కథా మధురం  

“ఇప్పుడైనా చెప్పనీయమ్మా” -జి.యస్.లక్ష్మి

-ఆర్.దమయంతి

  ‘అమ్మ ఔన్నత్యానికి ఆకాశమంత ఆలయం కట్టిన కథ!’ – శ్రీమతి జి.ఎస్ లక్ష్మి గారు రాసిన – ‘ఇప్పుడైనా చెప్పనీయమ్మా..’

ముందుగా ఒక మాట:

‘తన సృష్టి లో నే ఇంత అందమైన సృష్టి వుందని తెలీని  బ్రహ్మ సయితం  అమ్మ ని చూసి అబ్బురపడిపోతాడట!’ – బహుశా, ఇంతకు మించిన అద్భుతమైన  వాక్యం మరొకటి వుండదేమో, – అమ్మ ని అభివర్ణించేందుకు, అమ్మ పేమానురాగాలకి హృదయాంజలి ఘటించేందుకు! 

ఈ భావాన్ని సంపూర్ణం గా  నింపుకున్న ఈ కథను – ఇప్పుడు మీ ముందు ఆవిష్కరించబోతున్నాను.  

కథ  ఏమిటంటే :  అంతర్జాతీయం గా  పేరొందిన ఒక ప్రతిష్టాత్మక సాఫ్ట్  వేర్ సంస్థకి సి. ఇ.ఓ. గా నియమితుడౌతాడు విజయ్. అమెరికా వంటి అగ్ర రాజ్యంలో అనేకానేక  మేధావులు పోటీ పడే ఆ పదివికి ఒక భారతీయుడు ఈ అత్యున్నత స్థానాన్ని గెలుచుకోవడం అంతర్జాతీయ వార్త గా నిలుస్తుంది.   ఆ సందర్భం గా టీ వీ చానెల్ లో వారి  ఇంటర్వ్యూ లో  తన విజయానికి మూల కారణం తన తల్లి అని, ఆమె ని స్ఫూర్తిగా తీసుకుని అనుసరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఎంతో ఆనందం గా ప్రకటిస్తాడు.

అతని మాటల్ని వింటున్న భార్య నీలిమ ఆశ్చర్యపోతుంది. ఆ వెనక ప్రశ్నిస్తుంది. ఆమె ఒకో ప్రశ్నకి ఒకో ఆణిముత్యం లాటి జవాబుగా అమ్మ కథని వినిపిస్తాడు. 

నిజానికి,  ఒక సి ఇ ఒ  స్థాయికి ఎదిగిన కొడుకుకి   గైడెన్స్న్స్ ఇచ్చేంత స్థాయిలో  చదువు కానీ, తెలివితేటలు కానీ ఏవీ లేని ఆ తల్లి,  గడప దాటని ఆ ఇల్లాలు, బయట ప్రపంచాన్ని చూడని ఆ అమాయకురాలు – ఇతనికి  ఎలా   స్ఫూర్తి  కాగలిగింది? ఈ హోదాపరుడు  ఆమె అడుగుజాడలని అనుసరించేంత గొప్పదనమేముందీ ఆ తల్లిలో? ఈ  సందేహాలు తీరాలంటే – కథ చదవడం ఒకటే మార్గం! 

 *** 

 కథలోని స్త్రీ పాత్రలు,  ఔన్నత్య గుణ సంపదలు:

*  పార్వతి :  చిన్నతనం లోనే పెళ్ళవుతుంది.  ఉమ్మడి కుటుంబంలోకి, పెద్ద కోడలిగా అడుగుపెడుతుంది. తనే పసిది. కానీ ఇంట్లో తనకన్నా పసి మనస్కులన్న్నారని తెలుసుకోగానే,   కొంగు బిగించి, పనిలోకి దూకి,  పెద్ద ఆరిందలా మారిపోతుంది. ఇంట్లో ఎవరి ధోరణి వారిదే. కానీ ఆ అందరూ ఒక ఇంటి కప్పు కిందే కలిసి బ్రతకాలి కాబట్టి, ఒక సెంటర్ పాయింట్ ని కనిపెట్టింది. ఎన్ని టార్గెట్సో..మరెన్ని చాలెంజెసో!  వాట్లకి మర్గాలు వెదుకుతూ, ఆ చిన్ని బుర్ర లో ఎన్నేసి ఆలోచనా తరంగాలో!  ‘ఈ తలనొప్పులన్నీ నాకెందుకు అని అనుకోకపోవడం పార్వతిలో ని  ఒక ప్రత్యేక  సుగుణం.  ఎలా అయినా అందర్నీ ఐకమత్యమనే ఒక తాటికి కట్టేసి వుంచాలనుకోవడం, ఆ దిశగా కార్యాచరణ చేయడం పార్వతి పాత్ర లో ని ఔన్నత్యం! 

 ‘ఈ మాటా ఆ మాట పెద్ద కోడలికీ అనే నానుడిలా…పార్వతికి అన్ని వైపుల నించి ఎదురు గాలులే వీస్తుంటాయి. అయినా,  అన్న వాళ్ళే, చివరికి ఆమె చుట్టూ చేరి, ‘నువ్వు ఇంటికి పెద్ద కోడలివి కదా, నువ్వు సలహా చెప్పు.  ఆమె తుది తీర్పు ‘కొసం అత్త గారు, అత్త గారి అత్తగారు కూడా  ఆమెని అడుగుతుంటారు. సరిగ్గా అప్ప్పుడామె, ఉన్నత న్యాయస్థానం లో తుది తీర్పు వెలిబుచ్చే న్యాయాధికారిణి లా అవతారమెత్తేది. ఆమె తీర్పుతో అందరూ సంతుష్టులయ్యే వాళ్ళు. అందుకు ప్రతిఫలం గా పార్వతికి దక్కే సత్కారాలు, సన్మానాలు, పారితోషికాలు అంటూ ఏవీ వుండవు. కానీ, అందరి మనసులో ఆమెకి ఒక ప్రత్యేక స్థానం వుంటుంది. అదే పెద్ద పదవి ఆమెకి.    

‘ మనిషి మనిషి కి మధ్య కేవలం ఆర్ధిక సంబంధాలు  వుండటం వల్లే  కుటుంబానుబంధాలు నిలబడవు.’ అని నిరూపించి, అందుకు తాను ప్రత్యక్ష సాక్షి గా నిలిచిన పాత్ర పార్వతి! 

పార్వతి –  ఈ తరం  ఇల్లాలికి ఒక మార్గ దర్శకురాలిగా నిలుస్తుంది అని చెప్పడం లో ఎలాటి సందేహం లేదు. ఆ కాలం నాటి  ఉమ్మడి కుటుంబాలు మనకిప్పుడు అరుదైపోయాయి.  కనీసం అత్తా, మామ గారితో కూడా కలిసివుంటానికి ఇష్టపడటం లేదు. ఇంట్లో భార్యా భర్త, ఒకరిద్దరు పిల్లలు. ఈ చిన్న సంసారాన్ని మేనేజ్ చేయలేక పోతున్నారు. నిత్యవారీ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకి, కలతలకే జీవితం చాలించాలనుకునే బేల మనస్కులకి బోలెడంత మనోధైర్యాన్ని కలిగిస్తుంది పార్వతి.

ఏ బడి లోనూ నేర్పని పాఠాలను, మనుషుల్ని చదివి తెలుసుకోవాలని చెబుతుంది. ఎదుటి వారిలో మంచి మనకెప్పుడు కనిపిస్తుందంటే, వారిలోని బలహీనతలను తొలగించి చూసినప్పుడు అనే సూక్తిని బోధిస్తుంది – పార్వతి.

ఒకానొక దశలో – ‘అసలు ఇన్ని చికాకులూ, తలనొప్పులు భరించడం నీ కవసరమా అమ్మా?’ అని అడుగుతారు..అప్పుడే ఊహ తెలుస్తున్న పిల్లలు. 

చాలా మంది తల్లులకి పిల్లల మాటలు మాట్లాడే ఇలాటి జాలి మాటలు పన్నీరు జల్లినట్టుంటుంది. కానీ పార్వతి కి అలా కాదు. సరిగ్గా ఇక్కడే ఈ పాత్ర ఆత్మ స్థైర్యం ప్రకాశితమౌతుంది. 

