ఉత్తరాలు-ఉపన్యాసాలు-4
స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి
మూలం: ఇంగ్లీష్
ఉపన్యాసం-4
గెట్టీస్ బర్గ్ సందేశం
నేపథ్యం: అబ్రహాం లింకన్ …… అమెరికా 16 వ అధ్యక్షుడు …… అమెరికా అంతర్యుద్ధం (1861-65) ముగిసిన తర్వాత … పెన్సిల్వేనియా లోని గెట్టీస్ బర్గ్ అనే చోట …. నవంబర్ 19, 1863 రోజున చేసిన ప్రసంగం ‘గెట్టీస్ బర్గ్ సందేశం’ గా ప్రసిద్ది చెందింది. ఆ యుద్దంలో ….. ఇరువైపులా చనిపోయిన అమర జవాన్ల స్మృతిలో …… ఏర్పాటు చేయబడిన “సోల్జర్స్ నేషనల్ సిమెట్రీ” (గోరీల గడ్డ) ని జాతికి అంకితమిచ్చే సందర్బంలో లింకన్ ఈ సందేశం ఇచ్చారు.
కేవలం 271 పదాలతో కూర్చిన ఈ సందేశం ‘ప్రజాస్వామ్యం’ అనే పదానికి భాష్యంగా నిలిచింది.
అయితే….. కారణాంతరాలవల్ల ….. ప్రస్తుతం … ఈ సందేశం కొద్ది పదాల తేడాతో…. 5 భిన్నమైన ప్రతులుగా చలామణీలో వున్నది. అందులో లింకన్ స్వదస్తూరీతో రాయబడిన ….. ‘బ్లిస్ కాపీ’ గా పిలవబడే ఒక ప్రసంగపు ప్రతిని …. వైట్ హౌస్ లోని ‘లింకన్ రూమ్’ లో ప్రదర్శనకు ఉంచారు. దానినే నేను ఇక్కడ అనువదించాను.
***
ఎనిమిది దశాబ్దాల ఏడు సంవత్సరాల క్రితం ….. మన పూర్వీకులు …. ఈ ఖండం మీద …. స్వేచ్చాబీజాల పైన….. “మానవులంతా సమానులే” అన్న సూత్రంపైన ….ఓ నూతన దేశాన్ని ఆవిష్కరించి… మనకు అంకితమిచ్చారు.
ప్రస్తుతం…. మనమేమో …… అట్లాంటి దేశాన్ని ….. లేదా అంత ఉత్కృష్టంగా ఆవిష్కృతమైన ఏ దేశాన్నైనా …… ఈ విపత్కరాన్ని తట్టుగోగలదా అని పరీక్షిస్తున్నాము.
ఆ యుద్దపు నెత్తుటి చాళ్ళలో మనమిప్పుడు నిలబడి వున్నాం. ఆ దేశాన్ని సజీవంగా వుంచడానికి తమ ప్రాణాలొడ్డి …. నిర్జీవులైన అమరులకు ….. ఓ విశ్రాంత స్థలాన్ని ….. ఆ నెత్తుటి గడ్డలో ఓ భాగాన్ని …. అంకితం ఇవ్వడానికి …. మనమిప్పుడు సమయాత్తమయ్యాం. మొత్తానికి…. ఇది చాలా సబబైనది… మరియు మన కర్తవ్యం కూడాను.
కానీ…. నిశితంగా ఆలోచిస్తే ….. దీన్ని అంకితమివ్వడానికి మనం తగినవాళ్ళం కాదు….. దీన్ని పవిత్రం చేయడానికి మనం తగినవాళ్ళం కాదు….. దీన్ని శుద్ధి చేయడానికి మనం తగినవాళ్ళం కాదు. అది మన శక్తికి మించిన పని. ఇక్కడ యుద్ధం చేసి బ్రతికి బయటపడ్డవాళ్ళు ….. చనిపోయినవాళ్ళు ….. ఆ యోధులు … ఈ భూమిని ఎప్పుడో పవిత్రం చేసేశారు. మనమిక్కడ మాట్లాడే మాటల్నిప్రపంచం పట్టించుకోకపోవచ్చు! లేదా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోక పోవచ్చు! ….. కానీ ఆ వీరులు ఇక్కడ ఏం చేశారో …. ఎవరూ …. ఎన్నడూ మరచిపోలేరు. ఏ ఆశయ సిద్దికి వారు పోరాటం చేశారో ….. వాటిని సాధించడానికి ….. మనకు మనమే అంకితమవ్వాలి. ఆ అమరుల అంకితస్ఫూర్తికన్నా మరింత ఎక్కువ స్ఫూర్తితో మనకు మనమే అంకితమవ్వాల్సిన గొప్ప కార్యాచరణ మన ముందున్నది. ఈ అమరుల త్యాగాలు వృధా పోకుండా వుండడానికి గాను …. భగవంతుడి సాక్షిగా ….. ఈ భూమ్మీద ఎన్నడూ అంతరించి పోకుండా వుండే ….. ఒక నూతన స్వాతంత్ర్యోద్భవాన్ని ….. ప్రజల యొక్క …. ప్రజల చేత …. ప్రజల కోసం ….పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని ప్రమాణం చేద్దాం.
***
ముగింపు: “ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క …. ప్రజల చేత …. ప్రజల కోసం ఏర్పాటుచేయబడిన ప్రభుత్వం” అని అనేకమంది వక్తలు మాట్లాడుతూ వుండగా విన్నాను. కానీ ఈ మాటలు ‘గెట్టీస్ బర్గ్ సందేశం’ లోనివి అని నాకు మా బి.ఏ ఇంగ్లీష్ క్లాసులో వున్న ఈ పాఠం చదివే దాక ….. లేదా మా లెక్చెరర్ ఆ పాఠం చెప్పేదాకా తెలియలేదు. ఆ పాఠం ఒక పేజీ వుంటే glossary (పదాల అర్థాలు, వివరణలు) రెండు పేజీల పైన వున్నట్టు గుర్తు.
ఉపన్యాసం అంటేనే పెద్ద ప్రసంగం అని అనుకొంటాము….. కానీ …. ఇంత చిన్న ఉపన్యాసం …..ముఖ్యంగా … ప్రారంభ వాక్యంలోనే లింకన్ పద చాతుర్యం మనల్ని ఆకట్టుకొంటుంది. అంత కొద్ది మాటల్లో … ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఓ మహానీయుడిగా ఆయన మానవాళికి ఎప్పుడూ గుర్తుండిపోతాడు.
నల్లజాతి దాస్య శృంఖలాల విముక్తి కోసం పోరాటం చేసిన ….. ఈ శ్వేత జాతీయుణ్ణి (లింకన్) …. మరో శ్వేత జాతీయుడు కాల్చి చంపడం చరిత్రలో ……. ఓ మానని గాయం.
*****
ఉత్తరం-4
“తాతా, నన్ను తీసికెళ్లు”-చెహోవ్
నేపథ్యం: సుప్రసిద్ధ రష్యన్ రచయిత, ఆంటోన్ పావ్లోవిచ్ చెహోవ్ చిన్న కథలు రాయడంలో సిద్ధహస్తుడు. 17 నాటకాలు, 600 కథలు రాసిన చెహోవ్ …..“జీవితాన్ని …నిజంగా…ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి” అనేవాడట! ఆయన కథలు అట్లాగే వుంటాయి కూడా!
“వాంకా” ఓ చిన్న కథ. కథలో ప్రధాన అంశం ఉత్తరం. తొమ్మిదేళ్ల పిల్లాడి పేరు వాంకా (వాంకా ఝుకోవ్). మాస్కో పట్టణంలో, ఆల్యాఖిన్ అనే బూట్లు తయారు చేసే అతని వద్ద వాంకా ఓ నౌకరు.
కథారంభంలో …క్రిస్మస్ ముందు రోజు… ఇంట్లో పనిమనుషులతో సహా అందరూ చర్చికి వెళ్ళారని నిశ్చయించుకొన్న తర్వాత … వాంకా తన తాతగారికి ఉత్తరం రాయడానికి పూనుకొంటాడు. ఓ నలిగిపోయిన కాగితం మీద…. ఆ ఉత్తరం రాస్తూ ఉంటాడు.
ఆ ఉత్తరంలోని అంశాలతో పాటు మధ్య మధ్యలో… ఉత్తరాన్ని ఆపి … కథనాన్ని కొనసాగించడం … చెహోవ్ ఎంచుకొన్న…ఓ అద్భుతమైన టెక్నిక్. గంభీరమైన కథ పట్టుతప్పకుండా …. అక్కడక్కడా …. సునిశితమైన హాస్యం. అందులోనే …కొద్ది మాటల్లోనే… ఓ సగటు రష్యన్ జీవితాన్ని కూడా స్థూలంగా అయినప్పటికీ … కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తాడు… చెహోవ్! పాఠకులకు ఆ దృశ్యాలు కళ్ళముందు ఆడుతుంటాయి.
( కథా భాగాన్ని తీసివేసి … కేవలం ఉత్తరాన్ని మాత్రమే ఇక్కడ పొందుపరచనైనది … గమనించగలరు. ఇంగ్లీష్ లో పూర్తి కథను చదవదలచుకొన్నవారు కింద ఇవ్వబడిన లింక్ నొక్కండి. అక్కడక్కడా బ్రాకెట్లలో ఇచ్చిన సమాచారం అనువాదకుడు ఇచ్చినది అని గమనించండి.)
***
తాతయ్య కాన్ స్టంటిన్ మకరిచ్,
నేను నీకో ఉత్తరం రాస్తున్నాను. నేను నీకు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపుతున్నాను. దేవుడు ఆయన ఆశీస్సులు పంపిస్తాడని ఆశిస్తున్నాను.
రాత్రి నేను బాగా దెబ్బలు తిన్నాను. మా యజమాని నా జుట్టు పట్టుకుని….బయటకు ఈడ్చుకెళ్ళి ….తోలు పటకాతో వొళ్ళు చిరేశాడు….ఎందుకంటే, వాళ్ళ పాపను ఉయల ఉపుతూ నేను నిద్రలోకి జారుకున్నాను. మరింకా…. పోయినవారం….ఓ రోజు….మా యజమానురాలు చేప తిత్తి తీయమంటే….నేను తోక దగ్గర్నుండి మొదలుపెట్టాను…. ఆమేమో చేపను తీసుకుని నా మొఖం మీద మోదింది. మిగతా పనివాళ్ళు నన్ను ఆటపట్టిస్తుంటారు.వాళ్ళు నన్ను వోడ్కా తేవడానికి మద్యం దుకాణానికి పంపిస్తుంటారు. ఇంకా…. వాళ్ళు …. యజమాని దోసకాయల్ని దొంగతనంగా తెమ్మంటారు. యజమానేమో ….ఏది ముందు దొరికితే ….దానితోనే నన్ను కొడతాడు. ఇక తినడానికైతే ఏమీలేదు. పొద్దునా….. సాయంత్రం బ్రెడ్ ఇస్తారు. రాత్రి భోజనానికి గంజి పోస్తారు. వాళ్ళు మాత్రం…. టీ గానీ… క్యాబేజ్ సూప్ గానీ… మిగలకుండా జుర్రేస్తారు. కానీ …. నాకు మాత్రం ఎప్పుడూ ఇవ్వరు. నన్ను దారిలో పడుకోమంటారు. ఇక వాళ్ళ పాప ఏడిస్తే….నాకు నిద్ర ఉండదు. నేను ఊయల ఊపాలి. ప్రియమైన తాతా, దయచేసి నన్ను ఇక్కడినుండి తీసుకెళ్లు. …నన్ను ఇంటికి…ఊరికి తీసుకెళ్లు. నేను ఇక ఎంతమాత్రమూ భరించలేను. ఓహ్! తాతయ్యా, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మరియు వేడుకొంటున్నాను. నేను మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. తప్పకుండా నన్నిక్కడ్నుండి తీసికెళ్ళండి లేదా నేను చచ్చిపోతాను.
నేను నీకోసం నశ్యం నూరుతాను. నీకోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నేను అల్లరి చేస్తే….. నీ ఇష్టమొచ్చినట్టు కొట్టు. ఒకవేళ …. నాకోసం ఏమీ పనిదొరకదు అనుకొంటే….స్తీవార్డ్ ను … నామీద దయతలచి బూట్లు తుడిచే పని ఇవ్వమని అడుగుతాను. లేదంటే …. ఫెద్యా బదులుగా నేను గొర్రెలకాపరి పనిచేస్తాను. ప్రియమైన తాతా, నేను భరించలేను. ఈ పని నన్ను చంపేస్తున్నది. నేను పారిపోయి కాలినడకన మన ఊరికి వొచ్చేద్దామనుకొన్నాను. …. కానీ … నాకు బూట్లు లేవు. మంచును చూసి భయమేసింది. నేను … పెద్దవాడినయ్యింతర్వాత …. నిన్ను బాగా చూసుకొంటాను. ఎవ్వరూ నిన్ను భాధపెట్టకుండా చూసుకొంటాను. నువ్వు చనిపోయింతర్వాత ….. నేను అమ్మకు చేసినట్లుగా … నీ ఆత్మశాంతికై ప్రార్థనలు చేస్తాను.
మాస్కో ఎంత పెద్ద పట్టణమంటే …… ఇక్కడ ఎన్నో పెద్దవాళ్ళ భవనాలు …. మరెన్నో గుర్రాలు వున్నాయి. కానీ …. గొర్రెలు లేవు. కుక్కలు కూడా భీకరంగా వుండవు. క్రిస్మస్ వొచ్చినపుడు …. అబ్బాయిలు … స్టార్స్ తయారు చేయరు. చర్చీల్లో…. వాళ్ళు … మనల్ని పాడనివ్వరు. ఓసారి … ఓ షాపులో పెద్ద చేపల గాలం చూశాను. దానితో ముప్పై పౌన్ల బరువున్న షీట్ చేపనైనా సరే పట్టుకోవొచ్చు. షాపుల్లో…. ఇంకా … నేను అనేక రకాల తుపాకులు చూశాను …. మా యజమాని దగ్గర వున్న తుపాకి లాంటిది కూడా. అవి ఒక వంద రూబుళ్ళ ఖరీదు వుండవచ్చు. మాంసం కొట్టులో సీమకోళ్లు, కుందేళ్ళ మాంసం అమ్ముతారు…. కానీ వాటిని ఎక్కడ చంపి తెస్తారో చెప్పరు.
ప్రియమైన తాతా, ఈసారి పెద్దింట్లో (తాతగారి యజమాని ఇల్లు) క్రిస్మస్ చెట్టు పెట్టినపుడు …. నాకోసం … బంగారు పూతపూసిన బంతి (నట్)ని ఒకదాన్ని తీసి ఆకుపచ్చ పెట్టెలో దాచిపెట్టు. అది వాంకా కోసమని ఓల్గా ఇగ్నాట్ వెవ్నాకు చెప్పు.
నా దగ్గరకు వొచ్చేయ్ తాతా! నేను నీకు దండం పెడతాను. …. నన్నిక్కడ్నుండి తీసికెళ్ళు. ఈ అనాథ పిల్లాడి మీద జాలి చూపించు. నన్ను వాళ్ళు ఎప్పుడూ కొడుతూనే వుంటారు. నాకెప్పుడూ ఆకలిగా ఉంటున్నది. నేనెంత దుర్భరమైన పరిస్థితిలో వున్నానో చెప్పలేను. నేనెప్పుడూ ఏడుస్తూనే వున్నాను. యజమాని ఓ రోజు నా తలమీద బూటుచేసే చెక్కతో మోదాడు. నేను కింద పడ్డాను.
మళ్ళీ ఎప్పుడూ దెబ్బలు తినొద్దు అనుకొన్నాను. నాది కుక్క బతుకు కంటే హీనమై పోయింది. అల్యోసాను, ఒంటికన్ను యేగోర్ ను, బండివాణ్ని అడిగానని చెప్పు. నా హార్మోని పెట్టె ఎవరికీ ఇవ్వొద్దు. ఇక వుంటాను.
నేను-నీ మనవడు, ఇవాన్ ఝుకోవ్ – తాతా తప్పకుండా రా!
(ఆ ఉత్తరాన్ని మడచి…. అంతకు ముందురోజే కొన్న కవర్లో పెట్టి …… దాని మీద …. “మా వూళ్ళో వున్న తాతగారికి” అని రాస్తాడు. మళ్ళీ బుర్ర గోక్కుని …. “కాన్ స్టంటిన్ మకరిచ్” అని కలుపుతాడు. ఎవరూ చూడ్డం లేదని నిశ్చయించుకొన్నాక ….. పరుగున బయటకు వెళ్లి …. పోస్ట్ బాక్స్ లో వేస్తాడు. గంట తర్వాత…. నిద్రలో తాతయ్య తన ఉత్తరం చదువుతూ …. మిగతా పనివాళ్ళకి వినిపించడం….కలగంటాడు.)
***
ముగింపు: అప్పట్లో ఈ కథ మా బి.ఏ పాఠ్యఅంశంలో వుండేది. “వాంకా” …ఈ అమాయకపు చిన్న పిల్లాడి దీనావస్థ …నన్ను గత 50 ఏళ్ళుగా తరుముతూ వొచ్చింది. ఎప్పుడైనా ఓ బాలకార్మికుణ్ణి చూసినప్పుడు “వాంకా” గుర్తుకొస్తాడు.
“ఉత్తరాలు ఉపన్యాసాలు” శీర్షిక ఎన్నుకొన్నాక సాహిత్యంలో ఇదే గొప్ప ఉత్తరం అనిపించింది. ఇది చదివిన వారెవరైనా సరే…తప్పనిసరిగా బాలకార్మికులపై రవ్వంత ప్రేమ, దయ, జాలి చూపించకుండా ఉండలేరు. అందుకనే…ఈ ఉత్తరం.
*****
ఘనపూర్ (స్టేషన్)–వరంగల్ జిల్లా, తెలంగాణ వ్యవసాయదారుల కుటుంబంలో జననం. ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లీష్), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ నుండి ఇంగ్లీష్ బోధనలో సర్టిఫికెట్కోర్స్ –32 సంవత్సరాలు ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఇంగ్లీష్ బోధన. 2011 లో ‘హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్’ గా ఉద్యోగ విరమణ. ఇంగ్లీష్ ఎడిటర్ గా; ఇంగ్లీష్ రైటింగ్, స్పీకింగ్, IELTS శిక్షకుడిగా అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, పాలిటెక్నిక్ పిల్లల కోసం ఇంగ్లీష్ పుస్తకాల రూపకల్పన చేసి, వాటికి అనుగుణంగా టీచర్ బుక్స్ వ్రాశారు. ‘టీచ్ ద టీచర్’ శిక్షణనిచ్చారు. 2014 లో “ఇంగ్లీష్ గ్రామర్ ఫండాస్” అనే టైటిల్ తో పుస్తకం (విశాలాంద్ర ప్రచురణ) వ్రాశారు. ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి.