నారిసారించిన నవల-11

వట్టికొండ విశాలాక్షి

-కాత్యాయనీ విద్మహే 

  

వట్టికొండ విశాలాక్షి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం నుండి వచ్చిన మొట్టమొదటి నవలా రచయిత్రి.  జాతీయోద్యమ ప్రభావంతో  కవిత్వం, కథలు వ్రాసినవాళ్ళు వున్నారు కానీ దానిని  వస్తువుగా చేసిన నవల వ్రాసిన రచయిత్రి సమకాలంలో హవాయీ కావేరి బాయి తప్ప మరొకరు కనబడరు.వ్రాసినంత వరకు అయినా ఏ దుర్గాబాయి దేశముఖ్ వంటి వాళ్ళో తప్ప ప్రత్యక్ష కార్యాచరణలో భాగస్వాములైనట్లు తెలిపే ఆధారాలు అంతగా కనబడవు. వట్టికొండ విశాలాక్షి అలా కాదు. ఆమె కమ్యూనిస్టు పార్టీ సిద్దాంతం పట్ల నిబద్ధతతో, ఆ పార్టీ ఆదర్శాలకు అనుగుణంగా ఏర్పడిన అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యులలో ఏకైక మహిళ. ఆ అనుభవం నుండి, చైతన్యం నుండి ఆమె నవలలు వ్రాసింది. అది  విశేషం. ఆమె ఆరు  నవలలు వ్రాసినా . భారతనారి, తపోభంగం,ఆత్మబలం అలభ్యాలు. లభిస్తున్నవి యుగధర్మం, ఖైదీ, నిష్కామయోగి, మాత్రమే. 

1943 లో ఆంధ్రదేశంలో అభ్యుదయ రచయితలసంఘం ఏర్పడటం అంతర్జాతీయ రాజ కీయార్థిక సాంస్కృతిక  పరిణామాల ప్రతిఫలనం. రెండవప్రపంచయుద్ధం హిట్లర్ ను,  ఫాసిజాన్ని ప్రపంచ రంగ స్థలం మీదికి  తెచ్చాయి. నియంతృత్వం, జాతీయ దురహంకారం మానవ సంస్కృతికి తీరని ద్రోహం చేశాయి. ఈ పరిస్థితులలో సంస్కృతీ పరిరక్షణ కర్తవ్యం భుజాల కెత్తుకొని 1935 లో  మాక్జిమ్ గోర్కీ , హెచ్.జి. వేల్స్, రోమరోలా వంటి యూరప్ దేశాల రచయితల చొరవతో  పారిస్ లో జరిగిన  అంతర్జాతీయ రచయితల సదస్సుకు అప్పటికే పై చదువులకోసం ఇంగ్లాండు లో ఉన్న సజ్జాద్ జహీర్, ముల్క్ రాజ్ ఆనంద్, యండి.తస్సీర్, ప్రమోద్ సేన్ గుప్తా వంటి కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావానికి లోనైన భారతీయ యువత కూడా హాజరు కావటంతో ఇండియన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఇంగ్లండ్ లోనే  పురుడుపోసుకొన్నది. 1935 డిసెంబర్ భారతదేశంలో (అలహాబాద్)  నిర్దిష్ట ప్రణాళికతో స్థిరపడింది.1936 లో ప్రేమ్ చంద్   అధ్యక్షతన జరిగిన అఖిల భారత అభ్యుదయ రచయితల సమావేశానికి వెళ్లి వచ్చిన అబ్బూరి రామకృష్ణారావు తెలుగు ప్రాంతాలలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటుకు శ్రీశ్రీని , పురిపండా అప్పలస్వామిని కూడగట్టుకొని తొలి ప్రయత్నాలు చేసాడు. 1942 నాటికి కమ్యూనిస్టు పార్టీ ప్రోద్బలంతో అభ్యుదయరచయితల సంఘం ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీలలో తాపీ ధర్మారావు అధ్యక్షతన జరిగిన ప్రధమ మహాసభలలో ప్రకటించబడిన అభ్యుదయరచయితల సంఘం కార్యవర్గంలో వట్టికొండ విశాలాక్షి కూడా ఉన్నది. విశాలాక్షి ఎక్కడినుండి అక్కడికి అలా చేరుకోగలిగింది? 

1

వట్టికొండ విశాలాక్షి భారత జాతీయోద్యమంలో సహాయనిరాకరణ ఘట్టం ప్రారంభమైన కాలంలో 1921 సంవత్సరం జూన్ నెలలో  గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించింది. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి పున్నయ్య. గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో 4 వతరగతివరకు చదివింది. ఇంటివద్ద సంస్కృతం చెప్పించారు తల్లిదండ్రులు. దొరికిన పుస్తకం అల్లా చదివే అలవాటు అయింది. 1936 లో గుంటూరు ఎసి కాలేజీలో ఎఫ్.ఎ చదువుతున్న వట్టికొండ రంగయ్య తో ఆమెకు పెళ్లి అయింది.  అత్తగారి వూరు కృష్ణాజిల్లా వీరులపాడు. కాట్నాలు కానుకలు తేలేదని అత్తగారి సాధింపులు ఆమెకు తప్పలేదు. అయినా అక్కడ ఆమెకు శబ్దమంజరి, అమరకోశం, రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం మొదలైన సంస్కృత కావ్యాలు చదువుకొనే అవకాశం మాత్రం లభించింది. వీరులపాడు ఆమెను  కమ్యూనిస్టు గా మలచటం మరొక విశేషం. కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉన్న ఆ కాలంలోనే పార్టీ పత్రిక ఆ వూళ్ళో రహస్య వినిమయంలో ఉండేది. ఆమె ఆ పత్రిక పాఠకురాలు. మహిళలకు నిర్వహించబడిన రాజకీయ పాఠశాలకు విశాలాక్షి కూడా హాజరయింది. జయ ప్రకాష్ నారాయణ రచించిన సోషలిజం ఎందుకు? అనే పుస్తకం ఆమెను బాగా ప్రభావితం చేసింది. వీరులపాడులో కమ్యూనిస్టు పార్టీ సంఘ కార్యదర్శిగా బాధ్యతలు కూడా నిర్వహించింది. ఆ క్రమంలోనే ఆమె అభ్యుదయ రచయితల సంఘంలోకి రాగలిగింది. భర్త వట్టికొండ రంగయ్య కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కావటం , కవి, రచయిత కావటం ఆ దిశగా విశాలాక్షి తన జీవితాన్ని నిర్మించుకొనటానికి మరింత ఉపయోగపడింది. 

అభ్యుదయ రచయితల సంఘం   ఏర్పడినప్పటి నుండి ఆమె అందులో చురుకైన పాత్రా వహించింది. సంస్థ సిద్దాంతాన్ని, ఆశయాలను అవగాహన చేసుకొంటూ దానిని కవిత్వంగా మార్చటం నేర్చుకొన్నది. రచయితల సంఘం సభలలో చదువుతూ వచ్చిన ఆ కవితలను కలిపి  ఆరునెలలు తిరగకుండానే  ‘అభ్యుదయగీతాలు’ అనే పుస్తకంగా  ప్రచురించింది. ( 1943,ఆగస్టు) ఉన్నవ లక్ష్మీనారాయణ, జివి కృష్ణారావు, గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు , చలం మొదలైన వాళ్ళ వచనరచనలు వాటిలోని అభ్యుదయ దృష్టి ఆమెను ఆకర్షించాయి.  ఉద్యోగరీత్యా మద్రాస్ వెళ్ళటం, చదలవాడ పిచ్చయ్యతో వచ్చిన చిన్న గొడవ కారణంగా వట్టికొండ రంగయ్య అభ్యుదయ రచయితల సంఘంలో ఎక్కువకాలం కొనసాగలేకపోయాడు. ఆయనకు ఇష్టం లేకపోయినా విశాలాక్షి మాత్రం అభ్యుదయ రచయితల సంఘంలో కొనసాగింది. దానిని భరించలేక ఆయన ఆమెతో మాట్లాడటం మానేసాడు. అయినా ఆమె అభ్యుదయరచయితల సంఘం నుండి బయటకు రావటానికి ఇష్టపడలేదు. దానితో ఆయన ఆమెను తీసుకొనివెళ్ళి పుట్టింట వదిలివచ్చాడు. తాను చెప్పినట్లు వింటేనే తిరిగి తీసుకువెళతానని అన్నాడు. అయినా ఆమె జంక లేదు. అభ్యుదయ రచయితల సంఘానికి రాజీనామాచేయటం అంటే తనను తాను కించపరచుకొనటమే అవుతుందని భావించింది. అంతకన్నా ఎవరిదారిన వాళ్ళు ఉండటమే మేలని చెప్పి చేబ్రోలులోనే ఉండిపోయింది. కొంతకాలానికి భర్త వచ్చి రాజీనామా ప్రసక్తి ఎత్తకుండానే ఆమెను తాను ఉద్యోగం చేస్తున్న మద్రాసుకు తీసుకువెళ్లాడు. మద్రాస్ లో ఉంటే  ఆంధ్రదేశంలోని అభ్యుదయ రచయితల సంఘం కార్యకలాపాలకు హాజరు అయ్యే అవకాశాలు ఉండవన్నది  అతని ఆలోచన. అదే నిజమైంది. బరంపురం లో నిర్వహిస్తున్న సాహిత్య పాఠశాలకు వెళ్లాలని తిండి మాని పంతం పట్టికూడా విశాలాక్షి అనుకున్నది సాధించలేకపోయింది. అభ్యదయ రచయితల సంఘం నుండి విజయవంతంగా ఆమెను పరాయీకరించాడు అతడు. తనకు ఇష్టమైన సాహిత్య సంఘంలో పనిచేసే స్వేచ్ఛ హరించబడి, భర్త ,నియంత్రణలో   అసంతృప్తికి లోనైన విశాలాక్షి వచనరచన వైపు మళ్లింది.1951 నుండి కథలు, నవలలు వ్రాయటం ప్రారంభించింది. స్వీయ అనుభవాల నుండి స్త్రీల కోణం నుండి నాటి ఉద్యమాలను విలువకడుతూ ఆమె సమకూర్చుకున్న ఇతివృత్తాలు అంతకు  ముందు లేనివి. 

2

లభిస్తున్న విశాలాక్షి నవలలు మూడింటిలో ఖైదీ, నిష్కామయోగి ప్రత్యేకంగా పరిశీలించవలసిన నవలలు. యుగధర్మం మిగిలినవాటిలాగానే 1956 లో తొలిసారి ప్రచురించబడింది. గుంటూరులోని ప్రజావాణి ప్రచురణగా మూడవముద్రణ సంవత్సరం లేకుండా వెలువడింది. ఇందులో ఇతివృత్తం విచిత్రమైనది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే మేనమామను పెళ్లాడటం ఇందులో విషయం. పెళ్ళికి ముందు మూడేళ్ళ క్రితం నుండే సరోజకు మేనమామతో సంబంధం ఉందని, ఇద్దరూ ఆవిషయం దాచి తనను మోసం చేసారని తరువాత ఎప్పుడో తెలిసిన అక్క శాంత వాళ్ళిద్దరితో సంబంధాలు వదులుకోకుండానే  దాంపత్య సంబంధాలనుండి తప్పుకొనటానికి బ్రహ్మచర్య దీక్ష పట్టటం ఈ నవల వస్తువు. ఆడవాళ్లు రుక్మిణులుగా ఉండే కాలం, మగవాడి కృష్ణ క్రీడలు నడిచే కాలం మాత్రం ఇది కాదని సూచిస్తూ ముగుస్తుంది.  అంతకు మించి  ఈ నవలకు మరే   ప్రత్యేకత లేదు. ప్రయోజనమూ లేదు.

