క్షమించు తల్లీ!

-ఆది ఆంధ్ర తిప్పేస్వామి

అమ్మా!

నీ అడుగులకు ఓసారి సాగిలబడాలనుంది!

చెమ్మగిల్లిన కళ్ళతో ..

నీ పాదాల చెంత మోకరిల్లాలనుంది!

నీదంటూ ఒకరోజుందని…గుర్తుచేసుకుని

నిన్ననే ఆకాశంలో సంబరాలు చేసుకున్నాం!

నీకు సాటిలేరంటూ గొప్పలు పోయాం!

గుండెలో పెట్టుకుని గుడికడతామంటూ

కవితలల్లి ఊరువాడ వూరేగాం!

క్షమించు తల్లీ!

నిచ్చెనేసి ఆకాశంలో నిలబెట్టాలని నువ్వుడగలేదు

సొంతూరికి చేర్చమని కాళ్లా వేళ్లా పడుతున్నావు..!

రోజూ పరమాన్నంతో కడుపునింపమని కోరలేదు

ఆకలితో చచ్చిపోయే ప్రాణాలకింత

గంజి పోయ మంటున్నావు ..!

అంతేగా!!

ఎండకు గొడుగు పట్టమనలేదు

నీ గూటికి చేర్చమంటున్నావు..!

బొబ్బలెక్కిన కాళ్లకు పాదరక్షలు ఇమ్మనలేదు

ఇంటిపట్టున వుండే వెసులు బాటు ఇమ్మంటున్నావు..!

అంతేగా!!

కోట్ల ప్యాకేజీలు..

అద్దాలమేడల్లో ప్రకటించిన  ఉద్దీపన ఫలాలూ

వండి వార్చిన  ఉచిత భోజన సదుపాయాలు ఇవేవీ 

మీ కడుపు నింపలేదనే చేదు నిజం తెలిసి..

గుండె నిబ్బరంతో..మొక్కవోని ధైర్యంతో

కష్టాల కడగండ్లని దిగమింగుకుంటూ

వేల మైళ్ళ దూరాన్ని లెక్కచేయక

ఒంటరి పయనానికి సిద్ధపడ్డ ఓ మాతృమూర్తి!

వేల వేల వందనాలు!

కలసి రాని కాలంతో

కసిరి పొమ్మంటున్న లోకంతో

తలదాచుకోవడానికింత చోటివ్వని

మనుషుల మధ్యన ఉండలేక

నెత్తిన మూటా ముల్లెతో

చంకన పసిబిడ్డతో గమ్యం చేరేందుకు

కాలినడకన బయలుదేరిన ఓ మాతృమూర్తి !

జరభద్రం తల్లీ!

ఆపన్న హస్తం కోసం ఆశ పడకు!

ఆసరా కోసం అంగలార్చకు!

తడబడిన అడుగులకు …

మడుగులొత్తే మనిషి కోసం ఎదురు చూడకు!

నిన్ను దాటించడానికి

నా దేశం ఇప్పుడు రైలు పట్టాలపై

కాళ్లు తెగిపడి అవిటిదయింది

రెక్కలు తెంపుకుని నెత్తురు గాయాలతో

పక్షిలా ఒంటరిగా విలపిస్తూవుంది

దారమ్మటా నెత్తుటి సంతకాలు చేసుకుంటూ వెళ్లే నీకు

చలువ పందిళ్లు పరిచి పూల వానలు కురిపించలేను

చిమ్మ చీకటిని చీల్చుకుంటూ మైళ్ల దూరానికి

రెక్కలు తొడిగిన నీకు దారి దీపాన్ని కాలేకపోతున్నా!

క్షమించు తల్లీ!

బొబ్బలెక్కిన కాళ్లకు

ఏ చెట్టు బెరడో మలాం రాయలేను

దాహం తో పిడచకట్టుకు పోయిన నోటికి

ఏ పసరో అందించలేను

అద్దాల మేడల్లో నిల్చుని

కరతాళ ధ్వనులతో స్వాగతించలేను

చీకటి నిండిన నీ బతుకులో

వెలుగు హారతులివ్వలేను

ఏ కాలంలో ..ఏ దేవుడో…

అడవుల్లో దిగబెట్టినట్లు

ఈ రోజు నిన్నిలా..నిర్దయగా ..

నడివీధిలోనిలబెట్టినందుకు

క్షమించు తల్లీ! క్షమించు!!

(విజయవాడ నుంచి మధ్యప్రదేశ్ కు కాలినడకన బయలుదేరిన “ఓ వలస కార్మికురాలి “దృశ్యానికి స్పందనగా…14.5.2020 వ తేదీ దినపత్రికల ఆధారంగా)

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

7 thoughts on “క్షమించు తల్లీ!”

  1. I am So, thank ful to you….SIR 🙏🏿 🙏🏿
    I am studying in 9th class….
    That is nice కవిత ……
    Itt is very use full to me……

    1. మీ అభినందనకు ధన్యవాదాలు

  2. ఆర్ద్రత నిండిన కవిత…అభినందనలు

Leave a Reply

Your email address will not be published.