ఉత్తరం-5

“స్కూల్ టీచర్ కు అబ్రహం లింకన్ రాసిన ఉత్తరం”

ఆంగ్ల మూలం: అనానిమస్

స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

 

నేపథ్యం: అమెరికా 16 వ అధ్యక్షుడు, అబ్రహం లింకన్ తన కుమారుని స్కూల్ టీచర్ కు రాసినట్లుగా చెప్పబడుతున్న ఈ లేఖ ఇంటర్నెట్ లో…. సోషల్ మీడియాలో చాల ప్రాచుర్యం పొందింది.

కానీ…. అమెరికాలోని పేరొందిన పత్రికలకు వ్యాసాలు రాసే ప్రముఖ పాత్రికేయుడు ….. జోనాథన్ మిటిమోర్ …. ఈ ఉత్తరం లింకన్ రాసి వుండలేదని అభిప్రాయపడతున్నారు.

ఈ విషయంలో….. ఆయన … లింకన్ జీవిత విశేషాలపై పరిశోధన చేసిన ఇద్దరు చరిత్రకారుల అభిప్రాయాలను సేకరించి …. ఇది నకిలీ అని తేల్చి చెపుతున్నాడు. పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ లో చదవవచ్చు.

https://www.intellectualtakeout.org/article/abraham-lincolns-letter-his-sons-teacher-totally-fake

నకిలీ అయినప్పటికీ ….. ఎవరు రాసారో తెలియకపోయినప్పటికీ ….. విషయ పరిపుష్టి …. దాని ప్రాచుర్యం మాత్రమే గాక ….. కవితాత్మకంగా … కొన్ని మంచిమాటలు చెప్పబడ్డ కారణంగా …. నేను ఈ అనువాదానికి పూనుకొన్నాను.

ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్ లలో ….. కొద్ది తేడాలతో ….. ఇది రెండు ప్రతులలో లభ్యమవుతున్నది. నేను రెంటిని కలిపి ఒకేదానిగా అనువదించాను.

***

మా అబ్బాయి ఈరోజు నుండి స్కూల్ రావడానికి సిద్దమయ్యాడు. కొంతకాలం పాటు…. అదంతా వాడికి కొత్త కొత్తగా … వింత వింతగా …. వుండవచ్చు. అందుకని, మీరు వాడిని సున్నితంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అది వాడిని ఖండాంతర సీమల్లోకి తీసుకువెళ్ళే ఓ సాహసయాత్ర కావొచ్చు. బహుశా… సాహసయాత్రలన్నీ యుద్దాలు, దుఃఖం మరియు వేదనలతో నిండినవే అయివుండవచ్చు. కానీ …. ఈ జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రేమ, విశ్వాసం, ధైర్యం కావాలి.

కాబట్టి ….. డియర్ టీచర్,

వాడు నేర్చుకోవాల్సిన వాటిని అన్నింటినీ …. వీలవుతే …. సున్నితంగా నేర్పించగలరా ?

మనుషులందరూ ధర్మజ్ఞులు, నీతిమంతులు కారు అనే విషయం వాడు తెలుసుకోవాలి. శత్రువులతో పాటుగా మిత్రులూ వుంటారని మీరు వాడికి నేర్పండి. నీచులతో పాటుగానే …. యోధులు వుంటారని, కుటిల రాజకీయవేత్తలతో పాటుగానే …. అంకితభావంతో పనిచేసే నాయకులు వుంటారని మీరు వాడికి తెలియజేయాలి.

పనిచేయకుండానే దొరికిన ఓ డాలర్ కన్నా …. కష్టపడి సంపాదించిన పది సెంట్లు విలువైనవి అని ….. వీలవుతే వాడికి నేర్పండి. స్కూల్లో …. కాపీ కొట్టి పాసవడం కన్నా …. ఫెయిల్ అవడమే గౌరవప్రదమైనది. ఓటమిని హుందాగా స్వీకరించడం …. గెలుపును ఆనందించడం వాడికి నేర్పండి.

నెమ్మదస్తులతో నెమ్మదిగాను….. కఠినాత్ములతో కఠినంగాను వుండమని మీరు వాడికి చెప్పండి. కన్నీరు కారడం సిగ్గుపడే విషయం కాదని …… కష్టాల్లో కూడా నవ్వుతూ బ్రతకడం సాధ్యమేనని వాడికి తెలియజేయండి.

