బాలానందం (క‌థ‌)

                                                                – విజయ దుర్గ తాడినాడ

“బాలూ! నీ స్టాపు వచ్చింది. దిగు” అంటూ స్కూల్ బస్సు క్లీనర్ అరుపుకి ఉదాసీనంగా తల తిప్పి చూశాడు బాలు. ఆ చూపులో బస్సు దిగి ఇంటికి వెళ్ళాలన్న ఉత్సాహం, ఆనందం ఏమాత్రం కనబడట్లేదు. ఎందుకో పొద్దున్నుండి అలాగే ఉన్నాడు స్కూల్లో కూడా. 

బాలు నాలుగో తరగతి చదువుతున్నాడు. చదువులోనూ, ఆటపాటల్లోనూ ముందుంటాడు. సాయంత్రం మూడింటికి ఇంటికొచ్చిన తర్వాత, ఐదింటికి టెన్నిస్, ఆరింటికి సంగీతం క్లాసులకి వెళ్లి, ఏడింటికి ఇంటికి తిరిగొచ్చి, స్కూల్లో ఇచ్చిన హోం వర్క్ అంతా ముగించుకోవటం, తాతగారితో చదరంగం ఆడటం, బామ్మతో పిచ్చాపాటి మాట్లాడటం ఇత్యాదులన్నీ బాలు దినచర్యలో భాగాలు. అయినా ఏమాత్రం అలసట, నీరసం అతని మొహం లో తొంగి చూడవు.

కానీ ఈరోజు అన్యమనస్కంగానే బస్సు దిగి ఇంటిముఖం పట్టాడు. నాలుగడుగులేసేసరికి ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చింది. వాళ్ళ ఇంటి వీది మొదట్లో ఉన్న శివాలయం అరుగుల మీద చతికిలబడ్డాడు. కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి. మధ్యాహ్నం లంచ్ కూడా చెయ్యలేదు. టిఫిన్ బాక్స్ తెరిచాడు. చల్లారిపోయి, గట్టిబడిపోయిన పప్పన్నం ….తినాలనిపించలేదు. స్నాక్స్ బాక్స్ తెరిచాడు. రెండు బిస్కట్లు, ఒక వేఫర్ ఉన్నాయి. వేఫర్ తిన్నాడు. చాలాసేపటినుండి ఏమీ తినకపోవటం వల్ల కడుపులో తిప్పినట్లయింది. గోడకి చేరగిల బడి కూర్చున్నాడు. అమ్మ గుర్తొచ్చింది. ఏడుపొచ్చింది. రోజూ బస్సు దిగీదిగగానే రయ్యిన ఇంటికి పరిగెత్తే తను ఈరోజు ఇంకా ఇంటికి రాకపోతే అమ్మ ఏడుస్తుందేమో అనిపించింది ఒక్క క్షణం. కళ్ళలోనుండి నీళ్ళు జలజలా రాలాయి. కానీ మరుక్షణంలోనే కళ్ళు తుడుచుకున్నాడు. ‘పోనిలే ఏమీ కాదులే ఏడిస్తే. నన్ను కొట్టిందిగా పొద్దున. ఇంకా నేను అక్కర్లేదు అమ్మకి. నేను ఇంకా ఇంటికి వెళ్ళను. అంతే’ అని తీర్మానించుకున్నాడు.

పొద్దున జరిగిన సంఘటన కళ్ళ ముందు తిరిగింది గిర్రున……..

********************************

“బాలూ! ఎంతసేపురా బాత్రూంలో, నాన్నకి లేట్ అవుతోంది, త్వరగా రా!” 

అమ్మ ఆర్డర్ విని కూడా అంగుళం ఐనా చలించలేదు బాలు. మూతవేసిన కమోడ్ మీద నిక్కర్ తోనే కూర్చొని దీర్ఘాలోచనలో పడిపోయాడు. 

‘ఎలా అడగాలి అమ్మని?’  

ఎలా ఐనా సరే అడగాల్సిందే. 

