నాన్నే ధైర్యం(కవిత)
-కె.రూప
ఆడపిల్లకు ధైర్యం నాన్నే!
గుండెలపై ఆడించుకునే నాన్న
చదువులకు అడ్డుచెప్పని నాన్న
ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న
చిన్నగాయానికే అమ్మకు గాయంచేసే నాన్న
ఇప్పుడెందుకు ఇలా!
మనసుకైన గాయాలను చూడడెందుకో!
చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు
పెద్ద తుఫానులో వున్నాను అంటే పలకడెందుకో!
నీ సుఖమే ముఖ్యం అనే వ్యక్తి
వ్యక్తిత్వం మర్చిపోయి సర్దుకోమంటాడే!
ధైర్యంగా బ్రతకమని చెప్పిన మనిషి
అణగారిన బ్రతుకునుండి బయటకు వస్తాను అంటే ఒప్పుకోడెందుకో!
నా చిట్టిపాదాల మువ్వలచప్పుళ్లు చూసి మురిసిపోయిన నాన్న
నా ఆర్తనాదాల చప్పుళ్లు వినిపించుకోడే!
ఎందుకిలా
బ్రతుకు భారమైనవేళ దరిచేరి వ్యథను పంచుకోవలసిన నాన్న
సమాజం అనే ముసుగేసుకుని కనపడనంటాడే!
పంతులుగారు ఒక దెబ్బ కొడితేనే
భరించలేని నాన్న
అత్తింటి ఆరళ్ళ మోత వినపడలేదంటాడే!
రెక్కలు వలిచి కష్టపడిన సొమ్ముని
వరకట్నంగా దారపోసినోడు
కలచెదిరి వచ్చిన కూతురికి నిలువనీడనివ్వనంటాడే!
ఎవరికోసమో కలతపడ్డ మనసుని
రాయిలా మార్చుకొని
ఎవరి మెప్పుపొందాలని గాంభీర్యపు బింకం-
ఒంటరిగా పోరాడే బిడ్డకు
వెన్నుముకైనప్పుడు కదా జన్మకు సార్ధకత.
సమస్యనెదుర్కొనే శక్తివున్న కూతురికి ధైర్యాన్నివ్వు!
పిరికిమందు నూరిపోయకు!
నీవు మెచ్చిన ఈసమాజం నీవెనుక
ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది.
నీ కంటిపాప మనసు నవ్వినప్పుడు కదా నిజమైన తండ్రిస్థానానికి చేరేది…!
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి