ఈ పిలుపు నీకోసమే!

                                                                – వసుంధర

నేను, నా ఫ్రెండు సుస్మిత కె ఎల్ ఎం షాపింగ్ మాల్ లో దూరాం. నేను జీన్సు పాంటుమీదకి టాప్సు చూస్తుంటే, సుస్మిత డ్రెస్ మెటీరియల్ చూడ్డానికి మరో పక్కకు వెళ్లింది. 

ఎవరో నా భుజం తట్టినట్లయి ఉలిక్కిపడి వెనక్కి చూస్తే సుమారు పాతికేళ్ల యువకుడు. సన్నగా, పొడుగ్గా, హుందాగా ఉన్నాడు. అపరిచితురాలైన ఓ కన్నెపిల్లని అలా భుజం తట్టడం అమర్యాద అని తెలియనట్లు మామూలుగా నవ్వుతున్నాడు.

నేను కాస్త కోపంగానే చూశాను. అతడు మాత్రం నా చూపుల్ని పట్టించుకోకుండా, “పాపా! అలా వెళ్లిందే, నీ అక్కయ్య. తనకీ ఉత్తరం ఇవ్వాలి. ఉత్తినే కాదులే, ఇదిగో చాక్లెట్” అన్నాడు.

ఓ చేతిలో నీలి రంగు కవరు. ఇంకో చేతిలో చాక్లెట్టు ఉన్నాయి. 

పాపా అన్న పలకరింపు నా ఇరవైరెండేళ్ల వయసుకి గిలిగింతలు పెట్టింది. అప్రయత్నంగా ఆ చాక్లెట్టూ, ఉత్తరం కూడా తీసుకున్నాను.  క్షణాలమీద ఆ యువకుడు మాయమయ్యాడు.

నేనిక టాప్సు కోసం చూడకుండా, ఉత్సాహంగా అక్కణ్ణించి కదిలి తొందరగానే సుస్మితని పట్టుకున్నాను. దాని భుజం తట్టి, “పెద్దక్కా!” అన్నాను.

ఆ పిలుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన సుస్మిత నన్ను చూసి, “నీకంటే పదహార్రోజులు చిన్నదాన్ని. నేను నీకు అక్కనే కాను. పెద్దక్కనెప్పుడయ్యానే!” అని గద్దించింది. 

ఆడపిల్లలం – మా ఫ్రెండ్సందరికీ అందరివీ పుట్టిన తేదీలు తిథులతో సహా జాతకాలకి పనికొచ్చేటంత వివరంగా తెలుసు. ఒకరినొకరు పేర్లతోనే తప్ప వరసలతో పిల్చుకోకూడదని పైకి చెప్పని నియమముంది. పొరపాటున అది తప్పామో, జాతకాలు బయటపడతాయి.  

“ఇదిగో, ఈ ఉత్తరం రాసినబ్బాయి, నీ చిట్టి చెల్లెల్ననుకుని నన్ను పాపా అని పిలిచి చాక్లెట్టు కూడా ఇచ్చాడు. దాంతో నిన్ను పెద్దక్కా అని పిలవాలని సరదా పుట్టింది” అన్నాను.  

“నాకంటే మూడేళ్లు చిన్నది నా రెండో చెల్లి. ఎప్పుడైనా పెద్దక్కా అని అదంటేనే తట్టుకోలేను. నువ్వంటే ఊరుకుంటానా, వాడెవడో నాకీ ఉత్తరాన్ని స్వయంగా ఇవ్వడానికి భయపడి, నిన్ను పాపా అని బెలిపించి నీచేత నాకీ ఉత్తరం ఇప్పించాడు. లేకపోతే పెళ్లయినదానివి, నిన్ను పాపా అని ఎవరంటారే! అది తెలుసుకోక నువ్విప్పుడు నాక్కలిగించిన మనస్తాపానికి ఇదే నా శాపం. తొందర్లోనే ఇంతకింతా అనుభవిస్తావు” అంది సుస్మిత.

నిండు మనసుతో ఇచ్చిన దీవెనలకు లాగే, న్యాయమైన కోపంతో ఇచ్చిన శాపాలు కూడా ఫలించి తీరతాయంటారు. 

సుస్మిత శాపం ప్రభావంతోనే కాబోలు మా ఇంట్లో ప్రవేశించింది  విశాల…..

బీటెక్ ఫైనలియర్లో ఉండగానే నాకు శ్రీనివాసుతో పెళ్లయింది. 

అతడు నాకంటే ఐదేళ్లు పెద్ద. నెలకి రెండు లక్షల జీతంతో ఉద్యోగం. ఓ పెళ్లిలో నన్ను చూసి ఇష్టపడ్డాడు. 

