అనుకరణ
-ఆదూరి హైమావతి
అనగా అనగా విజయపురి అనే రాజ్యం ఉండేది.ఆరాజ్యానికి మహారాజు విక్రమసింహుడు.ఆయన తన ప్రజలు చాలా విఙ్ఞులనీ, తెలివై నవారనే నమ్మకం ఉండేది. పక్కనే వున్న అమలపురి మహారాజు ఆనందభూపతి ఆయన బాల్యమిత్రుడు. ఇరువురూ ఒకమారు కలసి నపుడు ,పరస్పరం తమరాజ్య పరిస్థితి గురించీ మాట్లాడుకునే సమ యం లో , విక్రమసింహుడు ” మాప్రజలు చాలాతెలివైన వారు, విఙ్ఞు లు కూడా.అందువలన మాకు మా ప్రజల గురించిన చింత ఏమాత్రం మాకు లేదు.వారు మోసపోడం జరగని పని. ఏపని చేసినా తర్కించి చేస్తారు…” అన్నాడు
” విక్రమా! ప్రజలు ఎంతతెలివైన వారైనా , ప్రతిపనీ తర్కించి చేస్తార నడం సమంజసంకాదు.ప్రజలు సదా తమ ఇరుగు పొరుగులనుఅను సరిస్తారు, ఇహ తమ ప్రభువును అనుసరించడంలో వారు ఏమీ ఆలో చించరు. ” అన్నాడు ఆనందభూపతి .
” కాదు ఆనందా! మాప్రజలవిషయంలో అదిజరుగదు.వారు వెఱ్ఱి గా ఏమీ అనుసరించరు.” అన్నాడు విక్రమసింహుడు , తమ ప్రజల విఙ్ఞతపైన ఉన్న పరిపూర్ణ విశ్వాసంతో. విక్రమసింహుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని ఆనందభూపతి ” సరే ! మిత్రమా! మా ఉద్యాన వనం దర్శించరండి.ఇటీవల కొన్ని చిత్రమైన మొక్కలను మా తోట మాలి పెంచుతున్నాడు ” అని విక్రమసింహుని తమ ఉద్యానవనానికి తీసుకెళ్ళి , తమ పూదోటను, పండ్లతోటలను చూపాడు ఆనంద భూప తి. వాటి ,సువాసననూ, సౌందర్యాన్నీ, పరిమాణాన్నీ చూసి మురిసి పోయిన విక్రమసింహుడు ఆశ్చర్యంతో ” ఇంత అందంగా ఇన్ని రకా ల వింత వింత మంచి సువాసన పుష్పాలు, , ఇంత పెద్ద పరిమాణం లో ఫలాలు ఎలా పండించగలుగు తున్నారు. మీ తోటమాలితో నేను సంప్రదించవచ్చా? ” అన్నాడు.
” తప్పక మిత్రమా!ఎవరక్కడ ? మన ప్రధాన తోటమాలి ‘ పమేశు ‘ని పిలిపించండి ..” అనితన పరివారాన్ని ఆఙ్ఞాపించాడు ఆనంద భూప తి. రాజాఙ్ఞ అందినవెంటనే పరమేశుడు పరుగు పరుగున వచ్చాడు.
” జయము జయము ప్రభూ ! ఆజ్ఞాపించండి” అనివినయంగా చేతు లు కట్టుకుని నిల్చాడు.
” పరమేశూ! మన ఉద్యానవనం అందచందాలు మాబాల్య మిత్రుని మనస్సు దోచుకున్నా యి. ఏవిధంగా ఇంత మంచి ఫల పుష్పాలు పండిస్తున్నారని ఆసక్తి చూపగా నిన్నుపిలిచాం.” అని ఆనంద భూప తి చెప్పగానే , ” ప్రభువులకు వందనాలు.మా ఉద్యానవనంలో హిమా లయాలనుండివచ్చిన ఓ ఋషీశ్వరులు ఒక హిమన్నగ శిలను ప్రతి ష్టించారు. దాని ప్రభావం వలన మా ఉద్యానవనం నిత్య నూతనమై న ఫలాలను, పుష్పాలను అందిస్తున్నది.ఆౠషీశ్వరులు తిరిగి రానున్న ఏకాదశి దినాన మానగరికి విచ్చేస్తున్నారు.తమరూ వారిని మాప్రభువులతో కలసి దర్శించవచ్చు.” అని సవినయంగా మనవి చేసుకున్నాడు పరమేశుడు.
