ఉనికి పాట
తెల్లగులాబీ, మళ్ళీ వికసించేదాకా!
ఏథెన్స్ శ్వేతగులాబీ, నానా మొస్కోరి
– చంద్రలత
ప్రపంచాధిపతి కావాలని కలగన్న గ్రీకువీరుడు, అలెగ్జాండర్, జైత్రయాత్ర యాత్ర అర్హ్తాంతరంగా ముగియవచ్చుగాక !
ప్రపంచ యుద్ధానంతర సాంస్కృతిక పునర్జీవకాలంలో,అఖండసంగీత ప్రపంచపు జగజ్జేతగా వెలుగొందుతుంది మాత్రం గ్రీకు బిడ్డే. నిస్సందేహంగా, నిఖార్సుగా.
ఆమె ఒక గ్రీకు జానపద గాయని.
సాంప్రదాయ గ్రీకు వస్త్రాలంకరణలో, విరబూసిన తెల్లగులాబీ లాగానే ,ఆమె నడిచి వస్తుంది. పాదాల దాకా జీరాడే, పొడవు చేతుల దుస్తులలో , ఆమె కదిలివచ్చిన అప్సరస లాగానే ఉంటుంది. ఆమె వేదిక మీదకి వచ్చే ముందుగానే, ఆమె పాడబోయే మైక్ కు అలంకరించిన ఒక అరవిచ్చిన తెల్లగులాబీ పూల రెమ్మ, వెన్నెల కాంతులు విరజిమ్ముతూ శ్రోతలను ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఆమె తరతరాల శ్రోతల హృదయాలను కొల్లగొట్టిన ఏథెన్స్ శ్వేతగులాబీ, ఇవాన్నా “నానా” మొస్కోరి.
ఈ నడుమనే,తన ఎనభై ఏళ్ళ వయస్సులోనూ,తన పాటలపొదిని వెంట బెట్టుకొని, నానా, ప్రపంచ పర్యటనకు పూనుకొన్నది. గాయనిగా తన వృత్తిజీవితంలో , సుమారు 200 లకు పైగా మ్యూజిక్ ఆల్బంలు, అనేకానేక వ్యక్తిగత గీతాలను, నానా విడుదల చేసింది. గ్రీక్, జర్మన్, ఫ్రెంచ్,ఇంగ్లీష్,డచ్,ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్,హీబ్రూ ,వెల్ష్,మాండరీన్ చైనీస్,కోర్సికాన్, తదితర పన్నెండు భాషల్లో, ‘నానా’ అనర్ఘళంగా పాడుతుంది.
ఇంతటి వైవిధ్యభరితమైన సంగీత జీవితాన్ని కలిగిన నానా, తన సంతకపు పాట, “తెల్లగులాబీ, మళ్ళీ వికసించేదాకా!” పాటను , మొదట జర్మన్ భాషలో పాడింది. 1961 లో, తన 27 వ ఏట, గ్రీస్ పై జర్మన్ భాషలో చేసిన ఒక డాక్యుమెంటరీ కోసం ఆ పాటను రికార్డ్ చేసారు. నికోస్ గాట్సోస్ గేయరచయిత, మానస్ హడ్జిదాకిస్ స్వర రచయిత.
1957 లో తన గాయక జీవితం మొదలు పెట్టిన నానా, ఇప్పటికీ అదే ఉత్తేజంతో ఉద్వేగంతో, కొనసాగుతోంది. ఆమె నాజూకు కంఠం లోంచి జాలువారే, అదే నూతనోత్సాహపు జలపాతాల హోరుతో ,ఆమె సంగీతసరిత ఉరకలెత్తుతోంది.ఉవ్వెత్తున ముంచేస్తోంది.
ఆనాటికి ఈ నాటికి ‘నానా’ లో మార్పేమీ లేదు. మరింత శోభాయమానంగా అయ్యింది తప్ప. నిజమే, కొండమల్లె స్వచ్చతా, మంచుబిందువుల హారపు ధవళ కాంతులూ, వెల్లి విరిసిన తెల్ల గులాబీ సౌరభవమూ అన్నీ, అలలు అలలుగా,నానా ఎక్కిన వేదిక పైకి, ఆమెతో పాటే పరుచుకొంటాయి. తన తరపు గ్రీకు తత్వాన్ని నిలువెల్లా ప్రకటించేలా.
ప్రపంచానికే దిశానిర్దేశకులయిన ఆలోచనాపరులు గ్రీకు తాత్వికులు. స్వేచ్ఛా సమానత్వ భావనల ప్రజాస్వామికవాదులు, గ్రీకు ప్రజానీకం
యుద్ధమైనా, నిత్య జీవన సంఘర్షణ అయినా, విశేషమైన స్వతంత్ర స్పూర్తిని నింపుకొన్న ఆధునికతకు పుట్టిల్లు , గణతంత్రానికి, సంవాదానికి,సంభాషణ లకు పురిటి గడ్డ. అలాంటి గ్రీస్ , నియంతృత్వపు చీకటిలో మునిగి పోయే రోజు వస్తుందని ఊహించామా? సర్వ సౌభాగ్య సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగిన ఆ గ్రీకుభూమి, పేదరికంలో మగ్గిపోవాల్సిన దశ ఉంటుందని ఊహించగలమా? సజీవ చేతనమయమైన భావ పరపంపర అందించిన గ్రీకు భూమి , నిస్సహాయ బేలలా తెల్ల మొహం వేస్తుందని అనుకొన్నామా?
అలాంటి, ఒక నిస్సహాయ దశ, ప్రపంచయుద్ధాల నీడలో,నానా కళ్ళుతెరిచింది. పుష్పించే నగరం గా పిలిచే ఏథెన్స్ లో. 1934 లో. ఇటలీ నియంతృత్వం, వారి మిత్రులయైన ,నాజీ జర్మనీ నియంతల చొరబాటు,దురాక్రమణల దౌర్జన్యాలకు,సమోన్నత గ్రీకు సంస్కారం సవాలు చేయబడింది.బందీ చేయబడింది.ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇప్పటికీ,తేరుకోలేనంత పతనానికి లోనయిన, ఆ గ్రీకు నేల పైని ముళ్ళపొదల్లో విరిసిన ఒక తెల్ల గులాబీ నానా మొస్కోరీ.