అన్నీ ఇంట్లోవాళ్లకి నచ్చాయి. అతడు నాకు నచ్చాడు. చదువవగానే అతడి కంపెనీ ఇచ్చిన నాలుగు గదుల అపార్టుమెంట్లో కాపురం పెట్టాం.    

శ్రీను భావుకుడు. జీవితాన్ని ఆఫీసుకే అంకితం చెయ్యడానికి ఇష్టపడడు. ఉదయం ఎనిమిదికి వెడితే సాయంత్రం ఆరింటికి ఇంట్లో ఉంటాడు. వారానికి ఐదు రోజులే పని చేస్తాడు. భార్యకి అన్ని సదుపాయాలూ అందిస్తాడు కానీ, ఆమె కూడా తనకిలాగే బయట ఉద్యోగం చేసి తనలాగే అలసిపోయి ఇంటికి రావడాన్ని ఇష్టపడడు.  

నాకు జీవితం బాగుంది కానీ చదువు వృథా కావడం నచ్చలేదు. శ్రీను నా అభిప్రాయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని, తన కంపెనీనుంచే వర్క్ ఫ్రం హోమ్ సదుపాయమున్న ఉద్యోగమొకటి చూశాడు. ఒకటినుంచి పది దాకా రోజుకి ఎన్ని గంటలైనా పని చెయ్యొచ్చు. ఇంట్లోనే కూర్చుని నెలకో అరవై డెబ్బైవేలకు తక్కువ కాకుండా సంపాదించొచ్చు. అంతా నా ఓపిక. 

ఆ ఉద్యోగానికి ఆరు వారాల ట్రైనింగుంది. అది కూడా ఆన్ లైనే. ఐతే మధ్యమధ్య టెస్టులుంటాయి. కృషికి శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. ఆ  సమయంలో తనుంటే నాకు డిస్టర్బెన్సని చిన్న ఫారిన్ టూరొకటి ఏర్పాటు చేసుకున్నాడు శ్రీను.

అన్నింటికీ కాస్త దూరం ఆలోచించే శ్రీను నా గురించి చాలా ఆలోచించాడు. ఇంటి పని చూసుకుంటూ ఉద్యోగం చేస్తే అలసిపోతాను కాబట్టి అన్ని పనులకీ మనుషుల్ని పెట్టుకుందామన్నాడు. అప్పటికే ఇంటి శుభ్రానికీ, బట్టలుతకడానికీ మనుషులున్నారు. ఇక కొత్తగా వంటమనిషిని కుదుర్చుకోవాలి. 

మా అవసరం తెలిసిన అమ్మ, “ఆ పదివేలూ ఎవరికో ఎందుకే! నేనే వచ్చి నీతో ఉంటాను” అంది.

“నువ్వొస్తే పది వేలే ఏం? ఇంటి పన్లకీ, బట్టలకీ మేమిక్కడ దగ్గర దగ్గర పదిహేను వేలిస్తున్నాం. అంతా కలిపి చేసే పనులు నువ్వు చేసే వాటిలో సగమైనా ఉండవు….” అని నేనేదో చెప్పబోతుండగా – 

“అంటే మొత్తం పాతికవేలన్న మాట! ఇక్కడ మీ నాన్నకి నా విలువ బొత్తిగా తెలియడం లేదు. ఆయన్నొదిలేసి నీ దగ్గరికొచ్చేసి నీ దగ్గరే ఉంటాను. నెలకో పట్టుచీర, ఆర్నెల్లకో నగ కొనుక్కుంటా” అంది అమ్మ.

ఇన్నేళ్ల కాపురంలో తనెంత నష్టపోయిందో అమ్మకి అర్థమౌతున్నట్లుంది. తనని విడియోలో ఊహించుకుంటే – గుండెలు బాదేసుకుంటోంది. 

వద్దంటే అమ్మ ఫీలౌతుంది. రమ్మంటే అమ్మ, నాన్న విడిపోకపోయినా కొంతకాలం నాన్న బాగా ఇబ్బంది పడతాడు. ఏంచెయ్యాలో తెలియక శ్రీనుని అడిగితే, “నీకింకా ఈ పెద్దోళ్ల తీరు అర్థమైనట్లు లేదు. అత్తయ్యని రమ్మని చెప్పేసేయ్. ఎవరూ నొచ్చుకోకుండా పరిష్కారం దొరికేస్తుంది” అని నమ్మకంగా చెప్పాడు.

కొత్తగా పెళ్లయింది కదా, అతడంటే నాకింకా కొంత ఆరాధనాభావం మిగిలుంది. అలాగే చేశాను.

