అనుసృజన
నిర్మల
(భాగం-6)
అనుసృజన:ఆర్. శాంతసుందరి
హిందీ మూలం: ప్రేమ్ చంద్
ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిన మన్సారామ్ మర్నాడే వెనక్కి వచ్చాడు.అతనికి హాస్టల్ లో గది దొరకలేదు. తోతారామ్ చాలామందిని అడిగి చూశాడు.బైటి ఊళ్ళనుంచి వచ్చే పిల్లలకోసం గదులు ఖాళీగా ఉంచామనీ,ఊళ్ళోనే ఉన్న పిల్లలకి ఇవ్వలేమనీ స్కూలు యాజమాన్యం జవాబు చెప్పేసరికి తోతారామ్ ఏమీ చెయ్యలేకపోయాడు.రెండు వారాలు కాళ్లరిగేలా ఊళ్ళోని స్కూళ్ళన్నిట్కీ తిరిగినా లాభం లేకపోయింది.
ఆరోజునుంచీ మన్సారామ్ ఇంట్లోంచి బైటికెళ్ళటం ఆయన చూడలేదు.చివరికి ఆడుకునేందుకు వెళ్ళటం కూడా మానేశాడు. కొన్నాళ్ళకి ఆయన మన్సులో ఉన్న ఆందోళన తగ్గింది.తనని ఆవారాగాడని తిట్టినందుకు అతని మనసు చాలా క్షోభ పడింది.ఆ చెడ్డపేరు ఎలాగైనా పోగొట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించటం మొదలెట్టాడు.
ఒకరోజు తోతారామ్ భోజనానికి కూర్చుని ఉండగా మన్సారామ్ స్నానం చేసి వచ్చాడు.చొక్కాలేకుండా అతన్ని చూసి చాలా నెలలు గడవటంతో ఆయన దృష్టి అటు మళ్ళింది.మరుక్షణం ఆయన నివ్వెరపోయాడు.ఎముకలు బైటికి కనిపించేంతగా చిక్కిపోయాడు కొడుకు .కానీ మొహం మీద మెరుపు మాత్రం తగ్గలేదు.”ఒంట్లో బావుండటం లేదా? ఏమిటిలా ఎముకల గూడులా తయారయావు?”అన్నాడాయన.
మన్సారామ్ పైబట్ట కప్పుకుంటూ ,”ఆరోగ్యానికేం, బాగానే ఉంది,”అన్నాడు.
“మరైతే ఇంత చిక్కిపోయావేం?”
“నీరసం అదీ ఏం లేదు, అయినా లావుగా ఎప్పుడున్నాను కనక?”
“బావుంది, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇంత బక్కచిక్కి ఉంటారా ఎక్కడైనా? అక్కయ్యా, నువ్వే చెప్పు, వీడెప్పుడైనా ఇంత సన్నగా ఉన్నాడా?”
గుమ్మం దగ్గర తులసి మొక్కకి నీళ్ళు పోస్తున్న రుక్మిణి,” ఎందుకు చిక్కిపోడు.ఈ మధ్య పోషణ బాగా అందుతోందిగా? నేనొక పల్లెటూరి మొద్దుని,పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాలో నాకేం తెలుస్తుంది?అడ్దమైన గడ్డీ తినటానికిచ్చి పిల్లల్ని పాడు చేశాను.ప్రస్తుతం చదువుకున్న ఆడది ఇంట్లో ఉంది.సంసారం ఎలా నడపాలో బాగా తెలిసిన మనిషి,”అంది.
“చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు అక్కయ్యా. తనే చిన్న పిల్ల , ఇక పిల్లల్నేం సాకగలదు? నువ్వేమైనా పరాయి మనిషివా? ఇవన్నీఅనుభవం ఉన్న నువ్వే చూసుకోవాలి.”
“చేసినంత కాలం చేశాను.నువ్వే ఆమెని వెనకేసుకొచ్చి నన్ను పరాయి మనిషిలా చూస్తే నేనెందుకు జోక్యం కలిగించుకోటం? అసలు పాలు తాగి ఎన్నాళ్ళయిందో పిల్లల్నే అడిగి చూడు!వాళ్ళ గదిలోకెళ్ళి చూడు , తినమని ఇచ్చిన మిఠాయిలు అలాగే ఉన్నాయి.ఆవిడగారు తినుబమ్డారాలు వాళ్ళ గదిలో పెట్టి చేతులు దులిపేసుకుంటుంది.వాళ్ళు తిన్నారా లేదా అని చూడదు.ఒకప్పుడు తల్లిప్రేమ చవిచూసిన వాళ్ళు కదా, ఇలా అనాథల్లా ఉండాల్సి వస్తే బాధపడరూ? “
ఇంతలో రెండు రొట్టెలు తిని మన్సారామ్ లేచాడు.” అప్పుడే అయిపోయిందా? అసలేం తిన్నావురా?” అన్నాడు తోతారామ్.