అసలీ గులాబీకి ,అందునా తెల్ల గులాబీ గల ప్రాధాన్యత ఏమిటి? ఎందుకంతగా , తెల్ల గులాబీ పాటకు స్పందన వచ్చింది? ఆమె పాటల ప్రాచుర్యానికి, ఎంత విలువున్నదీ?ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందీ. ప్రపంచాయుద్ధాల అనంతరం , అటు గ్రీకు సమాజంలోను ఇటు పాశ్చాత్య సంగీత తాత్వికతలోనూ ఎలాంటి ప్రభావం చూపింది,ఈ పాట గ్రీకు వారి ఆయువు పాట , ఉనికి పాట అయ్యిం దీ తెలుసుకోవాలిగా,కాలాల వాలున!
అవును, కాలం పని కాలానిది! అపనమ్మకాల ఆపత్కాలాలలో, జీవితం పట్ల బలమైన నమ్మకాన్ని,శాంతిని, ప్రేమను ప్రతిధ్వనించే,శ్వేత గులాబీ గీతానికి నానా మొస్కోరీ స్వరమద్దింది,తానే ఆ విరిసిన తెల్ల గులాబీ కుసుమం అయ్యింది. శ్రోతల మదిలో.
***
నానా మొస్కోరీ గ్రీక్ దేశంలోని , క్రీట్ నందు, ఛనియా అన్న ఊళ్ళో, 13 అక్టోబర్, 1934 లో జన్మించింది. ఆమె తండ్రి, కాన్ స్టాంటైన్ మొస్కోరి, ఒక ఫిల్మ్ ప్రొజెక్టరర్ ,అంటే, సినిమాలు ఆడించే వ్యక్తి. అమ్మ,ఆలీస్ మొస్కోరీ, ఒక అష్షరైట్. సినిమాకి వచ్చిన ప్రేక్షకుల, టికెట్ సరిచూసి, వారి వారి స్థానాల్లో కూర్చో బెట్టేపని.
అది, మూకీ సినిమా యుగం. సినిమా సినిమా మధ్యలోనూ, సినిమా నడిచేటప్పుడు అక్కడక్కడా, చిన్నారి నానా,ఆమె అక్క జెన్నీ, తమకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్షించి, ప్రేక్షకులను అలరించేవారు. యూజెనియా, (జెన్నీ,నానా అక్క) ది శ్రావ్యమైన కంఠం. ఎంతో ఇష్టంగా జెన్నీని అడిగి మరీ, కోరిన పాటలు పాడించుకొనే వారు ప్రేక్షకులు. అలా, ప్రేక్షకులను ముందు జనరంజక ప్రదర్షన ఇవ్వడం అన్నది ,నానా కు అక్షరాలా వెన్నతో అబ్బిన విద్య! సహజంగా!
నానా మూడేళ్ళ వయస్సులో, ఆ కుటుంబం ఏథెన్స్ లో నివసించడానికి వెళ్ళారు. నానా అమ్మానాన్నలకు ,ఏథెన్స్ ఒక కొత్త సంగీత,కళా ప్రపంచాన్ని పరిచయం చేసింది.
సాంప్రదాయ గ్రీకు సంగీతంలో, ఓపెరా గాయని కావడం ఎంతో ప్రతిష్టాకరం.అది ఎంతో నిబద్దమైన శిక్షణతో, కఠినమైన సాధనతో గానీ సాధ్యం కాదు. నానా తల్లి, ఇద్దరు పిల్లలను ఆ ప్రతిష్టాత్మక” ఏథెన్స్ కన్సర్వటొర్ “లో సంగీత శిక్షణ ఇప్పించాలను కొన్నది.
“ ఏథెన్స్ కన్సర్వటొర్” , గ్రీకు దేశాన ప్రతిష్టాత్మకమైన సంగీత నాటక అసోసియేషన్. అక్కడ ప్రవేశము, శిక్షణ చాలా కష్టం.
నానా తన ఆరేళ్ల వయస్సు నుంచే , పాడుతోంది. అయితే, ఆమె అక్క జెన్నీ ది పుట్టుకతో అబ్బిన సంగీత సుస్వరం. కానీ, నానా కు సంగీత శిక్షణ ఒక ముఖ్యఅవసరమని ఆమె అమ్మానాన్నలు భావించారు. నానా స్వర పేటిక లో, ఒక కండరమే పని చేస్తుందని, వైద్య పరీక్షలో తెలిపారు. ఈ సంగీత శిక్షణ ఆమెకు స్వర చికిత్స అవుతుందని నానా అమ్మానాన్నలు అనుకొన్నారు.
వారి అమ్మానాన్నల ఆదాయం అంతంత మాత్రం. దానికి తోడు, నానా తండ్రి, కాన్ స్టాంటైన్ , ఆనాటి నాజీ దురాక్రమణ వ్యతిరేక ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవాడు. వారి పరిమిత ఆదాయాల దృష్ట్యా, ఒక్కరికే సంగీతశిక్షణ ఖర్చులు భరాయించగలరు. జెన్నీది సహజ సంగీతస్వరం. మెరుగులు పెట్టాలి. కానీ, నానా కి స్వర చికిత్స లా, ఆ సంగీతశిక్షణ అవసరం.
నానా అక్క తన ఇష్టాన్ని పక్కకు పెట్టి,తన శిక్షణను మానుకొని, చెల్లెలికి, సంగీతం నేర్చుకొనే అవకాశం కల్పించింది. అదే, నానా జీవితంలో ఒక గొప్ప మలుపు.
తన మేలుకోరి,ఆనాటి చిన్నతనంలోనే పెద్ద మనసుతో ఆలోచించి, అక్క చేసిన త్యాగాన్ని, నానా ఇప్పటికి అనుక్షణం గుర్తుచేసుకొంటుంది.
చెల్లెలు నానా సాధించిన,అగణిత ఘనతలో, అఖండ ఖ్యాతి లో తనకూ భాగం ఉన్నందుకు అక్క జెన్నీ మురిసిపోతుంది!
అమ్మ ఆలోచన, అమ్మానాన్నల స్వేదం, అక్క త్యాగం , ముప్పేటలా నానా పై ప్రకటించిన నమ్మకం , నిలబె ట్టు కొనేందుకే ,నానా కృషి చేసేది. అయితే,ఒక మారు తన చిన్నతనపు చేష్టల వలన, తన చదువుకే ముప్పు తెచ్చుకొంది. తన స్నేహితుల ప్రోద్బలంతో, ఏథెన్స్ నైట్ క్లబ్ లో జాజ్ సంగీతం ఆలపించింది. ఈ విషయం తెలుసుకొన్న సంస్థ వారు, నానా పై క్రమశిక్షణా చర్యగా, నానా ను పరీక్షలకు హాజరు కానివ్వలేదు.