 ఖైదీ, నిష్కామయోగి నవలలు అట్లా కాదు. జాతీయోద్యమ  కమ్యూనిస్టు ఉద్యమ నేపధ్యాలనుండి  మహిళల జీవితాన్ని వ్యాఖ్యానించిన నవలలు ఇవి. వీటిలో ఖైదీ మొదటిది .  కాంగ్రెస్ పత్రికలో(1952) ప్రచురించబడింది. ఆ లెక్కన  ఇది ఆమె తొలి నవల కూడా కావాలి.  1956 లో గుంటూరు నుండి ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. రెండవ ముద్రణ కూడా వచ్చింది. సంవత్సరం తెలియటం లేదు. ఒక ఆడ రాజకీయ ఖైదీ, ఒక జైలు ఆసుపత్రి డాక్టర్ వీళ్లిద్దరి స్నేహం, సంభాషణలు, సంబంధం,ఒకరి గురించి ఒకరి మనసు లో చెలరేగే అంతః సంఘర్షణలు ఈ నవల కు ఇతివృత్తం సమకూర్చాయి. ఎవరికోణం నుండి వారు చెప్పే ఉత్తమపురుష కథనాలు, ఇద్దరి గురించి ప్రథమపురుషలో సాగే రచయిత కథనం ఇందులోని ప్రత్యేక శిల్పం. అంతే కాదు. కథ వర్తమానం నుండి గతానికి జ్ఞాపకాల రూపంలో ప్రయాణిస్తూ మళ్ళీ వర్తమానానికి తిరిగివస్తూ కొనసాగుతుంటుంది. 

ఈ నవలలో కథాకాలం స్థూలంగా 1940 వదశకం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే  కమ్యూ నిస్టుపార్టీ   విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఏర్పరుస్తూ ప్రజాపునాదిని బలపరుచుకొంటూ  చురుకుగా  పనిచేస్తూ, నిషేధానికి, నిర్బంధానికి  గురిఅవుతూ ,అజ్ఞాత వాసం చేస్తూ, రాజ్యహింసకు గురవుతూ , కార్యకర్తలను కోల్పోతూ చరిత్ర సృష్టించిన కాలం.1948 నుండి 1951వరకు ఆంధ్రదేశంలో పోలీసురాజ్యం నడిచిన కాలం. అయితే ఆ కాలపు చరిత్ర కన్నాఆ  చరిత్ర నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల అంతరిక సంఘర్షణలు, సంబంధాలు ఇందులో ప్రధానం. 

ఈ నవలలో ఆ స్త్రీకి పేరులేదు. ఖైదీ .. ఆజన్మఖైదీ. అంతే.  విద్యార్థి ఉద్యమాలనుండి మహిళా ఉద్యమంలోకి వచ్చింది. ప్రధాన భూమిక నిర్వహించింది. ప్రభుత్వం దృష్టి పడ్డది. ఫలితం జైలు . డాక్టర్  జైలు ఆసుపత్రి డాక్టర్. ఏమీ జరిగిందో .. అతని నేపధ్యం ఏమిటో సూచనలేదు కానీ  ఉన్నటుండి అతను ఖైదు చేయబడ్డాడు. ఆడవాళ్ళ జైలులో ఆమె కు అతని గురించిన ఆలోచనలు. మగవాళ్ల జైల్లో అతనికి ఆమె గురించి ఆలోచనలు. అతని చెల్లెలు చనిపోవటంవల్ల పెరోల్ మీద అతను బయటకు వచ్చాడు. అదే సమయానికి తల్లి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమెను కూడా పెరోల్ మీద ఇంటికి పంపారు. అతను ఆమె ఇంటికి వచ్చి కలిసి మాట్లడి వెళ్ళాడు. వెళ్తూ ఆమెనూ ఆమె అన్నాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. పెరోల్ ముగిసి తిరిగి వెళ్ళేటప్పుడు త్రోవలోనే ఉన్న వాళ్ళ వూర్లొ దిగి రెండురోజులు ఉండేట్లు నిర్ణయం అవుతుంది.అన్న ఏవో పనులు ఉన్నాయని  ఆమె ఒక్కతేనే పంపుతాడు. 

అక్కడ డాక్టర్ ఆమె ప్రేమలో ఉన్నారని స్పష్టం అవుతుంది. అతను ఆమెతో సాన్నిహిత్యాన్ని వాంఛిస్తాడు. కోరికలు లేకుండా ఉండలేమా అని ఆమె తర్కం. ఇద్దరూ మళ్ళీ జైలుకు వెళ్ళవలసినవాళ్ళే. పెళ్లి చేసుకొనే అవకాశాలు కనిపించనప్పుడు ప్రత్యామ్నాయం ఇద్దరం ఒకటి అని నమ్మకం కుదుర్చుకొనటమే కదా అని అతని అభిప్రాయం. ఆ ఊగిసలాటల మధ్యనే తోటలో ఇద్దరూ ఏకమవుతారు. అది ఆమెకు కొంత దిగులు కలిగిస్తుంది. యధాప్రకారం జైలుకు వెళుతుంది. అతను జైలుకు వెళ్లకుండా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి మహిళాఖైదీలను విడుదలచేస్తారు. అలా ఈ ఖైదీ కూడా ఇల్లు చేరుతుంది. అజ్ఞాతంలో ఉన్న అతనిని అప్పుడప్పుడు  కలుస్తుంటుంది. ఒకవైపు ఇష్టం,ప్రేమ. మరొకవైపు అలా అతనికోసం వెళ్ళటం చూసి లోకం ఏమనుకొంటుందో అని లోలోపలి చింత, తల్లికి ఇష్టంలేదు కనుక  అతనితో పెళ్ళి సాధ్యం కాని విషయమే. అటువటప్పుడు అతనికోసం వెళ్ళటం ఎప్పటికైనా ప్రమాదకరమే అనుకొంటుంది. . మళ్ళీ కాదనుకొని అలాగే ఉండిపోయేలా మనసుని గట్టి పరచుకోలేక యాతన పడుతుంటుంది.   

