అమెరికాలో- కరోనా సమయంలో

-డా|| కె.గీత

“అమెరికాలో ఎలా ఉంది? మీరంతా ఎలా ఉన్నారు?” అని చాలా మంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. 

అందుకే ఈ నెల ఇదిగో మీ కోసం ఈ ప్రత్యేకం-

***

కాలిఫోర్నియా బే ఏరియాలో శాన్ ఫ్రాన్సిస్కో కి దాదాపు 60 మైళ్ల దూరంలో చుట్టూ కొండల మధ్య ఉన్న అతిపెద్ద సిలికాన్ లోయ ప్రాంతంలో ఉంటాం మేం. 

ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో సిలికాన్ లోయ నడిబొడ్డునున్న మా ఆఫీసులో రెండు వారాల రెన్నోవేషన్ జరిగింది. అంటే ఫిబ్రవరి చివరి వారంలో రెండు వారాల వర్క్ ఫ్రమ్  హోమ్ తర్వాత ఆఫీసులో అడుగుపెట్టేం. ఆ రోజంతా ఎక్కడ ఎవరికెవరు ఎదురైనా పదిహేను రోజులు ఇంటి నుంచి పనిచెయ్యాల్సి వచ్చిన “బాధాకర” అనుభవాల గురించి కబుర్లే.  కానీ అదే విధంగా ఇళ్లలో నుంచే నెలల పాటు పనిచేయాల్సి వస్తుందని ఎవరం అనుకోలేదు. 

ఇంచుమించు అదే సమయంలో చైనాలోని వుహాన్ లోని కరోనా వైరస్ గురించిన వార్తలు విని,  నిర్మానుష్యమైన వీధులు, జన జీవనం టీవీలో చూసి “అయ్యో పాపం” అనుకున్నాం. ప్రపంచమంతా అదే పరిస్థితి వస్తుందని ఊహించలేదు. 

ఎప్పటిలానే ఉదయానే లేచి, పిల్లల్ని స్కూల్లో దించి, ఉరుకుల పరుగులతో ఆఫీసులకెళ్లి,  సాయంత్రం ఎప్పటికో గూటికి చేరి…..లాగే గడుస్తున్న రోజులవి. 

అదే వారంలో ఎక్కడో జపాను తీరాన ఆగిపోయిన క్రూజ్ లో కరోనా విజృంభించిందని, అదే విధంగా మరెక్కడ క్రూజ్ లోనయినా బయల్పడితే అందరినీ రెండు వారాలపాటు  మిలట్రీ స్థావరాల్లో క్వారంటీన్ లో  ఉంచుతున్నారని వార్తలు విని ముక్కున వేలేసుకున్నాం. 

క్రూజ్ లలో సదుపాయాలతో పోలిస్తే ఇళ్లు సదుపాయంగా లేక వయసు మీరిన కొందరు అదేపనిగా క్రూజ్ లకు వెళ్తారన్న  వార్తలు, జోకులు విని తేలికగా నవ్వుకున్నాం. 

ట్రంపు గారితో సహా అంతా “మాకేం కాదనే” ధీమాగా ఉన్న రోజులవి.

వారం కూడా తిరగకుండా మార్చి మొదటి వారంలోక్రూజ్ తో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా 20 కేసులు నమోదయ్యేయి. ఆఫీసుల్లో హ్యాండ్ శానిటైజర్ల వాడకం మొదలయ్యింది. 

అందులో 10 కాలిఫోర్నియా లోనే. అంతే. అదే వారాంతానికి కాలిఫోర్నియాలోని సాఫ్టువేర్ ఆఫీసులన్నీ ముందుగా మేల్కొని “సామాజిక దూరం” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేయి. ప్రపంచంలోనే పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగులకి ఇంటి నించి పనిచేసే వీలుని ఐచ్ఛికంగా కల్పించేయి. అయినప్పటికీ కొందరు ఆఫీసులకి వెళ్లి వస్తూనే ఉన్నారు. 