‘పోనీ నాన్నని అడిగితే!!??’ ‘ఊహూ! ప్రయోజనం లేదు. అమ్మే బెటర్’

“బాలూ! బైటకి రారా” ..ఈసారి నాన్న గొంతు. 

ఇక తప్పదు రావాల్సిందే …..గబగబా షవర్ కింద రెండు నిముషాలు నిలబడి, బైటకొచ్చేశాడు. 

టవల్ తోనే వంటింట్లోకి పరుగెత్తి, బాడ్మింటన్ ఆడుతున్నట్టుగా ఒకచేత్తో అట్లకాడని, మరోచేత్తో ప్లేట్ ని పట్టుకొని చకచకా దోశెలు వేసి, తీస్తున్న అమ్మని చూసి, ‘ఏంటమ్మా సింధు అక్కవైపోతున్నావా?’ అంటూ జోకులు వేసి నవ్వించాడు. అమ్మ నవ్వుతూనే బాలు ని దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. ‘వెళ్లి త్వరగా యూనిఫాం వేసుకుని, తల దువ్వుకుని రా, నీకిష్టమైన దోశెలు పల్లీ చట్నీతో తిందువుగానీ’ అంటూ కంప్లాన్ కప్ చేతికిచ్చి, తన పనిలో నిమగ్నమైపోయింది. అయినా అక్కడనుండి కదలకుండా, “అమ్మా! మరేమో, మరేమో, నాకూ….నాకూ….” అంటూ సణుగుతున్న బాలు ని చూసి  ‘ఏమికావాలి నాన్నా!’ అంటూ లాలనగా అడిగేసరికి కొండంత ధైర్యం వచ్చేసింది బాలుకి. “అమ్మా! నాక్కూడా ఎగిరే హెలికాప్టర్ కావాలి. చందూగాడు నిన్న స్కూల్ కి తెచ్చి చాలా పోజులు కొట్టాడమ్మా. అది కాదమ్మా, అసలు పొద్దున ఫష్టు ఫష్టు క్లాసులోకి వస్తున్నప్పుడే ఫేసు ప్రభాసు లా పెట్టుకుని వచ్చాడమ్మా. నాకు అప్పుడే డౌటు వచ్చేసింది…విడేదో తెస్తున్నాడని. అయినా నేను తలొంచుకుని డ్రాయింగ్ చేసుకుంటున్నానమ్మా. రాహుల్ గాడేమో…’రా నా, రా నా పక్కాన కుచ్చో’ అంటూ వాడికి ప్లేసు ఇచ్చాడమ్మా, అయినా వాడి పక్కన కూచోకుండా నా పక్కన వచ్చి కూచున్నాడు. నా దగ్గర పోజులు కొట్టలేదులే. నేను వాడి బెష్టు ఫ్రెండ్ ని కదా, అందుకే. నాకైతే ఒకసారి ఎగరెయ్యమని ఇచ్చాడు కూడా. ఇంకెవరికీ ముట్టుకోవడానికి కూడా ఇవ్వలేదు తెలుసా! నన్ను కూడా కొనుక్కోమని చెప్పాడు. బిగ్ బజార్ లో దొరుకుతున్నైటమ్మా! ఈరోజు మనిద్దరం వెళ్లి తెచ్చుకుందాం. ప్లీజ్” అనడుగుతున్న కొడుకుని చూసి రజిత నవ్వేసింది. 

ఆ నవ్వులో ఎంతో నిర్లక్ష్యం, వెటకారం, చిన్నచూపు ధ్వనించాయి ఆ చిట్టి బుర్రకి. పంతం పెరిగింది. “ఏమైనా సరే ఇవ్వాళ కొనాల్సిందే, లేకపోతే బడికెళ్ళను” అని అల్టిమేటం జారీచేసి, బెడ్ రూమ్ లోకి వచ్చేశాడు. మంచంమీద బోర్లపడుకున్నాడు. ఇంతలో నాన్న తయారవడం, టిఫిన్ తినేసి ఆఫీసుకు వెళ్ళిపోవటం జరిగిపోయినై. అన్నీ గమనిస్తూనే ఉన్నాడు కానీ మంచం మీదనుంచి లేవలేదు, ఒంటికి కట్టిన టవల్ తియ్యనూ లేదు. 

