అనుసృజన
నిర్మల
(భాగం-5)
–ఆర్. శాంతసుందరి
(హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -)
ఆనాటినుంచీ నిర్మల ప్రవర్తనలో మార్పు వచ్చింది.తన కర్తవ్యం ఏమిటో అర్థమైనదానిలా నైరాశ్యంలో కూరుకుపోకుండా అన్ని పనులూ చురుగ్గా చేసుకోసాగింది. ఇంతకుముందు మనసులో ఉన్న కోపమూ, చిరాకూ, దుఃఖమూ ఆమెని జడురాలిగా చేసేశాయి.కానీ ఇప్పుడు, ‘నా ఖర్మ ఇంతే, నా నుదుట బ్రహ్మ ఈ జీవితమే రాశాడేమో! దాన్ని తుడిపెయ్యాలన్నా సాధ్యం కాదు.ఎంత బాధ ఉన్నా, దుఃఖం కమ్ముకొచ్చినా దిగమింగి ఇలా బతకాల్సిందే. ఏడ్చినా పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు అది కాళ్ళకి బమ్ధమే అవుతుంది. ఇక జీవిత ఖైదీ లాగ ఇలా అన్నీ భరించి నా పనులు నేను చేసుకోకపోతే లాభం లేదు !’ అనుకుంది నిర్మల.
మర్నాడు లాయరు గారు ఇంటికి వచ్చేసరికి నిర్మల నవ్వుతూ తన గది గుమ్మంలో నిలబడి ఉండటం కనపడింది.ఆమె అందానికి ఆయన ముగ్ధుడైపోయాడు.చాలా కాలం తరవాత ఈ పువ్వు వికసించటం చూశాడాయన.గదిలో ఒక గోడకి పెద్ద నిలువుటద్దం బిగించి ఉంది.లోపలికి అడుగుపెడుతూనే అందులో ఆయనకి తన రూపం కనిపించింది. మనసు ఒక్కసారి గతుక్కుమన్నట్టయింది.రోజంతా పనిమీద తిరిగి తిరిగి మొహం వాడిపోయింది.ఎంత మంచి తిండి తిన్నా మొహమ్ మీది ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ముందుకి తోసుకొచ్చిన పొట్ట అసహ్యంగా ఉంది.గుమ్మంలో నిలబడ్డ నిర్మల ఇటు తిరిగింది. ఇద్దరి ప్రతిబింబాలూ అద్దంలో పక్కపక్కన కనిపించాయి.ఇద్దరికీ ఎంత తేడా… ఆమె ఇప్పుడే కట్టిన పాలరాతి భవనంలా ఉంటే తను కూలిపోయిన శిథిలంలా ఉన్నాడు! తన రూపాన్ని చూసి తనకే రోతపుట్టి ఆయన అద్దం దగ్గర్నుంచి పక్కకి తొలిగాడు.’ ఇంత అందగత్తె తనని అసహ్యించుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదని అనిపించింది తోతారామ్ కి.ఆమె అందం ఆయన హృదయాన్ని శూలంలా గుచ్చి బాధ పెట్టింది.ఆమెకేసి చూసే ధైర్యం కూడా చెయ్యలేకపోయాడు.
“ఇవాళ ఇంతాలస్యమైందేం? చూసి చూసి కళ్ళు కాయలు కాచాయంటే నమ్మండి!” అంది.
ఆమెవైపు చూడకుండా కిటికీ బైటికి చూస్తూ,” కేసులు అలా నడుస్తూనే ఉన్నాయి ఉదయం నుంచీ. ఇంకా ఒక ఏసుంటే తలనెప్పిగా ఉందని చెప్పి వచ్చేశాను,”అన్నాడు తోతారామ్.
“మరి అన్ని కేసులు తీసుకోవటం దేనికి? ఒళ్ళు హూనం చేసుకుని సంపాదించాల్సిన అగత్యమేముంది? నాకు డబ్బాశ లేదు.మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు నెమ్మదిమీద సంపాదించుకోవచ్చు.”
“సిరికి మోకాలడ్డటం మూర్ఖత్వం కదూ?”
“ఆ సిరి రక్త మాంసాలు కోరేదైతే దాన్ని రానివ్వకపోవటమే మేలు.”
[అదే సమయంలో మన్సారామ్ స్కూలునుంచి వచ్చాడు.నిర్మలని తినేందుకు ఏమైనా ఇవ్వమని అడిగి హాకీ ఆడుకునేందుకు వెళ్ళిపోయాడు.]
‘మునుపు నాకు ఎదురుపడి మాట్లాడటానికి మొహమాట పడేవాడు.ఇప్పుడు చూడండి.ఆకలేస్తే నన్నే అడుగుతున్నాడు! నేనే చెప్పాను, నా దగ్గర అలా మొహమాటపడక్కర్లేదని!” అంది నిర్మల ఆనందంగా.
తోతారామ్ విసుగ్గా మొహమ్ పెట్టి,” ఎందుకు వీడు నీ దగ్గరకే వస్తాడు? అక్కయ్యని అడగచ్చు కదా?” అన్నాడు.
నిర్మల భర్త మెచ్చుకుంటాడనుకుని ఈ మాట చెప్పింది. ఆమెది ఇంకా అమాయకమైన పసి మనసు.పిల్లలతో తానూ ఒక పిల్లగా మారి సరదాగా ఉంటుంది. భర్తకి అసూయ కలుగుతుందని ఏమాత్రం ఊహించలేకపోయిందామె.అందుకే,” ఆవిణ్ణి ఎందుకడగరో నాకేం తెలుసు? నన్ను అడిగితే పొమ్మని ఎలా కసురుతాను? సవతి తల్లి అందుకే మమ్మల్ని పట్టించుకోదని అనుకోరూ?”
ఆయన ఆమెకి జవాబేమీ చెప్పలేదు.కొడుకుని పిలిచి వాడి చదువు సంధ్యల గురించి అడగటం మొదలెట్టాడు.ఎప్పుడూ తనని పట్టించుకోని తండ్రి ఇలా అడగటం చూసి వాడు విస్తుపోయాడు.అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్ట్ గా వస్తున్న కొడుకులో ఏ లోపమూ ఎత్తి చూపలేక,” రోజంతా నువ్వు ఇక్కడా అక్కడా బలాదూరు తిరగటం చూస్తున్నాను.నీ తెలివితేటలకన్నా నీ నడవడి సరిగ్గా ఉండటమే నాకు ముఖ్యం.నువ్వు ఇలా ఆవారా లా తిరగటం నాకు నచ్చలేదు,”అన్నాడు.
మన్సారామ్ ఏమాత్రం తొణక్కుండా,” సాయంకాలం ఒక గంట సేపు ఆడుకోటానికి వెళ్తాను తప్ప రోజంతా ఇంటిపట్టునే ఉంటాను నాన్నా.కావాలంటె అమ్మనీ, అత్తయ్యనీ అడగండి.అలా ఊరికే బైట తిరగటం నాకే నచ్చదు.హెడ్ మాస్టర్ బలవంతం మీద మ్యాచ్ ఆడేందుకు వెళ్తున్నాను. మీరు వద్దంటే రేపట్నుంచీ వెళ్ళను,”అన్నాడు.
ఆయనకి ఏదో ఒక మిషతో కొడుకుని తిట్టాలని ఉంది.అందుకే,” నువ్వు ఆడుకునేందుకే వెళ్తున్నావని నన్నెలా నమ్మమంటావు? నీ మీద ఫిర్యాదులు నా చెవిన పడుతూనే ఉన్నాయి,” అన్నాడు.
మన్సారామ్ కి కోపం వచ్చింది,”ఎవరలా చెప్పారు మీకు? దాన్ని నిరూపించమని చెప్పండి చూద్దాం,”అన్నాడు.
“ఒకరైతే కదా, చాలామందే చెప్పారు.ఇక రేపట్నుంచీ నువ్వు స్కూల్ హాస్టల్లో ఉండిపో.”
మన్సారామ్ మొహం ఒక్కసారిగా పాలిపోయింది,” సరే, నకేమీ అభ్యంతరం లేదు.మీరు ఎప్పుడు చెపితే అప్పుడే వెళ్ళిపోతాను,” అన్నాడు.
“అలా మొహం వేలాడేశావేం?అక్కడ ఉండటం ఇష్టం లేదా? ఏమైంది? హాస్టల్లో ఉండేందుకు అంత భయం దేనికి?” అన్నాడు తోతారామ్.
“అదేం లేదు.రేపే వెళ్ళిపోతాను.అక్కడ ఖాళీలు లేవంటే మాత్రమ్ నేను చెయ్యగలిగిందేమీ లేదు,” అన్నాడు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ.
ఎంతైనా లాయరు,తోతారామ్ కొడుకు మనసులో ఏముందో పసిగట్టాడు.తనమీద ఏ తప్పూ లేకుండా అక్కడికెళ్ళకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని గ్రహించాడు.కానీ మన్సారామ్ తో ఏమీ అనకుండా బైటికి వాహ్యాళికి బైలుదేరాడు.
ఆయన వెళ్ళాక మన్సారామ్ మేనత్త దగ్గరకెళ్ళి ,”అత్తా, నాన్న నన్ను రేపట్నుంచీ హాస్టల్ లో ఉండమని అన్నారు,”అన్నాడు.
రుక్మిణి నిర్ఘాంతపోతూ,”ఎందుకు?” అంది.
“నాకేం తెలుసు? ఇక్కడ నేను పనీ పాటూ లేకుండా వీధులవెంట తిరుగుతున్నానట.”
“ఎక్కడికీ వెళ్ళటమ్ లేదని చెప్పకపోయావా?”
“చెప్పాను, కానీ ఆయన వినిపించుకుంటే కదా?”
” ఆవిడగారే ఏదో చెప్పి ఉంటుంది!”
“లేదత్తా, ఆవిడ చాలా మంచిది.అలా ఎవరిగురించీ చెడు చెప్పే మనిషి కాదు.”
“నీకేం తెలుసురా ఆడవాళ్ళ యుక్తులు? ఉండు నేను వెళ్ళి అడిగొస్తాను.” అంటూ రుక్మిణి కోపంగా నిర్మల దగ్గరకి వెళ్ళింది.నిర్మలని నానా మాటలూ అని హింసించి ఏడిపించే అవకాశం దొరికితే ఊరికే పోనిస్తుందా!ఆవిడంటే నిర్మలకి కాస్త భయం.పైకి మర్యాదగానే ఉంటుంది.తనకి తెలీని విషయాలు ఆవిడ దగ్గర నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటుంది,కానీ ఆవిడ ఎప్పుడూ నిర్మలతో సఖ్యంగా, ఆప్యాయంగా ఉండదు.
ఆవిడ గదిలోకి రాగానే నిర్మల లేచి ,”రండి వదినా…” అంది.
[రుక్మిణి ఆమెని అనరాని మాటలంది. ఇంట్లో ఉన్నవాళ్ళని బైటికి తరిమేసి తను ఇంటికి మహారాణిలా ఉండాలనుకుంటోందని దెప్పి పొడిచింది.అన్యోన్యంగా ఉన్న తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు పెట్టేందుకే వచ్చావని తిట్టింది.నిర్మల అవాక్కయి వింటూ , మధ్య మధ్యలో తాను అటువంటి దాన్ని కానని సమర్థించుకోబోయింది.కానీ రుక్మిణి వాగ్ధాటి ముందు ఆ అమాయకపు పిల్ల నిలవలేకపోయింది,తన తప్పేమీ లేదనీ ,మన్సారామ్ ని హాస్టల్ కి వెళ్ళమన్నారని తనకి తెలీనే తెలీదనీ బాధపడుతూ చెప్పింది.’నువ్వే కన్నతల్లివైతే వాణ్ణలా వెళ్ళనిస్తావా?’ అని సూటీ పోటీ మాటలంటూ రుక్మిణి నిర్మలని అనరాని మాటలంది.ఇంతలో రెండోవాడూ, చిన్నవాడూ వచ్చి, అన్నయ్య వెళ్ళిపోయాడని చెప్పారు.నిర్మల మ్రాన్పడిపోయింది.ఎవరికీ చెప్పకుండా, కనీసం మేనత్తకైనా వెళ్ళొస్తానని చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయాడు,అనుకుంటూ చాలా బాధపడింది.]
తోతారామ్ వాహ్యాళి నుంచి వెనక్కి రాగానే నిర్మల మన్సారామ్ గురించి చెప్పింది.” అతను నాకు తీరికున్నప్పుడల్లా కాస్త ఇంగ్లీషు నేర్పేవాడు.ఇప్పుడు నాకెవరు నేర్పుతారు?”అంది.తోతారామ్ కి ఈ సంగతి తెలీదు.ఆమె ఆయన్ని అశ్చర్యపరచేట్టు ఏదో ఒకరోజు తన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని ప్రదర్శించాలనుకుని ఆ విషయం దాచింది.