విక్రమసిం హుడు ” మిత్రమా మాకు అవసరమైన రాచకార్యం ఉంది మేము ఈ దినమే మీనగరాన్ని విడువవలసిఉంది. ఏంచేస్తాం ..” అన్నాడు
” ప్రభూ! ఇబ్బందేం లేదు. మీరు మాప్రభువుల మిత్రులు ,మా కూ ప్రభువులవంటి వారేకదా! ఆఋషీశ్వరులవద్ద ఇలాంటి మహిమ గల హిమన్నగ శిలలు ఉంటాయి.వారు రాగానే తమ రాజ్య ప్రజల కోసం ఒక హిమన్నగ శిలను తెచ్చి మీనగరం నడిబొడ్డున నాటి , తమ కు విన్నవించుకుంటాను ప్రభూ !, మాప్రభువులవారి అనుమతితో. తమ అనుమతితో, నాకు అనుమతిపత్రం ప్రసాదించండి ” అని మనవి చేశాడు పరమేశుడు.
” ఆ ఋషీశ్వరులురాగానే వారి నుంచీ ఒక హిమన్నగ శిలను సేక రించి అవస్యం వెళ్ళి మామిత్రుని నగరం నడిబొడ్డున ప్రతిష్టించి , వారికి మనవి చేసిరా .పదమిత్రమా ! భోజనసమయ మైది మనంవెళ్ళి భుజిద్దాం. ” అంటూ రాజ మందిరంలోకి దారితీశాడు ఆనందభూపతి.
ఒకరోజు ప్రాతః కాలంలోనే మహారాజు విక్రమసింహుని ఆంతరగిక సేవకుడు వచ్చి,
” ప్రభువులకు అభివాదం.! ఎవరో ఆనందభూపతి ఉద్యాన ప్రధాన తోట మాలిట ! మన నగరం నడి బొడ్డు న ఉన్న నాల్గువీధుల కూడలి లో ‘ హిమన్నగ శిల ‘ అంటూ ఒక రాతిని ప్రతిష్టించాడుట! అతన్ని మనసేవకులు అడ్డగించబోగా తమరి ‘ అనుమతి పత్రం ‘ చూపాడు ట. తమర్నికలవను సమయంలేదని ,విన్నవించుకుని , వెళ్ళాడుట! ” అనిచెప్పగానే , విక్రమసింహుడు త్వరగా తయారై వెళ్ళి , నాల్గు వీధు ల కూడలిలోని , ఆ హిమన్నగ శిలను , దర్శించుకునివచ్చాడు. అది తెల్లని కాంతు లీనుతూ పెద్ద బానంత గుమ్మడిపండులా గుం డ్రం గా , ఎంతో ముచ్చాటగా ఉంది. విక్రమసిం హుడు దాన్ని చేత్తో ముట్టుకుని , తట్టి చూసి , దాని అందానికి మురిసి కొంతసేపు నిల్చిచూసి , తిరిగి తన ఆంతరంగిక మందిరానికి వెళ్ళాడు. అదంతా గమనించిన ప్రజలు అది మహత్యం గల శిలై ఉంటుందని లేనిచో సాక్షాత్ ప్రభువులేదాన్ని వీక్షించి, తడిమి చూసి మౌనంగా కొంత సమయం నిల్చి వెళ్లరనీ భావించారు.
ఆ సాయంకాలం రాణి తన పరివారంతో వచ్చి ఆశిలను దర్శించి ముట్టి , తట్టి దాని గట్టిదనాన్ని చూసి , కాస్తసేపు దాని ఎదుటనిల్చి వెళ్ళ డం గమనించిన ప్రజలు ” ఇది తప్పక మహత్తు గల శిలయే ! లేనిచో మహారాజేగాక , అంతఃపురo వదలి మహారాణి సైతం వచ్చి దర్శించి వెళతారా!?” అని అనుకుని ప్రతిఒక్కరూ వచ్చి, దాన్ని తట్టి, తాకి ఎదుట కాస్తసేపునిల్చుని వెళ్ళసాగారు. అలా అలా ఆది మహిమ గల శిలని దేశ మంతా వ్యాపించింది.
