పోరాటం (కథ)

-డా. లక్ష్మి రాఘవ

గేటు శబ్దం అయింది. వాచ్ మాన్ గేటు తెరుస్తున్నట్టుగా వినిపించి పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చింది సునీత. అమ్మతో బాటు మూడేళ్ళ చైత్ర కూడా వెళ్ళింది. కారు పార్క్ చేసి అవుట్ హౌస్ లోకి వెడుతూ ఒక నిముషం కిటికీ ని చూస్తూ నిలబడ్డాడు ప్రకాష్. 

చైత్ర చెయ్యి ఊపుతూ “డాడీ” అనటం అద్దాల కిటికీలోంచి లీలగా వినిపించింది. సునీత చెయ్యి పైకి ఎత్తింది “హలో” అంటూఉన్నట్టు. డా ప్ర కాష్ చెయ్యి ఒక్కసారి ఊపి, కూతురు చైత్రకూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ గబా గబా అవుట్ హౌస్ వైపు నడిచి తాళ౦  తీశాడు. లోపలకు రాగానే ముందుగా పక్కనే వున్న బాత్రూం లోకి వెళ్లి స్నానం చేసి అక్కడే  వున్న వాషింగ్ మిషన్ లో ఇందాక తను వేసుకువచ్చిన బట్టలు వాష్ చెయ్యడానికి బటన్ ఆన్ చేసి ఇంట్లోకి రాగానే మొబైల్ మోగింది.

“చెప్పు సునీతా, పాప ఈ రోజు బాగా ఆడుకుందా?” నీకెలా గడిచింది?”

“పాప బాగా ఆడుకున్నా ‘డాడీ’ అని అడుగుతూనే వుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని చూసాక తలుపు తెరవమని ఒకటే గోల…నా సంగతి సరే మీకు ఎలా గడిచింది? ఈ రోజు కొత్త పేషంట్లు వచ్చారా?? ఎన్ని పాజిటివ్ కేసులు ..”

“ఈ రోజు టెస్టు కు  వచ్చిన ఇరవై మందిలో  పన్నెండు మందికి పాజిటివ్ వచ్చిందిట. నేను కొన్ని సీరియస్ కేసులు అటెండ్ అవ్వాల్సి వచ్చింది….”

“సరే ఈ కబుర్లు తరువాత ముందు కిచెన్ లోకి వెళ్లి ఏమి తింటారో చూడండి…మీరు తిన్నాక మళ్ళీ ఓపిక వుంటే చెబుదురు గానీ …”అని సునీత ఫోను కట్ చేసింది.

              కిచెన్ లోకి వెళ్ళినా ఏమీ చేసుకునే ఓపిక లేదు ఫ్రిజ్ తెరిచి బ్రెడ్ బయటకు తీసుకుని బ్రెడ్ టోస్ట్ చేసుకుని తిన్నాడు. పాలు మైక్రో అవన్ లో వేడి చేసుకుని పసుపు, మిరియాల పొడి వేసుకుని తాగాడు. ప్రకాష్ వాళ్ళమ్మ చిన్నప్పటి నుండీ రాత్రిపూట వేడి పాలల్లో పసుపు వేసుకుని త్రాగటం అలవాటు చేసింది. పాలు తాగుతూ వుంటే అమ్మ జ్ఞాపకం వచ్చింది. నాన్న పోయాక తనను అమ్మ ఎలా చదివి౦చిందీ. డాక్టర్ గా చూడాలని ఎంత తాపత్రయ పడిందీ తలుచుకుంటూ వుంటే మనసు భారం అయ్యింది. ఈ నాడు తను కరోనా మహమ్మారి అదుపుచేయడానికి ఫ్రంట్ లైన్ డాక్టర్ గా ఎంత మందికి సాయపడుతున్నాడో చూసివుంటే ఎంత సంతోషించేదో …అనుకుంటూ ఒక్కసారి ఉలిక్కిపడి”వద్దులే అమ్మా, నీవు నిరుడు పోవడమే ఎంతో మేలు అయ్యింది’..ఈ కరోనా కష్టాలకు తట్టుకునే శక్తి వుండేది కాదు. పైగా కొడుకు తన ఇంట్లోనే అవుట్ హౌస్ లో ఉంటూ క్వారెంటైన్ అవలంబించేది చూసి  కష్టమయ్యేది. 

మొబైల్ మళ్ళీ మోగగానే తీసుకుని”ఇప్పుడే బ్రెడ్ టోస్ట్ చేసుకు తిన్నాను. సునీతా. మీరు భోజనం చేశారు కదా?? పాప నిద్రపోయి౦దా??”

