జ్ఞాపకాల సందడి-11
-డి.కామేశ్వరి
2012 – వంగూరి ఫౌండేషన్ లైఫ్ టైం అవార్డు అందుకోడానికి హ్యూస్టన్ వెళ్లినప్పటి మాట.
1986 లో అమెరికా యూరోప్ టూర్ వెళ్ళినపుడు ఒక నెలరోజులు ఉండి చూడాల్సినవి చూసా కాబట్టి ఈసారి అవార్డు ఫంక్షన్ హ్యూస్టన్ లో, డల్లాస్ లో సన్మానం అయ్యాక నా ముఖ్య బంధువుల ఇళ్లలో తలో రెండుమూడు రోజులు ఉండేట్టు ప్లాన్చేసుకున్నా.
వాషింగ్టన్ లో మనవడు నిర్మల్ , చెల్లెలు కూతురు కల్పనా వున్నారు. నాకు మునిమనవడు మూడు నెలల క్రితం పుట్టాడు. వాడిని ముందు చూడాలి గదా! అక్కడికి వెళ్ళినపుడు చిన్న సరదా జ్ఞాపకం.
వెళ్ళగానే అమ్మమ్మకి మర్యాదగా, అభిమానంగా వాళ్ళ బెడ్ రూం ఇచ్చి సామాను పెట్టారు.
వన్ బెడ్ రూం అపార్ట్మెంట్ , పెద్ద హాల్ . ఒక బెడ్రూమ్ , కిచెన్ ఉంటే స్టూడియో అపార్ట్మెంట్ అంటారు.
పెళ్లి అయిన కొత్తలో నుండి అక్కడే ఉంటున్నారు. హాల్లో పడుకుంటానన్నా వినకుండా గది ఇచ్చారు. గదిలోకి తీసికెళ్ళి క్రిస్టీన్ ( మనవడి జర్మన్ భార్య ) కప్బోర్డు తలుపు తీసి ఏదో అంది.
అమెరికన్ యాక్సెంటే సరిగా అర్ధంకాదు అందులో జర్మన్ యాక్సెంట్ లో బట్టలు పెట్టుకోమంటుందేమో అని బుర్ర ఊపా.
అంతలో చటుక్కున రెండో అరలో మెరుస్తూ నాలుగు కళ్ళ లాటివి కనిపించి ఓ కేకపెట్టి వెనక్కి తగ్గా.
అక్కడ అరలో రెండు పిల్లులు “మ్యావు” అని అరిచి కిందకి గెంతి పారిపోయాయి.
నిర్మల్ వచ్చి విషయం చెప్పాడు. అవి పెంపుడు పిల్లులు. రోజంతా కప్బోర్డు లో చలికి పడుకుని రాత్రి ఇంట్లో తిరుగుతాయి, నీవు భయపడతావని క్రిస్టీన్ చూపించి చెప్పింది అని చెప్పాడు.
ఇంట్లో పెద్ద కుక్కకూడా ఉంది. సరే రాత్రి హాల్లోపెద్ద ఎయిర్ బెడ్ వేసుకుని వాళ్ళు పడుకున్నారు.
అర్ధరాత్రి బాత్ రూమ్ వెళ్ళడానికి లేస్తే హాల్లో కనిపించిన దృశ్యం ఏవిటంటే-
భార్య భర్త , మధ్యన చంటివాడు, కాళ్ల దగ్గర కుక్క, తలల దగ్గర చెరో వైపు రెండుపిల్లులు, వాళ్ళ ఫుల్ ఫామిలీ అన్నమాట హ్యాపీగా పడుకున్నారు.
ఓరి వీళ్ళ దుంపతెగా అలా పక్కలమీద ఎక్కించుకోడం ఏమిటో అర్ధం కాలేదు.
చంటివాడిని కుక్క, పిల్లులు నాకేస్తున్నాయి.
“ఒరేయ్! రోగాలు పట్టుకుంటాయిరా ” అని కేకలేస్తే.
“ఏమీ రావు, పైగా ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది” అని వాదించాడు.
మేము కుక్కని పెంచాం. కానీ పక్కలు, సోఫాలు నాకడాలు అలౌ చేయలేదు.
ఫారెనర్స్ అందరు చంటిపిల్లల దగ్గర అలా వదిలేస్తారు.
ఆరాత్రి దృశ్యం ఫోటో తీయడానికి అపుడు మాములు సెల్ తప్ప స్మార్ట్ఫోన్లు ఇంకా రాలేదు నాకు.
అలమరాలో మాత్రం ఊహించని ఆ కళ్ళు చూసి నిజంగానే భయపడ్డా!
*****