మా నాన్నగారు

-రాజన్ పి.టి.ఎస్.కె

“ఓరేయ్ డాడీ! నువ్వు మీ అమ్మ పార్టీయా? నా పార్టీయా?” మా నాన్నగారి ప్రశ్న.

“నేను అమ్మ పార్టీనే” క్షణం ఆలస్యం చేయకుండా, అమ్మను వాటేసుకుని మరీ ఖరాఖండీగా చెప్పేసేవాడిని. అప్పుడు మా అమ్మ “నా బంగారం” అంటూ నన్ను ముద్దు పెట్టుకునేది. అప్పటికే మా అక్క, మంచం మీద కూర్చున్న మా నాన్నగారి మెడ చుట్టూ వెనకనుండి చేతులు వేసి ఊగుతూ ఉండేది; నన్నా ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదన్నట్టు ముఖం పెట్టి. అలా నేను, మా అక్క అమ్మానాన్నలు అనే రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహించేవాళ్ళం. నా సమాధానం వినగానే నవ్వుతూ ఉరిమేవారు మా నాన్నగారు. మా అమ్మ కూడా కిలకిలమని నవ్వేసేది. రాత్రి భోజనాలయ్యాక, యథాప్రకారం నాన్నగారు మంచం మీద పడుకుని కబుర్లు చెబుతుంటేనో, పద్యాలు పాడుతుంటేనో ఆయనకు చెరో పక్కా చేరిపోయేవాళ్ళం అక్కా, నేను. ఆయన పొట్ట మీద చేతులు వేసుకుని అతుక్కుపోయేవాళ్ళం.  “ఏరా! ఇందాక అడిగితే నువ్వు మీ అమ్మ పార్టీ అన్నావ్. మళ్ళీ నా దగ్గరకొచ్చేవేంటి” అనేవారు నాన్నగారు నవ్వుతూ. నేను సమాధానం ఏమీ చెప్పకుండా ఇంకాస్త గట్టిగా వాటేసుకునేవాడిని ఆయనను. కబుర్లు కొనసాగిపోతూ ఉండేవి. అలా వింటూ వింటూ నిద్దట్లోకి జారిపోయేవాళ్ళం అక్కా, నేను.

ఇలా ప్రతీరోజు బోలెడు కబుర్లు. బోలెడన్ని పద్యాలు, చెప్పలేనన్ని సరదాలు. 

“ఎవ్వడ వోరి? నీకు ప్రభు వెవ్వడు చెప్పుము? నీ విటొంటిమై

నివ్వనరాశి దాటి యిట కే గతి వచ్చితి? నామ మేమి? నీ

వెవ్వని ప్రాపునం బెఱికితీ వనమంతయు..” ఇలా రావణాసురుడు హనుమంతుని గద్దిస్తూ ప్రశ్నించే పద్యాన్ని రావణాసురుడు ఇలాగే పాడతాడేమో అన్నట్టు గంభీరంగా పాడేవారు నాన్నగారు. 

“ఖండించెద నీ చేతులు,

తుండించెద నడుము రెండు తునుకలు గాగన్‌

జెండించి నీదు కండలు

వండించెద నూనెలోన వారక నిన్నున్” అంటూ అదే ఉధృతితో ఇంకొక పద్యాన్నీ పాడేవారు. తరువాత “ఇట్లు పట్టరాని కోపంతో నాటోపంబుగా పలుకుచున్న రావణాసురునితో హనుమంతుడు ఏమన్నాడయ్యా అంటే..” అని వచనంగా అంటూ..

ఇనతనయుని వరమంత్రిని,

జనపతి యైనట్టి రామచంద్రుని దూతన్‌

ఘనుడగు వాయుకుమారుడ

వినుమీ హనుమంతు డనగ వెలసినవాడన్

అని హనుమంతుడు పాడినట్టే హాయిగా, స్థిరంగా, రాగం తీస్తూ పాడేవారు. ఈ పద్యాలన్నీ మొల్ల రామాయణంలో పద్యాలని ఆ తరువాత తరువాత తెలిసింది. 

ఇక ఆయన పోతనగారి గజేంద్రమోక్షం పద్యాలు పాడుతుంటే ఆనందం పట్టలేకపోయేవాడిని. నాది ఆ  పద్యాల అర్థం గురించి, పోతనగారు చెప్పదలచుకున్న భగవంతుని తత్త్వం గురించి ఇలా ఏమీ తెలియని, తెలుసుకోలేని వయసే అయినా, వాటి నడకలో ఉండే అందమైన సొగసు, మా నాన్నగారి మధురమైన కంఠంలో ప్రవేశించి అక్కడనుండి నా చెవుల ద్వారా మనసు లోపలికి వెళ్ళిపోయి, కాలక్రమంలో ఆ పద్యాలన్నీ కంఠతా వచ్చేశాయి. 