మార్చి రెండో వారం ప్రారంభంలో దేశ వ్యాప్తంగా వెయ్యి కేసులు నమోదయ్యేయి.  

ఇక కాలిఫోర్నియాలో, ముఖ్యంగా జనసమ్మర్దమైన ప్రాంతాలైన లాస్ ఏంజిలిస్, సిలికాన్ వ్యాలీలలో వందల్లో కేసులు ఒక్కసారిగా నమోదు కాసాగేయి.

చాలా రాష్ట్రాలు విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంలో జాప్యం చేసినా మొదటగా సిలికాన్ వ్యాలీ మేల్కొందని చెప్పచ్చు.  

అయినా మార్చి15 నాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడువేలకు, మరణాలు అరవైకి చేరగా అందులో 1300 కేసులు, 20 మరణాలు ఒక్క కాలిఫోర్నియాలోనే నమోదయ్యేయి. 

అదే వారంలో మార్చి 15 వతారీఖు నుంచి సిలికాన్ వ్యాలీ వంటి ప్రధాన వ్యాప్త ప్రదేశాల్లోను, రెండురోజుల్లో 

17 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగాను ఏప్రిల్ 7 వ తారీఖు వరకు మూడు వారాల పాటు “షెల్టర్ ఇన్ ప్లేస్” ఆర్డర్ చేసేరు.  

“షెల్టర్ ఇన్ ప్లేస్” అంటే ఎక్కడి వారక్కడ ఇళ్లలోనే ఉండాలన్నమాట. అంతే కాకుండా  నిత్యావసర వస్తువులు, మందులు వంటి ముఖ్యావసరాలు తీర్చే దుకాణాలు, పేక్ చేసి ఇవ్వగలిగిన రెస్టారెంట్లు , డెలీలు, ఆసుపత్రులు వంటివి మాత్రమే తెరచి ఉంటాయి. 

అయితే మరో వారంలో ఆసుపత్రులలో అర్జెంటు కేసులు తప్ప మిగతా అన్ని అప్పాయింట్మెంట్లు కేన్సిల్ చేసేరు. తప్పనిసరిగా డాక్టర్లతో మాట్లాడాల్సి వస్తే ఫోన్ కాల్, వీడియో అప్పాయింట్మెంట్లు తప్ప ఆసుపత్రికి తిన్నగా వెళ్లే అవకాశం తీసేసేరు. చివరకు అర్జెంటు కాని ఆపరేషన్లు  కూడా వాయిదా వేసేరు. 

“షెల్టర్ ఇన్ ప్లేస్”  కి ఒక వారం ముందుగా మా ఆఫీసులు ఇళ్ల నించి పని చేసుకోవచ్చని ప్రకటన చేసిన సమయంలో కరోనా వైరస్ కేవలం వయసు మీరిన వృద్ధులకి మాత్రమే హాని చేస్తుందని భావించడం వల్ల స్కూళ్లు ఆ వారం యథాతథంగా నడిచేయి. 

ఎప్పుడైతే పిల్లలకి లేదా పిల్లల ద్వారా పెద్దవాళ్ళకి కూడా వైరస్ సోకవచ్చని రూఢి ఐయ్యిందో “షెల్టర్ ఇన్ ప్లేస్” లో భాగంగా స్కూళ్ళకి కూడా మూడు వారాలు సెలవులు ప్రకటించేరు. 

మా ఊళ్లో ఆ మూడు వారాల తర్వాత మరో వారం వసంత కాలపు సెలవులు కలిపి పిల్లలకి నెలరోజులు సెలవులిచ్చేసేరు. 

ఆ రోజు గెంతుకుంటూ, తుళ్లుకుంటూ వచ్చేరు మా పిల్లలు. 

కానీ “షెల్టర్ ఇన్ ప్లేస్”  ఇచ్చిన మొదటి వారం వరకూ ఇంట్లో అందరికీ టైం టేబుల్ అంటూ లేకపోవడం మొదటి సమస్య అయ్యింది. 

