జగదానందతరంగాలు-4
తిరుపతి
-జగదీశ్ కొచ్చెర్లకోట
“లేవాల్లేవాలి! మళ్ళా క్యూ పెరిగిపోతుంది. నాలుగున్నర రిపోర్టింగ్ టైము!” తను అలా తరమకపోతే ఓపట్టాన లేచేవాళ్ళెవరూ లేరిక్కడ.
“పొద్దున్నే లేవాలన్నప్పుడు పెందరాళే పడుకోవచ్చు కదండీ! ఈకబుర్లు ఎప్పుడూ వుండేవే!” అని తనంటూనేవుంటుంది.
కానీ ఇల్లొదిలి, ప్రాక్టీసొదిలి, ఇహలోకంనించి ఇక్కడికొచ్చాకా కూడా పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే పాతకం కాక మరేఁవిటి?
ఇంటిదగ్గరుంటే లేచినవెంటనే కాల‘అ’కృత్యాలు మొదలవుతాయి..అదేనండీ…ఫేస్‌బుక్కూ, వాట్సప్పూ చూసుకోవడం, పేపర్ చదువుతూ కూర్చోడం!
ఇలా నెట్వర్కుల్లేని చోటకొస్తే కాలకృత్యాలు పద్ధతిగా జరుగుతాయి.
సూర్యభగవానుడికన్నా ముందే సింగారించుకుని తయారైపోయాం.
తను మల్లెపువ్వులాగ, నేను మొగలిపొత్తులాగ, మా సన్నాసులిద్దరూ అశోకా శాండల్ పౌడర్ డబ్బాల్లాగ ఘుమఘుమలాడుతున్నాం!
‘టీ’కోసం పోటీపడుతున్న ఉత్తరాదివారినీ
‘కాఫీ’రాగాన్ని ఆలపిస్తున్న దక్షిణాదివారినీ
ఉత్సాహంగా ఉల్లాసపరుస్తున్న నాయర్ ముఖమ్మీద మెరుస్తున్న విభూతి తప్ప అంతా చీకటిగావుంది.
బయటకొచ్చేటప్పటికి చిన్న చలి తగిలింది.
కానీ ఆ చలి ‘ఏదో’లాంటి చలికాదు. అందులో పవిత్రత వుంది. ఇంకావేస్తే బావుణ్ణనీ వుంది. ప్రతీ వృక్షం తలొంచి వినమ్రంగా నిలబడినట్టుంది. పూలచెట్లయితే వంగివంగి పువ్వులిస్తున్నట్టుంది.
“పట్టుకెళ్ళండి! ఆస్వామి దగ్గరికి నేన్నడుచుకెళ్ళలేను. ఈ విరులన్నీ ఆయనకు సమర్పించి మీరే ఆపుణ్యం కట్టుకోండి!” అని వేడుకుంటున్నట్టే వుంది.
ముచ్చటగా మూడుగంటలైనా పడుకోని మూర్తిని కౌసల్యాదేవి పేరుచెప్పి మేలుకొలుపుతున్నారు అయ్యవార్లు. మంద్రంగా మైకులన్నిటా వినబడుతున్న ఆ సుప్రభాతంతో మమేకమైపోయాం!
మనోవాక్కాయకర్మలన్నీ మంత్రబద్ధమైనట్లు మనోహరంగా మారిపోయాయి.
అల్లరి, అహంకారం అన్నీ అదృశ్యమైపోయాయి
చిన్నతనం, చిలిపిదనం చిత్రంగా మాయమయ్యాయి.
వైకుంఠం క్యూకాంప్లెక్సుకి వెళుతున్నట్టులేదు… వైకుంఠంలోనే విహరిస్తున్నామేమో అన్నంత హృద్యంగావుంది వాతావరణం!
‘ఎదుటనెవ్వరులేరు ఇంతా విష్ణుమయమే’ అనడం అతిశయోక్తి కాదు.
ఇక్కడేదో వుంది. ఈగాలిలో నిండైన భక్తి జీవనదిలా ప్రవహిస్తూ వుంటుంది. మాపాదాల్ని తాకిన చల్లటి నీరు మనసుల్ని కూడా ప్రక్షాళన చేసేసింది.
‘చేరిపారేటి నదులు శ్రీపాద తీర్ధమే’ అదికూడా ఆతని పాదాల్ని తాకిన పవిత్రగంగాజలమే కదా!
దర్శనానికై బారులుతీరిన భక్తులు తమ కోరికలన్నీ స్వామికి నివేదించుకోవాలని ఇంటిదగ్గర అనుకునే వచ్చారు!
కానీ ఆక్షణం వారికవేమీ గుర్తురావడంలేదు..
నామాలదేవుడికిచ్చే నిలువుదోపిడీ తప్ప!
క్లేశాలను తొలగించమని సహకారంకోరగా తరలివచ్చినవారు
కేశాలను తొలగించుకుని మమకారాన్ని వదిలి నిలుచున్నారు!
గోవిందనామాన్ని గొంతెత్తి పాడుతున్నారు.
ఆ క్షణం ఆసన్నమైంది.
ఒకడిపైనే దృష్టి…
రెండేకదా కనులున్నవి…
ముక్కంటి క్షేత్రపాలనలో…
చతురాననుడి చరాచరసృష్టిలో…
పంచేంద్రియాలూ పరమాత్మయే!
ఆరడుగుల ఆజానుబాహువు..
ఏడుకొండల్ని ఎక్కించినవాడు..
అష్టకష్టాల్నీ మరిపించినవాడు..
నవనవోన్మేషమైన అలంకరణతో..
దశదిశలా దివ్యరూపమే సాక్షాత్కరించింది!
కళ్ళనిండా చూసుకుని
మనసునిండా నింపుకుని
నోరారా కీర్తించేసరికి..
‘ఇహ నడవండి!’ అంటూ
ఇహలోకంలోకి తోసేశారు.
జయవిజయుల్లా వీళ్ళకీ రాక్షసజన్మలు తప్పవేమో అనిపించిందొక్క క్షణం.
‘పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్ల!’ అని అన్నమయ్య చెప్పినట్లు ఇడ్లీలు, ఉప్మాలు, పొంగళ్ళు…
ఆరగించేది ఏదయితేనేం పదార్ధం
ఆతడి ప్రసాదమేనన్నది యదార్ధం
కలికాలం ఆకలికాలం! తినక తప్పదు.
బరువైన అడుగులతో గదికిచేరిన నామదిలో
‘భారపు భూమియతని పాదరేణువే!’ అన్న భావన!
ఏడాదికోసారి ఏడుకొండలవాణ్ణి చూసే మనకే ఇలా అనిపిస్తే ఎల్లవేళలా ఎనలేని సేవలో మునిగిన అన్నమయ్యకు ఎలావుండి వుంటుంది?
భావములోనా బాహ్యమునందును
గోవిందునే తలచిన భక్తశిఖామణికి ఏరీతిగా వుండి వుండునో అతని సంకీర్తనామృతమే శెలవిస్తుంది.
అది అద్వితీయం. ముల్లోకాలకూ ముదావహం. నాల్గుముఖాల బ్రహ్మకైనా అలవడని అసదృశ కావ్యం.
*****
నాపేరు: డాక్టర్ కొచ్చెర్లకోట జగదీశ్
వృత్తి: జిల్లా కేంద్ర హాస్పిటల్లో సివిల్ సర్జన్ అనెస్తీసియాలజిస్ట్
ప్రస్తుత నివాసం: విజయనగరం
అరె… ఎక్కడ చూసినా మీరేనా…సర్వం జగదిశం
😊 ఎంతమాట!