వెనుతిరగని వెన్నెల(భాగం-11)
-డా|| కె.గీత
(ఆడియో ఇక్కడ వినండి)
వెనుతిరగని వెన్నెల(భాగం-11)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయమవుతుంది. పెద్ద వాళ్లు ఒప్పుకుని ఇద్దరికీ పెళ్లి చేస్తారు. తన్మయి, శేఖర్ విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు.
***
తన్మయికి అంత మొద్దు నిద్ర ఎలా పట్టిందో అర్థం కాలేదు.
చెమటతో తలకూడా తడిసిపోయి ఉంది.
“కొత్త ఊరికి అలవాటు పడడానికి సమయం పడ్తుందిలే.” అన్నాడు శేఖర్ లోపలికి వస్తూనే తన్మయి జిడ్డు ముఖం చూసి.
తన కలల నగరం విశాఖపట్నం. ఎప్పుడు చూస్తానా అని ఎన్నో రోజుల నించీ చూసిన ఎదురుచూపు ఇప్పటికి నిజమైందన్న ఆనందంతో చిర్నవ్వు నవ్వింది.
“ఇదేవిటి? ఎక్కడి సామాన్లింకా అక్కడే ఉన్నాయి?” అన్నాడు కాస్త చికాగ్గా మొహం పెట్టి.
పక్కనే పుస్తకాన్ని, పెన్నుని చూసి “మొదలెట్టేవా, నీ పిచ్చి రాతలు” అన్నాడు వ్యంగ్యంగా.
అతను పుస్తకం తీసి చదివితేగా తనేం రాసేదీ తెలిసేది.
ఉక్రోషంగా ఏదో అనబోతున్న తన్మయిని పట్టించుకోకుండా “లేచి ముఖం కడుక్కో, మావయ్యని చూసొస్తాను. అని వెళ్లిపోయేడు.”
అంతలోనే ఎదురు వరండాలోంచి “ఈ పూటకి మనకి భోజనం ఇక్కడే. వచ్చి అత్తమ్మకి సాయం చెయ్యి.” అని అరిచేడు.
తెచ్చుకున్న చీరల్లోంచి చిన్నపూల కాటన్ చీర తీసి కట్టుకుంది.
పాపిట నిండా సింధూరం, తిలకం బొట్టు, చేతుల నిండా గాజులు. తను ఎన్నాళ్లుగానో కలలు గన్న అవతారం.
పమిట భుజం చుట్టూ కప్పుకుని వచ్చి వినమ్రంగా నిలబడింది.
“ఏవిటా ముసలమ్మ వేషాలు?” అని పకపకా నవ్వేడు శేఖర్.
తన్మయి శేఖర్ వైపు చురుగ్గా చూసిన చూపు శేఖర్ గమనించలేదు గానీ చిన్న మావయ్య శివ గమనించేడు.
“నీ పెళ్లానికి కోపం వచ్చేసిందిరా” అని గట్టిగా నవ్వేడు.
ఇంతలో చిన్నమావయ్య భార్య హైమ వెనక నుంచి వస్తూ చక్కగా అల్లుకున్న తన్మయి జడని చేతితో పైకెత్తి చూసి “నిజం జుట్టే, ఇంత బావుంది!” అంది.
ఆవిడకి ఎందుకంత ఆశ్చర్యం వేసిందో తన్మయికి అర్థం కాలేదు.
భోజనాలయ్యేక అందరి కంచాలూ తన్మయినే తియ్యమని పురమాయించేడు శేఖర్.
“మీ పెళ్ళికి నాకు వొంట్లో బాగోలేక మేం రాలేకపోయేవమ్మాయ్, ఇదిగో మీకు అద్దె లేకుండా ఆరునెలలు మా ఇల్లు ఇస్తున్నా. అదే మీ పెళ్లి గిఫ్టనుకోండి.” అన్నాడు నోట్లోంచి పళ్ల సెట్టు తీసి పక్కన బాక్సులో పెట్టుకుంటూ శేఖర్ తాతయ్య.
“తాతయ్యా! స్టవ్వూ అదీ… “అని నసిగేడు శేఖర్.
“పాత కిరసనాయిలు స్టవ్వు షెడ్డు లో ఉంది తెచ్చుకోరా” అన్నాడు ఉదారంగా ఆయన.
“రేపు పగటి పూట నేను అక్కడ క్యాంటీనులో తినేస్తాను. రేపు పొద్దున్న ఈ సామాన్లన్నీ సర్దేసి నీకు వంట చేసుకో.” అన్నాడు శేఖర్.
రాత్రికి పడుకోవడానికి చాప, బొంత అడిగి తెచ్చేడు శేఖర్.
సూట్కేసులోంచి దుప్పటి తీసి వేస్తున్న తన్మయి వైపు ఈసడింపుగా చూస్తూ “ఏం చేస్తాం! మీ వాళ్లు ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని ఇప్పటికింకా మంచం, కుంచం పంపనేలేదు. మనమిక్కడికి వచ్చే లోగా సామాన్లు పంపించేస్తే పోలా? ఎక్కడ పడుకుంటారనే ఇంగిత జ్ఞానం అయినా ఉందా మీ వాళ్లకి?” అంటూ అటు తిరిగి ఉన్న తన్మయిని తనవైపు తిప్పుకున్నాడు.
“డాబా మీద పడుకుందామా?” అడిగింది ఆశగా బయటికి చూస్తూ.
మంచి వెన్నెట్లో చిన్నగా గాలి వీస్తూ హాయిగా ఉంది బయట.
“సర్లే. ఈ ఉక్క పోతలో ఇయ్యన్నీ ఆలోస్తూంటే నాకు బుర్ర వేడెక్కిపోతూంది.” అని చాప, దుప్పట్లని చుట్టి పైకి నడిచేడు శేఖర్.
“ఎవర్రా అది?” గట్టిగా కేక వినిపించింది కింద నుంచి.
“మేమే తాతయ్యా, ఫ్యాను లేదుగా ఉక్కగా ఉంటేనూ” అని అరిచేడు ఇట్నించి.
డాబా మీద పడుకునే అవకాశం వచ్చినందుకు తన్మయి సంతోషపడింది.
“రెల్లు పూలా పానుపు పైనా
జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మా
వెన్నెల.. చల్లినారమ్మా…. ” కృష్ణ శాస్త్రి గారి పాటని తన్మయి హృదయం లోలోపల పాడుతూ ఆనందంతో పులకరిస్తూంది.
హాయిగా పైకి పాడాలని ఉంది. సాయంత్రమంతా నిద్రపోయినందువల్ల తన్మయికి నిద్ర రావడం లేదు. అప్పటికే నిద్రలోకి జారుకున్న శేఖర్ వైపు కన్నార్పకుండా చూస్తూ కూచుంది కాసేపు.
“సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?”
ఎంత అందగాడు! అంత అందమైన మనస్సూ ఉంటే బావుణ్ణు! కాదు కాదు ఉంది. అతనికి మంచి మనస్సు ఉండి ఉంటుందని తనకి ఏ మూలో అనిపిస్తూంది.
“నేను నిన్ను తప్పక మార్చుకుంటాను శక్కూ! నా ప్రియ నేస్తాన్ని చేసుకుంటాను.”అని దృఢంగా అనుకుంది.
నిజానికి తన చుట్టూ ఉన్న వాళ్ల మాటలు చూస్తూంటే వీళ్లందరి కంటే శేఖరే కాస్త నయమనిపించింది తన్మయికి.
***
ఉదయానే లేచి వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టింది. గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టింది.
శేఖర్ వెళ్లే లోగా కాస్త పరమాన్నం చేసింది.
“కొత్తగా ఇంట్లోకి వెళ్లే వేళ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. రోజూ దీపం పెట్టడం మర్చిపోకు” అమ్మమ్మ తనకి వచ్చేటప్పుడు చెప్పిన మాటలు గుర్తొచ్చేయి.
రెండు మందార పూలు కోసి తెచ్చి కిటికీలో బుద్ధుడి బొమ్మకు అటూ ఇటూ పెట్టింది.
ఇదంతా ఆశ్చర్యంగా చూసేరు ఇంట్లో వాళ్లంతా.
శేఖర్ వెళ్లేటపుడు “రోజల్లా పుస్తకాలు వేసుకుని కూచోకుండా అలా వెళ్లి మా అత్తయ్యకి కాస్త సాయం చెయ్యి” అన్నాడు.
అతను వీథి మలుపు తిరుగుతూ వెనక్కి తన వైపు చూస్తే బావుణ్ణని గేటు దగ్గిరే నిలబడింది.
వీథి మలుపు తిరిగి శేఖర్ బండి తిప్పుకుని మళ్లీ వెనక్కి వచ్చేడు.
తన్మయి వైపు కాస్త తీవ్రంగా చూస్తూ “ఇలా గేటు పుచ్చుకుని వేళ్లాడడం లాంటి పనులు మా ఇళ్లలో ఆడవాళ్లు చెయ్యరు. రేపట్నించి కర్టెను దాటి నువ్వు రావక్కరలేదు.” అన్నాడు.
తన్మయికి కళ్లలో నీళ్లు తిరిగేయి.
చప్పున లోపలికి నడిచింది. వరండా లోంచి అతని తాతయ్య పెద్ద నవ్వు వినిపించింది.
“అమ్మాయ్, హైమకి సాయం చెయ్యి” అని పిలిచేడాయన.
వంటింట్లో అటు తిరిగి పనిచేస్తున్న హైమని శివ వెనకి నుంచి వచ్చి ఒక్క తన్ను తన్నేడు. ఆ పక్కనే గట్టు మీద చపాతీలు ఒత్తుతున్న తన్మయి ఉలిక్కి పడింది.
అతనేదో బూతుమాట హైమతో మెల్లిగా అన్నాడు.
ఆవిడ అదేదో జోకులా నవ్వుతూ”అది మా ఆయన పలకరింపు, నువ్వేం గాభరా పడకు. ఆఫీసుకి పంపించి, హనుమాన్ చాలీసా చదువుకుని వస్తాను. చపాతీలు వత్తడం అయిపోతే కూరలు తరిగిపెట్టు” అంది.
ఇంటి వాళ్లకి సాయం చెయ్యడం కోసం వాళ్ల మాటలన్నీ వినాల్సి రావడం పెద్ద బాధగా తయారైంది తన్మయికి.
వాళ్ల వరస నచ్చలేదు తన్మయికి. పైగా తనని పల్లెటూరి అమ్మాయని లోకువగా చూస్తున్నారనిపించింది.
పదకొండు గంటల వేళ వంట చేసుకోవాలనే నెపం మీద గదిలోకి వచ్చి పడింది.
ఎందుకో గుండె బరువుగా అనిపించింది తన్మయికి. అద్దంలో తనను తాను చూసుకుంది. “ఇప్పుడేమయ్యిందని తనకిలా కళ్లనీళ్లు? శేఖర్ వెళ్తూ అన్న మాటలు మనసులో బాధని రేకెత్తిస్తున్నాయి. కాస్సేపట్లో తేరుకుని “అతని పద్ధతి అది. పాటిస్తే పోలా? అతన్ని ప్రేమించడం అంటే ఇవన్నిటినీ ప్రేమించడమనేగా” అని సర్ది చెప్పుకుంది.
అతనితో జీవితాన్ని కలలు కన్నప్పుడు ఇవన్నీ తనకు తెలియవు.
అసలు శేఖర్ ఇంత దురుసుగా పెళ్లికి ముందరెప్పుడూ ప్రవర్తించలేదు. అతని ప్రవర్తన తెలిసేటంత సేపు తామిద్దరూ గడపలేదు.
తను చదివిన గొప్ప ప్రేమ కథల్లో పెళ్ళయ్యాక ఇంత మార్పు ఉన్న పాత్ర తనకి ఎక్కడా కనిపించలేదు. వనజ జ్ఞాపకం వచ్చింది.