వీలవుతే ….. అసూయ నుండి వాడిని దారి మళ్ళించి …… నవ్వడంలో వున్న రసానుభూతిని వాడికి తెలియజేయండి. రంధ్రాన్వేషకులను దూరంగా ఎలా వుంచాలో ….. అతి ప్రేమను చూపే వాళ్ళనుండి దూరంగా ఎలా వుండాలో వాడికి నేర్పండి. గొంతు చించుకొని అరచే అల్లరిమూకల అరుపులు వినరాకుండా చెవులు మూసుకోవడ మెలాగో …. వాడికి నేర్పండి. తాను నమ్మిన విలువలకోసం …. ఎదురొడ్డి పోరాడాడమెలాగో …. కూడా వాడికి నేర్పండి.

పుస్తకాలు ఎంత అద్భుతమైనవో వాడికి చెప్పండి. నీలాకాశంలో ఎగిరే పక్షులు, సూర్యరశ్మిని గ్రోలుతూ తుమ్మెదలు చేసే ఝంకారాలు, పచ్చటి కొండకోనల్లోని రంగురంగుల పూల అంతులేని మర్మరహస్యాలని చేధించడం వాడికి నేర్పండి.

గొర్రెదాటుగా ప్రవర్తించే మనుషులను అనుసరించకుండా వుండే శక్తిని వాడికి ప్రసాదించండి. అందరూ చెప్పేది వినడమెలాగో వాడికి నేర్పండి. కాని … అలా విన్నదాంట్లో సత్యాన్ని జల్లెడపట్టి కనుక్కోవడమెలాగో కూడా మీరు వాడికి నేర్పండి. అందరూ తప్పు అని చెప్పినప్పటికీ …… తన నమ్మకాల పట్ల విశ్వాసాన్ని కోల్పోవొద్దని వాడికి తెలియజేయండి.

తన ప్రతిభను, మేధస్సును వీలయినంత ఎక్కువ ధరకు అమ్ముకోవడం వాడికి నేర్పండి. కానీ ….. తన హృదయానికి, ఆత్మకు ….. ఎన్నడూ ……. వెల కట్టవద్దని కూడా మీరు వాడికి నేర్పండి. అసహనాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం ….. ధైర్యంగా సహనాన్ని కలిగి వుండడమెలాగో …. వాడికి తెలియజేయండి. తనపట్ల తనకు అచంచల విశ్వాసాన్ని కలిగి వుండడమెలాగో …. వాడికి తెలియజేయండి. అలా అవుతేనే ….. మానవాళి పట్ల ….. తానూ ఉదాత్తమైన నమ్మకాన్ని కలిగివుంటాడు.

వాడిపట్ల సున్నితంగా వ్యవహరించండి …. కానీ … వాడిని గారాబం చేయకండి. ఎందుకంటే ….. ఉక్కు యొక్క నాణ్యత తెలుసుకోవడానికి దాన్ని నిప్పుల్లో పడేయాల్సిందే!

ఇది ….. మీరు చేయాల్సిన పని. కానీ ….. మీ శక్తివంచన లేకుండా …. మీరు ఏం చేయగలరో చూడండి. నా కొడుకు …. మంచి పిల్లాడు.

***

ముగింపు: ఈ ఉత్తరం ఎవరు రాసారో తెలియదు. కానీ …. ఖచ్చితంగా … రాసినవారు ఎవరైనా సరే, మంచి రచయిత. కాకపోతే, అతను గానీ, ఆమె గానీ …. తన పేరిట రాస్తే, అంతటి ప్రాచుర్యం పొందకపోవచ్చుననే ఒకే ఒక కారణంతో …. లింకన్ పేరిట దీనిని రాసి వుండాలి.

లింకన్ రాసినది కాదు అని తెలిసినప్పటికీ, విషయం సార్వజనీనమైనది అనే కారణం చేత మాత్రమే నేను దీనిని అనువదించడం జరిగింది. ఈ సందేశం కేవలం ఉపాధ్యాయులకే కాదు ….. పిల్లల పట్ల అందరికి ఉండవల్సిన భాద్యతను గుర్తు చేస్తుంది.

