బలమైన కుటుంబం
-అనసూయ కన్నెగంటి
అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి మూడు పిల్లల్ని పెట్టింది. వాటిలో ఒకటి కాస్తంత బలంగా ఉండేది. మిగతా రెండు పిల్లులూ బలహీనంగా ఉండేవి . అయితే తల్లి పిల్లి తన పిల్లల్ని వెంటేసుకుని ఇల్లిల్లూ తిరుగుతూ ఆహారం ఎలా సంపాదించుకోవాలో పిల్లలకు నేర్పటం మొదలు పెట్టింది.
సహజంగానే బలమైన పిల్లి పిల్ల వేగంగా పరిగెత్తుతూ ఎప్పుడూ తల్లి వెనకే ఉండేది. దాంతో దానికి తల్లి పట్టిన ఆహారంలో ఎక్కువ భాగం దొరికేది. దాంతో అది మరింత బలంగా తయారయ్యింది. అది గమనించింది తల్లి పిల్లి.
బాగా ఆలోచించింది .ఇలాగే కొనసాగితే మిగతా పిల్లలిద్దరూ అలా బలహీనంగానే ఉండిపోతారు. ఏదో ఒకనాడు ఏ పాల దొంగతనంలోనో యజమానికి దొరికిపోయి చావు దెబ్బలు తింటారు. అదెంత బాధ తనకు? కాబట్టి వాళ్లిద్దర్నీ కూడా బలంగా చెయ్యాల్సిన అవసరం ఉంది. కనుక ఏంచెయ్యాలి? అని ఆలోచించింది. ఎంతగా ఆలోచించినా దానికి ఏ ఉపాయమూ తట్టలేదు.
చివరికి ..
“ ఎలాగూ పెద్దయ్యాకా, వాళ్ల తిండి వాళ్ళు సంపాదించుకునే శక్తి వచ్చాకా పిల్లలందర్నీ ఎవరి బతుకు వాళ్లని బతకమని తనే చెప్పేస్తుంది. అదేదో పెద్ద పిల్లని ఒక్కదాన్నీ అయిదారు రోజులపాటు తన కూడా రమ్మని ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పేసి ఇప్పుడే దాని బతుకు దానిని బతకమని చెప్పేస్తే? అప్పుడు తీరికగా మిగతా రెండింటికీ కాస్తంత బలం పెరిగెటట్టు చెయ్యచ్చు కదా!” అనుకుంది.
కానీ ఎందుకో తన ఆలోచన తనకే నచ్చలేదు. అలా పెద్దదాన్ని పంపేస్తే దానికి మిగతా పిల్లల పట్ల ప్రేమ లేకుండా పోతుంది. చిన్న పిల్లలిద్దరూ వాళ్ల అక్క ప్రేమను కోల్పోతారు. పైగా దాని తిండి అది సంపాదించుకోవటం కొద్ది రోజుల్లోనే నేర్చేసుకుంటుందని ఎలా చెప్పగలం? అంతే కాదు అది నేర్చుకున్నన్ని రోజులూ చిన్న పిల్లలిద్దరికీ తిండి ఎలాగా? అందుకని ఇలా చెయ్యటం సరైనది కాదు అనుకుంది.
ఆలోచించింది. ఆలోచించింది. ఎన్నో ఆలోచనలు చేసింది. చివరికి ఏ ఆలోచనా నచ్చక తన స్నేహితురాలిని సలహా అడిగింది. అంతా విన్న పిల్లి స్నేహితురాలు బాగా ఆలోచించి..ఇలా చెప్పింది.
“ అందరూ నీ పిల్లలే. దాపరికం ఎందుకు? పిల్లలు ముగ్గుర్నీ కూర్చోబెట్టి నీ మనసులోని మాట వాటితో చెప్పెయ్. చెప్పేసి..ఏం చెయ్యాలో వాళ్లనే సలహా అడుగు. సమాధానం వాళ్లతోనే చెప్పించు. మనం తల్లులం. ఒకరికి మంచి చెయ్యాలని చూస్తున్నామని మిగతా వాళ్లకు అనిపించకూడదు. అవి మరిన్ని గొడవలకు దారి తీస్తాయి.“ అంది.