ఉత్తరం రాయడం కోసం అడ్రసు పెట్టిన పుస్తకం తీసింది. గాభరాగా అన్ని పేజీలూ తిప్పింది. “ఎక్కడ పడిపోయి ఉంటుంది అడ్రసు కాగితం?” ఎంత ఆలోచించినా తనకి అర్థం కావడం లేదు.
బహుశా: బయలుదేరే రోజు శేఖర్ వాళ్లింట్లో మర్చిపోయి ఉంటుంది. అసలేదీ జాగ్రత్త చెయ్యని వాళ్లింట్లో ఈ కాగితాన్ని ఎవరైనా భద్రపరిచి ఉంటారన్న నమ్మకమూ లేదు.
మనస్సులో అన్ని బాధలూ కలిపి మెలితిరగడం మొదలు పెట్టాయి.
“మిత్రమా! అజ్ఞాత మిత్రమా! నన్ను రక్షించు. అన్నిటి నించీ నన్ను రక్షించు.” వాక్యం రాసి మౌనంగా చాలా సేపు కూచుంది తన్మయి.
రెండు గంటల వేళ ఆకలి కరకరా వేయడం మొదలయ్యింది. పాయసం కాస్త పెట్టుకు తిని ముఖం కడుక్కుని వచ్చింది.
దొడ్లో పనికి రాకుండా పడి ఉన్న చిన్న చిన్న బల్ల చెక్కల్ని తెచ్చి వాటి కింద ఇటుకలు పెట్టి, సంచుల్ని విప్పి సామాన్లని అందంగా, పొందికగా సర్దింది.
పుస్తకాల్ని మురిసిపోతూ చూసుకుంది.
పనిలో పడ్డాక మనసు శాంతించింది.
శేఖర్ బట్టలు ఉతికి ఆరేయడానికి మేడ పైకి వెళ్లింది. రాత్రి అందంగా కనబడిన డాబా ఇంతెత్తు మట్టి పేరుకు పోయి, అసహ్యంగా ఉంది.
కిందనే తీగె కట్టి బటలు ఆరేసి మళ్లీ పైకెళ్లి చుట్టూ చూసింది. అంత డాబాని తుడవడం తనకి సాధ్యం కాని పని. చీపురు పుచ్చుకుని డాబాకి ఒక పావు మేర శుభ్రం చేసి వచ్చింది.
అకస్మాత్తుగా తమ ఇల్లు, సన్నజాజి పందిరి గుర్తుకొచ్చేయి. అమ్మా, నాన్నా, అమ్మమ్మా జ్ఞాపకం వచ్చేరు. ఒక్క సారి మాట్లాడితే బావుణ్ణనిపించింది.
“ఇంటి వాళ్లని ఫోను చేసుకోవడానికి అడిగి చూస్తే? అయినా శేఖర్ని పొద్దున్నే అడిగి వుండాల్సింది” అనుకుని అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకుంది.
“ఏవమ్మాయ్, టీ తాగుతావా?” గుమ్మం దగ్గర్నించి హైమ పిల్చింది.
ఆ కాస్త పిలుపుకే ఆనందపడుతూ వెళ్లింది తన్మయి.
“నీకు శేఖర్ సంగతి తెలిసే చేసుకున్నావా?” గుసగుసగా అడిగింది ఆవిడ టీ గ్లాసు ఇస్తూ.
తన్మయికి ఒక్క సారిగా కాళ్లు వణికేయి. ఏం వినాల్సి వస్తుందో అని ఊపిరి బిగబట్టుకుని “ఏం సంగతండీ” అంది గొంతు పెగుల్చుకుని.
“అయినా నాకెందుకులే.” అంది ఆవిడ దాట వేస్తూ.
సాయంత్రం అయినదగ్గర్నించీ శేఖర్ ఎప్పుడొస్తాడా అని క్షణాలు లెక్కబెట్టసాగింది తన్మయి.
అతను వస్తూనే అడగాలి. అదేవిటో గట్టిగా అడగాలి. అనుకుంది.
రాత్రి భోజనాల సమయం అయిపోయి అందరూ నిద్రపోతూండగా వచ్చేడు శేఖర్.