కాబోయే సాంప్రదాయ సంగీతగాయని, ఇలాంటి అల్లాయి లొల్లాయి పాటలు పాడడం ఏమిటని వారు మండి పడ్డారు.దాదాపు ఎనిమిదేళ్ళ శిక్షణ, సాధన ,వృధా అయ్యాయి. నానా ఎప్పటికీ ఆ పరీక్షలలో పాల్గొన లేకపోయింది. ఆమె సంగీత పాఠాలు పూర్తి చేయకుండానే , సంగీత పరీక్షలలో సఫలీకృతురాలు కాకుండానే ,సర్టి ఫై చేయకుండానే ముగిసాయి. జాజ్ సంగీతం పై ఆనాటి సాంప్రదాయ సంగీతజ్ఞుల స్పందన అదీ!
సాంప్రదాయ సంగీత విద్యార్థి చాలా కఠిన నియమాలను పాటించాలి. శిక్షణా సమయానా, సంగీత కళాశాల లోపలా వెలుపలా,ఖచ్చితంగా సాంప్రదాయ పద్దతులు పాటించాలి. ఎన్నడూ వేలెత్తి చూపబడని నానా, ఒక్క సారిగా నిబంధనలను ఉల్లంఘించిన తిరుగుబాటుదారు అయ్యింది. ఎటొచ్చి ,తన తిరుగు బాటుకు, వెయ్యింతల మూల్యం చెల్లించాల్సి వచ్చింది.
అన్నేళ్ళ శిక్షణ ఒక ప్రమాణ జయ పత్రాన్ని ఇవ్వక పోవచ్చు కానీ, నానా స్వరానికి సొబగులు అద్దింది. ఆనాటి కఠిన శిక్షణ ఆమె సంగీత జీవితానికి, బలమైన పునాది అయ్యింది.
క్రమశిక్షణా చర్యకు గురై , తిరస్కృతురాలైన నానా, సంగీత కళాశాలను వదిలి పెట్టి, ఏథెన్స్ లోని జాకీ నైట్ క్లబ్ లో రాత్రిళ్ళు పాడసాగింది. సరిగ్గా అక్కడే, ఆమె తన బంగారు భవిష్యత్తును కలవబోతోంది!
***
అందానికి,అలంకరణకు,ఆకర్షణలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే, ప్రదర్షనకళ లో కళాకారిణి అయినా,
వాటన్నిటి పట్లా మొదటి నుంచీ విముఖురాలిగా ఉండేది. ఇప్పటికీ, అలాగే ఉంటుంది.
బొద్దుగా, కుదిమట్టంగా, హూందాగా, గంభీరంగా ఉండే నానా, సాదా సీదా గ్రీకు సాంప్రదాయ వస్త్రధారణతోను,తన మందపాటి నల్ల ఫ్రేం కళ్ళద్దాలతోనూ, నిరాడంబరంగా వేదిక మీదకు నడిచి వస్తుంటే,
మధ్యధరా సముద్రపు ఒడ్డున, ఇసుకతిన్నెల పైకి, యధాలాపంగా నడిచి వచ్చే, ఒక సాధారణమైన ,గ్రీకు పల్లెపడుచులా ఉంటుంది.
నానా కంఠం విప్పగానే, నవరస సమ్మిలిత లాలిత్యం, రమ్యత,ఆర్ద్రత, ప్రేమలతో పెనవేసుకొన్న స్వాభిమానపు నాజూకుతనాలతో పాటు, పల్లెపడుచు గొంతులోని అమాయకత్వం, జానపద సొబగుల్లోని కొంటెతనం, జాలువారుతాయి. సొంపుగా. సొగసుగా.
నిజమే, మనకు తెలిసిన చరిత్రలో, ప్రపంచాధిపత్యం కోసం , ఎల్లలు దాటి వచ్చిన గ్రీకు యోధుల వీరగాథలు సుపరిచతం. మరి, ఆయా యోధుల కుటుంబాల పరిస్థితి ఏమిటో ,మనకేం తెలుసు?
వారి బిడ్డలను ఎవరు పదిలంగా పెంచే వారు ? ఎవరు వృద్ధులను,యుద్ధ శకలాలయిన వికలాంగులను ఒద్దికగా కాపాడేవారు? ఎవరు వాళ్ళ పొలాలను పండించేవారు? ఎవరు నవరస వంటకాలను వండి వడ్డిం చేవారు? ఎవరు యుద్ధాలకు ఆర్ధిక వనరులు ప్రోది చేసేవారు? ఎవరు తమ కన్నబిడ్డలనే యుద్ధ సన్నిద్ధ మానవ వనరులనుగా మలు చేవారు?
ఇంకెవరు? ఆనాటి గ్రీకు వనితలే.
స్థానికంగా ‘ఏజియన్ సీ’ గా పిలవబడే మధ్యధరా సముద్రపు పాయ ద్వార నిరంతరం జరిగే నావికాయానాలే,ఆ దేశానికి జీవనాడి అయిన ఆ కాలాల్లో, దేశాంతరం వెళ్లిన ప్రియుడు, భర్త,అన్న, తమ్ముడు, కొడుకు.. ఎవరయితేం, తిరిగి వచ్చేదాకా ప్రాణాలు ఉగ్గ బట్టు కొని, ఆ సున్నిత హృదయాలు ఎంతగా తల్లడిల్లి పోయి ఉంటాయో!
అన్నిందాలా బాధ్యతలను ఒక పక్క నిర్వహిస్తూనే, మరోవైపు దిగులు,విచారం,ఎదురుచూపు,నిరాశ,నిస్పృహలతో నిత్యం పోరాడుతూ,వారి పునరాగమనాల కొరకై ధైర్యంగా కాచుకొని ఉండే వారెంత ధృఢ మనస్కులో! ఆ వంటరి మనసులకు తోడూ, నేస్తం, వార్తాహరుడు అన్నీ ఆ సముద్రమే! ఓదార్పు, ఉపశమనం,ఆశ అంతా ఆ సముద్రమే !
ఇలా విని చూడండి, నానా గొంతులో ఒక గడుసు పిల్ల, ఏకంగా ఆ సముద్రుని తోనే స్నేహం కట్టి, రోజూ తన ఊసులు పంచుకొంటోంది. అదే సంద్రం పైనే ఎక్కడో ఉన్న తన సఖుడికి ,రాయభారం పంపుతుంది.సముద్రుణ్ణే మధ్యవర్తిని,వార్తాహరుణ్ణి చేసి. అవన్నీ అందమైన కలలే!
అలాంటి ఒక జానపద గీతం, “సముద్రమే నా నెచ్చెలి!” లో, ఆ గ్రీకు పల్లెపడుచు తన సఖుడితో వివాహవిందుల కల కంటోంది. అతని పడవ తెరచాపను దించేసి, మరిక ఎత్తని రోజేగా వారిద్దరికీ పండగ రోజు. వారివురికి కాబోయే పెళ్ళి రోజు!విందుల రోజు!