ఉపన్యాసం-5

షికాగో సందేశం

వక్త: స్వామి వివేకానంద

స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

మూలం: ఇంగ్లీష్

నేపథ్యం: 1893 లో సెప్టెంబర్ 11 నుండి 27 తేదీల వరకు అమెరికాలోని షికాగో పట్టణంలో “ప్రపంచ సర్వమత సమ్మేళనం” జరిగింది. దానిలో …… స్వామి వివేకానందుడు ….. భారతదేశం మరియు హిందూమతము ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆ సమావేశంలో సెప్టెంబర్ 11 న ఆయన చేసిన ప్రసంగం “షికాగో సందేశం” గా ప్రసిద్ది చెందింది.

ఆ సమావేశంలో పాల్గొనేందుకు ….. ఆయన తన అమెరికా ప్రయాణాన్ని 31 మే రోజునే మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన ఆయన ప్రయాణం …. చైనా, జపాన్, కెనడాల మీదుగా సాగింది. జూలై 30 వ తేదీ ఆదివారం రోజున ఆయన షికాగో పట్టణం చేరుకొన్నారు.

నిజానికి ….. ఆ సమ్మేళనంలో పాల్గొనడానికి ఆయనకు ఎలాంటి పిలుపు కాని ఆహ్వానం కాని లేదు. దానికి హాజరు కావడానికి ఎవరిదైనా సిఫారసు లాంటిది అవసరమని అతనికి తెలిసినప్పుడు అతను కొంత నిరాశ చెందాడు. తక్కువ ఖర్చుతో అమెరికాలో ఉండడానికి గాను …. షికాగో నుండి …. అతను బోస్టన్ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అతనికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం వొచ్చింది. అక్కడే ఆయనకు ప్రొఫెసర్ రైట్ పరిచయమయ్యారు. ఆ ప్రొఫెసర్ గారు వివేకానందుడి ప్రతిభాపాటవాలను గమనించి ఆయనకు “ప్రపంచ సర్వమత సమ్మేళనం” కు కావాల్సిన సిఫారసు పత్రాలను ఇచ్చారు.

వివేకానందుడు తన ప్రసంగాన్ని …… “సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా” అని సంభోదిస్తూ మొదలు పెట్టబోయాడు. అంతే! సమావేశాల్లో ….. సాధారణంగా …… ఎన్నడూ లేని విధంగా ….. ఎవరూ తమల్ని ఆ విధంగా సంభోదించడం వినని అమెరికన్లు ….. రెండు నిమిషాలపాటు లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు!

***

(ప్రసంగ పాఠం)

అమెరికన్ సోదరీ సోదరులారా,

మీ స్నేహపూర్వక హార్దిక స్వాగతంతో నా హృదయం నిండిపోయి సంతోషంతో మాటలు రావడం లేదు. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన సాధుపుంగవుల సమాజం తరఫున మీకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను; మతాలన్నింటికీ మాతృక తరఫున….. మరియు అన్ని వర్గాలు, శాఖలకు చెందిన కోటానుకోట్ల హిందువుల తరఫున నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