ఆ పరిస్థితులలో డాక్టర్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిని ఎక్కడకు తీసుకొనివెళ్ళారో, ఏమి చేశారో సమాచారం ఏమీ లేదు. అతని గురించి ఖైదీకి దుఃఖం, వేదన.  “తాను ఖైదీ మాత్రమే కాదు సమాజానికి కొందరు వ్యక్తులకు బానిస అని బాధపడుతుంది. ఎప్పుడో జైలులో ఉన్నప్పుడు మాత్రమే ఖైదీని కాదు వెలుపలకు వచ్చిన తరువాతకూడా నిరంతరమూ ఖైదీగానే జీవించాను. ఈ సంఘంలో ఉన్న అజ్ఞానమే నాకు ఆజన్మ శిక్ష అయింది. ఈ సంకుచిత సామాజిక వ్యవస్థే నా చుట్టూ కటకటాలై కాపలా కాసింది. అందువల్లనే ఇక్కడ ఉన్నన్నాళ్ళయినా డాక్టరును సుఖపెట్టలేకపోయాను”  అన్న బెంగతో ఆమె జ్వరపడటంతో ఈ నవల ముగుస్తుంది. 

కమ్యూనిస్టు పోరాటాన్ని కాక పోరాట నేపథ్యంలో స్త్రీపురుషుల మనోలోకాల వైచిత్రిని  పనితీరును,  ప్రదర్శించే ఇతివృత్తంతో సాగే ఈ నవలలో కథ ప్రవర్తించే ప్రాంతాలు  ప్రధానంగా జైలు. జైలు ఆసుపత్రి. ఆ మేరకు జైలుజీవితం ఇతివృత్తంలో భాగం అయింది. ఆ తరువాత ఇందులో కీలకమైన కథాంశం   ప్రేమను, లైంగికతను చుట్టుకొని ప్రవర్తిస్తుంది. ఆ మేరకు ఈ నవల వాటిని  చర్చించకు పెట్టిన  తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అది ఆనాటికి విప్లవాత్మకమైనదే. 

ఖైదీ, డాక్టర్ – ఈ ఇద్దరి ముఖంగా  జైలు జీవిత చిత్రం రేఖామాత్రంగా పరిచయం అవుతుంది ఈ నవలలో.  జైలు వార్డెన్ల అధికారం  నిర్ణయించబడిన జైలు భృతిలో కొంత కాజెయ్యటం మహిళా ఖైదీకి అనుభవ విషయాలు. జైలులో డెటెన్యూలను సి క్లాసు ఖైదీలకన్నా కన్నా కష్టం గా చూసే తీరు డాక్టర్ ప్రత్యక్షంగా చూసింది. నేరగాళ్లు, నిందితులు, శిక్షలు అనుభవిస్తున్నవాళ్ళు మానవులే కనుక సర్వ మానవ హక్కులు వాళ్లకు కూడా వర్తిస్తాయి. ఆ ఎరుకతో వాళ్ళు అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. 

ఇదేమని ప్రశ్నించినందుకు బలప్రయోగం చేసే జైలువ్యవస్థ గురించి, ఆత్మరక్షణకు పూనుకొంటే తిరుగుబాటు అని అంతకుముందున్నకొద్దిపాటి  సౌకర్యాలు కూడా రద్దుచేసిఇబ్బంది పెట్టటం గురించి ఖైదీ నిరసన స్వరంతో ప్రస్తావిస్తుంది. ఖైదీలకు ఇంటిదగ్గరనుండి  వచ్చే ఉత్తరాలు ఇయ్యక సతాయించటం,  ఇళ్లకు ఉత్తరాలు రాసుకోనియ్యకుండా  నిషేధం పెట్టటం గురించి ఆమె ఆందోళన పడుతుంది. లోపలివాళ్ళకు ఏమిజరుగుతున్నదో బయటివాళ్లకు, బయటవాళ్ళకు ఏమిజరుగుతున్నదో లోపలివాళ్ళకు తెలియక కలిగే ఆందోళన సంగతి ప్రస్తావిస్తుంది. 

ఖైదీలు తమనెందుకు హీనంగా వివక్షాపూరితంగా చూస్తున్నారని ప్రశ్నించి నందుకు అధికారులు  వాళ్లపై కాల్పులు జరపటం ప్రత్యక్షంగా చూసినవాడు డాక్టర్. కొందరు మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళను చూసి కదిలి పోయిన సున్నిత హృదయుడు  డాక్టర్.  జైలు ఆసుపత్రిలో రోగులకు కావలసిన మందులు ఉండకపోవటం కూడా గమనించినవాడతను. . ఇలాగైతే ఎలాగని పైవాళ్లను అడిగితే ఎదో ఒకటి ఉన్నవే సర్ది వాడమని ఆజ్ఞాపనలు పంపే తీరును గర్హించినవాడతను. 

రాజకీయ ఖైదీలకు విముక్తి ఎప్పుడు? అన్న విచికత్సలో డాక్టర్ మాటకు సమాధానంగా  ‘ప్రపంచంలో ప్రజలకు బాధలనేవి ఉన్నంతవరకు మా సంకెళ్లు సడలవు. ప్రపంచంలోని ప్రజలంతా తమకష్టాలకు కారణాలు తెలుసుకొని వాటి నివారణకు పూనుకున్నప్పుడే .. వారి సుఖాలకు ఆటంకంగా ఉన్న కటకటాలతో పాటు మా కటకటాలు కూడా పెకిలించబడతాయి.’ అని ఖైదీ చెప్పిన సమాధానం సోషలిస్టు ఆచరణకు సంబంధించినది. 

ఈ ఆచరణ ఆదర్శం అయినప్పుడు వ్యక్తిగత సుఖాలు, సంతోషాలు దాని ముందర అల్పమైనవి,  వదులుకోవలసినవి అవుతాయి. అయితే అది అంత సులభమా?   ఈ ఆదర్శంతో ప్రారంభమైన వ్యక్తులలో  కోరికలు చెలరేగ కుండా ఆపగలమా? ఆదర్శాలకు .కోరికలకు మధ్య ఘర్షణ లో మనుషులు ఎంత నలిగిడి పడతారో  ఈ నవల చూపించింది. 

