స్ఫూర్తి

-అనసూయ కన్నెగంటి

 

 

   పాఠం చెప్పటం పూర్తి చేసి గంట  కొట్టగానే తరగతి గది నుండి  బయటికి వెళుతున్న ఉపాధ్యాయుణ్ణి “ మాస్టారూ..! ఈ బడిలో ఆరు బయట నాకు కొంచెం స్ధలం కావాలండి” అని అడిగాడు రాము.

      ఆ మాటకి తోటి విద్యార్ధులంతా ఫక్కున నవ్వారు రాముని చూసి.  సిగ్గు పడ్దాడు రాము.

    అయితే రాము మాటలకి వెళ్ళబోతున్న వాడల్లా ఆగిపోయి వెనక్కి వచ్చారు ఉపాధ్యాయుల వారు. 

రాము మామూలు విద్యార్ధి కాదు. ఎప్పుడూ ప్రధమశ్రేణిలోనే  ఉత్తీర్ణుడు అవుతూ ఉంటాడు. అలాంటి వాడు ఏదో కారణం ఉంటే తప్ప అలా అడగడు. అందుకే  నవ్వుతున్నవాళ్లను కోపంగా చూసాడు.

            దాంతో వాళ్లంతా నవ్వటం ఆపి రాము వైపు , మాస్టారి వైపు మార్చి మార్చి చూశారు. తరగతి అంతా నిశబ్ధంగా అయిపోయే వరకూ చూసి రాము దగ్గరకంటా వచ్చి భుజం మీద చెయ్యేసి.. 

              “ స్ధలం నీకెందుకు రాము ? “ అని అడిగారు ఉపాధ్యాయుల వారు. 

              “ మొక్కల్ని పెంచుతాను మాస్టారు..” అన్నాడు చేతులు కట్టుకుని వినయంగా. అతని మాటల్లోని నిజాయితీకి ముచ్చటేసిన ఉపాధ్యాయుల వారు..రాముని అభినందిస్తున్నట్టుగా భుజం మీద ప్రేమతో నిమిరి..

   “ మంచి ఆలోచన. పద ప్రధానోపాధ్యాయుల వారిని అడుగుదాము. “ అని చెప్పి రాముని ప్రధానోపాధ్యాయుల వారి వద్దకు తీసుకెళ్ళి అంతా చెప్పారు. 

        రాము వైపు చూసి నవ్వారు ప్రధానోపాధ్యాయుల వారు. నవ్వి..” ఆస్దలంలో  ఏమి మొక్కలు వేస్తావు? “ అని అడిగారు. రాముకి తల్లి గుర్తుకు వచ్చి.. “ మనందరికీ ఉపయోగపడే మొక్కలు వేస్తానండి”  అన్నాడు.

    దాంతో..ప్రధానోపాధ్యాయులు చెప్పిన మీదట బడి బయట ఆవరణలో కొద్దిగా స్ధలాన్ని చూపించి..

   “ఇదిగో..రాము. ఈ స్ధలం నువ్వు తీసుకో. ఏమి మొక్కలు వేస్తావో..నీ ఇష్టం” అన్నారు ఉపాధ్యాయుల వారు.

     ఆ మర్నాడు..చిన్న  ఇనుప ముక్క తెచ్చి ఖాళీ సమయంలో ఆ నేలంతా తవ్వి చక్కగా చదును చేసి..తను కూడా తెచ్చుకున్న సీసాలోని మిగిలిన మంచినీళ్లను ఆ మట్టి మీద చిలకరించాడు.

     తర్వాత వాళ్ల అమ్మను అడిగి కొన్ని మెంతులు తీసుకు వచ్చి ఆ మట్టి మీద చల్లాడు. రోజూ తన దగ్గరున్న నీళ్లను ఆ విత్తనాల మీద చల్లేవాడు.

     రాము చేసే పనిని పిల్లలంతా ఆసక్తిగా గమనించటం మొదలు పెట్టారు. అలా ఆ విషయం బడి మొత్తం తెలిసిపోయింది. మూడవనాటికి మెంతి విత్తనాలు మొలకెత్తాయి.

    అయిదవనాటికి అవి మూడు అంగుళాలు పెరిగే సరికి ఉపాధ్యాయుణ్ణి కలసి..వాటిని కోసి కూరల్లో వేస్తే బడిలో మధ్యాహ్న భోజనంలోపిల్లలకు పెట్టవచ్చని చెప్పాడు రాము. 

    ఉపాధ్యాయుడు తనలో తానే నవ్వుకుంటూ..ప్రధానోపాధ్యాయుల వారికి ఒక మాట చెప్పి రాము చెప్పినట్తే చేశాడు. తమ ఆవరణలో పెరిగిన మెంతి కూర కావటంతో ఆ రోజు పిల్లలంతా ఎంతో ఆనందంగా భుజించారు. 