అమ్మ వెంటనే నాన్న ఎంత అమాయకుడో, తను లేందే ఆయనకు క్షణమైనా ఎందుకు గడవదో వగైరా వగైరాలు ఎన్నో సంజాయిషీగా ఏకరువు పెట్టి, “అలాగని నీ అవసరం నాకు అర్థం కాలేదనుకోకు. తగిన ఏర్పాటు చేశాన్లే” అంది. 

అలా – శ్రీను టూరెళ్లిన సాయంత్రమే మా ఇంటికొచ్చింది విశాల. 

ముఖం చూస్తే నాకంటే ఐదారేళ్లు పెద్దదిలా ఉంది. కొంచెం లావు. మనిషి చలాకీగానే ఉంది. 

ఇల్లు చూస్తూనే, “ఒక్క మనిషికి ఎంత పెద్దిల్లో” అంది.

‘ఒక్కరు కాదు, ఇద్దరం’ అనబోయి – ఇద్దరికైనా ఆమె దృష్టిలో ఇది పెద్దిల్లే కదా అని స్ఫురించి ఊరుకున్నాను.

తర్వాత నన్ను చూస్తూ, “ఒక్కత్తివీ ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగమటగా! ఐనా ఎంత నాజూగ్గా ఉన్నావో అక్కా!” అంది విశాల.

నా ఉద్యోగం గురించి తనకలా అర్థమయిందని గ్రహించినా, దానికి ఎక్కువ రియాక్టవలేదు. ఎందుకంటే, ‘అక్కా!’ అన్న పిలుపు ఆమె నోట వినగానే నాకు గుండె బద్దలైనట్లుంది.

“అక్కా ఏంటి? అదేం వరస!” అన్నాను కొంచెం కోపంగా.

“వంటకొచ్చినంత మాత్రాన నీతో వరస కలపడం తప్పా, అక్కా! ఎవరితోనైనా వరస కలిపితేనే మనవాళ్లు అనిపిస్తుంది మరి!” అంది విశాల.

తనలా అనేసరికి కాస్త నొచ్చుకుని, “అయ్యో! నా ఉద్దేశ్యం వరస కలపడం తప్పని కాదు. నీకంటే చిన్నదాన్ని. చెల్లీ అనాలి కానీ, అక్కా అనకూడదు” అని కాస్త సూటిగానే చెప్పాను. 

“చూడక్కా! నీకంటే కాస్త లావుగా ఉన్నానని నీకంటే పెద్దదాన్నయిపోతానా?” అంది విశాల. 

“నీ డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ తీసుకురా, నా డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ చూపిస్తాను. రెండూ పోలిస్తే ఎవరు పెద్దో తేలిపోతుంది” అన్నాను పట్టుదలగా.

“ఇంతోటిదానికీ డేటాఫ్ బర్త్  సర్టిఫికెట్టెందుకూ? నువ్వేం చదివావో చెప్పు, చాలు” అంది విశాల.

“బీ టెక్” అన్నాను గొప్పగా.

“మరి నేను ఇంటరు. బీటెక్ చదినవాళ్లు ఇంటర్ చదివినవాళ్లకంటే చాలా పెద్దే కదా అక్కా!” అంది విశాల.

“ఇలాంటి లాజిక్ నేనెప్పుడూ వినలేదు. అలాగైతే మా అమ్మ టెన్తే చదివింది. నేను తనకంటే కూడా పెద్దదాన్నా?” అన్నాను.

“మీ అమ్మని నువ్వు అమ్మా అని పిలిచినప్పుడు, తను నీకంటే ఎక్కువే చదువుకుంది. అందుకని తనే పెద్దది. చిన్నవాళ్లు ఇంకా ఇంకా పెద్దవుతారేమో కానీ, ఒకసారి పెద్దయినవాళ్లు మరి చిన్నవాళ్లు కారు. అమ్మ ఎప్పుడూ అమ్మే!” అంది విశాల.

అది తెలివో, అతితెలివో, వితండవాదమో, చమత్కారమో, శాడిజమో నాకు అర్థం కాలేదు. కానీ ఆ పూట మచ్చుకి తన వంట రుచి చూసేక, పనిలో చేర్చుకోకుండా ఉండలేకపోయాను. 

రోజూ ఉదయం ఆరింటికొచ్చి కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేసి ఏడింటికి వెడుతుంది. మళ్లీ పదకొండుకి వచ్చి రెండు పూటలకీ సరిపడ వంటలు చేసి ఒంటిగంటకి వెడుతుంది. అవసరమైతే సాయంత్రాలు కూడా రావాలని ఒప్పందం.

