
నారిసారించిన నవల
-కాత్యాయనీ విద్మహే
10
మాలతీచందూర్ నవలలు మొత్తం 27 అని ఒక అంచనా. ( ఓల్గా, నవలామాలతీయం, జులై 2006) వాటిలో 17 నవలలు 1955 నుండి 70 వదశకం పూర్తయ్యేసరికి పాతికేళ్ల కాలం మీద వచ్చాయి. మిగిలిన తొమ్మిది నవలలో ఎనిమిది తెలుస్తున్నాయి. శిశిరవసంతం నవల ప్రచురణ కాలం తెలియటంలేదు. మిగిలిన ఎనిమిది నవలలో శతాబ్ది సూరీడు తప్ప మిగిలినవి 80 వదశకపు నవలలు. తెలియ రాకుండా ఉన్న ఆ ఇరవైఏడవ నవల 1950వ దశకంలో మరొక ఆరుగురు మహిళా రచయితలతో కలసి వ్రాసిన గొలుసు నవల సప్తపది అయిఉండాలి. కాకపోతే కొన్నిచోట్ల ఆమె రచనల జాబితాలో కనిపించే ‘గౌతమీపుత్రి’ ఆ నవల అయిఉంటుంది.
80 వ దశకంలో మొదటి సగం అంతర్జాతీయమహిళాదశకంలో రెండవభాగం (1975- 1985) రెండవ సగం తెలుగునాట స్త్రీవాద ఉద్యమచైతన్య వికసన కాలం. ప్రారంభం నుండి స్త్రీ జీవితచైతన్యాలు కేంద్రంగా నవలేతివృత్తాలనునిర్మించుకొంటూ వచ్చిన మాలతీచందూర్ ఎందువల్లనో స్త్రీవాద సాహిత్యోద్యమాన్ని అంతగా పట్టించుకున్నట్లు కనబడదు. తాను ఇప్పటికే ఆ మార్గంలోనే ఉన్నానుకొనటమే కారణం కావచ్చు. అయితే కాన్సర్ వ్యాధి బాధితుల జీవితం ఇతివృత్తంగా వ్రాసిన శిశిరవసంతం నవలలో స్త్రీవాద ప్రస్తావనలు రావటం గమనించవచ్చు. ( సుజాతారెడ్డి, నవలామాలతీయం) దానిని బట్టి ఈ నవల 90వదశకంలో వచ్చి ఉంటుంది అని కూడా అనుకోవచ్చు.
స్త్రీ పురుషులమధ్య ప్రేమ సర్వసాధారణమైన సాహిత్యవస్తువు. వాళ్ళవాళ్ళ వ్యక్తిత్వాలు, సంస్కరాల స్థాయి, కులం, ధనం మొదలైన వాటి సంబంధంలో అది భిన్నభిన్నరూపాలలో వ్యక్తమవుతుంటుంది. అందువల్ల ప్రేమ ఒక్కటే అయినా కథలు అనేకం. పరిణామాలు ప్రత్యేకం. 70వ దశకపు లావణ్య, మేఘాలమేలిముసుగు, ఏది గమ్యం ?ఏది మార్గం? వంటి నవలలో వలెనె మధురస్మృతులు (1983) నవలలో కూడా అటువంటి ఒక ఆకర్షణ, ప్రేమ పరిణామాలే చిత్రించబడ్డాయి. అయితే అది విషాదస్పర్శగల నవల. ఈ దశకంలో స్త్రీపురుషుల ఆకర్షణలు, అభిమానాలు వస్తువుగా వచ్చిన మరో రెండు నవలలు కర్పూరపరాగం (1982), వైశాఖి( 1986).