నిజమేననుకుంది పెద్ద పిల్లి. దాంతో ఒకరోజు పిల్లలందర్నీ ఒక ఖాళీ ఇంట్లో కాసేపు కదలకుండా కూర్చోమని చెప్పి..పెద్ద పిల్లితో ఇలా అంది.
“ రోజులు బాగా లేవు. వీధుల్లో కుక్కలు బాగా పెరిగిపోయాయి. పైగా ఇదిద వరకటిలా పాలు కూడా దొరకటం లేదు. మనకు పాలు దొరక్కుండా చెయ్యాలని యజమానులు ద్వారబంధాలకు, గుమ్మాలకూ, తలుపులకూ సంచులు వేల్లాడదీసే కుట్రలు చేస్తున్నారు. కాబట్టి తింది కొరత చాలా ఉంది మనకు. దానికి తోడు చెల్లెళ్ళు ఇద్దరూ చాలా బలహీనంగా ఉన్నారు. వాళ్లిద్దర్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరిదే. మన దృష్టి మన ఆహారమైన ఎలుకల మీద ఎలా ఉంటుందో కుక్కలకి వాటి ఆహారమైన మనమీద అలానే ఉంటుంది. చెల్లెళ్ళు బలహీనంగా ఉన్నారని, పెరిగెత్త లేకపోతున్నారని కుక్కలు గమనిస్తే తరుముతాయి. ఒకటి రెండుసార్లు పరిగెత్తి పారిపోవటానికే వాటి బలం సరిపోతుంది. అంతే. కాబట్టి వాళ్లని కూడా మనలాగా బలంగా తయారు చెయ్యాలి. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు.నువ్వు బలవంతురాలివే. నీ గురించి నాకు బెంగలేదు. వాళ్ళిద్దరి గురించే నా బెంగంతా. అలా అని ఆహారాన్ని తెచ్చి నీకు పెట్టకుండా ఆ రెండింటికే పెట్తలేను. “ అంది బాధగా..
తల్లి తమ గురించి అలా మట్లాడుతూ ఉండేసరికి చిన్న పిల్లలిద్దరూ “ మ్యావ్ మ్యావ్ ” అని గారంగా అరుస్తూ తల్లి పక్కన చేరి ఒదిగి పడుకున్నాయి.
అది చూసి పెద్ద పిల్లిపిల్ల ఇలా అంది..
“ అమ్మా..! నువ్వు చెప్పింది నిజమే. నేను చెల్లేళ్ల గురించి ఆలోచించలేదు. నీ కూడానే ఉంటూ ఎక్కువ ఆహారాన్ని నేనే తినేసేదాన్ని. నువ్వెప్పుడూ నన్ను అలా తినద్దని కూడా అనలేదు. అది నీ అమ్మ మనసు. చెల్లెళ్ళ గురించి నువ్వేం దిగులు పడకు. నువ్వు వాళ్ల దగ్గర కాపలా ఉండు ఏ కుక్కలకూ ఆహారం కాకుండా. నేను వెళ్ళి అందరికీ ఆహారం సంపాదించి తెస్తాను. ఒకవేళ నన్ను ఎవ్వరైనా చంపేసినా నువ్వు చెల్లెళ్ళకు అండగా ఉండచ్చు. ఇద్దరం బయటికి వెళితే చెల్లెళ్లకు రక్షణ ఉండదు. అందుకని “ అంది.
అది విన్న తల్లి పిల్లికి మనసంతా ఒకలా అయిపోయింది.
గొల్లున ఏడ్చేసి “ వద్దమ్మా వద్దు. వీళ్లిద్దర్నీ బలంగా చెయ్యాలనే నా ఆలోచన. అంతేతప్ప నిన్ను పోగొట్టుకోవాలని కాదు. అసలు నువ్వు ఎక్కడికీ వెళ్లద్దు. నువ్వే చెల్లెళ్లకు కాపలా ఉండు . నేను వెళ్ళి మీ ముగ్గురికీ ఆహారాన్ని తెస్తాను “ అంది తల్లిపిల్లి లేవబోతూ..
“ అది కాదమ్మా! చెల్లెళ్ళు ఇద్దరితో పోలిస్తే నేను కొంచెం బలవంతురాలను. నీ వెనకే ఉండి మెలకువలూ నేర్చుకున్నాను. కాబట్టి కొద్దో గొప్పో ఆహారాన్ని సంపాదించగలను. ఆ సంపాదించుకోవటంలోనే మరింతగా ఆహారాన్ని ఎలా సంపాదించాలో నేర్చుకోగలుగుతాను. అంతే కాదు ..మమ్మల్ని ఇక్కడ ఉంచి మా ఆహారం కోసం బయటికి వెళ్ళిన నీకు ఏదైనా అయితే? అప్పుడు మాకు ఎవరు దిక్కు? అందుకని నేను వెళ్లటమే సబబు. ఒకవేళ నాకు ఏదైనా అయితే నీకు ఇద్దరు పిల్లలు ఉంటారు. నీకు ఏదైనా అయితే మా ముగ్గురికీ అమ్మ ఉండదు కదా” అంది
దాంతో మరింత గట్టిగా ఏడ్చేసిన తల్లిపిల్లి..
పెద్ద పిల్లని దగ్గరకు రమ్మని..ముగ్గుర్నీ మరింత దగ్గరగా లాక్కుని..
“ ఇంత చిన్న వయసులో ఎంత బాగా ఆలోచించావమ్మా! చెల్లెళ్ల బలహీనత మాట ఎలా ఉన్నా మనది బలమైన కుటుంబం అని నిరూపించావు. నేను, నువ్వూ ఎవ్వరం వెళ్లద్దు. వెళితే అందరం వెళదాం. కలిసే తిందాం..కలిసే ఉందాం..చెల్లెళ్ల కోసం నిన్ను పోగొట్టుకోలేనమ్మా..” అంది కళ్లనీళ్లు పెట్టుకుంటూనే స్నేహితురాలికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ.
“ సరేనమ్మా..” అంది పెద్ద పిల్లిపిల్ల చెల్లెళ్ళ తల మీద చెయ్యేసి నిమురుతూ.
ఆ మర్నాటి నుండి..దొరికిన ఆహారాన్ని నలుగురూ పంచుకుంటూ హాయిగా తిరగసాగాయి.
*****
కన్నెగంటి అనసూయ 1962 డిశంబర్ 1 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామంలో పుట్టారు. బి.కామ్., బి.ఎల్.ఐ.ఎస్.సి ., ఎం.కామ్ , ఎమ్మె పాలిటిక్స్ , చదివి కంప్యూటర్ కోర్సులు చేశారు .. ఇప్పటి వరకూ అనేక కధలూ, బాలల కధలూ, కవితలూ, నవలా, వ్యాసాలూ వ్రాసారు. 2009 లో “మానస స్వచ్ఛంద సేవా సంస్ధను స్థాపించి రక్తదాన శిబిరాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బాలలకు బాల్యంకరువైపోయిందని బాధపడే కన్నెగంటి అనసూయ భవిష్యత్ కార్యక్రమంగా అనేక బాల సాహిత్య కదా కార్యశాలలు ఏర్పాటు చేసి బాల కథారచయిత్రులనూ, బాల సాహితీవేత్తలనూ, బాలలే బాలల కధలు వ్రాసేలా కృషి చేయదలచుకున్నారు