“నెచ్చెలి”కి ఆత్మీయ వాక్యాలు
నెచ్చెలి ప్రథమ జన్మదినోత్సవం సందర్భంగా నెచ్చెలి రచయిత్రు(త)లు అందజేసిన ఆత్మీయ స్పందనలు ఇక్కడ ఇస్తున్నాం:
- మా గీత : నెచ్చెలి
మా గీతకు బాల్యం నుంచి అనుకున్నదేదైనా సాధించి తీరడం అలవాటు.
స్వదేశంలో రెండుభాషల్లో పి.జి. చెయ్యడం, ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో డిప్లొమా, నెట్ పాసై చిన్నవయసులోకే లెక్చరర్ కావడం, తర్వాత డాక్టరేట్ చెయ్యడం, ఉద్యోగం చేస్తూనే గ్రూప్-1 సాధించడం ఇలా ఎన్నెన్నో. తల్లిగా మా అమ్మాయి గొప్పలు నేను చెప్పుకోకూడదు. తన పరిజ్ఞానాన్ని పెంచుకొనే నిరంతర అధ్యయన శీలి గీత.
ఇక U.S. వెళ్లేక మిత్రులతో కలిసి సాహిత్యానికి సంబంధించిన తనకృషి వీక్షణం ద్వారా అందరికీ తెలిసినదే!! ఒక్కక్షణం కాలు నిలువకుండా నిరంతరం సంచరిస్తూనే ఉంటుంది. ఓ పక్క పిల్లల పెంపకం, మరోపక్క ఎమ్మెస్ చేసి సాధించిన ఉద్యోగం, రచనలు.
ఓ రోజు హఠాత్తుగా “అమ్మా, వెబ్ మేగజైన్ ప్రారంభించాలనుకుంటున్నాను.” అన్నప్పుడు అన్ని బాధ్యతల మధ్య ఎలా నిర్వహించగలదా అని నేను కంగారుపడ్డాను. నెలలో ఎన్నో రోజుల నిద్రను త్యాగం చేసి దాన్నీ విజయవంతంగా నడుపుతోంది.
“నెచ్చెలి” ద్వారా పరిచయమౌతున్న కొత్త రచయితలెందరో విజయవంతంగా రాస్తున్నారు. లబ్ధప్రతిష్ఠులైన రచయిత మిత్రులు తమ రచనల్తో నెచ్చెలికి సొగసులద్దుతున్నారు. అందరికీ గీతతో బాటూ నేనూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
తన ఈ అలుపెరగని కృషి నిరంతరం నిరాఘాటంగా కొనసాగాలని ఆశీర్వదిస్తూ, అమ్మగా ఆనందిస్తూ, కొంచెం గర్వపడుతూ…
-కె.వరలక్ష్మి
- ఆత్మీయ పత్రిక నెచ్చెలి
ఎన్ని వ్యాపార పత్రికలు వచ్చినా సమా౦తర వామపక్ష పత్రికల అవసరం ఎప్పుడూ వుంటుంది. ఎందుకంటే ప్రస్తుత పత్రికలన్నీ ఏదో పార్టీకి గొడుగుపడుతూ, ఫక్తు వ్యాపార విలువలతోనే నడుతున్నాయి. అటువ౦టి చోట్ల మన ఆలోచనలకు భావస్వేచ్చకీ ముఖ్యంగా విమర్శకు చోటు లేదు. అంతకంతే ముఖ్యంగా ఇన్ని పేజీలే వుండాలి , ఈ పద్ధతిలో వుండాలీ లాంటి నిబంధనలు రచన ని ఒక మూసలోకి కుదిస్తాయి. అసలు సాహిత్యానికి వున్న పేజీలే తక్కువ, వాటిని ఎవరు నిర్వహిస్తే వారి విలువలు, అభిరుచులు ఆక్రమిస్తాయి. అదీకాక ఒక్కో రచన అచ్చులో చూసుకోవడానికి నెలలు తరబడి ఎదురుచూడాలి . అప్పటికి అది రాసిన సందర్భం, స్ఫూర్తి కూడా మాసిపోతాయి.
సరిగ్గా ఈ కారణాలే ప్రత్యామ్నాయ పత్రికలకు వరంగా మారాయి . కొత్తరచనలకి రెక్కలిచ్చి వెలుగు చూపడంలోనూ మంచి రచనలకి గౌరవ౦ ఇవ్వడంలోను ముందుకొచ్చాయి. ఎడిటింగ్ అనేదానికి పరిమితి బాగా తగ్గిపోయింది. దీనివల్ల క్వాలిటీ తగ్గింది అనే విమర్శ కూడా వచ్చినప్పటికీ తక్షణ సందర్భాలకు ఇది వేదిక ఇచ్చి౦ది. ఇటు పత్రికలకు రాస్తున్నవారికి, పత్రికలు నడుపుతున్నవారికి రచన ఫుల్ టైమ్ వ్యాపకం కాదు. కల్పించుని పట్టుదలతో కొనసాగిస్తున్న వ్యాపకం మాత్రమే . ఆ రెండువర్గాల సమయాభావ పరిస్థితిని ఆన్ లైన్ మ్యాగజెన్స్ మాత్రమే పూరించగల వేదికగా వున్నాయి. ఇప్పుడు దాదాపు ఒక పదిహేను ఇరవై వరకు తెలుగులో వస్తున్న అంతర్జాల పత్రికలు వున్నాయి. రచయితలకి, పాఠకులకి ఒక ఒక పెద్ద కాన్వాసు దొరికినట్టయింది.
వాటి మధ్య నెచ్చెలి ఒక చిన్న పాపాయి. ఏడాది పూర్తి చేసుకుని అడుగులు వేస్తోంది. నెచ్చెలి పత్రిక ఒక విదేశం నుంచి వస్తున్న పత్రికగా ఎవరికీ అనిపించదు. మన పక్క వీధిలో అచ్చవుతున్నట్టుగా వుంటుంది. ఈ దగ్గరితనం బాహ్యంగానే కాదు మానసికంగా కూడా . మన గీత కదా ఈ ఎడిటర్ అనుకుంటే అదో గొప్ప నాకు. ఒక జర్నలిస్టుగా నా ఇరవైయేళ్ళ అనుభవం ఎన్ని సాధకబాధకాల్ని రుచి చూపి౦చినా ఈ రంగమ్మీద వున్న ఫేషన్ నాకు అలాగే వుంది. నా ఉనికిని అలా నిర్వచించుకోవడానికే ఎక్కువ ఇష్టపపడతాను.గీత తనకున్న అనేక పనుల మధ్య సాహిత్యానికి ఇంత చోటు ఇచ్చి సంవత్సరం నుంచి నడపడం ఎంత కష్టమో నేను ఊహించగలను. గీత ఎక్కడికి వెడితే అక్కడికి తెలుగును పట్టుకువెడుతుంది. సంగీతం మొక్కలు నాటుతుంది. చంద్రమండలం కాస్త దూరంగా వుంది కాబట్టి ఆలస్యమవుతోంది కానీ మన నెచ్చెలి అక్కడినుంచి కూడా వస్తుందనే నమ్మకం నాకుంది.
గీత, వాళ్ళ అమ్మ వరలక్ష్మి చిరకాల మిత్రులు, ఆత్మీయులు . ఇందులో నా రచనలు చూసుకోవడానికి గొప్పగా వుంటుంది.
-కొండేపూడి నిర్మల
నీలిమేఘాలు కవిత సంకలనం కాలానికి ( 1993) యువ కవిగా తెలిసిన గీత 2013 లో మా అమ్మాయి కోసం కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు ‘నేను ఇక్కడే ఉన్నానోచ్’ అంటూ వచ్చి నన్ను కలిసి కబుర్లు చెప్పి పిల్ల తెమ్మెరలా కమ్మేసింది. అప్పటి నుండి కాలిఫోర్నియా వెళ్ళినప్పుడల్లా కలవటం …సాహితీ సమావేశాలకు తీసుకువెళ్లడం … తొవ్వపొడుగునా కబుర్లు .. గీత నాకు మంచి నెచ్చెలి అయిపొయింది. ఒక తెలుగు పిహెచ్ డి అమ్మాయిగా మొదలై, సాంకేతిక విద్యారంగం లోకి మారి ఉద్యోగస్తురాలైన గీతలో సాహిత్యాసక్తులు, అభినివేశాలు మారాకులువేస్తూ మల్లెమొగ్గలై పరిమళిస్తూనే ఉన్నాయి. వీక్షణం సమావేశాల నిర్వహణ నుండి నెచ్చెలి పత్రికను ఏర్పరచటంవరకూ ఆమె సాగించిన ప్రస్థానం అందులో భాగమే.
గీతకున్న మంచి నిర్వహణ సామర్థ్యాన్ని నెచ్చెలి పత్రిక మరొకసారి రుజువు చేసింది. పనికి తనను ఎప్పుడూ ఒక ఉత్సాహశక్తి నడుపుతుంటుంది. నెచ్చెలిని మొదలుపెడుతూ మహిళల నవలలపై రీసెర్చ్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు కదా … నెచ్చెలికి ప్రతినెలా వ్రాయమని కోరింది. నెల నెలా వ్రాయటం సాధ్యం అవుతుందా అని సందేహిస్తుంటే వాదించి ఒప్పించింది. కథలు, కవిత్వం, విమర్శ , యాత్రాచరిత్ర, జీవితచరిత్రలు ,ఆడియోలు మొదలైన శీర్షికలతో పత్రికను వైవిధ్యభరితంగా రూపొందించి ఒంటిచేతిమీద నిర్వహించుకొంటూ వస్తున్న గీతను అభినందించాలి.