” రొట్టెలతోబాటు పప్పూ, కూరా కూడా తిన్నా కదా?ఎక్కువ తింటే గొంతులో మంట వస్తోంది.పులితేన్పులు వస్తున్నాయి.”
భోజనం త్వరగా ముగించి లేచాడు తోతారామ్.కొడుకు ఆరోగ్యం గురించి ఆయనకి విచారం పట్టుకుంది.ఇలా చిక్కిపోతూ ఉంటే ఏదైనా వ్యాధి పట్టుకుంటుందేమో అని ఆలోచిస్తూ బాధ పడటం మొదలెట్టాడు.అక్కయ్య పట్టించుకోవటం లేదనీ, ఇంకా ఇంటినీ,పిల్లల్నీ ఎలా చూసుకోవాలో తెలీని నిర్మల ఇంటి యజమానురాలిలా పెత్తనం చెలాయిస్తోందనీ , వాల్ళిద్దరిమీదా ఆయనకి పట్టలేనంత కోపం వచ్చింది. చివరికి ఒకరిద్దరు స్నేహితులతో మాట్లాడి చూశాడు. విషయమంతా విన్నాక, “పిల్లలకి కాస్త స్వేచ్ఛ ఇవ్వండి, ఇరవైనాలుగ్గంటలూ ఇంట్లో కూర్చుని చదువుకుంటూ ఉంటే శరీరానికి వ్యాయామం ఎలా దొరుకుతుంది? యుక్తవయసులో స్నేహితులతో కలిసి ఆడుకోవాలి. అలా ఒంటరిగా గడపటం ఒంటికీ, మనసుకీ కూడా మంచిది కాదు,” అన్నారు వాళ్ళు. అప్పుడు గాని తోతారామ్ కి తను చేసిన తప్పేమిటో తెలిసిరాలేదు.
నిర్మల ఎంత బతిమాలినా తోతారామ్ తన కొడుకుని హాస్టల్ కి పంపే విషయంలో మొండిగా ఉండేసరికి నిర్మల మన్సారామ్ దగ్గర ఇంగ్లీషు నేర్చుకోవటం మానేసింది.అసలు అతనితో మాట్లాడటమే లేదు.భర్త మనసులో ఏదో అనుమానం ఉన్నట్టు లీలగా అర్థమైంది.ఇంత అసహ్యమ్గా ఎలా ఆలోచిస్తాడీయన, అనుకుంది.ఇంచుమించు తన వయసున్న మన్సారామ్ తో కబుర్లు చెపితే నిర్మలకి ఉత్సాహంగా ఉండేది.ఆమె మనసులో ఎలాంటి కల్మషమూ లేదు. అయినా భర్త అంత నీచంగా తనని అనుమానిస్తున్నాడని చాలా రోజులు ఏడ్చింది.అందుకే మన్సారామ్ తో మాట్లాడటం ,అతని గదికి వెళ్ళి చదువుకోటం మానేసింది.పరధ్యానం ఎక్కువైంది.ఎక్కడ కూర్చున్న మనిషి అక్కడే ఉండిపోయేది.భర్త నిర్ణయాన్ని కాదంటే ఆయన అనుమానం ఇంకా బలపడుతుంది.మన్సారామ్ ని వెళ్ళిపోనిస్తే సవతితల్లి వెళ్ళగొట్టిందన్న అపవాదు ఎదుర్కోవాలి.ఎటు చూసినా తనకి బాధ తప్పేట్టు లేదనిపించింది.
అది చాలనట్టు రుక్మిణి మేనల్లుడికి నిర్మల మీద లేనిపోనివి కల్పించి చెప్పింది.ఆమె వల్లే తండ్రి అతన్ని హాస్టల్ కి పంపిస్తున్నాడని నూరిపోసింది.అతను నమ్మాడు.చాలా బాధపడ్డాడు.తను ఆశించినదానికి వ్యతిరేకంగా ఆమె ప్రవర్తించటం చూసి భరించలేకపోయాడు.
అతనికి ఎలాగైతేనేం హాస్టల్లో సీట్ దొరికింది.
