
బహుళ-1
– జ్వలిత
జీవితాలను , అనుభవాలను ప్రతిబింబిస్తూ అనాదిగా మనిషికి ఊరటను కలిగించేది కథ. కథకు నిర్వచనం చాలామంది చాలా రకాలుగా చెప్పినా, స్థూలంగా గ్రహించే అంశం “ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మనోస్థితి, వీటిలో కొన్నింటిని లేదా అన్నింటినీ ఆధారంగా చేసుకుని సాగే ఇతివృత్త వివరణ కథ”. కథలో చెప్పిన అంశానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, చెప్పకుండా ఒదిలి ఆలోచన రేకెత్తించే వాటికి అంతే ప్రాధాన్యత ఉండడం కథ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే సాహిత్యంలో కథను నవల, నాటకం నుండి విభిన్నంగా నిలిపాయి.
హాలుని గాధాసప్తశతి ప్రాకృతభాషలో లిఖిత పూర్వక భారతీయ తొలి కథాసంపుటి. 19వ శతాబ్దంలో తెలుగులో బ్రౌన్ “తాతాచార్యుల కథలు”, మధిర సుబ్బన్న దీక్షితులు “కాశీ మజిలీ కథలు”, మర్యాద రామన్న కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యులకథలు, చార్ దర్వేష్ కథలు, బట్టి విక్రమార్కులకథలు, మెకంజీ కైఫీయత్తులలోని వివిధ స్థల పురాణాలు, వివిధ చేతివృత్తులవారికథలు , గిరిజనుల కథలు, జానపద కథలు, పొడుపు కథలు మొదలైనవి. గోండులు చెప్పుకునే కథల్ని “ఎల్విన్”, చెంచులు చెప్పుకునే కథలు “హైమన్డార్ఫ్” సంకలనం చేసి, ఇంగ్లీష్ అనువాదాలు చేసి తెలుగు కథకు గొప్ప ఉపకారం చేశారు. అయితే వాటి కంటే ముందే మౌఖిక సాహిత్యంలో “కథ” ప్రచారంలో ఉంది.
ప్రస్తుతం “బహుళ” పేరుతో నిర్వహించే ఈ శీర్షికలో ‘కథ’లో చెప్పబడిన ఒక అస్తిత్వ వేదన, వాదన వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కథలను ఎంపిక చేయడం ముఖ్యాంశం. అవి బహుజనీనం, బహుముఖీనం అయిన కథలు మాత్రమే. విస్మరణకు వివక్షకు గురైన ఒక సింహభాగం తమ గళాన్ని వినిపించిన కథలు. అధిక సంఖ్యాకులైన బహుజనుల జీవిత అనుభవాలను ప్రతిబింబించే కథలు. విజేత కథలను మాత్రమే వినడానికి, చదవడానికి అలవాటైన ప్రపంచానికి “ఓడిన వారి కథలు, పడిపోయినా లేదా పడదొక్కినా కూడా లేచే ప్రయత్నం చేసిన వారి కథలు ఇందులో మీరు చదువుతారు. పితృస్వామ్య ప్రపంచంలో పురుషస్వామ్య సాహిత్యంలో ఒక రచయిత్రి కథను మొదటగా గుర్తించ బడటానికే దాదాపు వంద సంవత్సరాల కాలం పట్టింది అంటే ఎంత విస్మరణకు మహిళా గళం లోనయ్యిందో అర్థం అవుతుంది.
భార్గవి రావు “నూరేళ్ళ పంట కధా సంపుటి” ద్వారా “బండారు అచ్చమాంబ” రాసిన కథను తెలుగు మొదటి కథగా పరిచయం చేశారు. నేటి కథ 1902లో బండారు అచ్చమాంబ / కొమర్రాజు అచ్చమాంబ రచించిన “దంపతుల ప్రధమ కలహం”, “హిందూ సుందరి”పత్రికలో ప్రచురించబడింది.
” నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహ మగుట మూలమున భర్తకు దాసి నగుదునా ఏమి”. అనే ప్రశ్న పూర్వక వాక్యాలతో కథ మొదలవుతుంది. ఇప్పటికీ దాదాపు 120 సంవత్సరాల క్రిందనే ఈ ప్రశ్న వేయగల చైతన్యం కథలో కనిపిస్తుంది.