“ఏవిటింకా పడుకోలేదా? నేను తినొచ్చేను.” అన్నాడు. అతని దగ్గిర గుప్పున వాసన కొడుతోంది.
తన్మయి గొంతు పెగుల్చుకునే లోగా, “ఉష్ష్.. మా తాతయ్యకి నేను మందు వేస్తానని తెలీదు. పెళ్లికి రాని ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చే వరకూ ఊరుకోలేదు. ఏవిటా చూపు? కాస్త పక్క వెయ్యి మేడ మీద” అన్నాడు.
మెట్లు తూలుతూ ఎక్కుతూ, “నువ్వు ఇంట్లో పడుకుని, నేను మేడ మీద పడుకుని ఉంటే వాళ్లకి పొద్దున్న అనుమానమొస్తుంది. వేషాలు చెయ్యకుండా మేడ మీదికొచ్చి పడుకో” అన్నాడు.
***
విశాఖపట్నం వచ్చి వారమైనా సముద్రాన్ని చూడలేదు.
మగవాళ్లంతా ఆదివారం నాడు వెళ్లి వంటకి దినుసులు, కూరగాయలు తెచ్చేరు.
సాయంత్రం అందరూ కలిసి సముద్ర తీరానికి వెళ్దామని ప్లాను చెప్పేడు శేఖర్.
“మీ జెట్టిల దగ్గిరకెందుకురా చేపల కంపు, ఆర్కే బీచికెళ్దాం” అన్నాడు శివ.
తన్మయి గుండె దడ దడా కొట్టుకుంది. ఇందులో ఎవరు వద్దంటారో, ఎక్కడ మానెయ్యాల్సొస్తుందో అని.
ముందు గానే చెప్పుకున్నట్లు మరో నాలుగైదు ఫామిలీలు సమయానికి చేరేరు.
శేఖర్ తల్లి తరఫు బంధువులు వాళ్లంతా. ఆవిడ అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు.
అంతా కలిసి తన్మయిని ఆటపట్టించడం మొదలెట్టేరు.
“పెద్ద బొట్టు అవతారవేవిట్రా మీఆవిడ?” అని ఒకళ్లు.
” ఆ భుజం చుట్టు కొంగేవిటని” మరొకళ్లు.
తన్మయి అలవాటైన నిశ్శబ్దంతో కిక్కిరిసిన ఆటోలో చివర మౌనంగా కూచుని బయటికి చూడసాగింది.
ఎక్కి దిగే కొండల రోడ్లతో చూడ చక్కగా ఉంది నగరం.
చివరి రోడ్డు మలుపు తిరిగి, ఎత్తు నించి ఆటో దిగువకి దిగుతుండగా బ్రహ్మాండమైన అలల్తో తన్మయి కలల సముద్రం ప్రత్యక్షమైంది.
శరీరం నించి మనస్సు విడిపడి సముద్రం వైపు పరుగుతీసింది తన్మయికి.
ఒక్క సారిగా రెక్కలొచ్చిన అనుభూతి. అమాంతం ఆ జలధిలోకి దూకెయ్యాలన్నంత పరవశం.
ఆటో దిగుతూనే మొక్క జొన్న పొత్తులు కొనుక్కోవడానికి అంతా ఎగబడుతూండగా సముద్రంకేసి కన్నార్పకుండా చూస్తూ నిలబడింది తన్మయి.
“శేఖర్ చేతిని గట్టిగా పట్టుకుని మెత్తని ఇసుకలో నడుస్తూ, అలల్ని మైమర్చి చూస్తూ, ఒడ్డున పరుగులెడ్తూ…..” తన్మయి మనస్సు పరిపరి విధాల కోరికలు వెదజల్లుతూంది.
చుట్టూ వందల మంది జనం. ఇసుకలో ఎక్కడా ఖాళీ లేకుండా ఉన్నారు. బూరలు, కాగితం బొమ్మలు, రకాల తినుబండారాలు అమ్మేవాళ్లతో కోలాహలంగా ఉంది అక్కడంతా.
