ఇట్లు మీ వసుధారాణి
ఆ బావి
-వసుధారాణి
అదాలజ్ (రాణి గారి బావి) గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ఉంది.అది చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ మాకు దాని నిర్మాణకౌశలం,నిర్మించడానికి వెనుక ఉన్నగాథ చెపుతూ ఉన్నాడు. మూడు నాలుగు అంతస్థులుగా అందమైన శిల్ప కళతో, పెద్ద పెద్ద మెట్లతో నిజంగానే చూడచక్కని దిగుడుబావి.మొత్తం తిరిగి చూసిన తరువాత గైడుకు డబ్బులు ఇచ్చి పంపివేసాక పై మెట్టుమీద కాసేపు కూర్చుందామా అనిపించి, కూర్చుండి పోయాము.స్తంభాల మధ్య నుంచి కొంచెం ఎండ పొడ నీటి మీద పడుతూ నీరు నెమ్మదిగా కదిలినట్లు అనిపిస్తూ వింతగా ఉంది.
ఇక్కడ జలకాలాడిన రాణులు , చెలికత్తెలు వారి సంభాషణలు నవ్వులు ఎలా ఉండి ఉంటాయో కదా అని ఊహించే ప్రయత్నం చేసాను.ఇంతలోకి మా ఊరిలో, మా ఇంటిదగ్గర గ్రౌండ్ పక్కన ఉండే బాలయ్యబావి గుర్తుకు వచ్చి ఒక్కసారిగా రాణి ,చెలికత్తెల నషా లోనించి బయటకు వచ్చాను.కారెక్కి మా అతిథిగృహం చేరుకునే లోపు అదాలజ్ ఎటు పోయిందో కృష్ణవేణి జ్ఞాపకాలు ముసురుకున్నాయి.
గిలకబావులు ఇప్పటి తరం వాళ్లకు ఎంతమందికి తెలుసో కానీ మా చిన్నప్పుడు దాదాపు ప్రతి ఇంటికి ఓ గిలకబావి ఉండేది.ఇళ్ళల్లో వుండే బావులు కొంచెం లోతు తక్కువగా చిన్నవిగా ఉండేవి మా ప్రాంతంలో ,ఎందుకంటే ఆరు అడుగుల లోతుకే అక్కడ నీటి ఊట ప్రారంభం అయ్యేది.మహా అయితే పది పదిహేను అడుగుల లోతు తవ్వేవారు .వర్షాకాలంలో అయితే బక్కెట్టుతో ముంచుకునేంత పైకి వచ్చేవి నీళ్ళు. అయితే ఇంటి బావులు కాక కొన్ని బావులను వెడల్పుగా ,పెద్దవిగా ,లోతుగా,చుట్టూ పెద్ద పళ్ళెంతో అందరూ వాడుకునేలాగా ఉమ్మడి స్థలంలోనో,దాతలు ఎవరో ఇచ్చిన చోటులోనో తవ్వేవారు.అదిగో అలాంటిదే మా బాలయ్యనగర్ లో కల బాలయ్యబావి.
మూడు వైపులా గిలకలతో ,సమమైన ఎత్తు గట్టుతో , నాలుగు అడుగుల వెడల్పుతో బావి చుట్టూ గచ్చు పళ్ళెంతో బాలయ్యబావి భలే ఉండేది. ఉదయం అయిదు గంటల నుంచే బావిదగ్గర హడావిడి మొదలయ్యేది.బావి దగ్గరగా ఉన్న ఇళ్ళ వాళ్ళు ఇంక వాళ్ళ ఇళ్ళలో బావులు తవ్వుకోకుండా ఈ బావినీరే వాడుకునే వారు.గేదెలకు కుడితినీళ్ళు తాగించటానికి కావాల్సిన నీళ్ళ దగ్గరనుంచి వాకిళ్ళలో చల్లుకునే కళ్ళాపులకు అన్ని అవసరాలకు ఈ నీటినే వాడుకునే వారు.మా లాగా ఇళ్ళల్లో బావులు ఉన్నవారు మాత్రం కేవలం మంచి నీళ్ళు తెచ్చుకునే వారు.
