కోపం లేని మనుషులపై కనికరం లేని దేశం
-సి. వనజ
హైదరాబాద్ లో వలస శ్రామికుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవంతో మొత్తంగా వలస శ్రామికుల సమస్యలో ఇమిడి ఉన్న కోణాలను చర్చిస్తున్నారు సి. వనజ-
దేశంలో కోవిడ్ కేసులు 340 ఉన్న రోజే తెలంగాణాలో జనం మీద లాక్ డౌన్ బాంబు పడితే మరో రెండు రోజులకు అది దేశమంతా పడింది. ఒక డిమానెటైజేషన్ లాగా, ఒక జిఎస్టీ లాగ ఇది కూడా ముందూ వెనకా చూడకుండా ప్రణాళిక లేకుండా వేసిన, భారత ప్రజల మీద పడిన మరో బాంబు అన్నది ఒక వాస్తవమైతే ఇది ఆ రెండింటికీ మించిన సంక్షోభాన్ని సృష్టించింది. స్తంభించిపోయిన జనజీవితంలో ఒకవైపు మధ్యతరగతి ఇళ్లలో కూర్చుని అంట్లు తోముకోవలసి రావటం మీద, వండుకుని తినడం మీదా విసుక్కుంటూ, మిగిలిపోయిన టైమ్ గడవటానికి రకరకాల ఆటలు ఆడుతూ సోషల్ మీడియాలో సరదా సవాళ్ళు విసురుకుంటూ ఉంటే, మరోవైపు కొన్ని కోట్లమంది ప్రజలు అన్నిటికీ తెగించి వందల కొద్దీ మైళ్ళు నడవటానికి రోడ్డున పడ్డారు. వాళ్ళే వలస కార్మికులన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా ప్రతి నగరంలోనూ అన్నేసి లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని, వాళ్ళే భారత దేశ నిర్మాణాలన్నీ చేస్తున్నారని, దేశంలో పరిశ్రమలను కారుచౌకగా తమ రక్తమాంసాలతో నడిపితే వాటినుంచి తయారయిన చౌక వస్తువుల మోజులో పడి సుఖంగా పౌరుల నుంచి వినియోగదారులుగా మారిపోయే ప్రక్రియలో ఉన్న భారత ప్రజానీకానికే కాదు ప్రభుత్వాలకు కూడా తెలియదని అర్థమయింది. కేవలం నాలుగు గంటల సమయం ఇచ్చి మొత్తం దేశాన్ని మూసేసిన ఏలినవారికి ఇన్ని కోట్లమంది ఇరుక్కుపోతారన్న కనీస అవగాహన మాత్రమే కాదు, వారెలా బతుకుతారన్న అక్కర కూడా లేదు. పని ఇస్తామని తెచ్చిన వాళ్ళు గాలికి వదిలేస్తే, ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేవలం అప్పటిదాకా తమ చేతులను నమ్ముకున్న కార్మికులు ఇప్పుడిక తమ కాళ్ళను నమ్ముకున్న విషాదం దేశమంతా చూసింది.
ఇలా వందల వేల సంఖ్యలో మనుషులు తెగించి నడవటం భారత దేశం విడిపోయినప్పుడు సరిహద్దుల దగ్గర కనపడిందట. అలాంటి దృశ్యాలు మళ్ళీ లాక్ డౌన్ లో దేశమంతా కనిపించాయి. ముందు తెలియకపోవటం, ఊహించకపోవటం ఒకటైతే ఒకసారి సమస్య వచ్చాక దాన్ని పరిష్కరించటానికి ప్రభుత్వాలు ఏం చేసాయన్నది మరో ప్రశ్న. ఏమీ చేయకపోగా అది తమ సమస్య కాదంటే తమ సమస్య కాదని అందరూ దాటెయ్యటానికి ప్రయత్నం చేసారు. అది రాష్ట్రాల సమస్య అని కేంద్రం తప్పించుకుంటే, తమ ఓటర్లు కాని వాళ్ళను తామెందుకు పట్టించుకోవాలని అతిథి రాష్ట్రాలు విసుక్కున్నాయి. వాళ్ళు వచ్చిందే వెనకబడిన రాష్ట్రాల నుంచి కనుక ఒక్కసారి వెనక్కి వచ్చిపడితే మేం మాత్రం ఏ చెయ్యగలం కాబట్టి పంపించొద్దన్న రాష్ట్రాలు మరికొన్ని. మీరెళ్ళిపోతే ఆ తర్వాత మా పరిశ్రమలు, భవన నిర్మాణాలు నడవవు కనుక తిండి లేకపోయినా, ప్రాణం పోయినా మా రాష్ట్రం వదలనివ్వమని హుకుం జారీ చేసిన రాష్ట్రాలు మరికొన్ని. అందరూ కలిసి ఎవరికి పుట్టిన బిడ్దలురా ఈ వలస కూలీలు అన్న పాట మాత్రం కోరస్ గా పాడారు.
దాదాపు 10 వారాల పూర్తి లాక్ డౌన్ లోనూ ఆ తర్వాత సడలించిన లాక్ డౌన్ లోనూ పత్రికల్లో, టీవీల్లో ప్రతిరోజు చర్చకు వచ్చిన విషయం వలస కార్మికులు, వాళ్ళ సమస్యలు, రవాణా పూర్తిగా స్తంభించిన పరిస్థితుల్లో వాళ్ళు ఇంటికి చేరటానికి పడుతున్న పాట్లే. ఇంత సంక్షోభం తలెత్తితే దాదాపు రెండునెలల పాటు దాన్ని పరిష్కరించటానికి ప్రభుత్వాలు ఏవో చిత్తశుద్ధి లేని కంటితుడుపు చర్యలు చేపట్టి, మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయనిధులు తెరిచి, టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లకు పూనుకున్నారు. ప్రాణాలకు తెగించి పిల్లాపాపలతో మూటాముల్లెలతో నడుస్తున్న జనాన్ని చూసి వాళ్ళకేదో ఒరగబెడతారని పిల్లలు తమ కిడ్డీబాంకులనుంచి తీసిచ్చిన డబ్బులను కూడా మింగిన ప్రభుత్వాలు ఆ డబ్బులేం చేసారో చెప్పాల్సిన అవసరం లేదని నిస్సిగ్గుగా చెప్పేసాయి. అది అత్యంత ప్రభుత్వ రహస్యాల్లో భాగమట. సంక్షోభ సమయాల్లో జనం కోసం జనం ఇచ్చిన డబ్బులు మింగెయ్యటానికి సిద్దపడే ప్రభుత్వాల మురికి రహస్యాలు ఏమయి ఉంటాయన్నది ఊహకు అందని విషయం కాదు.
లాక్ డౌన్ అయిపోయేసరికి దేశంలో దాదాపు 16 కోట్ల మంది వలస కార్మికులున్నారన్న ఒక లెక్క వచ్చింది. 135 కోట్లకు పైబడి జనాభా ఉన్న దేశంలో ఇది పది శాతం కంటే కొంచెం ఎక్కువ. కానీ ఈ పదహారు కోట్ల మంది ఇంత వేదన పడుతుంటే మిగిలిన 120 కోట్లమంది ఏం చేశారన్న ప్రశ్న కూడా వేసుకోవాలి. ముందు ఒక సంక్షోభ సమయంలో దేశ పౌరులుగా మన వైఫల్యం గురించి మాట్లాడుకుందాం. మనం ఈ మధ్య కాలంలో “పౌరులుగా” చాలా వాటిలో విఫలమయినట్లుగానే ఇక్కడా విఫలం అయ్యాం. మొత్తం ప్రజలకు జవాబుదారీ తనంతో ఉండాల్సిన ప్రభుత్వాలను కానీ, పని కోసం తెచ్చుకుని సంక్షోభం రాగానే గాలికి వదిలేసిన నిర్మాణ, పారిశ్రామిక రంగాలను గానీ ప్రశ్నించటంలో, వాళ్ళకు బాధ్యత అప్పచెప్పటంలోనూ ఘోరంగా విఫలమయ్యాం.
ప్రభుత్వాలు విఫలమయిన చోట…
కాని ఒక జాతిగా విఫలమయిన చోట వ్యక్తులుగా, చిన్న సమూహాలుగా వలస కార్మికుల కష్టం పంచుకోవటానికి కొన్ని వేల చేతులు ముందుకు వచ్చాయి. ఇంత పెద్ద సంక్షోభంలో కూడా వలస కార్మికుల్లో గానీ, లాక్ డౌన్ తో పని పోయిన అనేక సమూహాల్లో గానీ ఆకలి మరణాలు కేవలం వందల్లోనే ఉన్నాయంటే అది పూర్తిగా పౌర సమాజం వల్లనే అని చెప్పొచ్చు. దేశంలో అనేకచోట్ల స్పందించిన మనుషులు, ఒంటరిగా, బృందాలుగా ఎవరికి తోచిన సహాయాలు వాళ్ళు చేసారు. కొంతమంది ఇళ్లలో వండుకుని ఆకలి ఉన్నదనిపించిన చోటికల్లా వెళ్ళి ఆకలి తీరిస్తే, మరికొందరు కుటుంబాలతో ఉన్న వలస కార్మికులు గౌరవంగా వండుకుని తినడానికి కిరాణా సామాను ఇచ్చారు. అది ఆకలి తీర్చటం అనే ఒక చిన్న సహాయంగా మొదలయి, కొనసాగుతున్న లాక్ డౌన్లతో కొనసాగుతూ పోయి, దేశమంతా అనేక రకాల సహాయ రూపాలు తీసుకుంది.
లాక్ డౌన్ విధించిన మూడో రోజే అలా హైదరాబాద్ లో ఏర్పడిన ఒక పౌరసమాజ బృందంలో భాగంగా వలస కార్మికులతో దాదాపు రెండున్నర నెలలపాటు పని చేసిన కాలంలో కలిగిన అనుభవాలు ఇక్కడ పంచుకుంటున్నాను. దేశంలో మార్చ్ 24న పిడుగు లాగా లాక్ డౌన్ విధిస్తే పౌరసమాజంగా మనం ఏం చెయ్యగలమన్న ఆలోచనతో ఒక వాట్సప్ గ్రూపుగా ఏర్పాటు అయిన మా ముందుకు వచ్చిన తక్షణ సమస్య వలస కార్మికులు. అప్పటికే దేశమంతా నగరాలకు పని కోసం వచ్చి, పని పోయి ఆశ్రయం కూడా పోయి, ఊరు చేరటానికి పిల్లా జెల్లలతో పాటు వందల కిలోమీటర్లు నడవటానికి సిద్దపడిన వలసకార్మికుల సమూహాల వార్తలు టీవీల్లో, పత్రికల్లో కనపడటం మొదలయింది. వాళ్ళు వెళ్లిపోవటానికి ఏ సహాయం చెయ్యని ప్రభుత్వాలు వాళ్ల మీద లాఠీచార్జిలు చెయ్యటం, వాళ్లను ఊరు దాటకుండా దిగ్బంధం చెయ్యటం వంటి దుర్మార్గమైన పనులు చేసాయి. కాని ఉండిపోయిన వాళ్ళు ఎలా బతకాలన్న ప్రశ్నకు మాత్రం ఆ లాఠీల దగ్గర గానీ, లాఠీలనే నమ్ముకుని రాజ్యం చేసే ప్రభుత్వాల దగ్గర గానీ జవాబు లేదు. లాక్ డౌన్ కి దాదాపు వారం ముందే పనులు ఆగిపోవటం, డబ్బులిస్తే వెళ్ళిపోతారన్న దుర్మార్గపు ఆలోచనతో అప్పటికి జరిగిన పనికి కూడా డబ్బులు ఇవ్వకపోవటంతో ఊరుగాని ఊరిలో తమతో తమలాగే పనికి వచ్చిన కొందరు, తమను తెచ్చి ముఖం చాటేసిన కాంట్రాక్టరు తప్ప ఎవరూ తెలియని చోట ఆకలి హాహాకారాలు మొదలయ్యాయి. అప్పుడు ఆ ఆకలి తీర్చటం తక్షణ అంశంగా మారింది. దాంతో అనేకమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు అట్లా పని లేక, ఇంటికి వెళ్ళే దారిలేక హైదరాబాద్ నగరంలోనూ, చుట్టుపక్కలా భవన నిర్మాణ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి దగ్గరికి ఎవరి శక్తి మేరకు వాళ్ళు బియ్యం, పప్పులు, నూనె వంటి డ్రై రేషన్ తీసుకుని వెళ్లటం మొదలుపెట్టారు. ఎక్కడ నీలం పట్టాలు కప్పిన భవన నిర్మాణం కనిపించినా వెళ్ళి సహాయం అవసరమా అని అడగటం, లేదా ఎవరో ఒకరు ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే అక్కడికి వెళ్ళటం చేశాం. అట్లా వెళ్ళినప్పుడు మాకు ఎదురైన అనుభవాలు చెప్పాలి.
భవన నిర్మాణ రంగంలో మాకు ఎక్కువగా కనిపించిన వాళ్ళు చత్తీస్ గడ్ ఆదివాసీ కార్మికులు. అడగటం, అబద్ధం ఆడటం రాని, మానవ జాతికి బాల్యం లాంటి వాళ్లయిన ఈ ఆదివాసీలకు సహాయం కోసం చెయ్యి చాచటం కూడా తెలియదు. పదే పదే పిలిస్తే కానీ వచ్చే వాళ్ళు కాదు. గుచ్చి గుచ్చి అడిగితే కానీ సమస్య చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు కూడా తమకు ఏం సహాయం కావాలో చెప్పేవాళ్ళు కాదు. వాళ్ల కోసం ఎవరూ రాకపోతే అలాగే కడుపులో కాళ్ళు పెట్టుకుని కూచునే వాళ్ళు. కాకపోతే తట్టా బుట్టా సర్దుకుని, పిల్లా జెల్లా వేసుకుని తెగించి నడిచిపోవటానికి తయారయ్యేవాళ్ళు. పదే పదే అడిగితే ‘మమ్మల్ని ఇంటికి పంపండి’ అని మాత్రం అడిగే వాళ్ళు. మొదటి రెండు లాక్ డౌన్ ల కాలంలో అది సాధ్యం కాదు కాబట్టి లాక్ డౌన్ అయ్యేదాక ఉండండి ఎలాగోలా అని నచ్చచెప్పి తినటానికి రేషన్ ఇచ్చి వచ్చేవాళ్ళం. మొదటి లాక్ డౌన్ కాలంలో మేము ఎక్కువగా కలిసింది సీజనల్ వలసకార్మికులు. పని ఉన్న దగ్గర తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుని, అక్కడ పని కాగానే ఇంకో పని జరిగే చోటకో లేదా ఇంటికో వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు ప్రధానంగా భవన నిర్మాణ రంగంలో, వ్యవసాయ రంగంలో కనిపించేవాళ్ళు. ఇందులో చత్తీస్ గడ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలనుంచి వచ్చినవాళ్ళు కుటుంబాలతో ఉంటే, జార్ఖండ్, బీహార్, యూపీ నుంచి వచ్చినవాళ్ళు ఎక్కువగా ఒంటరి కుర్రవాళ్ళు. కుటుంబాలతో ఉన్నవాళ్ళలో ఒక నిర్వేదం లాంటి భావం కనిపించేది. కానీ ఒంటరిగా ఉన్న యువకుల్లో ఒకవైపు పని లేకపోవటం, మరోవైపు అనిశ్చితి వల్ల ఒక అలజడి కనిపించేది. మూడు వారాల్లో ముగుస్తుందనుకున్న లాక్ డౌన్ కొనసాగటం, ఇది ఎంతకాలం కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడటంతో ఆ అలజడి మరింత పెరిగింది.
సహాయ పనులు చెయ్యటం ఒకటయితే సహాయం అవసరం అయిన వాళ్లను గుర్తించటం మరొక సమస్య. దాన్ని అధిగమించటానికి మొదటి లాక్ డౌన్ మొదలయిన వారానికే రైతు స్వరాజ్య వేదిక ఒక సహాయ హెల్ప్ లైన్ ను ప్రారంభించి ఆ ఫోన్ నంబర్ ను పత్రికల్లో ప్రకటించింది. దానికి ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. దాదాపు నలభై మంది వలంటీర్లు ఆ హెల్ప్ లైన్ ద్వారా కాల్స్ తీసుకుని, వెరిఫై చేసుకుని, ఆ వివరాలు రేషన్ ఇచ్చే వ్యక్తులకు, సంస్ఠలకు అందించేవాళ్ళు. మాలో చాలామందిమి వ్యక్తిగతంగా చెయ్యగలిగినంత చేశాక, స్నేహితులు, బంధువుల నుంచి నిధులు సేకరించి సహాయ కార్యక్రమాలు కొనసాగించాల్సి వచ్చింది.
మరి ప్రభుత్వం వలస కార్మికులకు ప్రకటించిన సహాయం?
బాధ్యతారహితంగా లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వాల అసమర్ధతకు చిహ్నంగా రోడ్డున పడ్డ వలస కార్మికుల సమస్య కళ్లముందుకు రావటంతో ప్రభుత్వాలు స్పందించక తప్పలేదు. దేశమంతా వచ్చిన సమస్యకు పరిష్కారం చూపించాల్సిన కేంద్రం భాధ్యతను రాష్ట్రాల మీద తోసేసింది. రాష్ట్రాలు తమ ఓటర్లు కాని వాళ్ళ బాధ్యత తీసుకోవటానికి సిద్దంగా లేవు. ఆ మాట ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అనేసాయి కూడా. కాని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సహాయాలేవో ప్రకటించాయి. తెలంగాణలో అది ప్రతి వలసకార్మికునికి 500 రూపాయలు, 12 కిలోల బియ్యం. దానికోసం జీవో నెంబరు 13 విడుదల చేశారు. దాని ప్రకారం వలసకార్మికుల భాధ్యత ప్రధానంగా వాళ్లను తెచ్చిన కాంట్రాక్ట్రర్లు, కంపెనీలదే. వాళ్ళు పట్టించుకోకపోతే కేసులు పెట్టొచ్చు. వలస కార్మికులుగా వచ్చిన వాళ్లకు కంపెనీలు, యజమానులు ఎవరో తెలియదు. లాక్ డౌన్ తర్వాత వాళ్ళెవరూ కనపడలేదు. తమను తెచ్చిన కాంట్రాక్టరు ఫోన్ నంబర్ మాత్రమే వాళ్లదగ్గర ఉండేది. అది ఇవ్వటానికి కూడా చాలమందికి భయం. వాళ్ళను ఎలాగోలా పట్టుకుని అడిగితే తాము పెద్ద కూలీలమేనని, అంత పెద్ద బాధ్యత తీసుకోవటం తమ వల్ల కాదని చెప్పేసేవాళ్ళు. సంస్థలను పట్టుకుని అడిగితే, కొందరు బాధ్యత కాంట్రాక్టర్ల మీద తోస్తే, తమను పీడించి పీఎం కేర్ ఫండ్ కు, సీఎం ఫండ్ కు నిధులు తీసుకున్నారని, కాబట్టి ఈ కష్టకాలంలో ఇంతకంటే ఏమీ చెయ్యలేమని చెప్పిన వాళ్ళు కొందరు. ప్రభుత్వం ప్రకటించిన సాయం కేవలం కంటితుడుపే. కేవలం హైదరాబాద్ జిహెచ్ ఎంసి పరిధిలోనే దాదాపు 30 లక్షల మంది ఉండవచ్చన్న అంచనా ఉంటే, రెండో లాక్ డౌన్ ముగిసే సమయానికి, ప్రభుత్వ సాయం అందులో 10 శాతానికి కూడా అందలేదు. చాలాసార్లు స్థానికంగా వలసకార్మికులకు బాధ్యత వహించాల్సిన రెవెన్యూ శాఖను సంప్రదిస్తే, మొదట అది కాంట్రాక్టర్ల బాధ్యత కనుక వాళ్ళు ఎవరో చెప్తే కేసులు పెడతామని, లేదా తమ దగ్గర డేటా లేదు కనుక సాయం అందించలేమనీ చెప్పేవాళ్ళు. చాలామందికి ప్రభుత్వ సహాయం ప్రతి కార్మికుడికి 500 రూపాయలు అన్న విషయం కూడా తెలియదు. తెలియదో లేక తెలియనట్లు నటించారో. కొన్ని “కుటుంబాలకు” మాత్రం 500 రూపాయలు, 12 కిలోల బియ్యం ఇచ్చారు. మరికొంతమందికి ఉన్న బియ్యాన్ని ఐదో పదో కిలోలు ఇచ్చేసి డబ్బులు మాత్రం ఇవ్వలేదు. 500 మంది కార్మికులున్న ఫరీద్ బస్తీలో రెండు రోజులు లైన్ లో నిలబడితే కేవలం 100 మందికి 5,10 కిలోల బియ్యం ఇచ్చి అయిపోయిందని చెప్పేసారు. మేము సంబంధిత ఎమ్మార్వోకి ఫోన్ చేస్తే అది వాళ్లను తెచ్చిన కాంట్రాక్టర్ల బాధ్యత అని దాటెయ్యటానికి ప్రయత్నించారు. గట్టిగా అడిగితే తమకు వచ్చిన బియ్యం పంచేసామని, ఇంకేం చెయ్యలేమని చేతులెత్తేసారు.