“సీతాపతే రామ రాధాపతే కృష్ణ శ్రీరుక్మిణీ సత్యభామాపతే

వాణీపతే బ్రహ్మ గౌరీపతే శంభొ లక్ష్మీపతే శ్రీమన్నారాయణా!”

అనే పద్యాన్ని రోజూ రాత్రి ప్రార్థనా శ్లోకంగా చదువుకునేవాళ్ళం.

అప్పుడప్పుడూ మా అమ్మ కబుర్ల మధ్యలో సరదా పొడుపు కథలు అడుగుతుండేది. 

“మా నాన్నగారు ఎవరికి మామగారో, వాళ్ళ కోడలి నాన్నగారు మా కొడుక్కి మామగారు” ఇదేంటో చెప్పుకోండి చూద్దాం అనేది.

“అత్తగారి అత్తగారు మామగారి తల్లికి ఏమవుతుంది?” అంటూ వెంటనే మరో పొడుపుకథ పొడిచేది. నేనూ మా అక్కా తెగ లెక్కలు వేసేసేవాళ్ళం. సమాధానం చెప్పగలిగిన వాళ్ళకు మా అమ్మ పెట్టే ముద్దే పెద్ద బహుమానం. మీరు చెప్పలేకపోయారంటూ మా అమ్మ మా నాన్నగారిని ఎత్తిపొడిచేది. మేం మా నాన్నగారి వంక విజయగర్వంతో చూసి, మళ్ళీ ఆయన పొట్ట మీద చేతులు వేసుకుని పడుకునేవాళ్ళం.

చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి ఇలా పిల్లల కథల పుస్తకాలన్నీ, ప్రతీనెలా క్రమం తప్పకుండా తీసుకొచ్చేవారు మా నాన్నగారు. ఆ పుస్తకాలు వచ్చినరోజు పండగలా ఉండేది నాకు. ఇక మా భీమవరం మావుళ్ళమ్మ ఉత్సవాల సమయంలో అయితే మా ఆనందం పట్టలేనంతగా ఉండేది. మేం నలుగురం సరదాగా నడుచుకుంటూ, చిన్నవంతెన మీదుగా అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళం. ఆ ఉత్సవంలో పెట్టిన లైటింగులు చూస్తూ.. నేను, మా అక్క నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తరువాత ఇది బావుంటుంది. అది బావుంటుంది అంటూ మిరపకాయబజ్జీలు, జిలేజీలు, బజ్జీమిక్చర్లు ఇలా అన్నీ నాన్నగారు కొనిపెట్టడం, అక్కా, నేనూ తింటూ గెంతులెయ్యడం. ఇలా గంటన్నరో రెండు గంటలో గడచిపోయేది. “ఇంటికి వెళ్ళాక అన్నాలు తినాలి కదా. ఇక చాలు పదండి” అని అమ్మ హుకుం జారీచేసేది. మేం నాన్నగారి వైపు కొంచెం జాలిగా చూసేవాళ్ళం. “ఏం పర్లేదు మీరు కానివ్వండి” అన్నట్టు ఆయన తల ఊపేవారు. మళ్ళీ కథ మొదటికొచ్చేది.

చిన్నప్పుడు మా అల్లరికి నాన్నగారి చేతిలో దెబ్బలు తిన్నరోజులు కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే.. దెబ్బలు తిన్నరోజు కూడా మాకు పండగ రోజే. కోపంతో రెండు దెబ్బలు వేసినా, ఆ తరువాత ఆయన విలవిలలాడిపోయేవారు. ఆరోజు సాయంత్రం సినిమాకి తీసుకువెళ్ళడమో, ఐస్ క్రీమ్స్ తీసుకురావడమో చేసేవారు. ఇక సినిమాకి వెళ్ళిన ప్రతీసారి ఇంటర్వెల్ లో నాకూ, మా అక్కకు గోల్డ్ స్పాట్ తప్పనిసరి. మా అమ్మకు అయితే లిమ్కా. నాకు మా అమ్మ లిమ్కాలో కూడా వాటా ఉండేది. వీటితో పాటు సమోసా, తినే గొట్టాలు కొనేవారు. 

నేను ఇంటర్లో ఉండగా, అమ్మ, నాన్న, అక్క, నేను, మా నాయనమ్మ కలసి కారులో బెజవాడ కనకదుర్గ గుడి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, బ్రహ్మంగారి మఠం, పెద్దతిరుపతి ఇలా పదిరోజుల యాత్ర చేశాం. ఆ యాత్రలో చిలుకలూరి పేటలో తిన్న సాంబార్ ఇడ్లీ, నంధ్యాలలో తిన్న భోజనం, తిరుమల ఉడ్ ల్యాండ్ లో తిన్న చపాతీల రుచి ఎంత గుర్తుందో, ప్రయాణం సాగుతున్నంతసేపూ మా నాన్నగారు చెప్పిన విశేషాల రుచి వాటన్నింటికంటే ఎక్కువగా గుర్తుంది, ఇలా  ఆ యాత్రాకాలం అంతా బోలెడన్ని అనుభూతులు. చెప్పలేనన్ని సరదాలతో సాగిపోయింది అనుభూతులంటే ఒక విషయం గుర్తుకువస్తోంది.

