యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

ఎదురీత

అజిత, సుజిత తల్లిచాటు బిడ్డలు. అమ్మనేర్పిన  పిండి వంటలు, కుట్లు, అల్లికలు, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలాంటి పనులన్నీ చక్కగా చేస్తుండేవారు. ఇద్దరికీ రాని పనంటూ లేదు. అందంగా ఉన్న అజితని వరసకి బావ అయిన రమేష్ ఇష్టపడ్డాడు. రమేష్ చాలా బావుంటాడు. అందరితో మర్యాదగా మాట్లాడతాడు. అజిత తండ్రి సుబ్బారావు అతన్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు.  

పెళ్ళి మాటలు అయిపోయాయి. ఒక శుభముహూర్తాన అజిత, రమేష్ లు ఓ ఇంటివాళ్ళయ్యారు. అందరి ఆడపిల్లలాగే అందమైన కలలతో అజిత అత్తగారింట్లో అడుగుపెట్టింది. అందరితో బాగా కలిసిపోయింది. అందరికీ తనకి వచ్చిన వంటలన్నీ చేసిపెట్టేది. ఇల్లు చక్కగా తీర్చిదిద్దేది. అయితే రమేష్ రాత్రిపూట చాలా లేటుగా వచ్చేవాడు. కొన్నాళ్ళు ఏవో పనులుంటాయిలే అని సద్దుకుపోయింది. కానీ రానురాను లేటుగా రావడమే కాకుండా బాగా తాగేసి వచ్చేవాడు. ఇవన్నీ పుట్టింట్లో చూడని అజితకి చాలా భయంగా, కొత్తగా అనిపించేది. 

రమేష్ రాత్రి వచ్చాక ఏమీ మాట్లాడేవాడు కాదు. పొద్దున్న లేటుగా లేచేవాడు. అత్తగారు, మామగారు ఏమీ తెలియనట్లే వుండేవారు. ఒకవేళ అజిత ఏదైనా మాట్లాడబోతే నువ్వే సద్దుకోవాలి అనేవారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. తనలో తనే బాధపడిపోయేది. అమ్మానాన్నలకి ఏమీ తెలియపర్చలేదు.

ఒకరోజు బాగా తాగేసి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడి ఏ కారణంలేకుండానే చెంపమీద టపటపా వాయించాడు. ఆ రోజు బాగా ఏడ్చి పడుకుంది. ఒకరోజు కాదు వరసగా వారంరోజులు ఇలాగే చేశాడు. చెంపలు వాచిపోయాయి. అత్తగారూ మామగారూ ఏమీ మాట్లాడట్లేదు. అజిత గట్టి నిర్ణయానికి వచ్చింది. ఏమైనాసరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది. 

ఒకరోజు కూతురిని చూసిపోదామని వచ్చిన సుబ్బయ్యకి చూడగానే అక్కడ ఏదో జరిగిందని అర్థమయ్యింది. కూతురితో అమ్మా… మీ అమ్మకి వంట్లో బాగాలేదు నిన్ను చూడాలంటోంది రమ్మన్నాడు. తండ్రి అడిగిందే తడవుగా బట్టలు బ్యాగ్ లో పెట్టుకుని అత్తమామలకి వెళ్ళొస్తానని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది.  

ఇంటికి వెళ్ళాక అమ్మా నాన్నలకి అన్ని విషయాలు విశదంగా చెప్పింది. వాళ్ళు బాధపడ్డారు. 

నాన్నా…. ఈ వంకతో నేను ఇలా వచ్చేశాను. ఇంక అక్కడికి వెళ్ళడం జరగదు. హైదరాబాదులో మా ఫ్రెండ్ ఉమ ఉంది. తన దగ్గిరకి వెళ్ళి ఏదైనా పని చూసుకుని నా బతుకు నేను బతుకుతాను అంది. మొదటి నుంచీ ఒక నిర్ణయానికి కట్టుబడి అనుకున్నది సాధించే అజిత మాటలకి వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేకపోయారు.  

ఉమతో అన్నీ ఫోనులో మాట్లాడి అజిత హైదరాబాదు వచ్చేసింది. అయితే ఉమ అజితతో – నువ్వు చదివిన చదువుకి ఉద్యోగం రావడం కష్టం. నీకు రకరకాల స్వీట్స్ వచ్చుకదా. నేను తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను. మా ఆఫీసులో కూడా చెప్తాను. నువ్వు చేసి అందరికీ ఇచ్చావంటే… నీకు అవసరాలకి తగిన డబ్బులు వస్తాయి. నీకు కొంత పెట్టుబడి నేను పెడతాను. నువ్వుబాగా సెటిల్ అయ్యాక నాకు ఇచ్చేద్దువుగాని అంది. అజితకి అది బాగానే అనిపించింది. 

ఇంట్లోనే స్వీట్లు తయారు చేసి ఉమ చెప్పిన చోటికల్లా వెళ్ళి అందరికీ అమ్మేది.   అందరితో నవ్వుతూ మాట్లామాట్లాడేది. కొద్దిరోజులకే అందరికీ అజిత అంటే మంచి అభిప్రాయం కలిగింది. ఒకవేళ అవసరం లేకపోయినా ఆమె మంచితనానికి అందరూ ఏదో ఒకటి కొనేవారు. 

కానీ పని బాగా ఎక్కువయి. కొద్దిరోజులు అనారోగ్యంపాలయ్యింది. అజిత ఏమాత్రం నిరాశపడలేదు.  ఉమ కూడా ఎక్కువ బలవంత పెట్టలేదు. వేరే ఏదన్నా ఆలోచించు అంది. 

