జ్ఞాపకాల సందడి-12
-డి.కామేశ్వరి
మనం నాలుగు ఐదు వారాలకే lockdown భరించలేక , ఆపసోపాలు పడిపోతూ బందిఖానాలో ఉన్నట్టు గిల గిలాడిపోతున్నాం , స్వేచ్ఛ కోల్పోయిన ఖ్యదీల్లాగా ఫీల్ అవుతూఎప్పటికి విముక్తి అన్నట్టు ఎదురు చూస్తున్నాం . అలాటిది రెండేళ్లు బయటి ప్రపంచం మొహం చూడకుండా, ఒక పెద్ద అటక (annex ) మీద ప్రాణభయంతో రెండు కుటుంబాలు ఎనిమిదిమంది సభ్యులు దాక్కుని ఎవరికంటా బడకుండా , అనుక్షణం భయంతో , గట్టిగ మాట్లాడకూడదు , శబ్దాలు చేయకూడదు , మనుషుల ఉనికివున్నట్టు బయటి ప్రపంచానికి తెలియకుండా బతికారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల దురాగతాలకు ఎంతో మంది యూదులు (jews ) బలైయారు. లక్షలాదిమందిని కాన్షన్ట్రేట్షాన్ కాంప్స్ లో బందీలుగా పందుల్లా షెడ్లలో కూర్చునే స్థలంలేనిచోట పడేసి చిత్రవధ చేస్తూ తిండిపెట్టకుండా , మాడ్చి , పస్తులతో రోగాలతో, తుపాకీ గుళ్ళకి బలిపెడుతూ మగవాళ్ళని అడ్డమైన చాకిరీకి , స్త్రీలు పిల్లలని హింసించి చంపుతూ హిట్లర్ నియంతృత్వ పాలనలో జర్మన్ సైన్యం రాక్షసత్వానికి ఎన్నో కుటుంబాలు బలియైపోయాయి .
జర్మనీ లో పుట్టి పెరిగిన ఒక యూదు కుటుంబం యుద్ధ సమయంలోనాజీల భయంతో నెదర్లాండ్ పారిపోయి amsterdam లో కొత్తజీవితం , కొత్త వ్యాపారం మొదలుపెట్టుకుని బతుకుతున్నా జర్మన్స్ యుద్ధంలో ఆ ప్రాంతాన్ని గెలిచి వశపరుచుకుని హింసామాకాండ మొదలుపెట్టగానే ఆ కుటుంబం వారి ఫ్యాక్టరీ మీద అంతస్తులో రహస్య (annex ) పెద్ద అటక మీద కుటుంబంతో తలదాల్చుకుంటారు. ముఖ్యమైన సామానులు , నమ్మకమైన వారి పనివారు , ఒకరిద్దరు స్నేహితులు ఆహారం వస్తువులు దొంగతనంగా అందిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా మాములుగా కింద ఆఫీసు , ఎవరికీ కనపడని రహస్యద్వారం ద్వారా ఆహారం అందిస్తూ నిమిషమో యుగంగా గడుపుతూ వుంటారు . ఇది నిజంగా జరిగినకథ.
మీలో కొందరయినా ‘ డైరీ అఫ్ అన్నే ఫ్రాంక్ ‘ అనే పుస్తకం చదివి వుంటారు, పదమూడేళ్ల అన్నే అన్న అమ్మాయి ఆ రెండేళ్ల తమ అనుభవాలు , బాధలు , నరకం , ప్రాణభయం రహస్యజీవితం గురించి ఎప్పటికపుడు ఆరోజు విషయాలన్నీ డైరీ రాసి పెట్టుకునేది. 1929 లో జర్మనీ లో jews కుటుంబం లో పుట్టిన ఆ అమ్మాయి పడిన బాధలు , పోలీస్ గస్తీల్లో బయటపడిన రహస్య స్థావరం, అందరినీ పట్టుకుని కాన్సెన్ట్రేషన్ క్యాంపు లో పడేస్తే పడిన నరకబాధ ,తిండిలేక అనారోగ్యంతో అక్క , తల్లి, అన్నే చనిపోతారు . తండ్రి యుద్ధం అయ్యాక వెతుకుంటూ వస్తే ఎవరూ మిగలరు . పదహారేళ్లకు anne చనిపోతుంది . పాత వస్తువుల్లో దొరికిన డైరీ తండ్రి చదివి తరువాత అచ్చువేయిస్తాడు, జ్యూయిష్ భాష లో రాసిన ఆపుస్తకం మొదట ఇంగ్లీష్, తరువాత 56 భాషల్లో ఎన్ని సార్లు పునర్ముద్రణలు జరిగి కోట్ల కాపీలు అమ్ముడయి 1959 లో సినిమాగా వచ్చి ఎన్నో ఆస్కార్ అవార్డులు గెల్చుకుని ఎన్నోవెర్షన్స్ సినిమాలు ,t .v సీరియల్స్గా వచ్చిందట.