కొడుకు మాటల్ని తోసిబుచ్చుతూ ఒక అమూల్యమైన మాట అంటుంది. ‘ ఈ ఇంటి పెద్ద కోడలిగా ఇది నా బాధ్యత. నేను నెరవేర్చాలి.’ అని స్థిరం గా చెప్పడం, పార్వతి మనో నిశ్చయానికి, నైతిక విలువలకి కట్టుబడి వున్న నిజాయితీ తనానికి  నిదర్శనం గా నిలుస్తుంది. 

ఇంటికి సిరి ఎంతున్నా, శాంతి లేనప్పుడు అదంతా చీకటి మయమే. పార్వతి వంటి – దీపం లాటి ఇల్లాలు ఇంట్లో వుంటే, వెల్లివిరిసే శాంతి సౌఖ్యాలే గొప్ప సిరులుగా ముంగిట కురుస్తాయి..అని సందేశాన్నిస్తుంది – పార్వతి!

 ప్రపంచంలో యుధ్ధాలెందుకు జరుగుతాయంటే  మనిషి పై మనిషి కి కలిగే  తీవ్ర ద్వేష భావం వల్ల.

మరి కుటుంబాలలో శాంతి ఎలా నెలకొంటుందంటే – మనిషిని మనిషి ప్రేమించడం వల్ల. కేవలం ప్రేమని పంచడం వల్ల. ఈ నిజాన్ని ఎలుగెత్త్తి  చెప్పిన  పార్వతి పాత్ర –  పాఠకుల మనసులో చిరకాలం  నిలిచిపోతుంది. 

***

నీలిమ : పార్వతికి కోడలు. అత్త గారి ని పొగిడితే, తట్టుకోలేని అల్ప ప్రాణులకి నీలిమ గొప్ప బలాన్నిచ్చే టానిక్ వంటిది అని చెప్పాలి. 

అత్త గారి జీవితాన్ని మొగుడి నోటంట వింటూ, శ్రధ్ధ గా ఆలకిస్తూ, మధ్య లో ప్రశ్నలు సంధిస్తూ, జవాబులు రాబట్టుకుంటూ, అత్త గారి ఓర్పు, సహనాలని క్షమా గుణాలకి మనసులోనే జోహార్లు అర్పిస్తుంది.  తనకిన్నాళ్ళూ తెలీని అత్తగారి ఉన్నతమైన ఔన్నత్యానికి మనసులోనే నిరాజనాలర్పిస్తుంది. 

నిజ జీవితం లో కూడా,  ఏ కోడలికైనా – అత్త గారి పట్ల గౌరవాభిమానాలు వుండాలి. తన భర్తని ఉన్నతునిగా తీర్చి దిద్ది తనకు బహుమతి గా ఇచ్చినందుకు…కృతజ్ఞతా భావం వుండాలి.  కానీ ఈ భావజాలమే మృగ్యమై పోతున్న కాలం లో నీలిమ పాత్ర కొంత ఆశాజనకం  కావడం ఎంతైనా అభినందనీయం. 

నీలిమ – తన  అత్త గారి కథని అంత వివరం గా ఆసక్తి గా ఎందుకు విన్నట్టంటే – అత్త గారు తన మొగుణ్ణి ఒక పద్ధతిగా పెంచినట్టు తనూ తన కొడుకుని అలా పెంచాలని కామోసు!!  

 తెలివైన వారు, వున్న చోటునించే సర్వ జ్ఞానాన్ని సొంతం చేసుకోగలరు. నీలిమ కూడా!

నీలిమ పాత్రని విశ్లేషిస్తున్నప్పుడు  ఆమెలో మరో మంచి లక్షణం కూడా పసిగట్టొచ్చు. ఆమెకి మామ గారంటే  అమితమైన గౌరవాన్ని కనబరుస్తుంది.  

విజయ్ ఇంటర్వ్యూ లో కేవలం అత్త గారి పేరు తో బాటు  మావ గారి పేరు కూడా జత చేయాల్సింది కదా, అనే  తన మనసులోని మాటని భర్త కి చెబుతుంది.  కారణం పెద్దాయన కదా! మనసు చిన్నబుచ్చుకుంటాడేమో  అనే ఒక కన్సర్న్!

 మావ గారు అంటే తండ్రి తో సమానమనే సహజ సిధ్ధమైన ఆత్మీయానురాగ స్వభావాన్ని నీలిమ పాత్రలో స్ఫురితమౌతుంది.

పంచుకోగల గుణం వుంటే కుటుంబంలో ప్రేమ ఒక నిధి కదూ? ‘నీ ఇల్లే నీకు ధనం. మరవకోయి ఈ సత్యం..’ అని అంటాడు కవి. అవి పదాలా? కాదు. మణిపూసలు. 

ఇంటి కోడలు గుణవంతురాలైతే వంశమూ సుగుణ సంపత్తులతో వర్ధిల్లౌతుందంటారు అందుకే! నీలిమ పాత్రలో ఈ సద్గుణ లక్షణాలని మనం చూడొచ్చు.

***

అత్తగారి అత్తగారు : అరవై నిండక ముందే  ఆతగార్లని వృద్ధాశ్రమాలకి తరలిస్తున్న ఈ కాలం లో.. ఆ ఇంట్లో ఆత్త గారికి అత్త గారు వుంటం, ఆవిడ ఆ ఇంటి  ముంగిట్లో మెల్ల మెల్ల గా అడుగులేసుకుంటూ తిరగడం చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. 

ముప్ఫై యేళ్ళైనా నిండక ముందే కొంతమంది స్త్రీలకి ఎక్కడ్లేని  అనారోగ్య ఆలోచనలతో డిప్రెషన్ కి గురికావడం,  మందులు వాడటం చూస్తుంటాం. అలాటి  స్తీలు ఈ మామ్మగారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది.  ఆవిడ ఆ వయసులో  ఎంత చురుకైన ఆలోచనలు చేస్తుందో తెలుసుకుంటే  మనలోనూ ఉత్సాహం ఉప్పొంగుతుంది.

‘జీవితం వున్నది జీవించడం కొరకే..’  అని సత్య వాక్యానికి  నిలువెత్తు సాక్ష్యం ఈ పాత్ర.  కోడలు లేకుండా చూసి, మనవడి పెళ్లాం  (పార్వతి)తో  నాలుగు మంచి మాటలు మాట్లాడటం, తన కూతురికి ఎలా అయినా ఆ గొప్పింటి సంబంధం ఖాయం చేయించేలా తన కొడుక్కి రికమండ్ చేయమని పార్వతి తో మొరలిడటం చూస్తే ఆవిడ కార్య దీక్షత ఎంత గొప్పదో అర్ధమౌతుంది.

మాటలతో మమతల వంతెన నిర్మించుకోవడం ఎలానో ఉమ్మడి కుటుంబాలు నేర్పుతాయి. ఇంట్లో వృధ్ధులు వుంటే, ఆ ఇంట్లో చందన వృక్షం వున్నట్టే! అని చెప్పకనే చెప్పిన పాత్ర. 

అత్తగారు : రాజు అన్నాక, ప్రజలని అప్పుడప్పుడు (అకారణం గా అయినా సరే)   ఝలిపిస్తుండాలట. లేకపోతే రాజు ఆధిక్యత వుండదు. అలానే అత్త గారునూ! తన సీనియారిటీ నించి తాను తప్పుకోలేదన్నట్టు కోడలి మీద అధికారాన్ని చలాయిస్తుంటుంది. కోడలి పై మాటలు రువ్వాలంటే అందులో బలమైన వంక చూపాలి. ‘నీకు పిల్లల్ని పెంచడం సరిగా రాదు.’ అంటూ ఒక బాణం వేస్తుంటుంది. 

కోడలి మీద మమకారాన్ని మాటల్లో వ్యక్తపరచడానికి పెద్దరికమో, లేక అహమో ఒక తెరలా అడ్డుకోవడం వంటి మనస్తత్వానికి అద్దం పడుతుంది అత్తగారి పాత్ర. 

అత్తగారి కోపం గాలికి చెదిరిపోయే మేఘం లా వుండాలి. అంతలోనే కోడలి మంచితనాన్ని పదిమందికి చాటుకుంటూ నూ వుండాలి. కోడలితో అవసరమైన పని పడ్డప్పుడు, మోకరిల్లి మాట్లాడకూడదు. ‘నువ్వు చెప్పు. పెద్ద కోడలివిగా..’ అంటూ నర్మగర్భం గా మాట్లడటం, ఓడినా గెలుపు తనదే అనే జాణతనం (?) ఈ పాత్రలో కనిపిస్తుంది. 