వైశాఖి విశాఖపట్టణం లో ఒక వైద్యవిద్యార్థి ప్రేమకథ. విశాఖ అమ్మాయి కథ కనుక వైశాఖి నవలపేరు అయింది. అంతే కాదు. ఆమె ప్రేమ కథ అంతా విశాఖ చుట్టూ అడవులలో విస్తరిస్తున్న విప్లవోద్యమ సంబంధంలో పరిణమించింది కనుక కూడా వైశాఖి అనేపేరు దీనికి సరిపోతుంది. నిరుపమ మెడిసన్ మూడవ సంవత్సరం విద్యార్థి.ఒకరోజు రాత్రి చీకట్లో, వానలో బస్సుకోసం ఎదురుచూస్తున్న ఆమెను సాయుధ విప్లవోద్యమంలో ఉన్న ఒక దళం, పోలీసు కాల్పులలో గాయపడ్డ తమ సహచరుడికి చికిత్స కోసం జీపులోకి ఎక్కించుకొని తీసుకువెళ్లటం దగ్గర నవలలో కథ మొదలవుతుంది. మూడు నాలుగు రోజులు వాళ్ళతో ఉండిపోవలసి రావటంతో . వాళ్ళ సాహసం పట్ల ఆకర్షణ, తాను చికిత్స చేసిన యువకుడి పట్ల అభిమానం కలిగించి అడవిలో రహస్య జీవితం పట్ల ఆసక్తిని పెంచాయి. ఆ క్రమంలో పోలీసు రికార్డులకు ఎక్కి, ఇక విశాఖలో ఉండటం కష్టమని రెడ్డితో మద్రాస్ వెళ్ళిపోవటంతో ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. అక్కడ నర్సుగా ఒక ఆసుపత్రిలో పనిచేస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ కు దగ్గర కావటంతో సంభవించిన పరిణామాలు మళ్ళీ ఆమె విశాఖవెళ్లి మధ్యలో ఆపేసిన డాక్టర్ కోర్సు పూర్తిచేసే అవకాశానికి దారితీయటంతో నవల ముగుస్తుంది. ఈ నవలలో నిరుపమకు రెడ్డికి మధ్య ప్రేమ కాల్పనికమే. విప్లవోద్యమం అతి బలహీనమైన కారణం. విప్లవోద్యమ నిర్మాణ నిబద్ధతల గురించిన సరైన సమాచారం గానీ అవగాహన గానీ లేకుండానే రచయిత దానిని నవల ఇతివృత్తంలో ఒక భాగం చేసింది. దళ జీవితం గడిపిన రెడ్డిని స్మగ్లర్ గా పరిణమింపచేసి ఒక పోలీసాఫీసర్ పాత్రను ప్రవేశపెట్టి నిజమైన ప్రేమ తోటివాళ్లను పతనానికి ఈడ్చే తొందరపాటు చర్య కాదని నిరూపించింది. ఆదర్శాలు, ఆవేశాలు కాక వ్యక్తిత్వాలు, బాధ్యతలు ప్రేమను సజీవం చేసేవి అని రచయిత్రి చెప్పకనే చెప్పింది.
పెళ్లంటే వ్యక్తి స్వాతంత్ర్యమునకు శాశ్వత సమాధి అని, ఉద్యోగం అన్నది వ్యక్తిత్వానికి మొదటి మెట్టు అని నమ్మి తల్లిదండ్రులను ఒప్పించి మద్రాసులో స్కూల్ టీచర్ ఉద్యోగంలో చేరిన వసంత -స్నేహితురాలు సుజాత వల్ల – శంకర్రావు అనే అపరిచిత వ్యక్తిపట్ల కలిగిన కుతూహలంతో అన్వేషించి, అతనిని కనుగొనటం, తాను సంచలనానికి లోనుకావటం, సన్యాస దీక్ష తీసుకొనటానికి సిద్ధంగా ఉన్న అతని చిత్తవృత్తిలో సంక్షోభానికి కారణం కావటం, తాను లేనిదే బ్రతకలేని అతని స్థితి అర్ధమయ్యేసరికి అతని కోసం తనలో కూడా ఒక ఆర్తి ఉందని అర్ధమై పెళ్ళికి సిద్ధమవటం కర్పూర పరాగం ఇతివృత్తం. శంకర్రావు వ్యక్తిత్వం గురించి, అతనిపట్ల తన ఇష్టం గురించిన సుజాత కథనం అతను యువతులకు కోరదగిన వరుడు అన్న అవగాహనను వసంతకు కలిగించింది. బహుశా అదే ఆమెను అతన్ని వెదుక్కొని పరిచయం ఏర్పరచుకొనటానికి, అతనిపట్ల శ్రద్ధ చూపటా నికి కారణం అయిఉంటుంది. తానుగా తెలుసుకొన్న యువకుడు కనుక పెళ్ళికి అభ్యంతరం లేక పో యింది. ఒకరిగురించి ఒకరు తెలుసుకోగల వివేకం, నిర్ణయాలు తీసుకోగల నిబ్బరం ఉన్న స్త్రీ పురుషుల మధ్య సహజ ఆసక్తుల నుండి జనించే ఆకర్షణ – ప్రేమ అన్న మాటతో సంబంధం లేకుండానే – సహజీవనకాంక్షగా పరిణమించగలదు అని చెప్పటం రచయిత ఉద్దేశంగా కనబడుతుంది.