నేను ఈ పుస్తకం ఎప్పుడు చదివానో 65 ,70 మధ్య అంటే ఏభయి ఏళ్ల పైన అయివుంటుంది .
ఆ రోజుల్లో ఈ పుస్తకం జనాన్ని ఎంత కదిలించి దంటే నాజీల దురాగతాలు యూరప్ దేశాలకు తెలిసినట్టు మనకు తెలియదు . మనదేశాన్ని పెద్దగా ఆ యుద్ధ ప్రభావం తాకలేదు . మొదటిసారి పుస్తకం చదివి కదిలిపోయేను నేను . వాళ్ళ రెండేళ్ల బాధలు అనుభవాలు, అనుభూతులు , నరకయాతనలు , వాళ్లతో పాటు స్నేహితులు ఇంకో ఫామిలీ వచ్చి చేరడం, టీనేజ్ అబ్బాయి , anne మధ్య స్నేహం రెండు ఫ్యామిలీల మధ్యచిన్న ఘర్షణలు , తిండికి పడే ఇబ్బందులు , తాగే నీళ్ళకంపు , టాయిలెట్ ఇబ్బందులు నిజంగా మానవమాత్రులు పడలేని ఆ కష్టాలు, అన్ని భరించినా ఆఖరికి పట్టుబడి నరకయాతన నించి తప్పించుకోలేక చనిపోవడం. నాకు సరిగా అన్నీ గుర్తులేవు. సరిగా వ్యక్తపరచలేకపోయా . పుస్తకం దొరుకుతుందో లేదో తెలియదు . సినిమా ఆరోజుల్లో ఒరిస్సాలో వుంది చూడలేకపోయా . పుస్తకం అంత కదిలించదు సినిమా అన్నారెవరో .
ఏమయినా ఇంత ఎందుకు చెప్పానంటే మనఇంట్లో మనం హాయిగా ఫ్యామిలిలో వుంటూ , శుభ్రంగా తింటూ , తాగుతూ ,సినిమాలు చూసుకు ఫోన్ లో పలకరించుకుంటూ , పిల్లలు వీడీయో గేమ్స్ , పెద్దలు వీడీయో చాటింగ్లు చేసుకుంటూ ఏదో కష్టపడిపోతున్నట్టు గోల పెడుతున్నాం అనుకుంటుంటే సడన్గా “డైరీఅఫ్ అన్నే ఫ్రాంక్” గుర్తొచ్చి చెప్పాలనిపించి కష్టపడి టైపు చేశా.
అయినా చెప్పాల్సింది సరిగా చెప్పలేకపోయాననిపిస్తుంది . వీలయితే పుస్తకం చదవండి . నేనెప్పుడూ అంటాను ఆనాటి సాహిత్యం లేకపోతే మనకు ప్రపంచ యుద్ధకాలం నాటి విషయాలు ఎలాతెలిసేవి ? ఏ విషయాలయినా ముందు తరాలకి అందించేది సాహిత్యం మాత్రమే . ఈనాటి యువత చదవండి పుస్తకం ప్లీజ్. ఇది నా అభ్యర్ధన- సాహిత్యాన్ని వదులుకుంటే నాగరికత మిగలదు!
*****
డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.