అందుకే అంటారు, వేప కాయలో తీపిదనం, అత్తగారిలో మంచి తనం సయించదని. కారణం, ఆ పాత్ర లో సహజం గా దాగుండే అధికార అహంభావం మరి చేదునిస్తుంది కదా!  ఆ స్థానం అలాటిది మరి. 

 ఈ పాత్ర డిమాండ్ ఒకటె. ఇంటికి తాను పెద్ద. అధికారిణి. తన కనుసన్నలలో నడవాలి అందరూ! ‘ సరే’ అన్న కోడలి మాటల బుట్టలో పడిన ఈ భోళా అత్త గారు,  కోడలు చెప్పినట్టు ఎంచక్కా ఆధ్యాత్మిక  దారిలో పడి వెళ్ళిపోతుంది. 

అత్త తో వాదించి,  తగవు లు పడటం కన్నా, ఆవిడ మాటే వేదమాట అన్నట్టు తలూపి, చివరికి ఆవిణ్ణి ఒక సరైన మార్గం లో పెట్టడమే కోడలి కర్తవ్యం అంటూ చెప్పకనే చెప్పిన పాత్ర ఈ అత్త గారి పాత్ర!  

***

పెద్ద పిల్ల లక్ష్మి : 

ఒకప్పుడు ఆడపిల్లకి – ఉన్నత విద్య అందరాని ద్రాక్ష పండు లా వుండేది.  అమ్మాయిలు చదువు లో  బ్రిలియంట్స్.  కానీ టెంత్ దాటి ఇంటర్ లొ కెళ్ళడం ఆలస్యం ఇంట్లో వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూసే వారు. తను చదవాలనుకున్న చదువు అర్ధాంత రం గా  గా ఆగిపోతుంటే, తన  ఆశలన్నీ ఆవిరైపోతుంటె …కలిగే దుఃఖం ఎలా వుంటుందుంటే  తుఫాను తాకిడికి పోటెత్తిన సముద్రం లా వుంటుంది. పెళ్ళి చేసుకోవడం కంటే జీవితాన్ని చాలించడమే సుఖం అనుకునేంత నిరాశ నిలువునా కమ్ముకుంటుంది. లక్ష్మి పరిస్థితి కూడా సరిగ్గా అలానే వుంది.

అయితే, అంత ఆవేశం లోనూ, అనే  వేదనలోనూ తల్లి మాటల్ని ఆలకిస్తుంది – ‘పెళ్ళి తర్వాత కూడా చదువుకోవచ్చు తల్లీ..మంచి సంబంధం కాదనకూ . అమ్మ చేసిన ప్రమాణం మీద భరో సా వుంచుతుంది.  పెళ్ళికి అంగీకరిస్తుంది. వివాహం తర్వాత చదువుని, తన స్వప్నాన్ని నిజం చేసుకుంటుంది. 

ఈ పాత్ర ఏం చెబుతుందంటే – పెళ్ళి తో జీవితం ఆగిపోదు. జీవితం లో ఎదగాలనే దీక్షా పట్టుదల వుంటే, వివాహం – చదువు కి ఏ మాత్రం ఆటంకం కాదు అని నిరూపించి చూపిన పాత్ర! – లక్ష్మి! నిజంగా కొనియాడదగినది.  మరో సత్యం ఏమిటంటే, ఆడపిల్లలు తల్లిని అర్ధం చేసుకుని, గౌరవించడం నేర్చుకోమని చెబుతుంది. 

  ఈ పాత్ర ఎంతో మంది ఆడపిల్లలకి ఒక చక్కని నీతి పాఠం అని చెప్పక తప్పదు. 

***

ప్రాముఖ్యం లేకున్నా, గుర్తుండిపోయే స్త్రీలు : కుటుంబ బాధ్యతల నించి తప్పింపుచుకుని వేరు కాపురం పెట్టిన తోడుకోడలు..

భర్త ని కోల్పోయి, పుట్టిల్లు చేరిన పెద్దాడపడుచు, పెళ్ళి కాని ఆడపడుచులు.. సంభాషణ లేకపోయినా..అటూ ఇటూ తిరుగుతూ, ఒక చూపు విసురుతూ కదులుతుంటాయి. మనసులోని మాటలు చెప్పకనే చెబుంటాయి.

*** 

   ఈ కథలో  మాటల ముత్యాలు :

* ‘యెంత గొప్ప విత్తనమైనా దానికి అనుకూలమైన వాతావరణం లేకపోతే మొలకెత్తదూ, ఫలించదూ కూడా.  కాశ్మీర్‍లో పండే ఆపిల్స్ ని నువ్వు హైద్రాబాదులో పండించగలవా.. యెడారిలో పండే ఖర్జూరాలని కోనసీమలో పండించగలవా..అందుకే కేవలం విత్తనాన్ని బట్టే దేని అభివృధ్ధీ వుండదు..’

* ‘జీవుడు జన్మించడానికి ముందు తనకి యేక్షేత్రం కావాలో చూసుకుంటాడుట. ముందుజన్మలో కలిగిన సంస్కారాలనిబట్టి  క్షేత్రాన్ని యెన్నుకుంటాడుట. అలా యెన్నుకుని ఆ గర్భాన పుట్టడంవల్ల ముందరి జన్మ సంస్కారాలన్నీ ఆ తల్లి పెంపకంలో వృధ్ధి పొందుతాయట. అలాగ మా అమ్మ కడుపున పుట్టడం నేను ఒకరకంగా అదృష్టంగా భావిస్తే, ఆ తల్లి పెంపకంలో నేను పొందిన స్ఫూర్తి ఇంకోరకంగా నాకు కలిసొచ్చింది.”

* ఇంట్లో ఆడవారి సలహా తీసుకోనిదే యే మగవాడూ నిర్ణయం తీసుకోడు. అలాగే ఇంట్లో నిర్ణయం తీసుకునేది ఆడవారైనా బయటికి దానిని ప్రకటించేది మటుకు మగవాడే.. అది మన సంప్రదాయం.” 

****

డియర్ రీడర్స్!

ఇదీ! మన తెలుగు వారి కుటుంబ జీవన కథ. ఈ రచన చదివి మీ హృదయ స్పందనలను తెలియచేస్తారు కదూ!

******

“ఇప్పుడైనా చెప్పనీయమ్మా”

-జి.యస్.లక్ష్మి

 

     “ఈరోజు ఇంతటి గురుతరమైన బాధ్యత, యింతటి గౌరవించదగిన ఉద్యోగం నాకు లభించిందంటే దానికి ముఖ్యకారణం మా అమ్మగారు. ఆవిడ కడుపున పుట్టడం నా అదృష్ట మయితే, ఆవిడ ప్రవర్తన నాకు స్ఫూర్తి అయింది. టీవీ ముందు కూర్చుని, కొడుకు యిస్తున్న ఇంటర్వ్యూ చూస్తున్న శంకర్రావు, పార్వతి ముందుకువంగి యింకాస్త శ్రధ్ధగా వినసాగారు.

   అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థకి సీ..వో.గా ఎంపికయిన విజయ్ హుందాగా కూర్చుని యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలిస్తున్నాడు. నలభై అయిదేళ్ళ విజయ్ పరిపూర్ణ వ్యక్తిత్వంతో ఫ్లడ్‍లైట్లముందు వెలిగిపోతున్నాడు. అమెరికాలో ప్రముఖసంస్థల జాబితాలో మొదటి నాలుగుస్థానాల్లో నిలబడే సంస్థకి సి...గా ఎంపిక కావడమంటే సామాన్యమైన విషయం కాదు. విజయ్ బాధ్యాతాయుతమైన ఉద్యోగంలో జేరేముందు తల్లితండ్రుల్ని కలవడానికి ఇండియా వచ్చాడు. ఒక భారతీయునికి దక్కిన గౌరవం అందరికీ చూపించాలనే ఉద్దేశ్యంతో లోకల్ ఛానల్ వాళ్ళు అతనిని ఇంటర్వ్యూ చేసారు.

అమెరికాలో దిగ్గజాల్లాంటి పోటీదారులతో పోటీపడి విజయ్ ఆస్థానాన్ని దక్కించుకున్నాడు. మిగిలినవాళ్ళు కూడా తక్కువవాళ్ళేమీకాదు. వారు చదివిన యూనివర్సిటీలు, తెచ్చుకున్న మార్కులు ఇతని కన్న యెక్కువే. కాని స్థానానికి విజయ్ ఎంపికయ్యాడు. దానికి ముఖ్యకారణం తన తల్లి అని చెపుతున్నాడు.