ఉదయం అయిదు నుంచి తొమ్మిది వరకూ ఒక్క గిలక కూడా ఖాళీ లేకుండా కరకరా తిరుగుతుండేవి.ఉదయాన్నే నోట్లో వేపపుల్లలు పెట్టుకుని నములుతూ ఒకళ్ళని ఒకళ్ళని పలకరించుకుంటూ బావి చుట్టూ చైతన్యం,జీవం తొణికసలాడుతుండేది.తొమ్మిదివరకూ పొలాలు వెళ్లేవారు ,పన్లకు వెళ్ళే వారు అయిపోయాక .కొంచెం సేపు గిలకలు,బావి విశ్రాంతి తీసుకునేవి.తరువాత పదిగంటల నుండి ఇళ్ళలో ఉండి వంటపని చేసుకునే ఆడవాళ్ళ రాక మొదలయ్యేది.మా ఇంట్లో బావిలో నీళ్ళు అన్ని అవసరాలకీ,వంటకు కూడా వాడినా తాగటానికి మాత్రం అమ్మ బాలయ్యబావి నీరు తెచ్చేది.
ఇత్తడిబిందెలో కాస్త చింతపండు ,కొంచెం బూడిద వేసుకుని బిందె పట్టుకుని అమ్మ వెళ్ళే సమయానికి బావికి దగ్గరలో ఇల్లు ఉన్న కమలమ్మ గారు కూడా ఆవిడ బిందెతో ఇదే విధంగా వచ్చేది.చింతపండు పట్టించి బూడిదతో బిందెలు తోముకుంటూ కష్ట సుఖాలు కాసేపు మాట్లాడుకుని ఎవరి బిందె వారు నింపుకుని నడుమున బిందె పెట్టుకుని వచ్చే దృశ్యం ఎంత బాగుండేదో. శుభ్రంగా తోమిన ఆ ఇత్తడిబిందెల ముందు బంగారపు బిందె ఉన్నా బలాదూర్.
కమలమ్మగారి ఇంటి యజమాని బాలిరెడ్డి .వయసు అప్పటికే డెబ్బయి ఏళ్ళు ఉంటాయి.మనిషి గట్టిగానే ఉండేవాడు .అతని భార్య సుందరమ్మ సన్నగా వంగిపోయి పెద్ద బొట్టుతో కుడివైపు పమిటవేసిన ముదురురంగుల గుంటూరు నేత చీరెలు కట్టుకుంటూ కొంచెం తమాషాగా ఉండేది.మేము ఆటలు ఆడుకుంటూ ఎపుడైనా వాళ్ళ ఇంటి వైపు వెళితే మా కృష్ణవేణిని కూడా ఆడించుకోండి రాణెమ్మా ! అని అడిగేది.
కృష్ణవేణి వాళ్ళ అమ్మ కన్నమ్మ మొత్తం బాలయ్యనగర్ లో అందరితో తగాదాలు పడుతూ ఉండేది.ఒక్క మాతోటి తప్పితే . అమ్మని రాధక్కయ్య గారూఅని వినయంగా పలకరించేది.వాళ్ళింట్లో ఏ వస్తువు అయిపోయినా కృష్ణవేణిని మా ఇంటికి పంపేది.కన్నమ్మ బాలిరెడ్డి,సుందరమ్మల కూతురు ,ఆవిడ భర్త ఇంకెవరినో పెళ్ళి చేసుకుని కృష్ణవేణి చిన్నపిల్లగా ఉన్నప్పుడే కన్నమ్మని ఇంటినుంచి పంపేసాడు.అప్పటి నుంచీ ఆవిడ తల్లిదండ్రుల దగ్గరే పిల్లని పెట్టుకుని ఉంటోంది. కన్నమ్మ తగాదా మనస్తత్వం వలననే భర్త పంపేసాడు అని అందరూ అనుకునే వాళ్ళు.
