కొన్ని నిర్మోహక్షణాలమధ్య.. 

(విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి)

-లక్ష్మణశాస్త్రి

‘‘కపాలంతో తీర్థం తాగాలంటే పెట్టి పుట్టాలి’’, మాతా మనీషా భైరవి చీకట్లోకి చూస్తూ చెబుతోంది. ‘‘అలాంటి కపాలం దొరకాలంటే, దానికి ముందుగా అన్ని యోగ్యతలూ ఉన్న శవం దొరకాలి’’.

మేమిద్దరమూ రెల్లుగడ్డతో కప్పబడిన చిన్న గుడిసె ఆవరణలో కూర్చుని ఉన్నాం. చుట్టూ అడవిలో చిక్కగా అలముకున్న చెట్లు . మహాస్మశానం అది.

బెంగాల్ లోని శక్తిపీఠం అయిన తారాపీఠ్ లోని మహాస్మశానంలో కూర్చుని  ఉన్నాం మేము. స్మశానం పక్కనే శక్తస్వరూపిణి తారామాత ఆలయం. అమ్మవారు మూడోకన్నుగా పేర్కొంటారీ తారామాతని.

చాలా భయానకమైన, ఒళ్లు గగుర్పొడిచే వాతావరణం. ఎంతో భయం, దాన్ని ఆనుకుని ఉండే చిన్ని ఆసక్తి. మనిషి మస్తిష్కానికి అందని వేరే లోకపు జాడలు ఇక్కడ కళ్లముందు కదలాడుతూంటాయి. తర్కానికి తావే లేని రుద్రభూమి అది. కలకత్తాలో బయల్దేరేటప్పుడు నాకు తారాపీఠ్ తాంత్రిక పూజలకు, క్రతువులకు, బలులకూ పెట్టింది పేరు అనీ, ఊహకు అందని బలులెన్నో తారాపీఠ్ లో జరుగుతూ ఉంటాయని నాకు చెప్పారు. నది ఒడ్డునే, గుడిని ఆనుకుని ఉన్న స్మశానంలో చీకటి సెగ, తగిలిన వెంటనే బెంగాలీ సంస్కృతీ సంప్రదాయాలకు, ప్రజా జీవితానికి దూరంగా ఇంకో జీవనయానం, మన ఊహకి అందని వేరే ప్రపంచం నిద్రలేస్తుంది.

తారాపీఠ్లో అమ్మవారు రాత్రిపూట తిరుగుతూంటుంది. మొక్కులు తీర్చడానికి పగలు బలిచ్చిన మేకల రక్తం తాగుతూ చెట్లమాటున సాధకులకు కనిపిస్తుంటుందని బెంగాలీలు ప్రగాఢంగా నమ్ముతారు. నాగరికత పెరిగి గ్రామాలలో జంతుబలులు రోజు రోజుకు తగ్గుతున్న ఈ రోజుల్లో తారాపీఠ్ క పజిల్. రోజుకు కనీసం యాభై మేకల తలలు తెగుతాయి. అమ్మ ఆకలి తీర్చడానికి దేశంలో ఇంకే మందిరంలోనూ చూడని విచిత్రాలు తారాపీఠ్ లో సర్వసాధారణాలు.

తారామాతకు ఎముకలు, పుర్రెలంటే మహా యిష్టం.  ఈ చుట్టుపక్కల ఉండే సాధువులు ఒళ్లంతా బూడిద అద్దుకుని చిన్నచిన్న పాకలు వేసుకుని ఈ స్మశానంలోనే ఉంటారు. పాకలని ఎముకలు, పుర్రెలతో అలంకరిస్తారు. ముఖ్యంగా పిల్లల పుర్రెలు. వాటిని ఎర్రరంగువేసి, గోడలకీ, గుమ్మాలకీ వేలాడదీస్తారు. గోడలనిండా తారామాత కేలంగర్ బొమ్మలు,  ప్రాంతంలో పేరొందిన సంత్సాధూలు, అఘోరాల ఫోటోలు, పూమాలతో అలంకరించిన త్రిశూలాలు, ముఖ్యంగా ఎముకలు, పుర్రెలు, మనుషులవీ, బలిచ్చిన జంతువులు, పాములవీ, అన్నీ కలగలుపుగా ఇళ్లలో, మెళ్లలో.

‘‘అయితే మరి సరి అయిన పుర్రెను ఎలా గుర్తిస్తారు’’ అడిగాను నేను.

‘‘ఇక్కడి స్మశానఘాట్ చూసుకునే బాబూలు ఉంటారు. వాళ్లు చెబుతారు మాకు. వాళ్లు జాగ్రత్తగా  పక్కనబెట్టి, పిలిచి ఇస్తుంటారు మాకు. ఒక్కనిముషం ఆగి, చెప్పసాగింది మనీషా. అన్నిటికంటే, ఆత్మహత్య చేసుకున్న వారి పుర్రెలు గొప్పవి. విషం తాగి, లేదా ఉరేసుకుని చనిపోయిన వారివైతే మరీ గొప్పవి. వాటికి చాలా శక్తి ఉంటుంది. అలాగే అమాయకులు, వెర్రివాళ్లు, కన్యగానే మరణించిన వారివి కూడా’’.

‘‘తరువాత’’

‘‘ఓ మంచి పుర్రె దొరికిన తర్వాత దాన్ని శుభ్రంచెయ్యాలి కొన్నాళ్లు మట్టిలో పాతిపెట్టితీసి శుభ్రంగా నూనెరాసి ఎండబెట్టాలి. నీళ్లు తాగడానికైతే అది సరిపోతుంది. మేం అదే వాడతాం. అదే ఇంట్లో, వాకిట్లో అలంకరించడానికయితే పూర్తిగా ఆరనిచ్చి, ఎర్రటి పెయింట్ వేస్తాం. దాంతో అది వర్షాకాలంలో పెళుసు అవ్వకుండా ఉంటుంది’’.

ఈ సంభాషణ వేరే ఎక్కడయినా, అది పట్టపగలయినా సరే, జరిగితే అదేదో క్షుద్రవిద్యలు, బ్లాక్  మాజిక్ జరిగే ప్రదేశంలా అనిపిస్తుంది వినడానికి. కాని మనీషామా గుడిసె చుట్టూ ఉన్న స్మశానం వైపు చూస్తే, చాలా సాధారణంగా, విచిత్రంగాఉంది. స్మశానంలో, చుట్టు పక్కలా నివసించే తాంత్రికసాధువులు కొందరు నగ్నంగా, చాలామంది అర్థనగ్నంగా గుంపులు గుంపులుగా కూర్చుని చాయ్ తాగుతూ, పేకాట ఆడుకుంటూ కనిపించారు. ఓ పక్కన శవాలు కాలుతున్న పొగతో నిండిన సాయంత్రపు సమయంలో ఎక్కడ పడితే అక్కడ సగం కాలిన ఎముకలతో, పుర్రెలతో నిండి ఈ భీకర రుద్రభూమి వాళ్లకి మామూలు జనావాసంలా, ఓ కాలనీలో ఉన్నట్లుగా అనిపిస్తోంది.

మేం పుర్రెలు శుభ్రం చేయడం గురించి మాట్లాడుతూంటే మనీషామాతో కలసి అదే గూటిలో నివసిస్తున్న తపన్ సాధు పాక వెనక కూర్చుని, ట్రాన్సిస్టర్ చెవిలో పెట్టుకుని ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా టెస్ట కామెంటరీ వింటూ, మధ్యమధ్యలో గట్టిగా,  ఉత్సాహంగా అరుస్తున్నాడు. ‘‘ఇంగ్లాండ్ టూసెవెంటీ ఫర్ ఫోర్’’.

దూరం నుంచి చూస్తే చాలా భీతావహంగా, భయపెట్టేలా ఉండే మనీషామాని కూడా దగ్గరనుండి చూస్తే ఆ అభిప్రాయం పోతుంది. సంస్కారం లేక అడలు కట్టి తట్టలా అయిపోయిన జుట్టుతో వెలిసిపోయి, చిరుగులు పట్టిన కాషాయం కట్టిన  రూపం చాలా వెగటుగా ఉన్నప్పటికీ, అరవైల్లో పడిన ముదిమి శరీరం భారీగా ఉండి, గంభీరంగా కనబడుతుంది. ఓ తమాషా అయిన చిరునవ్వుతో మాట్లాడుతుంది. మాటల మధ్యలో కళ్లు తమాషాగా మెరుస్తున్నాయి. మాగిన రంగులో ఎండబారిన ఒంటినిండా ఏదో చర్మరోగపు తెల్లని మచ్చలు.

ఆశీర్వచనం కోసం ఆగిన భక్తుల తలపై చెయ్యిపెట్టి దీవిస్తూ, వచ్చేపోయే సాధువులను నీళ్లు కావాలా, చాయ్ కావాలా అని పలకరిస్తూ, మధ్యమధ్యలో తపన్ సాధుకు బెంగాలీలో ఏదో చెబుతూ, చాలా ఏక్టివ్ గా కనిపించింది మాతా మనీషా.

‘‘తారాపీఠ్ లో ఏం వుందో తెలీనవాళ్లు ఇదంతా మర్మవిద్యలు, క్షుద్రోపాసన అనుకుంటారు. ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చి, ఇక్కడ బలులిస్తారని ఎవరో అంటే విని, అదే నిజమనుకుంటారు. ఒక్కోసారి ఇక్కడికి గూండాలు వచ్చి మమ్మల్ని రకరకాలుగా హింసిస్తూ ఉంటారు. ఇక్కడి సాధువు లెవరైనా లోకల్ బజార్ కి వెళితే ఒక్కోసారి పక్కకి నెట్టేస్తారు. అంతెందుకు నన్నే చాలాసార్లు మంత్రగత్తెగా భావించి కొట్టడానికొచ్చారు.

తారాపీఠ్ గురించి పేపర్స్లో, మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆ మధ్య ఓ ఆర్టికల్ లో చదివాను. బెంగాలో తాంత్రిక విద్యలకు సి.పి.ఎం. నుండి ముప్పు వాటిల్లుతోందని, కమ్యూనిస్ట్ పార్టీలు, హేతువాద సంఘాలు, నాస్తిక సంఘాల పేరుతో కొందరు కార్యకర్తలను పంపి దాడి చేయిస్తున్నాయని, తాంత్రిక సాధకుల బారిన పడవద్దని ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాయనీ, హిందుత్వంలో తాంత్రిక విధానాల కంటే మెరుగయిన, నాగరికమైన విధానాలున్నాయనీ, వాటిని నమ్ముకోమనీ, ఇలా చాలా కోణాలలో ప్రచారం చేస్తున్నాయనీ  ఆ ఆర్టికల్ లో వచ్చింది. కాని ఇలా ఎన్ని చెప్పినా, తాంత్రిక ప్రపంచం మీద భౌతిక దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నయి. ఆగడం లేదు. ఇక్కడి సాధువులను మీడియా, మేధావి వర్గం మానసిక రుగ్మతకు గురైన పేషంట్స్ గా, డ్రగ్ అడిక్ట్స్ గా, తాగుబోతులుగా, నరమాంస భక్షకులుగా ముద్రవేస్తూనే వున్నారు.