నాన్న వెళ్ళిన తర్వాతగానీ రజితకు బాలు గుర్తుకు రాలేదు. 

ఆ క్షణాన…..

ఒక్క ఉదుటున బెడ్ రూమ్ లోకి దూసుకు రావడం, ‘ఒరేయ్ ఇంకా యూనిఫాం వేసుకోలేదే’ అంటూ గావుకేక లాంటిది పెట్టడం, పిల్లాడ్ని లేపి కుదేసి, వస్త్రాపహరణం చేసేసి, ఏక రూప వస్త్రాలంకరణ చేసెయ్యడం, ఆ నేపథ్యంలో మొండికెత్తి అటూఇటూ లూజు గా ఊగుతున్న బాలుగాడి వీపుమీద ఒక్కటి చరిచి, బెల్ట్, టై కట్టేసి, తల దువ్వేసి, క్రీం పట్టించేసి, బూట్లు తొడిగేసి, బాక్సు, స్నాక్సు బాగ్ లో కుక్కేసి, బాలుగాడిని అప్పుడే వచ్చిన బస్సులోకి నెట్టేసి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం పది నిమిషాల్లో చేసేసింది రజిత ‘మూవ్’ టి.వి.యాడ్ లో ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూపించినట్టు.   

మరుక్షణాన…….

బస్సులో బాలూ….అవమాన భారంతో, ముక్కుపుటాలు అదురుతూండగా, చెవులలోనుంచి ఎర్రటి పొగలు బుసలుకొడుతూ ఉండగా, తల దించుకొని, బస్సులో తనొక్కడే ఉన్నట్టు, నిజానికి ఈ ప్రపంచంలోనే తనొక్కడే బాధలో కూరుకుపోయినట్టు రకరకాల భావాలతో స్కూల్ కి చేరాడు. ఇంతటి అవమాన భారంలో కూడా ఒక్క విషయం అతని దృష్టిని దాటిపోలేదు…బస్సు ఎక్కించిన తర్వాత అమ్మ నవ్వుతూ బంటీ గాడి మమ్మీ తో మాట్లాడటం……అంటే అమ్మకి తన మీదనే కోపం గానీ ఇంకా ఎవరిమీదా కోపం లేదనమాట. తనని కొట్టేసి, ఏడుస్తున్నాడో లేదో కూడా చూడకుండా, సారీ కూడా చెప్పకుండా, హాయిగా నవ్వుతూ ఆంటీతో ఎలా మాట్లాడుతోంది?

ఈక్షణాన………………..

పొద్దున నుండి జరిగిన సంఘటనంతా గుర్తుకొచ్చేసరికి, అమ్మ చేసిన నమ్మకద్రోహం మనసుని పిండేస్తుండగా, అప్రయత్నంగా కళ్ళనుండి నీళ్ళు కారసాగాయి బాలుకి. 

ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో ఒక నల్ల కుక్క అక్కడికి వచ్చి, తనవైపే చూస్తోంది నాలుక బైటపెట్టి. చీకట్లో దాని కళ్ళు ఆకుపచ్చగా మెరుస్తున్నాయి. కాళ్ళలో వణుకు, కళ్ళలో భయం కమ్ముకుంటుండగా …

“అమ్మా!” అంటూ ఒక్క ఉదుటున లేచి పరిగెత్తుకుంటూ ఇంటికి చేరి తల్లిని చుట్టేశాడు.

కొంతసేపటికి తేరుకున్నాక, గుండె దడ ఇంకా తగ్గకపోయినా, నవ్వులు వినిపిస్తుండగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి సిగ్గుపడి బెడ్ రూంలోకి పరిగెత్తి తలుపేసుకున్నాడు. ఇంటినిండా చుట్టాలు. ఈ రోజు రజిత ఆడపడుచు, బాలుకి మేనత్త ఐన ప్రతిమకి నిశ్చయ తాంబూలాలు. అప్పుడు గుర్తొచ్చింది బాలు కి నిన్న అమ్మ చెప్పిన మాట … ‘రేపు ఇంటికి చాలా మంది చుట్టాలొస్తున్నారు, ఫంక్షన్ ఉంది, అల్లరి చేయకుండా, పేచీలు పెట్టకుండా బుద్ధిగా గుడ్ బాయ్ లాగా ఉండాలి సరేనా’.

