మైల(కవిత)
-జయశ్రీ మువ్వా
మాకొద్దీ ఆడతనం
అనుక్షణం అస్థిత్వం కోసం
మాకీ అగచాట్లెందుకు..??
పిచ్చికుక్క సమాజం పచ్చబొట్టేసూకూర్చుంది
అణుక్షణం అణువణువూ తడుముతూ వేధిస్తూనే ఉంది..
ఆకలి కోరలకి అమ్మతనాన్ని అమ్ముకున్నాం
ఆబగా వచ్చే మగడికై ఆలితనాన్ని తాకట్టుపెట్టాం ..
చివరికి మూడు రోజుల ముట్టు నెత్తుటి పుట్టుకకి
ఇప్పుడు బతుకంతా మడికట్టా??
సమాజమా…సిగ్గుపడు… !!
అలవాటుపడ్డ ప్రాణలే
సిగ్గుకి ముగ్గుకి తలొంచుకున్నాం
ఇక చాలు
ఓ ఆడతనమా మరీ ఇంత సహనమా
తాతమ్మ ,బామ్మ అంటు అంటూ నెట్టినా
పాత చీర ముక్కైన అమ్మతనం
ఏ మూలనో
ఎన్ని అగ్ని పర్వతాల లావా ని దాచిందో
బట్టకట్టని రోజులే నయం
సిగ్గు తలెత్తుకు తిగిగింది
నాగరికత చుట్టుకున్న
అవమాన కట్టు మోతబరువై
మెలతాడు తెంపుకు తిరుగుతోంది
నేలపై రాలినపుడు
తొమ్మిది నెలల రక్తపు పొత్తిలి నీవు
అదే రుధిరపు రంగు ఇప్పుడు మైలా??
ఆ నెత్తురే రూపు మార్చి
చనుబాలు పట్టిన పాపం మాదే..!
ఇంకా ఏం చూస్తావు పుట్టుకని చూసే..
ధైర్యం పాలు తాగి రా
అమ్మ రొమ్ము గుద్ది అడుగు
అరువిస్తుంది ఎంతైనా ఆడది కదా..!
నిశ్శబ్ధాన్ని ఇక బద్ధలుకొట్టేద్దాం
ఆరు ఒుుతువులు చూపిన కాలమా
ఇక నుంచి నెల నెలా స్రవించే
ఈ ఏడో ఒుుతువు
ఎరుపు రంగు పోటెత్తే లోపే
ఒప్పుకో…
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి