షర్మిలాం”తరంగం”
-షర్మిల కోనేరు
డైటింగోపాఖ్యానం
మా చిన్నప్పుడు ముప్పొద్దులా అంత అన్నం , పచ్చడి , మీగడపెరుగు ఏసుకుని కమ్మగా తినేవాళ్ళం .
పచ్చడంటే పండుమిరపకాయ కావొచ్చు మావిడికాయ , మాగాయ ఏదో ఒకటి ! పైగా నెయ్యేసుకుని తినే వాళ్ళం .
పెద్దాళ్ళు కూడా కాస్త ఎక్కువ అన్నమే తినేవారు .
మరి ఇప్పుడేంటో!
అన్నం చూస్తే ఆమడ దూరం పారిపోతున్నాం .
అన్నం ఓ గుప్పెడు తింటే ఆ రోజల్లా గిల్టీ ఫీలింగ్ …
ఏంటో ఖర్మ !
ఆ రోజుల్లో ఆ మాత్రం గుప్పెడు పొట్ట వున్నా పెద్ద పట్టించుకునేవారు కాదు .
ఇంటెడు చాకిరీ చేయడం పళ్లెం నిండా అన్నం పెట్టుకు తిండమే .
మరీ పాత రోజుల్లో అయితే సినిమాల్లో కూడా ముద్ద బంతి పూలల్లే బొద్దు గుమ్మలు కనబడేవారు.
సావిత్రి , భానుమతి రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండును .
కమ్మగా తినొచ్చు .
నా చిన్నప్పుడు ప్రేమ్ నగర్ సినిమాలో వాణీశ్రీ అప్పటి హిందీ సినిమా హీరోయిన్లను చూసే ఏమో ! వెన్ను పొట్ట అంటుకు పోయేలా ఫిగర్ మెయింటైన్ చేసింది .
ఏ మాటకా మాట చెప్పుకోవాలి,
ఉత్తరాది సినిమా హీరోయిన్లు నర్గీస్, నూతన్ దగ్గర నుంచి వహీదా రహమాన్ , షర్మిలా టాగూర్ వరకూ ఎక్కువ మంది నాజూకు భామలే !
చపాతీల మహిమో ఏంటో !
మళ్లీ మన వైజయంతిమాల , పద్మిని , హేమామాలిని సాంబార్ పుణ్యమా అంటా కాస్త మిసమిసలాడేవారు .
ఇక మన తెలుగు సినిమాల్లో శ్రీదేవి , జయసుధ, జయచిత్ర వగైరాలు కూడా కండపట్టి వుండేవారు ఒక్క జయప్రద మినహాయిస్తే …
ఇక ఎప్పుడైతే జీరో సైజు బొంబాయి పాపలు తెలుగు సినిమాల్లోకి రావడం మొదలైందో జనాలకి తంటా మొదలైంది .
ఇక డైటింగ్ అనే పదం మన తెలుగు జీవితాల్లోకి వచ్చి పడింది .
షాపుల్లోకి గోధుమ పిండి ప్యాకెట్లు విరివిగా అమ్ముడు పోవడం మొదలైంది .
అసలు నాకు తెలిసి చపాతీలు తినే వాళ్ళు 30 ఏళ్ళ కిందట వేళ్ళ మీద లెక్కపెట్టేంత మంది వుండేవారు .
ఒక వేళ వారాలు చేసే వాళ్ళు రాత్రుళ్ళు దిబ్బరొట్టో , బియ్యం రవ్వ ఉప్మానో లేదంటే ఇడ్లీలో కమ్మగా తినేవారు .
ఇప్పుడు పుల్కాలు తప్ప దిబ్బరొట్టికి చోటు లేదాయె
ఇప్పుడు రాత్రి అన్నాలు తినే వాళ్ళని వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు .
పైగా ఈ యూట్యూబు మరీ జీవితాల్ని ఓ ఆట ఆడేసుకుంటాంది .
ఒకాయన
“కొబ్బరి నూని తాగి ప్రొటీన్ తినండి”
అంటే ఇంకో ఆయన
“అసలు మాంసాహారం వద్దు మిల్లెట్స్ తినండి” అని ఢంకా బజాయిస్తాడు .
లేదా రెండూ తినమని ఇంకొకళ్ళు . మా అమ్మాయిలు ఆ మధ్య సినిమా ఏక్టర్లకి కూడా డైట్ అడ్వైజరంట, నెలకి 15 వేలు ఫీజు.
ఆవిడ ఏ దేశంలో వున్నా డైటింగ్ చేయించేస్తంది.
పొద్దున్నుంచి సాయంత్రం వరకూ ఏం తినాలో పట్టిక ఇస్తంది .
ఫీజు తీసుకుంటే తీసుకుంది గానీ మరీ కడుపు మాడ్చలా !
ఇడ్లీలు , పొదీనా పచ్చడి వంటివి తింటా డైటింగ్ .
బాగానే తగ్గారు .
ఎన్నాళ్ళు ఒక ఆర్నెల్లు .
మళ్ళీ రాఘవేంద్రరావు సెట్టింగ్ మాదిరిగా భారీగా
తయారయ్యారు.” నా బొంద నేను మాత్రం చచ్చీచెడి. ఓ రెండు నెల్లు కడుపు మాడ్చుకుని తగ్గటం, మళ్ళీ పాత బరువు నవ్వుతూ వేయింగ్ మిషన్ మీద పలకరించడం…అలాగని ఓ తిండి కుమ్మెయ్యటల్లా మామూలుగా తిన్నా సరే!
నాకర్ధమైంది చివరాఖరిగా ఒకటే డైటింగ్ జీవితాంతం చెయ్యాలని. అందుకే గావున్ను హీరోయిన్లు చాలా మంది సినిమాలు విరమించుకున్నాక నిండుగా కనపడతారు. ఏతా వాతా నా మట్టుకు నాకు అర్ధమైందేంటంటే కడుపు మాడ్చు…
బరువు తగ్గు అని. ఏం శుభ్రంగా చికెన్లు, మటన్లు తిని బరువు తగ్గడానికేం దొబ్బిడాయా?
అనొచ్చు. ప్రొటీన్ డైట్ చేసేటప్పుడు ఏ మామిడిపండో చూశాననుకోండి తినాలన్న కోరిక వామనుడు ఆకాశమంత ఎత్తు పెరిగినట్టు అమాంతం పెరిగిపోతుంది .
ఏ జాంగ్రీయో చూశానా ఎందుకు ఈ వెధవ డైటింగ్ ! హాయిగా తినేస్తా అని డిసైడై పోతా!
లిమిట్ గా తిని ఎక్సర్ సైజ్ చేస్తే సరి అని స్టేట్మెంట్ ఒకటి ఉచితంగా పారేసి మరీ మామిడిపండు అందుకుంటా!!
( గమనిక: ఈ పోస్టు పెళ్ళి కోసం తగ్గే అమ్మాయిలకి ,ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే బుద్ధిమంతులకీ కాదు)
*****
షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో కూడా శీర్షికలు రాస్తున్నారు.