యాత్రాగీతం(మెక్సికో)-11

కాన్ కూన్ (సిటీ టూర్- మార్కెట్-28)

-డా||కె.గీత

భాగం-13

ఇక మా తిరుగు ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది. మర్నాడు కాన్ కూన్ లో అప్పటివరకూ సిటీ టూర్ చెయ్యలేదు మేం.  అంతే కాదు,  అప్పటివరకూ టాక్సీల్లో, టూరు బస్సుల్లోనే తిరిగేం కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎలా ఉంటుందో చూడలేదు. కానీ పిల్లలతో బస్సుల్లో తిరగడం జరిగే పని కాదు కాబట్టి పిల్లలిద్దరినీ రూములోనే వదిలేసి మేమిద్దరమే బయలుదేరుదామని అనుకున్నాం. 

ముందు సత్య వెళ్లాలనుకున్న జెట్ ప్యాక్ రైడ్ కి,  ఆ తర్వాత  కాన్ కూన్ డౌన్ టౌన్ లో లోకల్ వస్తువులు అమ్మే మార్కెట్-28 చూడడానికి నిశ్చయించుకున్నాం. 

పొద్దున్నే  హడావిడి లేకుండా కాస్త స్థిమితంగా లేచి పదిగంటల వేళప్పుడు హోటలు బయటికొచ్చి రోడ్డు మీద కనబడ్డ మొదటి బస్సు ఎక్కేసేం. మేమున్న హోటలు జోన్ నించి ఎడమ వైపుకి వెళ్లే ప్రతి బస్సు జెట్ ప్యాక్ రైడ్ టిక్కెట్లు అమ్మే లాఇస్లా (Laisla) కాంప్లెక్సుకు, కుడి వైపుకి వెళ్లే ప్రతి బస్సు మార్కెట్-28 కు వెళ్తాయని మా రిసార్టు కౌంటర్లో చెప్పేరు. ఇక బస్సుల్లో ఎక్కి దిగడానికి అక్కడి లోకల్ కరెన్సీ “పేసో” లు అవసరం కాబట్టి రిసార్టు లోనే ఎటిఎం నుంచి వంద డాలర్లు పెట్టి రెండువేల పేసోలు తీసుకున్నాం. 

బస్సు ఎక్కగానే లోపల నీలం, పసుపు పచ్చ రంగు సీట్లు చూడగానే నాకు ఏదో మనవైపు బస్సెక్కినట్లు అనిపించి తెలీని ఆనందం కలిగింది. బస్సులు రద్దీగా లేవు. నిలబడి ప్రయాణం చెయ్యడాలు అసలే లేవు. అయిదునిమిషాలకో బస్సు ఉండడం వల్ల సీట్లు బానే దొరుకుతున్నాయి. నిజానికి అక్కడి ప్రాంతీయ జనాన్ని చూడడానికి అదే మంచి అవకాశమని అర్థమయ్యింది. అంతే కాకుండా మేమున్న హోటల్ జోన్ నించి డౌన్ టౌన్ కి ఒకవైపు టిక్కట్ మనిషికి ఎనిమిదిన్నర పేసోలు. అంటే టాక్సీతో పోలిస్తే పదో వంతు. 

ముందు సత్య వెళ్లాలనుకున్న జెట్ ప్యాక్ రైడ్ కోసం లాఇస్లా (Laisla) కాంప్లెక్సుకి వెళ్ళేం. మా హోటలు నుంచి పది నిమిషాల వ్యవధిలో ఉందది. అది కొత్తగా కట్టిన పెద్ద మాల్ వంటిది. కానీ ఉదయం కావడంవల్లనో ఏమో జనం లేరు.  అయితే సత్యకి కావలసిన జెట్ ప్యాక్ రైడ్ కి అవేళ్టికి టిక్కెట్లు లేకపోవడంతో వెనుతిరిగేం. 

ఇక తిన్నగా మార్కెట్-28 బస్సెక్కేం.  మాలాగా వచ్చిన టూరిస్టులు చాలామంది డౌన్ టౌన్ ప్రధాన స్టాపుల్లో పెద్ద షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు , మ్యూజియమ్స్, గేమ్స్ సెంటర్ల దగ్గర దిగిపోవడంతో బస్సు దాదాపు పూర్తిగా ఖాళీ అయిపోయింది. 

దాదాపు అరగంట ప్రయాణం తర్వాత మార్కెట్-28 లోని మొదటి దుకాణం ప్లాజా-28 దగ్గిర దిగేం.  ఈ  ప్లాజా వల్లే ఈ మార్కెట్ కు మార్కెట్-28 పేరు వచ్చింది. అక్కడి నుంచి దాదాపు మైలు దూరంలో చతురస్రంగా విస్తరించి ఉన్న ఒక్కోదుకాణం చూసుకుంటూ కాలినడకన వెళ్లి తిరిగి ఇక్కడికే వచ్చి బస్సు ఎక్కాలని అనుకున్నాం. 

కాన్ కూన్ లోని  హోటల్ జోన్ లోని లగ్జరీ సిటీ ప్రాంతానికి ఈ మార్కెట్ కు సంబంధమే లేదు. ఇక్కడే అసలు సిసలు జీవితాలున్నాయి.  

ప్లాజా-28 గులాబీ రంగు గోడలతో ఉన్న దుకాణ సముదాయం. మొదటి దుకాణం దగ్గరనించి స్థానిక మద్యం “టకీలా” అమ్మే దుకాణదారులు సత్యని లోపలికి రమ్మని పిలుస్తూ ఉండడం చూసి తను అటువైపు నడుస్తున్నవాడు కాస్తా  నాకు ఇటుపక్కకి వచ్చి నడవడం మొదలు పెట్టేడు. అది చూసి నాకు నవ్వాగలేదు. 

దారిపొడవునా మాయా సంస్కృతి ప్రతిబింబించే సాంప్రదాయ దుస్తులు, పూసలు, రాళ్ల నగలు దగ్గరనించి రంగురంగుల సిరామిక్ కపాలాల వరకు అనేక వస్తువుల్ని అమ్మే చిన్నచిన్న దుకాణాలు. 

నా వరకు నాకు “మన” అనిపించే మనుషుల్లోకి వచ్చిపడిన అద్వితీయానందం కలిగింది. 

ఇక్కడి స్థానిక వస్తువులని కొని కుటీర పరిశ్రమల్ని నిలబెట్టమని దారిపొడవునా దుకాణాల వాళ్లు అడగసాగేరు. కానీ ఒకేలాంటి వస్తువులు చిన్న దుకాణాల్లో ఎక్కువ ధరకి, పెద్ద దుకాణాల్లోతక్కువ ధరకి అమ్ముతున్నారు చిత్రంగా. ఇటువంటి ప్రతీ చోటా ఉన్నట్లే ఇక్కడకూడా ఒకేలా కనిపించే వస్తువుల నాణ్యతలో కూడా తేడాలున్నాయి. 

ఎక్కడికి వెళ్లినా అరచేతిలో ఇమిడే చిన్న వస్తువులు మా అద్దాల షోకేసు లోకి కొనడం అలవాటు నాకు. అందుకోసం అక్కడే తయారు చేస్తున్న చిన్న చిన్న చెక్క స్ప్రింగ్ బొమ్మలు కొన్ని కొన్నాను. 

దారిపొడవునా ట్రంపు గురించిన బూతు తిట్లతో ముద్రించిన టీ-షర్టులు అమ్మడం చూసేం. ఒకరిద్దరు మేం అమెరికా నుంచి వచ్చేమని తెలిసి మరీ అధ్యక్షుడు ట్రంపుని బూతులు తిట్టేరు. అమెరికాలో అధికారిక నామపత్రాలు లేకుండా నివసిస్తున్న మెక్సికన్ల పట్ల వహిస్తున్న కఠిన వైఖరి, దేశాల మధ్య అక్రమ వలసల్ని అరికట్టేందుకు గోడ కట్టాలన్న ప్రతిపాదనలే అందుక్కారణమని ముందురోజు మా టూరు గైడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చేయి. 

ఇక కీ చెయిన్లు, స్థానిక స్వెట్టర్లు , టోపీలు,  మట్టి బొమ్మలు వంటివి అంతకు ముందే టూర్లలో కొన్ని కొన్నాం. ఇక ఆ దుకాణాల దగ్గిర ఆగకుండా ముందుకు నడిచేం. 

దాదాపు మైలు దూరం నడిచేక చివరిగా ఉన్న స్వీట్లు అమ్మే దుకాణాల్లో అద్దాలలో ఉన్న మంచి దుకాణానికి వెళ్లి పది డాలర్లకు ఒక ప్యాకెట్టు చొప్పున అరడజను ప్యాకెట్లు కొన్నాం. మన పాలకోవా బిళ్లల్లాంటివి కొన్ని, చింతపండుతో తయారుచేసినవి కొన్ని కొన్నాం. నిజానికి పెట్టిన డబ్బులకి సరితూగేవి కావవి. అయినా ఆఫీసుల్లో పంచడానికి తప్పనిసరిగా తీసుకున్నాం. 