3

జైలులో ఖైదీ జబ్బుపడ్డప్పుడు చికిత్సకు జైలు ఆసుపత్రికి పంపబడింది. అక్కడ వైద్యం చేసే డాక్టారుకు ఆమెకు మధ్య స్నేహ సంభాషణలు సాగుతూ ఉన్న క్రమంలో  ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ కలిగింది.  డాక్టర్ కు ఖైదీ పై ఆసక్తి ఆకర్షణ ..ఆమెకూ అతని గురించి నిత్యచింతన.    ప్రేమ గీతాలు అల్లుకొని వినిపించటం, వ్రాసి  చేతికియ్యటం వరకు కొనసాగింది. వాళ్ళ ప్రేమ వాచ్యం కాదు.  ఇద్దరికీ అది మనసులోపలి విషయమే . అయితే ఒకరి మనసు ఒకరు తెలిసిన వారు కూడా .. నిండు మబ్బు మనసులు. బయటి పాటకు కదిలి కురిసేంత సున్నితత్వం తో పదునెక్కాయి.  పెరోల్ ముగిసి వెళ్లిపోయే ముందు ఆమె అతని ఇంటికి వెళ్ళటం చివరకు అతనే ముందు వ్యక్తం చేసాడు. మీ మనసులోని ఉద్దేశాన్ని స్పష్టం చేయరూ అని అడిగాడు. 

అప్పుడు ఆమె ఆశయాలకు కోర్కెలకు మధ్య తంలోలోపల జరుగుతున్న పోరాటం గురించి చెబుతుంది. తన మెదడు యుద్దరంగం అయిపోయిందని  ఆ రెంటికీ వైరుధ్యం ఉన్నదా అన్నది అతని ప్రశ్న. రెండూ ఒక మనిషిలో ఉండటానికి వీలులేదా?  ఉంటె తప్పా ? అన్నది అతని ప్రశ్న. బలీయంగా ఉన్న కోరికలను ఎంతో బలమైన ఆదర్శాలతో ఓడించాలన్న   ప్రయత్నం లో ఆమె పడుతున్న హింసను గురించి హెచ్చరించాడు.   ఇద్దరం జీవితకాల ఖైదీలమే అయినప్పుడు , ఇద్దరూ  కలిసి జీవించే అవకాశాలు కనిపించినప్పుడు అతను తనవాడు, తాను అతనిది అని అనుకొనటంలో,అనిపించుకొనటంలో ప్రయోజనం ఏమిటన్నది ఆమె తర్కం. 

ఆ విషయం అతనికి తెలియనిది కాదు. ఉన్న అవకాశాలనైనా ఉపయోగించుకొందామనే ఆతురత అతనిది. పెరోల్ పై ఇద్దరూ బయటే ఉన్నప్పుడు సందేహించాల్సింది ఏముంది?అని అతను అనుకొంటాడు. ‘స్త్రీపురుషులు పరాయివాళ్ళనుకున్నప్పుడొక విధంగానూ, స్నేహితులనుకున్నప్పుడు ఇంకొక విధంగానూ, ప్రేమికులే అనుకున్నప్పుడు మరొకవిధంగానూ ఉంటారు. ఇప్పుడు మనం అన్ని దశలను దాటి ఆఖరు దశలో ఉన్నాం. ఈ దశలో కూడా ఇంకా పరిస్థితులు అనుకూలించలేదు , నాకేవో కొన్ని నియమాలు హద్దులు వున్నాయి అని చెప్పటంలో అర్ధంలేదు అని అతను అంటాడు కూడా. 

ఖైదీ విడుదల అయ్యాక అజ్ఞాతంలో ఉన్న డాక్టర్ తో అప్పుడప్పుడూ కలయికలు కొనసాగు తున్నాయి. అతను ఒక  అమ్మాయి  ఇంట్లో ఆశ్రయం తీసుకొని ఉండటం చూసినప్పుడు ఖైదీ ఆందోళన పడుతుంది. తనను మరచి, విస్మరించి  ఆమెతో సంబంధం ఏర్పరచుకొన్నాడా అని అనుమానం కలుగుతుంది. అది మంచిది కాదని కూడా ఆమెకు తెలుసు. డాక్టర్ ఆ స్నేహితురాలతో పొద్దుపుచ్చటం పట్ల తనకు అసూయ లేదుకానీ తనపట్ల ప్రేమ తగ్గిందనేది మాత్రం తనకు బాధ కలిగిస్తుందనే అనుకొంటుంది. ఈ సందర్భంలో ప్రేమ పుట్టటం ,విఫలం కావటం గురించి ఆలోచనలు ఎన్నో కదలాడాయి. ప్రేమ ఎప్పుడూ దానంతట అది కలిగేదికాదు, విఫలమయ్యేదీ కాదు. ప్రేమైపోయిందీ అంటే ప్రేమిస్తున్నవస్తువులోనో  వ్యక్తిలోనో  తీవ్రతరమైన మార్పులు వచ్చి  మార్చుకొనటం సాధ్యం కాదనిపించిన్నప్పుడు  ఇక తనకు అవి అలభ్యం అని తెలిసివస్తూ నిరాశకు లోనైనప్పుడు ప్రేమ పోతుంది.  ఆ వస్తువుకు, వ్యక్తికి  దూరం అవుతున్నందుకు తపించి తపించీ ఇక అవి లభించేవి కావన్న నిరాశలో ఆ బెంగను మరచిపోవటానికి ప్రేమకు మరొక వస్తువునో, వ్యక్తినో ఆలంబనగా మరొక వస్తువునో , వ్యక్తినో చేసుకోవచ్చు. ప్రేమ ఎలా పుడుతుంది? ఎప్పుడు పోతుంది ? ప్రేమ ఒక మనిషి మీదనుండి మరొక మనిషి మీదికి ఎలా మారుతుంది? ఎందుకుమారుతుంది వంటి ప్రశ్నలు ఎనభైలలో స్త్రీవాద భావజాల చర్చలో లైంగిక స్వేఛ్చ గురించి విస్తృతంగా జరిగిన చర్చలో భాగంగా తెలుగు సాహిత్య ప్రపంచంలో వ్యాపించాయి. అంతకు మూడు దశాబ్దాలకు ముందే వట్టికొండ విశాలాక్షి అటువంటి ప్రశ్నలను వేసుకొని ఆలోచించటానికి ప్రయత్నించటం ఈ నవలలో కనిపించే విశేషం. 