నాలుగు రోజులు గడిచాయి. తన వంట అద్భుతం. కానీ అక్కా అన్న పిలుపు దుర్భరంగా ఉంది. శ్రీనుకి చెప్పుకుందామంటే సిల్లీగా ఉంటుందనిపించింది. బాగా ఆలోచించగా సుస్మిత ఇచ్చిన శాపం గుర్తుకొచ్చింది.  వెంటనే దానికి ఫోన్ చేసి జరిగింది చెప్పి, “నీ శాపం ఫలించింది. అనుభవిస్తున్నా. ఇక విమోచనం చెప్పు” అన్నాను.

“ఇంకా నయం, ఆ విశాల నిన్ను ఆంటీ అనకుండా అక్కతో సరిపెట్టింది. ఎందుకంటే, ఇప్పుడు పెళ్లయితే చాలు – పద్దెనిమిదేళ్ల నవ వధువూ అంటేయే, తొంబై ఏళ్ల ముది వగ్గూ అంటీయే! అందరిదీ ఇదీ వరస, ఇదే వరస! ఐనా నా శాపఫలం అనుభవిస్తున్నానన్నావు కాబట్టి నాదో సలహా!  నీకంటే ఐదారేళ్లు పెద్దదంటున్నావు. ఇంకా పెళ్లి కాని అలాంటివాళ్లకి మగాళ్లంటే ఓ ఆకర్షణ ఉంటుంది. నిన్నక్కా అని పిలిస్తే, మీ శ్రీనుకి కోపమొస్తుందని చెప్పు. అతణ్ణి నొప్పించడం ఇష్టం లేక, తన పిలుపు మార్చుకుంటుంది” అంది సుస్మిత.

మర్నాడే సుస్మిత సలహా అమల్లో పెట్టాను. నేనన్నది వినగానే విశాల కళ్లు పెద్దవయ్యాయి, “ఇంట్లో నువ్వొకత్తివే ఉంటున్నావనుకున్నాను. నీకు పెళ్లయిందా ఆంటీ” అంది వెంటనే.

ఒక్కసారి నా కళ్లముందు ప్రపంచం తలకిందులైనట్లు తోచింది.  విశాలకు నేనిక అక్కని కాను. అంటీని.  

నేను నీకు ఆంటీనేమిటి – అంటే ‘నీకు పెళ్లయింది, నాకు కాలేదు. పెళ్లి కానివాళ్లకి పెళ్లయినవాళ్లు ఆంటీలే’ అనగలదు,

ఆంటీకంటే అక్కే నయం.  కానీ విశాల ఇక ఆంటీ పిలుపు వదలదు, “చిన్నవాళ్లు ఇంకా ఇంకా పెద్దవుతారేమో కానీ, ఒకసారి పెద్దయినవాళ్లు మరి చిన్నవాళ్లు కారు. ఆంటీ ఎప్పుడూ ఆంటీయే!” అనగలదు.

ఇక లాభం లేదని విషయం శ్రీనుకి చేరవేసి, “మనిషి మంచిది. నమ్మకస్థురాలు. వంటలు చాలా బాగా చేస్తుంది. ఎలాగో అలా తన చేత ఈ పిలుపు మాన్పించాలి. ఎందుకంటే నేను ఆంటీనైతే, నువ్వు అంకులువి కదా! నన్ను ఆంటీ అన్నా భరించగలను కానీ, నిన్ను అంకులంటే భరించలేను” అని బంతిని తన కోర్టులో వేశాను.

శ్రీను టూర్నించి వచ్చేక, మా ఇంట్లో పని చేసేవాళ్లకి గుర్తింపు కార్డు అవసరమని చెప్పి విశాల ఆధార్ కార్డుకి జిరాక్సు కాపీ తెమ్మన్నాడు. కాపీ ఎలా చెయ్యాలో మచ్చు కోసమని  నా ఆధార్ కార్డు జిరాక్సు తనకిచ్చాడు. 

మర్నాడు విశాల తన ఆధార్ కార్డు జిరాక్సు తెచ్చింది. చూస్తే నేను 1997లో పుడితే తను 1991లో పుట్టింది. అంటే తను నాకంటే ఆరేళ్లు పెద్ద.

నేనేదో అనేలోగా విశాల చాలా ఆశ్చర్యంగా మొహం పెట్టి, “నీ పుట్టిన సంవత్సరం చూసేదాకా తెలీలేదు. నాకంటే నువ్వు చాలా చిన్నదానివి, ఆంటీ!” అంది.

“ఇప్పుడు అందరిదీ ఇదీ వరస, ఇదే వరస!” అన్న సుస్మిత మాటలు ఓసారి చెవుల్లో గింగురుమన్నాయి.      

(నమ్మండి, నమ్మకపొండి – అచ్చం ఇలాగే కాకపోయినా, ఇది నిజంగా జరిగిన కథ)

 

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.