మన్సారామ్ హాస్టల్ కి వెళ్ళగానే ఇల్లంతా బోసిపోయినట్టనిపించింది నిర్మలకి.చిన్నవాళ్ళిద్దరూ అదే స్కూల్లో చదువుతున్నారు.నిర్మల ప్రతిరోజూ అతని గురించి వాళ్ళని అడిగేది. సెలవరోజెప్పుడైనా ఇంటికి వస్తాడని ఆశ ఉండేదామెకి.ఆదివారం కూడా అతను ఇంట్కి రాకపోయేసరికి ఆమె నిరాశగా నిట్టూర్చి , మర్నాడు పనిమనిషి చేతికిచ్చి లడ్డూలు పంపింది. ఆ మనిషి వాటిని వెనక్కి తెచ్చి, బాబు తీసుకోలేదని చెప్పింది.”నువ్వు ఎందుకని అడగలేదా?” అంది నిర్మల.
“అమ్మా, ఏమనుకోకండి, మిమ్మల్ని తినేందుకు ఏమీ పంపవద్దనీ,ఉత్తరాలూ అవీ కూడా రాయద్దనీ చెప్పమన్నాడు బాబు .”
నిర్మల గదిలోకెళ్ళి మంచమ్ మీద బోర్లా పడుకుని తనివితీరా ఏడ్చింది.’నా తప్పేమీ లేకపోయినా ఎందుకు నాకీ శిక్ష? నేను బతికుండి ఏం లాభం?నా కోరికలన్నీ ఏనాడో మట్టిలో కలిసిపోయాయి.మనసు దుఃఖంతో రగిలిపోతున్నా మొహం మీద నవ్వు చెరగకూడదు.ఆయన ముట్టుకుంటే తేళ్ళూ జెర్రులూ పాకినట్టుంటుంది.అలాటిది ఆయనతో సంసారం చెయ్యటం ఎంత కష్టమో, నా మనసూ ,శరీరమూ ఎంతగా నలిగిపోతున్నాయో ఎవరికి చెప్పుకోను? ఈ నేల చీలిపోయి నేనందులోకి వెళ్ళిపోతే, నా జీవితం ముగిసిపోతే ఎంత బావుణ్ణు !
***
[పెద్దతమ్ముడు జియారామ్ అన్నని కలిసి ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ చెపుతాడు.తండ్రి సవతితల్లి ని అనుమానించటం, మన్సారామ్ కీ ఆమెకీ మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని అనుకోవటం , అన్నీ చెపుతాడు.మన్సారామ్ మనసు విరిగిపోతుంది.’ఇంతవరకూ ఏ తండ్రీ తన కొడుకుమీద ఇంత భయంకరమైన అభామ్డం వేసి ఉంటాడా? అందరూ తన నడవడిని మెచ్చుకునేవాళ్ళే, కానీ కన్నతండ్రికే నా మీద ఇంత అనుమానమా!కలలో కూడా తనకి అలాంటి ఆలోచనలు ఎన్నడూ రాలేదు,’ అని బాధతో తల్లడిల్లిపోయాడు. అతనికి తన గుండె వెయ్యి చెక్కలైపోతుందా అనిపించింది. స్కూల్ బెల్ మోగినా అతనికి వినిపించలేదు.పెద్ద ఉప్పెన వచ్చి తనని లాక్కుపోతున్నట్టూ.తను మునిగిపోతున్నట్టూ అనిపించింది.అలా కూర్చుని తండ్రి గురించీ, తనని హాస్టల్ కి పంపే ముందు జరిగిన సంఘటనల గురించీ ఆలోచిస్తూ, తనని ప్రాణంగా ప్రేమించే ఆయన తనకి శత్రువుగా మారటానికి కారణాలేమిటని తీవ్రంగా మధనపడటం మొదలుపెట్టాడు మన్సారామ్]
‘ఛీ,ఏం బతుకు నాది! ఎందుకు బతకాలి? ఎవరికోసం బతకాలి?’ అని కాసేపు వేదన అనుభవించి తల్లిని గుర్తుచేసుకుని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కాసేపటికి దుఃఖావేశం తగ్గింది. మనసులో రకరకాల ఆలోచనలు సుళ్ళు తిరగసాగాయి.అసలు నాన్నకి నా మీద అనుమానం ఎందుకొచ్చింది? నాలో అలాంటి మార్పు ఏదైనా వచ్చిందా? నా మీద అంత వాత్సల్యం కురిపించే ఆయనకి అలాటి అనుమానం వచ్చిందమ్టే అందులో నా తప్పెంత ఉంది? ఆయన నా శత్రువేమీ కాదు కదా!