“పడవలన్నీ నింపిన చిన్న మధుపాత్రలవ్వనీ
మనిద్దరి స్నేహితులకు మన ప్రేమ విందు చేస్తా
ఏదో ఒక రోజు నీ పడవని వొడ్డుకి లాగేస్తాం!
అదే నువ్విక పడవ తెరచాపను ఎత్తని రోజు.”
(https://genius.com/Nana-mouskouri-my-friend-the-sea-lyrics)
నావికామార్గమే ప్రధానమైన ఆ యుగంలో, నౌకా నిర్మాణంలోనూ, నౌకాయానం పై గ్రీకుల పట్టు, నైపుణ్యమే వారిని ,సముద్రయానంలో ఆధిపత్యులను చేసింది.అది సమరమైనా, వ్యాపారమైనా, ఇంటిలోని మగవారు దేశాంతరం వెళ్ళాల్సిందే!
వివిధ భౌగోళిక,రాజకీయ, ఆర్ధిక పరిస్థితులను తెలుసుకోవడానికి, సాంస్కృతిక ,కళారంగాలను వికసించడానికి, శాస్త్రీయ, ఖగోళ, వైద్య తదితర ఆధునాతన జ్ఞానం పెంపొందడానికి, ఈ విస్తృత పర్యటనలు తప్పక సాయపడే ఉంటాయి.
ఆ తెలివిడే ,వారిలో ప్రపంచాధిపత్య భావనకు బీజాలు వేసి ఉండొచ్చు కాదా?
దేశాంతరం వెళ్లిన ప్రియుడు, భర్త,అన్న, తమ్ముడు, కొడుకు…ఎవరయితేం, తిరిగి వచ్చేదాకా ప్రాణాలు ఉగ్గ బట్టు కొని, ఆ సున్నిత హృదయాలు ఎంతగా తల్లడిల్లి పోయి ఉంటాయో!
యుద్ధానికి సాగనంపడం అంటే, మరణద్వారాన వదిలి రావడమే! ఏనాటికి వారు తిరిగి వస్తారో లేదో తెలియదు. వారి సజీవస్పర్ష ఒక కలలాగా మిగిలిన ఆ కాలంలో, ఆయా భగ్న హృదయాలకు, ఉపశమనం ఏమిటి? అందరూ అలాంటి వేదనలోనో , మునిగి తేలుతున్నప్పుడు ఎవరికి ఎవరు ఊతం?స్వాంతన?
ఆ కన్నీటి సంద్రమేనా మధ్యధరా?
ఆ ఎదురుచూపుల, తపనల, నిట్టూర్పుల, అభద్రతల ఓదార్పులేగా గ్రీకు పడతుల పాటలు!
“మూడు ఈలలు వేసినపుడు”, “కుక్కురుకు పలోమా” లాంటి అనేక గ్రీకు జానపద ప్రేమ గీతాలు ,నానా గళంలో సరికొత్త సొంబగులు అద్దుకొన్నాయి . విపరీతమైన జనాదరణతో ప్రాచుర్యమైనవి.
ఆ ఆయా జీవనపోరాటాల ప్రయత్నాలలోని,విస్మృత అంశాలనే, నానా పాటలు లోకానికి పరిచయం చేశాయి. గాయపడిన యోధుల జీవితాలతో పాటు, గాయపడిన హృదయాలకూ నవనీతమైన గ్రీకు జానపదాలన్నీ, నానా గొంతులో పునరుజ్జీవించ బడ్డాయి.అలాంటి పాటలలో ఆణి ముత్యమే,” తెల్ల గులాబీలు విరిసే దాకా!”
ఒకానొక జానపద గీతానికి, సరిగొత్త స్వర సొబగులు అద్దిన ఆ పాట, గ్రీకు దేశీయుల గుండె తడిని స్పృశించడంలో ఆశ్చర్యం ఏముంది?
***
“కాలమంత పురాతనమైనదీ కథ.
లయంత పురాతనమైనదీ పాట .”
నానా పాడిన బ్యూటీ అండ్ బీస్ట్ లోని పాట ఇదీ!
జాకీ క్లబ్ లో జాజ్ పాడినందుకు, తన సంగీత కళాశాలలో నుంచి బహిష్కృతురాలయిన తరువాతా, ఏ సర్టిఫికెట్ లేకుండానే,అదే క్లబ్ లో రాత్రిళ్ళు తన గానాన్ని కొనసాగించింది. అమ్మ ఆకాంక్ష, అమ్మానాన్నల ఆదాయానికి మించిన ఖర్చు, అక్క పెద్ద మనసుతో తనకిచ్చిన అవకాశం,ఇలా ముగియడం, ఆ కుటుంబానికే పెద్ద దెబ్బ. ఈ సంఘట నానా ను మరింత బాధ్యతా బద్దురాలిని చేసాయి.
సరిగ్గా , నానా ఆ క్లబ్ లో పాడుతున్నప్పుడు, సుప్రసిద్ధ స్వరరచయిత, మానోస్ హడ్జవీస్ , నానా గొంతులోని ప్రత్యేకతను గుర్తించాడు. ఆమె స్వరానికి ముగ్దుడై, ఆమెకే ప్రత్యేకించి పాటలు స్వర పరిచాడు.నికోస్ గాటొస్ రచించిన పాటను, నానా కై స్వరపరిచాడు, అలా, 1957 లో ,నాన తన మొదటీ పాటను, గ్రీక్ మరియు ఇంగ్లీష్ లలో రికార్డ్ చేసింది.
1958 నాటి గ్రీక్ సంగీతోత్సవాలలో,హద్జవీస్ స్వరపరిచిన పాట,” ఎక్కడో ఓ చోట నా ప్రేమ సజీవంగా ఉంటుంది.”నానా పాడింది. అది ప్రథమ బహుమతి గెలుచుకొంది. ఆ పాట ను నికోస్ గాట్సోస్ రచించాడు. 1959 లో గ్రీక్ సంగీతోత్సవం ళొనూ, మెడిటేరియన్ సంగీత ఉత్సవంలోనూ, ఉత్తమ గాయని గా నానా ప్రథమ బహుమతి గెలుచుకొంది . ఈ వరస విజయాలు సంగీత ప్రపంచంలో ఆమెకు పేరుతో పాటు , రికార్డ్ కంపనీల వారి ఆఫర్లు అందుకొంది. అనతి కాలంలోనే , తన పాటలు వరసగా రికార్డ్ చేయసాగింది.ఫిలిప్స్ తదితర అంతర్జాతీయ కంపెనీలు, గ్రీకు తో పాటు ఇతర భాషలకు, ఇంగ్లీషుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలా, బెలఫాంటే కు ఒక కొత్త గొంతుకగా పరిచయం అయ్యింది.
