అమ్మమాట

-అనసూయ కన్నెగంటి

 

అడవిని ఆనుకుని ఉన్న తన పొలం లోనికి ఆవును దూడను మేత కోసం తోలుకు వచ్చాడు రైతు. ఆ దూడ పుట్టి ఎక్కువ కాలం కాలేదు. అది తల్లి కూడా పొలం రావటం అదే మొదటి సారి. 

     అలా తన కూడా వచ్చిన దూడకు దూరంగా ఉన్న అడవిని చూపిస్తూ..

“ అది అడవి. అక్కడ క్రూర జంతువులు ఉంటాయి. మనలాంటి వాళ్లం కనిపిస్తే తినేస్తాయి. నువ్వు పొరపాటున కూడా నన్ను, రైతును విడచి అటు వైపు ఎప్పుడూ వెళ్ళకు“ అని చెప్పింది తల్లి ఆవు.

  “క్రూర జంతువులంటే  ఎవరమ్మా? వాళ్లు ఎలా ఉంటారు? “ అని అమాయకంగా అడిగింది దూడ.

    “ పులి, సింహము, నక్క..లాంటి కొన్ని జంతువులు ఉంటాయి.  వాటికీ మనలాగే నాలుగు కాళ్ళు  తోక ఉంటాయి..” అని చెప్పింది. 

   “ మరి మనలాగ..తోక, నాలుగు కాళ్ళూ ఉంటే మనలాగా గడ్డి తినచ్చు కదా! మనలాంటోళ్లను ఎందుకు తింటాయి? “ అంది అమాయకంగా దూడ. 

  “ మనలా వాటికి గడ్డి తినటం నచ్చదు. వాళ్ల కంటే బలం తక్కువ ఉన్న ప్రాణుల్ని అవి తినేస్తాయి.కాబట్టి ఎప్పుడూ అటు వెళ్ళకు ”అంది తల్లి. 

    అప్పటికి తల్లితో..” అలాగే “ అంది కానీ  “ ఎలాగైనా అడవికి వెళ్ళి ఒకసారి వాటిని చూసేసి వెంటనే వచ్చెయ్యాలి “  అనుకుంది దూడ మనసులో. 

     దాంతో ఒకనాడు కావాలనే అడవిలోకి పారిపోయింది దూడ. ఆవు చాల బాధపడింది తన బిడ్దను క్రూరజంతువులు చంపేస్తాయేమోనని. ఆనాటి నుండి ఆహారం కూడా తినటం మానేసి తన బిడ్ద వస్తుందేమోనని అడవి వైపే చూడసాగింది. 

    రైతు కూడా దూడ అడవిలోకి పోయినందుకు చాల బాధపడ్డాడు. ఇప్పటికే అది చనిపోయి ఉండి ఉంటుందని అనుకున్నాడు. 

     అయితే అడవిలోకి వెళ్ళిన దూడ  తమలాగా నాలుగు కాళ్ళుండి, తోక ఉన్న జంతువులను వెతుకుతూ అడవంతా తిరగసాగింది. కొంత దూరం వెళ్ళేసరికి దానికి ఒక కుందేలు ఎదురు పడింది. దానిని చూసి భయపడిపోయి అటూ ఇటూ గంతులు వేయసాగింది దూడ. 

    తనని చూసి భయపడుతున్న దూడను చూసి కుందేలుకి ఆశ్చర్యం వేసింది. అంతేకాదు..

“  నేనే ఇతరులను చూసి భయపడతాను. నన్ను చూసి నాకంటే ఎంతో పెద్దగా ఉన్న ఈ దూడ భయపడుతుందేమిటి?” అని మనసులో తెగ సంతోష పడిపోయింది..సరిగ్గా అదే సమయంలో..దూడ గంతులు ఆపి భయపడుతూనే కుందేలు దగ్గరకంటా వచ్చి..