[మన్సారామ్ కి తండ్రి తనని హాస్టల్ లో ఉండమని అన్న ఆ రోజు సంఘటనలన్నీ గుర్తొచ్చాయి.ఆ రోజు నుంచీ నిర్మల తనతో ఎడమొహం పెడమొహం గా ఉండటాన్ని అప్పుడు అర్థం చేసుకోలేదు కాని ఇప్పుడు అంతా స్పష్టంగా తెలుస్తోంది. పాపం, నాకే ఇంత బాధగా ఉంటే ఆవిడ ఇంకెంత క్షోభ అనుభవిస్తోందో!ఎంత అన్యాయంగా ఆవిణ్ణి సవతితల్లి అని అసహ్యించుకున్నాను! ఇప్పుడు ఆవిడ ఏదైనా అఘాయిత్యం చేస్తే … నేను అలాంటిదేదైనా జరిగితే చూస్తూ ఎలా ఊరుకోను? దీనికి ఒకటే పరిష్కారం…నేను బతికుండకూడదు…నా రక్తంతో ఆమెకి అంటిన కళంకాన్ని కడిగేస్తాను!]
మర్నాడు మన్సారామ్ హాస్టల్లో ఉన్న చిన్న డిస్పెన్సరీకి వెళ్ళాడు.డాక్టర్ అతన్ని చూడగానే,” ఇదేమిటి ఇలా చిక్కిపోయావు? గుర్తుపట్టలేనంతగా మారిపోయావు.ఒంట్లో బాగాలేదా?” అంటూ అతన్ని పరీక్ష చేసి,” మందులిస్తాను వేసుకో,” అంటూ అల్మారా తెరిచాడు.
“డాక్టర్ నా జీవితమే నా రోగం! నాకు నిద్ర అసలు పట్టటమే లేదు. దానికి ఏదైనా మందివ్వండి,”అన్నాడు మన్సారామ్.
“నీ ఆరోగ్యం అస్సలు బాగాలేదు…”
“అవునా డాక్టర్? అయితే నేనెక్కువ రోజులు బతకనా?”అన్నాడు మన్సారామ్ ఉత్సాహంగా.
“ఏం మాటలవి? మీ నాన్నగారిని కలిసి మాట్లాడతాను.సరైన వైద్యం చేస్తే బాగయిపోతావు.
“అనవసరంగా నాన్నతో ఏమీ చెప్పద్దు.ప్రస్తుతం నిద్రలేక తల పగిలిపోతోంది,దానికేదైనా మందివ్వండి.”
డాక్టర్ ఒక అల్మార తెరిచి సీసాలోంచి మాత్రలు తీసి ఇచ్చాడు.దానిమీద లేబిల్ చూసి, ఇవి ఎన్ని వేసుకుంటే ప్రాణం పోతుంది డాక్టర్?”అని అడిగాడు.
“చచ్చిపోరు కానీ తల తిరుగుతుంది, వాంతులవుతాయి.”
“ఈ అల్మారలో ప్రాణం పోయేందుకు పనికివచ్చే మందులు కూడా ఉన్నాయా?”
“చాలా ఉన్నాయి.ఇదుగో ఈ సీసాలో మందు తాగితే ఒక్క నిమిషంలో ప్రాణం పోతుంది,” అన్నాడు డాక్టర్ ,మన్సారామ్ ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నాడో అర్థం చేసుకోకుండా.
‘ఈ మందు పేరేమిటో తెలిస్తే ఏ మందుల దుకాణంలోనైనా కొనుక్కుని తాగెయ్యచ్చు,’అనుకున్నాడు మన్సారామ్.అప్పటికి అతని మనసులో ఒత్తిడి తగ్గింది.
కుర్రాళ్ళు కొంతమంది ఊళ్ళో సినిమా చూసేందుకు బైలుదేరుతూంటే తను కూడా వెళ్ళేందుకు సిద్ధమయాడు.ఎప్పుడూ లేనంత ఆనందం, ఉత్సాహం తో గంతులేస్తూ, కేకలు పెడుతూ సినిమా చూస్తున్న మిగతావారికి చిరాకు కలిగించాడు.ఎప్పుడూ సీరియస్ గా, మౌనంగా ఉండే ‘బుద్ధిమంతుడు‘ ఇలా అల్లరి చెయ్యటం చూసి అతని స్నేహితులకి ఆశ్చర్యం వేసింది.సినిమా చూసి అర్ధరాత్రి రెండు గంటలకి హాస్టల్ చేరుకున్నారు వాళ్ళు. హాస్టల్ కి వచ్చాక కూడా మన్సారామ్ అల్లరి ఎంతమాత్రం తగ్గలేదు.ఒక కుర్రాడి మంచం తలకిందులు చేసేసరికి ఆ గలభాకి మేలుకున్న హాస్టల్ వార్డెన్ వచ్చి తిట్లు లంకించుకున్నాడు.మన్సారామ్ కి ఆ తిట్లేవీ అవమానకరంగా అనిపించలేదు.జీవితంలో అతి పెద్ద అవమానం అతనికి ఇంట్లోనే,కన్న తండ్రి చేతిలోనే జరిగింది !
*****
(ఇంకాఉంది)
ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.