యెవరైనా విజయం సాధించినప్పుడు మాటే చెపుతుంటారు. మీరు దీనిని ఇంకాస్త వివరించగలరా? అంటే మీ అమ్మగారు యెంతవరకు చదువుకున్నారు, యేమి ఉద్యోగం చేసేవారూ, మిమ్మల్ని చదివించడంలో ఆవిడ చూపించిన ప్రత్యేకమైన పధ్ధతులు యేమిటి.. ఇలాంటివన్నీ మీద్వారా వింటే కొంతమందైనా స్ఫూర్తి పొందుతారుకదా..

విజయ్ మనోహరంగా నవ్వాడు. “మా అమ్మగారి చదువు హైస్కూల్‍తోనే ఆగిపోయింది. కాలేజీలో అడుగు పెట్టకుండానే పెళ్ళైపోయింది. అమ్మగా నన్ను ఆవిడ పెంచిన తీరే నాకు స్ఫూర్తి”.

  చాలా శ్రధ్ధగా వింటున్న శంకర్రావు మొహంలో భావాలు మారిపోయాయి. తనకన్న, తన భార్య కొడుకు అభివృధ్ధికి సాయపడిందని అతను చెప్పడం ఆయనని చిన్నబుచ్చింది. పార్వతి వంక చూసాడు. ఆవిడ ఇంకా ఆనందంనుంచి తేరుకోలేదు. కాని భర్త తనని చూడగానే ముఖమ్మీద కనపడే భావం మార్చేసుకుని, మొహం ఉదాసీనంగా పెట్టేసింది.

చూసేవా.. చూసేవా నీ కొడుకూ..యేవిటో.. మాట్లాడితే కొడుకు లందరూ అమ్మ అమ్మ అంటూ అమ్మ భజన మొదలెడతారు. తొమ్మిదినెలలు మోసి, కని, పెంచి పెద్దచేసింది అంటూ దండకాలు చదూతారు. కడుపుతో వున్నాక కనక మాన్తారాపిల్లలంటూ పుట్టేక ఆమాత్రం ఇంత అన్నం వండి వడ్డించడంకూడా ఘనకార్యమేనాయేం.. వాడికి తండ్రిగా నేనేమీ చెయ్యలేదా.. పుడుతూనే ఇన్ని డిగ్రీలు తెచ్చేసుకున్నాడా.. వాడిని మంచి  స్కూల్లో చేర్పించడం  దగ్గర్నుంచి అప్పు చేసి అమెరికా పంపేవరకూ యెంత తాపత్రయపడ్డానో వాడికి తెలీదా? ఇంట్లో కూర్చుని అన్నం వండిపెట్టిన అమ్మని అంత అందలం యెక్కిస్తున్నప్పుడు పక్కన నాపేరు కూడా కలిపి అమ్మా, నాన్నా అనొచ్చుకదా.. లోపలినుంచి ఉబికివస్తున్న ఉడుకుమోత్తనం ఆపుకోలేకపోయాడు శంకర్రావు.

యేదో అందర్లాగే వాడూ చెప్పేడేమోనండి. ఇప్పటికి కూడా వాడు మీ యెదుట యెప్పుడైనా తలెత్తి మాట్లాడేడా.. సమాధానపరచబోయింది పార్వతి.

సరిగ్గా అదేమాట అంది విజయ్ భార్య నీలిమ కూడా అమెరికాలో విజయ్‍తో కలిసి ఫామిలీరూమ్‍లో కూర్చుని ఇంటర్వ్యూ చూస్తూ.

పోనీ పెద్దాయన. ఆయన్ని చిన్నబుచ్చకుండా అమ్మానాన్నలిద్దరి పేర్లూ చెప్పొచ్చుకదండీ.

నీలిమ అడిగినదానికి తన లోపల యెప్పట్నించో వున్న భావాలని ఆమె ముందు వెళ్ళగక్కేసాడు విజయ్

నీలూ, నాతోపాటు మరో ఇద్దరు ఇదే పొజిషన్‍కి పోటీ పడ్డారు. గుర్తుందా..?”

లేకేం.. వాళ్ళు చదివిన స్కూల్స్, తెచ్చుకున్న గ్రేడ్స్ కూడా మీకన్నా యెక్కువే అని మీరే అన్నారుగా. మరి వాళ్లని కాదని మిమ్మల్ని యెన్నుకున్నారంటే కంపెనీవాళ్ళు మీలో యేదో ప్రత్యేకతని చూసేవుంటారు. బహుశా మీ నాన్నగారినుంచి మీకు జీన్స్ వచ్చాయేమో.. అంది.

కాదనలేను. వంశంలో వున్న ప్రత్యేకతలు యేడుతరాలదాకా వస్తాయంటారు.. కానీ విత్తనం ఒక్కటీ సరిపోదు నీలూ.. విత్తనం యెంత ముఖ్యమో క్షేత్రం కూడా అంతే ముఖ్యం.. యెంత గొప్ప విత్తనమైనా దానికి అనుకూలమైన వాతావరణం లేకపోతే మొలకెత్తదూ, ఫలించదూ కూడాకాశ్మీర్‍లో పండే ఆపిల్స్ ని నువ్వు హైద్రాబాదులో పండించగలవా.. యెడారిలో పండే ఖర్జూరాలని కోనసీమలో పండించగలవా..అందుకే కేవలం విత్తనాన్ని బట్టే దేని అభివృధ్ధీ వుండదు..

యేదో కొత్తవిషయాన్ని వింటున్నట్టు ఆసక్తిగా చూసింది నీలిమ. యేదో గుర్తు చేసుకుంటూ అన్నాడు విజయ్, “నేను యెప్పుడో యెక్కడో చదివాను నీలూ.. జీవుడు జన్మించడానికి ముందు తనకి యేక్షేత్రం కావాలో చూసుకుంటాడుట. ముందుజన్మలో కలిగిన సంస్కారాలనిబట్టి  క్షేత్రాన్ని యెన్నుకుంటాడుట. అలా యెన్నుకుని గర్భాన పుట్టడంవల్ల ముందరి జన్మ సంస్కారాలన్నీ తల్లి పెంపకంలో వృధ్ధి పొందుతాయట. అలాగ మా అమ్మ కడుపున పుట్టడం నేను ఒకరకంగా అదృష్టంగా భావిస్తే, తల్లి పెంపకంలో నేను పొందిన స్ఫూర్తి ఇంకోరకంగా నాకు కలిసొచ్చింది.

నాకేమీ అర్ధం కావటంలేదు..” అంది నీలిమ. నవ్వాడు విజయ్. నీలిమ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ,

అందరమ్మల్లాగా మా అమ్మ కని పెంచడమొక్కటే చెయ్యలేదు. నేను పొజిషన్‍లో నిలబడడానికి కారణం మా అమ్మ మా ఇంటిని నడిపిన తీరు. అది గుర్తించగలగడం నా అదృష్టంపిల్లలు తండ్రి దగ్గర్నుంచి చాలా నేర్చుకుంటారు. నిజమే. కానీ అవి వాళ్ళు నేర్చుకునేవి కాస్త వయసు వచ్చాక. కానీ పుట్టినప్పటినుంచీ విషయాలు నేర్చుకునేది తల్లి పొత్తిళ్ళనుంచే. తనకి తెలీకుండానే బిడ్ద తల్లిని గమనిస్తాడు, అనుకరిస్తాడు.

అత్తయ్యగారు చేసిన అంత గొప్ప పనేవిటో నాకు తెలీలేదు. అంది నీలిమ.

చెప్తాను. సరిగ్గా విను. నువ్వు కూడా కొడుకును కన్న తల్లివే. పిల్లలను పెంచేటప్పుడు తల్లులు యెంత అప్రమత్తతతో వుండాలో నీకే తెలుస్తుంది.” అంటూ కార్పెట్ మీద కాళ్ళు జాపుకుని కూర్చుంటూ మొదలెట్టాడు విజయ్.

నీలూ, ఒక సంస్థకి సి... అంటే సంస్థని అభివృధ్ధి వైపు నడిపించగలగాలి. అందుకోసం ఎంతోమందితో, ఎన్నోరకాల పరిస్థితులలో పని చేయించగలగాలి. దానికి సబ్జెక్ట్ ఒక్కటే వస్తే సరిపోదు. రకరకాల వ్యక్తుల్లో వున్న ప్రతిభని గుర్తించి, ప్రోత్సహించి, సముదాయించి, సమాధానపరచి అలా యెన్నోరకాలుగా ప్రతిభని వారినుండి రాబట్టి సంస్థను పెద్దది చెయ్యాలి. ఇలా యెలా చెయ్యాలన్నది నేను కేవలం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను.

