అనుసృజన
నిర్మల
(భాగం-4)
–ఆర్. శాంతసుందరి
(హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -)
నిర్మలకి లాయర్ తోతేరామ్ తో పెళ్ళయిపోయి ఆమె అత్తారింటికి వచ్చింది.తోతేరామ్ నల్లగా ,లావుగా దిట్టంగా ఉంటాడు.ఇంకా నలభై యేళ్ళు రాకపోయినా అతను చేస్తున్న ఉద్యోగం చాలా కష్టమైంది కాబట్టి జుట్టు నెరిసిపోయింది.వ్యాయామం చేసే తీరిక ఉండదు.చివరికి వాహ్యాళికి కూడా వెళ్ళటం కుదరనంత పని ఒత్తిడి.దాంతో పొట్ట పెరిగింది.ఒంట్లో కొవ్వు చేరటం వల్ల ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటూనే ఉంటుంది.
ముగ్గురు మగపిల్లల్లో పెద్దవాడు మన్సారామ్ కి పదహారేళ్ళు,రెండోవాడు జియారామ్ కి పన్నెండు,ఆఖరి పిల్లవాడు సియారామ్ కి ఏడేళ్ళు. ఇంట్లో మరో ఆడదిక్కు తోతారామ్ అక్క మాత్రమే.ఆమె వితంతువు.ఆమే ఇంటి యజమానురాలు.యాభైయేళ్లకి పైబడ్డ ఆవిడ పేరు రుక్మిణి.
పాపం తనలోని లోపాలని కప్పిపుచ్చుకునేందుకు తోతారామ్ నిర్మలకి తరచు ఏదో ఒక కానుక తెచ్చిస్తూ ఉండేవాడు.ఏ కాస్త తీరిక దొరికినా సినిమాలకీ, సర్కస్ , నాటకం లాంటి వాటికి తీసుకెళ్ళేవాడు.లేకపోతే ఆమె పక్కనే కూర్చుని గ్రామఫోన్ లో పాటలు వినేవాడు.కానీ నిర్మలకి ఆయన పక్కన కూర్చోవాలంటే ,నవ్వుతూ కబుర్లు చెప్పాలంటే సంకోచంగా ఉండేది.కారణం , ఆ పిల్ల అంతకుముందు తన తండ్రిని తప్ప అంతవయసున్న మగవాణ్ణి అంత దగ్గరగా చూడలేదు.తండ్రికి ఎదురుపడేందుకే భయపడుతూ పెరిగింది.ఇప్పుడు తండ్రి వయసు భర్తతో చనువుగా ఉండటం ఎలాగో అర్థం కావటం లేదు.వయసు ప్రభావం వల్ల ఆమెతో మాట్లాడేప్పుడు మనస్ఫూర్తిగా ప్రేమ ప్రకటించటం, ఆమెని పరవశింపజేయటం లాంటివి ఆయనకీ తెలిసేవి కావు.సరస సంభాషణలు ఆయన నోటంట కృత్రిమంగా తోచి ఆమెకి వెగటు పుట్టించేవి.తన యౌవనాన్నీ, అందాన్నీ ఆస్వాదించే మనసు ఆయనకి లేదని తెలిసి నిర్మలని నిరాశ ఆవహించింది.మంచి బట్టలు తొడుక్కుని చక్కగా అలంకరించుకున్నప్పుడు తనని తాను అద్దంలో చూసుకుని మురిసిపోయేంతలోనే తీరని కోరికలేవో ఉవ్వెత్తున లేచి ఆమెని కలవరపరచేవి.మనసులో జ్వాలలు రేగేవి.తల్లిమీద అలవికాని కోపం వచ్చేది.అందరికన్నా ఎక్కువ కోపం పాపం తోతారామ్ మీద వచ్చేది.ఎప్పుడూ ఏదో అసంతృప్తితో ఆమె శరీరం జ్వరం వచ్చినట్టు కాలిపోతూ ఉండేది.
తోతారామ్ పెళ్ళైన నెలరోజులకి డబ్బు లెక్కలన్నీ నిర్మలకి అప్పజెప్పాడు.ఆమె ఆ పని క్షుణ్ణంగా చేసి ఎప్పటికప్పుడు జమా ఖర్చులు రాసి ఆయనకి చూపించేది.పిల్లలతో కొంతసేపు గడిపితే ఆమెకి కాస్త సంతోషం దొరికేదే కానీ ఆడపడుచు రుక్మిణి పిల్లల్ని ఆమె దగ్గరకి వెళ్ళనిచ్చేది కాదు.ఆవిడ స్వభావం చాలా విచిత్రమైంది.దేనికి ఆనందిస్తుందో దేనికి కోపం తెచ్చుకుంటుందో తెలిసేది కాదు.ఒకే విషయానికి ఒకసారి ఆనందిస్తే మరోసారి కోపగించుకునేది.