ఇక ఈ దశకంలో వచ్చిన మరొక నవల ‘కలలవెలుగు’ క్వాలిటీ పబ్లిషర్స్ వారు 2010లో ముద్రించిన ప్రతి లభిస్తున్నది. కానీ 1986 లో ఇదే ప్రచురణ సంస్థవారు ప్రచురించిన వైశాఖి నవల లోపలి పేజీలో మాలతీచందూర్ నవలల జాబితాలో ఈ నవల కూడా ఉంది. కనుక ఇది 80 వ దశకపు నవల అవుతుంది. రేణుకాదేవి ఆత్మకథ నవల వలె ఇది కూడా సినిమారంగం తో ముడిపడిన నవల. ప్రేమ గురించి కలలు కనటమే కానీ ఏ స్త్రీపురుషులిద్దరి వైవాహికజీవితంలో గానీ, సహజీవనం లో గానీ ప్రేమను ఒక వాస్తవంగా అనుభవంలోకి తెచ్చుకోగల సామాజిక పరిస్థి తులు లేవని ఈ నవల ఇతివృత్తంలో నిరూపించి చూపింది మాలతీచందూర్. (అక్కినేని కుటుంబ రావు, నవలామాలతీయం)
ప్రేమ స్త్రీపురుషుల పరస్పర ఇష్టానికి సంబంధించిన విలువ అయితే పెళ్లి ఒక సామాజిక బంధం. భద్రత. బాధ్యత. ఆ రెండింటికీ ఉండే అన్యోన్యసంబంధం వల్లనే జీవితం ఉన్నతంగానూ మానవీయంగానూ అవుతుంటుంది.అయితే అసమ సమాజంలో అందుకు అవకాశాలు శూన్యం. పెళ్ళికి ప్రేమ పునాదిగా ఉండాలన్న భావమే లుప్తమైన మనుసంస్కృతి పెళ్లి వంశవరసత్వాన్ని నిలబెట్టటానికి అని రూఢి చేసి పెట్టింది. ఈ క్రమంలో పెళ్లి అంటే మగవాడికి సుఖాన్ని ఇచ్చే ఒప్పందం. ఈ నవలలో రామచంద్రం ఆ సుఖం కోసమే పెళ్లిచేసుకొన్నాడు. పెళ్ళిలో సుఖం అంటే మగవాడికి లైంగిక సంతృప్తిని ఇస్తూ, బిడ్డలను కనిపెంచుతూ, తన అవసరాలు కనుక్కొంటూ ఇల్లుచక్కదిద్దుకొంటూ కమ్మగా వండి పెట్టె భార్య దొరకటం. రామచంద్రానికి ఆ సుఖం పూర్తిగా దక్కలేదు. స్త్రీలకు సుఖం, సంతోషకరం అయిన ధర్మం భర్తను సుఖపెట్టటమే. అయితే రామచంద్రం పెళ్లాడిన రమణమ్మకు సుఖం అంటే పొదుపుగా సంసారం వెళ్లదీస్తూ భర్త సంపాదనను సంపదగా మార్చటం. దానికి అంతం లేదు. తృప్తీ లేదు. ప్రేమతో ప్రమేయమే లేని దాంపత్యాల తీరు ఇది.
కెమెరామెన్ రామచంద్రంను ఆకర్షించి, అభిమానం సంపాదించి సినిమాలో అవకాశాలు పొందాలన్న లక్ష్యంతో సన్నిహితురాలైన పద్మలత ఆ ఊసే వదిలి ఒక భద్రతను , గౌరవకర జీవితం ఆశించి రామచంద్రతో సహజీవనంలో సంతృప్తినివెతుక్కొనే క్రమంలో పెళ్లి లేకుండానే ఒదిగి ఉంటూ తనను తాను సంపూర్ణంగా సమర్పించుకొని సమస్త సేవాసుఖాలు అందించే భార్యాధర్మాన్ని అవలంబించింది. ఇక్కడా ప్రేమకు ఆస్కారంలేదు. ప్రేమలేని సంబంధాలలో చట్టబద్ధత కూడా లేకపోతే అది స్త్రీల జీవితాన్ని ఎంత భీభత్సానికి, నిస్సహాయతను లోను చేస్తుందో పద్మలత జీవితంలో చూస్తాం.
ఇక ఈ దశకంలోని మరొక నవల భూమిపుత్రి. ఏకబిగిన చదివింపచేసే ఆహ్లాదకర జీవనహేల ఆద్యంతాలకు విస్తరించి కనబడుతుంది ఈ నవలలో. తండ్రి మరణించి మరోదిక్కులేక తల్లి తో పాటు పెదతండ్రి పంచన చేరిన దుర్గ అస్తిత్వఆరాటం, జీవన పోరాటం, స్వయంసిద్ధగా ఎదిగిన తీరు ఈ నవలకు ఇతివృత్తం. పెత్తండ్రి ఇంట చదువు సంధ్యా లేక తల్లితోపాటు బానిస చాకిరీ చేయవలసి వచ్చినా, చివరకు తల్లి మరణించి ఒంటరిగా మిగిలినా దుఃఖానికి అతీతంగా తనపని చేసుకుపోయే తాత్వికత,కుంగిపోవటం కాక నింగికి విస్తరించే జీవనాలాలసను సమాంతరంగా నిలుపుకొనటం ఆమె ప్రత్యేకత. అవే ఆమెను పెత్తండ్రి ఇల్లువదిలి టౌన్ లో చదువువునంటున్న బావ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకొనటానికి, అతనికి తాను బరువై కూర్చోకుండా, అతని చదువు సజావుగా కొనసాగటానికి ఆమె చిన్నవే అయినా ఎడతెగకుండా ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా ప్రయత్నాలు చేయటానికి, ఆ క్రమంలో అందరిబంధువు అవుతూ జీవితాన్నిఅంచెలంచెలుగా నిర్మించుకొంటూ నిర్మాణానికి చోదకశక్తి కూడా కావటానికి కారణమయ్యాయి. నేనూ కొన్ని పనులు ప్రత్యేకంగా చెయ్యగలను.. నాకూ ప్రత్యేకత ఉంది అని నిరూపించుకోవాలన్న తహతహ తో ముగ్గులు పెట్టటంలోని తననైపుణ్యాన్ని పెత్తండ్రి ఇంటిముందర పరచి తృప్తి పడిన అస్తిత్వ చైతన్య స్ఫూర్తి ఆమె జీవితం పొడుగునా భిన్నరూపాలలో ఆవిష్కృతం అయ్యాయి.భయపడకుండా నిద్రలేచే ఉదయాల స్వేచ్ఛను, కాలాన్ని తనకిష్టం వచ్చినట్లు వినియోగించుకొనే స్వతంత్రాన్ని పోరాడి సాధించుకొన్నదుర్గ వ్యక్తిత్వ చైతన్యం ఈ నవల అంతటా పరుచుకొని కనిపిస్తుంది.నిజాయితీతో కూడిన ఆత్మవిశ్వాసం, ఏ ఆశాలేకుండా నాదీ అన్న వస్తువు లేకుండా ఒక్కళ్ళే బ్రతకటంలోని కష్టాన్ని కూడా కాలదన్ని ఆశావాహప్రవృత్తిని సాగుచేసుకొన్న స్థైర్యం దుర్గను సానుకూల శక్తి ప్రసారంతో వాతావరణాన్ని సముజ్వలం చేయగల వ్యక్తిగా నిలబెట్టాయి. ఆ వ్యక్తిత్వం నుండి పాఠకులు నేర్చుకోగలిగిన విలువలు ఎన్నో ఉన్నాయి. ( జలంధర, నవలామాలతీయం)
మాలతీ చందూర్ నవలలో కథలు ఎక్కువగా మద్రాసు మహానగరంలో ప్రవర్తిస్తుంటాయి. ఏవో కొన్ని ఆంధ్రదేశంలో ప్రారంభం అయినా ఊళ్ళ పేర్లు ఖచ్చితంగా పేర్కొనబడటం తక్కువే. భూమిపుత్రి నవల సంగతే చూస్తే మా వూరు, మనవూరు, వేరేఊరు ఇలాంటి సూచనలే తప్ప అసలు కథ ప్రవర్తిస్తున్న ఊరేదో ఎక్కడా చెప్పబడకపోవటం గమనించవచ్చు. కథ ప్రవర్తిస్తున్న ఊళ్ళ పేర్లు పేర్కొనబడ్డ సందర్భాలలో కూడా ‘కథ కంచికి’ అన్నట్లు చాలావరకు అవి మద్రాసుకే చేరుతుంటాయి.చంపకం- చెదపురుగులు నవల నుండి వైశాఖి నవల వరకు అనేక నవలలో ఈ ధోరణే కనబడుతుంది. ఇక కథలలో జీవిత గమనం ఉంటుంది కానీ, భౌతిక కాల చలన సంబంధం తక్కువ. దీనికి పూర్తిగా మినహాయింపు ‘హృదయనేత్రి’ నవల.
