ప్రశాంత జీవనం!
-వసంతలక్ష్మి అయ్యగారి
సృష్టిలో మనుషులు,మనస్తత్వాలు ఎన్ని రకాలో మరణాలుఅన్ని రకాలు.ఆపై ఓ మరణవార్తకి మనుషుల స్పందనలోనూఅంతే వైవిధ్యం.జననమరణాలు దైవాధీనాలే అయినా పూర్ణాయువుకలిగి పైకెళ్లడంఓటైపైతే,అకాలమరణం,అర్థాయుష్షూ మళ్ళీ వేరు.అక్కడితో అయిందా?సునాయాస,అనాయాస,ఆయాస,ఆపసోప,ఆసుపత్రి[ప్రభుత్వ,కార్పోరేటు]..హబ్బో..యీ వర్గీకరణ కి తెగూతెంపూ లేనట్టుందే!
ఇదిలా ఉంటే,పుట్టిన ప్రతిజీవి తన తల్లిదండ్రులు గతించడాన్ని ఒకలాగ, అత్తమామల కన్నుమూతని మరోలాగ, సహచరులు, ఏకోదరులైతే యింకోలాగ, దగ్గరిబంధువులైతే ఓలాగ, దూరపువారి దుర్వార్త మరోలాగ, వృద్ధులనిర్యాణమైతే కాస్త గంభీరంగా….యిలా రకరకాలుగా స్వీకరించి స్పందిస్తాడు కదా!
కొన్నింటికి షాకుకు గురై మరీ హుటాహుటిన ప్రయాణం కడితే..కొన్నింటికి సమారాధనల దినాలు లెక్కేస్కుని వెళ్తారు.వీటికిమళ్ళా బోల్డంత లెక్కలు, నియమాలు.. వారాలు, వర్జ్యాలు, పరామర్శలు, ఓదార్పులు, నివాళులు, శ్రద్ధాంజలులు, పలకరింపులు, పట్టింపులు, స్మశానవైరాగ్యం, షరామామూలే!!
యిక తమ కుటుంబం కాకుండా, ఇరుగుపొరుగువారు, సహోద్యోగులు, ఎక్స్ ఉద్యోగులు,బాస్ లు..అంతా యింకో రకం! ఆసుపత్రికే ఆఘమేఘాలమీద ఆయాసపడుతూ వెళ్ళేవి కొన్నైతే, ఆలోచించి, కార్యక్రమం షెడ్యూలు తెలుసుకుని, అదేంటో మృతుడికి పేరే లేనట్టు.. ”బాడీతరలింపుకు” అంటూ తాపీగా, తప్పనిసరిగా వెళ్ళేవి యింకొన్ని.
మనవాడుక భాషలో కొన్నిజాతీయాలను ప్రత్యేకించి యీ సందర్భానికి రాసిచ్చేసి జాతీయం చేశాం.
అనారోగ్యంపాలై,పూర్తిగా మరో మనిషి ఆసరాతో రోజులు వెళ్లదీసే దుస్థితిని అనుభవించి మరీ సద్గతి ని పొందినవారిని..”ప్చ్ ..పాపం.చాలా తీసుకుని తీసుకుని పోయారు ..”అంటూ పెదవి విరవడం పరిపాటి!దీనికిభిన్నంగా..చెప్పాపెట్టకుండా ఓగంటలో చటుక్కున అంతర్థానమై..చక్కాపోయిన వారిని…అరవైయే దాటినాసరే,అదృష్టవంతుడు,అనాయాసంగా పోయాడు,ఎంతపుణ్యం చేసుకుంటే అంత మహద్భాగ్యం కలగాలీ అంటూసాగతీతలు!ఏకాదశి మరణం..ద్వాదశి దహనం అంటూ మరో సొలేసూ!!
దుర్మరణం,అకాలమరణమయితే మటుకు రోదనలు రోదసినంటాల్సిందే…శోకసముద్రాన్నీదాల్సిందే!