తెల్లబోయింది నీలిమ. “కానీ, అత్తయ్యగారు యేమీ చదువుకోలేదు కదండీ.!

నిజవే. అమ్మ కాలేజీ చదువులు చదవలేదు. హైస్కూల్ చదువు పూర్తవకుండానే ఒక ఉమ్మడికుటుంబంలోకి పెద్దకోడలిగా వెళ్ళింది.  విజయ్ చిన్నప్పటి ఙ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా నీలిమకి చెప్పసాగాడు.

నీలూ, మా అమ్మ ఆమె పదహారేళ్ళకే అత్తగారు, మామగారు, అత్తగారి అత్తగారు, ఇంట్లోనే వుండే ఒక విధవాడపడుచూ, పెళ్ళికాని మరో ఇద్దరు ఆడపడుచులూ, ముగ్గురు మరుదులూ వున్న ఉమ్మడికుటుంబంలోకి కాపరానికొచ్చిందిటమా ఆఖరి మేనత్త పెళ్ళిటైమ్‍కి నాకు పదేళ్ళు. అప్పుడే నేను మా అమ్మలోని మరో మనిషిని చూసాను. అప్పటికింకా మేం మా చదువులకోసం హైద్రాబాదు రాలేదు. మా ఊళ్ళోనే ఉండేవాళ్లం.

రోజుల్లో మా అత్తకి చూసిన సంబంధం చాలా పెద్దింటి సంబంధం. సంబంధమే చెయ్యాలని మా మామ్మ పట్టు పట్టి కూర్చుంది. అంత తూగలేనని మా తాతగారు ససేమిరా అన్నారు. నీకు తెలుసుకదా. మా నాన్నకి మేం నలుగురు  పిల్లలం. అప్పటికి మా పెద్దబాబయ్య ఒక్కడే యెక్కడో గుజరాత్‍లో యేదో బట్టలమిల్లులో అక్కౌంటెంట్‍గా చేసేవాడు. మిగిలిన బాబయ్య లిద్దరూ యింకా చదువుకుంటున్నారు. మా మండువాలో యింట్లోవాళ్ల మధ్య అంత పెద్ద మాటల యుధ్ధం జరగడాన్ని చూడడం నేనదే మొదటిసారి. అంతా గట్టిగా యెవరికి తోచినట్టు వాళ్ళు అరిచేసి వెళ్ళిపోయారు.

ఒక్క మా అమ్మ మాత్రం నోరిప్పి ఒక్క మాటనలేదు. అలా అందర్నీ చూస్తూ కూర్చుంది. ఆఖర్న అందరూ మా అమ్మ దగ్గరకొచ్చి ..మా తాతగారేమో “ఇదిగో కోడలుపిల్లా చెప్పు మీ అత్తగారికి. పెళ్ళి చెయ్యడంతో అవదు. తర్వాత పురుళ్ళకీ పుణ్యాలకీ యింతకింత అవుతుంది. నావల్ల కాదని ఖచ్చితంగా చెప్పెయ్యి” అంటే..

 మా మామ్మేమో “ఒసేవ్, పిల్లని కలిగినింట్లో పడెయ్యాలని మీ మావగారితో చెప్పు. ఇప్పుడు గంతకు తగ్గ బొంతని యేదో ముడెట్టేస్తే రేప్పొద్దున్న దాని పిల్లలకి పాలడబ్బా ల్దగ్గర్నుంచీ మనవే కొనాలని చెప్పు” అంటే

ఇంక మా నాన్నేమో “యేదో.. కొంతవరకు సాయం చెయ్యగలను కానీ నా స్తోమతుకి మించి నేనేమీ  ఇవ్వలేను. నాకూ నలుగురు పిల్లలున్నారు కదా.. అన్నారు. మా బాబాయిలిద్దరూ యేం మాట్లాడకుండా జరుగుతున్నది చూస్తూ కూర్చున్నారు.

నాకు బాగా గుర్తు. ఆరోజు సాయంత్రం పొలంనుంచి వచ్చి, కాఫీ తాగి, వీధరుగు మీద విశ్రాంతిగా కూర్చున్న మా తాతగారితో సింహద్వారం లోపలగా నిల్చుని మా అమ్మ యేదో మాట్లాడింది. తర్వాత దేవుడి దగ్గర సంధ్యదీపం వెలిగిస్తున్న మా మామ్మతో మాట్లాడింది. రాత్రి భోజనం వడ్డిస్తూ మా నాన్నగారితో మాట్లాడింది. మరి యేం మాట్లాడిందో యేమో వయసులో నాకర్ధం కాలేదు కానీ మర్నాడు పొద్దున్నే ముహూర్తం బాగుందంటూ మా తాతగారు మా నాన్నగారిని వెంటపెట్టుకుని వెళ్ళి అదే సంబంధాన్ని ఖాయం చేసుకొచ్చారు. వాళ్లందరికి అమ్మేదో చెప్పిందని తప్పితే యేం చెప్పి  అందర్నీ ఒప్పించిందో వయసులో తెలీలేదు.

   కాని ఒకటి మాత్రం బాగా అర్ధమయ్యింది. వాళ్లంతా ఆవేశంగా వున్నపుడు యెదురుచెప్పకుండా సాంతంగా వాళ్ల మాటలన్నీ మా అమ్మ వింది. తర్వాత వాళ్ల వాళ్ల ఆవేశాలు తగ్గాక ఒకరిమాట ఇంకొకరికి అర్ధం అయ్యే వాళ్ల వాళ్ల భాషలో చెప్పింది. అందరు కోరుకునేదీ మా అత్త సుఖమేకదా.. లక్ష్యం దృష్టిలో పెట్టుకుని యెవరు యెలా చెపితే ఒప్పుకుంటారో అలా వాళ్ల దగ్గర మాట్లాడి పెళ్ళి స్థిరపడేలా చేసింది మా అమ్మ. అంతే కాదు.. పెళ్ళిలో కూడా యెటువైపునుంచీ మాటరాకుండా అందర్నీ యెంతో సమర్ధవంతంగా ఒకే లక్ష్యం వైపు నడిపించింది. వయసులో అమ్మ యెలా చేసిందో నాకు తెలీలేదు కాని యేదో గొప్పపని చేసిందనిమటుకు అర్ధమైంది. తర్వాత నుంచి అమ్మని నిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకున్నాను. 

విజయ్ చెపుతున్నది శ్రధ్ధగా వింటున్న నీలిమ గబుక్కునలేచి, “ఉండండి. చింటూ స్కూల్‍బస్ వచ్చే టైమైంది. వాణ్ణి తీసుకొచ్చేక స్థిమితంగా చెప్దురుగాని” అంటూ డ్రైవ్‍వే వైపు పరిగెట్టింది. చింటూ లోపలికి రాగానే తండ్రిని ఫామిలీరూమ్‍లో చూసి సంతోషంతో విజయ్ ఒడిలో చేరిపోయేడు. చింటూకి స్నాక్ తీసుకొచ్చి పక్కనే కూర్చుని “ఊ ఇంక చెప్పండి” అంది నీలిమ.

నీలూ, నీకు తెలీనిదేవుంది..మూడుతరాల మనుషులు ఒక యింట్లో వుంటున్నప్పుడు తరాల మధ్య సంఘర్షణ తప్పదు. అందులోనూ వయసు పెరిగేకొద్దీ చాదస్తాలు కూడా యెక్కువవుతాయంటారు. అలాగే మా తాతగారూ, నాన్నమ్మా వాళ్ల పట్టుదలలు అస్సలు వదిలేవారు కాదు. యెదుగుతున్న ఆడపిల్లల్ని మా అమ్మ సరిగ్గా పెంచటం లేదని అస్తమానం మా అమ్మని, చెల్లెళ్ళని యేదో ఒకటంటూ సాధించేవారు. వాళ్ళలా అంటుంటే మా చెల్లెళ్ళు విసుక్కునేవాళ్ళు. కాని మా అమ్మ మటుకు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర మరొకర్ని కించపరచలేదు. మా చెల్లెళ్ళ దగ్గర పెద్దవాళ్ల మాటలని యెలా గౌరవించాలో చెప్పేది. మా తాతగారు, నాన్నమ్మల దగ్గర మారుతున్న కాలంలో చదువుకుంటున్న పిల్లల మనస్తత్వం యెలా వుంటుందో వివరించేది. మరి మధ్యవర్తిత్వం యెలా నెరిపేదో కానీ ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు రెండింతలయ్యేలా చూసింది. అందరికన్నా యెక్కువ సాధించేది ఇంట్లోనే వుండే మా పెద్దమేనత్త. ఆవిడ జీవితంలో యేమీ అనుభవించలేకపోయింది. బాధ మరొకరిమీద ద్వేషంగా మారకుండా మా అమ్మ ఆవిడ నెప్పుడూ యేదో ఒక ఆధ్యాత్మిక చింతనలో వుంచేది. అలా వుంచడానికి మా అమ్మ యెన్నిరకాలుగా సమర్ధించుకోవాల్సి వచ్చేదో నేను గమనిస్తుండేవాణ్ణి. నీలూ, నీకోవిషయం తెలుసా? ఆడిగాడు విజయ్యేమిటన్నట్టు ఆసక్తిగా ముందుకు వంగింది నీలిమ.