వచ్చే దార్లో అరటి పళ్లు, నారింజలు వంటివే కాక అరచేయంత పెద్ద సపోటాలు, (Pitaya) పిటాయాలనబడే బొమ్మజెముడు పళ్లు వంటి స్థానిక వెరైటీలు కూడా చూసేం.  పళ్ల దుకాణాల ఒక చిన్న బండి మీద ఏవో కాశీ రేగుపళ్ళ కంటే కొంచెం పెద్దవైన కాయలు ఉప్పూ, కారం, నిమ్మరసం పెట్టి అమ్ముతుంటే ఒక కాయ తినిచూసి, బావుండడంతో పది పేసోలకి ఎనిమిది కాయలున్న ఒక చిన్న సంచీడు కొనుక్కుని దారి పొడుగునా నడుస్తూ తిన్నాం. మధ్యలో పెద్ద గింజతో మామిడి, పీచ్ కలిపిన రుచితో ఒకరకమైన పండు అది. మేం నవంబరులో వెళ్లిన సీజనులో దొరికే ఈ పండు పేరు మెక్సికన్ ప్లమ్. స్థానికభాషలో దీనిని సెరులా (Ciruela) అని పిలుస్తారు. 

షాపుల్లో ఎక్కడైనా పేసోలే కంటే డాలర్లు తీసుకోవడానికే ఉత్సాహపడసాగినా మేం మా దగ్గిర పేసోల్ని ఖర్చు చెయ్యడం కోసం వాటినే వాడేం.  దారిలో వంద పేసోలు పెట్టి మూడు విసనకర్రలు కొన్నాను.  దాదాపు నాలుగు దుకాణాల్లో బేరమాడి చివరికి ఒక దుకాణంలో ఆరు వందల పేసోలకు ఒక దుప్పటి కొన్నాను. చిచెన్ ఇట్జా వంటి స్థానిక చిత్రాలతో  అల్లిన  చేనేత దుప్పటీ అది. ఒక విధమైన ఎరుపు, నారింజ, పసుపు దారాలతో అల్లిన ఆ దుప్పటీ నాకెంతో నచ్చింది. 

ఇక అప్పటికే పన్నెండు కావస్తుండడంతో భోజనాల సమయానికి రిసార్టుకు చేరుకోవడానికి వెనక్కి తిరిగొచ్చి  మేం బస్సు దిగిన ప్లాజా-28 దగ్గిరే పది నిమిషాలు నిలబడ్డాక అర్థమైన విషయం ఏవిటంటే అది ఒన్ వే అని. 

నాకు వచ్చీ రాని స్పానిషు భాషలో దుకాణాదారుల్ని అడుగుతూ ముందుకు నడిచి మొత్తానికి ఆ పెద్ద సర్కిల్ లో మరో వైపున ఉన్న పెద్ద మార్ట్ దగ్గిర బస్సెక్కడానికి పరుగెత్తేం. వచ్చిన ప్రతీ బస్సుని అడుగుతూ ఉండగా ఒక బస్సతను అక్కడ మా హోటల్ జోన్ బస్సులు ఆగవని మరికాస్త ముందుకు నడవమని చెప్పేడు. ఇంకాస్త నడిచి మొత్తానికి మరో అరగంటలో బస్సు పట్టుకున్నాం. 

సత్య అప్పటికే ఊబర్ వంటివేవైనా దొరుకుతాయేమోనని సెల్ ఫోనులో ఎంతో ప్రయత్నం చేసేడు. తెలీని ప్రదేశంలో బస్సులు ఎక్కే ముందు రూట్లు సరిగా చూసుకోవాలని అప్పుడు గ్రహించేం. హోటల్ జోన్ నించి వెళ్లే ప్రతి బస్సు డౌన్ టౌన్ మీంచి  వెళ్తుంది కానీ డౌన్ టౌన్ దాటి వచ్చేక మార్కెట్ -28 నుంచి వెనక్కి వెళ్లే ప్రతి బస్సు హోటల్ జోన్ కి మాత్రమే వెళ్లదు. 

ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ, అప్పుడు అసలే పిల్లల్ని హోటల్ లో వదిలి వచ్చేమని భలే గాభరాగా అనిపించింది. ఏ నంబరు బస్సెక్కితే ఎటెళ్తామో తెలియదు. మొత్తానికి బస్సెక్కి ఒంటి గంటకల్లా ఆదరాబాదరా రిసార్టుకి చేరుకునేసరికి పిల్లలిద్దరూ చక్కగా స్నానాలు చేసి రెడీ అయ్యి, హాయిగా టీవీ చూసుకుంటున్నారు. 

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.