విషాద నిషాదము
పంచమ భాగము – స్వర విస్తారము
-జోగారావు
అది 1973 వ సంవత్సరం.
మే నెల.
సాయంత్రము సమయములో, దక్షిణ ముంబయ్ వార్డెన్ రోడ్ లోని ఆకాశ గంగ ఎపార్ట్ మెంట్ లో ఆ ఫ్లాట్ ముందు నిలబడిన 33 సంవత్సరాల యువకుడు కాలింగ్ బెల్ కొట్టబోయి, తలపుకు ఉన్న సూచనని చదవ సాగేడు.
“ The door will not be opened on Mondays and Fridays.
Please ring the bell only thrice.
If no one opens, please leave your name and address.
Thank you for your cooperation.
Inconvenience is regretted “
సూచనని చదివిన యువకుడు ఆ రోజు గురువారం అని నిర్ధారించుకుని , కాలింగ్ బెల్ నొక్కేడు.
పది నిముషాల తరువాత నలభయ్యారేళ్ళ మహిళ తలుపు సగము తెరిచి అడిగేరు.
“ ఎవరూ ? “ ఎవరు కావాలి ?”
“ మీతో మాటాడాలి ?”
“ నాతో నా ? ఎందుకు ? “
“ సంగీతము నేర్చుకోవడానికి?
“ నేనెవరికీ సంగీతము నేర్పను “ అంటూ ఆవిడ తలుపు మూసి వేయ బోయేరు
“ నన్ను మీ అన్నగారు ఆలీ ఆక్బర్ ఖాన్ గారు పంపించేరు . నన్ను మీరు లోపలికి
రానిస్తే… “
ఆ అపరిచితుని నోటి వెంట తన అన్న గారి పేరు, ఆయన పంపించేరనే మాట విన్న ఆవిడ తలుపు తెరచి అతను లోపలికి రాగానే తలుపు వేసి
“ చెప్పండి. మా అన్న మిమ్మలిని నా దగ్గరకు ఎందుకు పంపించేరు? “ అన్నారు.
“ సంగీతము నేర్చుకోవడానికి “
“ నాకు సంగీతము వచ్చునని మీకు ఎవరు చెప్పేరు ?”
“ మీ అన్నగారే చెప్పేరు. నేను ఆయన దగ్గర సితార్ నేర్చుకొంటున్నాను. “
“ నా పేరు ఋషి కుమార్ పండ్యా . నేను అమెరికాలో మనస్తత్వ శాస్త్రము చదువుకుని, మేనేజ్ మెంట్ విషయాల, మీద, వ్యవహార విజ్ఞానము మీద పాఠాలు బోధిస్తూంటాను . నాకు సంగీతము అంటే ఆసక్తి . కేలిఫోర్నియా లో ఉన్న మీ అన్నగారు అలీ ఆక్బర్ ఖాన్ గారి దగ్గర వేసవి కాలములో సితార్ నేర్చుకొంటూ ఉంటాను. అక్కడ సితార్ కచేరీలు కూడా చేస్తూంటాను. “
అని మాటాడడానికి మరొక అవకాశము దొరుకదనే భయంతో గుక్క తిప్పుకోకుండా చెప్పేరు.
“ అయితే, మీరు నేరుచుకున్నది ఏమిటో సితార్ వాయించి చూపించండి “ అంటూ అతని ముందు సితార్ ఉంచేరు.
ఆవిడ పాదములకు నమస్కరించి, అతను సితార్ చేతిలోకి తీసుకుని సవరించుకుని సిధ్ధమని సూచించేరు.
ఆవిడ తల ఊపగానే కొంత సేపు సితార్ వాయించిన పండ్యాను చూసి, ఆపమ్మన్నట్లు సైగ చేసి
“ ఇప్పుడు నేను పాడబోయే రాగాన్ని సితార్ మీద వాయించండి “ అని యమన్ రాగము ఆలపించేరు.
ఆవిడ పాడిన “ విలంబిత్ గత్ యమన్ రాగాన్ని పలికించడానికి రెండున్నర గంటల సమయము పట్టింది.
అంతవరకూ, ఓపికతో, సహనముతో ఆ స్థాయిని పండ్య చేరుకోగానే ఆపమన్నట్లు సైగ చేసేరు.
“ నేర్చుకున్నారుగా. సంగీతము వచ్చేసింది కదా ! ఇక మీరు వెళ్ళ వచ్చు “ అన్నారు.
“ అదేమిటి? ఇప్పుడేగా నేను మీ దగ్గర సంగీతము నేర్చుకొంటున్నాను. పూర్తిగా నేర్చుకున్న తరువాతనే నేనిక్కడ నుండి కదిలేది “ అని చెప్పేరు.
పండ్య మొండి తనానికి ఆవిడ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి, రెండు కప్పులతో టీ తెచ్చి ఒక కప్పు అతనికి ఇచ్చి తాగుతూ అతని వివరాలను సేకరించేరు.
ఆ విధముగా ప్రారంభమయిన వారి గురు శిష్య సంబంధము నలభయ్యేళ్ళు సాగింది.
పండ్య అన్నపూర్ణాదేవి గారిని పేరు పెట్టి పిలిచేవారు కాదు.
గురు మా అనే అనేవారు.
అన్నపూర్ణాదేవి జీవితములో ఏర్పడిన శూన్యము పండ్య రాకతో క్రమేపీ మార్పు చెందింది.
ఆవిడ తన జీవితములోని సంఘటనలను పండ్య తో పంచుకున్నారు.
అయినా, వారిద్దరూ తమ హద్దులు దాట లేదు.
ఒక రకంగా, పండ్య అన్నపూర్ణాదేవి కి సంరక్షకునిగా మారి ఆవిడకు శిష్యులకు మధ్య వారధి అయ్యేరు.
కఠోర పరిశ్రమకు, క్రమ శిక్షణకు, అర్థ రాత్రి పాఠాలకు కూడా సిధ్ధమయి అన్నపూర్ణాదేవి వద్ద సంగీతమును అభ్యసించాలనుకునే శిష్యుల సంఖ్య పెరగసాగింది.
1984 వ సంవత్సరములో హరి ప్రసాద్ చౌరాసియా గారు అన్నపూర్ణాదేవి వద్ద బాన్సురీ ( ఫ్లూట్ ) వాదనలో మెళకువలు నేర్చుకోవడానికి చేరేరు.
గురు మా అన్నపూర్ణాదేవి గారి వద్ద సంగీత విద్యను అభ్యసించిన ప్రముఖులు
సితార్ : నిఖిల్ బెనర్జీ, దేబీ ప్రసాద్ ఛటర్జీ, ఇంద్రనీల్ భట్టాచార్య, బహదూర్ ఖాన్,
హిరేన్ రాయ్, కార్తీక్ కుమార్
బాన్సురీ : హరిప్రసద్ చౌరాసియా, నిత్యానంద్ హల్దీపుర్.
సరోద్ : ధ్యానేష్ ఖాన్, ఆశీష్ ఖాన్, బసంత్ కబ్రా, సురేష్ వ్యాస్
దిల్ రుబా : దక్షిణా మోహన్ టాగోర్
వయొలీన్ : సత్య దేవ్ పవార్ .
గురు మా అన్నపూర్ణా దేవి గురించి ఒక సంఘటన.
ఒకరోజు, బసంత్ కబ్రా సరోద్ పైన రాగ్ బిహాగ్ అభ్యాసము చేస్తున్నారు..
శిష్యులు వారి వారి వాయిద్యాల పైన గురు మా చెప్పిన పాఠాలను ఏకాగ్రతతో సాధన చేస్తున్నారు.
ఆవిడ వంట గదిలో పనిలో ఉన్నారు.
హఠాత్తుగా వంట గది నుండి గురు మా తీవ్ర స్థాయిలో బసంత్ కబ్రా ను ఉద్దేశించి “ నిషాద్ అపస్వరము పలుకుతోంది. సరిగ్గా వినపడడము లేదా ?” అని గద్దించేరు.
ఆవిడ గర్జనకు అక్కడున్న వారు ఉలిక్కి పడ్డారు. ఆ గదిలో నిశ్శబ్ద వాతావరణము నెల కొంది .