ఇప్పటికీ ఆరోజు నాకు బాగా గుర్తు. ఆరాత్రి పెద్ద వర్షం. కుండపోతగా కురిసేస్తోంది. కరెంటు లేదు. అప్పటికే భోజనాలు అయ్యి చాలా సేపయ్యింది. అందరం మంచం మీదకు చేరిపోయాం. ఉరుములు, మెరుపులు. ఆ వర్షం పడుతున్న శబ్దం మా పెంకుటింటి మట్టి గోడల్లోంచి భీకరంగా వినబడుతోంది. అమ్మానాన్నల మధ్యలో పడుకున్న నాకూ, మా అక్కకూ చెప్పలేనంత సంబరంగా ఉంది. అంతోటి వరుణదేవుడు కూడా అమ్మానాన్నల మధ్యలో పడుకున్న మమ్మల్ని భయపెట్టలేకపోతున్నాడు. అంత చలిలోనూ మాకు వెచ్చగానే ఉంది. నాన్నగారు “తోకపీకుడు కథ” అనే సరదా కథొకటి చెబుతున్నారు.  ఇంతలో మా అమ్మ “మీరు చెబుతూ ఉండండి” అని నాన్నగారితో అని, ఆ చిన్న కిరసనాయిలు దీపం పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది.  దీపం అమ్మతోపాటూ వంటింట్లోకి వెళ్ళిపోవడం వల్ల మేమున్న గదంతా కారు చీకటి అయిపోయింది. ఇంతలో మా నాన్నగారు సిగరెట్టు వెలిగించారు. ఆ చిమ్మ చీకటిలో సిగరెట్టు చివర ఉన్న ఎర్రటి వెలుగు ఒక్కటే కనబడుతోంది. భలేగా ఉందనిపించింది. అప్పటికి నాకు ఆరేడేళ్ళకు మించి ఉండుండకపోవచ్చు. కానీ ఇప్పటికీ ఆ వెలుగు నాకు స్పష్టంగా కనబడుతున్నట్టే ఉంటుంది. ఇంతలో అమ్మ వంటింటిలోనుండి వేయించిన వేరుశెనగ గుళ్లు ప్లేటులో వేసి తీసుకు వచ్చింది. ఆ వర్షంలో,  ఆ చిమ్మచీకటిలో, వేయించిన వేరుశెనగ గుళ్ళు తింటూ నాన్నగారు కథ చెప్పడం, అప్పుడు పొందిన ఆ ఆనందానుభూతి… మూడు దశాబ్దాలు గడచినా, ఇప్పటికీ తలచుకున్నప్పుడల్లా నా ఒళ్లు పులకింపజేస్తూనే ఉంటుంది.

మా నాన్నగారు కీ.శే. పెట్ల వీరభద్రరావుగారు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం, చల్లవాని పేట దగ్గరలో ఉన్న జోనంకి అనే గ్రామంలో పుట్టారు. పెట్ల కామరాజు గారు, మాణిక్యమ్మల ఆరవ సంతానం. ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు. ఆయన తన పదిహేనవ యేట పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం వచ్చి స్థిరపడ్డారు. భీమవరంలోనే పుట్టి పెరిగిన మా అమ్మ లక్ష్మీరాజేశ్వరిని పెళ్ళాడి దేవి, రాజా అనే మా అక్కను, నన్ను ఈలోకానికి తీసుకొచ్చారు. మమ్మల్ని లాలించారు, ఆలించారు, ప్రేమించారు ఏ లోటూ లేకుండా పెంచారు. పదిమందిలోనూ చాలా మంచి పేరు సంపాదించారు. భీమవరంలో అందరూ ఆయనను గురువు గారని పిలిచేవారు. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే మా నాన్నగారు, ఆ అలవాటుతోనే, సుమారు తొమ్మదేళ్ళ క్రితం మా అక్క కొడుకుని ఆడిస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళిరావాలనే ఆయన కోరికతీరకుండానే ఆయన తన అరవయ్యో యేట సరాసరి కైలాస యాత్రకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆయనను గుర్తుచేసుకున్నప్పుడల్లా.. “గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అన్న నన్నయ్యగారి మాటే గుర్తుకు వస్తుంటుంది. నాన్నగారి జ్ఞాపకాలకు అంతులేదు. ఆయన రూపానికి నా మనసులో ఎప్పుడూ మరపురాదు “ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న” అన్న సినారె గీతాన్ని పదే పదే స్మరించుకుంటూ, మా నాన్నగారికి నమస్కరించుకుంటూ స్వస్తి!

ఈ ఫొటో మా నాన్నగారి ఫొటోలలోకెల్లా నాకు ఎంతో ఇష్టమయిన ఫొటో.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.