బెంగాల్ లో ఇప్పటికీ బీదకుటుంబాలలోని దిక్కులేని అనాథ స్త్రీలు, విధవరాళ్లను నాలుగు డబ్బులు సంపాదించడం కోసం క్షుద్రవిద్యలు నేర్చుకుని ప్రయోగిస్తారు. మంత్రగత్తెలని, మనిషి కాలేయం మోజుగా తింటారని ఇలా విన్నవి, చూశామని అనుకున్నవి అయిన అనేక ఆరోపణలతో కొట్టి చంపుతున్నారని బెంగాల్ మీడియా లో చదివాను.

‘‘ఇక్కడకి దగ్గర్లోని భీర్ భమ్లో నాకు తెలిసిన చాలామంది సాధువులను మంత్రగాళ్లుగా ముద్రవేసి చితక్కొట్టి చిత్రహింసలకు గురి చేయడం నాకు తెలుసు.’’ మనీషా చెబుతోంది. ‘‘కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మా లోకల్ యమ్.పి. ఇక్కడి వాళ్లవన్నీ, మూఢనమ్మకాలని బయట మీడియా ముందు కొట్టిపడేస్తాడు. కానీ ఎన్నికలు వచ్చేటప్పటికి సాధువుల ఆశీర్వచనం తీస్కోవడానికి ఇక్కడికి వచ్చి తారాదేవికి మేకలు బలిస్తాడు. మా కాళ్లకు మొక్కుతాడు. మొన్ననే వచ్చి పదిమేకల్ని బలిచ్చి వెళ్లాడు. మనస్సులో తారామాతను, సాధువులను పిచ్చిపిచ్చిగా నమ్ముతాడు.’’

‘‘కాని మనీషా, నాకిది చెప్పు, ఇక్కడ ఈ స్మశానంలోనే ఎందుకు ఉండడం? ఈ ప్రపంచానికి వెలుపలే ఉంటూ, ఆధ్యాత్మిక పవిత్రతతో జీవించొచ్చు కదా. హిమాలయాల్లో, రుషికేశ్, లేదా గంగోత్రి….’’

‘‘మేము అమ్మ తారామా చెప్పిన ప్రకారమే ఇక్కడ ఉంటున్నాం’’ మనీషా కళ్లతో చెప్పాలన్న ఆసక్తి పెరుగుతోంది. ‘‘అమ్మ రమ్మంది, వచ్చాం. ఇక్కడే, తనదగ్గరే ఉండమంది, ఉంటున్నాం. నువ్వు కూడా కొన్నాళ్లు ఇక్కడే ఉండి చూడు. అమ్మ ప్రేమను, శక్తిని శ్వయంగా నువ్వే చూస్తావు. నీలో దాగివున్న తారామా రూపమైన శక్తిని కనుగొనేలా చేయడమే తారాపీఠ్ ప్రత్యేకత. నువ్వు నీ లోపలికి లైట్ వేసుకుని చూసుకునేలా చేస్తుంది తారాపీఠ్.’’

మేము మాట్లాడుతుండగా ఒకతను వచ్చి మనీషా పాదాలకు నమస్కరించాడు. మాటలాపి, మనీషా అతడి తలపై చెయ్యిపెట్టి ఆశీర్వదించింది. అతడు వెళుతూ వెళుతూ, గుమ్మం దగ్గర పీటపై అలంకరించి ఉంచిన కపాలం దగ్గర దక్షిణగా డబ్బులు వేసి వెళ్లిపోయాడు.

‘‘ప్రతిరాత్రి, అంటే ఇంచుమించు తెల్లవారగట్టకి ముందుగా తారామాత దర్శనం అవుతుంది. ఇక్కడ సంచరిస్తూ కనిపిస్తుంది. మనకు అర్హత ఉంటే, ఆ టైంలో నువ్వు కొండంత బలం పొందినవాడివి అయిపోతావు. ఆమె దర్శనం, ఆశీర్వచనం లేకపోతే మేం ఇక్కడ ఇన్నాళ్లు ఉండగలిగే వాళ్లమే కాదు. అమ్మ చేరదీస్తుంది. అన్నం పెడుతుంది, ఆదరిస్తుంది. కోర్కెలతోటి, ఆవేదనతోటి తారాపీఠ్ చేరిన వాడు అవి తీరకుండా వెనక్కి వెళ్లడు. ఇక్కడి ఆకుల్లో, కొమ్మల్లో, రాళ్లు రప్పల్లో ఉడికిన అన్నం మెతుకుల్లో, మరి నీ మనస్సులో, అమ్మ లేనిదెక్కడ? ప్రతి అణువులోనూ తారామాత కొలువుతీరి ఉంటుంది. మనం చేసేదే పాటి? చిన్న దీపం వెలిగించి, వందనం చేసి, రెండు మంత్రాలు చదవడమే. తక్కిందంతా అమ్మే.’’

‘‘మరి ఈ వాతావరణంలో ఉండడానికి భయం వేయదా?’’ అడిగాను.

‘‘అమ్మ నన్ను ప్రేమిస్తూంటే ఇక భయం దేనికి?’’ నవ్వింది మనీషా. ‘‘భయం లేదు, ఏమీ లేదు’’, ఒక్కక్షణం ఆగింది. ‘‘మరణించిన వాళ్లు ఇక్కడేమీ ఉండిపోరు కదా. వాళ్లు మరుక్షణమే ఎక్కడో మళ్లీ పుట్టడానికి వెళ్లిపోతారు. ఇక్కడ మిగిలేది వాళ్ల శరీరంలోని కొన్ని అంగాలు మాత్రమే.’’ ఇది అమ్మ ఇల్లు. ఇక్కడ ఏం ఇచ్చినా అమ్మే ఇవ్వాలి. ఇదిగో ఇలాంటి భక్తులొచ్చి దక్షిణవేసినా, పూజలు చేయించుకున్నా, ఆమె ఆదేశం ప్రకారం, మా భుక్తికి చేసిన ఏర్పాటుగానే అనుకోవాలి. నా చుట్టూ ప్రతి అణువులోనూ తారామాత నిండివుంది. అమ్మను అనుక్షణం నేను ఫీలవుతూనే ఉన్నాను.’’

‘‘నువ్వు అమ్మని నిజంగా చూశావా మరి?’’

‘‘అమ్మకి ఎన్ని రూపాలని? ఎవరు లెక్కపెట్టగలరని? నిన్న కాక మొన్న అమ్మని ఆమె వాహనం నక్కరూపంలో చూశాను. ఎన్నోసార్లు కలలో కనిపించి దీవించింది. తెరిచిన కళ్లకి అమ్మ అమ్మలా అయితే నాకింకా కనబడలేదు. కాని ఓ రోజు చూస్తాను. మనసారా పిలిస్తే, అమ్మను ఏదో ఓ రోజు నువ్వు కూడా చూస్తావు. చూశాక నువ్వు మామూలు మనిషివి ఎప్పటికీ కాలేవు.’’

చేతిలో రుద్రాక్షమాల తిప్పుతోంది మనీషా.

‘‘నాకింకా దర్శనం అవలేదంటే నా ఆరాధనలోనే ఏదో లోపం ఉందేమో! మనస్ఫూర్తిగా ఆరాధిస్తే, మనస్సును లగ్నం చేస్తే తప్ప అమ్మ నీ మాట వినిపించుకోదు. నీకు కనబడదు. అదొక సుదీర్ఘమైన ప్రయాణం, ప్రయత్నం. సుళువేమీ కాదు. ఇక్కడే ఉండి, రోజు తెల్లారగట్ట రెండింటికి స్నానం చేసి, మనసు పెట్టి చూస్తూంటే, చేసుకుంటూ పోతే, ఒకనాటికి ఖచ్చతంగా తారామాతను  ఈ ప్రాంగణంలో చూస్తావు.

‘‘మరి ఇక్కడ ఈ స్మశానంలో ఎన్నో పుర్రెలు, ఎముకలు రకరకాల రూపాల్లో వాడుతున్నారు. వాటి సంగతేంటి?’’ అడిగాను నేను.

మనీషా కొంచెం సహనంగా కదిలింది. ‘‘మీకు అన్ని విషయాల్ని వివరించి చెప్పలేను, చెప్పకూడదు. కాని ఒక్క విషయం ఈ కపాలాలు మాకు శక్తినిస్తాయి. మా ప్రార్థనకి శక్తిని జోడిస్తాయి. కొన్ని దైవిక శక్తులు ఈ కపాలాల్ని మా దగ్గరకు చేర్చి ఈ రూపంలో మాతోనే ఉంటాయి. అందుకే మేం వాటికి రోజూ అన్నం, పప్పు నైవేద్యం పెడతాం. ఆ శక్తులు మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని దుష్టశక్తుల బారినుండి రక్షిస్తూంటాయి. తారామాతను ఆరాధించడంలో, మేలుకొలపడంలో మాకు సహాయపడుతూంటాయి.

మనీషా మాటల్లో నాకు అర్థమైనదేమిటంటే తారామాత ఇక్కడివాళ్ల దృష్టిలో ఈ స్మశానవాతావరణంతో సరితూగే భయంకర శక్తి స్వరూపమయితే కాదు. ఆమె దేవత గురించి అమ్మ, తారామాత, తారామా అని ఎంతో ఆప్యాయంగా, ఆరాధనగా, ముద్దుగా మాట్లాడుతోంది. బజార్లోని కేలండర్లలో, పోస్టర్లలో కనిపించే భయానకమైన తారామాతకు భిన్నమైన స్వరూపాన్ని వీరిక్కడ ప్రేమిస్తున్నారు. కైలాసం లో రత్నఖచిత సింహాసనం మీద కూర్చుని, పిల్లలని లాలన చేస్తున్న గౌరీస్వరూపంగా అక్కడక్కడ కనిపించినప్పటికీ, చాలాచోట్ల తారామాత బొమ్మ చాలా భయంకరంగా ఉంటుంది. అడలు కట్ట వేలాడుతున్న జుట్టుతో, నగ్నంగా, మహారౌద్రస్వరూపిణిగా నిలబడి, నెత్తురు తాగుతున్న నాలుక బయటకు వేలాడుతుండగా, అప్పుడే నరికిన తలలతో కట్టిన దండను మెడలో వేసుకుని, వళ్లంతా రక్తంతో తడిసి ఉండగా, స్థంభించిన పురుషాంగంతో ఉన్న ఓ రాక్షసాకారుడి శవం మీద వికటాట్టమాసం చేస్తూ నిలబడి ఉంటుంది. మనీషా తో అదేమాట చెప్పాను.