రక్తసంబంధీకులయితే ఎప్పుడైనా ఒకమాటనుకున్నా అదేమీ మనసులో పెట్టుకోకుండా కలిసిపోతారు. కాని బైటనుంచి వచ్చినవాళ్ళు? అంటే మా పిన్నిలు ముగ్గురూ కూడా వేరే వేరే ఇళ్ళనుంచి వచ్చినవారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పధ్ధతి. పెద్ద బాబయ్య దూరంగా గుజరాత్‍లో వుంటున్నా ప్రతియేడూ వచ్చి ఫలసాయంలో తన వాటా పట్టికెళ్ళేవాడు. మిగిలినవాళ్ళు ఇద్దరూ దగ్గర ఊళ్ళలోనే పనిచేస్తుండడం వల్ల ప్రతి పండక్కీ పబ్బానికీ ఇంటికొచ్చేవారు. మా పిన్ని లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడేదికాదు. మాటలు బాణాల్లా విసురుకునేవారు. మాటల్లో మా తాతగారు, నాన్నమ్మల్ని కూడా దులిపేసేవారు. మా నాన్నమ్మ అయితే మాటలు వినలేక తలపట్టుకు కూర్చునేది. ఒక్కొక్కసారి మా తాతగారైతే ఇంక ఇంట్లో అడుగు పెట్టొద్దని కూడా వాళ్లమీద అరిచేసేవారు. అలాంటి ఉత్తర దక్షిణ ధృవాలని మా అమ్మ యేం మంత్రం వేసేదో కానీ యేకతాటికి తెచ్చేది. నేను కాస్త పెద్దవాణ్ణయేక వాళ్ళని యెలా కలిపేవమ్మా అనడిగితే అమ్మ నవ్వేసి ఇలా అంది.

   “నాన్నా, దేనికైనా ఒక లక్ష్యమంటూ వుంటుంది. ఇక్కడ మన లక్ష్యం మనిల్లు అభివృధ్ధిలోకి రావడం. అదెలా వస్తుందీ.. పిల్లలు మీరందరూ జీవితాల్లో బాగా స్థిరపడినప్పుడు వస్తుంది. మీరు యెలా స్థిరపడతారూ. మీరైనా బాబయ్యల పిల్లలైనా నలుగురిలో మన కుటుంబం గురించి గౌరవమర్యాదలుంటే మీకు అలాంటి ఇళ్లనుంచి సంబంధాలొచ్చి చక్కగా స్థిరపడతారు. ఒక కుటుంబగౌరవం నిలబడాలన్నా, కూలిపోవాలన్నా కారణం ఇంటి ఇల్లాలే. ఇల్లాలి లక్ష్యం పిల్లల అభివృధ్ధి అయినప్పుడు మిగిలిన విషయాలన్నీ చాలా చిన్నవైపోతాయి. పిన్ని లిద్దరికీ వాళ్ల కర్ధమయ్యేటట్టు దీన్ని చెప్పడమే నేను చేసింది.

నీకింకో విషయం చెప్పనా నాన్నా..మనుషులు సాధారణంగా దుర్మార్గులు కారు. ఒక్కొక్కసారి పరిస్థితులు వారినలా స్వార్ధపరులుగా, దుర్మార్గులుగా మారుస్తాయి. మనం పరిస్థితిని సరిదిద్దాలి తప్పితే మనుషులని తప్పు పట్టకూడదు. ఇక్కడకూడా అంతే.. పిన్నిలిద్దరూ మంచివాళ్ళే. యెటొచ్చీ పెద్దవారైన తాతగారు తీసుకునే నిర్ణయాలవల్ల వాళ్ళ పిల్లలకి యెక్కడ అన్యాయం జరుగుతుందోనన్న భయం వాళ్లనలా మాట్లాడిస్తోంది. వారిలో భయం పోగొడితే యెంతో కలివిడిగా వుంటారు.

అమ్మ అన్న మాటలకి నాకు కోపం వచ్చింది. “అందుకోసం నువ్వు వాళ్ళనంత బతిమాలాలా? నీలాగే వాళ్ళు కూడా కోడళ్ళే కదా.. నీలాగే వాళ్ళకి కూడా బాధ్యతలు లేవా? నువ్వెందుకు అందరిచేతా మాటలనిపించుకోవాలీ..?” అన్నాను. అమ్మ నవ్వింది.

నేను ఇంటికి పెద్దకోడలిని. అందర్నీ ఒకేతాటిమీద నడిపించడం నా బాధ్యత. యెవరి దగ్గర యే సమర్ధత వుందో తెలుసుకుని, సామరస్యంగా దానిని బైటికి తీసి ఇంటి అభివృధ్ధికి వాడుకోవడంలోనే నా సమర్ధత వుంటుంది. నువ్వే చూడు. బైట అందరితోనూ మర్యాదగా మాట్లాడి కార్యాన్ని సాధించుకొచ్చే లౌక్యం చిన్నపిన్ని దగ్గర వుంది. అందుకని ఆవిడని కథలూ కార్యాలూ అయినప్పుడు మధ్యవర్తిగా కనక వుంచితే మనం కావాలనుకున్నవి సాధించుకొస్తుంది. అదే బుల్లిపిన్నిని చూడు. మార్కెట్‍లో సరుకులుకానీ, బట్టలూ, బంగారం కానీ యేవి యెక్కడ నాణ్యంగా, సరసంగా వుంటాయో బాగా తెలుసు. అటువంటి పనులు ఆవిడకి అప్పగించితే మనకి నిశ్చింత. ఇంక మీ అత్త అంటావా.. యేయే పూజలూ, వ్రతాలూ యెలా, యెప్పుడు, యెక్కడ చెయ్యాలో.. అన్నీ తెలిసిన శాస్త్రవేత్త. పెత్తనం ఆవిడకి అప్పగించామనుకో..ఇంక ఊరూవాడా పదినాళ్ళు చెప్పుకునేలా బ్రహ్మాండంగా చేయించేస్తుంది.

ఆసక్తిగా వింటున్న నీలిమ “యెంత బాగా చెప్పారండీ అత్తయ్యగారూ..! అంది.

నీలూ, నీకు మాటలు బాగున్నాయేమో కానీ అప్పుడు నాకు నచ్చలా.. అందుకే అమ్మని అడిగేసాను. “యేమని..?” ఆతృతగా అడిగింది నీలిమ.

యేవనంటే.. మగవాళ్ల ప్రమేయమే లేకుండా ఆడవాళ్ళు ఇల్లు నడిపించెయ్యగలరంటావ్.. అన్నాను.

అప్పు డత్తయ్యగారే వన్నారు?

నీలిమ నెత్తిమీద చిన్నగా మొడుతూ, “అయ్యొ పిచ్చినాగన్నా .. అంది. కిసుక్కున నవ్వింది నీలిమ విజయ్ అన్నతీరుకి.

ఇంకా యేవందంటే…ఇలా ఆడవాళ్ళూ, మగవాళ్ళూ అంటూ రోజుల్లో తేడాలు చేస్తున్నారు కానీ.. నిజంగా ఆలోచిస్తే ఇంట్లో ఆడవారి సలహా తీసుకోనిదే యే మగవాడూ నిర్ణయం తీసుకోడు. అలాగే ఇంట్లో నిర్ణయం తీసుకునేది ఆడవారైనా బయటికి దానిని ప్రకటించేది మటుకు మగవాడే.. అది మన సంప్రదాయం. అంది అమ్మ.