పిల్లలంటే ఇష్టమైన అజితకి బేబీ కేర్ సెంటర్ పెట్టుకోవాలనిపించింది. తనకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పివచ్చింది. అలా తెలుసుకున్న కొంతమంది ఉద్యోగస్తులైన ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలని అజిత కేర్ సెంటర్ లో పెట్టి వెళ్ళేవాళ్ళు. అది ఒక చిన్న చిన్నగదిలో ఉన్నా కూడా ఎవరూ దాన్ని గురించి పట్టించుకునేవారు కాదు. 

అజిత పిల్లలని చాలా బాగా చూసేది. పిల్లలకి టైముకి పాలు పట్టడం, వాళ్ళకి అమ్మానాన్నలు ఇచ్చిన ఆహారం పెట్టడం విషయంలో చాలా శ్రద్ధతీసుకునేది. సాయంత్రం, అందరూ పిల్లలని తీసుకుని వెళ్ళడానికి వచ్చే టైముకి వాళ్ళకి స్నానం చేయించి శుభ్రంగా వుంచేది.  రోజులు బాగా గడిచిపోతున్నాయి. అజిత మనసు కుదుటపడింది. 

ఒకరోజు అమ్మావాళ్ళని చూద్దామనిపించి పాలకొల్లు బయల్దేరింది. వాళ్ళకి కొత్తబట్టలు కొనుక్కుని బండెక్కింది. ఇంటికి సంతోషంగా వెళ్ళింది. చాలా రోజులకి చూశారేమో సుబ్బారావు, సుమతి కూతుర్ని ఆప్యాయంగా పలకరించి విషయాలు తెలుసుకున్నారు.

ఆ సాయంత్రం రమేష్ వచ్చాడు. అజిత ఏం మాట్లాడలేదు. ఎందుకంటే హైదరాబాదులో వుండగా ఎన్నోసార్లు ఫోన్ చేసి మాట్లాడదామని ప్రయత్నించాడు. అజిత ఇష్టపడలేదు. ఇంక ఇక్కడ తప్పించుకోలేకపోయింది. ఎదురుగా కూర్చున్నాడు. ఇద్దరి మధ్యా మౌనం తాండవిస్తోంది. రమేష్ ధైర్యం చేసి అజితా నా తప్పులన్నీ క్షమించు ఇంక మనిద్దరం కలిసే వుందాం. నేనింకెప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టను అన్నాడు. అజిత ఏం మాట్లాడలేదు. సుమతీ, సుబ్బారావు అమ్మా…. అజితా అడుగుతున్నాడు కదా సమాధానం చెప్పు అన్నారు. 

ఏం చెప్పాలమ్మా ఇతనితో కలిసి వుండి మళ్ళీ కష్టాలు కొనితెచ్చుకోవాలి. ఇది జరగదు అంది. రమేష్ చాలా నెమ్మదిగా నేను కొంత డబ్బు దాచాను హైదరాబాదులో కిరాణాషాపు పెట్టుకుందాం. నేను మారిపోయాను. నన్ను క్షమించు అన్నాడు. 

ఇక అజిత ఏమీ మాట్లాడకుండా ఇది ఆఖరి అవకాశం నన్ను ఇంకేమైనా ఇబ్బంది పెట్టావంటే పోలీసు కేసు పెడతాను అంది. అన్నిటికీ ఒప్పుకున్నాడు.  అజిత ఇంకో అవకాశం ఇచ్చింది. 

ఇద్దరూ కలిసి హైదరాబాదు వచ్చారు. కిరాణాషాపు పెట్టారు. తెలిసిన వాళ్ళు చాలామంది వుండటంతో షాపు బాగానే నడిచింది. అజితకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కిరాణాషాపుకి తరచు వెళ్లలేకపోయేది. రమేష్ అన్నీ చూసుకుంటున్నాడు కదా అని వదిలేసింది. 

అయితే రమేష్ షాపు సరిగా తీసేవాడు కాదు. టైముకి ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడో తెలియదు. కొంతమంది వచ్చి అజితకి విషయం చెప్పినా వినేసి వూరుకుంది. బాగా ఆలోచించింది. షాపు తన పేరు మీద వుంది కదా అని గుర్తుకు వచ్చింది. వెంటనే కొంతమంది పెద్దమనుషుల దగ్గిరకి వెళ్ళి విషయం చెప్పింది. ఆ షాపుని వారి సమక్షంలో వేరే వాళ్ళకి ఇచ్చేసింది. వాళ్ళిచ్చిన కొద్దిపాటి డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చింది. ఇంట్లో రమేష్ పడుకుని నిద్రపోతున్నాడు. ఏమాత్రం బాధ్యతలేనితనం చూసి చాలా అసహ్యం వేసింది. 

రమేష్ కి నన్ను కలవడానికి ప్రయత్నించకు అని ఒక ఉత్తరం రాసి పెట్టేసి పిల్లలని తీసుకుని మళ్ళీ తన స్నేహితురాలు ఉమ దగ్గిరకి వెళ్ళిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బులలో కొంత బాకీగా ఇచ్చేసింది. పిల్లలని దగ్గరలో ఉన్న స్కూలులో వేసింది. 

అజిత ఇద్దరు మనుషులని పెట్టుకుని మళ్ళీ స్వగృహఫుడ్స్ చెయ్యడం మొదలుపెట్టింది. తొందరలోనే వ్యాపారం బాగా పుంజుకుంది. తను కొత్త జీవితాన్ని ప్రారంభించడమే కాకుండా ఈరోజు అజిత 20 మందిని తన దగ్గర పనికి పెట్టుకుని వాళ్ళకి కొత్తజీవితాన్ని ఇచ్చింది. 

*****

Please follow and like us:

One thought on “యదార్థ గాథలు-ఎదురీత”

Leave a Reply

Your email address will not be published.