అంతేకాదు. స్త్రీపురుష లైంగిక సంబంధాల విషయంలో కూడా ఒక స్త్రీ అనుభవ కోణం నుండి   సంప్రదాయ ఉక్కుచట్రం పై విమర్శను, నిరసనను నమోదుచేసిన తొలి నవలగా కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది.  

ఒక స్త్రీకి ఒకపురుషుడు , ఒకపురుషుడికి ఒక స్త్రీ అన్న సామాజిక విలువ ఈ నవలలో ఆద్యంతాలు చర్చినీయాంశం అయింది. సమాజం ఏర్పరచిన నియమాల ప్రకారం జీవితపర్యంతం ఒక స్త్రీని ఒక పురుషుడు, ఒక పురుషుని ఒక స్త్రీ ప్రేమించటానికి అర్హత ఉంది . సమాజంలోని అవక తవకలవల్ల  అది ప్రయోజనకారి కాకుండా పోతున్నదని డాక్టర్ అభిప్రాయం. ఒకే పురుషుని ఒకే  స్త్రీ,  ఒకే స్త్రీని ఒక పురుషుడు ప్రేమించుకొని దానిపై ఎవరికివారు బాధ్యత వహించటం పోయి ఆ బాధ్యత సంఘంమీద పడేయటం వల్ల భార్యాభర్తలు ఒకరికొకరు గుదిబండలుగా తయారవుతున్నారు అన్నది అతని అవగాహన. అజ్ఞాతంలో ఉన్న డాక్టర్ కలుసుకోమని తనకు చాల రోజుల వరకు కబురు చేయకపోవటం గురించి ఖైదీ తన దిగులును వ్యక్తం చేసినప్పుడు మిమ్మల్ని మర్చిపోయానని భయపడ్డారా? ఆడవాళ్లకు అనుమానాలు ఎక్కువ అన్నప్పుడు అలాంటి భయం నాకు లేదంటూ ఆమె ఒకరిని ఆకర్షించిన వాళ్ళు మరొకరిని కూడా ఆకర్షించే అవకాశం ఉంటుందని అంటుంది.ఒక చోట మనసు కుదిరితే  ఆకర్షణ మారదు అని అతను అన్నమాటకు జవాబుగా ఆమె   ‘ఈ ప్రపంచమంతా ఒకే స్త్రీతో ఒకే పురుషుడు,ఒకే పురుషునితో ఒకే స్త్రీ జీవితంతవరకూ ఉంటున్నారా అన్నవిషయంలో సందేహం వ్యక్తం చేస్తుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరిగే నియమోల్లంఘనను ప్రస్తావిస్తుంది. అందుకు కారణం వాళ్ళవాళ్ళ బలహీనతలు లేదా మరే రకమైన అనివార్య కారణాలో అయివుంటాయి అని డాక్టర్ అన్నప్పటికీ ఆమె సంతృప్తి చెందలేకపోయింది. 

స్త్రీపురుషుల మధ్య ఆకర్షణలో శరీరానికి ఉండే పాత్రను ఎవరెంత హీనంచేసి, అప్రధానం చేసి చెప్పినా అది ఒక వాస్తవం. అది మనిషిని ఎంతవేధిస్తుందో చర్చకు తెచ్చింది ఈ నవల. 

డాక్టర్ ఆకర్షణకు లోనవుతూ ఖైదీకి  ఆ  ఆకర్షణ నుండి బయటపడే శక్తి తనకు లేనప్పుడు జీవితంలో ఇంతవరకు ఎన్నడూ పొందని , ఇంత ఆనందానుభూతిని పొందితే మాత్రం తప్పేమిటి? అన్న ప్రశ్న వచ్చాక ఆమెలో జరిగిన సంఘర్షణ అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.  శరీరస్పర్శతో గానీ ఆనందానుభూతి కలగదా? అసలు ఆనందం అంటే ఏమిటి? నిర్వచించు కొనటం ఎలా ? అన్నవి వాటిలో కొన్ని. మనలోనే ఆనందం  ఉంది. దాన్ని చూచుకోవాలి అంటారు. అట్లా మనకు మనమే ఆనందం  కావటం ఎందుకు సాధ్యం కావటం లేదు అన్నది ఆమె వేదన.  మనకు మనమే ఆనందం కావాలంటే స్వయంపోషకం కావాలి. స్వయంపోషకం కానిదే  స్వయం ప్రకాశం అసంభవం అనుకొంటూనే స్వయంపోషకం, స్వయంప్రకాశం అన్నవి  సాధ్యమా అన్న విచికిత్సలో పడుతుంది. ఆమె విద్యార్థి. కమ్యూనిస్టు. ప్రకృతిలోని గతితర్కం తెలిసిన మనిషి. అందువల్లనే  ప్రకృతి, ప్రపంచం ఒకదాని మీద ఒకటి ఆధారపడటంలోనే ఆస్తితను పొందుతుండగా, భూమి, సూర్యచంద్రాదులు, తదితర గ్రహాలూ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఆకర్షణలో పరిభ్రమిస్తుండగా  డాక్టరుకు తనకు మధ్య ఆకర్షణ అంత ప్రకృతి సహజమే అన్న అవగాహన ఆమెకు కలిగింది. 

మనుషుల మధ్య ఏ రకమైన అనుబంధానికి అయినా అంతిమ వ్యక్తీకరణ కరచాలనం నుంచి కౌగిలింతవరకు ఏదైనా కావచ్చు. తల్లి పిల్లచెక్కిళ్ళకు చెంపను  చేర్చి ముద్దాడటంలోని పారవశ్యత స్పర్శ సుఖానికి  స్త్రీపురుషుల మధ్య ఆకర్షణకైనా అత్యున్నత వ్యక్తీ కరణ. అటువంటప్పుడు పరస్పరం ఆకర్షితులైన స్త్రీపురుషులమధ్య స్పర్శ గురించిన వాంఛఉండటంలో ఆశ్చర్యం లేదు. డాక్టర్ పట్ల  కలిగిన  ఆ రకమైన వాంఛలోని తప్పుఒప్పులగురించి ఖైదీ అంతరంగపుటాలోచనలు ఈ నవలలో చాలా ముఖ్యమైనవి. శరీరరాజకీయాల పై తొలి వెలుగులు ప్రసరింపచేసిన ఆలోచనలు అవి.  