ఈ నవలలో కథ చీరాలకు నాలుగైదుగంటల రైలు ప్రయాణపు దూరంలో ఉన్న పల్లె టూరులో ప్రారంభమై, చీరాల, బెజవాడ, బందరు, రాజమండ్రి దగ్గరలోని సీతానగరం ఆశ్రమం, ఏలూరు, గుంటూరు, కాశీ, మద్రాస్, పౌనార్ ( వార్ధా కు దగ్గర) ప్రాంతాలలో ప్రవర్తించి చీరాలకు చేరి ముగుస్తుంది. చీరాల పేరాల పనుల నిరాకరణ ఉద్యమం, బెజవాడ కాంగ్రెస్, కాకినాడ కాంగ్రెస్, దండి యాత్ర, సైమన్ కమీషన్ బహిష్కరణ, వ్యక్తిసత్యాగ్రహాలు, దేశ స్వాతంత్య్రం, గాంధీ నౌఖాలీ యాత్ర, గాంధీమరణం వంటి జాతీయోద్యమ ఘటనలను ఇతివృత్తంలో భాగంచేసి కథను నడుపుతూ నక్సల్బరీ ఉద్యమాన్నీ, ఎమర్జన్సీ కాలాన్నీ కూడా కలుపుకొంటూ ఇందిరాగాంధీ హత్య వరకు సమకాలీన రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ ఈ నవలను ముగించింది మాలతీచందూర్. ఆ రకంగా 1921 నుండి 1984 వరకు ఆరుదశాబ్దాల భారతీయ రాజకీయార్థిక పరిణామాలు గోపాలం అనే వ్యక్తిజీవితాన్నిశాసించి పాలించిన విధానాన్ని ఇంకొకరకంగా చెప్పాలంటే గోపాలం అనే వ్యక్తి జీవిత పరిణామాలు, దృక్పధం కేంద్రంగా ఆరుదశాబ్దాల భారతదేశ రాజకీయపరిణామాలను, విలువలను ప్రతిఫలించింది హృదయనేత్రి నవల.( సింగమనేని నారాయణ, నవలా మాలతీయం) మేనత్త రామలక్ష్మమ్మ ఆలోచనలు, బోధనలు,ఆమె భర్త ఆదర్శాలు, ఆచరణ నుండి బాల్యంలోనే పొందిన ఉత్తేజం నడిపిస్తే జాతీయోద్యమరాజకీయాలలోకి నడిచివెళ్లిన వ్యక్తి గోపాలరావు. గాంధీ నాయకత్వాన్ని నమ్మి నడిచిన వ్యక్తి. దేశ మాత స్వేఛ్చ కోసమైన తపన, దేశీయుల స్వాతంత్య్రం కోసమైన ఆరాటం ఇంట్లో తల్లిదండ్రులతో , భార్యతో తన సుఖసంతోషాలు తనవిగా బతికెయ్యకుండా అతని జీవితామార్గాన్ని నిర్దేశించాయి. ఫలితం అరెస్టులు, జైలుజీవితం. అతని ఆదర్శం కుటుంబం కోణంనుండి బాధ్యతారాహిత్యంగా అనిపించింది. స్వాతంత్య్రం వచ్చాక స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇస్తున్న భూమిని నిరాకరించటం అయినా, ఎన్నికలలో నిలబడి అధికారం సంపాదించటానికి విముఖత చూపటం అయినా అవకాశాలను అంది పుచ్చుకోలేని అసమర్ధతగా నిందకు గురి అయ్యాయి.
మాలతీ చందూర్ రచయితగా జాతీయతను ఎలా నిర్వచించిందీ అన్నది ప్రశ్న. ఈ నవల ప్రధానంగా గోపాలరావు అనుభవాల కథనమే అయినా ఇందులో జాతీయోద్యమానికి బలమైన ప్రాతినిధ్య పాత్ర రామలక్ష్మమ్మ మాత్రమే. ఆమె ప్రభావం, మార్గదర్శకత్వం లేకపోతే గోపాలం లేడు. అందువల్ల జాతీయత గురించిన రచయిత్రి ఆదర్శాన్ని ఆమె మాటల నుండి, ఆచరణ నుండే వెతుక్కోవాలి. ‘స్వరాజ్యం తోనే స్వేఛ్చ, స్వాతంత్య్రం. కుల మత లింగ అసమానతలు లేని సమాజం. స్వరాజ్యం వస్తే మనదేశాన్ని మనం పాలించుకోవచ్చు. ప్రజలందరికీ తిండీ బట్ట వుంటుంది. దరిద్రం వుండదు . పిల్లలు స్వేఛ్ఛగా, ధైర్యంగా పెరగవచ్చు. ప్రతివాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా బతకగలగాలి’. ఈ విధమైన రామలక్ష్మమ్మ భావాలలో ఒక జాతిని ఐక్యం చేసి నిలబెట్టే మౌలిక అంశాలు ఉన్నాయి. ఇవి ఒంటబట్టిన వ్యక్తిత్వం వల్లనే గోపాలం కుటుంబంలో ఇమడలేకపోయాడు. గాంధీ ఏ హిందూ ముస్లిమ్ ఐక్యతనయితే ఆకాంక్షించాడో ఆ హిందూ ముస్లిం విభజనతోనే స్వాతంత్య్రం రావటం, మనదేశాన్ని మనం పాలించుకోటం అన్నది డబ్బున్న వాళ్ళు, డబ్బును ఖర్చుపెట్టగలిగినవాళ్లు అధికారాన్ని సంపాదించి అందలాలు ఎక్కటంగా స్వసుఖం, స్వప్రయోజనం చూసుకొనటంగా ఆచరణలోకి పరివర్తన చెందటం చూసాడు కనుకనే గోపాలం స్వాతంత్య్రంతో సంతోషం పొందలేకపోయాడు. అధికారంలో భాగం పొందటానికి అంగీకరించ లేకపోయాడు. అధికారదాస్యం, సంప్రదాయ బానిసత్వం పుట్టకీళ్లు కాస్తయినా కదలబారకపోవటం గమనించి మౌనంలోకి జారిపోయాడు.