క్విన్సీ జోన్స్ ఆహ్వానంతో ,”ది గర్ల్ ఫ్రం గ్రీస్ సింగ్స్” అన్న సినిమాలో పాడడం కోసం ,1962 లో నానా ఏథెన్స్ నుంచి న్యూయార్క్ కు ప్రయాణమై, అమెరికాకు పరిచయం అయ్యింది.అప్పటి అంతర్జాతీయ రికార్డింగ్ కంపెనీలెన్నో అక్కడే ఉన్నాయి కదా. ‘నానా సింగ్స్’ (1965) ఆల్బం హ్యారీ బెలఫాంటే దృష్టిలో పడింది.1966లో బెలఫాంటే తనతో ప్రపంచ సంగీత యాత్రకు ఆహ్వానించాడు.
బెలఫాంటే నిర్వహిస్తున్న ప్రపంచ పర్యటన సందర్భంలో, తన స్టేజ్ అప్పియర్స్ విషయమై ,నానాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అలంకరణ ప్రధానమైన ప్రదర్షనా కళాకారులమని అలంకరణలో కొంచెం మార్పు, అలంకరణ కొద్దిపాటి శ్రద్ధ పెడితే, వేదిక మీద ప్రత్యేకంగా నిలబెడుతుందనీ.
బెలఫాంటే సలహాలను నానా నిర్ద్వంద్వంగా నిరాకరించింది. తన రూపలావణ్యం కన్నా, గాన మధురిమ ముఖ్యమనీ, తనలా తనుండలేక పోతే ఆ పర్యటననే రద్దు చేసుకొంటానని స్పష్టం చేసింది.అది మిలియన్ డాలర్ల గౌరవ ఆదాయం ఆమెకు తెచ్చి పెట్టే, పర్యటన. నానా , ఒక్క మాటతో తోసి పుచ్చింది.
ఆ పర్యటన కొరకై, బెలఫాంటే తో చేసిన ,మొదటి ఫోటో షూట్లో కవర్ పైననే నానా కళ్ళద్దాలు లేకుండా కనబడుతుంది. ఆ ఫోటో షూట్ ,ఆ తరువాతి రెండురోజుల ప్రదర్షన, నానా స్వాభిమానాన్ని సవాలుచేసింది. వెంటనే ,నానా తన అభిప్రయాలను, చాలా స్పష్టంగా ప్రకటించింది.
నానా ధిక్కరించింది, ఆనాటి సుప్రసిద్ధ జనరంజక కళాకారుడు, ప్రజా నాయకుడు, హ్యారీ బెలఫాంటే ను. తన సహజత్వాన్ని ప్రకటించుకోలేని సందర్భాలను, ఆమె నిర్ద్వందంగా ఖండించింది. ప్రపంచపర్యటనను, దానితో రాబోయే అఖండ ఖ్యాతిని, సంపదను ఆమె తృణప్రాయంగా తిరస్కరించింది.
నానాకు నచ్చ చెప్పే ప్రయత్నం మానుకొని, బెలఫాంటే తనను తాను నచ్చ జెప్పుకొన్నాడు. బెలఫాంటే నానా అభిప్రాయాలను,ఇష్టాఇష్టాలను గౌరవించాడు. వారిద్దరి గాయక వృత్తి దశాబ్దాల పాటూ నిరాఘాటంగా కొన సాగింది. పరస్పర గౌరవ భావనతో, వారిరువురి స్నేహమూ కొనసాగుతోంది.ఆనాటి నుంచి ఈనాటి వరకూ.
నానా తన మందపాటి కళ్ళద్దాలతోనే, మాములు తెలుపురంగు గ్రీకు వస్త్రధారణతోనే, సంగీత ప్రపంచాన్ని జయించింది. నానా తన సుధీర్ఘ సంగీత జీవితంలో, ఎక్కని సంగీత వేదిక లేదంటే, అతిశయోక్తి కాదు. తాను ఎక్కిన ప్రతి వేదిక మీదల్లా, ప్రత్యేకం గా ,తలెత్తి, తనలా తాను నిలబడింది. నిలబడుతుంది, నానా మొస్కోరీ.
***
1961 లో ఒక జర్మన్ డాక్యుమెం టరీ కోసం రికార్డ్ చేసిన “తెల్ల గులాబీ వికసించే దాకా” పాటకు 1981 లో రికార్డ్ చేసిన “స్వేచ్ఛ కొరకై” పాటకు మధ్యన , నానా చాలా ముఖ్యమైన సంగీత సోపానాలను దాటి వచ్చింది.
అమెరికా పర్యటన, హాలీవుడ్ లో పాడడం తో బాటు ప్రతిష్టాత్మకమైన , బెలఫాంటే తో సంగీత పర్యటన , నానా ను తిరుగులేని గ్రీకు జానపద గాయని గా సంగీత ప్రపంచానికి ప్రకటించేసింది.
1966 నుండి 1976 వరకు ,దాదాపు దశాబ్ద కాలం , నానా బిబిసి లో, ‘ ప్రెజెంటింగ్ నానా మొస్కోరీ” అన్న సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది.
సుమారు 20 భాషలలో పాడగలిగిన నానా, గ్రీకు జానపదం తో పాటు యూరోపియన్ జానపదశైలుల్లోని అనేక అపురూప గీతాలను, శ్రోతలకు, ప్రేక్షకులకు పరిచయం చేసింది.
ఆ బృందం లోని సాటి కళాకారుడు, జార్జ్ పెల్సొలావ్ ను వివాహం చేసుకొంది. వారికిద్దరు పిల్లలు. వారి వృత్తి ఉన్నతదశలో ఉన్నప్పుడు, జార్జ్ గ్రీక్ దేశానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయం తీసుకొన్నాడు.చేసిన ఒప్పందాలను అర్థాంతరంగా వదిలి పోలేక, ఇబ్బడి ముబ్బడిగా వస్తోన్న అవకాశాలను వదులుకోలేక, చివరికి వారివురు విడిపోవడానికి నిర్ణయించుకొన్నారు. సాంప్రదాయవాది అయిన నానా , చాలా కాలం పాటు పునర్వివాహం చేసుకోలేదు. వంటరిగానే, పిల్లల బాగోగులు చూస్తూ, తన వృత్తిలో నిమగ్నమై ఉండేది.ఆ తరువాత,స్వరరచయిత , ఆం డ్రె ఛాపెల్ తో సహజీవనం మొదలుపెట్టినా, ఒక పుష్కర కాలం తరువాత వివాహం చేసుకొన్నారు. ఇంత ఆలస్యమూ, నానా సాంప్రదాయ భావాల పట్టింపుల చేతనే!