   “నీకు కూడా నాకులాగే నాలుగు కాళ్ళూ, తోక ఉన్నాయి కదా . అలా ఉంటే అవి తప్పక పులో, సింహమో, నక్కో అయి ఉంటాయట. అవి క్రూర జంతువులట. మమ్మల్ని తినేస్తాయట. మా అమ్మ చెప్పింది. అందుకే నిన్ను చూస్తుంటే నాకు భయం వేసింది. వాటిని చూడాలని వచ్చాను. నువ్వు పులివా? సింహానివా? నక్కవా?”  అనడిగింది .

     ఆ మాటలకి పడీ పడీ దొర్లి దొర్లి నవ్వింది కుందేలు.  దూడకి అర్ధం కాలేదు అది ఎందుకు నవ్వుతుందో. 

   కాసేపు ఆలోచించి..అలా నవ్వుతూనే..

    “నేను పులిని. నీకు సింహాన్ని చూపిస్తా రా..” అని గుంభనంగా తనలో తనే నవ్వుకుంటూ..ముంగిస దగ్గరకి తీసుకు వచ్చి “ ఇదిగో ఇదే ..సింహం “ అని దూడకు చూపించింది. 

        అయోమయంగా చూస్తున్న ముంగిసకు అర్ధమయ్యేట్టు చెప్పింది కుందేలు. అది విని  పక పకా నవ్వింది ముంగిస. కాసేపయ్యాకా ..

   “ మా అమ్మ పులి, సింహం చాల క్రూర జంతువులని, చూడగానే తినేస్తాయని చెప్పింది. కానీ వచ్చినప్పటి నుండీ మీ ఇద్ధర్నీ చూస్తున్నాను. ఎంత మంచి వారో..ఇక నక్కను చూడాలి. అది ఎలా ఉంటుందో?” అంది దూడ.

    “ అబ్బే. నువ్వేం భయపడకు. అది కూడా చాల మంచిది. మేము చూపిస్తాంగా నీకు..” అంటూ ఒకరికొకరు సైగలు చేసుకున్నారు వాళ్ళల్లో వాళ్లే నవ్వుకుంటూ..

     ఇంతలో ..వాటికి దూరంగా ఏదో తింటున్న  జింక కనిపించింది వీళ్ళిద్దరికీ.

దానిని దూడకు చూపిస్తూ “ అదిగో..ఆ దూరంగా గడ్డి తింటుందే..అదే నక్క..”  అన్నాయి పడీ పడీ నవ్వుతూ.. 

    ఈ లోపు ఎంతకీ దూడ కనపడక పోయే సరికి రైతు బాధ పడ్డాడు. 

    ఏ జంతువులో అడవిలోకి లాక్కుపోయి తినేసి  ఉంటాయి అనుకున్నాడు. తల్లి ఆవు ఏడుస్తూనే అడవి వైపు ఆశగా చూడసాగింది కూతురు ఎప్పుడు వస్తుందా అని. అలా చూసీ చూసీ ఎంతకీ రాని కూతుర్ని తలచుకుని..

    “ ఇక ఈ బాధను తట్టుకోలేను. పిల్ల అమాయకురాలు. లోకం తెలియని పసికూన. నా అదృష్టం కొద్దీ బ్రతికి ఉంటే తెచ్చుకుంటాను. లేదంటే నేనూ అదే క్రూర మృగాలకు ఆహారం అవుతాను “ అని మనసులో అనుకుంటూ….రైతు ఏదో పనిలో ఉండగా చూసి గబుక్కున అడవిలోకి పరిగెత్తింది. 

     అది గమనించిన రైతు కాసేపు ఆవును వెంబడించి క్రూరమృగాలకు భయపడి ఆగిపోయాడు.

    అదురుతున్న గుండెల్తో అడవి లోపలికంటా వెళ్ళిపోయింది ఆవు. అలా నడుస్తూ నడుస్తూ ఉండగా ఎక్కడి నుండో..పకపకా నవ్వులు వినిపించాయి దానికి. 

    అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా తన బిడ్డ ఆచూకీ చెబుతారేమోనని అటుగా అడుగులు వేసింది తల్లి ఆవు. 

    ఆత్రుతగా వెళ్ళిన ఆవుకి కింద గడ్డిలో పడి దొర్లుతూ నవ్వుతున్న కుందేలు, ముంగిస, జింకా కనిపించాయి.