ఇంకా హాస్యాస్పద విషయం ఏమిటంటే సహాయం ప్రకటించిన ప్రభుత్వం చెయ్యకపోగా, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సహాయం తమకే తెచ్చి ఇవ్వాలని, అది అందించే పని తామే చేస్తామనీ, కాదని సహాయం చేస్తే కేసులు పెడతామనీ జిహెచ్ ఎంసి మేయర్ ప్రకటన కూడా చేసారు. ఒకవైపు వెళ్ళిపోతున్న వలసకార్మికులను పట్టుకొచ్చి పశువులను బందెలదొడ్లో తోలినట్లుగా ఫంక్షన్ హాళ్లలో తోలిన ప్రభుత్వం, సరుకుల పంపిణీలో సామాజిక దూరం పాటించటం లేదన్న సాకు చూపింది. దాంతో సహాయం చెయ్యటానికొచ్చిన చాలమంది కేసులకు భయపడి వెనక్కు వెళ్ళిపోయారు. అందరూ భయపడి పాల పాకెట్లు కూడా సబ్బునీళ్ళలో కడుక్కుంటూ, వాట్సప్పుల్లో, ఫేసుబుక్కుల్లో, టీవీల్లో కాలక్షేపం చేస్తుంటే, ఒంటరిగా స్పందించి మానవత్వంతో బయటకు వచ్చిన అనేకమంది వెనక్కు పోవలసి వచ్చింది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న సామెతకు ఇది చక్కటి నిదర్శనం.
కాని సమూహాలుగా ఉన్న బృందాలు ప్రభుత్వంతో వాదించి, పర్మిషన్లతో సహాయం కొనసాగించాయి. మానెయ్యనైనా మానేస్తాం కానీ, ఎవరికి అవసరం ఉందో అన్న డేటా కూడా లేని మీకు మాత్రం ఇచ్చేది లేదని మొండికేసాం.
లాక్ డౌన్ 2.0
లాక్ డౌన్ 2.0 ప్రకటించేసరికి సమస్య మరింత తీవ్రమయింది. అప్పటివరకు వలసకార్మికులకు పరిమితంగా ఉన్న ఆకలి సమస్య అనేక మంది చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు కూడా విస్తరించింది. రేషన్ కార్డు ఉన్నవాళ్లకు 1500 రూపాయలు, 15 కిలోల చొప్పున బియ్యం ప్రకటించిన ప్రభుత్వం చాలా చోట్ల ఉత్త బియ్యంతో సరిపెట్టింది. రేషన్ కార్డు ఉన్న వాళ్లకు వాళ్ళ బాంక్ ఎకవుంట్ లింక్ అయి ఉండకపోవటం ఒక సమస్య అయితే, ఇంకే మార్గంలోనూ వాళ్లను చేరుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నించకపోవటం మరో సమస్య. ఆ సందర్భంగా చాలా విషయాలు మా ముందుకు వచ్చాయి. నగరాల్లో రోజువారీ కూలి పనులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే స్వరాష్ట్రీయులు కూడా గ్రామాల నుంచి నగరాలకు వలస వచ్చినవాళ్ళే. వాళ్లలో చాలా మంది తమ రేషన్ కార్డును ఊళ్లో ఉండిపోయిన తల్లితండ్రులకు వదిలేసి వచ్చారు. చాలా మందికి అసలు రేషన్ కార్డే లేదు. అప్లై చేసి చాలా కాలమయినా ఇంకా రాలేదు. దాంతో హైదరాబాద్ లో ఉండి పనులు చేసుకుంటున్న తెలంగాణ, ఆంధ్రా తెలుగు వలస కార్మికులకు ఏ ఆధారం లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు కేవలం తిండి, ప్రయాణం సమస్య అయితే వీళ్లకు ఇంటి అద్దె కట్టటం ఒక సమస్య. లాక్ డౌన్ లో ఇంటి అద్దె అడగొద్దు అని ప్రభుత్వాలు ప్రకటించినా అది వాస్తవంలో జరగలేదు. దాంతో మా హెల్ప్ లైన్ కు వీరి నుంచి కూడా సహాయం కోసం ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. అందరికీ ఎంతో కొంత సహాయం అదించటం కోసం పని చేస్తున్న వాళ్ల మీద విపరీతమైన భారం పడింది. అప్పటికే చాలమందికి ఉద్యోగాలు పోవటం కూడా ప్రారంభం అవటంతో నిధుల సేకరణ కూడా కష్టంగా మారింది. అందులోనూ పూర్తిగా వ్యక్తిగతంగా సేకరించి పని చేసేవాళ్లకు మరింత కష్టంగా మారింది. అయినా కూడా చాలామందిమి ఈ పని కొనసాగిస్తూ పోయాం.
ఈ సందర్భంలో మాకు చాలా కష్టంగా అనిపించిన కొన్ని అనుభవాలు చెప్పాలి. లాక్ డౌన్ కొనసాగించటం దాదాపు రోజువారీ చిన్న పనులు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లందరినీ తీవ్రంగా దెబ్బ కొట్టినప్పటికీ కొద్దిగా చదువుకుని 8 వేలకు, 10 వేలకు మాల్స్ లో, షాపుల్లో, చిన్న నర్సింగ్ హోముల్లో పనిచేసేవాళ్లకు సహాయం అడగటం నామోషీగా ఉండేది. ఎక్కువగా ఆటో డ్రైవర్లు, రోజుకూలీ పని చేసుకునే వాళ్లనుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. అవి కూడా స్త్రీల నుంచి వచ్చేవి. ఈ కాల్స్ తీసుకునే వాలంటీర్లుగా పనిచేసేవాళ్ళంతా సమాజం పట్ల కన్సర్న్ ఉన్న యువతీ యువకులు. అడిగిన వాళ్లందరికీ ఇవ్వగలిగితే బాగుండునని వాళ్లకూ, మాకూ ఉండేది. చెయ్యగలిగిన సహాయం తక్కువ కనుక వచ్చిన కాల్స్ అవసరం, తీవ్రత, తొందర నిర్ణయించటానికి వాలంటీర్లు చాలా ప్రశ్నలు అడగాల్సి వచ్చేది. అడిగిన వాళ్ల అవసరం నిర్ణయించాల్సి రావటం అనే ప్రక్రియ చాలామందికి బాధ కలిగించేది. ఒక్కోసారి ఇది సరైనదేనా అన్న నైతిక మీమాంస కలిగేది. వారం వారం జరిగే జూమ్ కాల్స్ లో ఇవన్నీ చర్చకు వచ్చేవి. ఈ సందర్భంగా బోలెడన్ని సమస్యలు బయటికి వచ్చేవి. తాగుడు అలవాటు ఉన్న ఇళ్ళలో మగవాళ్ళకు అది దొరకక వచ్చే మానసిక సమస్యలు, ఎప్పటికీ అందరూ చిన్న ఇళ్ళలోనే తప్పనిసరిగా ఉండాల్సిరావటంతో పెరిగిన హింస, ఇవన్నీ మమ్మల్ని తాకుతుండేవి. మేము వాళ్లకోసం రేషన్ తీసుకుపోయినప్పుడు కూడా ఈ కథలన్నీ వినేవాళ్లం. మేము ఇవ్వగలిగేది కేవలం తిండిగింజలు. అప్పుడప్పుడూ పసిపిల్లలు ఉన్నవాళ్లకు పాలకో, మందులకో ఏదో కాసిన్ని డబ్బులు ఇవ్వగలిగేవాళ్ళం. కానీ దానికి మించిన అవసరాలు చాలా ఉండేవి వాళ్లకు.