‘‘అదీ నిజమే. అది ఆమె రుద్రరూపం. మనకు కాపాడే సందర్భంలో శత్రువును చీల్చి చెండాడే ఉగ్రరూపం అది.’’

‘‘కాని ఆమెను దేవతగానా, అతిబల అయిన ఓ రాక్షసాకారంగానా, ఎలా చూడాలి?’’

‘‘ఆవిడ మా అమ్మ’’ రెండు ముక్కల్లో చెప్పింది మనిషా. ‘‘ అమ్మ ఎప్పుడైనా భయపెడుతుందా? అమ్మ ఎప్పుడైనా కౄరంగా ఉంటుందా? నేను జీవితంలో అన్నీ కోల్పోయి, దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మ రక్షించింది. నా భర్త నన్ను చిత్ర హింసలు పెట్టి హింసించాడు. అత్తగారు బయటికే గెంటేసింది. నా ఇల్లు, ముగ్గురు పిల్లలను వదిలి, ఇంట్లోంచి బయటకు పోవలసిన పరిస్థితిలో అమ్మే నన్ను రక్షించింది. తపన్సాధుని తోడుగా పంపి, నేను ఇక్కడికి చేరుకునేలా చేసింది. చావుకి రూపమైన  ఈ రుద్రభూమిలో నాకు కొత్త జీవితం ప్రసాదించింది. ఇదే నా ఇల్లు, నా సర్వస్వం. వేరే ఎక్కడికి పోతాం? అమ్మే నా తోడు, సర్వస్వం. అమ్మే నా జీవితం.’’

ఆర్తితో మూసుకున్న మనీషామా కన్నులు కరిగి కాలువలవుతున్నాయి.

పచ్చటి పంటపొలాలు, సారవంతమైన నేలలు, చెట్లు, గంగాడెల్టా. సుందర్ బన్స్, బంగాళాఖాతం వరకూ పరచుకున్న చిక్కటి ఆకాశం వీటన్నటి మధ్యా వెలసివున్న చక్కటి గ్రామం తారాపీఠ్.

నది ఒడ్డున చిక్కటి చెట్ల మధ్య సాగే రోడ్డు మనని శాంతినికేతన్ నుండి మనను తారాపీఠ్ చేరుస్తుంది. అక్కడక్కడ పలకరించే ఊడలెత్తిన పెద్ద పెద్ద మర్రిచెట్లు సిసలైన గ్రామీణ వాతావరణం పలకరిస్తుండగా, మనం తారాపీఠ్ చేరుకుంటాం.

ఊరంతా తాటాకిళ్లు, అక్కడక్కడ పెంకుతో నేసిన కప్పులు, ఊరి మధ్య చేపల చెరువు, మర్రిచెట్లు దూరం నుంచి చూస్తే తారాపీఠ్ కూడా బెంగాల్ లోని అన్ని గ్రామాలలాగే కనిపిస్తుంది. తేడా అల్లా ఊరుమొత్తాన్ని డామినేట్ చేస్తున్నట్లు ఉండే పెద్దగోపురంతో కనిపించే తారామాత ఆలయం ఎర్ర ఇటుకతో కట్టిన గోడలు, హిమాలయాలను తలపించే తెల్లటి ఎత్తైన శిఖరం గర్భగుడిలో నల్లని పొడవైన జడ, ఎర్ర మంకెన దండలు, పట్టు చీర ధగధగల మధ్య ములిగిపోయి మెరిసిపోతున్న తారామాత దేవి వెండి విగ్రహం, పైన వెండిగొడుగు, నుదుటనిండా మెత్తని కుంకుమ బొట్టు, ప్రధానార్చకుడు తారాదేవి నుదుటి మీది కుంకుమను వేలితో అద్ది, భక్తుల నుదుటిమీద ఉంచుతాడు. భక్తితో భక్తులు కొబ్బరికాయలు, అగరొత్తులు, చీరసారెలు, అరటిపళ్లు సమర్పించి, అమ్మపాదాలపై తలవంచి మొక్కుతారు. వారు సమర్పించే నివేదనలతో భక్తితో మత్తిల్లిన మనస్సేకాదు, మత్తెక్కించే విస్కీ కూడా సర్వసాధారణం. ఇది ఇక్కడ ప్రత్యేకత.

అయితే తారాపీఠ్ లో నివసించేవారు, దర్శించేవారు నమ్మిన, నమ్మాల్సిన విషయం ఒకటుంది. అమ్మవారి ఆలయం అంటే కేవలం ఇటుకలు, రాయితో నిర్మించిన గుడి మాత్రమే కాదు. ఊరి చివర, గుడి దగ్గర, నది ఒడ్డున, ఘాట్ల వెంబడి విస్తరించి ఉన్న మహాస్మశాన వాటిక మొత్తం ఆమె నివాసస్థలమే, ఆమె ఆలయమే. హిందూ దేవతలందరిలోకి తారాదేవి అత్యంత పరాక్రమవంతురాలు, మహాభీకరమైన దేవత. అలాంటి శక్తి స్వరూపం కేవలం గర్భగుడిలోని అర్చన మూర్తిగా బంధించబడిపోయి ఎలా ఉంటుంది. ప్రజలకి పరమ సత్యమయిన జ్ఞానాన్ని బోధించే అధి దేవత మాత్రమే కాదు. ఆమె మరణాన్ని మోసంచేయగల, జయించగల శక్తి. పరమ భీతాసహమైన రూపం. చితిమంటలపై నుండి నడుచుకు వచ్చి, అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, సంహరించే మహాశక్తి మరి అలా భయానకంగా కాకపోతే ఎలా ఉంటుంది! పదో శతాబ్దికి చెందిన “మండమాలాతంత్ర” లో తారామాత రక్తప్రియగా, రక్తధారిణిగా, రక్తతర్పణకి శాంతించి అనుగ్రహించే దేవతగా కీర్తించబడింది. తారామాతకి జంతురక్తం అంటే ప్రీతి, మనిషిరక్తం అంటే మరింత ప్రీతిట. ముఖ్యంగా నుదురు, చేతులు, వక్షోజాల నుండి స్రవించే రక్తం అంటే అమితాసక్తట.

తార అంటే సంస్కృతంలో నక్షత్రం అని అర్థం. కొందరు పరిశోధకులు తార శబ్దానికి మూలం ప్రాచీన మెసపొటేమియన్ నాగరికతలోని నక్షత్రదేవతలు ‘‘ఇస్టార్, అస్తార్ట్’’ అని సిద్ధాంతీకరించారు. ఇంగ్లీష్ పదం స్టార్, తార ఒకే ఇండోయూరోపియన్ మూలాలు కలిగిన ధాతువునుండి పుట్టిన శబ్దాలు. పర్షియన్ శబ్దం. ‘‘సితార’’, గ్రీక్ శబ్దం సాటర్, లాటిన్ ‘‘స్టెల్లా’’లకు కూడా ఇదే అర్థం. ఆధునిక కేథలిక్ సంప్రదాయంతో ‘‘స్టార్ ఆఫ్ ది సీస్’’ అయిన లేడీ స్టెల్లామేరిస్ కూడా ఇదే సంప్రదాయానికి చెందిన రూపం కావచ్చు. ఈ తత్త్వం తూర్పుదిశగా వ్యాప్తిచెంది, క్రీ.శ. తొలి శతాబ్దాలలో మహాయాన బౌద్ధ సంప్రదాయంలో స్థిరపడింది. బోధిసత్త్వ అవలోకితేశ్వరుని దేవేరిగా, స్త్రీశక్తిగా తార తొలి పూజలందుకుంది.

టిబెట్ నుండి హిమాలయాల మీదుగా బెంగాల్లోకి తిరిగి హిందూదేవతగా ప్రవేశించిన ఈ దేవతను బెంగాల్ లో ‘‘చీనీతారా’’గా కూడా పూజిస్తారు. చైనాలోని బౌద్ధులకంటే బెంగాల్లో మరింత శక్తివంతమైన ప్రభావశీలమైన, రౌద్రదేవతగా తారామాత పూజలందుకుంది, అందుకుంటోంది  ఈ నాటికీ.

మధ్యయుగంలో తంత్రశాస్త్రం మీద మహీధరుడిచే రాయబడిన ‘‘మంత్రమహోదధి’’లో సమస్త విశ్వాన్నీ ఆదరించి ఉన్న మహాసముద్రం మధ్యలో తెల్లతామరలో కూర్చునివున్న దేవతగా తారాదేవి వర్ణించబడింది.

ఈ రౌద్ర రూపావిష్కరణ తారాదేవికే పరిమితం కాదు. త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులతో సమానంగా పూజలందుకునే దశమహావిద్యాదేవతా రూపాలు కూడా బెంగాల్ మొత్తం సుపరిచితాలే. తాంత్రిక శక్తి కేంద్రాలైన ఈ స్వరూపాలు దైవశక్తికి, క్షుద్రశక్తికి మధ్యగల సన్నని విభజన రేఖని ఆక్రమించుకున్న సభ్యసమాజం ‘‘జుగుప్స’’ అనుకునే రీతులలో తమ లీలలు చూపిస్తూంటాయి.

మధ్యయుగం నాటి తాంత్రిక విద్యలు ఆనాడు దేశవ్యాప్తంగా ఆచరణలో ఉండగా, నేడు చాలామటుకు అవి బెంగాల్ ప్రాంతానికి పరిమితమయిపోయాయి. వైష్ణవ శైవ సంప్రదాయాల పరిమితులు దాటి, అవి జైనమతం, మహాయాన బౌద్ధమతాలలోనే కాక చైనీయులు మావోయుజం, ఇస్లాం సూఫీ సంప్రదాయంలోకి కూడా చొచ్చుకుపోయాయి.

తంత్రవిద్య మూలాల్లోకి వెళ్లిచూస్తే, సంప్రదాయాన్ని పక్కకు తోసి, భిన్నంగా, ఎదురెళ్లి ప్రశ్నించేలా ఉంటుంది దృక్పథం. సాత్వికాహారం, ఋజువర్తనం, సదాచారం ఇవన్నీ హిందూధర్మం పాటించే అగ్రవర్ణాలకు వున్న నిర్దేశాలు. తాంత్రిక విద్యోపాసకుల ప్రకారం ఈ విధానాలను పక్కనబెట్టి, వాటికి భిన్నంగా అనుసరించడం ద్వారా భగవతి అనుగ్రహం పొందవచ్చు ఖచ్చతంగా. మామూలు జీవితాన్ని తలకిందులు చేస్తే అది తారాపీఠ్ అవుతుంది. బయట నిషేధించినవన్నీ, అక్కడ తప్పనిసరి.