స్పృశించాలని లోలోపల కుతూహలం. కానీ స్పర్శ అంటే మళ్ళీ భయం ఈ వైరుధ్యాల తత్వం శోధించింది ఆమె అంతరంగం.  రెండూ సత్యాలే. ఒకే మనిషిలో రెండూ ఉండటానికి వీలున్నవే … మొదటిది సహజం, రెండవది సామాజికం. బుర్రలోకి ఎక్కించబడిన భావజాల ఫలితం అని ఆమె గుర్తించగలిగింది.  ‘కొంతమంది స్వార్థపరుల క్షేమం కోసం సృష్టించబడ్డ శాస్త్రాలు  పురాణాల ద్వారా మనుష్యుల తత్వానికే వ్యతిరేకమైన కొన్ని కొన్ని నియమాలను, అభిప్రాయాలను మనుషుల బుర్రల్లోకి ఎక్కించారని ఆమె అనుకొంటుంది. ఇది ‘స్త్రీల విషయంలో మరీ ఎక్కువ. అది ప్రత్యేకమైన శిక్షణ’ అనుకోగలిగింది అంటే జండర్ రాజకీయాలకు దగ్గర కావటమే.  పాతివ్రత్యం , ఏకపత్ని వ్రతం, వివాహానికి ముందర స్త్రీపురుషులు ఒకళ్ళనొకళ్ళు తాక కూడదు, వంటి విధి నిషేధాలు వినీవినీ శరీరంఅన్నా, స్పర్శఅన్నా భయపడే స్థితి వచ్చేసింది అని ఆమె నిర్ధారణకు రాగలిగింది. శరీరంలో శీతోష్ణ పరిస్థితులను కాఠిన్య మార్దవాలను తెలుసుకొనే శక్తి ఉన్నంత వరకు స్పర్శ సుఖాన్ని కోరుకొనటం సహజం. స్పర్శను గురించి సమాజం కల్పించిన భయాల మాయపొరలను తొలగించుకొని చూస్తే  శరీరం అనుభవం కోరటం సహజం అని ఆమెకు అర్ధం అయింది. 

కోరిక డాక్టర్ ఒక్కడిదేనా ? తనకు లేదా? అని తర్కించుకొంటుంది. సామాన్య లౌకిక జ్ఞానం, హేతుబద్ధ ఆలోచన-   కోరిక డాక్టర్ ది అయినా  అది ఫలించిందీ అంటే తన భాగస్వామ్యం ఉన్నట్లే కనుక అప్పుడు   ఫలితం తనకు కూడా అనుభమే అవుతుంది అని అంగీకరించేట్లు చేశాయి.  

 బంధువులను ,స్నేహితులను ఒప్పించి వివాహం చేసుకొనే అవకాశం లేదు .అవకాశం వచ్చేవరకు ఆగటమా ? వచ్చిన అవకాశాన్ని వాడుకొనటమా అన్న సందిగ్ధానికి ఆమె లోనైనది. పెళ్లి లేకుండా పరస్పర ఇష్టం మీద స్త్రీపురుషులు ఒకటికావటం ఆమె ఊహకు ఇంకా అందని విషయమే.   

సమాజానికి భయపడే తాను డాక్టరు కోరికను మన్నించలేకపోతున్ననా   అని ఆమె  తనను లోపలి నుండి తెలుసుకొనే ప్రయత్నం కూడా చేసింది. భయాలనే పక్కకు తోసిందో,అవకాశాన్ని వాడుకోవాలని  తెగింపు చేసుకున్నదో , డాక్టర్ గారి కోరికల ఉద్వేగంలో పడి  కొట్టుకుపోయిందో మొత్తానికి అతని తో కలయిక అనివార్యమైంది. ఆ కలయిక తరువాత ఇక తనదంతా అబద్ధపు బతుకే కదా అని వేదన చెందటం కానీ,  తనలో ఎన్నో హత్యలు జరిగినట్లుగా భావించటం, బాధపడటం కానీ శరీర తృష్ణ తీర్చుకొనటం చెయ్యరాని పని  అన్న అపరాధ భావనా లక్షణం అయి ఉండాలి. 

సామాజిక ముద్రలేని లైంగికవాంఛా పరితృప్తి పాపమూ, నేరమూ అనుకొనే స్థిరపడ్డ మానవ సమాజ విలువ పెట్టిన ఒత్తిడి  ఫలితమే అనుకోవాలి. 

ఈ సంప్రదాయ లైంగిక నీతే కోరికలు తుచ్ఛమైనవి అనుకొనేట్లు చేసింది. కోరికలను నియమాలకు శత్రువుగా నిలబెట్టి, నియమ రహితజీవితం త్యజించదగ్గది అని నమ్మేట్లు చేసింది. కోరికలనే  విషసర్పాలు పడగవిప్పి ఆడుతుంటే వాటిని నిద్రపుచ్చటానికి, సదాశయాలపై , ఆదర్శాలపై దృష్టి కేంద్రీకరించిన సందర్భాలు ఆమెకు గుర్తే. కానీ డాక్టర్ తో సాహచర్యం తరువాత అంతరంగంలో జరిగిన అనేక సంఘర్షణలు, యుద్ధాలు ఆమెలో క్రమానుగత మార్పుకు కారణం అయ్యాయి.ఇంతకు ముందు కోరికలను విషసర్పాలుగా భావించిన ఆమె సుఖానుభూతికి సంబంధించిన కోరిక మానవత్వానికి సహజలక్షణమే అనుకొనే స్థాయికి వచ్చింది. మానవత్వం నశించితే గానీ కోరిక నశించటానికి వీలులేదు. అని నిర్ధారణకు రాగలిగింది. 

