నివాళి ..
మా భాను నాకు మా దొడ్డమ్మ కూతురు.
తన హఠాన్మరణం మమ్మల్ని షాక్ చేసి షేక్ చేసింది.అదేమిటి ఇంకా తన పిలుపు నందుకున్న మేం తాను ఎంతో ప్రియంగా ‘ కట్టుకున్న గూడు ‘ , దయాల్ బాగ్లో తన ఇంటికి వెళ్లి చూడనే లేదు , నార్త్ అంతా చూద్దాము అనే ఆహ్వానం మేం మన్నించనే లేదు , ఎన్నెన్ని ఊహలు , ఎన్నెన్ని ఆశలు పెంచుకుంది. అన్నిటినీ తల్లకిందులు చేసింది , ఒక ఆపరేషన్ ,తరవాత తన ఆరోగ్యం అంతగా కోలుకోలేదు ..
తన గురించి ..
మా అమ్ముమ్మ కి ముగ్గురు పిల్లలు , మా దొడ్డమ్మ , రమణమ్మ , తను చదివిన చదువు హైస్కూల్ ఏమో కానీ , కథలు ఎంత బాగా చెప్పేదో , మేం కూడా కళ్ళు విశాలం చేసి , మొహంలో హావభావాలు మారుస్తూ వినే వాళ్ళం , తనని ఇంట్లో కున్నీలు అని పిలిచేవారు , సమవయస్కులు అంతా , తన తరువాత మా మావయ్య త్రిపుర , అక్క అంటే చాలా ఇష్టం , ఆఖరున మా అమ్మ రాధమ్మ , రాధమ్మ అంటే మా డాక్టర్ తాత గారికి ముద్దు , మా అమ్ముమ్మ ని అందరూ మంగత్త అనే వారు.అంటే మా అత్తా వాళ్ళు.అందుకే మాకు మంగత్తమ్ముమ్మా అయింది , మా అమ్ముమ్మ మాకు.
మా తాత గారు రేషనలిస్ట్ , మూఢాచారాలు , ఆడ పిల్లల పట్ల చిన్న చూపు లాంటివస్సలు ఒప్పుకునే వారు కాదు.
మా దొడ్డమ్మ కి చాలా ఆలస్యంగా, పెళ్లి అయిన పదేళ్లకు పుట్టిందట మా భాను .అందరికీ ఎంత ముద్దో , మా అమ్మకి ఇంకా ఎక్కువగా.ఇంట్లో మొదటి పసి పిల్ల కదా.
చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ , ఉషా సూయింగ్ మెషిన్ వారి స్కూల్ లో మెషిన్ మీద ఎంబ్రాయిడరీ ,సర్టిఫికెట్ కోర్సు చేసింది..భాను.
వేసవి సెలవులకు , మేం అటు వైజాగ్ వెళ్లాడమో , వాళ్ళు ఇటు ఏలూరు రావడమో జరిగేది.
మా పెద్ద నాన్నగారు కృష్ణారావు గారు రైల్వేస్ లో గార్డు గా పని చేసే వారు..వారి తమ్ముడు బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు మంచి పేరు పొందిన రచయిత.
వారి కథ ” దొంగ ” అప్పట్లో అంతర్జాతీయ స్థానంలో పేరెన్నిక కలది.
మా మావయ్య త్రిపుర , చిన్నాన్న సూర్యారావు గారు , రెండు వేపుల నుంచి , సాహిత్య వ్యాసంగం కొంత వారసత్వంగా లభించింది.తనకు.
సైంట్ జోసెఫ్ కళాశాల లో బి ఏ చదివి , ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్ ఏ చేసింది.ఫిలాసఫీ లో.
డాక్టరేట్ కూడా ఫిలాసఫీ లోనే బుద్ధిస్ట్ స్టడీస్ మీద చేసింది..ఎన్నో సెమినర్లు , కాన్ఫెరెన్సెస్ లో పాల్గొంది. అన్నిట్లో చాలా ఉత్సాహం గా పాల్గొనేది.ఎక్కడికి వెళ్లినా మంచి స్నేహితులని చేసుకుని వచ్చేది.
వారందరికీ ఎలా తెలుస్తుందో మరి..వివిధ రాష్ట్రాలకు చెందిన వారు , ఆ ఫ్రెండ్స్ అంతా.
ఇక్కడ యూనివర్సిటీలో పాతుకు పోయిన పాత ఆలోచనలు , ఆచారాలు , పాటింపులు , అన్నీ అంటే భానుకి విపరీతమైన ఎలర్జీ.
కొత్త నీరు , కొత్త ఆలోచనలకు చోటేది అనేది ఆమె నిరంతర వేదన , తన లాంటి ఆలోచనలు కలిగిన వారు తన స్నేహితులు కూడా.
మా పిల్లలన్నా , తన చెల్లెలు ఉషా పిల్లలు అన్నా మరి కొంత ఎక్కువ ఇష్టం అనేది అందరూ అనే మాట..అదేమిటో ఆడపిల్లలకు తన తల్లి వేపు వారు అంటే ఎంత ప్రేమ ఉంటుందో..
మా దొడ్డమ్మ ను చివరి వరకూ తన దగ్గరే పెట్టుకుని బాగా చూసుకుంది. , యూనివర్సిటీకి వెళుతూనో , వస్తూనో , తను అతి జాగ్రత్తగా నడిపే మారుతి 800 కారు మా అమ్మ వాళ్ళింటి ముందు ఆగడం మాములు , భయం ఉన్నా కూడా , పట్టుదలగా కార్ డ్రైవింగ్ నేర్చుకుని , నడిపేది , మేం అందరం తన డ్రైవింగ్ మీద జోకులు వేసినా పట్టించుకోని పట్టుదల తనది.
తన తమ్ముళ్లని ప్రేమించేది , దయాల్ కాలనీ లోని సమిష్టి జీవనం లో చాలా బాగా ఇమిడిపోయి జీవించిన భాను అంటే తెలియని వారు లేరు.
దయాల్ బాగ్ యూనివర్సిటీ డిస్టన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ని నడిపిన దక్షురాలు..
తన కవితలని ” వెలుగు కిరణాల స్పర్శ ” అనే సంపుటంగా వేయించి , దొడ్డమ్మకు అంకితం ఇచ్చింది .కథలు కూడా రాసేది , పలు వార , మాస పత్రికలు లో పడ్డాయి , తన రచనలు .
మంచి పుస్తకాల కలెక్షన్ ఉన్నది తన దగ్గర..దయాల్బాగ్ కి మారినప్పుడు ఏమయ్యాయో ఆ పుస్తకాలు , నేను అడగలేదు.
ఒంటరిగా అన్ని పనులు ఓపికగా సాధించుకునేది , ఎవరి సహాయం అడగని ధృఢత్వం తనది.
ఇలా ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి..
తన చెల్లెళ్ళు ఉషా కిరణ్ , భర్త శ్రీ నాగేశ్వరరావు గారు , ఇద్దరూ ఎడ్వొకేట్స్ , మరొక చెల్లెలు స్నేహాలత.
ఇద్దరు తమ్ముళ్లు ఈశ్వర చంద్ర , కృష్ణ చైతన్య.
అందరం వైజాగ్ వాసులం ముఖ్యంగా..ఈ మధ్య అటూ ఇటూ వెళ్లిపోయినా..
మా అమ్ముమ్మతో ప్రత్యేకమైన అనుబంధం ఉండేది తనకి.మా మావయ్య ఇంట్లో ఉండే అమ్మమ్మని రోజూ , ఇంటికి వెళుతూ దారిలో ఆగి , పలకరించి వెళుతూ ఉండేది , మా అమ్ముమ్మ తన రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేది..మా అమ్ముమ్మ పోయే ముందు రోజు , ఎందువల్లో కలవలేక పోయాను అని , ఆ ఒక్క రోజే ఎందుకు బస్ దిగి వెళ్ళలేదు , అమ్ముమ్మ నా కోసం ఎంతో ఎదురు చూసి ఉంటుంది అంటూ భాను ఎంతో బాధపడడం , కొలుకోవడానికి సంవత్సరాలు పట్టడం నాకు తెలుసు.అంత సున్నితమైన మనసు తనది.
మా అమ్మగారు వైజాగ్ కి వచ్చేసాక , తనతో కూడా అలాగే ఎంతో అనుబంధం పెంచుకుంది.ఇప్పుడు మా అమ్మ గారిని ఓదార్చడం మా వంతు అయింది.ఈ బాధ ఒక్క రోజుతో పోయేది కాదు.
చిన్నతనం.
భాను వాళ్లు , చిన్నప్పుడు విజయనగరంలో ఉండే వారు కొంత కాలం. వైజాగ్కి మారేక , రైల్వే క్వార్టర్స్ లో ఉండే వారు.ఓ సారి ఎంతో సాహసంగా ఇంట్లో జొరబడిన ఓ దొంగ ని పట్టుకుంది.వాడు పారిపోయినా , మేం అందరం ఎన్నాళ్ళో తలుచుకుంటూ ఉండేవాళ్ళం.
అందరు పిల్లల్లాగే చదువు మీద శ్రద్ధ , పెయింటింగ్ చేసేది , పాటలు పాడేది , హిందీ పాటలు అంటే చాలా ఇష్టం , ఏది నేర్చుకున్నా పంతంతో , దీని అంతం చూడాలి అన్నట్టు నేర్చుకునేది..ఇంట్లో పెద్ద పిల్ల అవడం వల్ల బాధ్యత గానూ ఉండేది.
ఒక జీవిత కాలంని ఇన్ని మాటల్లోకి కుదించడం , కుదరని పని.నాకు తెలిసిన మా భానుని, నా మాటల్లో చెపుతూ , ఎంత కష్టం ఈ పని అని తలబోస్తూ , కన్నీళ్లతో నేను..వసంత.
భానూ ఇంతేనా ఇంకా ఏమన్నా మరిచిపోయానా అంటే , అబ్బో..ఇంకా చాలా ఉన్నాయి కదే , వసంతా అంటూ బదులిస్తుంది , మా భాను..
ఇక లేదు అని మటుకు నమ్మలేను నేను..
24 06 2020
వైజాగ్..
*****
Chaala bags raasaavu vasantaa!