1947 లో స్వాతంత్య్రం వచ్చేనాటికి గోపాలం కొడుకు శ్రీనివాస్ పన్నెండు పదమూడేళ్ళవాడు. అంటే1935 నాటికి పుట్టి ఉంటాడు. అతను బిఎ పాసయిన ప్రస్తావన వుంది నవలలో. ఐదేళ్లకు చదువు మొదలైతే బిఎ పూర్తిచేయటానికి 15 లేదా 16 ఏళ్ల కాలం పడుతుంది కనుక 1955 నాటికీ 20 ఏళ్ళ వయసులో అతని చదువు పూర్తయి ఉంటుంది. అతను పై చదువుకూపోలేదు, ఉద్యోగమూ చూసుకోలేదు. ఎక్కెడెక్కడికో వెళతాడు.. ఎప్పుడో వచ్చిపోతుంటాడు. అసలు కనిపించకుండానే పోయాడు. కొన్ని రోజులకు ‘ఆశయసిద్ధి కోసం పోరాడుతున్నాను. నా కోసం వెతకవద్దు’ అని ఒక ఉత్తరం వ్రాసాడు. అప్పుడు భార్య సాధింపులు, ఎత్తిపొడుపులు భరించలేక వూరు వదిలి వార్ధా దగ్గరి వినోబా ఆశ్రమం ప్రెస్ లో పని చేస్తున్న గోపాలం మళ్ళీ మూడేళ్లకు భార్య సీరియస్ అన్న టెలిగ్రామ్ వల్ల ఇంటికి తిరిగివచ్చాడు.వచ్చేటప్పటికి శ్రీనివాస్ ఉత్తరం వుంది. అతను తమ మీద పెట్టిన మనుమరాలి పెంపకపు బాధ్యత ఉంది. స్వరాజ్యంతో పాటు సమానత్వం రాలేదని ప్రతివ్యక్తికీ ఓటువున్న దేశంలో ప్రతిమనిషి కడుపునిండాతిని ఒంటినిండా బట్టకట్టే పరిస్థితి లేదని, దేశమంతటా లక్షలాది అన్నార్తుల ఆకలి, శ్రామికుల హాహాకారాలు ఆవేదన కలిగిస్తున్నాయని ఆర్ధిక అసమానతను వర్గపోరాటంతో తప్ప, ప్రణాళికలతో జయించలేమని అందుకు తాను తుపాకీని ఆయుధంగా ఎన్నుకున్నానని – తన సహచరి కూడా తనతోపాటే ఆ మార్గంలోనే ప్రయాణి స్తున్నదని,చెప్తూ తమకూతురిని పెంచి పెద్దచేయమని కోరుతూ వ్రాసిన ఉత్తరం అది.
1956 , 1957 ప్రాంతాలలో అతను ఇల్లువదిలి వెళ్లి సాయుధపోరాట మార్గంలో ప్రయాణం ప్రారంభించా డన్నమాట. 1947 స్వాతంత్య్రంతో తెలంగాణాలో సాయుధరైతాంగ పోరాట విరమణ జరిగిన తరువాత ఆంధ్రాలో కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొన్న సంక్షోభంనుండి శ్రీకాకుళ గిరిజన ప్రాంతాలలో ప్రజా పునాదిని విస్తరించుకొంటూ సాగిన విప్లవోద్యమ పాయతో కలిసి చేసిన ప్రయాణమే కావాలి అది. అయితే అతను ఏ ఉద్యమంలోనైతే భాగస్వామిగా ఉన్నాడో, 1967 నాటి దాని ఉధృతి, పరిణామాలు నక్సల్బరీ ఆవిష్కరణ ఇవేవి ఈ నవలలో ప్రస్తావనకు కూడా రాలేదు.
అంతర్గత ఆధారాలనుబట్టి శ్రీనివాస్ బిడ్డ స్వరాజ్యం 1960లో పుట్టింది అనుకోవచ్చు.తాత పత్రికా ఉద్యోగం రీత్యా ఆమె పెరిగింది మద్రాసులో . ఇందిరాగాంధీ మరణం ప్రస్తావన ను బట్టి నవల ముగిసేసరికి ఆమె 24 ఏళ్ల యువతి. ఎమ్ఏ పూర్తిచేసి సోషల్ వర్క్ లో డిప్లొమా చేసిన అమ్మాయి. ఆమె చైతన్య స్థాయి ఏమిటి? పెళ్ళిచూపుల , కట్నాల పెళ్ళిళ్లు అంటే మండిపడటం. ఆడదానికి పెళ్లే జీవితపరమార్ధం కాదని చెప్పగల తెగువ చూపటం. అన్యాయాన్ని ప్రతిఘటించగల చేవ ఉండటం. తాతను ప్రభావితం చేసిన రామలక్ష్మమ్మ ను అయితే ఆమె చూడలేదుగానీ జానకమ్మను చూసింది మాట్లాడింది. రామలక్ష్మమ్మ మేనల్లుడికి