తూరుపు దేశాలనుండి హాజరైన ప్రతినిధులను సూచిస్తూ ….. సహనశీలతను వారంతా ప్రపంచానికి తెలియజేస్తున్నారు అని …… ఇక్కడే నాకన్నా ముందు తమ ప్రసంగంలో పేర్కొన్న కొంతమంది వక్తలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచానికి సహనశీలతను, విశ్వమానవ సౌహార్ద్రాన్ని తెలియజేసిన మతానికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను. అంతేగాక …… మేము అన్ని ధర్మాలను అదే ఆదరణతో స్వీకరిస్తాము. అన్ని మతాలకు చెందిన, అన్ని దేశాల్లోనుండి తరిమివేయబడ్డ లేదా కాందిశీకులుగా వొచ్చిన వారిని తన అక్కున చేర్చుకొన్న దేశానికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను. రోమన్ నిరంకుశత్వం ….. తమ పవిత్ర దేవాలయాన్ని చిన్నాభిన్నం చేసి, ధ్వంసం చేసిన తరుణంలో …… దక్షిణ భారతానికి తరలి వొచ్చి తలదాచుకొన్న …. ఇజ్రాయిలీలను మేము మా హృదయాలకు హత్తుకొన్నాము …… అని చెప్పడానికి ……… అలాగే … జోరాస్ట్రియన్లకు (పార్సీలకు) ఆశ్రయం కల్పించి …. ఈనాటికీ వారిని ఆదరిస్తున్న ఓ మతపు వారసుడిని అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. సోదరులారా, నేనూ …. నాతో పాటే …. కోట్లాది ప్రజలు ….. ప్రతిరోజూ ….. ఉచ్చరించే మంత్రంలోని కొన్ని వాక్యాల సారాంశాన్ని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. “నదీమతల్లులు ……. తమ ప్రవాహంలో వంకలూ, వంపులూ తిరుగుతూ ….. వివిధ సవ్య అపసవ్య మార్గాల్లో ప్రయాణించినట్లే ….. విభిన్న రూపాల్లో కనపడినప్పటికీ ….. మానవ ధర్మాలన్నీ నిన్నే (భగవంతుణ్ణి) చేరుకొంటాయి.”

ప్రస్తుతం జరుగుతున్న అత్యంత పవిత్రమైన ఈ సమావేశమే భగవద్గీతలోని ఓ ప్రభోధాన్ని రుజువు చేస్తున్నది. “నన్ను ఎవరు ఏ రూపంలో తలచుకొన్నా నేను వారికి చేరువలో ఉంటాను. ఎవరు ఏ మార్గంలో పయనించినా చివరకు నన్నే చేరుకొంటారు.” శాఖాభేదాలు, మతాంద్ధత్వం….. దాని ద్వారా సంక్రమించిన మతమౌఢ్యం ….. ఈ భూమిని చాన్నాళ్ళుగా ఆవహించి వున్నాయి. అవి ఈ ధరిత్రిని అనేక మార్లు మానవ రక్తంతో తడిపివేసినవి ….. నాగరిక చిహ్నాలను చెరిపివేస్తూ ….. అవి అన్ని దేశాలను నిస్పృహలకు గురిచేశాయి. ఈ రక్కసులు లేనట్లైతే …… మానవ జాతి మరింత అభివృద్ధి సాదించి వుండేది. కానీ …. ఇక వాటికి కాలం చెల్లింది. ఈరోజు ఉదయం ఈ సమావేశపు ప్రారంభ జేగంటలు …. ఆ మతమౌఢ్యనికి …. కత్తులతో గానీ ….. కలాలతో గానీ …… తలపెట్టే హింసాత్మక చర్యలకు ….. అలాంటివి మరేవైనా సంకుచితపు ఆలోచనలకు …… మరణ ఘంటికలై మ్రోగుతాయి.

***

ముగింపు: మొట్టమొదటిసారిగా …… షికాగో ప్రసంగం గురించి …. ఏదో హైస్కూల్ క్లాసులో ….. ఓ టీచర్ (వారెవరో గుర్తు లేదు) వివేకానందుడి గురించి ప్రస్తావిస్తూ …… ఆయనకు కేవలం రెండు నిమిషాలే సమయ వ్యవధి ఇచ్చారని ….. ఆ తర్వాత అతని సంభోధన విని వారు చేసిన కరతాళ ధ్వనులే రెండు నిమిషాల పాటు మ్రోగాయని …… ఆ తర్వాత అతని ప్రసంగం కొనసాగిందని చెప్పినపుడు ….. వివేకానందుడిపై ఓ రకమైన గౌరవభావం ఏర్పడింది. ఆ తర్వాత రామకృష్ణ మిషన్ వారి ఓ పుస్తక ప్రదర్శనలో ఇంగ్లీష్ లోని షికాగో ప్రసంగం చిన్న పుస్తకం కొనుక్కొన్నాను.

షికాగో సందేశం” భారతీయ సంస్కృతిని అమెరికన్లకు పరిచయం చేసింది. తద్వారా మరిన్ని దేశాలకు ఆ సందేశం అందింది. ఇంతకన్నా మనము కోరుకోగలిగేది ఏముంటుంది?

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.