మనీషా చెప్పినట్లుగా తారాపీఠ్ లో మనకి ఆశ్చర్యం కలిగించేది ఇక్కడి భయానక వాతావరణం, జుగుప్స, గగుర్పాటు కలిగించే కలాపాలు, పూజలు మాత్రమే కాదు. సభ్యసమాజం ఏవగించుకునే బహిష్కరించే స్థితిలో ఉన్న, సాధువులు, కడజాతుల వాళ్లు, పిచ్చివాళ్లు (ఈమాట తప్పేమో) మానసిక స్థితి సరిగా లేనివాళ్లు, దిక్కులేని వాళ్లు, అనాథలు, చీకటి గదుల్లో గొలుసుల్లో బంధించి ఉంచాల్సిన మానసిక రుగ్మతలున్నవాళ్లు – వీళ్లందరూ పెర్ఫెక్ట్ హార్మొనీలో ఒక సమాజంగా, ఒక కమ్యూనిటీగా, ఒకరి కష్టం ఒకరు పంచుకుంటూ, ఒకరి ఆకలి ఒకరు తీరుస్తూ, ఒక మీడియంలో,  బయటి సమాజానికి దూరంగా, సఖ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. కాని మనం? తారాపీఠ్ మహాస్మశాన వాటిక వెలుపల, మీ, మా సమాజంలో అలా జీవించగల్గుతున్నామా? ఆ హార్మొనీ మనలో ఉందా. మనం వాళ్లని బహిష్కరించాలా, వాళ్లు మనని బహిష్కరించాలా!

ఆ రోజు సాయంత్రం పొద్దు వాలాక మనీషా నన్ను తారామాత ఆలయానికి తీసుకెళ్లింది. మన రాజకీయనాయకులని తంత్రవిద్య ఎలా నడిపిస్తుందో ఆ సాయంత్రం నాకు స్పష్టంగా కనిపించింది. సాయంత్రం హారతికి టైమ్ అయినప్పటికీ ఆరోజు తారాపీఠ్ గుళ్లో ఉండాల్సినంత మంది భక్తులు లేరు. దర్శనం క్యూమెల్లగా కదులుతోంది. ఈ క్యూకి దూరంగా, పక్కనున్న మండపంలో కొందరు ఖాదీచొక్కాలు నిలబడివున్నారు. మహామోటుగా ఉన్నారు. ఛోటామోటా వార్డు రాజకీయాలు చేసే రింగ్ లీడర్సలా మాట. అందులో ఒకడు ఓ బలిసిన మేకను మెడ పట్టుకు నిలుచున్నాడు. నరకడానికి సిద్ధంగా.

‘‘నేను బాలీవుడ్లో టాప్ ఫైట్ మాస్టర్ ని’’ పరిచయం చేసుకున్నాడు మిలన్ ఘోషల్. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయింది. ఈ సారి మా వూరినుండి ఎన్నికల్లో పోటీ చేస్తునాన్నాను. తారామాతకు బలివ్వడానికి ఈ మేకను బీహార్లో మావూళ్లో స్పెషల్ గా  కొని, కార్ లో తీసుకొచ్చాను. వాళ్లంతా మావాళ్లే, బీహార్నుండి వచ్చారు.” కొంచెం వంగి చెవిలో చెబుతున్నట్లుగా అన్నాడు. ‘‘ఈ బీహార్లో ఎలక్షన్స్, రాజకీయాలు బలమున్న వాళ్లకే నెగ్గాలంటే ఇదిగో ఇలా తలలు నరికేలా ఉండాల్సిందే.’’

పహిల్వాన్ బాడీ, ఖద్దరు చొక్కా, మెడలో రుద్రాక్షమాల, మణికట్టు చుట్టూ రంగురంగుల రక్షతాళ్లు.

‘‘బోంబేలో నన్ను మిలన్ ఠాకుర్ అంటారు. భూటాన్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. నూట ఏభయి సినిమాలకి ఫైట్స్ కంపోజ్ చేశాను. నా ఫీల్డ్ లోనే కాదు ఏ ఫీల్డ్లోనైనా నేనే కింగ్. బోంబే అయినా బీహార్ అయినా…’’

‘‘మీ బీహార్ ఎలక్షన్స్ కీ,  తారాపీఠ్ కే సంబంధం ఏమిటి? ఇదంతా అవసరమా?’’

‘‘భలేవారే అక్కడ గెలవడం చాలా కష్టం. ఈ ఫైట్లో తారామాతే నన్ను దగ్గరుండి గెలిపించారు. నా పూజలకీ, నైవేద్యాలకీ అమ్మ సంతృప్తిచెంది, నన్ను దీవించి, నా తరఫున పనిచేస్తే, గెలిచి తీరతాను. అమ్మకి సాధ్యం కానిదేమీ లేదు. నేను అపొజిషన్ కాండిడేట్ అంత రిచ్ కాదు. వాడికి లేనిదీ, నాకు ఉన్నదీ ఒక్కటే అమ్మ ఆశీర్వచనం.’’

అప్పుడే క్యూలోకెళ్లి దర్శనం చేసుకువచ్చింది మనీషామా. మిలన్ కి పరిచయం చేశాను. వెంటనే మిలన్ వంగి, ఆశీర్వచనం తీసుకున్నాడు. ‘‘మామూలు మంత్రం కంటే తాంత్రికవిద్య మరీ శక్తివంతం తెలుసా మీకు? అమ్మ తారాదేవి కటాక్షం. ఇదిగో ఇలాంటి భక్తుల ఆశీస్సులు ఉంటే తప్ప మీరూ నేనూ సాధించేదేమీ ఉండదు. అవి వుంటే సాధించలేనిదీ లేదు ఆరాధనగా చెప్పాడు మిలన్.

‘‘మరి అమ్మ ఆశీర్వచనం కోసం ఇంతదూరం తారాపీఠ్ రావాలా? మీ ఊళ్లోప్రార్థన చేస్తే దొరకదా?’’ ఉత్సుకతతో అడిగాను.

‘‘అమ్మవారిని శక్తిస్వరూపంగా కొలిచే గుడి ఇది. అందుకే ఎనిమిదిగంటల ప్రయాణం చేసి వచ్చాం. మా బీహార్ లో మగవాళ్లు శక్తులు కోరుకుంటే తారాపీఠ్ వస్తారు. అందులోనూ రేపు అమావాస్య. ఈ రాత్రి ముఖ్యంగా అర్థరాత్రి దాటేక అమ్మవారు మన ప్రార్థనలను అనుగ్రహంతో గ్రహిస్తుంది. ఇక్కడే తిరుగుతూ, మనందరినీ దీవించి మరీ వెళుతుంది.’’

పూజ ఏర్పాటుచేసిన హోమగుండం దగ్గర పూలు, కొబ్బరికాయలు, పచ్చివెదురు, పసుపుతో అలంకరించిన యంత్ర ప్రతిష్ఠ ఉన్న మండపం కేసి నడిచాడు మిలన్. అగ్ని రాజుకుని మండుతోంది. నాలుగు మూలలా కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. మంట పైకి లేస్తున్నప్పుడల్లా, కార్యక్రమం చేయిస్తున్న పండా మంత్రాలస్థాయి పెంచుతూ, ఎర్రబియ్యాన్ని అగ్ని లోకి జల్లుతున్నారు.

తంతు పూర్తయిందని సూచనరాగానే లేచి నిలబడి, ‘‘బలి ఇచ్చే టైం అయింది’’ అని మనీషాకేసి చూశాడు. అటూ ఇటూ బెదిరి పరుగెడుతున్న మేకను లాక్కొచ్చి పూజస్థలంలో నిలబెట్టారు మిలన్ అక్కడ నేలను బిగించి వున్న స్టీల్ స్టాండ్ మీదకి మేక తలను బలంగా నొక్కి అదిమిపట్టి ఉంచాడు. ఒక పండా వచ్చి మంత్రాలు చదువుతూ, మేక మెడచుట్టూ పసుపును గీతలా పులిమాడు. ఇంకొకడు వచ్చి పొడవైన కొడవలి లాంటి ఆయుధంతో ఒక్కసారిగా మేక తల తెగనరికాడు. కిందపడి కొట్టుకుంటున్న మొండాన్ని పండా దూరంగా తీసుకుపోయాడు. పచ్చి నెత్తురు వాసన ఒక్కసారిగా నేలంతా విరజిమ్మింది. తడిసిన మట్టి, వాడిన పూలు, అగరొత్తులు, పచ్చినెత్తురు వాసనలన్నీ కలిసిపోయిన ఒక పచ్చివాసన జీవితానికీ, మృత్యువుకూ సమానార్థకంగా గాలినిండా పరుచుకుంది.

‘‘జైమాతా, చేపట్టిన ప్రతిపనీ అమ్మపేరుతోనే స్టార్ట్ చెయ్యాలి’’, తెలియని ఆనందంతో అంటున్నాడు మిలన్. ‘‘రేపు అమావాస్య పూట నామినేషన్ వేస్తాను. ఇది సత్యం, నమ్మండి. అమ్మను మించిన శక్తిలేదు, రక్షణలేదు. ఆమె తనవెంట ఉంటే వెనక్కి తిరిగి చూడాల్సిన పనేలేదు ఈ ప్రపంచంలో…’’

మర్నాడు నేను మనీషాతో మాట్లాడడానికి మళ్లీ మహాస్మశానన వాటిక చేరుకున్నాను. తారామాతను మనీషా చూసే విధానానికి, మిలన్ చూపే విధానానికి ఎంతో తేడా కనిపించింది. మిలన్ దృష్టిలో తారామా ఒక ఖచ్చితమైన, మహిమాన్వితమైన శక్తి. ఆమెను సంతృప్తి పరచడం ద్వారా తన కోర్కెలన్నీ తీరుతాయన్న బలమైన విశ్వాసంతో ఉన్నాడు మిలన్. మనీషా దృష్టిలో మాత్రం తారామా తనకు ప్రేమనిచ్చి, నీడనిచ్చి సాకుతున్న, కాపాడుతున్న తల్లిప్రేమ. ఈ విషయాన్ని మనీషా రకరకాలుగా తన మాటల ద్వారా చెప్పింది. ఈ మాటల సారం నాకు పూర్తిగా అర్థంకాలేదు. స్మశానంలో జీవించేలా చేసిన ఆమె గతం ఏంటో తెలుసుకోవాలన్న కోరిక ప్రబలం కాసాగింది.

‘‘ఇంగ్లాండ్ నైంటీఫోర్ నోలాస్’’, తపన్ సాధు గుడిసెవెనుక కూర్చుని కామెంటరీ వింటూ అరుస్తున్నాడు. స్కోర్ వినడానికి అక్కడ చేరిన సాధువులకు అటుగా వచ్చిన చాయ్ వాలా మట్టిపిడతల్లో చాయ్ అందిస్తున్నాడు. అర్థచంద్రాకారంలో పేర్చిన పుర్రెలమధ్యలో ఉన్న చాపమీద కూర్చుని మనీషా తన కథ చెప్పసాగింది.

