షర్మిలాం”తరంగం”

-షర్మిల కోనేరు 

నాగరాణుల కోరల్లో బుల్లితెర

తెలుగు సీరియళ్ళలో ఏడుపులు, కుట్రలు లేకుండా ఏ సీరియల్లూ ఎందుకు తీయరు ?

ఈ ప్రశ్న తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తల వేయి వక్కలవుతుందని విక్రమార్కుడి భుజం మీద వేలాడుతున్న భేతాళుడు ప్రశ్నిస్తే ?

ఈ ప్రశ్నకు సమాధానం కోసం నా తల వేయి వక్కలయ్యేట్టు ఎప్పటినుంచో అలోచిస్తున్నా …

ఇంతవరకూ సమాధానం దొరికితే ఒట్టు .

ఇప్పుడు పాపం విక్రమార్కుడేం సమాధానం చెప్పి తల కాపాడుకుంటాడో ?

కాకపోతే అలాంటి సీరెయళ్ళు తప్ప ఇంకోటి తీయమని పట్టువదలనితనంలో విక్రమార్కుడి వారసులే వుండటం వల్ల ఆయనకి సమాధానం లీకవ్వొచ్చు .

భేతాళుడు మళ్లీ తెలుగు సీరియల్లాగ ఆ చెట్టుకే వేలాడుతూ వుండొచ్చు .

కానీ డైలీ సీరియల్ నెల తరవాత చూసినా భేతాళుడల్లే అక్కడే వేలాడుతూ వుండటం చూసి జనాల మాటేమో గానీ నేను జడుసుకు చస్తాను .

కరోనా లాక్ డౌన్ కి రోడ్లు నిర్మానుష్యం చెయ్యాలంటే కార్తీకదీపం సీరియల్ 21 రోజులు నిరంతరాయంగా ప్రసారం చేస్తే సరి .

సోదర సోదరీమణులు ఎంతో ఓపికతో ఏళ్లతరబడి తెలుగు సీరియల్ హీరోయిన్ల కష్టాలను భరించీ భరించీ రాటు తేలి పోయారు .

వారికీ కరోనా కష్టం ఓ కష్టమా !

సోదరీమణులే కదా సీరియళ్లు చూసేది ? సోదరుల ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా ?

ఇప్పుడు తెలుగు డ్రాయింగ్ రూముల్లో సరికొత్త విప్లవం !

భార్యలతో పాటు భర్తలూ సీరియళ్లు చూడటం .

తినగ తినగ వేము తీయనగును అన్నట్టు .

వాళ్ళ ఆవిడలతో రాత్రుళ్లు టీవీ ముందు కూర్చుని చూసి చూసి కరోనా అంటినట్టు ఈ సీరియళ్లు చూడడం అంటింది .

అబ్బే సీరియళ్లు చూడడం తప్పని అనడం నా ఉద్దేశం కానే కాదు .

అంతంత ఖర్చు పెట్టి తీసే సీరియళ్ల కధల మీద కూడా ఖర్చు పెట్టొచ్చు కదా .

ఆ సీరియళ్లలో సున్నితమైన హాస్యం గానీ , మనసారా నవ్వుకోవడం వంటి సహజమైన వాతావరణం వుండదు .

పైగా పాముల్లా విషం చిమ్ముతూ నాగరాణులు (విలనీ తో ) కధానాయికకి కంటిమీద కునుకు లేకుండా చేస్తారు .

కోయిలమ్మ అనే సీరియల్లో ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి ఇప్పటికి 25 ఏళ్ళొచ్చాయి .

ఇప్పటివరకూ ఒక్కనాడంటే ఒక్కనాడు ఏడుపు తప్ప సుఖంగా వుండటం చూడలేదు .

మౌనరాగం అనే సీరియల్ లో నాకు తెలిసి ఏడ్చి ఏడ్చి ఆ అమ్మ పాత్ర వేసే ఆవిడ కళ్లు ఏమైపోతయ్యో ! అని తెగ బెంగ .

పైగా నోరూ వాయీ లేని ఆ బక్క హీరోయిన్ తన కొడుకుని సముద్రంలోకి తోసి చంపిందని తిడుతూ జనాలని చంపేసున్నారు .

” దొంగా ఈ సీరియళ్ళన్నీ నువ్వూ చూస్తున్నావు కదూ ! అనుకుంటున్నారు కదా “

కాదు నేను మా అమ్మ ఇంటికి అత్తగారింటికి వెళ్లినప్పుడు ఓరకంట అప్పుడప్పుడు వీటిని చూస్తుంటా !

వాళ్లు జరిగిన కధని చెప్తుంటారు , అలా విని విని కధ తెలిసిపోతుంది .

ఆ సీరియళ్లని చూస్తే ఒకందుకు గర్వంతో భుజాలు ఉప్పొంగుతాయి .

ఆడవాళ్లు నగలు ధరించడంలోనూ , కుట్రలు చేయడంలోనే కాదు అది ఇది ఏమని అన్ని రంగముల మగ ధీరుల నెదిరించారు .

సీరియళ్లలో ఆడవారి పాత్రల విశ్వరూపం ముందు మగవాళ్లవి మరుగుజ్జు పాత్రలే !

కేవలం సీరియళ్ల వరకే సుమండీ నిజజీవితంలో ఆయనే బాస్ ఎప్పటికీ .

*****

Please follow and like us:

One thought on “షర్మిలాం“తరంగం”-10”

  1. U r right madam
    Telugu serials and shows needs censorship board
    No organization. Working on this issue —most worthless stories
    —buchi reddy gangula

Leave a Reply

Your email address will not be published.