భార్య చెప్పిన మాట వినగానే ఆయనలో అసూయ రగిలింది.మొహమ్ చిట్లిస్తూ, అదెప్పట్నుంచి? నాకెప్పుడూ చెప్పలేదేం?”అన్నాడు కోపంగా.
ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో నిర్మల గ్రహించలేకపోయింది.భయం భయంగా,” దానివల్ల అతని చదువుకి ఎలాంటి అడ్డంకీ రాలేదు.ఆడుకునేందుకు వెళ్ళే ముందు ఒక్క పది నిమిషాలు నాకు నేర్పించి వెళ్ళేవాడు.అతని చదువు పాడవటం నాకు మాత్రం ఇష్టం ఉంటుందా చెప్పండి?” అంది.
అది అంత పెద్ద విషయమేమీ కాదు,కానీ తోతారామ్ నీరసంగా మంచం మీద పడుకుని నుదురు రుద్దుకోసాగాడు.అసలు మన్సారామ్ ని ఇంట్లో ఉండనివ్వటమే తను చేసిన పెద్ద తప్పు,రెండో పెళ్ళి నిశ్చయమైన వెంటనే వాణ్ణి హాస్టల్ కి పంపించెయ్యాల్సింది! ఇప్పుడు తొందరపడి భార్యని ఏమీ అనకూడదనుకున్నాడు.పైకి మాత్రం, “నీకంత ఇంగ్లీషు నేర్చుకోవాలనుంటే ట్యూషన్ పెట్టేవాణ్ణి కదా, వాడి చదువెందుకు పాడుచెయ్యటం?ఒక్క పది నిమిషాల్లో వాడేం చెప్పాడు,నువ్వేం నేర్చుకోగలిగావు?”అన్నాడు.
నిర్మల ఇంకా భర్త మనోభావాన్ని అర్థం చేసుకోకుండా, ” అయ్యో,చాలా శ్రద్ధగా చెప్పేవాడు మన్సారామ్.ఒక్కసారి చెపితే అర్థమైపోయేది తెలుసా?అతను చెపుతూ ఉంటే ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. మీరు ఒక్కరోజు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది,”అంది ఉత్సాహంగా.
తన ప్రశ్నల్లోని మర్మాన్ని నిర్మల అర్థం చేసుకోటంలేదన్న ధీమాతో ఆయన,” పగలు మాత్రమే చెప్పేవాడా లేకపోతే చాలాసార్లు నేర్చుకునేదానివా?” అన్నాడు.
అప్పటికీ భర్త అలా ఎందుకు అడుగుతున్నాడో నిర్మలకి అర్థమ్ కానేలేదు.మొదట్లో సాయంకాలాలు మాత్రమే చెప్పేవాడు,ఈ మధ్య నేను సరిగా రాస్తున్నానా లేదా అని ఒకటి రెండు సార్లు మధ్యలో వచ్చి చూస్తున్నాడు.వదినగారు నావల్ల అతని చదువు పాడవుతోందనీ,ఇంకా ఏమేమిటో అని వెళ్ళారు,అది నిజం కాదు.అతనెప్పుడూ క్లాసులో ఫస్టే!” అంది
నువ్వు నన్ను బురిడీ కొట్టించలేవు.నిన్న మొన్న పుట్టినదానివి నీకేం తెలుసు,నీ లాంటి వాళ్ళని నేనెంత మందిని చూడలేదు,అని మనసులో అనుకుంటూ,”అసలు హాస్టల్ లో ఉండమంటే చిన్నబుచ్చుకునేవాళ్ళని ఎవర్నీ చూడలేదు.కుర్రాళ్ళకి అక్కడ దొరికే స్వేచ్ఛ కావాలి, స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఇష్టపడతారు.కానీ వీడేమిటి ఇలా తయారయాడు?ఇంట్లో ఉంటే వాడి చదువు సరిగ్గా సాగదు.ఇక నీ విషయమంటావా, ఒక టీచరమ్మని ఏర్పాటు చేస్తాలే,” అన్నాడు తోతారామ్.
***
(ఇంకాఉంది)
ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.