పతియే ప్రత్యక్ష దైవం అయిన కాలం అది. నిద్ర లేవగానే భర్త పాదాలకు నమస్కరించే కాలంలో మొలకెత్తిన ప్రశ్న “భార్య అంటే దాసి కాదు అనే ధిక్కార గళం” అది. ఇక ఆప్రశ్న కలహానికి కారణం కాక ఏమౌతుంది. అదే ఇతివృత్తంతో రాసిన “దంపతుల ప్రధమ కలహం” కథలో నాలుగు పాత్రలు ఉంటాయి. కథానాయిక లలిత, ఆమె భర్త నారాయణరావు , పార్వతమ్మ లలితకు అమ్మమ్మ, ఆమె తల్లి పేరు వివరించబడ లేదు.
కానీ మనవరాలితో సాగే సంభాషణలతో కథ నడుస్తుంది. మధ్యలో పార్వతమ్మ వేరేవారి అనుభవము చెప్తున్నట్టు, తన గురించి తాను చెప్పి, ఇటువంటి ప్రశ్నల ద్వారా జీవితాలు నాశనమవుతాయని హితబోధ చేస్తుంది. ఆ విధంగా ప్రశ్నించినందుకు లలితకు పశ్చాత్తాపాన్ని కలిగించి, లలిత మనసును దహించి, కరిగించి, మెత్త పరిచి, మూస పద్ధతిలో మామూలు భార్యగా పతికి అనుకూలవతి గా మార్చడంతో కథ ముగుస్తుంది.
లలిత నారాయణరావు భార్యాభర్తలు. వారి పెళ్ళయి రెండు నెలలే గడిచింది. నారాయణరావు పట్టబద్రుడు మంచి ఉద్యోగం పొందిన వాడు. ఉద్యోగ నిమిత్తం రాజమండ్రిలో భార్యతో మకాం పెడతాడు. అతని తండ్రి ఆర్థికంగా స్థితిమంతుడైనందున పనివాళ్ళున్నందున లలిత పనిచేయవలసిన అవసరం లేదు.
నారాయణరావు ఒక రోజు నాటకం చూసేందుకు టికెట్లు తెచ్చి లలితను రమ్మంటాడు. లలిత తన అమ్మమ్మ వద్దకు వెళ్ళాలనుకుంటుంది కాబట్టి నేను రానంటుంది. ఇక్కడే స్పర్థ మొదలవుతుంది.
భర్త నాటాకానికి వెళ్ళగానే లలిత అదే ఊరిలో ఉన్న అమ్మమ్మ దగ్గరికి పోయి విషయం చెప్పే సంభాషణతో కథ మొదలవుతుంది. కానీ పార్వతమ్మ లలితవి బాల చేష్టలు అంటుంది. భర్తవద్ద తగ్గి ఉంటే నష్టమేమిటని అడుగుతుంది.
చివరికి తన కథ చెప్పి పార్వతమ్మ తన జీవితంలో నష్టపోయింది కూడా ఇటువంటి అర్ధం లేని పౌరుషంతోనని భయాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ మనమొక విషయం గమనించాలి భారతదేశంలో స్త్రీ వాద వాసనలేని సమయంలో సంఘసంస్కర్తల ప్రభావం ప్రబలక ముందే రచయిత్రి హక్కుల ప్రశ్నలను లేవనెత్తి కథను మొదలు పెట్టారు.
“అమ్మమ్మా! నేను నా భర్తకు విక్రయింపబడిన పరిచారికనేమో న్యాయంగా విచారించి నీవే చెప్పు?”
“నీవు నీ పతి యొక్క పట్టపు దేవివే గృహలక్ష్మీవే దాసీవిగావు”.
“అయితే ఆయన నన్ను గృహ యజమానురాలిగా నెంచి మన్నించి ప్రేమింపవలయును కదా!”
ఇట్లా సాగుతాయి వారి మాటలు.
భార్యాభర్తల మధ్య సంభాషణ ఈ విధంగా ఉందీ
” నేడు నాటకమునకు పోయి చూడ వలెను గాన త్వరగా భోజన ప్రయత్నం చేయించు. ఈ నాటకమునకు మనమిరువురము పోవలయును” సంతోషముగా భార్యకు చెప్పెను.
లలిత కోపంతో “నాటకము చూడబోవలెనా? ఎవరు పోవలెను” అని విసుగు కొనెను. అంత నారాయణ రావుకు సంతసమునడుగంటి, అతడికి ఒక విధమైన చిన్నతనము తోవ “మనమిద్దరం పోవలె” అన్నాడు.