ఇక ప్రకటన వచ్చిన శుక్రవారం సాయంత్రం నిత్యావసర వస్తువుల దుకాణాల దగ్గిర జనం మైళ్ళ కొలదీ లైనుల్లో నిలబడి అవసరాలకు మించి కొనుగోళ్లు చేసేరు. అన్నిటికన్నా ముఖ్యంగా బియ్యం, పిండి, నూడుల్స్, బ్రెడ్లు, టిన్ ఫుడ్స్, టాయిలెట్ పేపర్లు , పంచదార వంటివి స్టాకు లేకుండా ఒక్క రోజులో అన్ని దుకాణాలు ఖాళీ అయిపోయేయి. చాలా మంది దోపిడీలు జరుగుతాయనే భయంతో గన్నులు కూడా కొనుక్కున్నారు. 

మా ఇంటి వరకూ వస్తే దాదాపు రెండు నెలల వరకూ సరిపడే సరకులు కొని పెట్టుకోవడం మాకు అలవాటు కావడంతో మేం వెంటనే దుకాణాలకు పరుగెత్తవలసిన అవసరం రాలేదు. కానీ పాలు, కూరగాయలు, పళ్లు, బ్రెడ్  వంటివి తప్పనిసరి అవసరాలకు వారానికొకసారి తప్పక వెళ్లి తీరాలి. అవి కూడా అదృష్టం కొలదీ ఆ ముందు రోజే తెచ్చిపెట్టుకోవడంతో మొదటి పది రోజుల పాటు బైటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు మాకు. 

కానీ తరువాత్తర్వాత ఆన్ లైన్ లో ఆర్డర్ చెయ్యడం, తప్పనిసరి అయితే ఎవరో ఒక్కళ్ళం మాత్రమే మాస్కు, గ్లవ్స్ ధరించి వెళ్లి రావడం చేస్తున్నాం. 

ఇక కుటుంబమంతా కలిసి ఇరవై నాలుగ్గంటలూ కలిసి గడపడం అనే కొత్త అలవాటు ఛాలెంజింగే అయ్యింది. 

ముఖ్యంగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉత్సాహంగా పనిచేయడానికి, లైవ్లీగా ప్రతిరోజూ గడపడానికి కొన్ని అలవాట్లు కొత్తగా నేర్చుకోవాల్సివచ్చింది. 

ఏదయినా పెద్దవాళ్ళం పాటిస్తేనే పిల్లలూ పాటిస్తారు కాబట్టి. ఉదయానే నిర్ణీత సమయానికి లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం,  స్నానపానాదులు సమయానికి చెయ్యడం, ఇంట్లో ఉన్నా బయటికి వెళ్తున్నట్టే తయారుకావడం, మితంగా తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి ముందు పెద్దవాళ్ళం చెయ్యడం ప్రారంభించాం. ఇక పిల్లలూ ఒక్క వారంలో నేర్చుకున్నారు. అలా కొంత వరకు నీరసం తగ్గింది. 

ఇక్కడి స్కూళ్లలో పిల్లలకీ సొంత లాప్ టాపులు ఉంటాయి. వాటిని రెండో వారంలో ఇళ్లకు తీసుకెళ్లనిచ్చేరు.  

అంతే కాకుండా ఆన్ లైన్ లో రోజుకి ఒకటో, రెండో  తరగతులు, రోజూ ఆన్ లైన్ లో సబ్మిట్ చెయ్యగలిగిన  హోమ్ వర్కులు ఇచ్చేరు. ఇలా కొంత టైం టేబుల్ అంటూ ఏర్పడింది పిల్లలకి. 

