ఉత్తరాలు-ఉపన్యాసాలు-3

ఉత్తరం-3

స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి

మూలం: ఇంగ్లీష్

“ఈ అమ్మాయే జె.ఆర్.డీ కి ఉత్తరం రాసింది!”

నేపథ్యం: రచయిత మాటల్లోనే …………సంక్షిప్తంగా….

***

బహుశా అది 1974 లో అనుకొంటాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని.

ఓ రోజు లెక్చర్ హాల్ నుండి హాస్టల్ కు వెళ్ళే దారిలో నోటీస్ బోర్డ్ పై టెల్కో(ఇప్పుడు టాటా మోటార్స్) అడ్వర్టైజ్మెంట్ చూశాను. వారికి తెలివైన యువ ఇంజనీర్స్ కావాలనేది దాని సారాంశం. ఇంకా ….కష్టపడి పనిచేసే తత్త్వం మరియు అత్యుత్తమ విద్యా నేపధ్యం కూడా కలిగి వుండాలట!

కింద చిన్న లైనులో ….. “ఆడపిల్లలు అప్లై చేయవలసిన అవసరం లేదు.అని వుంది.

ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేకపోయినా నాకు అది ఒక చాలెంజ్ గా అనిపించింది. వారు చూపుతున్న లింగ వివక్షత పట్ల నా నిరసన తెలియజేయాలనుకొన్నాను.

నాకు ఒళ్ళు మండిపోయింది. టెల్కోలో పెద్ద తలకాయ ఎవరో నాకు తెలియదుగానీ ఎవరో టాటా అయి వుంటాడు అనుకొన్నాను. టాటా గ్రూప్ అధినేతగా జె.ఆర్.డీ.టాటా పేరు మాత్రం తెలుసు. హాస్టల్ కు వెళ్ళగానే ఓ కార్డు తీసుకుని జె.ఆర్.డీ కు ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. అందులో ఏం రాసానో ….ఈరోజువరకూ…. నాకు చాల స్పష్టంగా గుర్తుంది.

***

(ఉత్తరం)

టాటాలు గొప్పవారు. ఎన్నో రంగాల్లో ముందంజలో వున్నవారు. ఇనుము, ఉక్కు, రసాయనాలు, బట్టలు, రైలు పరిశ్రమల ఏర్పాటుతో పాటు 1900 నుండి భారత దేశంలో ఉన్నత విద్య పట్ల వారు శ్రద్ధ చూపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నెలకొల్పారు. అదృష్టవశాత్తు నేను అక్కడే చదువుకొన్నాను. కానీ టెల్కో లాంటి కంపెనీ ఎలా లింగ వివక్షత చూపుతున్నదో నాకు ఆశ్చర్యంగా వున్నది.

***

ముగింపు: 

ఆ తర్వాత….. ఉత్తరాన్ని పోస్ట్ చేసి సుధా మూర్తి ఆ విషయమే మరచిపోయిందట. కానీపదిరోజుల్లో ఆమెకు ఇంటర్వ్యూ రావడం….సెలెక్ట్ కావడం జరిగిపోయాయి. ఇంటర్వ్యూలో ఎవరో అన్నారట ఈ అమ్మాయే జె.ఆర్.డీ కి ఉత్తరం రాసింది!అని.

రచన, నటన, సంఘ సేవలో తనదైన ప్రత్యేకత నిలుపుకొన్న బహుముఖ ప్రజ్ఞాశాలి….. సుధా మూర్తి…. టెల్కోలో పనిచేస్తున్నపుడే అక్కడే పనిచేస్తున్న నారాయణ మూర్తిని కలవడంప్రేమ ….పెళ్లి.

ఆ తర్వాత కొన్నాళ్ళకు…..ఇద్దరూ కలిసి ఇన్ఫోసిస్ స్తాపించారు. ఈ రోజు ఇన్ఫోసిస్ ఓ ప్రపంచ స్థాయి కంపెనీ.