ఒంటరి మహిళలు – పిల్లలు
ఇక ఒంటరి మహిళల కష్టాలు చెప్పనలవి కాదు. తెలంగాణలో ఒంటరి మహిళల సంఖ్య చాలా ఎక్కువన్నది తెలిసిందే. అందులో చాలామంది ఇళ్లలో పనిచేసుకునేవాళ్ళు లేదా చిన్నచిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఇళ్ళలో పనులు చాలమందికి మార్చి మొదటి వారం నుంచే ఆగిపోయాయి. ఇతర పనులు చేసుకునే వాళ్ళది కూడా అదే పరిస్థితి. పిల్లలతో వాళ్ల ఇబ్బందులు దారుణంగా ఉండేవి. కాల్ చెయ్యటానికి ఫోన్ లో చార్జింగ్ లేక వాళ్ళని వీళ్ళని అడిగి ఫోన్ చేసేవాళ్ళు కొందరు. మేము రేషన్ తో వెళ్ళినప్పుడు ఆ ఇంకెవరికో ఫోన్ చేస్తే వాళ్ళు సరిగా రెస్పాండ్ కాక ఇబ్బందయ్యేది. ఇక ఏక్ మినార్ నుంచి కిందకు ఆసిఫ్ నగర్ వైపు వెళ్ళినప్పుడు మాకు చాలా మంది స్త్రీలు పిల్లలను పట్టుకుని రోడ్ల మీద అడుక్కుంటూ కనిపించేవారు. వాళ్లను ఎవరిని పలకరించినా ఒకటే కథ. పిల్లలతో సహా వదిలేసిన భర్తలు. వాళ్ళకు ఇలా ఫోన్ చేసి సహాయం అడగొచ్చన్న విషయం తెలిసేది కాదు. దాదాపు అందరికి నలుగురు లేదా ఐదుగురు పిల్లలు. ఇలా ఎక్కువమంది పిల్లలు ఉండటం అన్నది దాదాపు అన్నిచోట్ల చూసాం. కులంతో, మతంతో సంబంధం లేకుండా పేదరికం ఉన్న అన్నిచోట్లా ఎక్కువ మంది పిల్లలు ఉండటం కనిపించింది. పిల్లలు ఆస్తి అన్న భావన నుంచి ఇంకా చాలామంది బయటపడకపోవటం ఒకటైతే, మగపిల్లల కోసం కంటూ పోవటం మరో కారణం అని మాకర్థమయింది. ఇది స్థానికుల్లోనూ, వలస కార్మికుల్లోనూ కూడా కనిపించింది.
అడుక్కునే వాళ్ళుగా…
పని చేసుకుని గౌరవంగా బతికే చాలామందిని అడుక్కునే వాళ్ళుగా మార్చిన కాలం కూడా ఇదే. ముఖ్యంగా ఏప్రిల్ చివరికి వచ్చేసరికి ఇది బాగా కనిపించింది. ముఖ్యంగా పేదలు నివసించే బస్తీల దగ్గరకు వెళ్ళినప్పుడు మాకు చాల సార్లు కనిపించిన దృశ్యం ఏంటంటే కొంత మంది ఒక మోస్తరు బట్టలు వేసుకున్న మగవాళ్ళు కూడా ఒక చేతిసంచి పట్టుకుని రోడ్డుమీద తిరుగుతూ ఉండేవారు. మధ్యాహ్నం పూట చాలమంది ఇళ్ళలో ఏదో ఒకటి వండుకుని పాకెట్లు చేసుకుని వచ్చి పంచుతుండేవారు. వాటి కోసం వచ్చి ఎదురు చూస్తూ ఉండేవారు. అదే సమయానికి మేము అక్కడ ఎవరికయినా సరుకులు ఇవ్వటానికి పోతే ఆశగా వచ్చి నిలబడేవారు. వాళ్ళందరికీ ఇవ్వలేక, లేవని చెప్పలేక మాకు కడుపులో మెలిపెట్టినట్లుగా అయ్యేది. అందరికీ హెల్ప్ లైన్ నుంబర్ ఇచ్చి ఫోన్ చెయ్యండి తప్పకుండా వచ్చి ఇస్తాం అని చెప్పేవాళ్లం. అలా ఒకే ప్రాంతానికి మళ్ళీ మళ్ళీ చాలసార్లు వెళ్ళేవాళ్ళం. అలా అడిగితే కూడా ఇవ్వలేకపోయిన వాళ్ళ మొహాలు మమ్మల్ని వెంటాడేవి.
లాక్ డౌన్ 3.0 – శ్రామిక్ రైళ్ల ప్రహసనం
లాక్ డౌన్ ను మే 4 నుంచి 17 దాకా కొనసాగింపుతో పాటు అనేక చోట్ల చిక్కుకున్న వలస కార్మికులను ఇళ్లకు పంపటానికి శ్రామిక్ రైళ్లను నడుపుతారన్న వార్త కూడా వచ్చింది. అయితే దానికి దగ్గరున్న పోలీసు స్టేషన్ కు వెళ్ళి నమోదు చేయించుకోవాలి. అలా నమోదు చేసుకుని ఎదురుచూస్తూ ఉంటే ఏ రోజు వాళ్ళకు అవకాశం వస్తే ఆ రోజు రెండు గంటల ముందు మాత్రమే ఫోన్ చేసి పిలుస్తారు. అప్పటికే రెండు నెలలుగా ఎవరికీ కాని వాళ్ళుగా బిక్కు బిక్కుమంటూ ఉన్న వలసకార్మికులు పోలీసుస్టేషన్లకు వెల్లువెత్తారు. ఆలోచన లేకుండా ప్రకటనలు చేసే ప్రభుత్వాలు ఎప్పుడైనా తమ అసమర్థతను నిరూపించుకోవటానికి వాడే ఆయుధం హింస. ఎతమంది ఉంటే అంతమంది వచ్చి నమోదు చేయించుకోవాలని చెప్పిన ప్రభుత్వాలు పిల్లా పాపలతో వచ్చి గంటలు గంటలు తిండి కూడా లేకుండా ఎండలో నిలబడిన వాళ్లకు లాఠీచార్జీలు రుచి చూపించాయి. ఎందుకు రావాలని చెప్పారో, ఎందుకు నమోదు చెయ్యకుండా లాఠీ చార్జ్ చేస్తున్నారో తెలియని అయోమయం వాళ్ళది. అలా అని వాళ్ళంత వాళ్ళు వెళ్ళిపోదామంటే రైళ్ళు లేని, బస్సులు లేని పరిస్థితి.
అన్నట్లు దేశంలో తొలి శ్రామిక రైలు హైదరాబాద్ నుంచే మే 2న వెళ్ళింది. అయితే అతిథులైన కార్మికులను సాదరంగా వెనక్కి పంపటం కోసం కాదు. కంది ఐఐటి ప్రాంగంణంలో భవన నిర్మాణాలు చేపడుతున్న ఎల్ అండ్ టి కంపెనీ కింద దాదాపు 2000 మంది వలస కార్మికులు పని చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళు బిహార్, జార్ఖండ్, యూపీలకు చెందినవాళ్ళు. వాళ్ళకు మార్చ్ 25 నుంచి పని లేదు. అప్పటికే చేసిన పనికి కూడా డబ్బులు లేవు. లాక్ డౌన్ 3లో భవన నిర్మాణ రంగం పని చెయ్యొచ్చని చెప్పటంతో అప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 ను ఖాతరు చెయ్యని కంపెనీ, తిరిగి వాళ్లందరినీ పనిలో చేరమని చెప్పింది. దాంతో తమకు ఇవ్వవలసిన డబ్బులు ఇస్తే గాని పనిలో చేరమని అంటూ కార్మికులు ధర్నా చేసారు. బహుశా దేశం మొత్తంలో వలసకార్మికులు తిరగబడిన ఏకైక సంఘటన ఇదే కావొచ్చు. అన్నట్లు జీవోలను పట్టించుకోని కంపెనీ అటు పీఎం కేర్ కి, ఇటు సీఎం రిలీఫ్ కి బాగానే ముట్టచెప్పిందట. ఇంకేం, కంపెనీని రక్షించటానికి రాత్రికిరాత్రి శ్రామిక్ రైలు ఏర్పాటుచేసి కార్మికులను రహస్యంగా తెల్లవారు జామున పంపించేసారు. ప్రతి చిన్న పనికి పెద్ద డబ్బా కొట్టుకునే ప్రభుత్వం ఈ పని అత్యంత రహస్యంగా చెయ్యటమే కాక దాని గురించి ఒక ప్రకటన కూడా చెయ్యలేదు.
ఆ తర్వాత కొన్నిరోజులకు శ్రామిక్ రైళ్ళు మొదలయ్యాయి. కాని అదొక పెద్ద గందరగోళం. ఏ రోజు ఎన్ని ట్రైన్లు ఉంటాయో, ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ చెప్పరు. రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ముందు చిట్స్ తీసి వివిధ పోలీసు డివిజన్లకు వాళ్ల కోటా పంపుతారు. అప్పుడిక పోలీసులు ఆదరాబాదరాగా వాళ్లదగ్గర ఉన్న లిస్టుల్లోంచి కొంతమందికి ఫోన్లు చేసి కేవలం గంట సమయం ఇచ్చి ఒక ప్రాంతానికి రప్పించి అక్కడి నుంచి బస్సుల్లో ఎక్కించి రైల్వే స్టేషన్ కి తెస్తారు. నమోదు చేసుకున్న వాళ్ల సంఖ్య లక్షల్లో ఉంటే రోజుకు 3-4 రైళ్ళు వేసి 4,5 వేల మందిని మాత్రం పంపేవారు. ఆ పద్ధతిలో అందరినీ పంపటానికి కనీసం ఏడాది పడుతుంది. ఎందుకు సరిపోయినన్ని రైళ్ళు వెయ్యరు అంటే దానికి వంద కారణాలు. ఒకటి ఈ రైళ్ళకయ్యే ఖర్చు ఎవరు పెట్టుకోవాలన్నది. నిజానికి కేంద్రం పరిధిలోకి వచ్చే విషయం ఇది. కానీ మీరూ మీరూ చూసుకోండి అని చేతులు దులుపుకుంది కేంద్రం మిగిలిన అన్ని విషయాల్లో దులుపుకున్నట్లుగానే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను అడిగితే వలస కార్మికుల హోమ్ స్టేట్ వాళ్ల కార్మికులను పంపటానికి అనుమతి ఇవ్వటం లేదు కాబట్టి మేము ఏమీ చెయ్యలేము అనేవాళ్ళు. నిజంగానే యూపీ లాంటి రాష్ట్రాలు అనుమతి ఇవ్వకపోగా, బస్సుల్లో వచ్చిన వాళ్ళను కూడా నాలుగు రోజులపాటు సరిహద్దు దగ్గర ఆపేసి తమ రాష్ట్ర ప్రజలకు తమ ఇంటికి వెళ్ళే హక్కు లేదని వెనక్కి పంపించేసింది. కర్నాటక వంటి రాష్ట్రాలు నిర్మాణ రంగం లాబీ అడిగిందని అసలు రైళ్ళే వెయ్యలేదు. అయితే అది అన్నిసార్లు నిజం కాదు. చత్తీస్ గడ్ వంటి కొన్ని రాష్ట్రాలు తమ కార్మికులని ఆహ్వానించటానికి సిద్ధపడ్డాయి. తమ రాష్ట్రానికి ఏ మార్గంలో వచ్చినా, వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకుని, పరీక్షలు చేసి వాళ్ల వాళ్ల ఊళ్లకు పంపటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. భవన నిర్మాణంలో, వ్యవసాయ రంగంలో చత్తీస్ గడ్ వాళ్ళే అధికం.