1981 లో “స్వేచ్ఛ కొరకై For Liberty)” పాట, అయిదు భాషలలో రికార్డ్ చేయబడింది. నానా పాటలలో ఈ రెండు పాటలు అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు.
1990-94 వరకు యూరోపియన్ పాలిమెంట్లో గ్రీక్ డెప్యూటీ గా,నియమించబడింది.
జీవితకాల కృషికి అందజేసే అత్యున్నత సంగీత సత్కారం , ప్రతిస్టాత్మక “ఎకో మ్యూజిక్ అవార్డ్” (2015)చేత, నానా సత్కరించ బడింది.
***
“కొందరంటారు ప్రేమంటే, అది లేత రెల్లుపొదలని ముంచెత్తే నదీప్రవాహమని.
కొందరంటారు ప్రేమంటే, అది నీ మనసును రక్తమోడేలా గాట్లుపెట్టే చురకత్తని
కొందరంటారు ప్రేమంటే, అది ఎంతకూ తీరని దుర్భర ఆకలి బాధ అని
నేనంటాను ప్రేమంటే, అది ఒక పుష్పమనీ, నీవు కేవలం దాని విత్తనమనీ.
…………………..
కాస్త జ్ఞాపకం పెట్టుకో,
శీతాకాలంలో ఘనీభవించిన మంచుపొరల అడుగున
ఒక విత్తనం దాగి ఉంటుంది.
సూరీడి వెచ్చని ప్రేమతో,
వసంతకాలాన గులాబీ పువ్వవుతుంది.”
(గులాబీ పువ్వు The Rose, https://genius.com/Nana-mouskouri-the-rose-lyrics)
గులాబీ ని మరో పేరుతో పిలిస్తే, పరిమళించకుండా పోతుందా?
అందుకేగా, ‘ ఏ పేరుతో పిలిచినా గులాబీ గులాబీనే ‘ అన్నాడు మహాకవి షేక్ స్పియర్.
అయితే, ఏ రంగులో పూచిన గులాబీ ప్రత్యేకత ఆ రంగుదే! ముఖ్యంగా, పాశ్చాత్య సంస్కృతిలో , గులాబీపూల ప్రాధాన్యత అంతింతని చెప్పలేం!
ఏథెన్స్ అంటేనే పుష్పించే నగరం. ఏథొస్ అంటే అంటే ఫలవర్ధకమైన నేల అని మరో అర్థం కూడా చెపుతుంటారు. సారవంతమైన, జీవస్పర్ష కలిగిన ఏథెన్స్ నేలలో నాటిన అ విత్తైనా , పుష్పించి ,ఫలిస్తుందనీ విశ్వసిస్తారు.
ఇక, గ్రీకులకు గులాబీపూలతో గల అనుబంధాలను గురించి చెప్పాలంటే, గ్రీకు పురాణాలంత పురాతనమైనది.గ్రీకు సంస్కృతిలో ప్రధానమైనదీ.గ్రీకు కళాసాంప్రదాయల్లో వైభవాన్ని పొందింది గులాబీ పువ్వు. అందులోనూ,శ్వేతగులాబీ !
శృంగారానికి, సౌందర్యానికి అధిదేవత అయిన, గ్రీకు దేవత, ఆఫ్రో డైట్, ఒక రోజు దేవ వనంలో విహరిస్తున్నప్పుడు,తెల్లగులాబీని అందుకోబోతే , గులాబీ ముల్లు ,ఆమె వేలికి గుచ్చుకొందట. ఆమె రక్తం చుక్క తాకిన , ఆ తెల్ల గులాబీ ఎరుపు రంగులోకి మారిందట. అలాగే, మరోసారి, తెల్లగులాబీ కి ఆ దేవత పెదవులు తాటిస్తే, ఆ సిగ్గిల్లిన తెల్ల గులాబీ పువ్వు, ఆమె చెక్కిళ్ళ లాంటి లేతగులాబీ వన్నెలోకి మారిపోయిందట.
మానవాళి ఊహలకు పరిమళాలు అద్దిన తెల్ల గులాబీ , ప్రేమకు, సౌదర్యానికీ, శాంతికి,యుద్ధానికి,రాజీకి రాజకీయానికి… వన్నెచిన్నెలద్దుతూ వచ్చింది.
శిలాజాల ఆధారంగా, చరిత్రకు అందనంత కాలాల్లోనే గులాబీ పూచిందని తెలుస్తుంది. రోమన్ సామ్రాజ్య కాలంలో , మధ్యప్రాచ్యం లో , గులాబీ ప్రాచుర్యాన్ని, ప్రాధాన్యతను పొందింది. రోం నగరంలో విశాలమైన గులాబీ తోటలను నాటారు. పరిమళాల తయారీలోనూ, ఔషధాల తయారీలోనూ విరివిగా గులాబీని వినియోగించే వారు.
16, 17 శతాబ్దాలలో, ఓటొమన్ సామ్రాజ్య కాలంలో, మధ్యధరా సముద్ర ప్రాంతంతో పాటు, మధ్యప్రాచ్య, పాశ్చాత్య రాజ్యాలన్నీ వారి అధీనంలో ఉండేవి. గులాబీల వన్నెలకు ప్రతీకలను అద్దినది ఆ కాలంలోనే.
అక్షరాస్యత నిరాకరించబడిన పర్షియన్ స్త్రీలు, తమ భావోద్వేగాల ప్రకటనకు,వివిధ వన్నెల గులాబీ పూలను ప్రతీకల్లా వినియోగించే వారు.
ఎర్ర గులాబీలు ప్రేమకు శృంగారానికి ప్రతీకలయితే, లేత గులాబీ వన్నె గులాబీలు సంతోషానికి, ఆరాధనకు, కృతజ్ఞతకు చిహ్నం గా భావించే వారు.పసుపువన్నె గులాబీలు స్నేహానికి, సంతోషానికి ,స్వేచ్ఛకు చిహ్నం అయితే, అన్నిటికన్నా పురాతనమైన, తెల్ల గులాబీ, నిష్కళంకమైన ప్రేమకు, శాంతికి గుర్తుగా ప్రస్తావించేవారు. తెల్ల గులాబీలు ప్రేమను, స్నేహాన్ని, శాంతిని గౌరవాన్న్ని, ఆశను వ్యక్తపరుస్తాయి.
