మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం

సైగ్లో – 20

నిజం చెప్పాలంటే 1952 ప్రజా విప్లవం తర్వాత అధికారానికి వచ్చిన ఎమ్.ఎన్.ఆర్. మనుషులు కొంచెం ఆశపోతులు. అందుకనే తమను తాము “విప్లవకారులు”గా ప్రకటించుకున్నప్పటికీ వీళ్ళను కొనేసే అవకాశాన్ని సామ్రాజ్యవాదం వినియోగించుకుంది. ఈ రకంగా జాతీయ సంపదతోనే ఒక కొత్త లంచగొండి బూర్జువా వర్గం తలెత్తింది. అన్ని రంగాలలోనూ లంచగొండితనం ప్రబలమైపోయింది. దాని ఏజెంట్ల, కార్మిక ప్రతినిధులు, రైతాంగ నాయకులు, అధికారులు కూడా అమ్ముడుపోయారు. ఇది చాలదన్నట్టు ఎమ్.ఎన్.ఆర్. బొలీవియాలో నాజీ తరహా కాన్ సెన్ట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేసేంత దూరం కూడా పోయింది. ఉదాహరణకు ఎమ్.ఎన్.ఆర్. రాజకీయ భద్రతా విభాగానికి అధిపతులుగా ఉన్న సాన్ రోమాన్, మొనాకోల దుర్మార్గ ఉదంతాలు అందరికీ తెలుసు. సాన్ రోమాన్ తన ఇంట్లోనే ఒక జెయిలు లాంటిది ఏర్పాటు చేసి జనాన్ని పాశవికంగా హింసించాడు. రాజకీయ ఖయిదీలందరికీ సాన్ రోమాన్ అంటే హడల్గా ఉండేది. సరే ఈ పరిస్థితుల్లో కార్మికుల్లో, ముఖ్యంగా సైగ్లో-20 కార్మికుల్లో నిరసన మొదలైంది. – పైన చెప్పిన ప్రజా వ్యతిరేక చర్యలు అమల్లోకొచ్చేసరికి ఘర్షణ మొదలైంది. నిరసనలూ, ప్రదర్శనలు జరిగాయి. ఏలినవారు రెచ్చిపోయి సరుకులివ్వడం మానేసారు. జీతాలివ్వడం మానేసారు. ఆఖరుకి వాళ్లు మా మందుల సరఫరాని కూడా అడ్డుకున్నారు మా నాయకుల్నీ జైళ్లలో పెట్టారు.

ప్రభుత్వ చర్యల్లో ఒక దాన్ని వ్యతిరేకిస్తూ 1963లో మా నాయకుడు మాట్లాడడం నాకింకా గుర్తు. బొలీవియా గనుల కార్పొరేషన్ చాలినన్ని డబ్బులు లేనందున ఆస్పత్రికి మందులు పంపనని ప్రకటించింది. ఆ సమయాన విరేచనాల జబ్బుతో పాటు ఫ్లూ జ్వరం బాగా వ్యాపించి ఉంది. అప్పుడు పిల్లలక్కూడా మందులు దొరకని పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి మా కొమిబొల్ జపాన్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలకు చెందిన ఒక అంతర్జాతీయ నటీనట బృందంతో గనుల్లో ప్రదర్శనలు ఇప్పించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్ళ ప్రదర్శనలన్నీ కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రబోధించేవనీ, ఆ ప్రదర్శన ఖర్చులను కొమిబొల్ భరిస్తున్నదనీ ఆ ప్రదర్శన చూసివచ్చిన జనం మాతో చెప్పారు. ఈ ప్రదర్శకులను కంపెనీ కార్మికులు గౌరవించరనీ, గౌరవించబోవడం లేదనీ, కొమిబొల్ గనుక అవసరమైన మందులు పంపకపోయినట్లయితే ఈ నటీనటులను కూడా శత్రువులుగానే లెక్కిస్తామనీ మా నాయకుడు ఎస్కోబార్, కొమిబొల్కు టెలిగ్రామ్ ఇచ్చాడు. కొందరు కార్మికులైతే ఈ విదేశీయులు బయటికి వెళ్ళకుండా ఉండేందుకు గాను రైలు పట్టాలు పీకేయడానికి కూడా పోయారు. వాళ్ళు కాన్కనిరి స్టేషన్ లో రైలుకోసం పడిగాపులు పడుతున్నప్పుడు వాళ్ళను చూడడానికి నేను కూడా వెళ్ళాను. ఆ విదేశీయులు ఆ స్టేషన్లో రోజంతా ఎదురుచూపులు చూశారు. వాళ్ళు మమ్మల్ని ఏం జరిగిందని ఆదుర్దాగా అడిగినప్పుడల్లా మేం వర్షాలొచ్చి పట్టాలు కొట్టుకుపోయాయనో, వాట్ని బాగుచేస్తున్నారనో ఏదో ఒకటి కుంటి సాకు చెప్పేవాళ్ళం. చివరికి తేలిందేమిటంటే విదేశీయులకు ఏమీ జరక్కముందే వీలయినంత తొందరగా బయటికి రప్పించుకోవాలని కొమిబొల్ వెంటనే విమానంలో మందులు పంపించింది. అట్లా ఆ రాత్రి పదింటికల్లా వాళ్ళు వెళ్లిపోయారు. వెంటనే మా వాళ్ళు రేడియోలో మందులొచ్చాయనీ, కావల్సినవాళ్ళు అవసరమైన కాగితాలు చూపి పట్టుకు పోవచ్చుననీ, ఆస్పత్రులు ఆ రాత్రి కూడా తెరిచే ఉంటాయని, అత్యవసరమనుకుంటే పిల్లల్ని కూడా ఆస్పత్రికి తీసుకెళ్ళాచ్చునని ప్రకటించారు.