ప్రతినెలా ఒక మహిళా రచయితతో ముఖాముఖీ వచ్చేట్లు చూస్తే బాగుంటుంది అని ఒక చిన్న సూచన. ఇలాంటి ఇంటర్వ్యూ లు, మహిళా రచయితల స్వీయ చరిత్రలు, జీవిత చరిత్రలు నెచ్చెలి లో ప్రచురించబడితే అది భవిష్యత్తులో స్త్రీల చరిత్రల నిర్మాణానికి మంచి రిఫరెన్స్ పత్రిక అవుతుంది. గీత ఉత్సాహశక్తి నిత్యం , నిరంతరం కావాలని, నెచ్చెలి పత్రిక మరెన్నో పుట్టినరోజులు చేసుకొనాలని ఆకాంక్షిస్తున్నాను.
-కాత్యాయనీ విద్మహే
4.
రావు బాలసరస్వతి గారు పాడిన “బంగారు పాపాయి బహుమతులు” పాటలా ఈ “నెచ్చెలి” అంతర్జాల పత్రికకు ఏడాది నిండింది. చిన్న చిన్న అడుగుల్తో మొదలై “నెచ్చెలి” మంచి పేరు సంపాదించుకోగలిగింది.
గీత వ్యక్తిత్వం లోనే పట్టుదల, దీక్ష, శ్రమపడే తత్త్వం ఉన్నాయి. నిరంతరం శ్రమించింది. తానెక్కడున్నా బతుకు మెట్లలో విజయాన్నిసాధించింది. ఆమె వ్యవహార దక్షత, పరిశీలనా శక్తి స్పష్టంగా కనబడుతున్నాయి. తన మీద ఉన్న ఇష్టంతోనే “కొత్త అడుగులు” అనే కాలమ్ రాస్తున్నాను. ఇప్పుడిప్పుడే రాస్తున్న కవయిత్రులను పరిచయం చెయ్యడం ఈ కాలమ్ ఉద్దేశ్యం.
“నెచ్చెలి” పేరు నన్ను బాగా ఆకర్షించింది. తను అందరితోనూ కలిసి ఉండే తన ధోరణికి ప్రతిరూపం ఈ పేరు.
చాలా మెటీరియల్ ను సేకరించడం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల్ని కలపడం, స్త్రీల రచనలకు ప్రాముఖ్యత నివ్వడం.. ఇలా ఉత్తమ సంపాదకత్వాన్ని సంతరించుకున్న
గీత మరెన్నో పనులను చేస్తూ మరింత ప్రతిభతో అందరికీ చేరువవ్వాలని, “నెచ్చెలి” దినదినాభివృద్ధి సాధించాలని మనసారా కోరుకుంటూ “నెచ్చెలి” ని అభినందిస్తు న్నాను.
-శిలాలోలిత
5.
నెచ్చెలి ప్రథమ జన్మదినం సందర్భంగా, నెచ్చెలి తో అనుబంధం పెంచుకున్న నన్ను, నేను అభినందించుకుంటూ, వ్యవస్థాపక సంపాదకురాలైన డాక్టర్ గీతా మాధవిని శతమానం భవతి………… అంటూ ఆశీర్వదించి, పత్రికను చక్కని సాహిత్య విలువలతో నడుపుతున్నందుకు అభినందిస్తున్నాను. పత్రికలోని విషయ వస్తువులను విభిన్న శీర్శికల క్రింద అమర్చి అందించడం చాలా బావుంది. యాత్రాగీతం తో మొదలై, పుస్తక సమీక్ష వరకు అన్నీ స్త్రీలు వ్రాసినవి, స్త్రీలకు సంబంధించిన ఇతి వృత్తాలతో పురుషులు రాసినవి కొన్ని వస్తున్నాయి. యాత్రా గీతంలో కొత్త ప్రదేశాల పరిచయం, కధామధురం లో ధారావాహిక కథలు, కవనకోకిల లో ధారావాహిక కవిత్వం, అనుసృజన లో ధారావాహిక అనువాదాలు (వివిధ భాషలనుండి తీసుకున్న కథలు, కవితలు ఇంకా జీవిత చరిత్రలు), ఇంటర్వ్యూలే కాకుండా, కన్నెగంటి అనసూయగారు స్పూర్తిదాయకంగా వ్రాస్తున్న బాల నెచ్చెలి కథలు బాగుంటున్నాయి. కౌముది సంస్థాపక సంపాదకులు కిరణ్ ప్రభ గారి టాక్ షోలు నారీమణులు ఎంతో బాగుంటున్నాయి. మునుపటి తరానికి చెందిన వారైనా నేటి తరానికి వారు కొత్తవారే. వారి గురించిన విశేషాలు కొత్తగా తెలుసుకున్నాము. అలాగే ఆడియో నవలా స్రవంతి, కథలు, గీతాలు, కూడా ఎంతో బాగున్నాయి వినడానికి. కాలమ్స్ లో షర్మిలా తరంగం, రమణీయం, చిత్రలిపి, గజల్ జ్యోతి మరియు సుధారాణి, సి బి రావు గార్ల పుస్తక సమీక్షలు వంటి విభిన్న విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఇంకా చాలా చాలా శీర్షికలు ఎప్పటికప్పుడు పరిచయమవుతూ ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తున్నాయి పాఠకులకు. కె వరలక్ష్మి గారి కథలు వసంత లక్ష్మి గారు చదువుతుంటే చాలా బాగున్నాయి. రచయిత్రి స్వరంలో వింటే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. మంచి పత్రికకు ఎప్పుడూ తలమానికంగా వుండేది సంపాదకీయాలే. ఆ సాంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగుతూ వుంది. ఇంకా చాలా విషయపరిధి పెరిగి, విభిన్న ప్రక్రియలతో, అనేక రంగాల్లో ఖ్యాతి గడించిన స్త్రీల గురించి తెలుసుకోవలసినవి, చెప్పుకోవాల్సినవి, తలచుకోవలసినవి, ముందు ముందు సంచికలలో వస్తాయని ఎదురు చూస్తాను.
1942, 43 సంవత్సరాల లో ఏర్పడ్డ అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యురాలు వట్టికొండ విశాలాక్షిగారు గురించి చదివినప్పుడు, ఆ రోజుల్లో ఉన్న అభ్యుదయం నేడు కొరవడింది అనిపిస్తుంది. బండారు అచ్చమాంబ గారు, కవి కోకిల సరోజినీ నాయుడుగారు, వింజమూరి అనసూయ గారు మొదలగు వారి గురించిన కథనాలు చాలా స్ఫూర్తిదాయకంగా వున్నాయి. ఇంకా చంద్రలత, ఆర్.శాంతసుందరి, కాత్యాయని విద్మహే, పుట్టపర్తి నాగపద్మిని మొదలగువారు, వారి రచనలతో నెచ్చెలికి వన్నె తెస్తున్నారు.
ప్రారంభ సంచిక నుండి ఒకే విధమైన మంచి ప్రమాణాలతో పత్రిక తీసుకురావడం, సంపాదకురాలి అభిరుచిని తెలియచేస్తుంది. దానికి ఎంతో ఓర్పు, నేర్పు, ఉండాలి. సంగీత సాహిత్యాలతో ఉన్న అనుబంధం వలన, గీత నెచ్చెలిని అపురూప నెచ్చెలి గా తీర్చిదిద్దుతూ వుందని అనుకుంటున్నాను. చిన్నప్పుడు వార పత్రిక, మాస పత్రికల కోసం ఎదురు చూచినట్లు, ఇప్పుడు నెచ్చెలి కోసం అలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటే అతిశయోక్తి కాదు.
ఒకరోజు గీత ఫోన్ చేసి ఆంటీ నేను ఒక web మేగజైన్ ప్రారంభిస్తున్నాను, మీరు రాస్తున్నారు అని చెప్పింది. నేనేం వ్రాయగలను? వ్రాయడం మానేసి 35 సంవత్సరాలు దాటింది, మధ్యలో ఎప్పుడో 1, 2 మినహాయించి, మరి ఏమీ రాయలేదు. ఇప్పటి తరానికి నచ్చేటట్లు వ్రాయడం ఎలా? మా అబ్బాయి కూడా, అమ్మా, మా చిన్నప్పుడు, నువ్వు రేడియో స్టేషన్ కి రికార్డింగ్ కోసం వెళ్లి రావడం, ప్రోగ్రాం ప్రసారసమయంలో అందరం రేడియో ముందు కూర్చోవటం నాకు గుర్తే, మళ్లీ ఎందుకు వ్రాయకూడదు? అని అంటాడు ఎప్పుడూ. ఆలోచించాను. వ్రాయడం మొదలెట్టాను. చాలా మందికి నచ్చి, ప్రోత్సహిస్తున్నారు. మరల నాలో రచనా చైతన్యం కలిగించిన నెచ్చెలికి మనఃపూర్వక ధన్యవాదాలు.
-సి. రమణ
వనితల కోసం నిర్వహించే పత్రికకు “నెచ్చెలి” అన్న పేరులోనే కొంత కృతార్థత వచ్చేసింది. చెలి అన్న పదాన్ని స్త్రీల పరంగానే వాడాలని నియమం ఉందేమో కానీ, “నెచ్చెలి” అన్న పదం లింగభేదానికి అతీతంగా ఆంగ్లంలోని ఫ్రెండ్ అనే పదానికి సమతుల్యం కావడం గమనార్హం. మగవారు ఇది పురుష ప్రపంచం అన్న భ్రమలో అహంకరించుకోవచ్చునేమో కానీ మగువలు వారినెప్పుడూ వేరుగా చూడరు. మచ్చుకి మే (2020) సంచికలో ‘రిస్క్ తీసుకుంటాను’, ‘బంగారమంటి’ అనే రెండు ఉత్తమ స్థాయి కవితలు. వీటిలో మొదటిది – తాగుబోతు మగడితో ఇల్లాలి పాట్లను ముచ్చట్లలా మలిచి మినీకథలా అలరిస్తూనే మనసుని కలచివేస్తుంది. రెండవది ఆధునిక దాంపత్యంలో ఆలుమగల పాత్రల్ని వాస్తవికంగా ప్రదర్శిస్తూ, మగవారి అల్ప అంకితభావాన్ని హందాగా ఎత్తిచూపుతూ, మగువల అల్పసంతోషాన్ని ముక్తాయించి మనసుకు హత్తుకుంటుంది. పిల్లలకి సమయం ఇవ్వలేని తలిదండ్రులు, పిల్లలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేని పితా-మాతామహులు సాధారణమైన ఈ ఆధునిక ప్రపంచంలో నీతి వాక్యాలు చెప్పేవారు లేని లోటు తీర్చడానికి ఈ సంచికలో పిల్లల కథలు ఉపయోగ పడతాయి. క్రమంగా తెలివి, చమత్కారం, సృజనలకు ప్రాధాన్యమిచ్చే కథలు కూడా ఈ శీర్షికలో చోటు చేసుకోగలవని ఆశించొచ్చు. వివిధ శీర్షికలతో, విభిన్న అంశాలతో ఆసక్తికరంగానూ, ఆకర్షణీయంగానూ రూపొందుతోంది ‘నెచ్చెలి’. ప్రస్తుతం పుస్తక రూపంలో వచ్చే పత్రికలు ఒకటొక్కటిగా మూత పడుతున్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటులా ఇప్పుడు ఈ కరోనా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠకులు, సాహిత్యాభిమానులు అంతర్జాలం వైపు ఆశగా దృష్టి సారిస్తున్నారు. రానున్న జూలైలో జన్మదిన ప్రత్యేక సంచికకోసం సన్నాహాలు చేసుకుంటున్న ‘నెచ్చెలి’ – వారి ఆశలకు ప్రాణం పోయడానికి తన వంతు సహకారం అందిస్తుందనే అనిపిస్తోంది. ‘నెచ్చెలి’ నిర్వాహకులకు, పాఠకులకు, అభిమానులకు ఈ సందర్భంగా మా శుభాకాంక్షలు.
-వసుంధర
విశాల విశ్వం లో విహరిస్తూ ఎందరెందరో మనస్సుల్లో స్నేహ బంధాన్ని , కలుపుకొని మనస్సున నిలుపు కున్న నెచ్చెలి. నిజంగా ఎందరికో నచ్చిన నాతి. నెచ్చెలి అంటే మిత్రురాలు. నెచ్చెలి అచ్చంగా ఒక నచ్చిన సఖి.
సాహిత్యానికి సహచరి. కవితల కనకాంగి. నవలల నళినాక్షి .బాలల భామిని .ఆడియో కధల అలివేణి. సద్విమర్శల సుదతి .ఆంగ్లకవితల ఆడకూతురు , ప్రయాణ సమాచారాల ప్రమద . వీడియో శీర్షికల విశాలాక్షి. కధల కామాక్షి. యాత్రాగీతాల లలన. చెరిగి పోని రస పూరిత కధాకధన మాధుర్యాల ముద్దుల గుమ్మ.
చక్కని చెలిమికత్తె .జీవనయానంలో విరామ సమయంలో విసుగు ను పారద్రోలే విశాలాక్షి. మొత్తంగా సాహితీ సమరాంగణా సార్వభౌతిక. మనసుకు నచ్చిన మానవతి. పిలిచి చెలిమి ని పెంచే పద్మాక్షి. నాకు నెచ్చెలి తెలిసింది కొద్దికాలం గానే కానీ చెఱుకురసం ఒక్క బొట్టు నాలుక పై పడితే చాలు కదా!
అలా నెచ్చెలి నిర్మాణకర్త గీత మధుర హృదయం నెచ్చెలి లో తెలుస్తున్నది. ఎంతో మంది రచనలకు నెలవైన నెచ్చెలి నిజంగానే ఒక గొప్ప నెలతుక . బాలనెచ్చెలికి కధలు వ్రాయడం స్నేహభావాన్ని పెంచుకోడం , పంచుకోడం నాకు గర్వకారణం . ఈ పత్రిక చక్కగా అనేకానేక మంచి విషయాలతో పెరిగి అందరిహృదయాల్లో చోటు చేసుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.ఈ అవకాశం ఇచ్చిన నెచ్చెలి సంపాదకురాలు గీత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నెనర్లతో,
-ఆదూరి హైమావతి
గీత గారూ! ఈ రోజుల్లో అంతర్జాల సాహిత్య పత్రిక నడపడం ఒక సాహసమే. మీరు ఈ బృహత్కార్యాన్ని ఒంటి చేత్తో చెయ్యడమేగాక, అందులో ఇంగ్లీషు విభాగాన్నికూడా ప్రారంభించడం ఎంతో ముదావహం. తెలుగులోకి ఎన్నో నాణ్యమైన అనువాదాలు వచ్చేయిగానీ, తెలుగునుండి ఇంగ్లీషులోకి అనువాదాలు వాసిలోనూ రాశిలోనూ ఇప్పటికీ తక్కువే. మీ ఇంగ్లీషు విభాగం ఆ లోటు తీరుస్తుంద నీ , పాత/ కొత్త తరం అనువాదకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనీ ఆశిస్తున్నాను.
ప్రపంచసాహిత్యంలో ఏ కథా రచయితకీ, కవికీ తీసిపోని రచయితలూ, కవులూ తెలుగులో వెలుగుచూడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సమాజప్రగతికి అన్నిరకాల వాదాలూ అవసరమే. లేకపోతే ప్రజల, పాలకుల దృష్టి సంకుచితమైపోతుంది. ఆ స్ఫూర్తితో మీ ‘నెచ్చెలి ‘ ముందుకి కొనసాగుతూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలనీ, ఈ ప్రయత్నంలో మీరు సఫలురవాలనీ ఆశిస్తూ, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
-నౌడూరి మూర్తి
నెచ్చెలి పాఠకులకు అద్భుతమైన పద సంపదనుఅందిస్తున్న నిర్వాహకులకు ముందుగా తొలి సంవత్సర శుభాకాంక్షలు!
నిజంగానే ఓ స్నేహమయమైన ఆహ్వానం రచనా ప్రియులకు ఈ నెచ్చెలి! .నాకు ఈ పత్రికతో పరిచయం ఏర్పడి 4 మాసాలు. ఇందులో కథలు సమీక్షలు,కవితలు వ్యాసాలు, ఇంటర్వ్యూలు, నిజజీవితానికి దగ్గరగా వుండే రచనలను ఎంపికచేస్తూ కొత్త పాత రచనల మేళవింపుతో సాగుతుంది. సాహితీవేత్తల పరిచయం, అనువాద కథలు,కవితలు నన్ను బాగా ఆకర్షించిన శీర్షికలు.
ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే స్త్రీ వాద రచనలకు ప్రాముఖ్యమిస్తూ, పాతతరంలోని రచనలను వివరిస్తూనే నేటితరం రచయితలలోని విప్లవాత్మక మార్పులను స్పష్టంగా విశదీకరిస్తూ సాగే రచనలను అందిస్తున్న నెచ్చెలి నిజంగానే ఓ సాహితీ బహుమతి. “నెచ్చెలి” లో నా రచనలకు అవకాశం కల్పించిన డా||కె.గీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
-కె.రూప
మన దేశంలో తెలుగు భాషకు, మన కళలకు మనం ఇచ్చే ఆదరణ, సహాయ సహకారాలతో పోలిస్తే, అమెరికాలో మనవాళ్ళు నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాలనండి లేక, చేస్తున్న సాహిత్య సేవ ఆనండి, ఏ మాత్రం తక్కువ కాదు. కొంతమంది సంఘాలుగా ఏర్పడి చేస్తుంటే, మరికొంతమంది తామే ఒక సంఘమై ఒంటి చేత్తో నిర్వహిస్తున్నారు. అలా ఒంటి చేత్తో నిర్వహిస్తున్న వారిలో అనేక రూపాలలో అవతారమెత్తి, సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు చేసుకున్న గీతగారు ప్రధమ స్థానంలో వుంటారు. ఆమె ఏదైనా మొదలుపెడితే, అది ఆగిపోవడం అంటూ వుండదు. అందర్నీ కలుపుకుంటూ, మనదేశం నుంచీ అక్కడికి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానిస్తూ, ఎంతో సహనంతో, అన్నీ తానై అతి సహజంగా, సునాయాసంగా నిర్వహిస్తారు. తానేమిటో నిరూపిస్తారు కూడా. నేనెప్పుడూ ఆమె శక్తి సామర్ధ్యాలకు, ఓపికకు ఆశ్చర్య పడుతుంటాను. మృదువుగా, క్లుప్తంగా మాట్లాడటం ఆమె కలవాటు. సాహిత్యం, సంగీతం తప్ప ఆమెకు వేరే ధ్యాస లేదేమో అనుకుంటాను. కానీ, ఒక బాధ్యతాయూతమైన పదవిలో వుంటూ, అటు ఆఫీసులోనూ, ఇంటిలోనూ చాకచక్యంతో వ్యవహరిచడం బహుశా ఆమెకు వెన్నతో పెట్టిన విద్య కాబోలు. ఆమె మొదలుపెట్టిన ఈ “నెచ్చెలి” పత్రిక, మరి కొన్ని దశాబ్దాల పాటు అప్రతిహతంగా సాగాలనీ, తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తున్నాను.
-రామానుజరావు
11.
నెచ్చెలి “వార్షికోత్సవం సందర్భంగా ముందుగా “నెచ్చెలి గీత”కి నా శుభాభినందనలు.
