జానకి జలధితరంగం-8
-జానకి చామర్తి
ఉత్తర
మడచిపెట్టిన పువ్వుల పొట్లం లాటివారు ఆడపిల్లలు. యుక్తవయసు వచ్చేటప్పటికి పొట్లం విచ్చి వాసనలు వెదజల్లినట్టు , ఆశలు పరిమళిస్తాయి. ఈ విచ్చుకునే కలలు కోరికలకి పేదా గొప్పా భేదాలు లేవు, ఉద్యోగి నిరుద్యోగి అనే తారతమ్యం లేదు , లోకం చూసిన ధీర అమాయకపు ముగ్ధ అనే వేరు భావమూ లేదు. కన్నెపిల్ల కలలు అందరకీ సమానం గానే కలుగుతాయి. కాలం సమయమూ తేడా..
అది అప్పుడెప్పటికాలమో,
ఇది ఇప్పటి కాలమూ అనే తేడాలు కూడా లేవు
ఉత్తర కూడా అంతే ..
“ ఉత్తర “…..ఈ పేరు వింటేనే మనసు ఒక విషాదరాగం విన్నట్టుగా మూగబోతుంది.
చాలా కలలు కంది, రాచకూతురు విరాటరాజు గారాబు పాపాయి,
పైగా అన్నకు ముద్దుల చెల్లెలు , నాట్యమూ గానము మొదలగు లలితకళలలో అందె వేసిన చేయి. కాబోయే వరుని కోసం ఎంత గొప్ప కలలు కనిందీ, చక్కనివాడూ శూరుడూ వీరుడు యుద్ధ కుశలుడూ పతిగా రావాలని ఎంత కోరుకుని ఉంటుంది.
ఇంకా బొమ్మలతో ఆడుకునే చిన్నది, యుద్ధమంటే ఏమిటో సరిగా తెలియని ప్రాయం , అన్నగారు ఉత్తరగోగ్రహణం లో కౌరవులతో యుద్ధానికి పోతుంటే , బొమ్మ పొత్తికలుగా కౌరవుల తలపాగా కుచ్చులు తెమ్మని అడిగిన అమాయకపు చిన్నారి. యుద్ధం మొక్క తీవ్రత , దాని వల్ల కలిగే ఫలితాలు ఆలోచించ లేని లేబ్రాయపు సుకుమారి.
ఉత్తరకు అభిమన్యుడిని ఎంచాడు తండ్రి విరాటరాజు వరునిగా . అందగాడు సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మ కు మేనల్లుడు, పరాక్రమంలో జగత్ విఖ్యాతి చెందిన అర్జునుని పుత్రుడు, పాండవుల వంశోద్ధారకుడు . ఇంతకంటే తగిన వరుడెవరు ఉత్తర కు.
పొంగిపోయింది ఉత్తర , సిగ్గుల మొగ్గ అయింది, భవిష్యత్ గురించిన కలలతో కన్నుల దీపాలు వెలిగించుకుంది. రంగ రంగ వైభవంగా పెళ్ళి చేసాడు తండ్రి , ఆనందాల తోరణాలే , తృప్తి కలిగించే సంతోషాలే .. కొత్తదంపతుల సంబరం అంబరాన్ని తాకింది.
ఎంత హాయిగా ఉందనుకున్నా , పెళ్ళి పందిరి పైన కమ్ముకున్న యుద్ధ మేఘాలను , పొంచి ఉన్న వియోగాన్ని ,అంత బాల ఉత్తర కూడా అర్ధం చేసుకోక తప్పలేదు.
యోధునకు ఇల్లాలు అవగానే పెద్దరికం వచ్చింది. పరిస్ధితులు అర్ధమయ్యాయి. తేనె నిలవులో తేలియాడే తరుణం పూర్తి అవకుండానే , పతి అభిమన్యుని కురుక్షేత్ర యుద్ధానికి సాగనంపే తరుణమొచ్చింది ఆ తరుణి ఉత్తరకు.
తాను స్వయంగా యుద్ధకుశలుడు,
పాడవవంశ విక్రముడు, సర్వరక్షణ కవచంలా పెదనాన్న , చిన్నాయనలూ .
యుద్ధమూ శత్రువులను ఎదుర్కొని వీరోచితంగా పోరాడటమే అతని లక్ష్యం . యుద్ధ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియదు, ఎవరూ చెప్పలేరు, అది కూడా ఒక జూదం లాంటిదే.