అప్పుడు నా చిన్న కూతురుకు కూడా విరేచనాలు పట్టుకున్నాయి. నేను కూడా ఆ రాత్రికి ఆస్పత్రికి వెళ్ళాను. ఆ అర్ధరాత్రి ఒంటిగంటప్పుడు ఆస్పత్రి తెరిచే ఉంది. జనం పొడవాటి వరసల్లో నిలబడ్డారు.

ఈ విధంగా కోమిబొల్ ప్రదర్శకులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ద్వారా మమ్మల్ని మోసం చేద్దామనీ, మాకు అబద్ధాలు చెబుదామనీ, ప్రజల విశ్వాసాల్ని దెబ్బతీద్దామని వచ్చారు. కానీ పాపం, చివరికి అనుకోని పరిస్థితులెదురై వాళ్ళు మాకు సాయపడ్డారనే చెప్పాలి.

కార్మికులెప్పుడూ పరిస్థితిని విశ్లేషించి అభిప్రాయాలు ప్రకటిస్తారు. అయితే యజమానులెప్పుడూ వాళ్ళు చెప్పేది వినరు. వేరే మార్గాలు వెతుకుతుంటారు. ఉదాహరణకు కార్మికులు ముక్కోణపు ప్రణాళికను, ద్రవ్యస్థిరీకరణను విమర్శించినప్పుడు, మా సొంత కొలుముల అవసరాల్ని నొక్కి చెప్పినప్పుడు వాళ్ళనెవరూ పట్టించుకోలేదు. కాని నిజానికి ఈ ఆలోచనలన్నీ ప్రజల్లోంచి వచ్చాయి. ఈ ఆలోచనలు అధ్యక్షుడు హోవాండో బుర్రలో ఈ మధ్యే పుట్టినట్లుగా ఎట్లా గప్పాలు కొడుతున్నాడో చూడండి.

సైగ్లో-20లో ఉండడం మొదలైనప్పటి నుంచి నేను ప్రతీ విషయంతోనూ సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించాను. రేడియో వార్తలు వినేదాన్ని, ప్రదర్శనలకు వెళ్ళి అక్కడ జరిగేది గమనించేదాన్ని, అదంతా నాకు కొత్త. పులకాయోలో నేను అలాంటి పనులేమీ చేయలేదని కాదు. అక్కడ ఒక వేరే ప్రపంచంలో  బతికాను గనుక బయట ఏం జరుగుతున్నదో తెల్సుకోలేక పోయాను. కాని సైగ్లో – 20లో పోరాటం గురించీ, ప్రజల భాధల గురించీ నిజంగా ఆసక్తి కనబరచడమూ నేర్చుకోవడమూ మొదలు పెట్టాను. దానితో మా నాన్నంటే, ఆయన తనను తాను అంకితం చేసుకున్న పోరాట ఆకాంక్ష అంటే నాకెంతో గౌరవం కల్గింది. సైగ్లో -20 ప్రజానీకపు మేధాశక్తి నన్నెన్నో విషయాలు తెల్సుకునేటట్టు చేసింది. ఆ ఊరిలో మాకోసం పోరాడిన ఎందరో గొప్పవాళ్ళున్నారు. ఎంతో మంది స్త్రీలు కూడా ఉన్నారు. మాలో ఉన్నత స్థానాలకు జేరిన మేధావులైన స్త్రీలు కూడా ఉన్నారు. మా ఇంట్లోనే మా కెన్నెన్నో మహత్తర అనుభవాలున్నాయి. లేవూ! నాలాగా కొంచెం ఎక్కువ మాట్లాడడం కూడా చేతకాని ఎంతోమంది స్త్రీలు ప్రజల్ని వీరోచితంగా రక్షించి వాళ్ళకోసం మరణించి అనామక వీరవనితలై పోయిన సంగతి నాకు తెలుసు. ప్రజలు వాళ్ళ స్వీయానుభవాల నుంచి ఎన్నెన్ని సాధించారని! మనం ప్రతిరోజూ ప్రజల నుంచి నేర్చుకోదగిన విషయాలెన్నో చూస్తుంటాం. అందుకే నేనేమనుకుంటానంటే మన ప్రతీ అడుగుదగ్గరా ఆగి చూసినట్టయితే ఏ మాత్రం నిజాయితీ ఉన్నా ప్రజల మేధాశక్తి కనబడుతుంది. దీన్ని గమనించి ప్రజల శ్రమను జాగ్రత్తగా పరిశీలించి, వాళ్ళు అట్లా ఉండడానికి కారణాలను గుర్తించడం ముఖ్యమని నేననుకుంటున్నాను. ఆ రకంగా మాత్రమే వాళ్ళ విలువల్ని మనం గౌరవించగలం.