నెచ్చెలి ఎడిటర్ అనక్కరలేదు ఎందుకంటే ఈ రెండు పదాలూవేర్వేరు కాదు. నెచ్చెలే గీత … గీతే నెచ్చెలి. సారధి బాగా నడిపితేనే రథం చక్కగా నడిచేది. ఒక పత్రిక నడపడానికి కావలసిన లక్షణాలన్నీ గీతకి పుష్కలంగా వున్నాయి.పూల రథం యుద్ధరంగానికి బయల్దేరినంత అందంగా వుంది నెచ్చెలి. ఈ యుద్ధంలో స్త్రీలు తమ సుకుమారమైన హస్తాలతో పదునైన అస్త్రాలను సంధిస్తారు. కలం అస్త్రం లాంటిదే!
ఆ అస్త్రాన్ని సంధించే అరుదైన అవకాశాన్ని నాకిచ్చిన నెచ్చెలికి కాదు కాదు నెచ్చెలి గీతకి నా ప్రియ ఆలింగనం. అసంఖ్యాక పాఠకాభిమానాన్ని నెచ్చెలి మూట కట్టుకోవాలని నా కోరిక.
-షర్మిల
12.
“నెచ్చెలి” అంతర్జాల వనితా మాసపత్రిక ఈ జూలై లో మొదటి సంవత్సరం అందరి అభిమానం సంపాదించుకుని దిగ్విజయంగా పుట్టిందిన పండగ జరుపుకోబోతున్న ఆనంద సమయంలో పత్రిక సంపాదకురాలు, డా|| కె.గీత కు, ఆ పత్రిక సర్వగసుందరంగా పాఠకులకి అందించడానికి ఆమెకి సహాయ సహకారాలు అందిస్తున్న మిగతా బృందానికి మనపూర్వక శుభాభి వందనాలు. ఇన్ని శీర్షికలతో ఒక పత్రిక నిర్విఘ్నంగా నెల నెల పాఠకులకి అందించాలంటే దానివెనకున్న శ్రమ, పట్టుదల, కార్యదక్షత, అంతేకాక ఎన్నెన్నో మంచి కొత్త కొత్త శీర్షికలను ఎంచి,అందరిచేత రాయించి, గుదిగుచ్చి పుస్తకరూపంగా అందిస్తున్న గీతని ఎంత అభినందించినా చాలదు. మంచి కథలు ,కవితలతో బాటూ నారి సారించిన నవల ,నవలా స్రవంతి, ఆడియోకథలు ,యాత్రగీతం ,జీవనయానం, నారీమణులు…ఒకటేమిటి ఏ పత్రిక ఇప్పటివరకు స్త్రీలకి, రచయిత్రులకు ఇవ్వనంతటి ప్రాముఖ్యత ఇస్తూ , ఇంత గొప్పగా పత్రిక నడుపుతున్న ఆమెకి మరోసారి అభినందనలు. పత్రిక పదికాలాలు నిర్విఘ్నంగా ఇదే స్థాయిలో నడపాలని కోరుతున్నాను. నేను పాతకాలందాన్ని,కంప్యూటర్ పరిజ్ఞానం అంతగా లేనిదాన్ని. అయినా నాలాటిదాన్ని కూడా ప్రోత్సహించి “జ్ఞాపకాలసందడి” రాయిస్తున్న గీతకి కృతఙ్ఞతలు. అసలు అంతర్జాలంలో చదివే అలవాటులేని నేను “నెచ్చెలి” చదివాకా అలవాటుపడ్డానంటే ఆ క్రెడిట్ కూడా గీతకే. నెచ్చెలిలో రాసే మహామహులందరికి, సంపాదకవర్గానికి రెండోయేట అడుగుపెడుతున్న శుభసమయంలో అభినందనలు.
-డి.కామేశ్వరి
13.
శ్రీమతి గీతతో నాకు ముఖాముఖి పరిచయం అయినది 2012 లో అని జ్ఞాపకం. నేనప్పుడు మా అమ్మాయి దగ్గిరకి కేలిఫోర్నియా వెళ్ళాను. నేను అక్కడ ఉన్నట్టు తెలిసి ఫోన్ చేసి పలకరించడమే కాదు వీక్షణం సాహితీ గవాక్షం అని నెలనెలా సాహిత్య సమావేశాలు చెయ్యాలనుకుంటున్నాను దానికి ప్రారంభసమావేశానికి మీరు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించింది గీత. అలా పరిచయమైంది. ఆరోజు కార్యక్రమానికి విచ్చేసిన సాహితీప్రియులతో, సాహితీప్రముఖులతో ఎంతో గొప్పగా జరిగింది వీక్షణం సాహితీ గవాక్షం ప్రారంభం. ముఖ్యఅతిథిగా నన్ను అక్కడ కూర్చోబెట్టిన గీతకి మళ్ళీ ఈవిధంగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. వాళ్ళమ్మగారు రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మిగారితో 2007 లో ముఖాముఖి పరిచయం అయింది కధానిలయం వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు. మంచిమంచి కధలు రాశారు వరలక్ష్మిగారు. ఇంక నెచ్చెలి వెబ్ పత్రిక విషయానికి వస్తే మంచి ఆశయంతో ఒక మహిళ చేపట్టి నడుపుతున్న పత్రిక దిగ్విజయంగా సాగిపోవాలని కోరుకునేవారిలో మొదటి వరసలో నేను ఉన్నాను అని గీతకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మంచి మంచి రచనలతో నెచ్చెలిని అందరికీ చేరువ చేయడంలో అనునిత్యం శ్రమిస్తున్న గీతని అభినందించకుండా ఉండలేను. అప్పటికప్పుడు అర్జంటుగా శ్రీమతి సోమరాజు సుశీలగారి గురించి నాలుగుమాటలు వెంటనే రాసి పంపించమని ఆవిడ స్వర్గస్తులైనప్పుడు ఫోన్ చేసింది నాకు. వెంటనే రాసి పంపించాను. అంత అర్జంట్ ఎందుకు అంటే నెచ్చెలి పత్రిక ఆన్లైన్లో పెట్టేసే సమయం అది మరి. ఎంత అకుంఠిత దీక్షాభావంతో గీత పని చేస్తుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చును. శ్రీమతి గీతకూ, మనందరి ఈ నెచ్చెలి పత్రికకూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
-తమిరిశ జానకి
14.
అప్పట్లో,ఇండియాలో నేనెరిగిన తెలుగు లెక్చరర్ గీత గారు మనిషంతా, మనసంతా కవిత్వ మై సంచరించేవారు. ‘ద్రవభాష’ తొలి కవితా సంపుటి ద్వారా కవిత్వ పట్టు మాత్రమే గాకుండా ప్రధానంగా మార్దవ ఛాయలలో జీవన సారాన్ని వడకట్టి చూపే పుస్తకంగా సాహితీ లోకంలో ఒక విశిష్ట స్ధానాన్ని సంపాదించుకున్నారు. అక్కడ నుండి ఆమె కలం వెనుతిరుగలేదు. శీతసుమాలు, శతాబ్ది వెన్నెల వరకు నాకు తెలుసు.
అమెరికా వచ్చాక, ‘డిపెండెంట్ ముఖం’ గా ఇష్టం లేదేమో, ఉద్యోగ అర్హతలు సంపాదించుకొని, సాఫ్టువేర్ అవతారమెత్తారు. బిజీ లైఫ్ లో సాంత్వనే కాకుండా అక్షర సృజన ‘బాధ్యత’ గా భావించినందుకే, వివిధ ప్రక్రియల పట్ల(యాత్రా సాహిత్యం, సిలికాన్ కథలు , నవలా) ఎక్స్టెన్షన్ గా కొనసాగడం ఆశ్చర్యమే.
ఇదంతా( luxury life) కాకుండా, తన సాహిత్య వ్యాసంగం తో సంతృప్తి పడకుండా,
“నెచ్చెలి” అంతర్జాల మాస పత్రిక (తెలుగు,ఆంగ్లం) స్థాపన తో సాహితీ వేత్తల సమీకరణ, పాఠకులకు సామాజిక ఆరోగ్య భావనల,చేతనల కల్పన సాధించే దిశగా ఒక తపన తనను వెన్నాడుతుందేమోనని అనిపిస్తుంది.
దాదాపు ముప్పదికి పైగా శీర్షికలతో, వస్తు వైవిధ్యాలతో, చేయి తిరిగిన రచయితలతో విషయం పట్ల కాంప్రమైస్ కాకుండా ‘ఒక్క చేతితో’ నిర్వహించడం బహుశాః తనకే చెల్లు నేమో. సంపాదకీయం లో ఒక నూతన ఒరవడిని ప్రవేశ పెట్టారామె. ప్రహసనంగా, హాస్య స్ఫోరకంగా అంశం హృదయంలో నాటుకునే విధంగా రాయడం గొప్ప తనమే.
నిబద్దత- నిమగ్నత గీత గారైతే , విజ్ఞత-నిపుణత గీత గారి సాహిత్యం.
రెండింటి మేళవింపులో ఉదయించే ఉదయమంతా సాహిత్యపు నిండు వెలుగులే.
నేను చేసిన ఫోన్ కి, మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి, కారు డ్రైవ్ చేస్తూ మాట్లాడటం, ఈ సమయం తప్ప సమయముండదనడం… గీత గారి ‘సమయ స్ఫూర్తి ’ఎంత విలువైనదో లెక్క కట్టలేనిదనటానికి తార్కాణం..
ఒక్క విలువ కోసం అనేక సమయాలు. అనేకానేక మేథోమథనాలు.
అక్షరాభినందనలతో-
-దాసరాజు రామారావు
15.
కళ్ళేలు లేకుండా పరుగెత్తేది ఒక్క కాలమే అని తెలుసు. కానీ కాలం మరి ఇంత వేగంగా పరుగులు తీస్తుందని ఇప్పుడే మన ప్రియతమ “నెచ్చెలి” ని చూస్తే నిజం అనిపిస్తుంది.