ఈ శ్రామిక్ రైళ్ళ గందరగోళంలో ఇళ్లకు వెళ్ళిపోవాలనుకున్న వలస కార్మికులకు ఎప్పటికీ పిలుపురాక మరొకసారి కాళ్ళను నమ్ముకుని తెగించి ఇల్లు చేరే ఆలోచన మొదలయింది. అప్పటికి కొంతకాలంగా తగ్గిన నడిచి వెళ్ళే వలస కూలీల దృశ్యాలు మళ్ళీ మొదలయ్యాయి. మేము అప్పటిదాకా పనిచేస్తూ ఉన్న వలస కార్మికుల బృందాలు మమ్మల్ని పదే పదే ఇదే విషయం అడిగేవారు. చాలామంది ఊరు బయటకు 30-40 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ రవాణాకోసం వచ్చిన ట్రక్కుల్లో పిల్లా పాపలతోసహా ఇరుక్కుని మండే ఎండల్లో మాడుతూ వెళ్ళిపోయేవాళ్ళు. నాకు తెలిసిన ఒక బృందం కూడా అట్లానే వెళ్ళిపోవటానికి తయారయింది. అయితే అందులో ఒక జంటకు అప్పుడే ఆ భవన నిర్మాణ స్థలంలోనే పుట్టిన వారం రోజుల పాపతో పాటు, ఇంకా ఐదారుగురు చిన్న పిల్లలు ఉన్నారు. అన్నట్లు అదొక విషాదం. ఇలా వచ్చిన వలస కార్మికుల కుటుంబాల స్త్రీలకు ప్రసవ సమయంలో కానీ, పుట్టిన పిల్లల పోషణకు గానీ మన రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ సహాయం అందదు. వాళ్ళు ప్రసవానికి ప్రభుత్వ ఆస్పత్రికి పోతే ఆషా వర్కర్ నుంచి కార్డు లేదని చేర్చుకోరు. ఆ పిల్లలదగ్గరకు ఏ అంగన్ వాడీ వర్కర్లు కూడా రారు. వాళ్ళకు ఐదేళ్లయినా పదేళ్లయినా స్థానికంగా ఏ గుర్తింపు ఉండదు కనుక స్థానిక ప్రభుత్వాల నుంచి అందే ఏ సహాయం అందదు. ఒక రకంగా వాళ్ళు లెక్కల్లో లేని, కనిపించని మనుషులు. కాబట్టి పిల్లలు పుడితే అక్కడే అలాగే పుట్టాలి. మాకు తెలిసిన బృందం అలా పిల్లలతో పాటు నడిచి, ట్రక్కుల్లో పోవడానికి సిద్ధపడితే చూడలేక, వాళ్ళను సరియైన పర్మిషన్లతో సురక్షితంగా పంపుదామన్న ప్రయత్నంలో ఆపి, పర్మిషన్ల కోసం ప్రయత్నిస్తే అది జరగలేదు. పొలీసులు వందసార్లు ఆ పేపర్, ఈ పేపర్ అని తిప్పి రెండు రోజుల తర్వాత పర్మిషన్ నిరాకరించారు. అప్పటికే అసహనంగా ఉన్న వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోవాలని సామాన్లు తీసుకుని నడవటం మొదలుపెట్టారు. వాళ్లతోపాటు పసిబిడ్ద తల్లిని, మిగిలిన పిల్లలను తీసుకుని వాళ్ళు ట్రక్కు ఎక్కడానికి వెళ్తున్న మేడ్చల్ కి వాళ్లతో పాటు వెళ్ళాను. టాంక్ బండ్, సికిందరాబాద్ స్టేషన్ నుంచి మొదలుకొని మేడ్చల్ దాక దాదాపు 30 కిలోమీటర్ల దూరం రోడ్ల మీద బారులు బారులుగా నడిచిపోతున్న కార్మికులే. అందులో కొందరు కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలనుంచి వచ్చి హైదరాబాద్ ఒక చివరన దిగి ఇంకో కొసన ఇంకో ప్రయాణ మార్గం కోసం వస్తున్నవాళ్ళు. ఈ దారంతా 30 కిలోమీటర్లు అయినా, 50 కిలోమీటర్లు అయినా తాగటానికి నీళ్ళు కానీ, తినడానికి తిండి కానీ లేని పరిస్థితి. మామూలుగా ఎండాకాలంలో పెట్టే చలివేంద్రాలు కూడా సామాజిక దూరం పేరుతో ఎవరూ పెట్టలేదు. అది చూసి మా గ్రూపులో అలర్ట్ చెయ్యగానే అందులో కొందరు, అయితే మన సహాయం అక్కడ ఉందని గుర్తించారు. దాంతో మే 9 నుంచి మాలో కొందరం నీళ్ళు, బిస్కట్లు, బ్రెడ్డు, పండ్లు తీసుకుని మేడ్చల్ కు వెళ్లటం ప్రారంభించాం. కాని మేము ఎంత తీసుకెళ్ళినా 15-20 నిమిషాల్లో ఖాళీ అయిపోయేవి, అప్పటికే ఆ ప్రాంతంలో ఇతరులు కూడా ఇలా బ్రెడ్లు, నీళ్ళు పంచుతున్నారు. కాని వెళ్తున్నవాళ్ల సంఖ్యకు అవి సరిపోని స్థితి. చెక్ పోస్టు దగ్గర కనుక్కుంటే రోజుకు 15,000 మంది నగరం నుంచి వెళ్తున్నారని చెప్పారు. ఆదిలాబాద్ దగ్గర రాష్ట్ర సరిహద్దులో కనుక్కుంటే అక్కడ కూడా అదే చెప్పారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న మిత్రుల సహకారంతో మేడ్చల్ మునిసిపాలిటీతో, జిల్లా యంత్రాంగంతో సంప్రదించి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ ఆర్) దగ్గర టెంట్లు వేసి ఫుడ్ కాంప్ పెట్టాం.
మానవత్వం పరిమళించిన ఓఆర్ ఆర్
అలా ఫుడ్ కాంప్ ఒక స్థలం అంటూ ఏర్పడ్డ తర్వాత దానికి ఆహారం పంపమని, వాలంటీర్లుగా రమ్మని సోషల్ మీడియాలో అభ్యర్ధన చేయటంతో దానికి విశేషమైన స్పందన వచ్చింది. అక్కడకు వచ్చిన ఒక వలంటీర్ చెప్పినట్లు అప్పటికి నెలన్నరగా నానాకష్టాలు పడుతున్న వలసకార్మికులను టీవీలో చూస్తూ, వాళ్ల గురించి పత్రికల్లో చదువుతూ ఏమీ చెయ్యలేక నిస్సహాయతకు, అపరాధ భావనకు గురయిన వాళ్లకు అది ఒక అవకాశంగా మారింది. మేడ్చల్ కాంప్ ఎంత పాపులర్ అయిందంటే కేవలం అనేకమంది తమ ఇళ్ళలో వండుకుని తెచ్చిన ఆహారంతో, లేదా కొని తెచ్చిన ఇతర ఆహారాలతో రోజుకు సుమారు 15 వేల మందికి ఆహారం అదించటంతో పాటు వాళ్ళకు వెళ్ళేదారిలో తినటానికి పనికొచ్చే ఆహారం కూడ మూటలు కట్టి ఇవ్వగలిగే వాళ్లం. ఈ పని మే 11 నుంచి మే 28 దాకా పూర్తిగా వ్యక్తుల చొరవతో జరిగింది. అక్కడ చాలా అద్భుతంగా అనిపించిన విషయం ఏమిటంటే అక్కడికి వచ్చిన ఎవరూ కూడా తాము ఏదో దాన కార్యక్రమం చేస్తున్నట్లు భావించలేదు. తమ దగ్గర ఉన్నదేదో ఇవ్వటం కాక, వాళ్లకు ఏం కావాలో తెలుసుకుని ఇవ్వటం, ఏం తింటారో తెలుసుకుని తేవటం చేసేవాళ్ళు. రకరకాల అన్నాలు, రొట్టెలు, కూరలు, మజ్జిగలు, పండ్లు, పండ్ల రసాలు, బన్నులు, చల్లటి మంచినీళ్ళు ఇలా బల్లల మీద ఖాళీ అవుతూ ఉంటే అలా మళ్ళీ మళ్ళీ నిండుతూ ఉండేవి, వెళ్ళేదారిలో తినటానికి ఏమి ఉపయోగం అని ఆలోచించి నానపెట్టిన సెనగలు, బెల్లం లాంటివి కూడా తెచ్చేవాళ్ళు. కార్పొరేట్ కంపెనీలలో ఉన్న స్నేహితులు కూడా తమ కంపెనీలనుంచి స్పాన్సర్ చేయించి భోజనాలు పంపారు. ముఖ్యంగా అది రంజాన్ కాలం కావటంతో ఇక్కడ కాంప్ గురించి తెలిసిన ముస్లిం సోదరులు జకాత్ కింద పెద్ద ఎత్తున ఆహారాన్ని, పండ్లను, పండ్ల రసాలను పంపారు. దాదాపు అందరూ అది ఒక బాధ్యత లాగ చేసారు. అక్కడ మేము పెట్టిన బానర్లు రెండే, అదీ ఎవరి పేరూ లేకుండా. “ఆహారం, నీళ్ళు అందరి హక్కు”. “వాళ్లను గౌరవంగా, సురక్షితంగా ఇళ్లకు పంపండి”.