ఎడబాటు ఛాయలూ విరహపు వ్యధ తెలియనివ్వలేదు, మొహంలో అధైర్యము కనిపించనివ్వలేదు , ప్రోత్సహిస్తూ మల్లెల దండలా నవ్వింది విజయుడవై కమ్మని వీరతిలకము దిద్దింది. శత్రువుల మీద యుద్ధం చేసే భర్తకు , పరోక్షంగా తోడుగా నిలచింది ఆ కొత్తపడుచు ఉత్తర.
చిన్నది , ముందు ముందు ఎంతో జీవితము కాచుకుని ఉన్నది, పతితో సౌఖ్యాలు పొందవలసినది కాని శత్రువుల నోడించి , తమ రాజ్యము తిరిగి పొందడానికి పోరాడే భర్త కు బాసటగా నిలచి, శత్రువులతో కనిపించని యుద్ధం చేసిన ధీర వనిత ఉత్తర.
అభిమన్యుని యుద్ధంలో అన్యాయంగా మరణించాడన్న వార్త , ఉత్తరకు పిడుగుబాటు. అసలే అతలాకుతలంగా ఉన్న మనసును ఘనీభవింపచేసేసింది. కన్నీళ్ళు కూడా రాలని మంచులా మార్చింది. దుఃఖం పట్టలేనప్పుడు కలిగేది మౌనమే. కడుపులో ఉన్న బిడ్డ , కొంచం కదిలాడు , ఆమెలో కదలిక తెచ్చాడు. కర్తవ్యం ఆమెను మళ్ళీ మనిషిని చేసింది.
పసుపు పారాణి ఆరని యుద్ధ వితంతువు, విషాద రాగం ఆలపించే తీగ తెగిన వీణలా మిగిలింది. ఇంకా పతి పరిష్వంగ సుఖం, జతగా అనుభవించిన పులకింతల ప్రణయం ,యుద్ధమనే ప్రళయంలో కలసిపోయింది పట్టుమని పదిరోజులు కూడా గడవకుండా ఐదవతనంకి కాలం చెల్లింది. కన్నెతనపు కలలు కోరికలకు అల్పాయుష్షు. ఎవరు ఊహించినది .. ఎవరు రచించినది ఆమె భవిష్యత్తు.
ఆలోచనలేని స్వార్ధపరుల పంతం పట్టుదల కలిగిన రాజుల చేతుల్లో వారి చేతలలో యుద్ధంలో .. ఉత్తర జాజిమొగ్గ లాటి జీవితం నలిగిపోయింది.
అయినా ఆమె తన జీవితం కొనసాగించవలసినదే., పుత్రుని పెంచి ప్రయోజకుడుగా చేసి సమాజానికి దేశానికి సమర్పించ వలసినదే. ప్రతి జీవితానికీ ఒక లక్ష్యం , యువకుడు అభిమన్యునకు శత్రువులతో యుద్ధం జీవితానికి ‘తుది ‘అయితే,
యువతి ఉత్తరకు జీవితంతో యుద్ధం చేయడం అప్పటి నుంచే
‘మొదలు ‘ అయ్యింది.
గాల్వాన్ లోయలో చైనాశత్రువులతో వీరోచితంగా పోరాడి అశువులు బాసిన వీరులు మన సైనికులు.
అంతే ధైర్య సాహసాలతో భర్తలను యుద్ధానికి పంపి, దురదృష్టవశాత్తూ వారిని యుద్ధం కబళించి వేసి, భర్తలను కోలుపోయినా, ధైర్యం కోల్పోకుండా జీవితంతో యుద్ధానికి సిద్ధపడ్డ ఆ సైనికుల భార్యలు ,
ఆ యుద్ధ వితంతువులు
“అభినవ ఉత్తరలు”.
వారికి గౌరవ వందనం !!
*****
జానకి చామర్తి ( వరిగొండ)
మనసులో భావాలు మనసులోనే కధలల్లి పెట్టుకోవడం ఎప్పటినుంచో చేస్తున్నా ,
అక్షరాలలో పెట్టడం ముఖపుస్తకంలో మొదలయ్యింది. సుందరమైన తెలుగునే నమ్ముకున్నా.
అందంగా కవితలా రాయాలని , రోజూవారీ జీవితాన్నైనా
ప్రకృతి యే ఆనందం , ఇప్పటికీ చదువు చెప్పే గురువు అదే.
నిజం చదువు MA Bed, ఉపయోగపడే విద్య yoga లో చేసిన PG Diploma,.
నివాసం విశాఖపట్టణం , ఎక్కువకాలం ప్రవాసం.
ప్రస్తుత నివాసం కౌలాలంపూరు.