ముందుగా “నెచ్చెలి” అంతర్జాల మాస పత్రిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మా ప్రియతమ “నెచ్చెలి” కి హృదయ పూర్వక శుభాకాంక్షలు. పత్రిక అధినేత శ్రీమతి డా||కె.గీత గారికి
అభినందనలు. “నెచ్చెలి” గీత గారి మానస పుత్రిక. ప్రింట్ పత్రికలు చాల వరకు ఆదరణకు నోచుకోక ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. ఫేస్బుక్, యూ ట్యూబ్ , ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలకు ఆకర్షితులౌతున్న పాఠకుల అభిరుచిని కథలు, కవితలు అంటూ సాహిత్యం వైపు మళ్లించడం అంటే ఈ రోజులలో పెద్ద సాహసం చేయడమే. కానీ అటువంటి సాహసం చేసి సఫలీకృతులైనారు శ్రీమతి గీత గారు.
“నెచ్చెలి” తో నా పరిచయం ఓ సుమధురమైన జ్ఞాపకం. గత ఏడాది మార్చి నెలలో అనుకుంటా ఓ రోజు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఎవరు అని చూస్తే అది ప్రముఖ రచయిత్రి శ్రీమతి వరలక్ష్మి గారి నుంచి. ఒక్క క్షణం సంభ్రమాశ్చర్యాలకు గురైనాను. “రోహిణి …మా పాప గీత ఒక అంతర్జాల పత్రిక ప్రారంభిస్తున్నది. నువ్వు ఓ కథ వ్రాసి పంపు” అని మెసేజ్. గొప్ప రచయిత్రి గారు కథ వ్రాయమంటే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయినాను.
తర్వాత పత్రిక కోసం ఏం కథ వ్రాయాలి..ముఖ్యంగా ఇది నెచ్చెలుల “నెచ్చెలి”. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే పత్రిక. స్త్రీ ల సమస్యలు, ప్రగతి, అన్నీ రంగాలలో స్త్రీ ల అభివృద్ధి, సమానత్వం ఇటువంటి నేపథ్యంలో చాల కథలు వ్రాస్తున్నారు. మనం కొత్తగా ఏం వ్రాయాలి. కానీ రాసేది ఏదైనా మహిళల సమస్యలను, పరిష్కారాలను కొత్త కోణంలో చూపాలి.
రెండు రోజులు ఆలోచించాను. అప్పుడే సైబర్ మోసాలు, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్ లతో మోసపోయిన స్త్రీ ల గురించి టీవీ లో, పత్రికలలో వార్తలు వస్తున్నాయి. సంచలం సృష్టించిన బ్యూటీషియన్ శీరిష ఆత్మహత్య, అనంతరం జరిగిన పరిణామాల గురించి కథనాలు వెల్లువెత్తాయి. ఏది యెట్లా జరిగినా చివరకు నష్టపోయేది వారు కన్న బిడ్డలు. దీపపు వెలుతురుకు ఆకర్షించబడి దగ్గరకు వెళ్ళిన పురుగులు ఆ వేడికి మాడిమసై పోయినట్టు ఫేస్బుక్, వాట్సాప్ ల ద్వారా పరిచయం, తాత్కాలిక ఆకర్షణకు లోనై తర్వాత మోసపోయిన మహిళలకు ఓ కనువిప్పుగా ఉండాలని “తప్పటడుగు ” అనే కథను రాసి పంపాను.
“నెచ్చెలి” గత ఏడాది జులై లో ప్రారంభం అయింది. ఎందరో సాహితీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రారంభ సంచికలోనే మొదటి కథగా నా ” తప్పటడుగు ” కథను స్వీకరించి ప్రచురించి గొప్ప అవకాశాన్ని నాకు అందించిన శ్రీమతి వరలక్ష్మి గారికి, శ్రీమతి గీత గారికి సర్వదా నేను కృతజ్ఞురాలిని.
“నెచ్చెలి” ఇంకా ఇంకా ఎదిగి అంతర్జాల పత్రికా రంగంలో తిరుగులేని పత్రికగా రూపొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
“నెచ్చెలి” గురించి నా మాటలు కవిత రూపంలో…
“నెచ్చెలి” గీతా మానస పుత్రిక
“నెచ్చెలి”ఎందరో నెచ్చెలుల ప్రియ సఖి
“నెచ్చెలి” కమ్మని కథల ఉద్యానవనం
“నెచ్చెలి” ఎన్నెన్నో కవితా కోకిలల గాన కచ్చేరి
“నెచ్చెలి” సాహస వనితల పుట్టినిల్లు
“నెచ్చెలి” పోరాట మహిళల కదనరంగం
“నెచ్చెలి” ఇంతులకు సలహాలిచ్చే సంజీవిని
“నెచ్చెలి” అమ్మలా లాలించే కమ్మని జాబిలి
“నెచ్చెలి” అతివల అంతరంగ కవనం
“నెచ్చెలి” అచ్చంగా నెచ్చెలులు మెచ్చిన సాహితీ సహచరి
“నెచ్చెలి” ని మెచ్చని నెచ్చెలి ఉండునా ఈ నెచ్చెలులందరిలో…
-రోహిణి వంజారి
16.
గత ఏడాదిగా నెచ్చెలితో స్నేహం చేస్తున్నాను. నాకు ప్రియసఖిగా మారింది ఈ నెచ్చెలి. అసలు స్త్రీలకంటూ ఒక పత్రిక ఉంటే ఎలా ఉండాలో అన్ని లక్షణాలనూ పుణికిపుచ్చుకుని, ప్రతి నెలా పదో తారీఖు కల్లా అంతర్జాల వీధుల్లో రెక్కలు కట్టుకుని వచ్చి మనచేతుల్లో వాలుతోంది. ఈ నవరాగాల నెచ్చెలి.
సరదాగా అనిపిస్తూనే ప్రస్తుత సమస్యలని స్పృశిస్తూ సాగిపోయే గీతగారి సంపాదకీయం ముందుగా మనల్ని ఆకర్షిస్తుంది.
ఇట్లు మీవసుధారాణి, జ్ఞాపకాల సందడి, రమణీయం, ప్రమద లాంటి మరెన్నో కాలమ్స్ చాలా అద్భుతంగా మనల్ని పాత జ్ఞాపకాల్లోకి పరుగులు తీయిస్తాయి.
ఇంక బాలనెచ్చెలి లాంటి పిల్లలను కూడా అలరించే విభాగాలున్నాయి. ఇవేకాక కవితలూ, సాహితీ విమర్శలూ, పుస్తక సమీక్షలూ ఒకటేమిటి అన్ని విధాలైన సాహిత్య ప్రక్రియలతో విందుభోజనపు విస్తరిలా అన్నిరుచులతో అలరించే మన ప్రియ చెలి ఈ “నెచ్చెలి”. మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకుంటూ, సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
నెచ్చెలికి అన్నీ తానై సర్వాంగసుందరంగా నెచ్చెలిని తీర్చిదిద్దుతున్న గీతగారికి అభినందనలు తెల్పుతూ-
-పద్మజ కుందుర్తి
17.
మా ప్రియమైన గీతా మాధవీ! నెచ్చెలి అంతర్జాల మాస పత్రిక ప్రారంభించి విజయవంతముగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు. సవ్యసాచిలా రెండు చేతులతో పనులు నిర్వహిస్తుంది మా గీత అనుకునే వాళ్ళము.ఇప్పుడు దేవీ రూపముగా పది చేతులతో ఇన్ని కార్యక్రమములు చేస్తున్నావు అనిపిస్తుంది. నెచ్చెలి మంచి మంచి శీర్షికలతో అలరిస్తుంది.చాలా అంశాలు సిద్ధాంతపరంగా చర్చిస్తున్నారు. మా కథ, ఉనికి పాట లాంటివి, పుట్టపర్తి వారి లాంటి మహానుభావులు గురించి తెలుసుకోవటం,ఎన్నో శీర్షికలు చదవటం సంతోషముగా వుంటుంది. నెచ్చెలి ఎన్నెన్నో వసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ
– ఉదయలక్ష్మి ముప్పలనేని
18.
డియర్ గీత గారు, నెచ్చెలి గురించి తెలిసి చాలా ఆనందించాను. ప్రధమ జన్మదినం జరుపుకోవటం మీ కృషికి పాఠకుల అభిమానానికి తార్కాణం . రచయిత్రిగానేగాక ఒక అంతర్జాల పత్రికను నడుపుతూ సాహితీసేవను ప్రగతిశీలభావాలతో కొనసాగిస్తున్న మీకు నా హృదయపూర్వక అభిననదనలు. శుభాకాంక్షలు.
-డా. సి. భవానీదేవి
19.
ఈ సంవత్సర కాలంలో “నెచ్చెలి” తన పేరు సార్థకం చేసుకుంటూ, పాఠకుల ఆభిమానాన్ని పొందింది. నవరసాలు మేళవిస్తూ,యాత్రాగీతాలు,వెనుదిరిగిన వెన్నెల వంటి నవలా స్రవంతి, సాహితీసమావేశాలు, చక్కని కవితలు, కథామధురం, ప్రమద,తాయిలం వంటి శీర్షికలతో మంచి కథలతో అలరిస్తున్న నెచ్చెలి పత్రిక సాహితీ ప్రియులకు నవకాయ పిండివంటలతో మ్రుష్టాన్న భోజనం పెడుతోంది. జయీభవ విజయీభవ.పత్రికా సారధి గీతకు అభినందనలతో
-డా. తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం
20.
అంతర్జాలంలో పూసిన సింగిడి పువ్వు ఈ నా నెచ్చెలి!