ఆ విధంగా ఓ ఆడపిల్ల …… మొదటిసారిగా …..టాటా కోటలో పాగా వేసింది. కేవలం మగవాళ్ళకే ఆ ఉద్యోగాలు అనే ….. ఓ ప్రతికూల పరిస్థితిని ప్రశ్నించి….సానుకూలంగా మార్చుకోగలిగిన ఆమె సాదాసీదా జీవితం ఎందరో ఆడపిల్లలకు స్పూర్తిప్రదాయని అయింది.

*****

ఉపన్యాసం-3

“పుస్తకాలు, పెన్నులే మన ఆయుధాలుగా పోరాటం చేద్దాం”

వక్త: మలాల యూసఫ్ జాయ్

సంక్షిప్త స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి

మూలం: ఇంగ్లీష్

నేపథ్యం: 

ముంజేతి కంకణానికి అద్దమేల?…….. 2014 లో అత్యంత చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి తీసుకొన్న 17 ఏళ్ల పాకిస్తాన్ అమ్మాయి మలాల యూసఫ్.

అప్పటికే….2007-2008 లో పాకిస్తాన్ లోని స్వాత్‌లోయలో తాలిబాన్లు మారణకాండ సృష్టించారు. స్త్రీలు గడపదాటి రావడం మీద ఆంక్షలు విధించారు. తాలిబాన్ల ఆగడాలను చదువుకోవడానికి నాకు ఉన్నప్రాథమిక హక్కుని లాక్కోవడానికి తాలిబన్లకు ఎంత ధైర్యం?” అని ప్రశ్నించిన మలాల వారి ఆగ్రహానికి గురయ్యింది.

అక్టోబర్ 9, 2012 లో బడినుండి ఇంటికి వెళ్తున్న మలాలపై తాలిబాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్పుడే మలాల పేరు ప్రపంచానికి తెలిసింది. తీవ్రంగా గాయపడిన మలాలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది….అదృష్టవశాత్తు ఆమె బ్రతికి బయటపడింది.

2013 జూలై 12 ……ఆమె 16 వ జన్మదిన సందర్భంగా….. ఐక్యరాజ్యసమితి మలాల డేగా ప్రకటించింది. ఆ రోజు ఐక్యరాజ్యసమితిలో ….. ప్రపంచపు నలుమూలల నుండి వొచ్చిన యువ ప్రతినిధులను ఉద్దేశించిఆమె చేసిన ప్రసంగమే నేను ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

***

(ఈ ఉపన్యాసాన్ని కొంతవరకు మాత్రమేఅనగా త్వరగా చదివే వీలుకోసంకుదించి అనువదించనైనది. అక్కడక్కడా బ్రాకెట్లలో ఇచ్చిన సమాచారం అనువాదకుడు ఇచ్చినది లేదా సంక్షిప్తం చేయబడినది అని గమనించండి.)

చాలారోజుల తర్వాత నేను ఈరోజు మాట్లాడ్డం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇంతమంది గౌరవనీయులైన వ్యక్తులతో …. ఇక్కడ ఈరోజు ఉండగలగడం …… నా జీవితంలో ….. ఓ గొప్ప క్షణం.

ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం లేదు. ప్రజలంతా నేను ఏం చెప్పాలని ఆశిస్తున్నారో కూడా నాకు తెలియదు…. కానీ నాకు కొత్త జీవితం ప్రసాదించిన భగవంతుడికి ….. నా కోసం ప్రార్థనలు చేసిన ఒక్కొక్కరికీ కృతజ్ఞతలు.

పాకిస్తాన్, UK, మరియు UAE ప్రభుత్వాలకు ….నాకు సహాయం చేసిన నర్సులు, డాక్టర్లందరికీ నా కృతజ్ఞతలు.

ప్రియమైన సోదరీ సోదరులారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకొండి. మలాల డేఅనేది నా ఒక్కదానిది కాదు. ఇది ప్రతి మహిళ, అబ్బాయి, అమ్మాయి ….. ఎవరైతే …. వాళ్ళ హక్కుల కోసం తమ గొంతెత్తి అరచారో…. వారందరిదీ. కేవలం మానవహక్కుల కోసమే కాకుండా…. విద్య, శాంతి, మరియు సమానత్వం కోసం పోరాటం చేస్తున్న ఆక్టివిస్టులు, సోషల్ వర్కర్లు వందలాదిగా వున్నారు. ఉగ్రవాదులు వేలాదిమందిని చంపారు….. లక్షలాదిమందిని గాయపరచారు. అందులో నేనూ ఒకదాన్ని.