ఇయ్యమని చెప్పిన ఆమె ఇంటి కాగితాలను, తనదగ్గర ఉన్న పదివేల రూపాయలను గోపాలానికి అప్పచెబుతూ ఏదైనా మంచిపనికి వాడమని జానకమ్మ చెప్పిన మాటను బట్టుకొని తన జీవితానికి గమ్యం రాముడత్తయ్య ఇంట్లో వృద్ధులకు హోమ్ నడపటమే అన్న నిర్ణయానికి స్వరాజ్యం రావటంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో జానకమ్మ జాతీయోద్యమంలో పనిచేసిన దువ్వూరి సుబ్బమ్మ నమూనా గా కనిపిస్తుంది. జుట్టు తీసివేయబడిన బాల వితంతువు కావటం, గాంధీ బోధనలతో కాంగ్రెస్ అభిమాని కావటం, నెత్తిన ఖద్దరు బట్టల మూటలు మోసుకెళ్లి అమ్మటం, వర్ణభేదమెరుగని లోకబాంధవి కావటం, స్వరాజ్యనిధికి తన నగలు ఇయ్యటం, సహాయనిరాకరణ ఉద్యమంలో జైలుకు వెళ్ళటం, కాకినాడ కాంగ్రెస్ సభ (1923)కు వెళ్లిరావటం ఇలాంటివన్నీసుబ్బమ్మను దృష్టిలో పెట్టుకొనే జానకమ్మ పాత్ర తీర్చి దిద్దబడిందని అనుకొనటానికి అవకాశం ఇస్తున్నాయి. ఏమైనా సంప్రదాయ శృంఖలాలను తెంచుకొని, కుటుంబపు హద్దులను దాటి స్త్రీలు సృజనాత్మకంగా భాగస్వాములు కావటానికి జాతీయోద్యమం గొప్ప అవకాశాలను కల్పించిందన్నది వాస్తవం. వంశ వారసులైన పిల్లల్ని కనటానికి, పెంచటానికి, ఇంటిపనికి పరిమితమైన స్త్రీల జీవితాన్ని సామాజికీయ ఆర్ధిక రాజకీయ విషయాలలో తమవైన ఆలోచనలతో అభిప్రాయాలతో, నిబద్ధతతో పని చేయగల ఉన్నతికి పరిణమింప చేయటంలోనూ స్వతంత్ర వ్యక్తులుగా సామాజిక గౌరవానికి పాత్రులు అయ్యేట్లు చేయటంలోనూ జాతీయోద్యమం ఎంత చేసిందో దానిని సూచించటానికే ఆ చరిత్రకు బలమైన ప్రతినిధులుగా రామలక్ష్మమ్మ, జానకమ్మ పాత్రలను సృష్టించింది మాలతీచందూర్. వాళ్లకు రెండవ తరం స్త్రీ స్వరాజ్యం అంతకంటే చైతన్యవంతమైన, అభివృద్ధికరమైన రాజకీయార్థిక దృక్పథంతో కార్యాచరణ రంగాన్ని ఎన్నుకోవాల్సి ఉండగా ఆమె ఓల్డేజ్ హోమ్ నడపటానికి పరిమితం కావటమే పెద్ద జీవితగమ్యం అన్నట్లుగా నవలను ముగించటం చిత్రంగానే ఉంది.
భాషారాష్ట్ర ఉద్యమాలు, తెలంగాణప్రత్యేక రాష్ట్రఉద్యమం, పార్లమెంటరీ డబ్బు రాజ కీయాలు, రాజకీయనాయకుల, ఉద్యోగవర్గాల అవినీతి, లంచగొండితనం, ప్రయివేటు విద్యాలయా లపై పెరిగిన మోజు మొదలైన విషయాలమీద ఆలోచనలు, చర్చలు అడపాదడపా ఈ నవలలో కనబడతాయి కానీ ఆ భావాల ప్రభావం తత్ఫలితమైన సంఘర్షణ స్వరాజ్యంలో కనబడవు. శ్రీనివాస్ లాంటి యువకుల అసంతృప్తులు, ఆకాంక్షలు ఏ విప్లవోద్యమ నిర్మాణంగా పరివర్తన చెందిందో దాని ప్రభావాలు గానీ, ఆర్ధిక అసమానతలకు సమాంతరంగా సమాజంలో సంక్షోభానికి కారణమవుతున్న దళిత మహిళా సమస్యలు , ఉద్యమ చైతన్యాలు గానీ ఏవీ స్వరాజ్యం వరకు రాకపోవటం ఎందువల్ల ? 1975 తరువాత అంతర్జాతీయ మహిళా దశకం లో రూపొందుతున్న ఆధునికానంతర కాలపు మహిళకు స్వరాజ్యం ఎందుకు ప్రతినిధి కాలేకపోయింది? రచయిత్రి దృక్పథ పరిమితులే అందుకు కారణం అనుకోవాలేమో !?