దక్షిణ బెంగాల్లోని ‘‘అరియదహా’’ మా వూరు మా నాన్న వాటర్ వర్క్స్ లో చిన్న క్లాస్ ఫోర్ జాబ్ చేసేవాడు. పంచాయితీ కుళాయిలు ఎప్పుడొదులుతారో, పన్నులు ఎప్పుడు కట్టాలో టముకు వేస్తూ మైక్లో చెప్పే ఉద్యోగం. మేం తొమ్మిదిమంది పిల్లలం. నాకు ఏడుగురు అక్కచెల్లెళ్లు, ఓ తమ్ముడూ. నేను పుట్టేనాటికి మా నాన్నకింకా ఉద్యోగం లేదు. కటిక బీదరికంలో మగ్గేవాళ్లం. చాలా రోజులు ఇంత ఉప్పు వేసుకుని గంజి మాత్రమే తాగి కడుపు నింపుకునే వాళ్లం. నాన్న, అక్కలు నన్ను ప్రేమించేవారు. అమ్మకి మాత్రం తమ్ముడంటే ప్రాణం. ఎన్ని వెధవ్వేషాలు వేసినా వెనకేసుకొచ్చేది. వాడు అలా చిన్నప్పటినుంచీ చెడిపోవడం మొదలెట్టాడు.

వాడికి సదుపాయం ఏదైనా కొంచెం తగ్గితే అలిగి అన్నం తినడం మానేసేది. ఇంట్లో ఒక్కరు తినడానికే సరిపోయేదేమైనా ఉంటే అది తమ్ముడికే. నాకు ఆరేళ్ల వయసులో ఓసారి అక్కకూ విపరీతమైన జ్వరం వచ్చింది. తినడానికి అన్నంలోకి ఏమీలేవు. అక్కకి వెర్రి నీరసం. నాన్న పక్కింట్లోంచి ఓ చేపముక్క తెచ్చి మా ఇద్దరినీ తినమన్నారు. అక్క నీరసం చూసి, నా ముక్క కూడా దాన్నే తినమని ఇచ్చేశా. ఈలోగా తమ్ముడొచ్చి మొత్తం లాక్కొని తినేశాడు. మర్నాడు నాకు తగ్గింది కాని అక్కకు జ్వరం ముదిరి చనిపోయింది. ‘‘మీరు దానిక్కూడా ఇంత చేపముక్క ఇచ్చుంటే దాని ప్రాణం నిలబడేది’’ అని అమ్మ చాలా కాలం వరకూ నాన్నను దుమ్మెత్తి పోసేది. మరి తమ్ముడు?

నాన్నకి ఉద్యోగం వచ్చేక నన్ను స్కూల్లో వేశారు. ఆ చదువూ అయిదు వరకే. నాకు పదకొండేళ్లు వచ్చాయి. అంతా మొక్కుబడి చదువు. ఎప్పుడూ స్కూల్లోంచి పారిపోయి వచ్చి, ఇంట్లో తిట్లు తినేదాన్ని. నాకు చదువు ఎక్కదని ముందే తెలుసు నాకు. అయిదోక్లాసు అయ్యేసరికి ఆదాయం చాలక, ఉద్యోగం వదిలి ఉపాధి కోసం నాన్న మా కుటుంబాన్ని కలకత్తా తీసుకెళ్లిపోయారు. బగుహటి జూట్ మిల్స్ లో అమ్మ, నాన్న ఇద్దరూ పనికి వెళ్లేవారు.

అప్పటినుంచి ఇంట్లో అందరూ రాత్రి రెండేసి పుల్కాలు తినడం మొదలెట్టాం. అక్కడా ఇక్కడా గిన్నెలు తోమి, బట్టలుతికీ నేను కూడా కొంచెం సంపాదించేదాన్ని. నాకిదేమీ ఇబ్బందిగా ఉండేది కాదు. కలకత్తా జీవితమే ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఊరినిండా బస్సులు, కార్లు, సినిమాలు. ఇవేవీ స్వయంగా అనుభవం లేకపోయినా, వాటిమధ్యలో జీవించడమే ఓ హాయిని, వెచ్చటి అనుభూతిని ఇచ్చేది.

చిన్నప్పటినుండీ నాకు దైవభక్తి ఎక్కువ. ఇంట్లో అందరమూ కలసి అమ్మవారికి రోజూ పూజ చేసేవాళ్లం. కాళి, దుర్గ, తార ఇలా అమ్మ వివిధ రూపాలు నన్ను ఎందుకో చాలా ఆకర్షించేవి. నన్ను జీవితాంతం కాపాడే శక్తి అమ్మకి ఉందని నాకు నమ్మకం కలిగింది. ఆ వయసు నుంచే గుళ్ళు, పండగలు, ఉత్సవాలంటే విపరీతంగా మనసు పడేదాన్ని ముఖ్యంగా దేవీనవరాత్రి కోసం ఏడాది మొత్తం ఎదురుచూసేదాన్ని. ఆ తొమ్మిది రోజులూ ఎక్కడెక్కడి నుంచో వచ్చే సాధువులు, బాబాలతో బోలెడు సేపు మాట్లాడుతూండేదాన్ని.

నాకు పదహారేళ్ల వయసులో పెళ్లి చేశారు. ముహూర్తం వరకూ నా మొగుడిని నేను చూడనే లేదు. మా వారికి చిన్న కిళ్లీ కొట్టుండేది. అప్పటికే మా నాన్న తాగుడికి బానిసయిపోయి, పిల్లలకోసం పైసాకూడా దాచలేకపోయాడు. మా మేనమామ నా పెళ్లికి పదివేలు సర్దాడు. నాన్నని వదిలి కొత్తమనిషి చెయ్యి పట్టుకొని, కొత్త చోటుకి వెళ్లాలంటే ఎంతో ఏడుపొచ్చింది. నా ఏడుపుతో ఏడాదివరకూ నా భర్తను దగ్గరకు రానీయలేదు. దాంతో అతనికి నా మీద కోపం వచ్చింది. అత్తగారు కూడా ‘ఎన్నాళ్లీ ఏడుపులు’ అని విసుక్కోవడం మొదలెట్టింది.

నేను నా భర్త గదిలోకి మారిన కొద్దినాళ్లకే నామీద అమ్మవారు ఆవహించడం మొదలైంది. నాకు మూర్ఛలా వచ్చేది. ఇది మొదలైన కొద్ది నెలలకి నేను పురిటికి పుట్టింటి కెళ్లాల్సి వచ్చింది. అప్పటికి అమ్మవారు నాకు రోజూ కనిపించసాగింది. రోజూ అపస్మారకంలోకి పోయేదాన్ని. ఒకావిడ చూసి తేల్చి చెప్పింది. ‘‘ఇది మీరనుకుంటున్నట్లగా మూర్ఛరోగం కాదు, అమ్మవారు వాలుతోంది. మీ అమ్మాయికి అమ్మ దర్శనమిస్తోంది.’’

తరువాత కొన్నేళ్లకి ఇలా సమాధి స్థితిలోకి వెళ్లిపోవడం, పూనకం రావడం సాధారణమైపోయాయి. నా పిల్లలూ అలవాటుపడిపోయారు. కాని అత్తగారూ, భర్త మాత్రం విసుగెత్తిపోయారు. అతనైతే రోజూ కొట్టేవాడు. కాని నన్ను నేను నియంత్రించుకోలేకపోగా, అమ్మవారికి రోజు రోజుకీ మరింత దగ్గరకాసాగేను. రోజంతా గుళ్లో భజనల్లో కూర్చునేదాన్ని.

ఓ రోజు గుళ్లో ఉండగా, ఎప్పటిలాగే అమ్మవారు ఆవహించింది. కళ్లు తెరచి చూసేసరికి పూజారి అమ్మవారి మెడలో మాల తెచ్చి నా మెడలో వేసి, నుదుట చందనం దిద్ది, హారతిచ్చాడు. ఇదేమిటని అడిగేలోపే ’’అమ్మా నీ భక్తులను కరుణించు’’ అని నా కాళ్లపై మోకరిల్లాడు. ఆ రోజునుండీ నాకు గుడిలో పూజలు మొదలయ్యాయి. జనం నన్నే అమ్మవారుగా భావించి హారతులివ్వసాగారు. నా పిచ్చి మాటలను దీవెనలుగా భావించి పొంగిపోసాగారు. కొత్తలో భయమేసింది. కాని క్రమేపి నా జీవితం తీసుకున్న కొత్త మలుపు ఆసక్తికరంగా అనిపించసాగింది. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. కనుక ఇక నాదారి నేను వెదుక్కోవాలనిపించింది. కాని ఇక్కడో తమాషా జరిగేది. పగలంతా భక్తులు నా దీవెనల కోసం తలుపు తడుతుండేవారు. అది చూసి నా భర్త కోపంతో ఊగిపోయే ప్రతిసారీ నాలో కొత్తశక్తి ప్రవేశించి, నేనూ భక్తితో ఊగేదాన్ని. అంటే అమ్మ నన్ను కాపాడడం ప్రారంభించిందన్న మాట.

కొంపను గుడిలా మార్చేస్తున్నావంటూ ఆయన ఓ మధ్యాహ్నం వీరంగం చేసి, నన్ను విపరీతంగా కొట్టాడు. ఎవరూ ఆపలేదు. ఒళ్లంతా హూనమైపోయి, కదిలే ఓపిక కూడా లేని స్థితిలో ఉండగా అమ్మ పిలిచింది. గాలి తెరతో పాటుగా అమ్మగొంతు వినిపించింది. ‘‘రా, వచ్చేయ్ సమస్తమూ కోల్పోయిన నువ్వు అన్నీ తిరిగి సాధించుకునే సమయం వచ్చింది. ఇక నువ్వు నాదగ్గరే ఉంటావు. నీ బిడ్డల క్షేమం నేను చూసుకుంటాను. బిడ్డా వచ్చేయ్’’.

నా ఇష్టానికి అవకాశం ఏది? అమ్మ రమ్మంది, ఆజ్ఞ అయ్యింది. నేను వెళ్లాలి అంతే. కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు నడిచాను. పిల్లలతో ‘‘వెళుతున్నా, జాగ్రత్త’’ అని చెప్పే వ్యవధి కూడా లేదు.

ఎక్కడికి వెళ్లాలో తెలీక కాళీ ఆలయానికి చేరుకున్నాను. అక్కడే నిద్ర లేని రాత్రిగడిపాను. ఆవేదన, జీవితమంతా శూన్యమయిన తరుణంలో ఆ శూన్యమంతా నిండిపొమ్మని అమ్మని వేడుకుంటూ భక్తులు పెట్టిన ప్రసాదాలు తింటూ గుడి ఆవరణలోనే రెండేళ్లు గడిపాను.