“రోడ్డుకి అటు పక్కగా కాళికాలయం చూసేవా?” అన్నాడు శేఖర్.
ఈ లోకంలోకి వచ్చి పడింది ఒక్క సారిగా. “వెళ్దామా?” అంది అటుగా ఆశగా చూస్తూ.
“మనం ఒచ్చింది సముద్రం ఒడ్డుకి. గుళ్లూ గోపురాలు తర్వాతెప్పుడైనా విడిగా వచ్చి చూసుకుందాం. అలా ఎటో చూస్తూ అయోమయంలాగా ఉండకుండా అందరితో కలిసి ఉండు.” అన్నాడు.
మనస్సులో పరవళ్ళు తొక్కుతున్న ఆలోచనలు భౌతికంగా అక్కడ ఎదురవుతున్న అనుభవాల్ని ఏ మాత్రం పట్టించుకునే స్థితిలో లేవు. అతనేమన్నాడో వినకుండా చిర్నవ్వు నవ్వింది.
“గత జన్మ నుండి నిన్ను చేరడానికే తపిస్తున్నా నేస్తం!
ఈ అనంత జల నిధి లో నన్ను పరవళ్లు తీయనీ
అలల నురుగుని ధరించి అణువణువూ పులకరించనీ… ” కవిత్వమో ఏదో. మనస్సులో పదాలు సుళ్ళు తిరుగుతూ చుట్టుముట్టేయి తన్మయిని.
ఇసుకలో కిందకు కూరుకుపోతున్న తన పాదాల మీద పట్టీల్ని పైకి లాక్కుంటూ నీళ్ల వైపు అడుగులేసింది.
“తై” మని వచ్చిన వాళ్లలో పదహారు పదిహేడేళ్ల పిల్లలతో “బావా, బావా” అని పిలిపించుకుంటూ నీళ్లు వాళ్ల మీదికి జల్లుతూ ఆనందిస్తూన్న శేఖర్ హఠాత్తుగా వచ్చి తన చీర ఎక్కడ తడిసిపోతుందో అన్నట్లు చప్పున చేతుల మీద తన్మయిని ఎత్తుకున్నాడు. అంతా గోలగా అరిచేరు.
ఆశ్చర్యంగా, మహదానందంగా తొలకరి వానకి పుడమి పులకరించినట్లు పులకించిపోయింది.
“ఏరా, నీ పెళ్లం రవణా రెడ్డిలాగా ఎంత పూచిక పిల్లలా ఉంటే మాత్రం, ఇలా గాల్లో తిప్పడం మొదలెట్టేవంటే ఇక బూమ్మీద నిలబడదు జాగ్రత్త” అంది శేఖర్ పిన్ని గారపళ్ళు పెకి వచ్చేట్లు గట్టిగా నవ్వుతూ.
“చప్పున దించి ఇలా సముద్రపు ఒడ్డుకు వచ్చేటపుడు నీళ్లలోకి రావాలనుకుంటే పంజాబీ డ్రెస్సు
వేసుకో” అన్నాడు.
ఇంతలో “వొదినా, రా… అంటూ ఇద్దరు పిల్లలు వచ్చి నీళ్ల లోకి లాక్కెళ్లేరు.”
నీళ్లలో కెరటాల్తో పసిపిల్లలా ఆడుకుంటూ “నాకు సముద్రం ఎంత నచ్చిందో తెలుసా?” అంది పక్కనున్న అమ్మాయితో.
తలెత్తి ఆకాశం వైపు చూస్తూ “నేనొచ్చేసేను నా కలల నగరానికి” అని గట్టిగా అరవాలని ఉంది తన్మయికి.
ఇంతలో పెద్ద కెరటం వచ్చి ఒక్క ఉదుటున అందర్నీ ముంచేసింది. తన్మయి కాళ్లానుకోలేక కింద పడింది. పడడమే కెరటంతో బాటూ లోపలికి జారిపోసాగింది.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
Mam venutiragani vennela part 20 continue last varaku audio or stories kavali please
Tappakunda Jyothi garu. Please write me an email to editor.neccheli@gmail.com