హృదయనేత్రి నవల లాగానే శతాబ్ది సూరీడు నవలలో కూడా ఇతివృత్తం సుదీర్ఘకాలం మీద విస్తరించినదే. ఇందులో కాలవ్యవధి వంద సంవత్సరాలు. 20వ శతాబ్ది ప్రారంభంలో పుట్టిన సూరమ్మ శతాబ్ది చివరలో పై చదువులకు అమెరికా వెళ్లిన సౌజన్య కు మధ్య మరొక రెండు తరాల స్త్రీలు .. మొత్తం నాలుగు తరాల స్త్రీల జీవిత పరిణామాల కథనం ఈ నవల. ఒకే కుటుంబానికి చెందిన నాలుగుతరాల స్త్రీలు. బాలవితంతువు సూరమ్మ, ఆమె పెంచుకున్న కమల , కమల కన్న కూతురు పద్మ ,ఆమె కూతురు సౌజన్య .. ఆ వందసంవత్సరాల సామాజిక మార్పులు, ఘటనలు , దేశ చరిత్ర వేటి సంబంధం గానీ, ప్రభావం కానీ పైకి కనిపించని కుటుంబ కథ ఇది. ఈ నవలలో మాలతీ చందూర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సూరమ్మ జీవితం ద్వారా ఇరవయ్యవ శతాబ్ది తొలి పాదంలో బాలవింతంతువుల జీవన స్థితిగతులను, వాళ్ళు పడే ఒంటరి హింసను, అందరి అవ సరాలకు వెట్టి చాకిరిచేస్తూ గడపాల్సిన జీవితాన్ని చూపించింది. ప్రసవంలో చనిపోయిన అక్కకూతురు కన్న ఆడపిల్ల ఎవ్వరికీ పట్టనిదయితే ఆ పురిటికందును చేరదీసి సూరమ్మ తన మాతృత్వ ప్రేరణను సఫలం చేసుకొన సిద్ధపడటం దగ్గర మొదలైన కమల జీవితం ద్వారా ఇరవయ్యవ శతాబ్ది రెండవపాదంలో చదువుకన్నా ఆడదానికి అనివార్యమైన పెళ్లి, ఎంత అసమర్థుడైనా, దుర్మార్గుడైనా భర్త కావటం వల్ల మగవాడికి భార్యమీద లభించే అధికార ఆధిపత్యాలు, తత్ఫలితమైన హింస – వాటినుండి విముక్తికై ఆరాటపడే వ్యక్తిత్వాల నిర్మాణం జరుగుతుండటం ఆర్ధిక స్వావలంబన ద్వారా సమస్యను పరిష్కరించుకొనేదిశగా పరిణామం చిత్రించబడ్డాయి. అటువంటి తల్లికి కూతురైన పద్మ జీవితంద్వారా ఇరవయ్యవ శతాబ్ది మూడవ పాదంలో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు, సమానత్వ విలువల ప్రాతిపదికగా దాంపత్య జీవితాలను నిర్మించుకొనటానికి కలిసివచ్చిన అవకాశాలను చూపించింది రచయిత్రి ఇక 1975 తరువాత తరం, సౌజన్య తరం ప్రపంచీకరణ సందర్భంలోకి విస్తరిస్తున్న తరం. సూరమ్మ జీవితంకంటే కమల జీవితం కొంత విశాలమైంది కానీ ఉన్నవూరు దాటకుండానే ఆమె జీవితం కూడా గడిచింది. పద్మ చదువుకోసం ఊరుదాటి విశాఖవెళ్ళింది. ఆమె కూతురు అమెరికాకే ప్రయాణం అయింది. ఇది క్రమాభివృద్ధి కనుక స్త్రీల జీవితంలో సామాజిక ఆర్ధిక రాజకీయ పరిణామాలకు అనుకూలదిశగా మార్పులు మొదలైనాయి అనుకోవాలి. వ్యతిరేక పరిస్థితులలో జీవిస్తూ కూడా బ్రతకటానికి, బ్రతికించటానికి సూరమ్మ వంటి స్త్రీల అమాయకమూ, ఆర్ద్రమూ అయిన కార్యోత్సాహమే ఒక స్ఫూర్తిగా తరతరాలకు అందివస్తున్నదన్న సూచన ఈ నవల ఆద్యంతాలలోను కనిపిస్తుంది.
ఇట్లా స్వతంత్ర నవలలు వ్రాయటమే కాదు, స్వాతి పత్రికలో పాతకెరటాలు శీర్షిక కింద ఇంగ్లీషు నవలలను మూడువందల యాభై వరకు పరిచయం చేసింది మాలతీ చందూర్. అవి లోగడ అదే పాతకెరటాలు అనే పేరుతో ప్రచురించబడ్డాయి.160 దేశవిదేశీ భాషా నవలల పరిచయాలు నవలామంజరి శీర్షికతో ఆరు సంకలనాలుగా ఇప్పుడు లభిస్తున్నాయి. ప్రపంచ నవలా సాహిత్యాన్ని తెలుగుపాఠకులకు అంత సరళ సుందరంగా పరిచయం చేసిన మాలతీచందూర్ కృషి అనన్య సామాన్యం.
*****

డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.