తర్వాత పుణ్యక్షేత్రాలు తిరిగి తిరిగి తారాపీఠ్ చేరుకోవడంతో నా అన్వేషణ పూర్తి అయింది. అమ్మ ఇచ్చిన మాట నెరవేర్చుకుంది. తపన్ సాధు రూపంలో నా గురించి పట్టించుకునే ఓ ఆసరా దొరికాడు. తారాపీఠ్ నా ఇల్లయింది. పిల్లలయితే గుర్తుకొచ్చి, చాలా వేదన కలిగేది. నేను బయటకి వచ్చేసరికి ఆఖరిదానికి నాలుగేళ్లే. కాని నా హృదయంలో పిల్లల స్థానంలో ఏర్పడిన శూన్యాన్ని నా భక్తులు భర్తీ చేశారు. నా కొత్త ప్రపంచంలో వాళ్లే నా పిల్లలు. నన్ను ’మా‘ అని ఆప్యాయంగా పిలుస్తున్నారు.

నేను నా భర్తని వదిలేసినప్పటినుంచీ నా పూనకాలు, మూర్ఛలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. వాటి స్థానంలో అమ్మ ‘నా మనసునిండా ప్రశాంతత నింపింది. తానై నిండింది. ఈ చిన్ని గుడిసెలో తపన్  సాధు, నేను కూర్చుని ఉంటామా, సడన్ గా అమ్మ తన శక్తితో ఈ గది మొత్తం నింపేసినట్లుగా, నేను, నా చుట్టూ ఉన్న ప్రదేశం మొత్తం ఎనర్జీతో నిండిపోయినట్లుగా ఫీలవుతాను. అది అనుభవిస్తినే తెలుస్తుంది. గది మొత్తం వెలుగు ముద్దగా మారినట్లనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి. అమ్మను నేను చూసినట్లా, చూడనట్లా?

ఈ కపాలాల ద్వారా మనం అంటే మేము మరింతగా తారామాత సామీప్యాన్ని పొందగలుగుతాం. ఎంతో మంది యోగులు సిద్ధిపొందడానికి ఇదే మార్గం ఎంచుకున్నారు. తారాపీఠ్ ప్రాముఖ్యాన్ని గుర్తించిన తొలి గురువుల్లో ఒకరైన బామాఖేపా ఈ మార్గంలోనే మొదటిసారి అగ్నిజ్వాలల మధ్యలో రాలి అమ్మవారిని బాలికగా, కన్యగా దర్శంచాడు. మనిషి జీవితపు అశాశ్వతత్వానికి కపాలాలు ప్రతీకలు. అలాగే మన జీవితాల చుట్టూ ఆవరించివున్న శాశ్వతమైన అశాశ్వతత్వానికి, మాయకు అవి ప్రతీకలు.

తాంత్రిక విద్యల ద్వారా కపాలాలని సాధనచేసి, కొన్ని ప్రక్రియల ద్వారా అమ్మశక్తి ఉద్దీపింపచేసి, అందులో మనమూ భాగం కావచ్చును. అమ్మను గెలుచుకోవచ్చును. రమ్మన వచ్చును.

చనిపోయిన వారి ఆత్మలు కపాలాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. వాటికి రూపం లేదు, నాశనం లేదు. మనం వాటిని కొలిచి మచ్చిక చేసుకోవాలి. అమ్మకు, పూలు, నూనెతో పూజచేయాలి. నివేదన చేయాలి. అలా అని అన్ని పుర్రెలూ పనిచేయవు. వాటిని అబ్జర్వ్ చెయ్యాలి. ఉడికించిన పప్పు, అన్నం, బలిచ్చిన జంతువుల పచ్చిమాంసం నైవేద్యం పెట్టాలి. కపాలం పక్కకి తిరిగిపోతే కనక అది మనకు ఉపయోగపడదన్న మాట.

బాధలు అసంతృప్తులతో, వేదనతో మరణించిన జీవుల ఆత్మలు మాత్రమే ఇక్కడ అవసరం. ప్రశాంతంగా జీవించి, మరణించిన వారి ఆత్మలు పునర్జన్మ పొందుతాయి, ఇక్కడ ఉండవు. అకాలమరణాలు, దిక్కులేని చావులు, బలవన్మరణాలు ` అందునా ముఖ్యంగా చిన్నవయసులో పోయినవారి ఆత్మలు ఇక్కడే ఉండి, ఈ గాలిలోనే అర్థరాత్రి దాటాక తిరుగాడుతూంటాయి. మా కార్యసాధనకు అవే ఉపయోగపడతాయి. మనం ఈ ఆత్మలని లొంగదీసుకోలేము. కొన్ని ప్రత్యేక మంత్రాల ద్వారా, ఉపాసనల ద్వరా మచ్చిక చేసుకోగలం. అంతే. తపన్ సాధు నేర్పిన కొన్ని ఉపాసనల ద్వారా సమాధులను పగలగొట్టి, ఆత్మలను నిద్రలేపవచ్చు తెలుసా. మనచుట్టూ వృత్తం గీసుకుని భద్రత కల్పించుకోవాలి. మనం ఆవాహన చేసిన ఆత్మలు వచ్చాక వాటితో సంభాషించే శక్తి మనకి ఉండాలి. అప్పుడు వాటి శక్తిని మనం ఉపయోగించుకోవచ్చును. ఇవన్నీ నిగూఢమైన శక్తులు, రహస్యాలు. తపన్ సాధు, ఆ స్థాయికి చేరిన సాధువులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు వాళ్లు ఏమైనా చేయగలరు.

కానీ నాకిప్పుడు అర్థమవుతున్నదేమిటంటే తాంత్రిక విద్యైనా, పేరేదైనా సరే, పరిపూర్ణమైన భక్తి లేకపోతే పని చేయదు. చిన్న వయసులో, నేను ఇక్కడకు చేరిన కొత్తలో కపాలాలు, తాంత్రిక రహస్యాల విషయాల్లో ఎంతో ఆసక్తి ఉండేది. కాని క్రమంగా నా ఆలోచనలు మారుతూ వచ్చాయి. ప్రేమ, భక్తి ద్వారా అమ్మకి దగ్గరవ్వడమే ముఖ్యం తప్ప చిన్న చిన్న ప్రయోగాలు చేయడం, సాధించడం కాదన్న విషయం అర్థమవుతోంది. అంటే నేనింతవరకూ చెప్పినవన్నీ అసత్యాలూ, కల్పనలూ అని కాదు. అవన్నీ ఉన్నాయి. వాటికంటే గొప్పది, సత్యమైనదీ కూడా ఉంది. అది అమ్మని నిండుమనసుతో ప్రేమించడం, పూజించడం. నా జీవితంలో ఈ పుర్రెలు, ఎముకలు, ఉపాసనలు ఇవన్నీ భాగమే, కాదనను. అవి కూడా నా జీవితప్రయాణంలో నాతోనే ఉంటాయి. కాకపోతే కాంక్షలను ప్రేమతో తుడిచేస్తున్నాను. అంతే. అమ్మపట్ల ప్రేమ.

ఈ తాంత్రిక విద్యలున్నాయి చూశారూ, చాలా ప్రమాదకరమైనది. చేసే విధానంలో, క్రమంలో చిన్నతప్పు జరిగిందో, పిచ్చివాళ్లయిపోతారు. అమ్మవారిని పటాయించి మహిమలు పొందే ప్రయత్నం చేసినవాళ్లు ఇక్కడే పిచ్చివాళ్ళై  మట్టిలో పొర్లుతున్నారు. ఒంటిమీద స్పృహలేకుండా, సాధనలో చిన్న పొరపాటు చేసినా, అది తిరగబెట్టి, మతిస్థిమితం మీద దెబ్బకొడుతుంది. ఇక వాళ్లెప్పటికీ మనుషులు కాలేరు. ఏం అర్థమైంది మీకు? భక్తికి తంత్రవిద్యకీ మధ్య సున్నితమైన తూకం ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఆ రెంటినీ బాలన్స్ చేసుకుంటూ, ప్రేమ – త్యాగం రెంటినీ సంధానం చేసుకుంటూ ముందుకు పోగలిగితే, నువ్వు సరైన దారిలో వెళుతున్నట్లు లెక్క. నువ్వలా ముందుకు సాగిపోతుంటే అమ్మ గమనిస్తూ ఉంటుంది. నువ్వు అర్హుడైనట్టుగా భావించిన రోజున అమ్మ నిన్ను తప్పకుండా కటాక్షిస్తుంది.

ఆ రోజు వరకూ అమ్మని రోజూ కలలోనే చూస్తుంటాను, కలవరిస్తూంటాను. భావనలో అమ్మ కరుణ పొందుతూనే ఉంటాను.

‘‘మరి ఈ తపన్ సాధు?’’

‘‘ఆ నాకథలో ఆ పార్ట్ చెప్పలేదు కదూ. ప్రేమగురించి అయినా, మంత్ర తంత్రాల గురించయినా, అసలు జీవితంలో నేనేమైనా నేర్చుకుని ఉంటే అది తపన్ సాధు నేర్పిందే. నేను కలకత్తా కాళీ టెంపుల్ లో ఉన్నప్పుడు ఒకసారి తపన్ తన శిష్యులతో అక్కడకొచ్చాడు. దగ్గరకు పిలిచి ‘‘పాన్ కావాలా’’ అని అడిగాడు.

అతడిని అప్పటికే రెండు మూడు సార్లు చూశాను. అతని గురించి విన్నాను. అప్పటికే నా మనసులో అమ్మవారి గురించి, తాంత్రిక విద్యల గురించి నేర్చుకోవాలనే కోరిక స్థిరపడింది. నా చేత సాధన చేయించే ఓ గురువు, నన్నూ గౌరవించే మనిషి, కాపాడే మగాడు నాకు అవసరం అనిపించింది. నాకు తపన్ దొరికాడు. అతనికే నేను దొరికానేమో? నా ఒంటరితనానికి సమాధానం దొరికింది. అతన్ని వెతుక్కుంటూ తారాపీట్ వచ్చాను. ఇక్కడే ఈ చెట్టుక్రిందే చాలా రోజులున్నా. అతనికోసం ఎదురుచూశా. మాట్లాడే ధైర్యం చేయలేదు. జనం ఏదో చెవులు కొరుక్కుంటుంటే, ఓ రోజు తిన్నగా లోపలికెళ్లి నేనే చెప్పేశా. ‘‘జనం ఏవేవో అనుకునే అవకాశం ఇవ్వకుండా, మనం కలిసే ఉండొచ్చు కదా. ఇద్దరికీ తోడు కావాలి. ఇది చాలదా?’’