యాడాది పాటు దిగ్విజయంగా సాగి, తన మొదటి జన్మదినమును నిర్వహించుకుంటున్న నెచ్చలికి వృదయ పూర్వక స్వాగతం. ఆకాశం లోని సింగిడి భూమిమీది ప్రతి వాకిటిలోకి తొంగి చూసి తన దోసిట పువ్వులను గడపల్లో రాశి పోసి ఆ ఇంటి ‘పిల్లలతో కరచాలనం చేసినట్లు నెచ్చెలి వెబ్ పత్రిక ఖండాoతరాల సాహిత్యాన్ని, ఖండాతరాల్లోకి అందిస్తూ విజయవంతంగా సాగుతున్నది. అందులో ప్రత్యేకంగా స్త్రీల మూలవాసీల సాహిత్యాన్ని అక్కున చేర్చుకుంటూ యాడాదికి చేరింది. ఈ నెచ్చెలి అనే గుడిసెకి ఒంటి నిట్టాడి అయి, నిరంతర శ్రామికురాలై , ఎన్ని ఆటు పోట్లు వచ్చినా విజయవంతంగా నిర్వహిస్తున్న డా||కె. గీత గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక మీదట కూడా ఇదే ఒరవడి తో ఇంతకు మించిన శక్తి సామర్త్యాలతో, ఎన్నో సింగిడీలను పూయిస్తూ నెచ్చెలి ని నిర్వహిస్తారని
– డా. గోగు శ్యామల
21.
అతివల ఆత్మగౌరవాన్ని పెంచు అలివేణి..
మగువల మనసెరిగిన మారాణి..
అంతర్జాలమున మాయాజాలం చేయు మానిని..
వనితల విద్వత్తు నావిష్కరించు విదుషీమణి..
నారి సారించిన నవలామణుల నివేదన ఈ నీలవేణి..
ప్రమదల చైతన్యానికి పునాది రాళ్ళు వేసిన పూబోణి..
కొత్త అడుగులేస్తూ కొన్నిరాగాలుతీసే రమణి..
నిత్య వసంత కాలాలతో జగదానందాన్ని పంచు శిఖరిణి..
అంతరంగాన జ్ఞాపకాల సందళ్ళతో సడిచేయు సుభాషిణి..
శతమానం భవతి ఓ శుకవాణి!!!
కళల కాణాచి మా ‘గీత’ గారి మానస పుత్రిక, కథాకాహళి మా నెచ్చెలి మాసపత్రిక…
అప్పుడే సంవత్సరం గడిచి పోయింది. మొదటి పుట్టినరోజు వచ్చేసింది. నా ప్రియ నేస్తం ‘నెచ్చెలి’ పత్రిక గురించి నాలుగు మాటలు మాట్లాడాలని నా మనసు ఆతృత పడుతోంది. రాయాలని కూర్చున్నా. ‘తెలుగువారి గారాలపట్టిని గురించి మాట్లాడగల శక్తి నాకుందా?!’ అని ఒక్క క్షణం నాలో అలజడి! అయినా ఆప్తుల గురించి, ఆత్మీయుల గురించి మాట్లాడటానికి మనసుండాలి గానీ, మాటలకు కొదవా! అడిగినదే తడవుగా నా రచనలను ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న‘నెచ్చెలి’ పత్రికా నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఇదొక మంచి తరుణం కదా!!
నాకు పరిచయం అయి కొన్నాళ్ళే అయినా… అదేంటో ఎన్నో ఏళ్లుగా కలిసి ప్రయాణిస్తున్నట్లుగా, అతి దగ్గర స్నేహితురాలు విదేశాలలో ఉండి, రోజూ ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టుగా, మన అమ్మమ్మో, అత్తయ్యో పెరట్లో గట్టు మీద కూర్చుని తన అనుభవాలను నేమరువేసుకుంటున్నట్లుగా…… అనిపిస్తుంది ఎప్పుడు చదువుతున్నా! నిత్య నూతన చైతన్యాన్ని అణువణువునా అంతర్వాహినిలా ప్రవహింపజేస్తూనే ఉంటుంది. భాషాభిమానానికి హద్దులు, సత్సంకల్పానికి ఎల్లలు ఉండవని నిరూపించి, ఖండాంతరాలలో విస్తరించి, అనతి కాలంలోనే అత్యధిక అభిమానులను సంపాదించుకుని, విలువలను విడవకుండా అప్రతిహతంగా సాగిపోతున్న ‘నెచ్చెలి’ మాసపత్రికను అభినందిస్తూ, మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తూ… సెలవు. జన్మదిన శుభాకాంక్షలు-
-విజయ దుర్గ తాడినాడ
22.
నెచ్చెలినిచ్చిన “నెచ్చెలి “
ముఖపుస్తకం పుణ్యమా అని యెన్నో కొత్తవిషయాలు అట్టే యత్నించకుండానే మన మస్తిష్కానికి వచ్చిచేరి యెక్కడోసర్దుకుని సెటిలవుతుంటాయి. అచ్చం అలాగే నెచ్చెలి అనే వెబ్ మాగజీన్ గురించి విన్నానేగానీ వివరాలు తెలీవు. పేరుబాగుందే అనుకున్నానంతే.
అలాంటిది… నేను గత జనవరి లో కాలిఫోర్నియా లో మా వాళ్లింట్లో మూడువారాలున్నపుడు అక్కడ వసంతఋతువుఆరంభమనుకుంట.. ప్రతిగుమ్మమూ పుష్పసౌరభాలతో మనసును కట్టిపారేస్తున్న పరవశాన్ని యథాలాపంగా ఫేస్బుక్లోకెక్కించాను. ఆపోస్టు మన గీతామాధవిగారి కంటపడటం నిజంగా నా అదృష్టం.
వెంటనే వారినుండి నాకు ఫోనూ.. మరునాడు రథసప్తమి అని బాగా గుర్తు. మాయింటికి గీతగారు వచ్చి మాటామంతీ సలిపి ..నెచ్చెలి వెబ్ మాసపత్రికకు నా యూట్యూబ్ చానెల్, వసంతవల్లరి నుండి నేను చదువుతున్న కథల లింకులను నెలకొకటి యివ్వమని అడగడం జరిగింది. పాత లింకులెందుకు కొత్తకథలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తుండగా అన్నాను. మీయిష్టమన్నారు.
వారి రచనలను, వారి మాతృమూర్తి కె.వరలక్ష్మి గారి కథలపుస్తకాలనూ నాకు బహూకరించారు.
వాటిని బహుజాగ్రత్తగా హైదరాబాదుకి చేరవేసుకున్నాను,వాటిస్థానే నాబట్టలను మాఅబ్బాయివద్దే వదిలేసిమరీ !
వరలక్ష్మి గారి కథనే ఎంచుకుని లింకు పంపడం, ఫిబ్రవరి 2020 ఎడిషన్ లోనే నా ఆడియో వినడం జరిగిపోయాయి. మార్చికల్లా నా కూతలకు జతగా, నిత్యజీవనహాస్యపుఘటనల “వసంత కాలమ్” పేరుతో నెచ్చెలి నారాతలకూ చోటిచ్చింది. నెల పొడవునా వీలు చేసుకుని చదువుతూ వింటూన్నా నెచ్చెలి సిలబస్ పూర్తిచేయాలన్న కోరికతీరడం లేదు.
-వసంతలక్ష్మి అయ్యగారి
23.
Neccheli, true to its name, Smt. Geeta garu a wonderful person made an effort and brought many friends and friends to become in future to a single platform, sharing myriad expressions over the globe. My heartfelt congratulations on this significant first anniversary celebration.
A fine endeavor which stepped into success from the beginning; an amazing tireless service warrior herself, has a great team, pooling in a greater friend’s circle, spreading many insights of life.
I have known and been seeing Geeta garu’s multi-talented facets of creative expressions, serving in our Silicon community and beyond and when she asked me to share in this community, I started writing for the column Upaasana. It’s been an inspiring journey. I look forward every month to those quiet creative moments, as I type in my words and paragraphs to send my article file. A fulfilling experience it has been.
Congratulations Neccheli team on the first anniversary, a milestone mark. Wishing many more to join the circle of friends and readership.
Keep rocking!
Best,
Satyavani
24.
“నెచ్చెలి” ఈ పేరు ఎంతటి ఆత్మీయతను ఒక నిర్వచించలేని అనుబంధాన్ని సూచిస్తుంది, ఇటువంటి చక్కని పేరుతో వచ్చే ఈ పత్రిక పాఠకులకు దగ్గరైపోతుంది ముందుగా. అంతే స్నేహ భావం సౌహార్ద్రం చూపిస్తారు గీతగారు. ఈ పత్రికతో చేయి కలపి నడవడం కొసాగించాలనుకునే మంచి అనుభవం.
పత్రికలోని ఫీచర్సు కథలూ పుస్తకపరిచయాలు యాత్రాను భవాలు సంపాదికీయం చదివింపచేసేవిగా కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటే,
వినడానికి ఉద్దేశించి ఉంచిన ఆడియో కథనాలు కూడా వినసొంపుగా ఉంటాయి. ప్రముఖుల రచనలు కథలూ అనుభవాలు పొందుపరచిన విలువైన మణిహారం ప్రతి నెలా నెచ్చెలి సంచిక.
పాతకాలం నాయికలతో , కొత్తతరం నాయికలను పోల్చుకుంటూ, “జానకి జలధితరంగం” పేరిట రాస్తున్న నా శీర్షిక కు నెచ్చెలి లోచోటు కల్పిస్తున్న ఎడిటర్ నెచ్చెలి గీతగారికి నా కృతజ్ఞతలు.