ఈ మాటలన్నీ కాస్త అర్థమయేది యాభైలు దాటిన వారికేననుకోండి!
ఇవన్నీ కాకుండా మనింట్లో మనం కూర్చుని ..నిత్యకృత్యంగా టీవీ పెట్టగానే..లేదా తెల్లారుతూనే పేపరు,సెల్లు,ముఖపుస్తకం….తెరుస్తూనే చూసే …మతిపోయే ..మృత్యువుల రకాలు కోకొల్లలు..!!
ఢీలు, పల్టీలు, డుషుండుషుంలు, కాల్పులు, పేల్పులు, కూల్పులు, మంటలు, వరదలు, భూకంపాలు, బోల్తాలు, బోరుబావులు, దిగుడుబావులు…పాపిష్టుల పాశవికాలు,శాడిస్టుల యాసిడ్ దాడులు, రాగింగు రోగ్ లు, అత్తింటి ఆరళ్ళు, వరకట్న వధలు, సైకోలవీరంగాలు, ప్రమాదాలూ, మితిమీరిన ప్రమోదాలు, పరీక్షాఫలితాలు…క్షణికావేశాలు, సమాజంసాధింపులు, పిడుగులు, హత్యలు,స్వహత్యలు,వైపరీత్యాలు,కక్షసాధింపుచావులు,సామూహిక దహనాలు, దావానలాలు, మాన్ హోల్మునుగుళ్ళు, ఉప్పెనలూ , ఉపద్రవాలూ,పంచభూతాల భీభత్సాలతో ప్రాణాలు పటాపంచలవడం, మరీసాధారణమనుకోండి. వీటికీ విభిన్న స్పందనలున్నా.. పైపైనే.. తేలికపాటిగా ఉంటాయే తప్ప హృదయాన్ని అంతగా కుదిపెయ్యవు.
” టైమైపోయిందంతే..ఏంచేసేదిలేదు ప్చ్” అని దులిపేసుకుని ఓ రొటీన్ ఎక్స్ ప్రెషన్ తో సరి! అదీ ఆ క్షణమే!!
సెలెబ్రిటీలు శలవు తీసుకుంటే..ఓహో అనుకుంటాం..బ్రేకింగు లో వచ్చే మరణ వార్తాకథనాలకు ..ఉన్నచోటే ఉత్కంఠకులోనై,పళ్ళు బిగించో,వేళ్ళు కొరికేస్తూనో నిట్టూరుస్తూనే ఉంటాం..తీరు,తీవ్రతలనుబట్టి.!
కొన్నింటిని ఆపళంగా మనవారికి ఫోన్లు చేసి పంచేస్తాం..అస్సలుంచుకోం .అదేంటో.!!ఇపుడంటే వాట్సప్లో ఫార్వర్డ్,ఫ్.బీలోషేరూ అనుకోండి.
చానెల్స్ వారు చావుల వివరాలతో,రిపీట్లతో మరీ విసిగిస్తే…మనం టీవీ కట్టేస్తాం.యిట్టివార్తలను అమాంతం పదిమందికిఫోన్లో పంచేసే జోరూ..హోరు… తగ్గినట్టేననిపిస్తోంది.అంటే మరణ వార్తలపట్ల ”ఫీలింగు ”లో తీవ్రత తగ్గుతోందాఅనిపిస్తోంది.
ఈ లెక్కన ,మన దేశ మాజీ అధ్యక్షుడు,శ్రీ అబ్దుల్ కలామనే మహనీయుని మరణ వార్త విశ్వమంతటినీ కుదిపేసి,తరచితరచి తలపిస్తూనే ఉందంటే…ఆయన వ్యక్తిత్వం ఎంత విశిష్టమో,విలక్షణమో..మరెంత శ్లాఘనీయమో కదా..!ఆయనమామూలు మనిషికాదుగా..మహామనీషి..ప్రజలమనిషి!పీపుల్స్ ప్రెసిడెంట్..!