అతను రమ్మన్నాడు. ఆనాటి నుండీ ఇద్దరం కలిసే ఉంటున్నాం. అమ్మ దయవల్ల ఇక్కడ తొందరగానే అలవాటుపడ్డాను. నాకంటూ కొందరు శిష్యులు, భక్తులు తయారయ్యారు. ఏడాదయ్యాక తపన్ సాధు యాత్రలకెళ్తూ నన్నూ తీసుకెళ్లాడు. కాశీ, హరీద్వార్, రిషికేశ్ – రైలెక్కి నార్త్ అంతా తిరిగాం. ఏనాడూ టికెట్ కొనలేదు. టీసీలకి సాధూలంటే భయం, టికెట్ అడగరు”. ఆగి, పెద్దగా నవ్వేసింది మనీషా.

రిషికేశ్ నుండి కేదార్, బద్రీ వరకూ నడుస్తూ పోయాము. వందల మైళ్లు మంచు, శీతాకాలం, జ్వరాలొచ్చాయి. కాని అద్భుతం. స్వర్గం చూశాం. అతనితోనే నేను. అతనేం తింటే అదే తిన్నాను. కలిసి యోగా చేశాం. హిమాలయాల్లోని ఒంటరితనంలో నిశ్శబ్దంలో వారాలపాటు జపం చేశాం. ఇది లేదనీ లేదు, కావాలనీ లేదు. ప్రకృతిలో సంగమించిన  ఓ శాశ్వతానందం. ఏదీ అవసరం లేని, కోరుకోని స్థితి. ముక్తికి సోపానం అదేనేమో. ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తే గతం తాలూకు అర్థం లేనితనం కనిపించి నవ్వొచ్చేది.

మొదటిసారి నానుండి నేను విడిపోయి తేలికయి పోయా. విముక్తురాలనయి నాకు నేనే కనిపించసాగాను దిగిపోయి, మొత్తంగా, కొత్తగా నిర్వాణం అంటే ఇదేనా.

ఒక వింటర్, సమ్మర్ అక్కడ గడిచాక, మళ్లీ అమ్మను చేరుకోవడానికి తారాపీఠ్ వచ్చేశాం. సృష్టిలో అన్నిటికంటే గొప్పసుఖం అమ్మ సన్నిధిలో గడపడం.

‘‘చావుకు ప్రతిరూపమయ్యే, దేహాలు అగ్ని పునీతమయ్యే నిర్మోహక్షణాల దొంతరల మూట అయిన ఈ మహాస్మశానంలో నేను జీవించడం, ప్రేమించడం నేర్చుకున్నాను.

అది నేను ఎదురు చూసిన అమావాస్య రాత్రి. చీకటి చిమ్ముతోంది. స్మశానానికి మధ్యాహ్నం నుంచే జనం చేరుకోసాగారు. అర్థరాత్రి మొదలయ్యే పూజలకు, క్రతువులకు ఏర్పాట్లు మొదలయ్యాయి. తాంత్రికులు తమ విద్యా ప్రదర్శనకి కావలసినవి కట్టలు కట్టి తెచ్చుకుంటున్నారు. మేకలు అమ్ముతున్నారు, కొనుక్కుని లాక్కొస్తున్నారు. ప్రతి పాకలోను దీపాలు వెలిగాయి.

‘‘ఇక్కడ ప్రతి అమావాస్య ఒక ఉత్సవమే, ఒక దీపావళే’’ పొద్దు వాలే కొద్దీ తాంత్రికులు, సాధువులతోపాటు బోల్పూర్, శాంతినికేతన్, కలకత్తాలనుండి బెంగాలీ కుటుంబాలు జట్లు జట్లుగా చేరుకుంటున్నారు. ఎవరి అవసరాలు, కారణాలు వారివి. ఎవరి డిమాండ్లు వారివి. అందరి కోరికా ఒకటే. అమ్మవారు అతిశక్తిమంతురాలుగా తిరిగే ఆ రాత్రి ఆమెను ప్రసన్నం చేసుకుని, ఆ శక్తిలో కొంత దోసిలిలో నింపుకోవాలని.

‘‘ఇన్ని మేకల్ని బలికి తీసుకురావడం, చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అన్నాను నేను.

‘‘అమ్మకి ఆకలి ఎక్కువ. ఆకలి తీర్చుకునే రోజుది. నిరంతరంగా తీర్చాల్సిన ఆకలి అది. ఆమెతో పాటు వచ్చే యక్షిణులు, ఢాకినీల ఆకలి దాహం కూడా ఈ నెత్తురుతోనే తీరాలి మరి.’’

చీకటి చిక్కబడింది. తపన్ సాధు తన పాక ముందు గొయ్యితవ్వి హోమగుండం తయారు చేశాడు. అతడిని పూర్తిగా మొదటిసారి చూశాను. డెబ్భయిల్లో పడ్డ వయస్సు, తెల్లనిగెడ్డం, ఆరడుగుల ఎత్తు, నిరంతర యోగసాధనలో రివటలా నిలబడ్డ శరీరం, లోపలినుంచి హోమానికి అవసరమైన కట్టెలు, త్రిశూలం, ఓ పెద్ద కపాలం, పూజాసామగ్రి తెచ్చాడు. హోమగుండం అంచున త్రిశూలం నిలబెట్టి, దాని మొదట్లో కపాలం ఉంచి మందారాలతో అలంకరించాడు. కపాలం చుట్టూ రుద్రాక్షమాల ఉంచాడు. కొవ్వొత్తులు వెలిగిస్తుండగా ఓ బడా బెంగాలీ బాబు వాళ్ల ఫ్యామిలీకి బలిహోమం పురమాయించడానికి వచ్చాడు. కొంచెం గుసగుసల తర్వాత బేరం కుదిరింది.

ఘడియలు గడుస్తుండగా స్మశానం మొత్తం చిన్న చిన్న హోమాలు వెలగడం మొదలయింది. ఒక్కో హోమం దగ్గిరా గోచీలతో కొందరు, నగ్నంగా కొందరు సాధువులు మఠం వేసుకుని, గొంతుక్కూచుకుని, అగరొత్తుల పొగల మధ్య పూజలు ప్రారంభించారు. చుట్టూ కూర్చున్న వారికి, సాధువులకు భంగుగొట్టాలు అందుతున్నాయి.

గాలిలోంచి, చీకట్లోంచి చెట్లమాటునుండి ఆరుతున్న చితిమంటలనుంచి ఏవో స్పష్టాస్పష్టంగా ఆకారాలు వచ్చి హోమాల్లోకి కరిగిపోతున్నట్లు ఏదో భావన. ఇది వాస్తవమా, లేక భావన మాత్రమేనా? తరచి చూసే సమయమూ లేదు, అవసరమూ లేదు. భావనకీ వాస్తవానికీ మధ్య ఉన్న సన్నని తెర చివికిపోయి చిరిగిపోయే దీర్ఘనిశి ఇది.

దూరంగా చీకట్లోంచి ఏకతార మీటుతూ ఎవరిదో ఆడగొంతుతో పాట వినబడుతోంది. హృదయం ద్రవించేలా, ఆర్తితో అమ్మనే వేడుకొంటూ, కేకలు పెడుతూ అమ్మ నిజంగా వింటే అదే ఆఖరి అమావాస్య అవుతుందేమో తారా పీఠ్ లో.

ఓ హోమం దగ్గర సాధువు గట్టిగా శంఖం పూరించసాగాడు. జై తారా జై గురు, జైజై మా తారా ల హోరు మధ్య భజంత్రీలు మోగ సాగాయి స్మశానం దద్దరిల్లేలా.

పాట ఆగలేదు. బాజాలని చీల్చుకుని అమ్మని చేరుతూనే ఉంది.

తపన్ సాధు హోమం వెలిగించాడు. మంటలు ఉవ్వెత్తున లేచాయి. దురదృష్టమేంటంటే హిందూధర్మం లో వేదకాలంలో నిర్వచించబడిన కొన్ని క్రతువులు, విధానాలను పట్టుకుని, స్ఫూర్తిని వదలి, కనుమరుగైన కొన్ని విధులను, ఉపాసనలనూ గుడ్డిగా ఫాలో అవుతూ ఓ అర్థంకాని చీకటి మార్గంలో దారి తప్పిపోయారీ తంత్రవిద్యోపాసకులు అనిపించింది ఇక్కడ.

తపన్ హోమం చుట్టూ బెంగాలీ బాబు బసు, కుటుంబం చేరారు. ‘‘కొన్ని ఫ్యామిలీ వ్యవహారాలు, లిటిగేషన్స్ మెరుగవడానికి, బిజినెస్ ఎక్స్ పాన్షన్ గురించి కోరుకుని ఇక్కడకొచ్చాం. మాది కలకత్తా’’ చెప్పాడు బసు. ‘‘ఇంట్లో సుఖం, మనశ్శాంతి కోసం. పిల్లలు దారి తప్పేలా వున్నారు. వాళ్లు మళ్లీ చదువుబాట పట్టాలి’’మిసెస్ బసు.

ఎడంచేత్తో చిరుగంట మోగిస్తూ తపన్ మంత్రాలు చదువుతున్నాడు. ఉండుండి నెయ్యి హోమం చేస్తున్నాడు. నేను బసు ఫ్యామిలీ వెనక మనీషా పక్కన కూర్చున్నాను.

‘‘ఈ తపన్ కథ ఏంటి?’’

‘‘తపన్ సాధు బ్రాహ్మిన్స్. ఇక్కడ ఛటర్జీలు అంటారు. అమ్మ పిలుపందుకుని ఇక్కడకు రాక పూర్వం కలకత్తా వాళ్లది. పెద్ద కుటుంబీకుడు. నాలాగే ఇల్లు వదలి వచ్చేశాడు.’’

‘‘మరి ఫ్యామలీ?’’

‘‘అతని భార్య ఈ మధ్యనే కాలం చేసింది. ఇల్లు వదిలేముందు పదిహేనేళ్లు సంసారం చేశాడు ఆవిడతో. కబురొస్తే, భార్య అంత్యక్రియలకు వెళ్లాడు. కాని కొడుకుతో సహా ఎవరూ కనీసం పలకరించలేదుట.’’

మా మాటలు లీలగా విన్నట్టున్నాడు తపన్. బసు ఫ్యామిలీ భజనపాటలు పాడడం మొదలెట్టడంతో పూజకి చిన్న బ్రేక్ ఇచ్చి మా దగ్గరకొచ్చి కూర్చున్నాడు.

‘‘చాలా కష్టంగా అనిపించింది’’ చీకట్లోకి చూస్తూ, బాధగా తల ఊపుతూ అన్నాడు. ‘‘నా కొడుకు నేనంటే చాలా కోపంగా ఉన్నాడు. నేను ఏనాడూ కుటుంబాన్నీ, కొడుకునీ పట్టించుకోలేదని, కనీసం కబురు కూడా లేదనీ కడుపులో ఉక్రోషం పెంచుకున్నాడు.’’

