సంధ్యారాగం,వజ్రపు ముక్కు పుడక : రెండు నవలికలు

-వసుధారాణి 

పంజాబీ మూలం: దలీప్ కౌర్ తివానా.

తెలుగు అనువాదం: జె. చెన్నయ్య.

నేషనల్ బుక్ ట్రస్ట్,ఇండియా.

మొదటి ముద్రణ: 2010.

భారత సమాజంలో వివాహ బంధాన్ని చిత్రించిన నవలిక ‘సంధ్యారాగం’ .వివాహిత అయిన ఓ సీనియర్ అధికారిణి అనుకోని పరిస్థితులలో ఎదుర్కొన్న జీవితాను భావాలు.స్వేచ్చా జీవిత భావన చుట్టూ అల్లుకున్న ఆలోచనలతో ,అనుభవంలోకి తెచ్చుకోలేని భావాలతో నలిగిపోయిన స్త్రీ మనోవేదన ఈ నవలిక.

అతి స్వార్ధపరుడైన భర్త,అతి మంచివాడయిన స్నేహితుడు సహోద్యోగి మధ్య నలిగిపోయిన ఓ స్త్రీ అస్తిత్వం . పంజాబీ భాష వచ్చి ఉంటే ఈ నవలిక నేరుగా ఆ భాషలో చదివితే ఇంకెంత బాగుండేదో అనిపించింది.

పంజాబీ నుంచి ఆంగ్లంలోకి,ఆంగ్లంనుంచి తెలుగులోకి అనువాదం అయిన ఈ రెండు నవాలికలూ పంజాబ్ బాస్మతి సువాసనను,అక్కడ ప్రవహించే జీలం,రావి, సట్లెజ్    నదుల ఒరవడిని పోగొట్టుకోలేదు.

డాక్టర్ దలీప్ కౌర్ తివానా పంజాబీ సాహిత్య రంగంలో అగ్రశ్రేణి రచయిత్రుల కోవలోనివారు.ఈ రెండు నవలికలలోని ముఖ్యపాత్రలు అయిన ‘సంధ్యారాగం’లోని హరిజిత్,’వజ్రపు ముక్కు పుడక’ లోని కిరణ్ వ్యక్తిగతమైన నిస్సహాయతల దృష్ట్యా వేరు వేరుగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి భిన్నమైన పాత్రలు ఏమీ కావు.

రచయిత్రి ఈ పాత్రల మనోభావాలను , అవి అనుభవించిన సంఘర్షణను విలక్షణ శైలితో పాఠకుల ముందు ఉంచారు.ముఖ్యంగా ‘సంధ్యారాగం’ నవలికలోని హరిజిత్ తో ఉద్యోగజీవనంలో ఉన్న ప్రతి వివాహిత తనని తాను తప్పక పోల్చుకుని చూసుకుంటుంది.

ఈ రెండు పాత్రల ద్వారా స్త్రీలుగా సమాజం విధించిన నైతికవిలువలు, కట్టుబాట్ల పట్ల తమ గాఢమైన అసంతృప్తిని ప్రతీకలు,అంతరంగ భావనల ద్వారా రచయిత్రి చక్కగా వ్యక్తీకరించారు.కొంత ఆధునికమూ,కొంత సాంప్రదాయమూ కలగలిసిన సమకాలీన వాతావరణాన్ని కథనంలో చిత్రించి పాఠకుల చేత ఉత్కంఠతతో చదివించేలా చేసే నవలికలివి.

142 పేజీల ఈ పుస్తకం ఆపకుండా చదివించేస్తుంది.’సంధ్యారాగం ‘ ముగింపు ఊహించిందే కానీ, ‘వజ్రపు ముక్కు పుడక’ ముగింపు సమాజానికి విసిరిన సవాలులా ఉంటుంది.డాక్టర్ జె చెన్నయ్య అనువాదం చాలా చక్కగా ఉంది .వజ్రపు ముక్కు పుడక చివరలో కిరణ్ డైరీ లోని కవితలు అద్భుతం.ఆవిడ మనోగతం ఆవిష్కరించే విధంగా ప్రతి కవితా ఓ ప్రశ్నలా ఉంటుంది.

డాక్టర్ దలీప్ కౌర్ తివానా 27 నవలలు,7 కథా సంపుటాలు,మొదటి భాగం స్వీయ జీవిత చరిత్ర,సాహిత్య జీవిత చరిత్ర వెలువరించారు.సాహిత్య అకాడమీ పురస్కారం, సరస్వతీ సమ్మాన్ లతో సహా అన్ని ముఖ్యమైన పురస్కారాలూ అందుకున్నారు.

“వజ్రపు ముక్కు పుడక “ఒక సైనికుణ్ణి పెళ్లాడి, పెళ్లయిన తర్వాత ఎంతో కాలం కాపురం చేయకుండానే , అత్తవారింటికి కాపురానికి  వెళ్లిన రోజునే భర్తను కోల్పోయిన అభాగ్యురాలైన ఒక పంజాబీ కన్య జీవిత కథ ఇది .ఆర్మీ ఆఫీసర్ అయిన భర్తకు భార్యను ఇంటికి తీసుకువచ్చిన రోజు రాత్రే యుద్ధానికి పిలుపు వస్తుంది.

యుద్ధానికి వెళ్లిన అతను చెక్కపెట్టెలోనే తిరిగి రావటంతో కథ మొదలవుతుంది.నవవధువు కిరణ్ పెళ్ళిలో చేతులకు తొడుక్కున్న రంగురంగుల గాజులని తీసివేసి వితంతువుగా జీవితం గడపటాన్ని వ్యతిరేకించింది.అంతే కాక తన వజ్రపు ముక్కు పుడక నవవధువుకు ఉండ వలసిన అలంకారం అలాగే ఉంచుకోవడం ద్వారా సమాజాన్ని ఎదిరించింది.

తల్లి,నాయనమ్మలు కిరణ్ ధోరణిని తప్పుపట్టినా తండ్రి వలన కొంత ఊరటను పొందుతుంది.పెళ్ళి వలన ఆమె జీవితంలో ఎటువంటి మార్పూ లేనప్పుడు ఇదివరలోలా తను ఎందుకు ఉండరాదు అన్న కిరణ్ ప్రశ్నకు సమాజం దగ్గర రకరకాల సమాధానాలు.

తండ్రి మరణం తరువాత కిరణ్ వజ్రపు ముక్కు పుడకను తీసివేసి ఎవ్వరికీ కనపడకుండా పోవటం ఒక ప్రతీక అయితే, ఆమెను గురించి ఎవరికి తోచిన విధంగా వారు అనుకోవటం ఇంకో ప్రతీక.

సమాజం ఒక స్త్రీని ఎలా ఉండాలి అనుకుంటుందో అది మంచిగానో ,చెడుగానో ఆ స్త్రీ అలాగే ఉండాలి అన్న ఆనవాయితీని వ్యతిరేకిస్తూ కిరణ్ తీసుకున్న నిర్ణయం విస్మయ పరుస్తుంది.

‘సంధ్యారాగం’ లో హరిజిత్ మొదటి నుంచి కొంత కట్టుబాట్లకు భయపడే స్త్రీ గా చూపినా , జరిగే పరిణామాలు ఆమెను ఎక్కడిదాకా తీసుకువెళతాయి అన్న అంశం ఓ ఆమోదయోగ్యమైన పంథాలో నడిపించిన తీరు రచయిత్రి ప్రతిభను,సామాజిక అవగాహనను తెలుపుతుంది.

చివరికి హరిజిత్ తీసుకునే నిర్ణయం సరైనదే అని అనుకుంటాం.హరిజిత్ స్నేహితురాలు సోనాల్  విప్లవాత్మక ఆలోచనలు కలిగిన స్త్రీ .సోనాల్ లాంటి స్త్రీ లను సమాజం హర్షించదు. అయితే సోనాల్ గొంతులో ప్రతి స్త్రీ మనోభావాలను దలీప్ కౌర్ వెల్లడించారు అనిపిస్తుంది.

రెండు వేర్వేరు సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న స్త్రీలు ఒకే సమాజానికి చెందిన వారు అవ్వటం వలన ఈ రెండు కథలూ వేరయినా ,ఎక్కడా పోలికలు లేకపోయినా ఏదో అంతర్లీనమైన సామ్యతతో నడుస్తాయి.

స్త్రీ వాదం ముద్రలేని మానవతావాదం రెండు నవలికలలో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సర్వ సాధారణ,సామాన్యమైన సమస్యలతో ఉన్న ఈ రెండు  కథలూ కేవలం శైలి,విభిన్నమైన ముగింపు వలన గొప్ప కథలు అయ్యాయి.

‘ వజ్రపు ముక్కు పుడక’ నవలిక నుండి కిరణ్ రాసుకున్న డైరీలో ఒక కవితను చూడండి.

“ప్రతిరోజూ సూర్యుడు వచ్చి అడుగుతాడు

నువ్వేం చేస్తావు

ఈరోజు?

ప్రతిరోజూ నేను నక్షత్రాలతో చెబుతాను

నేనీరోజు వృథా చేసాను.

ప్రతిరోజూ అర్ధానికీ,అర్ధ రాహిత్యానికీ మధ్య

మార్గంలో కలియదిరుగుతాను.

ప్రతి మార్గానికీ విశ్వాసం వుంది

ప్రతి మార్గానికీ విశ్వాస ఘాతుకత్వం వుంది.

ఎవరూ తన నీడలో తాను కూర్చోలేరు.”

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.