కన్నమ్మ తల్లిదండ్రులను బాగానే చూసుకునేది కానీ కూతురు కృష్ణవేణిని తెగ వేధించేది. బహుశా భర్త మీద కోపం ఆ పిల్ల మీద చూపేదేమో. ఆ పిల్ల కొంచెం సేపు ఆడుకోవడానికి వచ్చినా సరే వెంటనే పిలిచి ఇంట్లో పనెవడు చేస్తాడు అని తిడుతుండేది.మాకు కూడా ఆ పిల్లని ఆటలో పెట్టుకుంటే మధ్యలో వెళ్ళిపోతుంది అని ఆ పిల్లని ఆడించుకోవాలంటే ఆసక్తి ఉండేది కాదు.
బాలయ్యబావి పక్కన ఎప్పుడో సున్నం గానుగ తోలిన స్థలం ఖాళీగా ఉండేది .టెన్నిస్ కోర్టులో గడ్డి మొలిచినట్లుగా పచ్చికతో ఉండేది. అందుకనే ఆ చోటును గ్రౌండ్ అని పిలుచుకునే వాళ్ళం. మా పేటలోని పిల్లలందరం అక్కడ చేరి ఆడని ఆట లేదు.పిచ్చిబంతి ,గడ్డి బాగా ఉంటుంది కనుక వంగుళ్ళు దూకుళ్ళు,అంటుకునే ఆటలు ఆడుకునే వాళ్ళం.కొంచెం మా కంటే పెద్ద పిల్లలు మా పద్మక్కా వాళ్ళు సందెవేళ మమ్మల్నిఆ గడ్డిలో కూర్చోపెట్టి సినిమా కథలు చెప్పేవాళ్ళు.అప్పట్లో ఒక్కళ్ళు సినిమా చూస్తే చాలు కధ అందరికీ తెలిసిపోయేది.పేర్లు ఎలా పడ్డాయి దగ్గరనుంచి శుభం కార్డు దాకా మొత్తం సినిమా ఉన్నది ఉన్నట్టు చెప్పే ఆర్ట్ మా పద్మక్కకి కూడా ఉంది.
రాత్రి వెన్నెల్లో ఐస్ బాయ్ ఆడేవాళ్ళం. బావికి దగ్గర్లో సగం పడిపోయిన పాత బొంతరాయి ఇల్లు ఉండేది.ఆ మొండి గోడల వెనుక దాక్కునే వాళ్ళం.బావి చుట్టూ తులసి మొక్కలు,మంచి తుమ్మ చెట్లు ఉండేవి.ఆటలు ఆడి అలిసి పోయి ,మేకల్లా ఆ తులసిఆకులు ,మంచి తుమ్మాకులు తిని బావి మంచినీళ్ళు తాగే వాళ్ళం.నీళ్లు తాగాలంటే బావి దగ్గరికి ఎవరైనా నీళ్ళు తొడుకోవటానికి రావాలి.ఎందుకంటే నీళ్ళు తోడుకోవటానికి చేద కావాలి కదా?
ఆటలు ఆడుకుంటూనే బావి వైపు ఓ కన్నేసి ఉండేవాళ్ళం .ఎవరైనా రాగానే అందరం పరుగున వెళ్ళి నీళ్ళు అడిగితే వాళ్ళు చేదతో తోడి బక్కెట్టుతో పోస్తూ ఉంటే దోసిలి పట్టి దాహం తీర్చుకోవటం ఓ గొప్ప అనుభవం.తులసి,తుమ్మ ఆకులు నమిలిన తర్వాత నీళ్ళు తాగుతుంటే ఎంత రుచిగా ఉండేవో మంచినీళ్ళు.ఇప్పుడు తాగే ఏ నీటికీ ఆ రుచి లేదు.
ఇలా ఆటలు ఆడిన మా బాల్యం ఆ బావిచుట్టూ పెనవేసుకుని ఉంది.మేము కొంచెం పెరుగుతున్న కొద్దీ ఆటలు తగ్గిపోయినా , బావిదగ్గర స్థలంలో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మాత్రం ఉండేది.పేటలోని చైతన్యం అంతా ఆ బావి గిలకచప్పుళ్లలో వినపడేది నాకు.