‘‘మరి, అది నిజమేగా’’

‘‘అవును, కాదుకూడా!’’ ‘‘అమ్మ పిలుపుకి బయటకొచ్చేశాక, వాళ్లతో కనెక్ట్ అయ్యే అవకాశం రాలేదు మరి నాకు’’, హోమంలోకి కట్టెలు ఎగదోస్తూ అన్నాడు. ‘‘తనని పెంచి పెద్దచేసిన వాళ్ల వైపు నిలుచున్నాడు ఇప్పుడు నా కొడుకు. వాడికి నేనేం సపోర్ట్ ఇచ్చాను కనుక. వాడి వాదం వాడిది. నన్ను అర్థం చేసుకోడు, చేసుకోలేడు.’’

‘‘మరి నీ భార్య?’’

‘‘నేను నా శిష్యులతో కలసి కలకత్తాలో ఉండగా మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. ఆఖరి చూపుకి తిన్నగా స్మశానానికి వెళ్లాను. నా కొడుకుని ఇరవై ఏళ్లయిపోయినా వెంటనే గుర్తుపట్టగలిగాను. నా ఒక్కగానొక్క కొడుకు. వాడి దగ్గరికి వెళుతూండగానే నా మేనల్లుడి గొంతు వినిపించింది. ‘‘ఇన్నాళ్లూ కుటుంబాన్ని గాలికొదిలేసి, ఇవాళ పెళ్లాన్ని సాగనంపడానికి వచ్చాడు యజమాని.’’

నా కొడుకు నాకేసి చూడనైనా లేదు. వాడి అత్తగారి తాలూకు వాళ్లనుకుంటా, వాడికీ నాకూ మధ్య అడ్డంగా నిలబడ్డారు. వాళ్లు నన్ను అడ్డుకుంటున్నట్లుగా అనిపించింది. కొడుకును కళ్లారా చూడనైనా లేదు.’’

మంటవెలుగులో తపన్ సాధు సడన్ గా  ఇంకో పాతికేళ్లు మీదపడినవాడిలా, లొంగిపోయినట్టుగా కనిపించాడు. ముఖంలో కన్నీరు కనిపించలేదు కాని కన్నీటి ఆవిరి కనిపించింది, ముఖంనిండా, మనసు నిండా.  డెబ్భై ఏళ్ల జీవిత ప్రస్థానం ఫోటో షోలా ముఖంలో ప్రేమలు మారుతూ కనిపించిది, అగ్ని గుండపు వెలుగులో బంధాలు తెగిన చప్పుడు అగ్గిరవ్వల చిటపటలతో శ్రుతి కలుపుతుండగా.

‘‘అందరూ నా సొంతమనుషులే, నా కొడుకును కనీసం పలకరించకుండా నన్ను ఆపేశారు.’’

తపన్ మౌనంగా మంటల్లోకి చూస్తున్నాడు. ‘‘వాళ్లెవరికీ ఆధ్యాత్మిక భావాలు లేవు. దేవుడిని కూడా నమ్మరేమో. మా మేనకోడలు ప్రొఫెసర్. వాళ్లాయన రేడియాలజిస్ట్. నా కొడుకు టాటాలో ఎకౌంటెంట్. ఎర్రగా, బుర్రగా ఎంతో బాగున్నాడు. చిన్నప్పటి నాలా ఉన్నాడు. కాని వాళ్లెవరూ నా ప్రపంచాన్ని కలలో కూడా అంగీకరించరు. వాళ్లకి నా ప్రపంచాన్ని పరిచయం చేసే అవకాశం ఎప్పటికీ నాకివ్వరు. ఇదో అఖాతం రెండు ప్రపంచాలమధ్య. ఇది ఇంతే ఈ జన్మకి.’’

‘‘పిల్లాడికి పెళ్లయిందిగా, పెళ్లాం మారుస్తుందేమో’’, మనీషా అంది.

‘‘ఊహూ’’ గెడ్డం నిమురుకుంటూ అన్నాడు తపన్. ‘‘వాడి మాటను వాళ్లెవరూ పడనీయరు. వాడికి స్వయంగా ఆలోచించే వయసూ, శక్తీ  రెండూ లేవు.’’

బసు కుటుంబం అందరూ కలసి ఆవేశంగా భజనచేస్తూ  వాళ్ల  ప్రపంచంలో వాళ్లున్నారు.

‘‘కార్యక్రమం అయ్యేవరకు దూరంగా నిలబడి, వచ్చేశాను. మళ్లీ ఇక ఎప్పటికీ వెళ్లనేమో.’’

‘అదేం మాట?’’ మనీషా సర్ది చెప్పింది. ‘‘ప్రాణం ఉన్నన్ని రోజులూ ప్రయత్నిస్తూ ఉండాలే కాని, ఇలా డీలా పడిపోతే ఎలా?’’

‘‘ఈ సన్యాసి జీవితం ఉంది చూడు, ఇదో ఆనందంతో నిండిన స్థితి.’’ తపన్ చెబుతున్నాడు. ‘‘కాని ప్రతి సన్యాసి జీవితంలోనూ ఓ గతం, ఓ మెలిపెట్టే బాధ దాక్కుని ఉంటాయి. సన్యాసిజీవితంలో కాలం గడిచిన కొద్దీ ఆనందం పెరుగూతూ పోతుంది. దాని చాటున గతం తాలూకు బాధను మరిచి పోతుంటాం. ఇంతలో హఠాత్తుగా ఓనాడు గతం మళ్లీ భూతంలా ముందుకొచ్చి నిలబడుతుంది. పుండు కెలికినట్లవుతుంది. అప్పుడు కలిగే దుఃఖానికి హద్దులుండవు. ఎందుకంటే కన్నీళ్లు రాని, వచ్చినా తుడిచేవాళ్లు లేని ఒంటి కట్టె బతుకుమాది. ఆ కష్టం పగవాడికి కూడా వద్దు తల్లీ. తారామాతా, జన్మలో ఎప్పటికీ నా వాళ్లను కళ్ల ముందు చూపించకు. ఈ ఆఖరి రోజులకు నువ్వు చాలు, నీ ప్రేమ చాలు, నీ మాయ చాలు.’’

తపన్ కళ్లు మంటల్లోకి చూస్తూనే ఉన్నాయి.

‘‘ఈ విషయంలో అమ్మ నాపట్ల దయచూపించిందనే అనుకోవాలి.’’ మనీషా టాపిక్ మార్చే ప్రయత్నం చేసింది. ‘‘నేను తారాపీఠ్ లో ఉంటున్నట్లు మావూరి వారెవరో చెప్పారట. మా ఇంట్లో మా ఆయన కాలం చేసిన తర్వాత నా పిల్లలు నన్ను వెతుక్కుంటూ తారాపీఠ్ స్మశానానికి వచ్చారు. పేరు మారిపోయింది కదా తెల్లమచ్చల సాధుమాత ఎక్కడ అని వాకబు చేస్తూ వచ్చారు. ఇరవై ఏళ్ల తర్వాత. కూతుళ్లు వచ్చి కాళ్లకు నమస్కారం చేశారు. నేను వదలి వచ్చేనాటికి పిల్లలు. ఇప్పుడు వాళ్లలో ఇద్దరికి పిల్లలు. ఆఖరిదానికింకా పెళ్లికాలేదు.

‘‘అది మనసుకు చాలా కష్టం కలిగించే క్షణం. ఒక్క నిముషం కళ్లలోకి చూసుకున్నాం. ఒకరినొకరు గట్టిగా హత్తుకుని బావురుమన్నాం. అందరి కళ్లలో కన్నీళ్లు. నాన్నపోయాడని చెప్పారు. అక్కడే గాజులు తీసేశాను. ఆఖరి దానికింకా పెళ్లి కాలేదు కదా. అది మా అమ్మను తీసుకుని తారాపీఠ్ గ్రామానికి షిఫ్ట్ అయిపోయింది. వారానికి ఓట్రెండుసార్లు కలుస్తుంటాం. ఇవాళ ఉదయం కూడా వచ్చింది నన్ను కలవడానికి.’’

మనీషా తపన్ కేసి చూసింది. ‘‘పిల్లలు తపన్ కి కూడా అలవాటుపడ్డారు. అతను కూడా వాళ్లను సొంత పిల్లల్లాగే చూస్తారు.’’ ఒక్క క్షణం ఆగింది. ‘‘మాది అందరి కుటుంబం లాంటిది కాకపోవచ్చు. కాని అందరి జీవితాలు, ఆనందాలు బుగ్గిపాలయ్యే ఈ వల్లకాట్లోనే మా జీవితాలకు అర్థం, పరమార్థం దొరికాయి.’’

వెనకనుంచి ‘‘జైతారా’’ నినాదాలు మిన్నంటుతున్నాయి. వందల మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. దూరంగా సాధువుల ఆవాసాల లోంచి ఓ వేణుగానం లీలగా వినిపిస్తోంది, ఆగి, ఆగి నా పక్కనున్న తాంత్రికులిద్దరూ మౌనంగా కళ్లతో పలకరించుకున్నారు.

‘‘తపన్ అన్నాడు, ‘‘ఈమె పాదాలకేసి చూసినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది తారామాత పాదాలు చూసినంత ఆనందం.’’

మనీషా నవ్వింది. ‘‘అమ్మ దయవల్ల పిల్లలు దొరికారు చాలు. ఓ విషయం మటుకు నిజం. మీ ప్రపంచం స్మశానంలో ఉండే వాళ్లందరూ పిచ్చివాళ్లు, మతి చెడినవాళ్లు అనుకుంటుంది. కాని బయట దొరకనిది, ఇక్కడ మాత్రమే కనిపించేది ఒకటుంది. అన్ని బంధాలూ కాటిమంటల్లో కాలిపోగా, పుటం వేయించుకుని మిగిలిన కల్తీలేని మంచిదనం. ఇది నిజం.’’

మంటలను దాటి శూన్యంలోకి చూస్తూ అంది మనీషా. ‘‘నాకున్నది ఒకటే కోరిక. ఇక్కడే, ఈ తారామాత ఒడిలోనే హాయిగా బూడిదయిపోవాలని. తన చేతుల మీదుగా పంపడానికి తపన్ ఉన్నాడుగా.’’

బసు చెట్టుకి కట్టి వుంచిన మేకను హోమం దగ్గరకు తీసుకొచ్చి, మీదే ఆలస్యం అన్నట్లుగా తపన్ కేసి చూస్తూ నిలబడ్డాడు.

‘‘రండి’’, తపన్ లేస్తూ అన్నాడు మాతో ‘‘ఇక కబుర్లు చాలు. ఈ రాత్రి తారామాతది. అమ్మని ఆవాహన చేద్దాం రాత్రంతా.’’

సాలోచనగా తల ఊపింది మనీషా. ‘‘అవును అమ్మ వచ్చే టైమయింది. ఆకలి, దప్పిక తీర్చే ఏర్పాట్లు చూడాలి. రండి…..’’

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.