ఇదంతా యెదో గందరగోళంగా అనిపించి నేను పెట్టిన తెల్లమొహం చూసి అమ్మ అక్కడే వున్న ఒక పౌడరుడబ్బా చేతిలోకి తీసుకుని చెప్పింది. “నీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే.. ఇప్పుడు మనం పౌడరు కొనుక్కోవాలనుకో..బజారుకెళ్ళి మంచి పౌడరుడబ్బాకోసం మనం యెప్పుడూ వాడే మంచి కంపెనీపేరు చెప్పి అదే డబ్బా ఇమ్మని అడుగుతాం కొట్టువాడు అంతకన్న తక్కువధరలోవి వున్నాయని చూపించినా సరే మనం మంచిదనుకున్నదే అడుగుతాం..యెందుకూ…దానికున్న పేరుని బట్టీ.. అదిగో అలాంటి పేరే సంఘంలో మంచికుటుంబాని క్కూడా వుంటుంది. పేరే.. బైట అందరూ చెప్పుకునే ఫలానావాళ్ల కుటుంబం. అలాగే ఇంట్లో ఆడవారి సామర్ధ్యాన్ని మగవాడు గౌరవిస్తే ఇంటిపేరు గొప్పగా వినిపిస్తుంది. ఆడవారు మగవాళ్ళని కాదని వాళ్ళే బైటకొచ్చిస్వతంత్రం ప్రకటిస్తే అది అంత గొప్పగా అనిపించదు. యెందుకంటే కుటుంబమంటే ఇంట్లోవారందరూ పొరపొచ్చాలు లేకుండా కలిసిమెలిసి వుండడం. అలా వున్నప్పుడే సంఘంలో కుటుంబగౌరవం పెరుగుతుందిదానిని ఆడా, మగా యిద్దరూ తెలుసుకోవాలి అన్న అమ్మ మాటలవల్లే నేను ఇక్కడ టీమ్‍లీడర్‍గా రకరకాలైన వ్యక్తులను ఒకేతాటికి తేగలుగుతున్నాను.

శ్రధ్ధగా వింటున్న నీలిమ “యెంతా బాగా చెప్పారో అత్తయ్యగారు..ఇంకా యేమన్నారండీ.. అంది చింటూకి వాడు ఆడుకునే లాప్‍టాప్ ఇచ్చి. విజయ్‍కి ఇంకా చెప్పాలనే ఉత్సాహం ఇనుమడించింది.

నీలూ, అమ్మ చేసిన పనుల్లో అన్నింటికన్న నాకు బాగా నచ్చింది ఒకటి చెప్పనా? నీలూ ఆసక్తిగా చూసింది.

మా పెద్దచెల్లెలు లక్ష్మి తెల్సుకదా.. చాలా తెలివైంది. అన్నింట్లోనూ ఫస్ట్ మార్కులే దానికి. బాగా చదువుకుని, ఉద్యోగంచేస్తూ, దాని కాళ్లమీద అది నిలబడాలని లక్ష్మి ఆశయం. కానీ డిగ్రీపరీక్షలవగానే ఒక మంచి సంబంధం చూసి పెళ్ళి నిశ్చయించేరు మా నాన్నగారు. ఇంక చూస్కో దాని బాధ..నాన్నగారి ఎదురుగా నిలుచుని మాట్లాడలేదు.. భయం. అమ్మని పట్టుకుని సతాయించేసింది. ఆఖరికి వయసులో వుండే ఆవేశంతో పెళ్ళి చేస్తే చచ్చిపోతానని కూడా బెదిరించింది. దాని మాటలన్నీ ఓపిగ్గా వింది అమ్మ. లక్ష్మిని నెమ్మదిగా మాటల్లో పెట్టింది. పెళ్ళనేది యే వయసులో చేసుకుంటే బాగుంటుందో చెప్పింది. ఇదివరకటి రోజులు కావనీ, పెళ్ళయాక కూడా చదువుకుని, ఉద్యోగం చేసుకోవచ్చనీ, అందుకోసం తను అన్నివిధాలా లక్ష్మికి సహాయంగా వుంటానని మాటిచ్చి, పెళ్ళికొప్పించింది.

విజయ్ చెప్పింది ఆసక్తిగా వింటున్న నీలిమ “లక్ష్మి చదువుకి  అత్తయ్యగారెలా సాయం చెసేరు? కుతూహలంగా అడిగింది.

చాలా చేసింది. పెళ్ళైన మొదటి రెండేళ్ళూ లక్ష్మికి అత్తవారింటి పరిస్థితులకి అలవాటు పడడానికి సరిపోయింది. తర్వాత రవిగాడు పుట్టాడు.వాడు పుట్టాక ఎమ్..పరీక్షలు రాసింది లక్ష్మి. సత్య పుట్టాక బి.ఇడి,. ఎమ్.ఇడి. కూడా చేసింది. అన్నింట్లోనూ మంచిమార్కులు తెచ్చుకుంది. అన్ని పరీక్షలప్పుడూ కూడా అమ్మ లక్ష్మి పక్కనేవుండి, పిల్లల్ని తను చూసుకుని, చాలా రకాలుగా సాయం చేసి తన మాట నిలబెట్టుకుంది. లక్ష్మి పిల్లలు స్కూలుకి వెళ్లడం మొదలెట్టాక అది కాలేజిలో లెక్చరర్‍గా చేరింది. రెండేళ్ళు అక్కడ చేసేక అమ్మే సలహా ఇచ్చి లక్ష్మి చేత ఒక స్కూల్ పెట్టించింది. అలామొదలుపెట్టిన స్కూలే ఇప్పుడు శారదా విద్యాలయం.. కె.జి. టు పి.జి. అనే పెద్ద విద్యాసంస్థ అయింది. వీటన్నింటి వెనకా లక్ష్మి వెన్నంటే అమ్మ కూడా వుందిఅలాగ ఇంట్లో గొడవలేమీ జరగకుండా సరైన సమయంలో లక్ష్మికి పెళ్ళిచెయ్యడం, లక్ష్మి కోరిక తీరడానికి తన వెన్నంటే వుండడం ఇవన్నీ అమ్మ చేసినవే నీలిమా. అదే స్ఫూర్తి నాక్కూడా. మన ముందున్న అవకాశాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవడమన్నది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నదే. . భావోద్వేగంతో అన్నాడు విజయ్.

ఒక అద్భుతాన్ని వింటున్నట్టు వింది నీలిమ. “అత్తయ్యగారి గురించి మీరీ విషయాలేవీ ఇన్నాళ్ళూ చెప్పలేదేవండీ..?” అంది.

తేలిగ్గా ఊపిరి విడుస్తూ, “మగవాణ్ణి కదా నీలూ..”అన్నాడు. అర్ధం కానట్టు చూసింది. “యెంత కాదన్నా మగవాడికి ఈగో వుంటుందనుకుంటాను. అందుకే అమ్మ గురించి ఎవరు చెప్పినా నవమాసాలూ మోసి కంది..అని చెపుతారు తప్పితే వారి వ్యక్తిత్వం తల్లి వల్ల రూపు దిద్దుకుందని చెప్పలేరు. ఎందుకంటే అలా చెపితే తండ్రి యేమైనా ఫీలవుతాడేమోననుకుంటారు. అలా తండ్రిని చిన్నబుచ్చడం తల్లికి కూడా ఇష్టముండదు కనక గొప్పదనాన్నంతా తండ్రికే ఆపాదిస్తారు. నవమాసాలూ మోసి కనడం గొప్ప విషయమే కానీ దానితోపాటు తల్లి నేర్పిన పాఠాలు కూడా వ్యక్తి జీవితాన్ని నిర్దేశిస్తాయి.

కాని విషయాలు నాకిన్నాళ్ళు  తెలీవండీ.” అంది నీలిమ.

నీలాగే చాలామంది దీన్ని గురించి ఆలోచించరు. అందుకనే నీలూ చెప్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కుటుంబమనే బండి సజావుగా సాగి ప్రయాణం సాఫీగా సాగాలంటే కుటుంబం అందరూ కూర్చునే బండి తొట్టె అనుకో, ఇంటి యజమాని చక్రం అనుకో.. చక్రాన్నీ, బండినీ సరిగ్గా సమన్వయపరచే ఇరుసే ఇంటి ఇల్లాలు. బండికి చక్రం మరీ బిగుసుకుపోయినా బండి నడవదు. వదులైపోయినా రెండింటి బేలన్స్ కుదరదు. అలా కాకుండా బండినీ, చక్రాన్నీ బాలన్స్ చేసి నడిపేదే అమ్మ. అలాగే యే కంపెనీ అయినా కూడా. కంపెనీ బండి అయితే, అందులో ఉద్యోగులు చక్రం అయితే రెండింటినీ సమన్వయపరచి నడిపించేవాడే సీ.యీ.వో. ఇలా అమ్మ దగ్గర నేర్చుకున్న పాఠాలు యే బిజినెస్ స్కూల్‍లోనూ చెప్పరు.