కానీ ఇవన్నీ పిల్లలతో  సక్రమంగా చేయించే కొత్త బాధ్యత పెద్దవాళ్లు తీసుకోవాల్సి రావడం మరో ఛాలెంజ్ అయ్యింది. పిల్లల్నే ఒకరికొకరిని సాయం చేసుకొమ్మని కొంత వరకు అప్పగించేం. అయినా మాలాగే ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులు షిఫ్టుల వారీగా పిల్లల బాధ్యత తీసుకోవడం వంటి అనివార్యమైన పరిస్థితి అందరికీ ఏర్పడింది. 

పిల్లల మామూలు అవసరాలు చూడడమే కాదు, చిన్న పిల్లల్ని ఇరవై నాలుగ్గంటలూ అలరించడం, పెద్ద  పిల్లలకి  ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడమూ ఒక పెద్ద ఛాలెంజే. ప్రపంచమంతా అలుముకున్న అంధకార పరిస్థితుల్లో ఒక పక్క పెద్ద వాళ్లకూ ఎమోషనల్ సపోర్ట్ అవసరమే. 

ఇందు కోసం ఇంట్లోనే చిన్న టెంటుతో  “ఇండోర్ కేంపింగ్” సెటప్ వేసో  లేదా పిల్లలు ఎక్కడుంటే అక్కడ వాళ్లతో బాటూ కలిసి కూర్చుని పనులు చేసుకోవడం, రోజులో కనీసం అరగంట సరదాగా “బంతాట”, “ఉయ్యాలాట”, “కుంటాట”, “దాగుడుమూతలు” వంటివి  పిల్లలతో ఆడడం, ఇంటి పనులు పెద్దల్తో బాటూ పిల్లలకీ సరదా కార్యక్రమంగానే అప్పగించడం వంటివి బాగా ఉపయోగపడ్తున్నాయి. 

ఉద్యోగం భద్రంగా ఉన్నా, కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థలు, బయటికెళ్తే ఏమవుతుందోనన్న ఆలోచన, ఇదంతా ఎప్పటికి సద్దుమణుగుతుందోనన్న ఆందోళన, అసలు ప్రపంచం అంతమైపోతుందేమోనన్న నైరాశ్యం లోకి వెళ్లిపోకుండా ఉండడానికి  ఎంతో కష్టపడాల్సి వస్తూ  ఉంది.

ముఖ్యంగా ఎంతో రాయాల్సిన సమయంలో రాయలేకపోవడం, శూన్యానికి, వైరాగ్యానికి లోనకుండా తప్పించుకోవడానికి ఎంతో  కష్టపడ్డాల్సి వస్తూంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సెల్ఫ్  మోటివేషన్,  సెల్ఫ్ డిసిప్లిన్ ఎవరికి వారు తప్పనిసరిగా అలవరచుకోవాల్సిందే. పెద్దలు సంయమనం కోల్పోకుండా ఉంటే పిల్లలకు అది గొప్ప మందులా పనిచేస్తుందని అర్థం అవుతోంది.  

ఇక అమెరికాలో సాఫ్ట్ వేర్ సెక్టార్ తప్ప మిగతా అన్నీ మూతబడడంతో దిగువ తరగతి  ఉద్యోగాలన్నీ పోయేయి. వారానికి నలభై లక్షల చొ||న నిరుద్యోగం నమోదుకాసాగింది. అధికార ప్రభుత్వం వెంటనే మేల్కొని నిరుద్యోగ భృతి ప్రకటించినా నిజంగా సహాయం అందేసరికి నెల పైగా పట్టింది. ఒక విధంగా ఎలక్షన్లు మరో ఆరునెల్లలో ఉండడం ఒక అదృష్టంగానే చెప్పుకోవాలి. దేశాన్ని ఆదుకునే పనులు ఇందువల్లే కొన్ని సత్వరంగా జరుగుతున్నాయి. 

ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలోను, అమెరికాలో అతి పెద్ద నగరాలలోను మనిషికి నెలకు అయ్యే సగటు అత్యధిక ఖర్చు ఇంటద్దె. నిరుద్యోగం కారణంగా “షెల్టర్ ఇన్ ప్లేస్” సమయంలో ఎవరూ ఇంటద్దె కట్టలేదని ఇళ్లు ఖాళీ చేయించకూడదని, అద్దె కట్టలేని వారికి తర్వాతి నెలల్లో ఎప్పుడయినా కట్టగలిగే అవకాశం కల్పించాలని ప్రభుత్వం ప్రకటించింది. సొంత ఇళ్లు కొనుక్కుని ఇళ్ల మార్టిగేజులు కట్టలేని వారి కోసం బ్యాంకులు కూడా ఇదే విధంగా సంయమనం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఉద్యోగుల్ని తొలగించకుండా ఉన్న వ్యాపార సంస్థలకు లోన్ సదుపాయం కల్పించింది. కానీ ఇది కేవలం పెద్ద వ్యాపార సంస్థల బాగుకే తప్ప అప్పటికే ఉద్యోగుల్ని తొలగించివేసిన చిన్న చిన్న వ్యాపార సంస్థలకు వర్తించడం లేదు. తత్ఫలితంగా చిన్న వ్యాపారసంస్థలన్నీ అమితనష్టాల్లో కురుకుపోయి మూతబడ్డాయి. 

“షెల్టర్ ఇన్ ప్లేస్” అంటే మొత్తం లాక్ డౌన్ కాకుండా ప్రజలు తగు జాగ్రత్తలతో బయట తిరిగే వీలు ఉంది. అందువల్ల అత్యవసర సరకులు తెచ్చుకోవడం వంటివాటికి ఇబ్బంది లేకపోయినా స్టోర్లలో నిర్ణీత లెక్కలో మాత్రమే మనుషుల్ని లోపలికి పంపడం వదలడం, ఆరడుగుల దూరం పాటింపజెయ్యడం వల్ల స్టోర్ల లోపల కంటే స్టోర్ల బయట లైన్లలో ఎక్కువ సమయంనిలబడి నిరీక్షించాల్సి వస్తూ  ఉంది. అంతే కాకుండా డిమాండుకి సరిపడే సప్లై లేనందున, ట్రాన్స్ పోర్ట్ రంగం మూతబడినందున స్టోర్లలో తగినన్ని సరకులు అందుబాటులో ఉండడం లేదు.  

ఇక్కడి స్థానిక స్కూళ్లు పనిదినాల్లో ఉచిత మధ్యాహ్నభోజన సదుపాయానికి అర్హులైన పిల్లలందరికీ కారులోనే ఉండి స్కూలు ముందు ఆవరణ నించి భోజనాన్ని అందుకునే అవకాశం కల్పించేయి. నిరుద్యోగులకు ఉచితంగా సరకుల పంపిణీ, భోజన పంపిణీల కోసం ప్రత్యేక ఫుడ్ షెల్టర్లు నెలకొల్పేయి స్థానిక ప్రభుత్వాలు. 

ప్రతిరోజూ వార్తల్లో వింటూ ఉన్న వేలాది కొత్త కేసుల నమోదు, వందలాది మరణాలు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అయితే ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున కొత్త కేసులు, మరణాల  పరిస్థితికి కారణాలు బహుశా:  ఇవి:-

  1.  ఇక్కడ జీవన ప్రమాణాలు అధికం కావడం వల్ల 70య్యేళ్ళ పైబడిన వృద్ధులు ఈ సమాజంలో అధికంగా ఉన్నారు. పైగా వీళ్లంతా ఏదో ఒక వ్యాధి గ్రస్తులే. కరోనా ఇతర వ్యాధులతో సతమతమయ్యే వారి పాలిట మొదటి శత్రువు కాబట్టి తొలుత కరోనా వీరికే సోకి అధికంగా ప్రాణ నష్టాన్ని కలుగజేసింది. 
  2. అన్ని రాష్ట్రాలలోనూ ఒక్కసారే “షెల్టర్ ఇన్ ప్లేస్” ప్రకటించకపోవడం, రాష్ట్రాల మధ్య విమానాల్ని యథావిధిగా నడపడం వల్ల వ్యాధి అన్ని ప్రాంతాలకూ శరవేగంగా పాకింది. 
  3. వుహాన్ లో వ్యాధి ప్రబలుతున్న సమయంలోనే వ్యాధి సోకిన వారు తమకు తెలిసే లోపే అమెరికాకి వచ్చెయ్యడం, అది అంతర్లీనంగా పాకిపోవడం ఒక కారణం. 
  4. ఇలా వ్యాధి డైరక్టుగా సోకినవారి సంఖ్య అధికంగా ఉండడం,  
  5. పరిశుభ్రమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉండడం వల్ల సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం 

కూడా కారణాలే. 

ఇక  షెల్టరే లేని హోమ్ లెస్ జనానీకం, ఇన్సూరెన్సు కూడా లేని వారు అధికంగా మృత్యువాత పడుతున్నారు. 

ఒక చోటే పెద్ద ఎత్తున సామూహిక ఖననాలు  చేస్తున్న దృశ్యాలు వార్తల్లో  కళ్లారా చూస్తూ ఉంటే మనసుల్ని కలిచివేస్తున్నాయి. 

మాలాంటి ఇతరదేశాల్లో నివసించే ప్రజలకందరికీ సగం ఆలోచన సొంత దేశం పైన కూడా ఉండడం పరిపాటి. అక్కడి లాక్ డౌన్ లో జీవన పరిస్థితుల్లో సగటు కుటుంబాల పట్ల కలతే కాక, వలస కార్మికుల బాధలు చూస్తూ మరింత బాధ కలుగుతోంది. 

ఇక ఇక్కడ ప్రతీ రాష్ట్రం లోనూ  “షెల్టర్ ఇన్ ప్లేస్” నిబంధనలు వ్యతిరేకిస్తూ వ్యాపారాల్ని తెరవమని ధర్నాలు విరివిగా జరుగుతున్నాయి. మే ఒకటవ తారీఖు నుండి కొన్ని రాష్ట్రాల్ని తెరిచినా, జనం సామాజిక దూరం పాటించడం మరిచిపోతున్న ప్రతీ క్షణం కరోనా భయం రెట్టింపు అవుతూ ఉంది. 

కాలిఫోర్నియాలో మే నెలాఖరు వరకు “షెల్టర్ ఇన్ ప్లేస్” పొడిగింపబడింది. వ్యాధికి భయపడి ఇలా ఇళ్లలో ఎన్నాళ్లు దాక్కుని ఉండాలో ఎవరికీ తెలియదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి కంటే భయంకరమైన జీవితాన్ని చవిచూడాల్సి వస్తున్న నిరుపేద బతుకులు వణికిస్తున్నాయి. 

వర్తమానం కంటే వణికిస్తున్న భవిష్యత్ అనిశ్చితి మానవాళిని కబళించకుండా జీవనం గడపడమే ఇప్పటి అతి పెద్ద కష్టం!

అడుగడుగునా జీవితంలో కోల్పోతున్న ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకోవడమే ప్రథమ కర్తవ్యం!!

*****

Please follow and like us:

6 thoughts on “అమెరికాలో- కరోనా సమయంలో”

  1. వివరంగా, విపులంగా చెప్పేవు గీతా.

  2. ప్రపంచ పరిస్థితులతో పోలిస్తే,యూరోప్ మరియు అమెరికాలలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
    ముఖ్యంగా మెడికల్ రంగంతో పాటూ ,వివిధ రంగాలలో రీసెర్చ్ కి మానవ మేధని ఉపయోగించగలిగిన పరిస్థితులు కల్పించి,రీసెర్చ్ రంగానికి పెద్దపీట వేయడం నేర్చుకోకపోతే,–బుద్ధిజీవులమన్న బోర్డ్ తిప్పేసుకోవలసిన రోజు రావచ్చు.

Leave a Reply

Your email address will not be published.