కన్నమ్మ కృష్ణవేణిని వేధించి వేధించి కొంతకాలానికి ఆ పిల్లకి పెళ్ళి చేసింది.అందరం హమ్మయ్య ఆ పిల్లకి తల్లి కష్టాలు తీరాయి అనుకున్నాం.ఓ యాడాది తరువాత పురిటి వచ్చింది కృష్ణవేణి .నాకు అప్పుడు పధ్నాలుగు ఏళ్ళు వుంటాయేమో.ఆ అమ్మాయికి పదిహేడు.అలా పురిటికి వచ్చిన కృష్ణవేణి ఇంక అత్తగారింటికి వెళ్ళలేదు.పురుడు వచ్చి ఏడాది అయినా కూడా.కన్నమ్మ మా అల్లుడు చానా మంచోడు ఇదే ముదరష్టపుది అని కూతురుని తిడుతుండేది.కారణాలు ఏమైనా కృష్ణవేణి తన పిల్లతో ఇక్కడే ఉండి పోయింది.
ఒకరోజు రాత్రి ఏడు గంటలప్పుడు కన్నమ్మ కృష్ణవేణిని తిట్టే తిట్లు గాలివాలుకు మా ఇంటిదాకా వినిపించాయి.రెండు దెబ్బలు కూడా వేసిందేమో మరి కొట్టవాకమ్మా! అని కృష్ణవేణి ఏడుపు కూడా.ఎవరో పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళి సర్దిచెప్పిన మాటలు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి.తొమ్మిది గంటలకు అంతా సద్దుమణిగింది.అందరం కన్నమ్మ గురించి కొంచెం సేపు మాట్లాడుకుని పడుకున్నాం.
తెల్లవారు జామున అయిదు గంటలకి ఒకటే గొడవ గొడవగా మాటలు వినపడి లేస్తే అందరూ కళ్ళు నులుముకుంటూ బాలయ్యబావి వైపు వెళుతూ వున్నారు.ఏమిటి అంటే రా అని నా చెయ్యి పట్టుకుని లాక్కెళ్లారు ఎవరో.బావిదగ్గరికి వెళ్ళేసరికి బోలెడు మంది జనం గుమిగూడి. బావిలో కృష్ణవేణి శవమై తేలుతూ.
ఎంతో వైభవంగా జనజీవనాన్ని తన చుట్టూ తిప్పుకున్న బాలయ్యబావిలో ఆ రోజు నుంచీ ఎవ్వరూ చేదవేసి నీళ్ళు తోడలేదు. గిలకలు తుప్పుపట్టి,బావిపళ్ళెం పగుళ్లువచ్చి,గట్టుమీద మొక్కలు మొలిచి నా కళ్ళ ఎదురుగుండానే బావి వైభోగం పతనం అయింది.కృష్ణవేణి కూడా అంతే మాతోటి పెరిగి మా కళ్ళముందే బావిలో తేలింది.
కన్నమ్మకి మాత్రం వేధించటానికి మనవరాలు దొరికింది.ఆ యింటివైపునుంచి మాటలు వినిపిస్తే మనసు బాధ పడేది చాలా ఏళ్ళ పాటు.
మా చిన్ని బాలయ్య నగర్ బావికే ఇంత కథ ఉంటే ఇక అదాలజ్ (రాణిగారి బావి) వెనుక ఎన్ని గాథలు ఉంటాయో కదా అనిపించింది.
మరొక కథతో వచ్చే నెచ్చెలిలో మీ ముందు ఉంటాను .
ఇట్లు
మీ
వసుధారాణి
*****
వసుధారాణి రూపెనగుంట్ల. విశాఖపట్నం. బాల్యం అంతా నరసరావుపేటలో గడిచింది. రైతు కుటుంబ నేపథ్యం. సాహిత్యపఠనాశక్తి అమ్మగారి నుంచి అలవడింది. రాణెమ్మ కథలు, కాకమ్మకబుర్లు పేరిట కొన్ని కథలు వ్రాసారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ నుంచి వెలువడిన నవనవాలా నాయికలు సంకలనంలో వీరి వ్యాసం అచ్చులో వచ్చింది. ఒక కవితా సంపుటిని ముద్రణలోకి తీసుకురాబోతున్నారు. కవిత్వం, కథారచన, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాస్తారు.