గౌరవంగా, సురక్షితంగా పంపుదాం
ఒకసారి తిండి, నీళ్ళ సమస్య పరిష్కారమయ్యాక మా దృష్టి వలస కార్మికుల సురక్షిత ప్రయాణం వైపు మళ్ళించాం. దాదాపు అక్కడ కాంప్ మొదలయిన నాటి నుంచే వచ్చినవాళ్లతో మాట్లాడుతుంటే మాకు అర్థమయిందేంటంటే వాళ్ల అవసరాన్ని చూసి లారీలవాళ్ళు విపరీతంగా డిమాండ్ చేస్తున్నారని. మేము కలగచేసుకుని ఆ రేట్లు తగ్గించటానికి ప్రయత్నం చేశాం. డబ్బులు లేక నడిచివెళ్లటానికి ప్రయత్నం చేసేవాళ్లకు మేము చందాలు వేసుకుని పంపించటానికి ప్రయత్నం చేశాం. మా దగ్గరే భోజనం చేసి, దారిలో తినటానికి ఆహారం తీసుకున్న (ఎందుకంటే డబ్బులు ఉన్నా, కొనుక్కుందామనుకున్నా, లాక్ డౌన్ వల్ల ఎక్కడా తిండి దొరకని రోజులు అవి) లారీ డ్రైవర్లు కూడా మేం నచ్చచెప్తే వినేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ లో ఇలాగే వలస కార్మికులతో వెళ్తున్న ఒక లారీకి, తెలంగాణా సరిహద్దులో ఒక లారీకి ప్రమాదం జరగటంతో అది సురక్షితం కాదని భావించాం. అప్పటికే ఫుడ్ కాంప్ కి అవసరమైన ఆహారానికి మించి సహాయానికి చాలామంది ముందుకు రావటంతో వాటిని వలస కార్మికుల ప్రయాణాలకు మళ్ళించాం. అప్పటికే ఒకటి రెండు సంస్థలు వాళ్ల ప్రయాణాలకు బస్సులు స్పాన్సర్ చేస్తామని ముందుకు రావటం, ఫుడ్ కాంప్ కి వచ్చిన విరాళాలతో మేము బస్సులు ఏర్పాటు చెయ్యటంతోపాటు చాలమంది వ్యక్తులు తామే స్పాన్సర్ చెయ్యటానికి, మరికొందరు కేవలం బస్సుల కోసమే విరాళాలు సేకరించి బస్సులు వెయ్యటానికి కూడా ముందుకు వచ్చారు. ఒకటి రెండు ఘర్షణల తర్వాత స్థానిక పోలీసులతో కూడా సమన్వయం కుదిరి వాళ్ళు మాకు బస్సులకు పర్మిషన్లు తేలిగ్గా సంపాదించిపెట్టటంతో ఆ కాంప్ దగ్గర నుంచి దాదాపు 150 బస్సులు చత్తీస్ గడ్, ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, యూపీ వంటి రాష్ట్రాలకు పంపగలిగాం. ఇవి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న శ్రామిక్ రైళ్ళకు అదనం. ఆ బస్సులు వేసి వలస కార్మికులను ఇళ్ళకు పంపటం అనేది ఫుడ్ కాంప్ తో మొదలు పెట్టిన కొందరు, వెళ్ళిపోయే వలస కార్మికుల సంఖ్య బాగా తగ్గిపోయి కాంప్ తీసేసిన తర్వాత కూడా దాదాపు జూన్ నెల ఆఖరి వరకూ కొనసాగించారు.
అభిమానం కల్ల మనుషులు
లాక్ డౌన్ లో వలస కార్మికులతో పని చెయ్యటం మొదలయినప్పటి నుంచి గమనిస్తూ ఉన్న విషయం అయినా మేడ్చల్ లో బాగా గమనింపుకు వచ్చిన విషయం వలస కార్మికులు చాల అభిమానవంతులు అన్నది. ముఖ్యంగా ఆదివాసీ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లలో ఇది కనిపించింది. మేము కేవలం కొన్ని బన్నులు పట్టుకుని వెళ్ళి హైవే మీద కనపడినవాళ్లకు ఇస్తున్నప్పుడు కూడా గమనించింది ఏమిటంటే వాళ్లలో చాలమందికి లాక్కోవడం, అవసరం కన్న ఎక్కువ తీసుకోవటం, కూడబెట్టటం అన్న భావాలు లేవు. ఒక బన్ను తీసుకున్న వాళ్లకు రెండో బన్ను ఇవ్వబోతే, “మై లియా, కిసీ ఔర్ కో దేదో” (నేను తీసుకున్నా, ఇంకెవరికన్నా ఇవ్వండి) అనేవాళ్ళు. రెండో మంచినీళ్ల పాకెట్ కోసమో, ఎప్పుడైనా తీసుకుని వెళ్ళటానికి మంచినీళ్ళ బాటిల్ దొరుకుతుందా అనో తప్ప వాళ్ళంతట వాళ్ళు మమ్మల్ని ఇది కావాలని అడిగింది లేదు. కాంప్ దగ్గర సరిపోయిననంత ఆహారం ఉంది, వద్దు అంటే, సహాయం చేద్దామని వచ్చిన వాళ్ళే వాళ్ళకు చెప్పులు అవసరమనో, తువ్వాళ్ళు అవసరమనో గుర్తించి తెచ్చారు కాని వాళ్ళు ఎప్పుడైనా అడిగితే ఇంటికి పంపటానికి ఏమైనా చెయ్యగలరా అని తప్ప మరొకటి అడగలేదు. అది కూడా మనం అడిగితేనే. తింటున్నప్పుడు కానీ, బస్సుల్లో ఎక్కుతున్నప్పుడు కానీ ఒక తోపులాట లేదు, ఒక గొడవ లేదు. రోజూ 10-15 వేలమంది వచ్చినా ఫుడ్ కాంప్ అంత ప్రశాంతంగా జరిగింది అంటే ఆ క్రెడిట్ వాళ్లదే. ఇదే లాక్ డౌన్ సమయంలో స్థానిక బస్తీలకు వెళ్ళినప్పుడు మాకు కలిగిన అనుభవాలకు ఇది పూర్తిగా భిన్నం. నిజానికి వలస కార్మికులెవరూ కూడా తమ పట్ల ఇంత నిర్దయగా వ్యవహరించిన ప్రభుత్వాల పట్ల కానీ, కంపెనీ యజమానుల పట్ల గానీ ఎప్పుడూ ఆగ్రహంగా కనిపించలేదు. అలా అని దుఃఖం కూడా కనిపించలేదు. టీవీ విజువల్స్ లో చూస్తే వాళ్ల కష్టానికి చలించిపోయిన బైటివాళ్ళ దుంఖం కనిపిస్తుంది కాని వాళ్లలో అలాంటి బేలతనం కనిపించదు. అక్కడ కూడా మాకు అదే కనిపించింది. ‘ఒక కష్టం వచ్చింది దీన్ని మనం ఎదుర్కోవాలి’ అన్న సంకల్పం, ఒక నిర్వికారత. నడిచి నడిచి వచ్చి కుటుంబాలన్నీ కలిసి గుంపులుగా కూర్చుండే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ లోకమే. లేస్తే సామాను వేసుకుని వెళ్లిపోవటమే. అలాంటి స్థితప్రజ్ఞత, సంకల్ప బలం వాళ్లకు బహుశా తమ మీద తాము తప్ప ఇంకెవరి మీదా ఆధారపడకపోవటం అనే జీవనవిధానం వల్ల వచ్చిందా? ఏమో?
తిరిగొస్తారా?
లక్షలాదిగా ఊళ్ళు ఖాళీ చేసిపోతున్న వలస కార్మికులను మీడియాలో చూసిన చాలమందికి వచ్చిన సందేహం వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా లేదా అని. ఇప్పుడు చాలామందికి అర్ధం అయింది. ఈ దేశం చౌకగా దొరికే వాళ్ళ శ్రమ మీదనే బతుకుతోందని. కాబట్టి ఇటు చౌక వస్తువులకు వినియోగదారులుగా మారిన మధ్యతరగతిని, అటు నోరులేని కార్మికుల చెమట మీద సంపద పోగేసుకుంటున్న పారిశ్రామికవేత్తలను సమానంగా కలవరపెడుతున్న ప్రశ్న ఇది. మేడ్చల్ ఫుడ్ కాంప్ దగ్గరకు కంపెనీల నిధులతో నడిచే కొన్ని స్వచ్చంద సంస్థలు వచ్చి వెళ్ళిపోతున్న కార్మికులకు నచ్చచెప్పి వెనక్కు తీసుకువెళ్ళటానికి కొన్ని విఫలప్రయత్నాలు కూడా చేసాయి. రెండు నెలల పాటు తమ మధ్య ఉండి నానా యాతనలు పడుతున్నప్పుడు, వైరస్ వచ్చిపడితే ఎట్లా అని మానసికంగా నలిగిపోతున్నప్పుడు పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు వచ్చి మీరు ఇంటికి వెళ్తే అక్కడ మాత్రం ఏముంది అని నచ్చచెపితే వింటారనుకుంటే అది భ్రమ. బహుశా వాళ్లకు ఇంటి దగ్గర బతుకు తెరువు లేకపోవచ్చు. నిజానికి లేదు కూడా. వెళ్ళిపోయిన చాలా మంది అదే విషయం చెప్తున్నారు కూడా. కాని వాళ్ళిక్కడ చావుకు భయపడి వెళ్ళిపోయారు. ప్రసవం జరిగితేనే ఆషా కార్డు లేదని హాస్పిటల్ లో చేర్చుకోని చోట, రేపు నిజంగా వైరస్ వస్తే ఎవరు పట్టించుకుంటారన్న భయం వాళ్లది. ఈ రెండు నెలల్లో ప్రభుత్వాలు ఆ విషయం స్పష్టం చేసాయి కూడా. మీరు మా వాళ్ళు కాదు అని. ఏమైనా జరిగితే శవం కూడా ఇల్లు చేరదన్న విషయం కూడా తెలిసిపోయింది వాళ్లకి. అందులోనూ ఇక్కడ నగరాల్లో ఉన్నట్లుగా వాళ్ల గ్రామాల్లో ఈ వైరస్ లేదు. ఉన్నా కూడా నగరాల్లో లాగా తీవ్రత కాని వ్యాప్తి కాని లేదు. కాబట్టి ఎవరూ వెనక్కి తిరిగి నగరంలోకి రావటానికి ఇష్టపడలేదు. బహుశా ఈ కాలెండర్ సంవత్సరంలో వాళ్ళెవరూ వెనక్కి తిరిగి రారు. అంతా బాగుంటే మళ్ళీ 2021లోనే వస్తాం అని మాకు చెప్పిన వాళ్లే ఎక్కువ. బహుశా కష్ట కాలంలో ఏ అండా అందని వాళ్ళు తిరిగి వచ్చే సాహసం కూడా చెయ్యరేమో.