ఆ గదిలో ఎంత మంది ఎన్ని రకాల వాయిద్యాలు వివిధ రాగాలతో వాయిస్తున్నా , బసంత్ కబ్రా గారి స్వరదోషమును దూరము నుండి గ్రహించి సరి దిద్దిన గురు మా అన్నపూర్ణాదేవి ప్రతిభా పాటవాలకు శిష్యులు ఆశ్చర్యపోయి, ఆవిడకు మనసు లోనే నమస్కరించుకున్నారు. అటువంటి విదుషీమణి వద్ద సంగీత విద్య నేర్చుకొంటున్న తమ అదృష్టాన్ని కొనియాడుకున్నారు. ఆవిడ వద్ద నేర్చుకున్న తమ సంగీత విద్య సార్థకమయినందుకు శారదాంబకు కృతజ్ఞతలను అర్పించుకున్నారు.
ఆవిడ వద్ద బాన్సురీ విద్యను అభ్యసించిన శ్రీ నిత్యానంద్ హల్దీపుర్ తన విద్యాభ్యాసము నాటి ఒక సంఘటనను స్మరించుకున్నారు.
ఒకరోజు నిత్యానంద్ బాగా అలసి పోయి , ఆ రోజు అన్నపూర్ణాదేవి వద్ద బాన్సురీ సాధనకు వెళ్ళడము మానేద్దామనుకున్నారు.
కాని, అస్సలు వెళ్ళకపోతే, గురు మా కు ఆగ్రహము తెప్పించిన వారు అవుతారని, అక్కడకు వెళ్ళి నీరసముతోనే ఏదో మొక్కుబడిగా, పది నిముషాలు బాన్సురీ వాయిస్తే, ఆవిడే పరిస్థితిని గమనించి ఇంటికి వెళ్ళి పొమ్మంటారని అనుకున్నారు.
గురు మాకు పాద నమస్కారము చేసి, నిత్యానంద్ అయిదు నిముషాలు బాన్సురీ వాయించేరు.
ఆవిడ బాన్సురీ వాదనను ఆపు చేయించి, తన తండ్రి ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ కని పెట్టిన రాగ్ మాజ్ ఖమాజ్ రాగము ఆరోహణ అవరోహణ చెప్పి వాయించమన్నారు.
నిత్యానంద్ రెండున్నర గంటల వరకు రాగ్ మాజ్ ఖమాజ్ వాయిస్తూనే ఉన్నారు
అంతే!
ఒంట్లోని నీరసము పోయి ఉత్సాహము ఉత్తేజము కలిగేయి.
అప్పుడు ఆవిడ చిరు నవ్వుతో, సంగీతము మీద దృష్ట పెట్టి ఏకాగ్రతను చూపితే ఫలితాలు ఇలానే ఉంటాయి అని చెప్పేరు.
అన్నపూర్ణాదేవి గారి గురించి మరొక విషయము వారి శిష్యుల ద్వారా తెలిసింది.ఆవిడ అర్ధము రాత్రి దాటేక సుర్ బహార్ పైన తెల్లవారే వరకు అభ్యాసము చేసేక ఉదయము ఆవిడ తన అభ్యాసము ముగించుకుని గది బయటకు వస్తే, ఆ గది అంతా పరిమళ భరితమయ్యేదట. ఒకరోజు చందన పరిమళమయితే, మరొక రోజు గులాబీల సుగంధము, ఇంకొక రోజు చంపక సౌరభము ఇలా ఆవిడ గది వేర్వేరు పరిమళ భరితమయ్యేదట.
ఆవిడ వాయించిన రాగముననుసరించి పరిమళము ఉండేదట.
అలా ఎందుకూ అంటే, శారదా దేవి సంగీతానికి పరవశించి వచ్చి మెచ్చినందువలన ఆ గది అలా సుగంధ భరితమవుతుందని ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ చెప్పేవారట.
శ్రీ శారదా మాత అనుగ్రహము పొందిన అన్నపూర్ణాదేవి ధన్యురాలు.
*****
బాంక్ లో పని చేసి, రిటైరయ్యాను. ప్రస్తుతము బెంగలూరు లో విశ్రాంత జీవితమును గడుపుతున్నాను. నా శ్రీమతి తో కలిసి అమెరికా లో వున్న మా అబ్బాయి దగ్గరకి తరచూ వెళ్తుంటాను
ఖాళీ సమయాలలో అప్పుడప్పుడు పద్యాలు, యాత్రా విశేషాలు, వంటకములను వ్రాస్తూంటాను.
ఫేస్ బుక్ వాల్ మీద, సమూహముల గోడల మీద నా వ్రాతలను పంచుకోవడం నా హాబీ.
రచనా వ్యాసంగము నా ప్రవృత్తి.