సోషల్ మీడియా పుణ్యమా అని …ఆ మహాత్ముని అమూల్యమైన క్వొటేషన్స్ ను ముమ్మరంగాపంచుకోగలిగి,తలచుకోగలిగిన సౌభాగ్యం,సౌలభ్యం మన సొంతమయ్యాయేమో!
అయినా వారి స్మృతులు అజరామరం! వారికి మరోసారి సలామ్!!వారి ఘనచరిత్రలో కొంత సమకాలీనులమైనందుకు గర్విద్దాం!
ఇవన్నీ కాదు గానీ,RIP అంటూ…మరణవార్తల పోస్టుకి సోషల్ మీడియా లో చోటుచేసుకునే స్పందనలూ,సందేశాలవెల్లువ విపరీతంగానూ,అసంకల్పితంగానూ,మరీ యాంత్రికంగానూ ఉంటోంది.అర్థంగానీ,ఫుల్ ఫామ్ గానీతెలియకుండా, తలా తోకా లేకుండా కూడా వాడేస్తున్నారు జనాలు.నిన్ననే ఎక్కడో చదివాను. “పోయాక యికరెస్టూ,పీసూ..ఏవిటీ…బతికుండగానే ఆ ‘రిప్’ అనో,కాదంటే ‘లిప్’ అనో [L I P…live in peace] అంటూ ఒకరినొకరు గ్రీట్ చేసుకునే సంస్కృతీ,సంస్కారం అలవర్చుకుంటే బావుంటుందేమో కదా అని!
ఇదెక్కడి టాపిక్ ను పిక్ చేసుకుందిరా యీ మహాతల్లి అని అంతా అనుకుంటున్నారుకదూ…!
మరి ప్రస్తుత పరిస్థితి అటువంటిది. లాక్ డౌన్ పేరుతో ప్రపంచాన్ని మొత్తం గృహనిర్బంధం కావించి…యెన్నివ్యాపకాలుంటున్నా… సేపనీ యింట తప్పక పోయినా… గుండెల్లో గుబులు…ప్రాణరక్షణ కై కట్టుబాట్లూ.. నియమాలూ , ఒక్కడు నియమోల్లంఘన గావించినా… కట్టలు తెంచుకుని .. వయసూ వరసా అంటూ మొహమ్మాటాలు లేకుండా …కోట్లప్రాణాలను పిప్పి చేస్తూ దూసుకుపోతూ తీసుకుపోతున్న “క రో నా” ఊసు ఊళ్లేలుతున్న కాలంలో దీనికి మించిన మంచిమాటలేం గుర్తొస్తాయి చెప్పండి?అందుకే కరవౌతున్న ప్రశాంత జీవనానికి తపస్సు చేస్తూ యీ మాటలు.
ఏవైనా ఔట్ బ్రేక్ లూ …యెపిడెమిక్కులూ… కాక పాండెమిక్ అనే పదానికి ప్రత్యక్ష సాక్షులమై చరితార్థులమవుతున్నాం! ప్రాణాలకు విలువే లేనట్టు కనీస స్పందన కరువైన రోజులొచ్చేశాయి.ఈ కథ కు సత్వర ముగింపుగా శుభం కార్డుపడాలని.. తెరదిగాలనీ నిత్యనిరంతరంగా జపిద్దామా !
తోచక టీవీ పెడితే కనిపిస్తున్న వరుస మరణాలగాథలు గాంచి, ఎక్కడో లీలగా పైకెళ్ళిన పెద్దలంతా కనిపించేసరికి అవలీలగా రాసేసిన మాటలివి.తప్పులు,అపార్థాలు లేవుగా!!
పోయినోళ్ళందరూ మంచోళ్ళు,,
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులు!!
*****