జనం తండోపతండాలుగా కదలిరాసాగారు.కొందరు ఆశిలను ముట్ట గానే ” మా జ్వరం తగ్గిందంటే , మరొకరు ” నాతలనొప్పి ‘ తగ్గిందనీ, ” మరొకరు ‘పిల్లలు లేని మా కోడలికి బిడ్డడు పుట్టాడ’నీ , ‘ మాకు పంట బాగా పండిం’దనీ , మాకు ‘వ్యాపారం కలసివచ్చి లాభాలపంట పండిం’ దనీ ..ఇలా రకరకాలుగా చెప్పుకోసాగారు.
ఒక సాయంసమయాన మహారాజు , తన మిత్రుడైన ఆనందభూ పతి , తమ నగరానికి వస్తున్నట్లు వార్తరాగా , ఎదురువెళ్ళి ఆహ్వానిద్దా మని నాల్గు వీధుల కూడలిదాటి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళా లని బయల్దేరాడు.
ఐతే అక్కడరద్దీ దాటి వెళ్ళను రధానికి దారిలేదు. జనం వరుసలుగా నిల్చి ఉండటాన భటులు , ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దనే రాజాజ్ఞను ఉల్లంఘించ రాదని, సౌమ్యంగా ఎంత ప్రయత్నించినా దారి చేయలేకపోయారు. విక్రమసింహుడు రధందిగి చూడగా ప్రజ లంతా ఆ’ హిమన్నగశిల ‘ వద్ద బారులు తీరి దాన్ని ముట్టి, తట్టి నమ స్కరించను ,నిల్చి ఉండటం చూశాడు.ఇంతలో ఆనంద భూపతి, తనరధాన్ని దిగి నడచి రానే వచ్చాడు.
” మిత్రమా ఆనందా! మన్నించాలి , మిమ్ము ద్వారంవద్దే ఆహ్వా నించాలని బయల్దేరాను.కాని ఈజనసంద్రం మధ్య వారిని బాధించి దారిచేయను నేను అంగీకరించలేదు.ప్రజల మనస్సులు బాధించ డం మాకు సమ్మతంకాదు.” అంటూ ఆహ్వానించాడు విక్రమసింహుడు .
” బావుంది మిత్రమా! మనమధ్య మన్నింపులేంటి? ఇంతకూ ఈ జనమంతా ఎందుకోసం ఈ బారులు తీరినట్లు?”అని అడిగిన ఆనంద భూపతితో ” మిత్రమా! ఇదంతా నీచలవేసుమా!మాప్రజలు ఈ హిమన్న గశిల వచ్చాక చాలాసుఖశాంతులతో , సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నా రు.వారంతా ఆశిలను ముట్టి, తట్టి నమస్కరించుకుని వెళుతుంటారు. వారి సమస్యలన్నీ మటుమాయమైపోతున్నాయి ” అనిచెప్పాడు విక్రమసిం హుడు .
” మిత్రమా! విక్రమా ! నీవు మరోలాభావించకు ,మనం మంచి మిత్రులం . నన్ను మీరు మన్నించానటే ఒకవిషయం బయల్పరు స్తాను.” అన్నాడు ఆనందభూపతి.
” అలా అనకు ఆనందూ! మనమధ్య అంతరాలే ఉండవు, రావు కూడా…”
” ఏంలేదు గుర్తు తెచ్చుకోoడి ….మానగరానికి వచ్చినపుడు, మీ ప్రజలు ‘ వివేక వంతులనీ , విఙ్ఞులనీ, ఏపనైనా తర్కించిచేస్తారనీ అన్నారు మీరు !. అసలు ఇది ‘ హిమన్నగ శిలేకాదు. మా శిల్పులు పాలరాళ్ళతో చెక్కినది.చూడను కొద్దిగా శివలింగాకారంగా వున్నమాట వాస్తవం. మీరు దాన్ని చూసి తట్టగానే , ప్రజలంతా ఇది మహిమగల శిలగా భావించి నమస్కరించడం మొదలెట్టారు. ఐతే వారు సహృదయులు, కష్టించి పని చేసేవారూ గనుక వారి కోరికలన్నీ తీర సాగాయి. ప్రజలెప్పుడూ ప్రభువును అనుసరిస్తారేగాని , వారి విఙ్ఞతను కాదు. ఇది మనమధ్య , ప్రజల మనో నైజాన్ని తెల్సుకునేందుకు పరిశీలనేకానీ మరొకటిగా భావించ కండి. మన స్నేహానికి భంగం రానివ్వకండి ” అంటూ చేతులు కలిపిన ఆనందభూపతిని మనసారా హృదయానికి హత్తుకున్నాడు విక్రమసింహుడు
*****