“నెచ్చెలి” సాహిత్య మాస పత్రిక ప్రథమ జన్మదిన సంచికకు అభినందనలు తెలుపుతూ, ముందు ముందు అంతర్జాల వీథులో నలు దిక్కులా “ నెచ్చెలి” తన స్నేహపరిమళాలు వెదజల్లలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
-జానకీ చామర్తి
25.
నెచ్చెలి..ఎంత మంచి పదం!! ఎంత హాయినిచ్చే పదం!! ఎంత ఊరటనిచ్చే పదం!! ఎంత ధైర్యాన్నిచ్చే పదం!! ఎంత ప్రేమనందించే పదం!! పదకోశంలో నెచ్చెలి పదానికి, స్త్రీ, పురుష భేదం లేదు. మనకు ఆప్తులైన, శ్రేయోభిలాషి ఐన, హితులైన, సహృదయులెవరైనా మనకు నెచ్చెలులనవచ్చు.
ఒకప్పుడున్న పత్రికలు, అప్పటి పఠనాసక్తి, మెల్లిమెల్లిగా కనుమరుగవుతున్న కాలంలో పత్రికను ప్రారంభించటమే ఒక ధైర్యమనుకుంటే, ప్రత్యేకించి తెలుగు రచయిత్రుల పత్రికను సంపాదక బాధ్యతలతో పాటూ ప్రారంభించటం నిజంగా పెద్ద సాహసమే!!
1960 ప్రాంతాల్లో మోహనవంశి లతగారు సంపాదకురాలిగా, లత అన్న మాసపత్రికను ప్రారంభించారు. ఎన్నో సాహిత్య విలువలతో నడిచిన పత్రిక అది. పైగా అందరి పత్రిక. మా అయ్యగారు తన జీవితానుభవాలు ధారావాహికంగా వ్రాశారు దానిలో!! ఐదారు నెలలు చక్కగా నడిపినా తరువాత , వివిధ కారణాలవల్ల అర్ధాంతరంగా ఆ పత్రిక ఆగిపోయింది. ఆర్థిక స్థైర్యం అప్పట్లో చాలా అవసరంగా ఉండేది, పత్రికలు నడిచేందుకు!!
తరువాతి కాలంలో,వేరు వేరు యాజమాన్యాలలో, శ్రీమతి కే.బీ.లక్ష్మి (విపుల,చతుర), శ్రీమతి ఏ.ఎస్. లక్ష్మి (ఆంధ్రభూమి – మాస పత్రిక) సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ చాలాకాలమే ఆయాపత్రికలను నడిపిన కీర్తిని అందుకున్నారు.
ఇది అంతర్జాల పత్రికల కాలం. నెట్ లోకి ప్రవేశిస్తే,భిన్నాభిరుచులతో, ఎన్నో పత్రికలు!! ఇప్పుడు ఇలాంటి సమయంలో, పత్రికను మొదలుపెట్టటమే, నిజమైన సాహసం!! ఆ ఆలోచన అమెరికా గడ్డమీద పుట్టటం, ప్రత్యేకించి రచయిత్రుల పత్రికను పెట్ట పూనుకోవటం, మరో సాహసం. ఒకటికి రెండు సవాళ్ళను అలవోకగా స్వీకరించి అంతే అలవోకగా పత్రికను నెల నెలకూ పెరుగుతున్న రేటింగులతో విజయవంతంగా నడిపి, ఇప్పుడు ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను కూడా తీసుకురాబోతున్న డా.కె.గీత గారి యీ ధైర్యం వెనుక ఉన్న పెద్ద అండ, తెలుగు సాహిత్య వీధుల్లో చిరపరిచితులైన వారి అమ్మగారు, వరలక్ష్మి గారు. మరో కారణం గీతగారు కూడా పేరొందిన కవయిత్రి కావటం కూడా!! నెచ్చెలి శీర్షికలను చూస్తే అర్థమౌతుంది గీతగారి సామర్థ్యమేమిటో!! కథ, కవిత, అనువాద రచనలు, జీవితానుభవ పరిమళాలు, లబ్ధప్రతిష్టులతో పరిచయాలు, పర్యటనానుభవాలూ, వీటన్నిటితోపాటూ, యువ ఆంగ్ల కలాల పరిచయం – ఇన్ని వైవిధ్యాలతో నెచ్చెలిని ముచ్చటగా గీతగారు తీర్చిదిద్దుతున్న వైనం, అద్భుతం. అభినందనీయం.
ఇటువంటి పత్రికలకు రచనాపరమైన, సాంకేతిక పరమైన సొబగులద్దటానికి, ఆ రెండు రంగాలలోనూ పదునున్న సంపాదకులే అవసరం. ఈ రెండు గుణాలూ కలబోసుకుని, సంపాదకీయాలలో అప్పుడప్పుడూ వెలువరించిన, క్రమశిక్షణ, సమయపాలన వంటి గుణాలనూ చక్కగా జీర్ణించుకున్న డా.గీతగారు, ఎంతో సమర్థవంతంగా నెచ్చెలిని తీర్చిదిద్దుతూ, క్రమం తప్పక ప్రతినెలా పదవ తారీఖున వెలువరిస్తుండటం, ఆమెలోని నిబద్ధతకు తార్కాణం.
సార్థక నామధేయురాలైన డా.గీతాకళ గారి సంపాదకత్వంలో, అటు గీతాచార్యుని జీవన సూత్రాలనూ, ఇటు పున్నమి చంద్రుని షోడశ కళలనూ కలబోసుకుని అవతరించి, సంవత్సర కాలంగా అలరిస్తున్న నెచ్చెలికి వార్షికోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. నెచ్చెలి ఇలాగే విజయవంతంగా మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ-
-పుట్టపర్తి నాగపద్మిని
26.
హాపీ బర్త్ డే డియర్ నెచ్చెలి!
నెచ్చెలి గురించి చెప్పే ముందు మీకు నేను – నెచ్చెలి ప్రేమికురాలు, సంపాదకురాలు అయిన గీత గారి గురించి చెప్పాలి.
ముందుగా – గీత గారిని నాకు పరిచయం చేసిన కృష్ణ మోహన్ మోచర్ల గారికి ధన్యవాదాలు తెలియచేయాలి.
కాలిఫోర్నియా కి వచ్చిన కొత్తల్లో – వీక్షణం సాహితీ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి గీత గారిని ఆ నాటి సాహితీ సమావేశం లో మొట్టమొదటి సారిగా కలవడం జరిగింది.
ఫోన్లో నే పరిచయం అయినా, నన్ను వెంటనే గుర్తు పట్టి, ఎంతో ఆదరంగా ఆత్మీయంగా ఆహ్వానించి, అక్కడున్న పెద్దలందరకీ పరిచయం చేసి, వేదిక మీద నా చేత కథ చదివించి, గౌరవించి, ప్రశంసించారు.
ఆ రోజొక తీపి గుర్తు గా నిలిచిపోయింది నాకు.
కారణం నాకు ప్రాముఖ్యత నివ్వడం వల్ల కాదు. తాను నిర్వహిస్తున్న సభలో పది మంది సాహితీపరులు మాట్లాడాలి, ప్రసంగించాలి, అది తను విని ఉప్పొంగాలి అనే గొప్ప సంస్కారం గల స్త్రీ మూర్తిని కలుసుకున్నందుకు సంతోషమేసింది.
సభకి విచ్చేసిన పెద్దలను, ఆహ్వానించిన సాహితీ వేత్తలను, గాయనీ గాయకులను, కవులను, సమీక్షకులను..ఇలా అందరకి అన్ని అవకాశాలు కల్పించడం ఒక ఎత్తు ఐతే, మరో వైపు ఆ నాటి వేదిక మీదకి సభా అధ్యక్షకులు గా ఒకరు, సభా నిర్వహణ కై మరొకరు, ప్రసంగీకులు మరొకరు, ఇలా ప్రముఖులని వేదిక మీద చేర్చి..తాను మాత్రం దూరం గా నిలబడి..సభని తిలకిస్తూ..పులకిస్తూ..నవ్వుతూ..ఎంతో తృప్తిని పొందుతూ నిలబడిన గీత గారి నిండైన వ్యకిత్వ రూపం నా మదిలో ఎప్పటికి అలా చెక్కుచెదరకుండా నిలిచే వుంటుంది.
కళా రాధన అంటే అది.
సాహితీ సేవ అంటే ఇది. సాహితీ పరులను సత్కరించుకోవడం అంటే ఇది. సరస్వతీ పూజ అంటే ఇదీ.
ఆమె ఏమీ రాని మనిషి కాదు. కవయిత్రి. రచయిత్రి. నావలిస్ట్. సమీక్షకురాలు. సాహిత్యం లో ఏ అంశం గురించైనా నాన్ స్టాప్ గా, తెలుగు ఆంగ్ల భాషలలో ధారాళంగా మాట్లాడ గల సమర్ధురాలు. ఆమె వేదిక మీద మాట్లాడుతుంటే ఆకర్షణీయం గా వుంటుంది. మొదటిది వారి నిండైన వేష ధారణ. రెండోది, తీయని గళం. చెక్కు చెదరని దరహాసం.
లలిత గీతాలను ఆలపించడంలో – ఆమె గాన కోయిల! సినీ గీత రచనలో కూడ ప్రవేశం వున్న లిరిసిస్ట్.
తన సంస్థ లో, తాను నిర్వహిస్తున్న సభలో – వారి మాతృమూర్తి వరలక్ష్మి గారి రచనలు కానీ, వారి రచన ల గురించి కానీ ప్రస్థావనే వుండదు. సభా సమయం అంతా ఇతరులకే పంచుతారు. ఎంత నిరాడంబరత! ఎంత సాహితీ మన్నన! ఎంత ఔన్నత్యం!
వీరి కవితా సంపుటిని మొట్టమొదటి సారిగా చదివినప్పుడు చాలా అబ్బురపడిపోయాను.
