యాత్రాగీతం

నా కళ్లతో అమెరికా

అలాస్కా

-డా||కె.గీత

భాగం-1

అమెరికాలో “అలాస్కా” చూసి రావడం అనేది ప్రతీ ఒక్కరికీ “బక్కెట్ లిస్టు” లో భాగం. 

అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తీరాలనుకున్న కోరికల పద్దులో ముఖ్యమైనదన్నమాట. 

ఇక మేం ఎన్నాళ్లుగానో చూడాలనుకున్న ముఖ్య ప్రదేశాల్లో ఇదీ ఒకటి. 

కానీ ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తూంది. ఇందుకు ఒక ప్రధాన కారణం ఏవిటంటే అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైనప్పటికీ భౌగోళికంగా ఇది ప్రత్యేకంగా కెనడా దేశాన్ని దాటి విడిగా ఉండడం. 

కానీ శ్రద్ధగా చూస్తే మేమున్న కాలిఫోర్నియా రాష్ట్రం నించి నిజానికి అమెరికా తూర్పు తీరాన ఉన్న న్యూయార్క్ కి వెళ్లడం కంటే ఇదే దగ్గిర. 

అంతే కాదు ఇక్కడి నుంచి వెళ్లేందుకు మూడు ప్రధాన రవాణా మార్గాలున్నాయి.

ఒకటి విమాన మార్గం, రెండు క్రూయిజ్ లనబడే అతిపెద్ద విహార నౌకా మార్గం, మూడు  రోడ్డు మార్గం. 

మొదటిదైన విమాన మార్గంలో తక్కువ సమయంలో చేరుకోవచ్చు. అయితే అతిపెద్దదైన అలాస్కా రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతాలలో ఉన్న ప్రధాన విశేషాలు, ముఖ్యంగా హిమానీనదాలు (గ్లేషియర్స్) ని చూసే అవకాశం కోసం చాలా మంది రెండో మార్గమైన క్రూజ్ లని ఎంచుకుంటారు. అయితే ఈ క్రూజ్ లలో వెళ్లిరావడానికి కనీసం పదిరోజుల సమయం పడుతుంది. అంతే కాకుండా ఆ మార్గంలో అలాస్కా లోని రోడ్డు మార్గం లోని విశేషాల్ని చూసే అవకాశం ఉండదు. 

ఇక మూడోదైన రోడ్డు మార్గం లో మధ్యలో కెనడా దేశాన్ని దాటుకు వెళ్లాంటే అమెరికా పౌరులు కాని మా లాంటి వారు కెనడా వీసా  తీసుకోవాల్సి ఉంటుంది. పైగా డ్రైవ్ చెయ్యగల్గిన దగ్గిర దూరమేమీ కాదు.  కాబట్టి చివరిది మాకొక ఆప్షను కానే కాదు.

మాకున్న సెలవులు వారం మాత్రమే. అందులో సాధ్యమైనంత వరకు సముద్ర తీరపు విశేషాల్ని, రోడ్డు మార్గం లోని విశేషాల్ని కూడా కలిపి చూసే విధంగా ప్రణాళిక తయారు చేసేం.

దాని ప్రకారం అలాస్కాలోని యాంకరేజ్ వరకు విమానంలో ప్రయాణించి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లి అక్కడి విశేషాల్ని చూడడమే కాకుండా విహారపు రైళ్లలోప్రయాణం చెయ్యడం, సముద్ర ప్రాంతాల్ని అక్కడి లోకల్ క్రూజ్ లు, బోట్ ట్రిప్పులలోను దర్శనం చెయ్యడం. 

ఇక అలాస్కాలో అధికభాగం శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉండడం వల్ల, వెళ్లి రావడానికి అనువైన కాలం వేసవి కాలమే కాబట్టి ఆ సీజన్ కే బుక్ చేసుకున్నాం. చవకగా విమాన టిక్కెట్లు దొరకాలంటే ముందే బుక్ చేసుకోవాలి కాబట్టి దాదాపు నాలుగైదు నెలల ముందే రిజర్వేషన్లు చేసేం. 

ఇక రానుపోను విమానపు టిక్కెట్ల తర్వాత మేమక్కడ ఉండే వారం రోజులకి  హోటల్స్, చూడవలసిన ప్రదేశాల జాబితాలు తయారు చెయ్యడంలో అర్థమైన విషయం ఏవిటంటే అలాస్కా టూరిజం పేకేజీ తీసుకోవడం అత్యుత్తమమని. 

అలాస్కా నడి బొడ్డున ఉన్న దెనాలి నేషనల్ పార్కు నుంచి దక్షిణంగా మాత్రమే పిల్లలతో చూడదగిన విశేషాలు ఉన్నాయి. గ్లేసియర్లయితే పూర్తిగా దక్షిణ తీరంలోనే ఉన్నాయి. 

ఉత్తరానికి వెళ్లే కొలదీ ఆర్కిటిక్ వలయానికి దగ్గర కావడం వల్ల దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది అలాస్కా. 

ఇక అలాస్కా చూడాలని తపించడానికి మరో కారణం ఏవిటంటే అలాస్కా రమణీయ ప్రకృతి సౌందర్యంతో బాటూ వేసవిలో అర్థరాత్రి సూర్యుడు కనిపించే అద్భుతాన్ని కళ్లారా వీక్షించడం.

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.