నిర్మల చేతికి తమ్ముడు డబ్బంతా ఇచ్చెయ్యటం ఆవిడకి ఒంటికి కారం రాచుకున్నట్టనిపించింది.అప్పట్నుంచీ ఆమెని మరింత బాధ పెట్టటం మొదలెట్టింది.పిల్లలు ఇంతకుముందు ఆవిణ్ణి డబ్బులడిగేవాళ్ళు.ఇప్పుడు నిర్మలని అడుగుతున్నారు.
పాలబ్బాయితో మాట్లాడితే తప్పు, పనిమనిషితో మాట్లాడితే తప్పు.తన గదిలోనే ఉంటే ముంగిలా బైటికి రాదని తిడుతుంది.డాబమీదికెళ్ళి నిలబడితే ఎవడికి సైగ చేస్తున్నావని అభాండం వేస్తుంది. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఈ హింసని భరించలేకా, ఆవిడకి జవాబు చెప్పే ధైర్యమూ లేకా నిర్మల నలిగిపోసాగింది.
ఒకరోజు భర్తకి చెప్పుకుని ఏడ్చింది.ఆ డబ్బు బాధ్యత ఆవిడకే ఇచ్చెయ్యమని చెప్పింది.ప్రేమ చూపించేందుకు దొరికిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు తోతారామ్,”ఇవాళే ఇల్లు వదిలి వెళ్ళిపొమ్మని చెప్తాను.ఆడదిక్కు లేని కొంప కదా అని ఇక్కడ ఉండమన్నాను.ఇప్పుడు నువ్వున్నావు.రేపే పంపించేస్తాను,” అన్నాడు మండిపడుతున్నట్టు.
“పిల్లలంటే నాకు ప్రాణం.ఎంతైనా మీ పిల్లలు నా పిల్లలే అనుకుంటున్నాను కదా?నేనంటే ఆవిడకి ఎందుకంత ద్వేషమో అర్థం కావటం లేదు!”అంది నిర్మల బాధగా.
అప్పుడు తోతారామ్ కోర్టుకెళ్ళే హడావిడిలో ఉన్నాడు.అక్కతో వాదించటానికి తీరిక లేదు.కానీ సాయంత్రం ఇంటికొచ్చాక అక్కని నిలదీశాడు,” అక్కయ్యా, నీకు ఇక్కడ ఉండాలనుందా లేదా? ఉండాలంటే నెమ్మదిగా ఉండు.మిగతావాళ్ళని ఇలా కాల్చుకుతినటం ఏం బాగుంది?”అన్నాడు.
నిర్మల తనమీద తమ్ముడికి నూరిపోసిందని ఆవిడకి అర్థమైంది,కానీ ఆవిడ అంత సులభంగా ఎవరి మాటా వినే రకం కాదు.జీవితాంతం తమ్ముడి కుటుంబానికి ఊడిగం చేసిన తనని తమ్ముడు అంత నీచంగా తీసిపారేసినట్టు మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయింది. “అయితే నేను ఈ ఇంట్లో పనిమనిషిలా ఉండాలా? ఇంట్లో ఘోరాలు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చోటం నా వల్ల కాదు.అసలేం జరిగిందని ఇంత రెచ్చిపోతున్నావు? అది ఆడించినట్టల్లా ఆడుతున్నావన్నమాట.అసలు ఏం జరిగిందో తెలుసుకోటం పాడూ లేదు,అది చెప్పింది, నువ్వు నమ్మావు!” అంది.
” తను చిన్నపిల్ల, తప్పు చేస్తే దెప్పటం, ఆ తప్పుని మాటి మాటికీ చెప్పి తిట్టటం కాదు, నిజంగా ఏమైనా నేర్పాలనుకుంటే మంచిగా ప్రేమగా చెపితే వినదా?దెప్పి పొడుస్తూ ఉంటే ఏం నేర్చుకుంటుంది? మనసు విరిగిపోదూ?”
[ఇలా ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నాక ఆవిడ పిల్లల్ని కూడా ఈ గొడవలోకి ఈడ్చింది.వాళ్ళు నిర్మలమీద చాడీలు చెప్పారు.తన గదిలోంచి అంతా వింటున్న నిర్మల “నేనెప్పుడలా అన్నాను, అలా చేశాను? చిన్నపిల్లలు కూడా అబద్ధాలాడుతున్నారు,చూశారా?”అంటూ
అడ్డం వచ్చింది.పెద్ద గొడవ జరిగి తోతారామ్ చిన్నవాణ్ణి చెవిపట్టుకు లేపి కొట్టసాగాడు.నిర్మల ఆపేందుకు పరెగెత్తింది కానీ రుక్మిణి ఆమె కన్నా ముందే అక్కడికి చేరుకుంది.]
నిర్మల కోసం అక్కతో పోట్లాడి కొడుకుని కొట్టి ఆమె మనసులో శాశ్వతంగా చోటు చేసుకున్నానని అనుకున్నాడు తోతారామ్.మునుపు అరుదుగానైనా తనతో నవ్వుతూ మాట్లాడే భార్య ఇప్పుడు పూర్తిగా పిల్లల బాగోగులు చూడటంలో మునిగిపోవటం చూసి ఆయన నిరాశ చెందాడు.చాలా రోజులు ప్రణయం కోసం తహతహలాడి నిర్మలకి విరక్తి కలిగింది.అందుకే పిల్లల తో గడుపుతూ ఆనందం అనుభవించటం మొదలెట్టింది.భర్త దగ్గర ఇంకా చనువు ఏర్పడలేదు.ఆయన సమక్షంలో అసలు ఉండబుద్ధే అయేది కాదు.పిల్లల అమాయకత్వం కల్మషం లేని ఆప్యాయతా ఆమెకి తృప్తినిచ్చేవి. వాళ్ళ ఆటలు చూస్తూ, మాటలు వింటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది, అనుకునేది.
తోతారామ్ కి నిర్మలతో గడపాలని ఉండేది,కానీ ఆమె ఎందుకలా ముభావంగా ఉంటుందో , తనని తప్పించుకుని తిరుగుతుందో ఆయనకి అర్థమయేది కాదు.నిర్మలని ప్రసన్నం చేసుకునేందుకు తను చేసే ప్రయత్నాలేవీ ఫలించకపోయేసరికి ఆయనకి చాలా బాధ కలిగింది.
ఒకరోజు తోతారామ్ తను ఎంత ధైర్యవంతుడో గొప్పలు చెప్పసాగాడు.తన చేతికర్రని చూపించి దీనితో ఎన్నో పాములని చంపానని డంబాలు పలుకుతూ ఉంటే రుక్మిణి గాభరాగా పరిగెత్తుకొచ్చి,” తమ్ముడూ నా గదిలోకి ఎలా వచ్చిందో పెద్ద పామొకటి వచ్చి మంచమ్కింద చేరింది.పడగ విప్పి బుసలు కొడుతోంది కాస్త వచ్చి దాన్ని చంపెయ్యరా!” అంది ఆయాసపడుతూ.
“పామా? అదేదో తాడయుంటుంది,దాన్ని చూసి పామనుకున్నావు…”
“లేదురా ,పామే…”
“సరే…ఉండు…అది ఈ కర్రతో ఎక్కడ చస్తుంది? వెళ్ళి ఇనప చువ్వలు పట్టుకొస్తా ఉండు,” అంటూ బైటికి పరిగెత్తాడు.
ఇంతలో ఆ గోల విని ఆయన పెద్ద కొడుకు మన్సారామ్ తన హాకీ కర్రతో వచ్చి రుక్మిణి గదిలోకెళ్ళాడు, ఆరడుగుల పెద్ద నాగు పడగ విప్పి బుసలు కొడుతూ మంచమ్ కింద దాక్కుంది. అతను గబుక్కున మమ్చమీద దుప్పటి తీసి పాము మీద పడేసి హాకీ కర్రతో అది చచ్చే వరకూ కొట్టి,తరవాత ఆ కర్రమీదే వేలాడదీసి బయటకి వచ్చాడు.
అదే సమయానికి తోతారామ్ నలుగురు మనుషులతో వచ్చి, తనే పాముని చంపినంత పోజు కొట్టాడు.
“సరేలే, చూశాంగా నువ్వెంత మొనగాడివో ! నీకన్నా ఈ చిన్న పిల్లాడు నయం,”అంది రుక్మిణి ఈసడింపుగా.
తోతారామ్ మాట్లాడకుండా భోజనాల గదిలోకి నడిచాడు.
నిర్మలకి భర్తని చూస్తే జాలేసింది.ఆయన వైపే చూస్తూ నిలబడింది.ఉన్నట్టుండి ఆయన దేనికోసం అంతగా వెంపర్లాడుతున్నాడో అర్థమైనట్టు అనిపించింది.కానీ తన పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆయన్ని గౌరవించగలదు, సేవలు చెయ్యగలదు,తన జీవితాన్ని ఆయనకే అంకితం చెయ్యగలదు, కానీ ఆ ఒక్క విషయంలో ఆయన్ని సంతృప్తి పరచటం తనవల్ల కాదు.వయసు తేడాని పట్టించుకోకుండా ఉండటం సాధ్యం కాదు.ఏం చెయ్యాలి?
***
(ఇంకాఉంది)