అయినా  కోరికలు తీర్చుకొనటానికి సామాజిక అవరోధాలను అధిగమించాలన్న ఆలోచన రాకపోవటం ఆమె జీవితంలో విషాదానికి అసలు కారణం. తాను చెప్పినట్లుగా పెళ్ళిచేనుకొంటేనే కూతురు సుఖపడుతుందని భావించే తల్లికి కూతురు  ఖైదు తప్పి బయటపడ్డ తరువాత ప్రధాన జీవన స్రవంతిలోకి రాక  పరారీలో ఉన్న డాక్టర్ ను పెళ్ళాడి కోరి కష్టాలు తెచ్చుకొనటం ఇష్టం లేకపోయింది.తల్లి గోల భరించలేక ఇప్పట్లో తాను పెళ్లి చేసుకోనని తల్లికి వాగ్దానం చేసింది. అయితే ఆ వాగ్దానం ఖైదీకి సంతోషాన్ని ఇయ్యలేదు. తల్లికి ఇచ్చిన మాట కోసం సహజ మైన కోర్కెలను చంపుకోవలసి వస్తున్నది అన్న వేదన ఆమెను లోలోపలి నుండి తొలుస్తూనే ఉంది. కోర్కెలు చంపు కొనటానికి చేసే ప్రతీ ప్రయత్నం ఆనందం విలువను గుర్తుచేస్తుంటుంది. డాక్టర్ ను పోలీసులు ఎత్తుకు వెళ్ళాక , అతనేమైనదీ తెలియని స్థితిలో గుండె చెదిరి బేజారయింది. జైలులో ఉన్నప్పుడే కాదు బయట కూడా స్త్రీలు సమాజానికి, అందులోని అజ్ఞానానికి, వ్యక్తులకు బానిసలైన ఖైదీలేనన్న సూచనతో ఖైదీ అంతరంగ జీవితచిత్రణ ముగుస్తుంది. 

4

వర్గ చైతన్యంతో ఉద్యమాలలోకి వచ్చిన ఖైదీ కి స్త్రీల అనుభవకోణం నుండి, స్త్రీల ప్రయోజనాల కోణం నుండి ప్రతిదానినీ పరిశీలించే నేర్పు, తీర్పు ఇయ్యగలిగిన దృక్పథం కూడా అలవడ్డాయి.   ఖైదీ  స్త్రీలను కించపరిచే ఏ వ్యాఖ్యనూ అంగీకరించదు. డాక్టర్ ఒకసారి మాటల సందర్భంలో స్త్రీలు ఏ కారణం వల్లనైనా తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు వెనుకముందులు ఆలోచించే శక్తిని కోల్పోతారు అని అంటే ఆమె దానిని  వ్యతిరేకించింది. ఒకానొక సమయంలో వెనుకముందులు ఆలోచించ లేని స్త్రీలూ ఉంటారు, పురుషులూ ఉంటారన్నది ఆమె అభిప్రాయం. సద్గుణాలకు స్త్రీపురుష తారతమ్యాలు లేవంటుంది. 

మరొక సారి ఆడవాళ్ళ మనసులు అంతుచిక్కవు అని డాక్టర్ అన్న మాటకు …  ఆమె… ఆడవాళ్లను అగాధంలోకి పడదోసింది మొగవాళ్లేనని నిర్ధారణగా చెబుతూ అగాధంలో పడివున్నవాళ్ళ మనస్సులు అంతు ఎలా చిక్కుతవి అని ప్రశ్నిస్తుంది. అగాధంలోకి నెట్టివేసి అందువల్ల ఆడవాళ్ళకు అలవడిన బలహీనతలనన్నింటికీ  ఒక దైవగుణాన్ని ఆపాదించి వాళ్ళిక  ఎన్నటికీ తిరుగుబాటు తీసుకు రాకుండాఉండేట్లు చేసింది పురుష సమాజమేనని ఆమె అభిప్రాయం.  

పెరోల్ మీద వచ్చి తిరిగి వెళుతూ ఖైదీ డాక్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరూ  తోటకు వెళ్లారు. డాక్టర్ ఆమెను నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించాలని అనిపిస్తున్నది అంటూ అక్కడ ఉన్నంత సేపూ  అలాగే పిలుస్తూ  వచాడు.  కామంచిపండ్లు తింటుంటే ఏమిటా పిచ్చితిండి అంటూ  చేయి ఎగరగొట్టాడు, పళ్ళన్నీ కిందపడేట్లు.. తరువాత తోట గదిలో కాఫీ తాగుతున్నప్పుడు తొణికి కొంచెం చీరమీదపడితే అతను ‘ అబ్బా … బొత్తిగా సెన్స్ లేదు’ అని విసుక్కున్నాడు. ఇక్కడ ఖైదీ   ప్రతిస్పందించకుండా ఉండలేకపోతుంది. … పాపం ఈ డాక్టరుకు ఒక భార్య కావాలని,  ఆ భార్య అనే ఆవిడ ఏదైనా పొరపాటుచేసినప్పుడు మందలించాలనీ ఎన్నాళ్ళనుంచీ కోరికగా ఉందొ …   అని అదంతా బానిసత్వం జీర్ణించుకుపోయిన లక్షణం అని మనసులో అనుకుంటుంది, అతనితో అంటుంది కూడా. 

జీవితాన్ని, అందులోని ప్రతి సందర్భాన్ని జెండర్ కోణం నుండి చూడవచ్చని , చూడాలని స్త్రీవాద ఉద్యమం తెలియచెప్పింది. తెలుగులో ఈ చైతన్యం 1990 వ దశకంలోగానీ ఊపు అందుకోలేదు. ఇది ఇచ్చిన విమర్శనాత్మక దృక్పథం,చర్చలోకి తెచ్చిన లైంగికత కు సంబంధించిన భావనలు  నాలుగు దశాబ్దాలకు ముందే విశాలాక్షి వ్రాసిన ఖైదీ నవలలో అంకుర దశలో కనబడతాయి. ఖైదీ అంతరంగ సంవేదనలు, ఆలోచనల పనితీరు, నూతన భావజాల నిర్మాణ ప్రచారాలు ప్రాధాన్యం వహించిన రచన గనుక దీనిని   ఆలోచనల నవల ( NOVEL OF IDEAS) అనవచ్చు. 

 (ఇంకా వుంది) 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.