కొత్త అడుగులు – 9
భానుశ్రీ కొత్వాల్
– శిలాలోలిత
స్త్రీలు ఇటీవలి కాలంలో ఎక్కువగా సాహిత్యప్రవేశం చేస్తున్నారు. మనం గమనించినట్లయితే – విద్యారంగం నుండి, ముఖ్యంగా టీచర్లు సాహిత్య సృజన చేస్తున్నారు. నల్గొండ జిల్లా స్థలకాల ప్రాధాన్యతల వల్ల కావచ్చు, సిటీకి దగ్గరవడం వల్ల చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎక్కువున్నారు. రచనలపట్ల ఆసక్తి వున్నవారే ఎక్కవుగా కనిపిస్తున్నారు.
ఒక ఆరోగ్యవంతమైన సాహిత్య వాతావరణంలో ‘భానుశ్రీ కొత్వాల్’ – ‘మొలక’ పేరుతో కవిత్వాన్ని తీసుకొచ్చారు.
వానలు పడుతున్నయి. నేలతల్లిగుండె చల్లబడింది. ఆకాశం కురిపిస్తున్న నీటి చుక్కల్ని తాకి రైతన్న హృదయం కూడా సంబరపడుతుంది మొలకెత్తిన రోజును చూసి మొలకెత్తిన పైరు పచ్చలు కాబోతున్న దశను చూపిస్తుందా అన్నట్లు తానే ఒక మొలకై, అక్షరాల బండితో మనముందు కొచ్చింది భానుశ్రీ.
ఈ పుస్తకానికి ఓల్గా ముందుమాట రాస్తూ, లోతైన చూపున్న కవితలు అన్నారు. కవులు, రచయితలు నిరంతర పాటకులు కావాలన్నారు. ఈ సంకలనంలో, వస్తులోపం, దృష్టి కోణంలో లోపం, కవిత్వీకరణ లోపం లేని అచ్చమైన కవితలు కొలువు దీరాయన్నారు.
2019 లో వచ్చిందీ ఈ పుస్తకం. అక్కలాయి గూడెం లో తెలుగు టీచర్ గా భానుశ్రీ పనిచేస్తుంది.
తన కవిత్వాన్ని గురించి భానుశ్రీ మాటల్లోనే విందాం.
“నా కవిత్వం
చుట్టూ ముసిరిన
మోసాలను చేదించే ఆయుధం
నా కవిత్వం
మింగుడుపడని
వేలవేల అహంకారుల చరిత్రను
తవ్వితీసే గునపం
అనేక సంఘర్షణల
సంఘటనల సమాహారం నా కవిత్వం.
అలవోకగా విస్తరించే
మనో సమతౌల్యం నా కవిత్వం.”
తన జీవన పరిణామక్రమంలో ఎన్నెన్నో ఒడిదుడుకుల్ని, ఎదుర్కొని నిలబడిన యోధురాలిగా ఆమె అంటే గౌరవం నాకు. తనను కవిత్వం ఎలా ఓదార్చిందో, సేద తీర్చిందో, యోధురాల్ని చేసిందో చాలాచోట్ల ప్రస్తావిస్తూ పోయింది.
పి.జి. చదివేటప్పుడు నేను స్త్రీవాది ననుకున్నా.
జీవితంలో పరిణితి సాధించావనుకున్న తరుణంలో నావి విప్లవ భావాలనుకున్నా.
ఉపాధ్యాయ వృత్తిలో వచ్చాక నాకొక బాధ్యత కూడా వుందనే అంచనా కొచ్చానంటుంది.
1994 నుంచి కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇప్పటి ఈ ‘మొలక’ పుస్తకం భానుశ్రీ వేసిన తొలి అడుగు. ఈ అడుగుకి జతై, ముందు ముందు మరిన్ని కవిత్వ పాదముద్రల్ని చూస్తాం.