   ఆ పక్కనే వాళ్లని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి ఉంది దూడ. 

        దాన్ని చూసి తల్లి ఆవుకి ఆనందం వేసింది, 

        తల్లి ఆవును చూసి లేగదూడ సంతోషంతో గంతులే  వేసేసింది. అది గమనించిన కుందేలు, ముంగిస, జింక తల్లి ఆవు దగ్గరకి వచ్చాయి. 

   “ అమ్మా..మరేమో..నీకో విషయం చెప్పాలి..” అంటూ  దూడ గంతులాపి తల్లి దగ్గరకంటా వచ్చి..వీళ్ళు ముగ్గుర్నీ చూపిస్తూ..

“ అమ్మా..! చూసావా? పులి, సింహం, నక్క. వీళ్లంతా నా స్నేహితులు. వీళ్లనేనా క్రూర మృగాలనీ, కనిపిస్తే తినేస్తాయని చెప్పావు? నువ్వు చెప్పింది తప్పమ్మా. వీళ్ళెంత మంచివాళ్ళో. “ అంది వాళ్ల దగ్గరకంటా వెళ్ళి “ నా వాళ్ళు “ అన్నట్టుగా వాటిని రాసుకుంటూ నిలబడి. 

       కూతురి మాటలకి  అయోమయంగా చూసింది తల్లి ఆవు వాటి వైపు. 

    దాంతో.. కుందేలు ముందుకు వచ్చి భయం భయంగా చుట్టూ చూస్తూ మెల్లగా ఆవుతో..ఇలా అంది..

   “ అవును. మీ అమ్మాయి అడవిలోకి వచ్చినప్పుడు ముందుగా నేనే చూశాను. దాన్ని చూడగానే చాల భయం, బాధ కలిగింది. చిన్న పిల్ల. క్రూర జంతువుల దృష్టిలో పడితే చంపి తినేస్తాయి. ఎలాగైనా కాపాడాలి అనుకున్నాను. ఇంతలో నన్ను చూసి..మీ అమ్మాయి “ మీరెవరు ? పులా, సింహమా, నక్కా?” అనడిగి  క్రూర జంతువులను గురించి మీరు చెప్పిన విషయాలు చెప్పింది. దాంతో నాకు మొత్తం విషయం అర్ధం అయిపోయింది. లోకం తెలియని పసిబిడ్డ అనిపించి నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు..కానీ దూడను మాత్రం కాపాడాలి అని గట్టిగా అనుకున్నాను. ” అంటున్నంతలో ముంగిస  కుందేలు మాటలకు అడ్డొచ్చి..

   “ అవును ..నాకు కుందేలు ఈ విషయం చెప్పినప్పుడు నేనూ ఇలాగే అనుకున్నాను. పుట్టుకతోనే పిల్లలకు ఏమీ తెలియవు. మనం చెప్పిన దానిని బట్టి వాటికి తెలుస్తుంది. కొంతమంది పిల్లలు ఆసక్తి కొద్దీ  వాటిని స్వయంగా చూసి, అనుభవించి తెలుసుకోవాలని అనుకుంటారు. అదెంత ప్రమాదమో వాళ్లకి తెలియదు.  మీ అమ్మాయికి  పూర్తిగా తెలిసి ఉంటే ఇలా వచ్చేది కాదు..” అంది. 

    అప్పుడు మళ్ళీ  కుందేలు కలగచేసుకుని..

    “ ..ఎలాగైనా  ఆ మూడింటినీ  చూడాలనే  పట్టుదలతో ఈ దూడ మరింత లోపలికి వెళితే మీరన్నట్టు వాటికి ఆహారం అయిపోతుందని భయం వేసింది. అందుకే అది మరింత లోనికి వెళ్లకుండా మేమే ఆ జంతువులమని అబద్ధం చెప్పాము. అలా చెప్పి మాటల్లో పెట్టి దాన్ని మెల్లగా పొలం వరకూ తీసుకు వచ్చి మీకు అప్పగించాలని  మా ఆలోచన. మేము  అలా అబద్ధం చెప్పటం వల్ల అది లోపలికి వెళ్ళకుండా ఆగింది. లేదంటే ఈ సరికి ఎప్పుడో వాటికి ఆహారం అయిపోయేది.” అంది.