“పాప కొంచెం సేపు మీ కోసం ఏడ్చి నిద్రపోయింది. మా భోజనాలు ఎలా వున్నా మీరు ఏమి తింటారో అన్న బెంగ నాకు. అలాగే ఒక సారి కిచెన్ లో అన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. లేనివి తెప్పించుకోవాలి కదా..”

“ఈ రోజు చూసే ఓపిక లేదు సునీ.. నేను ట్రీట్మెంట్ ఇస్తున్న ఒక ముసలాయన కు కొంచెం ఎక్కువ అయ్యింది.  బతుకు తాడని నమ్మకం లేదు. ఆయన ఆయాస పడుతూనే నన్ను పిలిచి “నా వాళ్ళ మధ్యలో చావాలన్న కోరిక డాక్టర్ బాబూ..అది తీరక పోగా పది రోజులనుండీ ఎవరినీ చూసే పరిస్థితి లేదు…పిచ్చిపట్టినట్టు అవుతోంది …ఇంత బతుకూ బతికి ఆఖరికి ఇలా అనాధ శవంగా వెళ్ళిపోవాల్సిన దేనా?” అని ఏడ్చాడు. డాక్టర్ గా ఎంత నిబ్బరం చూపినా ఒక్కసారి మనసులో కలత తప్పదు..”

“ఇలాటివి మరీ జ్ఞాపకం చేసుకోకండి…మీ వలన ఎంతో మంది కోలుకుంటారు. ప్రజల దృష్టి లో మీరు ఇప్పుడు దేవుళ్ళు…”

“అలా అనకు సునీ, మొన్న మన వూరి దగ్గర వున్న ఆస్పత్రి లో ఒక డాక్టర్ “క్వారంటైన్ కు వెళ్ళాలి’ అనగానే కొట్టారు కూడా…”

“ఏమైనా ఈ కష్ట సమయం లో మీరు మీ డ్యూటీ చేస్తున్నారు అని మాత్రమే జ్ఞాపకం ఉంచుకోండి.” ఒక డాక్టర్ గా తనను సునీత ఎంత పోత్సహిస్తుందో…

“నా సంగతి సరే, నేను నిన్న చెప్పిన విషయం ఏమి చేశావు?? మరి మీ నాన్నగారితో మాట్లాడనా?? రెండు మూడు రోజుల్లో అన్ని ఏర్పాట్లూ చేస్తాను…”

“ప్లీజ్ నన్ను బలవంత పెట్టద్దు. నేను ఇక్కడనుండీ నాన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళను…ఇక్కడ వుంటే కనీసం రోజూ మిమ్మల్ని చూసే అవకాశం వుంటుంది. మీకు దూరం గా వెళ్ళిపోతే తట్టు కోలేను …” సునీత గొంతులో ఏడుపు!

“నీవూ, పాప సేఫ్ గా వుంటే కదా నాకు నిశ్చింత. ఇక్కడ డ్యూటీ ఇంకా ఎక్కువ కావచ్చు…”

“పరవాలేదు…ఏది ఏమైనా మీతో బాటే నేనూ, పాపా” ఖచ్చితం గా చెప్పింది సునీత.

“సరే అయితే నిద్రపోతాను. ఐ నీడ్ రెస్ట్ సునీ. గుడ్ నైట్.” అని చెప్పి బెడ్ మీద వాలాడు డాక్టర్ ప్రకాష్.

  కరోనా మహమ్మారి ప్రపంచమంతా విలయ తాండవం  చేస్తూ మనిషిని ఎన్ని విధాలగానో హిసిస్తూ వికట్ట హాసం చేస్తూ వుంటే “లాక్ డౌన్ “ అని నెలరోజులుగా కంట్రోల్ చెయ్య ప్రయత్నిస్తున్నభారత దేశం లో  డాక్టర్ల దీ, నర్సులదీ పోలీసులదీ ఎన్నేన్ని కథలు జరుగుతున్నాయో తలచుకుంటేనే భయం వేసే పరిస్థితి 2020 లో

                   

*****

Please follow and like us:

4 thoughts on “పోరాటం (కథ)”

  1. ప్రస్తుత పరిస్థితుల్ని గుర్తు చేస్తూ సాగిన మీ రచన చాలా బాధాకరంగా ఉంది.. ఎంతమంది డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, బ్యాకుల వారు ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో తమ వృత్తిధర్మం నిర్వహిస్తున్నారో.. ఆటంబాంబు మీద కూర్చుని పనిచేసిపట్లే, ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి.. మనసును తాకేలా రాశారు.. 🙏🏻

Leave a Reply

Your email address will not be published.