కష్టంలో కుములుతున్న నారింజ చెట్టు దగ్గర కూర్చుని, దాని వెన్ను నిమిరి, కొమ్మల్ని స్పృశించి, ప్రేమగా మాట్లాడుతూ, దాని దుఃఖాన్ని పంచుకున్న గీత గారి ఫోటో మీకు త్వరలో పరిచయం చేస్తా.
అమ్మ చెట్టుని ఓదార్చడం, తల్లిలా కాచడం, ఆ చెట్టుకి ధైర్యాన్నిచ్చి, కడుపు శోకాన్ని దూరం చేయడం చూసి నా కళ్ళు చెమర్చాయి. వెంటనే మెయిల్ చేసా..అభినందిస్తూ.
అంతే కాదు, కవితా సంపుటి గురించి సభలో మాట్లాడాలనే నా నిర్ణయాన్ని ఆమె ముందు వొప్పుకోలేదు. కాదూ కూడదని పట్టు బడితే..కాదన్లేక ‘సరే పది నిముషాలు ఇస్తా సమయం..’ అన్నారు.
ఎక్కడా..ఐదు నిముషాలైనా కానిదే..మొహమాట పడిపోతుంటే నేనే ముగించేసా..సమీక్షని.
అంత మొహమాటస్తురాలు. పొగడ్తలకి, మోసేయడాలకి బహు దూరం.
వారి ఉత్సాహాన్ని, ఆ చురుకైన పరుగునీ, టైం మేనేజ్మెంట్ ని చూసి అన్నాను..’గీత గారు పనిలో పని ఒక మాగజైన్ కూడాపెట్టేయకూడదూ’ అని.
నవ్వి తలూపారు.
అప్పటికే వారు ప్లాన్ చేసారో ఏమో..ఆ మరుసటి నెల సమావేశంలో అనౌన్స్ చేయడం జరిగింది ‘నెచ్చెలి’ గురించి.
మనఃస్ఫూర్తి గా అభినందించా.
ఒక కవయిత్రి. ఒక కథా రచయిత్రి. ఒక నావలిస్ట్. ఇప్పుడు ఎడిటర్ గా మరో ఎత్తైన మెట్టు మీద చూడటం నాకెంతైనా ఆనందకరమైన విషయం.
వ్యక్తి సంస్కారమే సాహిత్య సంస్కారం. సాహితీ సంస్కారమే వ్యక్తి ఔన్నత్య స్వభావం గా రూపు దిద్దుకుంటుంది.
ఎంత ఎదిగినా ఒదిగి వుండే తత్వం వారిలో చూస్తాం.
వ్యక్తిగా కూడా చాలా సహనవంతురాలు అని నాకర్ధమైపోయారు. ఎలా అంటే..నా లాటి బద్ధకస్థురాలి తో కూడా ఫీచర్ రాయించుకునే నేర్పు, ఓర్పు లని చూసి ఔరా! అని మెచ్చుకుంటుంటాను.
ధన్య వాదాలు గీత గారు! మీ సహనమే మాగజైన్ కి శ్రీరామరక్ష గా నిలుస్తోంది.
నెచ్చెలి – ఇప్పటికే పలువురి ప్రశంసలను అందుకుంటోంది. చక చకా రీడర్షిపి ని అతి వేగంగా పెంచుకుంటూ పోతోంది. సంతోషం.
అయినా, మీ మనసులో ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు మెరుస్తూనే వుంటాయి.
నాకు తెలుసు. మీరు నిదురలో కూడా నెచ్చెలి ని మరువరు. అది మీ మానస పుత్రిక.
కాబట్టి, ఎప్పటికప్పుడు పత్రికను నూతనంగా తీర్చిదిద్దడం లోనే మీ మనసు నిమగ్నమై వుంటుంది.
సదా నూతనంగా, వైవిధ్యభరితంగా మీదైన ఒరవడిలో, మెరుపైన శైలి లో, సరస రీతిలో..పాఠక మనసులను దోచుకునే ఫీచర్స్ తో..కథలతో..రచనలతో పాఠకుల మనసులను మరింత గా దోచుకుంటుందని ఆశిస్తూ..అభిలషిస్తూ..
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.
హాపీ బర్త్ డే నెచ్చెలీ!
ఆల్ ద బెస్ట్ గీత గారు!
-ప్రేమతో…
ఆర్.దమయంతి
27.
నెచ్చెలి అంతర్జాల మాసపత్రిక నాకెంతో నచ్చింది. ముఖ్యంగా నెచ్చెలి ద్వారా ప్రపంచం చాల చక్కటి వేదిక అని నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమందిని ఒకచోట చేర్చి వారిని ప్రోత్సహించి వారిలో ఉన్న ప్రతిభని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఇంత చక్కటి మాసపత్రికని నిర్వహించాలంటే చాలా సమయం కేటాయించాలి. అలా సమయాన్ని కేటాయించి పెద్ద, చిన్న పిల్లల రచనలు, యాత్రా దర్శనాలు ఎన్నో ఇంకెన్నెన్నో గుప్పించి ఒక కదంబమాలని అందిస్తున్నారు. నా రచనని కూడా నెలనెలా ఇందులో వచ్చే అవకాశాన్నిచ్చినందుకు కృతజ్ఞతలు. నెచ్చెలి మాసపత్రిక ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని. నెచ్చెలికి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
-దామరాజు నాగలక్ష్మి
28.
చక్కని కథలతో,వ్యాసాలతో,కవితలతో ,సీరియళ్లతో తెలుగు పాఠక లోకాన్ని అలరిస్తున్న “నెచ్చెలి” వెబ్ మాసపత్రికకు జన్మదిన శుభాకాంక్షలు.
-భార్గవి
నువ్వు నీ ఇంటిబయట తోటలో కూర్చుంటే
నీ వొళ్ళో ఒద్దికగా అమరి కూర్చుంటుంది.
నువ్వు పనులతో అలసి సొలసి పడకగదిలో
నడుమువాల్చి కళ్ళు మూసుకుంటే నీ గుండెలమీద నిశ్చింతగా
విశ్రాంతిగా అదీ వాలిపోతుంది.
నీ చదువులగదిలో నిట్టనిలువుగా కూర్చుని
ధ్యానముద్రలో నువ్వుచదువుతుంటే
నీ ఙానసముపార్జనలో భాగస్వామి తానే!
నీనిరంతర పరిశ్రమలో సదా వెన్నంటి వుండే నెచ్చెలి, సఖి!
నిన్ను కవ్విస్తుంది, నీ మనస్సుని మెలిపెడుతుంది,
నీ తెలివిని సవాలు చేస్తుంది
నిత్యమై సత్యమై నీ మేధాసముద్రపు
గాఢతని, నీ ఆలోచనావిహంగాల ఎత్తులని
కొలిచేందుకు, నీకు కొలమానాల్ని ప్రసాదిస్తుంది!
నీలాకాశమంత విశాలమై
బంగాళాఖాతమంత గాఢమై
ఈరెంటినీకలిపుతూ నీ మేధస్సరిహద్దులని
విస్తారింపజేసే ఈ నెచ్చెలిఎవరు?
ఎవరీమె?
నేటి కంప్యూటర్ల సినిమాల టీవీలతెరలకీ సరితూగని
సాటి రాని అచ్చమైన సత్యమైన నేస్తం
పురాణకాలమంత పురాతనమై నిత్యనూతనమైన నీ అచ్చుపుస్తకం!
-కల్లూరి శ్యామల
30.
నెచ్చెలీ! ఓ నెచ్చెలీ!
నువ్వే నా ప్రియమైన చెలి
వింతలూ, విశేషాలతో
సరి కొత్త కథల
కమామిషులూ,
వనితకు వెన్నుదట్టే,
భరోసాల భంగిమలతొ
చిత్ర విచిత్రపు
సంగతులను,
అందిస్తూ ,
అలరిస్తూ
అందమైన బాపుబొమ్మలా
వయ్యారాల చెలీ!
నెచ్చెలి! ఓ సఖియా!
శతమానం భవతని
భావిస్తున్నా! నిను దీవిస్తున్నా!
– లక్ష్మి మల్లాది
*****
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
గీతగారు, నెచ్చెలి ప్రథమ వార్షిక సంచిక చాలా బాగుంది. తీరిక లేని పనులతో ఉండే మీరు ఎంతో సమయం వెచ్చించి, శ్రమకోర్చి నెచ్చెలిని సకల కళా సరస్వతిలా తీర్చి దిద్దారు. అభినందనలు. అందులో నా కథ చోటుచేసుకోవడం సంతోషం. కొన్నేళ్ళ క్రిందట వేమూరు రావు గారి ఇంటిలో మిమ్మల్ని కలిసాను మీ వీక్షణం ముఖ్య అతిధిగా. తరువాత నేను “వీక్షణం” సభకు వచ్చిన ప్రతిసారి మీరు ఎంతో ఆదరించారు.”నెచ్చెలి” పత్రిక తెస్తున్నట్టు, రచనలు పంపమని అడిగారు.గత సంవత్సరం నవంబర్ లో వీక్షణం వార్షికోత్సవంలో నా సప్తమ కథాసంకలనం ” జగమంత కుటుంబం” ఆవిష్కరించారు. ఇన్నాళ్ళకు నేను నెచ్చెలి చేయి అందుకున్నా. మీరు, మీ పత్రిక శుక్లపక్ష చంద్రునిలా ప్రవర్థమానం కావాలని అభిలషిస్తూ మీ
కె. మీరాబాయి ( తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం )
మీరాబాయి గారూ! మీకు నెచ్చెలి నచ్చడం చాలా సంతోషమండీ. మీ అభినందనలకు ధన్యవాదాలు. నెచ్చెలికి మీ రచనలు తప్పక పంపిస్తూ ఉండండి.