ఇక, ” తెల్ల గులాబీ అంటే నిరంకుశత్వపు ముఖాన ఆడించిన శుద్ధ ముగ్దత్వం !” అన్నాడు, హాన్స్ స్కోల్, నిర్దాక్షిణ్య నాజీ గిల్లిటెన్ పదునైన గోడ్డలికి, తన మెడను ఎదురొడ్డి!
హాన్స్ స్కోల్ తెల్ల గులాబీ ఉద్యమ సారధి.
నిరంకుశ,నిర్దాక్షిణ్య, నాజీ దళాలు పోలెండ్ దురాక్రమణ తదనతరం చేసిన, 300,000 యూదుల మారణ హోమాన్ని ప్రశ్నించిన , శాంతియుత జర్మన్ మేధో ఉద్యమం ,తెల్లగులాబీ ఉద్యమం. గతశతాబ్దిలో , అతి సమీప చరిత్రలో, అత్యంత హేయమనిన అమానవీయ ఘట్టాలు అవి. అప్పుడప్పుడు ,అనిపిస్తుంది. జర్మనీలో కొంచం మానవత్వం ఉన్న పౌరులే లేరా ? వారంతా ఏం చేస్తున్నారు ? అని. ఉన్నారని లోకానికి ప్రకటీంచిందే, ఈ తెల్లగులాబీ ఉద్యమం.
మ్యూనిచ్ విశ్వవిద్యాలయం విద్యార్థి అయిన హాన్స్ స్కోల్ (1918-1943) ప్రారంభించిన ఈ ఉద్యమం లో,అతని చెల్లెలు,సోఫీ స్కోల్ (1921-1943)ప్రధాన పాత్ర వహించింది. అలెక్షాండర్ స్కొమొకాల్, విల్లీ గ్రాఫ్, క్రిస్తొఫర్ ప్రొస్ట్ తదితర విద్యార్థులతొ పాటు, ప్రొఫెసర్ కుర్ట్ హూబర్ వంటి అధ్యాపకులు ఈ ఉద్యమంలో ప్రధాన పాత్రధారులు.
” ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. మేం రాసింది, చెప్పింది నమ్మే వాళ్ళు అనేకానేకులు .మా లాగా వాళ్ళు మాట విప్పడానికి జంకుతున్నారు.అంతే.” సోఫీ అన్నది. తన చివరి మాటల్లో.
ఇక, హాన్స్ చివరి మాటలు,” స్వేచ్ఛని బతకనీయండి!”
హన్స్ సోఫీ ఇద్దరూ అన్నాచెల్లెళ్ళు. షోర్చిటన్ బర్గ్ మేయర్, రోబర్ స్కాల్ పిల్లలు.మ్యూనిచ్ విశ్వవిదాలయం విద్యార్థులు. హాన్స్ కి మార్గదర్షకుడు, ఒక కాథలిక్ బిషప్, ఆగస్ట్ వాన్ గాలెన్.
తెల్లగులాబీ ఉద్యమం శాంతియుత ఆలోచనాపరులది.వాళ్ళు స్వదస్తూరీలో రాసి, తమ వద్దనున్న చిన్న కాపీయింగ్ మెషీన్ లో ప్రతులు తయారు చేసుకొని ,సాటి విద్యార్థులకు పౌరులకు పంచారు. మొత్తం, ఆరు కరపత్రాలు,పదిహేను వేల కాపీలు. స్టెన్సిల్స్ తో, గోడల మీద , నినాదాలు , ఆలోచనలు రాసేవారు. యూనివర్సిటీ ఆవరణలో, ఆరో కరపత్రం పంచే సమయంలో, హాన్స్ ను, సోఫీ ని నిర్భందించారు. నాలుగో రోజున, వారిద్దరి గిల్లెటిన్ వేటుతో, ఉద్యమం ముగిసింది. వారిద్దరికీ పట్టుమని పాతికేళ్ల వయసులేదపుడు.
ఆరో కరపత్రం ప్రతి, జర్మన్ దేశ నాజీ సరిహద్దులు దాటి, మిత్రకూటమి చేతిలో పడింది.దానిని, కొన్ని మిలియన్ల కాపీలు చేసి , నాజీ జర్మనీ అంతా వెదజల్లారు మిత్రకూటమి వారు!
ఆ ఆరో కరపత్ర రచనలో ప్రధాన పాత్రధారి, హాన్స్ కి మార్గదర్షకుడైన, ఒక కాథలిక్ బిషప్, ఆగస్ట్ వాన్ గాలెన్.
యుద్ధానంతర జర్మనీ ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. జర్మనీ పునర్నిర్మాణ దశలో, హాన్స్ ,సోఫీ అన్నాచెల్లెళ్ళ ఆలోచనలు,తిరుగుబాటు, ధైర్యం,త్యాగం,ఆ తరంలోని జర్మన్ స్పృహకు ప్రతీకలయ్యాయి.గౌరవంగా స్పూర్తిగా తీసుకొన్నారు.
యుద్ధానంతరం, వైట్ రోజ్ ఉద్యమ నేపథ్యంలో, ఆ కాలపు సంఘటల ఆధారంగా, ఆ అన్నాచెల్లెళ్ళ జీవితాల ఆధారంగా ,అనేక నాటకాలు ప్రదర్షించబడ్డాయి. సినిమాలు నిర్మించబడ్డాయి. మ్యూనిచ్ విశ్వవిద్యాలయంలోనూ,మ్యూనిచ్ నగరంలోనూ,వైట్ రోజ్ ఉద్యమ స్మారక చిహ్నాలు నిర్మించారు.
ఆ క్రమంలోనే, నాజీ జర్మన్ దురంతాలు జరిపిన గ్రీక్ ప్రాంతాలకు కొత్త ఊపిరిని పోసే క్రమంలోనే, ఈ నానా
“తెల్ల గులాబీ “పాట చిత్రీకరించ బడింది. ఈ పాట, అటు ఆనాడు ప్రపంచం ముందు దోషిగా నిలబడిన జర్మన్,తన ఆత్మస్థైర్యం కూడ దీసుకోవడానికి, ఇటు స్వేచ్ఛావాదులయిన వారందరికీ అంది వచ్చింది.
ఆనాటి స్వేచ్ఛావాదులకు ఈ పాట ఒక సజీవస్మృతి.
స్వచ్ఛతను, అమాయకత్వాన్ని , ముగ్దత్వాన్ని ముప్పెటలా మూస పోసుకొన్న ,అచ్చమైన గ్రీకు జానపద సరళి ఈ పాటకు సున్నితమైన గాఢతను అద్దింది.