ఎంతోమంది ఆడపిల్లల్లో ….. నేనూ ఒకదాన్ని…. ఇవాళ ఇక్కడ నిలబడ్డాను.

నేను నా ఒక్కదాని కోసం మాట్లాడ్డం లేదు. అబ్బాయిలు, అమ్మాయిలు …. అందరికోసం మాట్లాడుతున్నాను.

తమ గొంతులెత్తి అరవలేని ….. నోరులేని వాళ్ళ కోసం నేను నా గొంతునెత్తి అరుస్తున్నాను.

డియర్ ఫ్రెండ్స్, 2012 అక్టోబర్ 9 నాడు ….. తాలిబన్లు నా నుదురుభాగాన ఎడమవైపు కాల్పులు జరిపారు. నా స్నేహితులపై కూడా కాల్పులు జరిపారు. వాళ్ళ బుల్లెట్స్ మన గొంతుల్ని నొక్కేస్తాయనుకొన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు విఫలమయ్యారు. ఆ తర్వాత…. వేలాది గొంతుకలు ….. ఎలుగెత్తి అరచాయి. ఉగ్రవాదులు నన్ను దారి మళ్ళించగలుగుతామని అనుకొన్నారు. నా ఆశయాలను తుంచివేయగలమని అనుకొన్నారు. కానీనా జీవితంలో ఏమీ మార్పు జరగలేదు…. ఒక్కటి తప్ప…. భయం, నిరాశ, నిస్పృహలు చచ్చిపోయి….. బలము, శక్తి, ధైర్యంవాటి స్థానాన్ని ఆక్రమించాయి. నేను అప్పటి మలాలనేనా ఆశలు, ఆశయాలు, కళలు …. అన్నీ అప్పటివే.

ప్రియ సోదరిసోదరులారా, నాకు ఎవరిపట్లా వ్యతిరేకత లేదు. తాలిబన్ల పైననో లేక ఇతర ఉగ్రవాద సంఘాల పైననో ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో నేనిక్కడ మాట్లాడ్డం లేదు. తీవ్రవాదులందరి పిల్లలకు ….. ముఖ్యంగా…. తాలిబన్ల పిల్లలకు విద్యాభోధన కావాలనేది నా కోరిక.

నాపై కాల్పులు జరిపిన తాలిబ్ (ఉగ్రవాది) ను నేను అసహ్యించుకోవడం లేదు. నా చేతిలో తుపాకి వుండి వుండి ….. అతను నా ముందు నిల్చొని వున్నా కూడా నేను అతన్ని కాల్చను. ప్రశాంతంగా వుండాలని …… ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని ….నా అంతరాత్మ చెప్తున్నది.

కత్తికంటే కలం గొప్పది.అన్న వివేకమంతమైన నానుడి నిజం. పుస్తకాలు, పెన్నులు చూసి ….. ఉగ్రవాదులు భయపడ్డారు. విద్య యొక్క శక్తి వాళ్ళను భయపెడుతున్నది. ఆడవాళ్ళను చూసి వాళ్ళు భయపడుతున్నారు. మహిళల కంఠధ్వనుల శక్తి వాళ్ళను భయపెడుతున్నది.

మనం సమాజంలో తీసుకురాబోయే సమానత్వం వాళ్ళని భయబ్రాంతుల్ని చేస్తున్నది.

(తాలిబాన్లు నిరక్షరాస్యులుఇస్లాం మతపు విలువల్ని వారు తప్పుగా తమ స్వంత ప్రయోజానాలకు వాడుకొంటున్నారు.) ఇస్లాం…. శాంతిని, మానవతను, సౌభాతృత్వాన్ని ప్రభోదిస్తుంది. విద్య అనేది కేవలం హక్కు కాదు…. అది ప్రతి పిల్లవాడి విధి, బాధ్యత అని ఇస్లాం మతపు విశ్వాసం.