ఇప్పుడిప్పుడే కంపెనీల పేర్లతోపాటు కంపెనీల సి..వో పేర్లు కూడా చెప్పుకుంటున్నట్టే తండ్రిపేరుతోపాటు తల్లిపేరు కూడా గుర్తించే రోజులొచ్చాయి. దానికి యెవరో ఒకరు నాంది పలకాలి కనక నేను మొదలెట్టాను అంతే..

నీలిమ ఆలోచించింది. “మరి మీ నాన్నగారు చిన్నబుచ్చుకోరూ..

విజయ్ ఆలోచించి నెమ్మదిగా అన్నాడు. “ఊహు.. చిన్నబుచ్చుకోరు. ఆయనకీ విషయం తెలుసు. కాని తనంతట తను బైట పెట్టలేరు. నేను పెట్టాను కదా. సంతోషిస్తారు తప్పితే యేమీ అనుకోరు. ఒకవేళ వెంటనే కాస్త చిన్నబుచ్చుకున్నా అర్ధం చేసుకుంటారు. అన్నాడు.

ఇంతలో ఫోన్ మోగింది. రింగ్ ఇండియానుంచే. విజయ్ వెంటనే తీసి “అమ్మా.. అన్నాడు. అటునుంచి పార్వతమ్మ నిశ్శబ్దంగా వుండిపోయింది. అర్ధమైపోయింది విజయ్‍కి. “ఇంటర్వ్యూ చూసేరామ్మా..?” అనడిగాడు. సమాధానం చిన్నగా వినిపించింది. “చూసాం నాన్నా.. కానీ…నువ్వలా చెప్పకుండా వుండాల్సింది.

గదిలోంచి మాట్లాడుతున్న పార్వతమ్మకి హాల్లో ఎక్స్ టెన్షన్ ఫోన్లో వింటున్న శంకర్రావు కనిపిస్తున్నాడు.

ఫరవాలేదమ్మా. ..నాన్నగారి గురించైతే నీకేమీ బెంగక్కర్లేదు. ఆయనకన్నీ తెలుసు. అర్ధం చేసుకుంటారమ్మా.. అన్నాడు విజయ్.

కానీ..” అంది పార్వతమ్మ.

అమ్మా, అమ్మ గురించి కనీసం నన్ను యిప్పుడైనా చెప్పనీయమ్మా..!” అన్నాడు విజయ్ ప్రాధేయపూర్వకంగా.

కొడుకు మాటలకి హాల్లోంచి వింటున్న శంకర్రావు మొహంలో చిన్ననవ్వు తొంగిచూసింది.

చిరునవ్వు చూసిన పార్వతమ్మ మొహం మందారంలా విచ్చుకుంది.

*****

(మొదటి ముద్రణ: 13 ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

*****

రచయిత్రి గురించి :

 నా పూర్తిపేరు గరిమెళ్ళ సుబ్బలక్ష్మి. మా అమ్మగారు శ్రీమతి పద్మావతిగారు. మా నాన్నగారు శ్రీ పిడపర్తి సుబ్బయ్యశాస్త్రిగారు నాకు సంగీత, సాహిత్యాలమీద అభిరుచి కలిగించారు

సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ , కర్ణాటకసంగీతం(వీణ)లో డిప్లొమా చేసాను.

బహుమతులందుకుని, పలు పాఠకుల ప్రశంసలు పొందిన నేను రాసిన కొన్ని కథల వివరాలు…

1.“రచన”(ఇంటింటి పత్రిక) లో మూడుసార్లు కథాపీఠం పురస్కారం;

2.”అతనుఆమెకాలం” కథల సంపుటికి 2017 సంవత్సరానికిగాను గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం.

3.“రచన” నిర్వహించిన కథలపోటీలలో ఆరుసార్లు బహుమతులు;

4.“జాగృతి” పత్రిక నిర్వహించిన “వాకాటి పాండురంగారావు స్మారక కథలపోటీ” లలో రెండుసార్లు  ప్రథమ, ప్రత్యేక బహుమతులు;

5.“ఆటా” (అమెరికన్ తెలుగు అసోసియేషన్) నిర్వహించిన కథలపోటీలలో రెండుసార్లు  బహుమతులు;

6.“సారంగ” అంతర్జాలపత్రికవారు నిర్వహించిన కథలపోటీలో ప్రథమ బహుమతి;

7.ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీవారు నిర్వహించిన కథలపోటీలో ఎన్నికయిన ఉత్తమకథ; ఇవికాక

8.అర్చన ఫైన్ ఆర్ట్స్ వారి కథల పోటీలలో రెండుసార్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు. 

నవ్య, స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సుజనరంజని, కౌముది, సారంగ, వాకిలి మొదలైన ప్రింటు, అంతర్జాల పత్రికలలో నా కథలకు,కవితలకు బహుమతులు వచ్చాయి

ఇప్పటివరకూ ఒక నవల, ఒక మినీ నవల, వందకథలూ వివిధ ప్రింటు, అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్దాయి

కొన్ని కథలు కథావాహిని, ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్), జ్ఞాపకసంచిక, “ఆశాదీపం” అంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీవారి సంకలనం 2014, కథాకేళి, ప్రమదాక్షరి కథాసంపుటాలలో చోటు చేసుకున్నాయి

గత పాతిక సంవత్సరాలనుండీ ఆకాశవాణిలో పలు ప్రసంగాలూ, నాటికలూ, కథలూ, పాటలూ ప్రసారమయ్యాయి

సంవత్సరకాలం నుంచీ సంచిక.కామ్ అనే అంతర్జాల పత్రికలో “కాజాల్లాంటి బాజాలు” అనే కాలమ్ రాస్తున్నాను

  జ్ఞాననిధి అయిన సాహిత్య ప్రపంచంలో వున్న మంచి రచనలు చదవడమన్నది నాకు చాలా ఆనందం కలిగించే విషయం..

*****

Please follow and like us:

6 thoughts on “కథా మధురం-జి.యస్.లక్ష్మి”

  1. ‘ఇప్పుడైన చెప్పనీయమ్మా’ కథ చాలానే మనసును హత్తుకుంది. అందులోని ఆణిముత్యాలు దారిదీపాలు. రచయిత్రి గారిది ఇదే మొదటి కథ చదవటం. మిగిలిన కథలు చదవాలి.వాటి లింకులు మీ Timeline లొ లభిస్తాయనుకుంటాను. దమయంతిగారు చాలా మంచి విశ్లేషణ రాశారు. మీకు దమయంతిగారికి మనఃపూర్వక అభినందనలు!!!

  2. ‘ఇప్పుడైన చెప్పనీయవమ్మా’ కథ చదివి మాటలు రావటంలేదండి. దమయంతిగారి విశ్లేషణ చదివే నా స్నేహితులకు పంచేశాను. తరువాత కథ చదివాను. అందులో రాసిన ఆణిముత్యాలు జీవితానికి దారిదీపాలు. ఎంత చక్కగా కథను నడిపారు.!మాతృదేవోభవ!!విత్తన మోకటే చాలదు అది పెరగడానికి అన్నీపోషక పదార్థాలు ఉండాలి. !!! మీ కథలు నేను ఇదే మోదట చదవటం. ఎక్కడ లభిస్తాయి. మీ timeline లో లింకులు లభించవచ్చా!! మనఃపూర్వక అభినందనలు మీకు మరియు అంతే చక్కగా విశ్లేషించిన దమయంతిగారికికూడా!!!

  3. తరతరాలుగా ( సమిస్టి )కుటుంబాలలో అనుభవాల వెల్లువలో ఏ చదువు లేకపోయిన (ఆ తరాలలో) అంతర్గతంగా అమ్మలో దాగివున్న మానేజ్ మెంట్ గురువును(management gurus)కొడుకు విజయ్(CEO) భార్వకు వెలికి తీసి చూపిన సుబ్భలక్ష్మి గారి కథనం హృద్యంగా వుంది. Very good story and review

  4. కథామథురం శీర్షికలో నా కథ “ఇప్పుడైన చెప్పనీయమ్మా” అన్న కథను ప్రచురించినందుకు నెచ్చెలి సంపాదకులకు, చక్కటి సమీక్ష నందించిన దమయంతికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  5. చాలా బాగుంది సుబ్బలక్ష్మి గారు. మంచి కథ

Leave a Reply

Your email address will not be published.