నానా తండ్రి, కాన్ స్టాంటైన్ మొస్కోరి, గ్రీకు దేశాన నాజీ దురాక్రమణను వ్యతిరేక ఉద్యమాలతో సన్నిహిత సంబంధాలు కలిగిన నిరసనకారుడు.
అటు జర్మన్ల తో పాటు యూరోపియన్లకు, ఇటు నానా కు, “ తెల్లగులాబీ” పాట, అంత ముఖ్యమైనది ఎందుకంటే, అందుకే!
నానా మొస్కోరి పాట విశ్వవేదిక మీద గ్రీకు ఆత్మను ఆవిష్కరించింది. మానవస్పృహను ప్రకటించింది.
స్వేచ్ఛగా.స్వచ్ఛంగా.తెల్ల గులాబీలా!
***
- తెల్లగులాబీ మళ్ళీ వికసించే దాకా.
గానం: నానా మొస్కోరి (1961)
స్వర రచన: మానోస్ హడ్కిదకిస్
పాట రచన: హాన్స్ బ్రాడ్టిల్
తెలుగు సేత: చంద్ర లత
నీవిక నాకు వీడ్కోలు చెప్పాలి,
నన్నిక ఏకాంతంలో వదిలేయి.
అప్పటి దాకా, సెలవిక నా ప్రియతమా !
తెల్లగులాబీ,,మళ్ళీ వికసించేదాకా
వేసవిరోజులు కోనలో కదిలిపోతున్నాయి.
మనం విడివిడిగా ఉండాల్సిన వేళ రాబోతున్నది
కానీ. వసంతకాలంతో తిరిగి వచ్చే గులాబీలా,
వసంతంతో పాటు నీవు తిరిగివస్తావుగా !
తెల్లగులాబీ మళ్ళీ వికసించే దాకా,
నీవిక నాకు వీడ్కోలు చెప్పాలి,
నన్నిక ఏకాంతంలో వదిలేయి
అప్పటి దాకా, సెలవిక నా ప్రియతమా !
తెల్లగులాబీ,,మళ్ళీ వికసించేదాకా
అప్పటి దాకా, సెలవిక!
అప్పటి దాకా, సెలవిక!
అప్పటి దాకా, సెలవిక!
- స్వేచ్ఛ కొరకై
గానం: నానా మొస్కోరి (1981)
రచన: పియర్రె డెలనోయి
పాట స్వరం: క్లాడ్ లెమెసెల్
తెలుగు సేత: చంద్ర లత
నీవు పాడేప్పుడు నీతో పాడుతాను, ఓ స్వేచ్ఛా ,
నీవు దుఃఖిస్తే నేనూ విచారంతో ఏడుస్తా.
నీవు బాధ పడితే ,నీ కోసం ప్రార్దిస్తాను, ఓ స్వేచ్ఛా!
విషాద చీకటి రాత్రుల భయాలు
ఏదో ఓ రోజు శిథిలమవుతాయి.
నీ పోరాటలు
మా కోసం కొత్త ఉదయాలను తెస్తాయి.
నీ కారుణ్య గుణం లోని బలం,నీ ప్రేమ,
వారిని వణికిస్తుంది.
నీవు పాడినపుడల్లా,
నీతోనే స్వరం కలుపుతా, ఓ స్వేచ్ఛా!
నీవు లేని శూన్యాల్లో,
నీ కోసం వెతుకుతూనే ఉన్నా.
నీవెవరు?
కలలాంటి భ్రమవా లేక వాస్తవానివా ?
విశ్వాసపు ఆదర్శవాంఛ ,విప్లవం
నీవు మానవత్వ ప్రతీకవని,
నేను విశ్వసిస్తున్నా!
ఈ లోకాన శాశ్వతత్వపు వెలుగులతో నింపగలవని.
నిన్ను రక్షించడానికి,
మానవులు ప్రాణాలొడ్డడం చూస్తున్నా,
నిన్ను కాపాడాలని,
నీతోకు అండదండగా
ఉండాలని ప్రయత్నిస్తూ.
నీవు పాడినపుడల్లా
నీతో స్వరం కలుపుతున్నా, ఓ స్వేచ్ఛా.
నీ చిప్పిల్లిన కన్నీటితడిని,
నీ సంతోష సంబరాలనీ ,
నేను గాఢంగా ప్రేమిస్తున్నాను.
మనమందరం కలిసి పాడుదాం,
మన చరిత్రను సంబరంగా పునర్మించుకొంటూ.
ఒక్క గొంతుతో పాడే ఆశాగీతాలు
విజయపథo వైపే సాగుతాయి.
స్వేచ్ఛ ! స్వేచ్ఛ ! స్వేచ్ఛ ! స్వేచ్ఛ!
References:
1. The White Rose of Athens
https://genius.com/Nana-
2.. For Liberty
https://genius.com/Nana-
3.Nana Mouskouri – The White Rose of Athens (Albert Hall 1974)
https://www.youtube.com/watch?
4.The Rose
https://genius.com/Nana-
*****
చంద్రలత రచయిత్రి, అధ్యాపకురాలు. ప్రస్తుత నివాసం నెల్లూరు. 1997 లో వీరి “రేగడి విత్తులు” నవలకు తానా వారి బహుమతి లభించింది. వర్థని (1996), దృశ్యాదృశ్యం (2003) ఇతర నవలలు.
నేనూ నాన్ననవుతా (1996), ఇదం శరీరం (2004), వివర్ణం (2007) కథా సంపుటాలు. “ప్రభవ” అనే చిన్న పిల్లల బడి నిర్వహిస్తున్నారు.
ఉనికి ని పాట తో చాటడం విప్లవ బీజం. అలాంటి విత్తులను మీరే పరిచయం చేయగలరు. ఒకో వాక్యం వ్రాసేందుకు మీరు చూపుతున్న శ్రద్ధ నా మనసుపై ఎడతెరిపి లేని వర్షమౌతోంది.అనేకానేక అభినందనలు.ఈ గ్రీకు శ్వేత గులాబి కి మీ ద్వారా జోతలు చెల్లించుకుంటున్నాను.
చంద్ర లత గారూ కొంత కాలం క్రితం మీ రేగడి విత్తులు చదివాను.రైతు బిడ్డను ఏమో చాలా నచ్చింది.బాగా గుర్తు వుంది.మళ్లీ మీరు ఇప్పుడు వ్రాస్తున్న ఉనికి పాట చదువు తున్నాను.చాలా బాగా ఎంతో పరిశోధన చేసి వ్రాస్తున్నారు. విలువైన అంశం ఎన్నుకున్నారు అభినందనలు అమ్మా.
mee abhimaaniki anEka dhanyvaadaalu Udayalakshmi garu.