లలిత “మీరు ఒక్కరు చూడ బొండు నేను రాను” అని విదిలించెను. “
నీవు రావలెను రాక తప్పదు. మనమిరువురకై ధనవ్యయం చేసి టికెట్లు తెచ్చితిని”
” మీరు ఒక్కరే చూడబొండు. టికెట్లు కొన్నప్పుడు నన్ను అడిగితిరా? నేడు నేను వచ్చుటకు వీలులేదు. వేరొక స్థలమునకు పోవలెను”
ఈ విధంగా సంభాషణ కొనసాగి నారాయణ రావు ఒక్కడే నాటకానికి వెళ్తాడు. కానీ నాటకాన్ని చూడలేక గోదావరి ఒడ్డుకు పెళ్లి ఇటువంటి భార్యతో కాపురం చేయడం కష్టమని ఆలోచిస్తూ ఉంటాడు.
అమ్మమ్మమాటలతో భయం కలిగిన లలిత ఇంటికి వచ్చి భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది మధ్యలో రచయిత్రి కథా ప్రవేశం చేసి “భర్త యిల్లు వెడలిన తోడనే లలితయు శాంతిహీనమగు మనముతో లేచి యాగ్రామమునందే యున్న తన ముత్తువ ఇంటికి నరిగెను అచటనామె ముత్తువతోనాడిన సంభాషణ యీ కథకు ప్రారంభముననే వ్రాసితిని” అంటారు. ఇది కథా రచనలో లోపమని సాహసం చేయను గాని కథలో ఇమడలేదు అని చెప్పగలను.
ముత్తువ వంటి మరుగైన పదాలు, భాషలో నాటి వచన సంప్రదాయాన్ని కూడా మనం తెలుసు కోవచ్చు.
అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇంత పెద్ద భారీ ఎత్తున ప్రశ్నించే చైతన్యం కలిగిన లలితను భయపెట్టవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు. ఆనాటి రచయిత్రి ఆ పాటి ఆలోచనలను రేకెత్తించడం గొప్పగా భావించి, ప్రశంసించాలి మనం. అయితే అంతకుమించి స్త్రీ స్వేచ్ఛ విస్తృతంగా చెప్పడం వల్ల ఎదురయ్యే వ్యతిరేకతలకు కొంత వెరచి ఉండవచ్చునని అనిపించింది. అనేక భాషల జ్ఞానాన్ని కలిగిన రచయిత్రి భర్త ఉద్యోగం ద్వారా అనేక ప్రదేశాలను రాష్ట్రాలను చూడగలిగిన అనుభవజ్ఞులురాలు. కొమర్రాజు లక్ష్మణరావు సోదరిగా ఇంటి వద్దనే అనేక గ్రంధాలను చదవగలిగి, భర్త బండారు మాధవరావు ప్రోత్సాహంతో అబలా సచ్చరిత్ర రత్నమాల” అనే గ్రంథరచన చేయగలిగిన సమర్థురాలు. కనుకనే ఆ మాత్రం రాయగలిగారు.
విద్యకు నోచుకోని అక్షర జ్ఞానం సాధ్యపడని మిగిలిన బహుజన స్త్రీలకు ఆ కాలంలో కనీసం పాఠకులుగా కూడా నిలువలేక పోయారు మొత్తానికి ఈ కథలో అందరూ చదివి తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి.
*****

కలం పేరు జ్వలిత. అసలు పేరు విజయకుమారి దెంచనాల. స్వస్థలం పెద్దకిష్టాపురం,ఉమ్మడి ఖమ్మం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు.
రచనలు-
1)కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం)
2)మర్డర్ ప్రొలాంగేర్-2008 (కవిత్వం,ఆంగ్లానువాదం)
(3)సుదీర్ఘ హత్య-2009(కవిత్వం)
(4)ఆత్మాన్వేషణ -2011(కథలు )
5)అగ్ని లిపి- 2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం )
6) జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు)
7) సంగడి ముంత- 2019(కవిత్వం)
8) రూపాంతరం – 2019 (కథలు)
చాలా బాగుంది అక్క..
Super madam
కధని చాలా చక్కగా సమీక్షించారు .చక్కని శైలి మీది గొప్ప ప్రయత్నం …కీప్ ఇట్ అప్