చెయ్యాల్సిందంతా చేసి వలస కార్మికుల వల్లనే దేశమంతా వైరస్ వ్యాప్తి చెందిందన్న ఒక నింద ఇవ్వాళ వలస కార్మికుల మీద వేస్తున్నారు. అదే నిజమైతే దానికి పూర్తిగా ప్రభుత్వాలదే భాధ్యత. నిజానికి లాక్ డౌన్ ప్రకటించే నాటికి ఇన్ఫెక్షన్లు చాల ప్రాథమికదశలో ఉన్నాయి. ఈ వర్గాలేవీ వైరస్ కి దగ్గరలో కూడా లేరు. అప్పటికి ఉన్న ఇన్ఫెక్షన్లు కేవలం 500. వేరే కొన్ని దేశాలు చేసినట్లుగా వారం రోజులు వ్యవధి ఇచ్చి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయే అవకాశం ఇచ్చి ఉంటే ఇంత పెద్ద మానవ విషాదాన్ని దేశం చూసి ఉండేది కాదు. ఇంతమంది వలస కార్మికులు ఉన్నారన్న విషయం కూడా తెలియని అజ్ఞాన ప్రభుత్వాలు మనకున్నాయి. కనీసం తెలిసాక అయినా వాళ్ళందరికీ ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కల్పించి ఉండాల్సింది. 500 నాడు దేశాన్ని మూసేసి ఇన్ఫెక్షన్లు లక్షకు చేరువలో ఉన్నప్పుడు శ్రామిక్ రైళ్ళు నడిపిన ఘనత మన ప్రభుత్వాలది, ఆ రైళ్లేవో వెంటనే నడిపి ఉంటే వాళ్ళు టికెట్లు కొనుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. శ్రామిక్ రైళ్లలో వెళ్ళినవాళ్ళకన్నా ట్రక్కుల్లో, ఇతర మార్గాల్లో, టికెట్ డబ్బుకు రెండు మూడు రెట్లు ఎక్కువ చెల్లించి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య ఎన్నో రెట్లు. ఇంతా చేసి చాలా రాష్ట్రాలు శ్రామిక్ రైళ్ళలో కూడా మామూలు టికెట్ కంటే ఎక్కువ డబ్బులు కార్మికుల దగ్గర వసూలు చేసాయి. ఆ విషయంలో తెలంగాణా రాష్ట్రం నయం. ఎన్ని రైళ్ళు వేసినా కార్మికుల దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇక్కడి నుంచి రైళ్ళళ్ళో వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరూ ఆకలితో మాడలేదు.
అయినా అంతా వెళ్ళిపోలేదు
నడిచిపోయిన వాళ్ళు, లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు కొందరే. వాళ్ళంతా సీజనల్ కార్మికులు. పని ఉన్నప్పుడు వచ్చి, పని స్థలం దగ్గరే ఉండి పని కాగానే వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు కాక ఊళ్ళో ఉండి, ఇళ్ళు అద్దెకు తీసుకుని రకరకాల పనులు చేసే వలస కార్మికుల సంఖ్య చాలా అధికం. హోటళ్ళలో, ప్రింటింగ్ పరిశ్రమలో, మగ్గం పనిలో, రంగులు వెయ్యటం, కర్రపని చెయ్యటం వంటి పనుల్లో ఉన్న వాళ్ల సంఖ్య మొత్తం వలస కార్మికుల్లో మూడింట రెండు వంతులు. వాళ్లంతా ఇక్కడే ఉన్నారు. ఇది ఉపాధి పథకంలో పని వెతుక్కునే వర్గం కాదు. వాళ్లకు అలా దులుపుకుని పోవటమూ కుదరలేదు. ఇళ్ళ అద్దెలు బకాయి. వెళ్తే అక్కడ ఎలాగూ పని లేదు. ఇక్కడ ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పని ప్రారంభం అయిన వాళ్లకు కూడా గతంలో దొరికిన పనిలో పది శాతం కూడా దొరకటం లేదు. హైదరాబాద్ లో పశ్చిమ బెంగాల్ కి చెందిన మగ్గం పనివాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువ. వాళ్ళ దురదృష్టం ఏమిటంటే చాలా మందికి అక్కడ మే నేలలో వచ్చిన తుపానులో ఊళ్ళలో ఉన్న ఇళ్ళు కూడా పోయాయి. వినదలచుకుంటే ఉండిపోయిన వాళ్ల వెతలు ఎన్నో. వాళ్ళెవరూ ఇక్కడ ఓటర్లు కాదు కనుక వాళ్లకు ప్రభుత్వాల నుంచి ఏదైనా సహాయం దొరికే అవకాశం లేదు. కూలిపోయిన ఎకానమీలో వీళ్ళు ఎలా బతుకుతారన్నది పెద్ద ప్రశ్న.
విమర్శలు – వివాదాలు
ఒక పని జరుగుతున్నప్పుడు కొన్ని విమర్శలు రావటం సహజమే. అందులో కొన్ని అయినా న్యాయమైనవై ఉంటాయి కాబట్టి వాటికి సమాధానం చెప్పాలి. ఇలా లాక్ డౌన్ లో చిక్కుకున్న వలస కార్మికులకు రేషన్ ఇవ్వటం, అహారం అందించటం అనేది దాన కార్యక్రమం అని, ఉద్యమాల వైపు మళ్ళించాల్సిన ప్రజలను యాచకులుగా మారుస్తున్నారని, అది ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా సమస్య తీవ్రతను తగ్గించే కార్యక్రమం అన్నది మొదటి విమర్శ. రెండవది ఇది అగ్రవర్ణ అర్బన్ ఫెమినిస్టులు (ఈ సహాయ కార్యక్రమంలో ఎక్కువమంది స్త్రీలే పాల్గొన్నారు) నడుపుతున్న బూర్జువా కార్యక్రమం అని. కాకపోతే ఈ విమర్శ చేసినవాళ్ళు కూడా ఆ తర్వాత అదే బూర్జువా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాని మొదటి విమర్శ మాత్రం కొంత సమాధానం చెపాల్సిన వర్గాలనుంచే వచ్చింది. స్థూలంగా చూస్తే ఆ విమర్శ నిజమే. దీర్ఘకాలంలో ఇది మనుషుల జీవితాలను మౌలికంగా మార్చటానికి పనికొచ్చే పని కాదన్నది లాక్ డౌన్ కాలంలో ఈ పని చేసిన మాలో కొంతమందికి స్పష్టత ఉంది. కానీ విపత్తులు సంభవించినప్పుడు వాటికి మినహాయింపులు ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు ఎదురయ్యే విషాదాల వంటిదే లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు ఎదురయిన విపత్తు. మూడు నెలల పాటు ఈ పని జరుగుతున్నంత సేపూ నేను కలిసి పనిచేసిన పౌర సమాజ బృందం సభ్యులు సమాంతరంగా వలస కార్మికుల పట్ల ప్రభుత్వాలు పాటిస్తున్న పద్ధతిని పశ్నించటం, విమర్శించటం, అవసరమైతే కోర్టులకు వెళ్ళి కావలసిన డైరెక్షన్ తేవటం వంటి పనులు చేస్తూనే ఉన్నారు. వలస కార్మికులకు తిండి, ఆశ్రయం, ప్రయాణ సౌకర్యం కల్పించటం ప్రభుత్వ బాధ్యతే అన్న హైకోర్టు తీర్పు కూడా ఈ బృందం వేసిన పిల్ నుంచి వచ్చిందే.
ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. 15 ఏళ్ళ క్రితం దండకారణ్యానికి జనతన సర్కార్ మీద వార్తా కథనం రాయటానికి వెళ్ళినప్పుడు దాదాపు నేను కూడా ఇలాంటి ప్రశ్నే అడిగాను. మీరిక్కడికి వచ్చింది దేశంలో విప్లవం తేవటానికి కదా, మరి ఇక్కడ మీరు చెరువులు పొయ్యటం, అదివాసీలకు సుస్థిర వ్యవసాయం నేర్పించటం, రవిక వేసుకోవాలా లేదా అన్నది నిర్ణయించుకునే హక్కు స్త్రీలకే ఉండాలనటం, ఇందుకోసం విప్లవానికి ఉపయోగపడాల్సిన ఇంత సమయాన్ని, వనరులను ఎందుకు వినియోగిస్తున్నారు అని అక్కడ డివిజన్ కార్యదర్శి గణేష్ ఉయికె ను అడిగాను. అప్పుడాయన చెప్పిన సమాధానం ఇది: ఇక్కడ మనుషులు, మలేరియాలతోనూ, సరైన తిండి లేకపోవటం వల్లా 40 కూడా దాటకుండా చనిపోతున్నారు. ముందు మనుషులు బతికి ఉండాలి కదా విప్లవం సాధించాలంటే అన్నారు. ఆశయం పెద్దదైనప్పుడు, యుద్దం దీర్ఘకాలమయినప్పుడు, తక్షణ సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ తరగతులు చెప్పటం కుదరుతుందనుకోను. అది సమాంతర ప్రక్రియ.