తొలినాళ్ళలో పసిపిల్లలు తడబడుతూ నడుస్తూ, పడుతూ, పైకి లేస్తూ నడక నేర్చుకుంటారు. అందుకే బహుశా ‘సినాశి’ ‘నడక నా తల్లి’ అనుంటారు. చిన్న చిన్న అంశాలు మినహా మంచి కవిత్వమిది. పరిణితి విస్తృత అధ్యయనం వల్ల వచ్చింది. ఎప్పుడన్నా అక్కడక్కడా భావగాఢత లోపించినట్లనిపించినా, వస్తువు బలమైంది అవడంతో కవిత్వమైంది. ఒక సామాజిక బాధ్యతగా కవిత్వాన్ని స్వీకరించడం అభినందించదగ్గ విషయం. వస్తువిస్తృతి ఎక్కువగా వుంది. భాషలో స్పష్టతవుంది. సరైన దృష్టికోణముంది. స్త్రీవాద స్పృహవుంది. అందుకే మొలక దశలో వున్న అనేక సామాజిక రుగ్మతలన్నింటినీ బట్ట బయలు చేసింది.
ఈ తొలిదశలో చాలామంది అనుభూతి ప్రథానంగా కనబడుతుంటుంది. పోను పోను వస్తువు బలపడి – కాలానికి ఎదురీది నిలబడీ దిక్సూచిలా తయారవుతారు. స్త్రీల కవిత్వం మీదే రిసెర్చ్ చేసిన నాకు ఎక్కడ ఓ కొత్త కవయిత్రి కనబడినా సంతోషం కలుగుతుంది. సంఖ్య పెరిగిందని ఆనందిస్తుంటారు.
కొన్ని కవితల్ని సూక్షంగా పరిచయం చేస్తారు. స్త్రీల పట్ల వున్న వివక్షను ‘జీవనతంత్రి’ కవితలో తూర్పారపట్టింది.
మరణానికి అంచువరకూ వెళ్ళి మరో జన్మనిచ్చేస్థితిని గాఢంగా చిత్రించిన కవిత ‘ప్రసవవేదన’.
‘జీవిశిల’ కవితలో – అస్థి పంజరానికి కప్పిన చిల్లుల దుప్పటి ఆమె.
స్త్రీలపై దినదినమూ పెరిగిపోతున్న హింసల్ని చాలావరకూ ప్రస్తావించడమే కాక, పరిష్కారాలను చూపించే యత్నం చేసింది.
‘కీట్స్’ – అన్నట్లుగా చెట్టుకు ఆకులు వచ్చినట్లుగా కవికి కవిత్వం రావాలి – అన్నట్లుగా, తనలోని తపన, బాధ, ఆవేశం, ఆక్రోషం పెను ఉప్పెనలా వచ్చినప్పుడు అప్రయత్నంగా, సహజంగా పెల్లుబికేదే నిజమైన కవిత్వం.
మొలక కవితలో
“జీవన భయంతో మొలక
నేడు కన్నీరిడుస్తోంది.
స్వానుభవాల మాటలు
వేల కోణాల లోచనలు
మోహపు మోసానికి
యవ్వనాన్ని అర్పించిన మొలకి
. . . . . .
బురదలోపడి కృంగిపోతే ఎలా
తెప్పరిల్లి
మనసు మాలిన్యం వీడి
ఓ మొలక ! నిన్ను నీవు దిద్దుకో
బలిపీఠం ఎక్కొద్దు
ఆత్మహత్య ఆవేశం వద్దు
ఆత్మాభిమానంతో ఎదుగు
ఓ మొలక చలించి చితికిపోకు
చితి దాకా చేరకు
భవితవ్యంపై ఆవను పెంచుకో
విజయాలతో ఒడి నింపుకో
చిరునవ్వుతో సాగిపో”
– అంటూ బాధితుల పక్షాన నిలబడి, పోరాడిన కవయిత్రికి అభినందనలు.
*****
Thank you @sheelalolitha mam’m for your great words towards my poetry and thank you very much @nechheli