నాకు తెలిసిందానికంతా నేను నా ప్రజలకు రుణపడి వున్నాను. వాళ్ళు నాలో రేకెత్తించిన సాహసానికి నేను వాళ్ళకెంతగానో రుణపడి వున్నాను.

గృహిణుల సంఘం

పాజ్ ఎస్టెన్సొరో పాలిస్తున్న ఆ కష్టకాలంలోనే సైగ్లో-20 గని కార్మికుల భార్యలు ఒక గృహిణుల సంఘాన్ని ప్రారంభించారు. జనం పాల్గొంటున్న పోరాటాలు చూస్తూ వాళ్ళు ప్రేక్షకుల్లా ఉండలేకపోయారు.

మొదట్లో మాకు పెద్దలు నేర్పి పెట్టిన అభిప్రాయాలే ఉండేవి. స్త్రీలు ఇంటిపని కోసమే పుట్టారనీ, వాళ్ళు పిల్లల్ని పెంచడానికీ, వండడానికి మాత్రమే పనికి వస్తారనీ, సాంఘిక రాజకీయ విషయాలు వాళ్ళర్థం చేసుకోలేరనీ మా మనసుల్లో ఉండేది. కాని అవసరం మమ్మల్ని సంఘటితం చేసింది. సంఘటితం కావడానికి మేమెంతో కష్టపడ్డామన్న మాట నిజమే. కాని ఇవ్వాళ గని కార్మికులకు మరొక బలమైన తోడు దొరికింది. అదే గృహిణుల

సంఘం. సైగ్లో-20లో పుట్టిన ఈ సంఘం ఇప్పుడు జాతీయమైన అన్ని గనులకూ విస్తరించింది. .

సంఘం 1961లో పుట్టింది. ఆ సమయానికి మా ఆర్థిక పరిస్థితి కొంచెం గందరగోళంలోపడి ఉంది. కంపెనీ కార్మికులకు మూడు నెలల జీతాలు ఎగొట్టింది. తినడానికి తిండిలేదు. మందులేమీ దొరకక ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేశాం. కనుక గని పనివాళ్ళూ, స్త్రీలు, పిల్లలు అందరితోనూ కలిపీ లోపాజ్ నగరం వరకు ఒక ఊరేగింపు తీయాలని కార్మికులు తల పెట్టారు. మూడువందల ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లోపాజ్ వరకు ఈ ఊరేగింపు ఒక లాంగ్ మార్చ్ అయ్యింది. ప్రభుత్వం మా ప్రయత్నం ముందే గుర్తించి మమ్మల్ని అడ్డుకుంది. మా నాయకుల్ని అరెస్టు చేసి లోపాజ్ జెయిలుకు పట్టుకుపోయారు. ఈ రకంగా మహిళలందరూ తమ భర్తల సంగతి తెల్సుకోవడానికి లోపాజ్ వెళ్ళడం మొదలు పెట్టారు. అక్కడ వీళ్ళని చాలా హీనంగా చూశారు. అక్కడి పోలీసులు వీళ్ళను అరెస్టు చేయడానికీ, వీళ్ళపై అత్యాచారాలు జరపడానికీ ప్రయత్నించారు. ప్రతీ స్త్రీ కూడా ఎంతో నిరాశతో వెనక్కి తిరిగొస్తుండేది. యూనియన్ హాల్లో వాళ్ళు మాతో తమ అనుభవాల్ని కోపంతో వివరిస్తుండే వాళ్ళు. అప్పుడే మాకో ఆలోచన తట్టింది. “ఎవరంతట వాళ్ళం ఒక్కొక్కళ్ళమే పోయే బదులు మనందరం కలిసికట్టుగా లోపాజ్ వెళ్ళి మన హక్కులు కోరుకుంటే ఎలా ఉంటుంది? అలా అయితే మనందరం ఒకరి నొకరం చూసుకుంటూ ఉండొచ్చు. మంచి ఫలితాలు కూడా దొరకొచ్చు”. –