అలాగే వలస కార్మికులను చైతన్యవంతులను చేసి ఉద్యమాలు చేయించటం వాళ్ళు రోడ్డున పడ్ద పరిస్థితుల్లో జరుగుతుందనుకోను. అప్పటికి వాళ్లలో ఆ చైతన్యం కలిగించే పని జరిగి ఉండాలి. అది జరగలేదు. విమర్శలు చేసిన వాళ్లందరికీ ఇప్పటికీ ఆ పని చెయ్యటానికి అవకాశం ఉంది. ఈ 16 కోట్ల వలస కార్మికులే కాదు ఇంకా ఎన్నో కోట్ల పేద, దిగువ మధ్య తరగతి కూడా ఈ కూలిపోయిన ఆర్థిక వ్యవస్థలో అష్టకష్టాలు పడుతున్నారు. వాళ్లను ఆర్గనైజ్ చెయ్యటానికి ఇది సమయం కూడా. దివిసీమ ఉప్పెన సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టిన ఎమ్ ఎల్ పార్టీల మీద కూడా దాదాపు ఇదే రకం విమర్శలు వచ్చాయి. విమర్శించిన వాళ్లు ఎక్కడున్నారో కానీ పని చేసిన వాళ్ళు మాత్రం ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. ప్రజలను ఎప్పుడూ వదిలి పెట్టలేదు. వాళ్లతో పోల్చుకునేంత గొప్ప పని చెయ్యకపోవచ్చు గాని, దేశం కనీ వినీ ఎరగని సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న వాళ్ల పక్క నిలబడటం మనుషులుగా చెయ్యవలసిన పని అని నమ్మి చేసిన పని. అది మనుషులుగా సాటి మనుషుల పట్ల బాధ్యత.
కృతజ్ఞతలు
వలస కార్మికుల బాధలు చూస్తూ ఏమి చెయ్యాలో తెలియక నిస్సహాయంగా దుఃఖపడిన చాలామంది నాకు తెలుసు. అలాంటి దుఃఖం నుంచి తప్పించటానికి నాకు వ్యక్తిగతంగా సహాయం చేసిన పని ఇది. అందుకు అవకాశం కల్పించిన కోవిడ్ అడ్వొకసీ గ్రూపుకు, ఒక వాట్సప్ గ్రూపుతో అంతమందిని లాక్ డౌన్ ప్రకటించిన రెండో రోజే ఒక చోటకి చేర్చిన సజయకు, తొలిరోజులనుంచీ కలిసి పనిచేసిన వసుధా నాగరాజ్, అన్వేషి సునీత, కొండవీటి సత్యవతి, సుజాత సూరేపల్లి, ఖలీదా పర్వీన్, పద్మజా షా, మాలిని సుబ్రమణ్యం, మీరా సంఘమిత్ర, అంబిక, భూమిక ప్రశాంతి, బ్రదర్ వర్గీస్, వెంకట రెడ్డి, జర్నలిస్టు వి వి జ్యోతి,వర్ష భార్గవి, లిస్సీ జోసెఫ్, సఫా సంస్థకు చెందిన రుబీనా, ఏంజెల్, ఇంకా నాకు తెలియని కొందరు (వర్చువల్ గా తప్ప బయట కలవలేదు చాలా మందిని), ఇందులోనే ఒక ఉప బృందంగా నాతోపాటు ఉన్న స్నేహితులు లలిత, రాణి, వారం రోజులకు మాతో కలిసి ‘సహాయ’ పేరుతో హెల్ప్ లైన్ ప్రారంభించి మా పని ఒక పద్ధతిలో జరగటానికి సహాయపడిన రైతు స్వరాజ్య వేదికకు చెందిన రవి కన్నెగంటి, నవీన్, సంయుక్త, శ్రుతి, హర్ష, విస్సా కిరణ్, స్వప్న, హెల్ప్ లైన్ కు వాలంటీర్లుగా పనిచేసిన 40కి పైగా నాకు పేరు తెలియని వాలంటీర్లు, రాధికా దేశాయ్, ఆయేషా, శ్వేత, ఇంకా నాకు పరిచయంలేని కొందరికి, డబ్బులివ్వొద్దు, మీరే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లకు సహాయం అందించండి అంటే ఈ పని కొత్త అయినా బ్రహ్మాండంగా చేసిన సుమాంజరి గుర్రం, చైతన్య పైడిపల్లి, జ్యోతి గూడవల్లి… అందరికీ కృతజ్ఞతలు. చిన్నపని చేసి పెద్ద ప్రమోషన్ చేసుకునే ఈ రోజుల్లో ఇందులో చాలామంది ఈ పని చేస్తున్నట్లు ఎక్కడా చెప్పుకోలేదు. వాళ్ల కుటుంబ సభ్యులకూ, వాళ్ళకు డబ్బు రూపేణా సహాయం చేసిన కొందరికి తప్ప. వీరంతా సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో దొరికిన అవకాశాన్ని, స్పేస్ ను కూడా విధానాల గురించి మాట్లాడటానికే వాడుకున్నారు.
మేడ్చల్ లో ఫుడ్ కాంప్ ప్రారంభించగానే సోషల్ మీడియాలో వాలంటీర్లు కావాలన్న పిలుపుకు స్పందించి దాని బాధ్యతలను భుజాలమీదకు ఎత్తుకున్న శ్రీరాం కంచర్ల, శ్రీనివాసరావు సజ్జా, అప్పటికే హైవే మీద పనిచేస్తూ ఉండి వెంటనే ఫుడ్ కాంప్ లో భాగంగా మారిన శ్యామ్ ప్రసాద్, గౌతమ్, అరుణ్ , ఎల్విస్, అభి, తవీ కృష్ణ, వాలంటీర్లుగా వచ్చి, తర్వాత కాంప్ లో భాగంగా మారిన అనితా మేస, రేణుకా దేవి, కృష్ణ పీల, రాధా పంతుల, భార్గవి, విజయలక్ష్మి, మాధవీకళ, ఫుడ్ కాంప్ కు పెద్ద ఎత్తున ఆహారపదార్థాలు రావటానికి సహాయపడిన ప్రొఫెసర్ ఇప్సిత, డాక్టర్ కల్యాణ్, రాజ్ జంగం, జకాత్ ఫౌండేషన్ కి చెందిన ముజాహిద్, షహీద్ అలీ ఖాన్, చాలా సహాయాలను ఇటు మళ్ళించటానికి పనిచేసిన బేగ్ ఫరాతుల్లా, మహనూర్, సోషల్ మీడియాలో ఫుడ్ కాంప్ గురించి తెలుసుకుని వచ్చిన చైతన్య పింగళి, మిర్చి మహేష్, రఘు మాదాటి, శంకర్ పటోల్ల, సందీప్, కవితా పులి, మహేందర్, కవితా చక్ర, సబిత, ఇంకా నేను పేర్లు మర్చిపోయిన కొందరు, వలస కార్మికులను బస్సుల్లో ఇళ్ళకు పంపటం అనే ప్రక్రియ ప్రారంభించిన సంస్థలు హీలింగ్ ఫీల్డ్స్, టీఎస్ఐజి, ఆ తరవాత ఫుడ్ కాంప్ తో పాటు నిధులు సేకరించి ఆ పనులు కొనసాగించిన ఇండస్ మార్టిన్, అరుణాంక్ లత, మోషే దయాన్, ఉషా జ్యోతి. ఈ ప్రయాణాలతో పాటు వాళ్ళు సురక్షితంగా ఇల్లు చేరే దాకా కార్మికుల హోమ్ స్టేట్స్ తో కూడా కో ఆర్డినేట్ చేసిన శరత్ ధవళ, ఫుడ్ కాంప్ కు కూడా తరలి వచ్చి పని కొనసాగించిన, ఇంకా కొనసాగిస్తున్న కోవిడ్ అడ్వొకసీ గ్రూప్, ఫుడ్ కాంప్ ఏర్పాటు చెయ్యటానికి స్థానిక యత్రాంగంతో మాట్లాడి పర్మిషన్లతో పాటు సదుపాయాలు కలగచెయ్యటానికి అవసరమైన సహాయం చేసిన దిలీప్ కొణతం, అక్కడ ఉన్నంత కాలం సదుపాయాలకు సంబంధించి ఏ అవసరం అయినా వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం, కాంప్ ను శుభ్రం చెయ్యటానికి, ఎప్పటికప్పుడు నీళ్లు ఏర్పాటు చెయ్యటానికి పని చేసిన 35 మంది గుండ్ల పోచంపల్లి మునిసిపల్ సిబ్బంది, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ కమిషనర్లకు, ఎప్పుడంటే అప్పుడు ఏదంటే ఆ సహాయం చేసిన స్థానిక రాజకీయ నాయకుడు నర్సింహారెడ్డి తో పాటు మా పనిలో అనవసరంగా కల్పించుకోకుండా సహాయం చేసిన ఇతర స్థానిక రాజకీయ నాయకులకు ధన్యవాదాలు.
ఇక మార్చి చివరి వారం నుంచీ చేస్తున్న సహాయ కార్యక్రమాలకు, ఫుడ్ కాంప్ దగ్గరా, ఆ తర్వాత కూడా బస్సులకు స్పాన్సర్లుగా వచ్చిన వాళ్ళు వందల్లో ఉంటారు, అందులో వెయ్యి రూపాయలు ఇచ్చిన వాళ్ళు, లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా మామీద నమ్మకంతోనే ఇచ్చారు. అలాంటి నమ్మకాన్ని మామీద ఉంచినందుకు ధన్యవాదాలు. అన్నిటికి మించి ఈదేశం, ఈ సమాజం కూడా మీ కష్టంతో బతుకుతూ మిమ్మల్ని ఇంత కష్టపెట్టినా కూడా ఉండాల్సిన కోపం కూడా లేకుండా నిర్వికారంగా మీరు నడిచివెళ్ళే దారిలో ఉడతా సాయం చెయ్యటానికి అవకాశం ఇచ్చిన భారతదేశ నిజమైన నిర్మాతలు వలస కార్మికులకు ధన్యవాదాలు.
(రచయిత స్వతంత్ర పాత్రికేయులు)
*****
“వీక్షణం” సౌజన్యంతో-