బ్రహ్మ కడగని పాదము (కవిత)
-జయశ్రీ మువ్వా
ఎల్లిపోతున్నాం…
ఖాళీ పాదాలు మావి ,
అందుకే …
తేలిగ్గా కదిలెల్లిపోతున్నాం ..
బరువవుతున్న బ్రతుకుని చింకి చాపల్లో చుట్టుకెళ్ళిపోతాం
చిరిగిన కలల్ని చీకట్లో దాచుకుంటూ ..
మా పొలిమేర పొరల్లోకి లాక్కెళ్ళి పోతాం
శెలవు చీటీ కూడా రాసిచ్చి పోలేని
నిశానీ కలాలం
మేమిన్నాళ్ళూ గుర్తించలేదు కానీ
మిగులు జీవితాల మూలల్లో
గుంపుగా కంపు వాడల మీద పరాన్నజీవులు కారా మీరూ..?
పురుగు వచ్చిందని ఏరివేసిన మెరిగలయ్యాము
మేమూ పురుగులమే
విలువలు విడిచిన నాగరికతకి
చలువ నేత నేసే పల్లె ఒడికెళ్ళి పట్టుపురుగులవుతాం
గంజినీరైనా పంచుకుందాం బిడ్డా ..అనే ..
అమ్మ ఊరి ముందు పొగిలి పొగిలి పోతాం..
తరిమికొట్టే కాడు లో కట్టెలవుతున్నాం ..
ఎంతకీ తీరని దూరంలో దప్పికవుతున్నాం
కొట్టి కొట్టి చంపుతున్నా ..ఆకలి మీదే గౌరవం మాకు
కాలే కడుపుల కాష్టాలం
ఇంతకన్నా ఏం జరుగుతుంది?
పుట్టుక చావు రెండూ ఒకటే మాకు
నడిమధ్యన నాటకానికి నేల టిక్కెట్టుగాళ్ళం
పగిలిన పాదాలం
ఉమ్ము లేపనాలం
ఆ’కలి’ వేటకి చిక్కిన కాలిముద్రలం
వస్తేరానీ…పోతేపోనీ..
విపత్తుకేం తలొగ్గం
ప్రతిరోజూ పగిలే పత్తి కాయలం
ముళ్ళబాటల్లో నిత్య బోయిలం
పూటకో లక్ష్యానికి ఎక్కుపెట్టే ఏకలవ్య వారసులం
వాసన వాకిలి లేని కంకిపువ్వులం
మళ్ళీ వస్తే ..మరో చరితతో తిరిగొస్తాం..
ఇప్పటికిలా పలుచగా కదిలిపోతాం..
నెత్తురోడుతున్న మహాయాత్రకు సాంత్వన కోరుతూ..
కర్మ భూమిని మోసెడి ఖరమ పాదమ్
నెర్రెబారిన నడతలోన నాటుకున్న నేలపాదమ్
ఆకలి కలల కడుపుల కావిడి పాదమ్
అడుసు మడుగున విరిసిన పద్మపాదమ్
ఇది ఆదమరపున బ్రహ్మ మరచిన పాదమ్
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
Memoo purugulame
Rojoo lagile pathikaayalam