మొత్తం మీద లోపాజ్ వెళ్ళడానికయితే నిర్ణయమయింది గాని డిమాండ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయం గురించిగానీ, ఏ పద్దతిలో డిమాండ్ చేయాలనే విషయం గురించి కానీ మా వాళ్ళెవరికీ అవగాహనలేదు. అదే సమయంలో అక్కడ ఏదో ఒక మంత్రుల సమావేశం జరుగుతున్నదనీ అక్కడ ఒక కార్మిక ప్రతినిధి కూడా పాల్గొంటాడనీ ఎవరో చెప్పారు. ఈ సమావేశాన్ని అదనుగా తీసుకొని “మాకు స్వేచ్ఛ కావాలి. మా భర్తల్ని విడుదల చేయాలి” అనే నినాదాలు చేసి కార్మికుల డిమాండ్లకు మద్దతు ప్రకటించొచ్చని వాళ్ళకెవరో చెప్పారు. సరిగ్గా వాళ్ళదే చేశారు. కాని అప్పుడు ‘బర్డోలా’లనబడేవాళ్ళు కూడా అరవడం ప్రారంభించి మురిగిపోయిన టమాటాల్లో మిరియాలపొడి నింపి స్త్రీల మీదికి విసిరేయడం మొదలు పెట్టారు. స్త్రీలను బెదిరించారు, కొట్టారు, పిల్లల్ని ఎత్తుకపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యంచేసుకునే వరకు ఈ గందరగోళమే సాగింది.

బొలీవియా మహిళా చరిత్రలో ఈ బర్డోలాలది ఒక విషాదాధ్యాయం. ఈ బర్డోలాలు ఎమ్.ఎన్.ఆర్. స్థాపించిన ఒక మహిళా సంఘ కార్యకర్తలు. వాళ్ళు మహిళా ఉద్యమ నాయకురాలు మరియా బర్డోలా పేరైతే పెట్టుకున్నారు గాని ఆమె నిర్వహించిన పాత్రను వారెన్నడూ నిర్వహించలేదు. మరియా బర్డోలా లాలాగువా గ్రామానికి చెందిన స్త్రీ. 1942లో పాత గని యజమానుల దగ్గరినుంచి జీతాల పెరుగుదలను కోరుతూ ఒక పెద్ద ఊరేగింపు జరిగినప్పుడు ఆమె జెండా పట్టుకొని ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించింది. ఊరేగింపు కబావిలోని ప్రధాన కార్యాలయం దగ్గరికి చేరే సమయానికి సైన్యం ప్రవేశించింది. మూకుమ్మడి హత్యకాండ జరిగింది. ఆమె ఆ హత్యాకాండలోనే మరణించింది. ఈ బీభత్సం జరిగిన ప్రాంతాన్ని ఇప్పుడు మరియా బర్డోలా మైదానం అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఎమ్ఎన్ఆర్ నాయకత్వంలోని బర్డోలాలు ప్రభుత్వ పక్షమైన తమ పార్టీ ప్రయోజనాలు కాపాడడానికే పనికొస్తున్నారు. అంటే ప్రజల్ని అణిచేయడానికి తోడ్పడుతున్నారు. ఈ కారణంవల్లనే బొలీవియాలో బర్డోలాలంటే ఎవరికీ సదభిప్రాయం లేదు. లోపాజ్లో ఓ సారి కొందరు కార్మికులు ఏదో డిమాండ్ కోసం ప్రదర్శన జరుపుతుంటే బర్డోలాలు కత్తులు, కొరడాలూ తీసుకొని వాళ్ళమీద దాడిచేశారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రదర్శనలు జరిపే వారిమీద వాళ్ళు దాడిచేశారు. పార్లమెంటులో కూడా ఎమ్ఎన్ఆర్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే బర్డోలాలు వాళ్ళమీదికి మురిగిన టమాటాలు విసిరేస్తారు. వాళ్ళను మాట్లాడనివ్వకుండా చేస్తారు. ఇట్లా ఈ ఉద్యమం బొలీవియన్ మహిళా ప్రయోజనాలను ముందుకు తీసుకుపోయేందుకు కాక ఒక శత్రువు చేతి ఆయుధంగా పనిచేసింది. అందుకనే ఎవరైనా ప్రభుత్వానికి అమ్ముడు పోయినప్పుడుగానీ మహిళా పోలీస్ ను చూసినపుడుగానీ జనం “ఆమె ఒక బర్డోలా. ఆమెతో తిరగకు” అంటారు. ప్రజల్లో నుంచి వచ్చిన ఒక చారిత్రక వ్యక్తి పేరు ఈ విధంగా తిట్టు అయిపోవడం, దుర్వినియోగం కావడం సిగ్గు చేటయిన విషయం కాదూ!

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.