అందుకే అమ్మ పొద్దున్న కోప్పడింది. 

స్నానం చేసి, బట్టలేసుకుందామని  అల్మారా తలుపు తీసిన బాలూ నోట మాట లేకుండా కొన్ని క్షణాలు, సంభ్రమాశ్చర్యాలతో మరికొన్ని క్షణాలు నిలబడిపోయి, వచ్చే అరుపుని ఆపుకోవడానికి నోట్లో గుప్పిటని కుక్కుకుంటూ, నిశ్శబ్దంగా గంతులేస్తూ, ఊడి పోతున్న టవల్ ని మళ్ళీమళ్ళీ కట్టుకుంటూ, లోపల డ్రాయర్ లేదని తెలిసికూడా ఊడిన టవల్ తోనే ‘లుంగీ డాన్స్ లుంగీ డాన్స్’ అంటూ డాన్సులు చేస్తూ, సంస్కారవంతంగా సంతోషపడ్డాడు అక్కడ ఎవరో ఉంచిన ‘హెలికాప్టర్’ బొమ్మ చూసి. చందూగాడి బొమ్మ కంటే పెద్దది. చాలా బాగుంది.

చుట్టాలు వెళ్ళిపోయారు. భోజనాలు అయిపోయి, రజిత ఇల్లు సర్దుతుంటే వెళ్లి చెయ్యిపట్టుకున్నాడు బాలు. ‘ఏమిట’న్నట్టు చూసింది రజిత. దగ్గరకి రమ్మన్నట్టు చేత్తో సైగ చేశాడు. కొంచెం వంగిన అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టేసి చటుక్కున గదిలోకొచ్చి మంచమెక్కేశాడు. 

రాత్రికి దానితో ఆడుకుని, పక్కనే పెట్టుకుని పడుకున్నాడు. తను నిద్రపోతున్నాడనుకొని అమ్మ దుప్పటి కప్పి, మురిపెంగా ముద్దు పెడుతుంటే …నాన్న అడిగాడు… ‘ఏమిటా బొమ్మ’ అని. 

‘పొద్దున అడిగాడండి కొనమని, పని ఒత్తిడిలో ఉండి, పసివెధవని కసురుకున్నాను. పొద్దున ఫంక్షన్ కి కావలసిన వస్తువులు తేవడానికి బిగ్ బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నా.’  అని చెప్తోన్న అమ్మ మాటలు చెవిన పడ్డ బాలూ పెదాలపై చిరునవ్వు తొణికిసలాడుతుండగా, ‘అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో’ అనుకుంటూ దుప్పటిలో దూరిపోయాడు తృప్తిగా.  

*****************************

Please follow and like us:

12 thoughts on “బాలానందం (క‌థ‌)”

  1. మా అమ్మ ప్రేమ ఎంత మహోన్నతమైనదో మళ్లీ గుర్తు చేశాయి. కథ విన్నపుడు మా అమ్మ చేతులు పట్టుకొని నడిచిన వేళలు, ఆమె ప్రేమతో పొంగిన ఆ తీపి క్షణాలు అన్నీ గుర్తుకొచ్చాయి.
    చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాలను మనసులో మళ్లీ నింపిన మీ మాటలకూ, మీ ఆలోచనలకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏

  2. పదవోన్నతులూ, జీతాల పెరుగుదలలూ ముప్పై అయిదున్నర గంటల్లో ఆవిరయిపోతాయని ఒక మహా రచయిత అన్నారు. ఈ చిన్ని చిన్ని ఆనందాలే ఎప్పటికీ మిగిలిపోయే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

  3. Just read… Lovely story ! పిల్లలకి సుళువుగా అర్ధమై మనసుకి హత్తుకునేలా ఉంది. 🥰

Leave a Reply

Your email address will not be published.