      “ అవును కుందేలూ, ముంగిస చెప్పింది నిజం. ముగ్గురం కలసి దానిని తీసుకుని కాసేపట్లో మీ దగ్గరకు బయలుదేరే వాళ్లమే. ఈలోపే మీరు వచ్చారు..” అంది ఆనందంగా జింక.

       అదంతా విన్న దూడ కోపంతో వణికి పోతూ వాళ్లందర్నీ మార్చి మార్చి చూస్తూ..

    “ అయితే ..మీరు పులీ, సింహం, నక్కా..కాదా? నాతో ఎందుకు అబద్దాలు చెప్పారు? నేను వాటిని చూడాల్సిందే “ అంటూ అడవిలోకి పరుగు తీయబోతే జింక తన కొమ్ములతో దూడ కాళ్లకు అడ్దం పడి..

   “  అవి నీకు ఎదురుపడ్డాయంటే…నీ మీదకు దూకి పీకపట్టుకుంటాయి. నువ్వు వాటిని  చూసి మాతో మాట్లాడినట్టు  తీరికగా వాటితో మాట్లాడే సమయం కూడా ఉండదు నీకు. చూడగానే దుమికి మీదపడి పీక పట్టుకుంటాయి. అర్ధం అయ్యిందా? తిక్క తిక్కగా మాట్లాడకు. నీకోసం, నిన్ను కాపాడుకోవటానికి  మీ అమ్మ ప్రాణాలకు తెగించి అడవికి వచ్చింది.

మిమ్మల్ని ఇద్దర్నీ పెంచుతున్న రైతు బహుశా బెంగ పెట్టుకుని ఉంటాడు. ఇక ఆలస్యం చేయకుండా

బయలుదేరండి. మేము సహాయం చేస్తాము..” అనేసరికి దూడ సరేనంది. 

    దాంతో తల్లి ఆవు నేల మీద కూర్చుని తలను వంచి ముగ్గురికీ నమస్కారం చేసింది కన్నీళ్లతో. 

 తర్వాత బిడ్డ వైపు తిరిగి..

     “పెద్దవాళ్లు పిల్లలకు అనుభవంతో ఎన్నో విషయాలు చెబుతారు. అందులో కొన్ని మాత్రమే స్వయంగా చూసి తెలుసుకోవాలు అనుకునేవి ఉంటాయి. మిగతావి అనుభవం మీద మీకే తెలుస్తాయి. పూర్తిగా నడవటం కూడా రాని నువ్వు ఇలా పూర్తిగా నేను చెప్పేది వినకుండా ఇలా అడవిలోకి రావటం పెద్ద తప్పు. నీ అదృష్టం బాగుండి కుందేలు, తన ఆలోచనని అర్ధం చేసుకుని సహకరించిన ముంగిసా, జింకా దొరకబట్టి బ్రతికిపోయావు. లేదంటే ఈ సరికే జీర్ణం అయిపోయి ఉండే దానివి. చూశావా ..ఎంత ప్రమాదం తప్పిందో. చేసింది చాలు. ఇక పద ఇంటికి. ఎప్పుడూ ఇలా నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లకు..” అని దూడకు నాలుగు చివాట్లు పెట్టి కుందేలుకీ, ముంగిసకూ , జింకకూ పదే పదేసార్లు కృతజ్ఞతలు తెలుపుకుని ..వాళ్ళు ముగ్గురి సహాయంతో  దూడను తీసుకుని క్షేమంగా పొలం చేరింది.

    ఆనాటి నుండీ..తరచుగా అవన్నీ కలుస్తూ..మంచి స్నేహితులై ఆనందంగా గడిపేవి.

           *****

Please follow and like us:

One thought on “అమ్మమాట (బాల నెచ్చెలి-తాయిలం)”

  1. చాలా కొత్తగా, చక్కగా ఉంది అనసూయ గారూ.

Leave a Reply

Your email address will not be published.