ఉపాధ్యాయులందరూ రాముని  ఎంతో మెచ్చుకున్నారు. 

      ఆ మర్నాడు రాముకి మరి కొంత స్ధలాన్ని ఇచ్చి మరోఇద్దరు విద్యార్ధుల్ని తోడు ఇచ్చారు. అలా అలా కొద్దికాలం గడిచేసరికి బడంతా పచ్చదనంతో నిండిపోయింది. బడి పిల్లలు అందరూ తమకి కేటాయించిన స్ధలంలో మొక్కలు వేసి పోటీ పడి పెంచసాగారు.

        ఈ మార్పుని  గమనించి ఉపాధ్యాయులంతా పిల్లలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆ బడిలోని స్దలాన్ని తలా కొంతా  తీసుకుని వాళ్ళూ తోటపనిలో నిమగ్నమవటం మొదలు పెట్టారు. మరి కొంతకాలం గడిచేసరికి బడిలో ఖాళీస్ధలమే లేకుండా నిండుగా పూలతో,  పళ్లతో కళకళలాడటం మొదలు పెట్టింది. బడిలో పిల్లలకు అవసరమైన ఆకు కూరలూ, కూరగాయలూ..తామే పండించుకోవటంతో..ఆ చుట్టుపక్కలా ఉన్న బడులన్నీ ఇదే పద్దతిని అనుసరించాయి.

      ఒకరోజు అకస్మాత్తుగా బడులకు పై అధికారి పరిశీలన నిమిత్తం బడికి వచ్చి పూలతో, ఆకు కూరలతో కళకళలాడుతున్న బడిని చూసి ఆనందపడి “ఇలా ఎలా సాధ్యమైంది ?” అని ప్రధానోపాధ్యాయుల వారిని అడిగారు.

    దాంతో రాముని రమ్మని కబురంపారు ప్రధానోపాధ్యాయులవారు. 

       “ మంచి బాలుడివి. భవిష్యత్తులో మంచి రైతువి అవుతావు. ఇంత చిన్న పిల్లవాడివి. అసలు ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది?” అని అడిగారు పై అధికారి.

    “ మా అమ్మను చూసి నేర్చుకున్నానండి. మా అమ్మ మా ఇంట్లోకి కావలసిన కూరగాయల్నీ, ఆకుకూరలనూ ఇంట్లోనే పెంచుతుంది.  మా తోట అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఇంట్లోనూ , బడిలోనూ ఎక్కువ సమయం గడుపుతాను. బడిలో ఉన్న ఖాళీ స్ధలాన్ని ఇంత అందంగా మారిస్తే అందరూ నాలానే సంతోషిస్తారు అనిపించింది. 

ఆ సంతోషం..వాళ్లని బడికి ఇష్టంగా తీసుకు వస్తుంది. ఆ ఇష్టం..వాళ్ళు బాగా చదువుకునేలా చేస్తుంది. అంతే కాదు…మనం పీల్చే గాలి కూడా మొక్కలు మన చుట్టూ ఉంటే స్వచ్చంగా ఉంటుందని అమ్మ చెప్పింది అండి” అనేసరికి పై అధికారి వచ్చారని, సమావేశం ఏర్పాటు చేసారని అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న ఉపాధ్యాయులంతా చప్పట్లు చరిచారు. 

  అంతే కాదు..

    అప్పటికప్పుడు  రాము తల్లిని బడికి పిలచి అందరి ముందూ ఆమెనూ, రామూని ఘనంగా సత్కరించారు. అదంతా చూసిన “ నాకు కొంచెం స్ధలం కావాలి” అని అడినప్పుడు నవ్విన తోటి విద్యార్ధులంతా రాము దగ్గరకు వచ్చి క్షమించమని అడిగారు.  దాంతో..రాము వాళ్లందరి వైపూ చూసి నవ్వి..

    “క్షమించేంత తప్పు ఏమి చేసారురా మీరు. నా ఆలోచన మీకు తెలియదు కదా. కాకపోతే ఒక పని చెయ్యండి. నన్నలా అన్నందుకు మీరు బాధ పడుతున్నారు కాబట్టి దానికి ఒకటే శిక్ష.  మీ మీ ఇళ్లల్లో ఖాళీ స్ధలం చూసి మొక్కల్ని పెంచండి. సరేనా?” అన్నాడు.

    సరేనంటూ పిల్లలంతా ఆనందంతో గంతులేస్తూ రాముని పైకెత్తి గిరగిరా తిప్పారు.

              *****

Please follow and like us:

One thought on “స్ఫూర్తి (బాల నెచ్చెలి-తాయిలం)”

Leave a Reply

Your email address will not be published.