శాంతి నేలకొంటేనే …. విద్యార్జన వీలవుతుంది. ప్రపంచంలో అనేకచోట్ల …..ముఖ్యంగాపాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ లలో యుద్దాలు, ఘర్షణలు, తీవ్రవాదం …. పిల్లలను బడులకు వెళ్ళకుండా నిరోధిన్నాయి. నిజంగాఈ యుద్దాల వల్ల మేము అలసిపోయాం. ప్రపంచవ్యాప్తంగా….స్త్రీలు, పిల్లలు అనేక రకాలుగా వేదనకు గురవుతున్నారు. పేదరికం, అజ్ఞానం, అన్యాయం, జాతి వివక్షత, మౌలిక హక్కుల వంచన…. అనేవి మగ, ఆడ అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.

ఇది మనం పోరాడాల్సిన సమయం.

అందుకనిఈరోజు మనం ప్రపంచాధినేతలను వారి వ్యూహాలను …. శాంతి సౌభాగ్యాల పట్ల మళ్ళించాలని కోరుతున్నాం.

శాంతి ఒప్పందాల్లో …. మహిళల మరియు బాలల హక్కుల పరిరక్షణ అంశాన్ని చేర్చాలని వారిని కోరుతున్నాం.

మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా ఉండబోయే ఏ ఒడంబడిక ఆమోదయోగ్యం కాదు.

ప్రపంచవ్యాప్తంగా…. పిల్లలందరికీ తప్పనిసరి ఉచిత విద్యనూ అందించాలని కోరుతున్నాం.పిల్లల పట్ల క్రూరత్వాన్ని, హానిని కలుగజేసే పనులనుండి పిల్లల్ని పరిరక్షించాలని ప్రభుత్వాలని కోరుతున్నాం.

అభివృద్ధి సాధించని దేశాల్లోని బాలికలకు విద్యావకాశాలు విస్తరింపజేయాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరుతున్నాం.

కుల, జాతి, మత, వర్గ, లింగ భేదాల పట్ల దురభిమానం పక్కకు నెట్టి…. ఓరిమి కలిగి వుండాలని …. స్త్రీలకు స్వేచ్చ, సమానాత్వాన్ని, సాధికారతను సాదించడానికి వీలు కల్పించాలని అన్ని సామాజిక వర్గాలను కోరుతున్నాం. సగంమందిని వెనుకకు నెడితే మనమెవరమూ ఏదీ సాధించలేము.

ధైర్యంగా వుండాలని….. బలాన్ని సమీకరించుకోవాలనిఅబలలు సబలలు అని చాటి చెప్పాలని …. అందరు ప్రపంచ సోదరీమణులను కోరుతున్నాం.

ఎందుకంటే….విద్యను అందించే విషయంలో మనమంతా సమిష్టిగా వుందాము. మనం కార్యసాధకులమవ్వాలంటే మనమంతా జ్ఞానం అనే ఆయుధాన్ని మనకు మనమే సమీకరించుకోవాలి. దానితో ఐకమత్యంగా వుండి మనల్ని మనమే సంరక్షించుకొందాం.

ప్రియ సోదరిసోదరులారా, లక్షలాదిమంది పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం లేదు అనే విషయం మనం మరవడానికి వీల్లేదు. మన ప్రియ సోదరిసోదరులందరూ …. కాంతివంతమైన …. శాంతివంతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు అనే విషయం మనం మరవడానికి వీల్లేదు.

కాబట్టి, విశ్వవ్యాప్తంగా నెలకొనివున్న నిరక్షరాస్యత, పేదరికం మరియు తీవ్రవాదంపై మనం పుస్తకాలు, పెన్నులతో పోరాటం చేద్దాం. …. అవే అత్యంత శక్తివంతమైన మన ఆయుధాలు.

ఒక పిల్లవాడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక పెన్, ఒక పుస్తకం …. ప్రపంచాన్ని మార్చివేయగలవు.

విద్య ఒక్కటే పరిష్కారం. ముందుగా విద్య కావాలి.

***

ముగింపు:

ఇంగ్లీష్ లో వున్న ఈ ఉపన్యాసాన్ని యూట్యూబ్ లో ఈ లంకెను నొక్కి వినవచ్చు. https://youtu.be/3rNhZu3ttIU.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.