తెనిగీయం
రాతిపరుపు(కథ)
ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్
స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి
వెర్నా ఎవరినీ చంపాలనుకోలేదు మొదట. ఆమె ధ్యాసంతా కేవలం విహారయాత్రను ఎలా ఆస్వాదిద్దామన్నదానిపైనే. ఆర్కిటిక్ వాతావరణం కూడా ఆమెను ఉత్సాహపరుస్తోంది. తనతో పాటు విహారానికి వచ్చిన వారిని… ప్రత్యేకించి మగాళ్లను ఒక్కసారి పరికించింది. ఇన్నేళ్ల జీవితంలో తనతో పరిచయానికి తహతహలాడిన వారు చాలామందే వున్నారు. పాత అలవాట్లు అంత త్వరగా వదలవు మరి. అందుకే ఆ షిప్ డెక్ పై చేరిన వారిని ఆసక్తిగా చూస్తోంది. ఈ వయసులో బికినీలో వయ్యారాలు ఒలకపోయాలని అనుకోలేదు వెర్నా. కానీ, వయసు మీరినా తనలో సెక్స్ అప్పీల్ ఇంకా ఉందనే అనుకుంటోంది, అద్దంలో ఓ సారి ఒంపుసొంపులను చూసుకుంది. అరవైలలో ఉన్న వెర్నా ఆకర్షణీయంగా కనిపించేలా, కొత్త పరిచయానికి ఊతమిచ్చేలా, అందంగా ముస్తాబైంది. తన మూడో భర్త శృంగారానికి ముందు తరచూ హమ్మింగ్ చేసే పాట… టెన్నిసన్ కవిత ” coming into the garden, Maud ” ఆమెలో ఉత్తేజాన్ని రగిలిస్తోంది.
ఒంటి నిండా సెంటు పూసుకున్న వెర్నా ఘుమఘుమలాడుతూ డెక్ మీదికి కాస్త ఆలస్యంగా చేరింది. అక్కడ రిటైరైన ప్రొఫెషనల్స్ చాలామందే వున్నారు. వారిలో డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, స్టాక్ బ్రోకర్లు కూడా ఉన్నారు. జంటలను వదిలేసి… ఒంటరిగా వున్న మగాళ్లను ఓసారి తేరిపారచూసింది. ఫ్రెడ్, డేన్, రిక్, నార్మ్, బాబ్… మరొక బాబ్… ఇంకొక బాబ్. ఓ బాబ్ లు చాలామందే వున్నారే అనుకుంది. వారిలో కాస్త సన్నగా వున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి పలుకరించింది ‘‘ మీరేనా బాబ్ ’’ అంటూ. అతను గతంలో తనకు పరిచయస్తుడిలాగే కనిపించడంతో కాస్త పరిశీలనగా చూసింది. సందేహం లేదు… అతనే. జుట్టు పలుచబడినా, చర్మం ముడుతలు పడినా, పెట్టుడు పళ్లు పెట్టుకున్నా…. ఆ నవ్వును తాను మరచిపోలేదు. అతడు… ఓ పీడకలగా జీవితాంతం తనను వెంటాడుతున్న నయవంచకుడు బాబ్. నిస్సందేహంగా అతనే. యాభై ఏళ్ల క్రితం ఎందరో యువతుల కలల రాకుమారుడు, సాకర్ స్టార్, కోటీశ్వరుడైన బాబే. సిటీలో ధనికులంతా నివసించే చోట, క్యాడిలాక్ కారును డ్రైవ్ చేస్తూ మతులు పోగొట్టిన బాబ్ గోరెహామ్! తననీ దుస్థితికి నెట్టివేసిన బాబ్, గతం గాయాలపై కారం చల్లినట్లు ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ కనిపించాడు.
‘‘ అవును నా పేరు బాబ్… బాబ్ గోరెహామ్ ’’ అన్న మాటలతో ఒక్కసారిగా తుళ్లిపడింది వెర్నా. ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ చిరునవ్వు విసిరింది. ఆమెలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయ్. ఎంతగా వంచించాడు బాబ్. తల్లి ఆంక్షల మధ్య, కట్టుబాట్ల మధ్య పెరుగుతున్న తనను ఎంత నిర్లక్ష్యం చేశాడు బాబ్ అనుకుంటూ రగిలిపోయింది. తను అతనిని ప్రేమించింది. డాన్స్ చేద్దామన్న అతని ఆహ్వానాన్ని మన్నించింది. కానీ బాబ్ తనను చులకన చేశాడు. వాడుకుని వదిలేశాడు. తప్పతాగించి సర్వస్వాన్నీ దోచుకుని నడిబజారులో వదిలేశాడు. స్నేహితుడు కెన్ సాయంతో తనను కారులోనే దారుణంగా వంచించిన క్షణాలు మళ్లీ కనుల ముందు కదలాడాయి. తనను అనుభవించిన తర్వాత ప్యాంటీని గాల్లో గిరగిరా తిప్పుతూ చేసిన వికటాట్టహాసాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేదు. అతని కారణంగా తల్లినైన తాను ఎన్ని కష్టాలు పడింది. ఎన్నెన్ని అవమానాలు దిగమింగింది. అతని కారణంగా ఊరిలో తన పరువు పోయింది. పథకం ప్రకారం తను చెడిపోయిందని బాబ్ ప్రచారం చేశాడు. అప్పుడు తను బజారులో వెళ్తుంటే ఎగతాళి చేసిన వారెందరో. బిడ్డను చర్చివారు తీసుకెళ్లిపోవడంతో ఒంటరిదైన వెర్నా…. బతకడానికి పాచిపని చేయాల్సి వచ్చింది. దాంతో విధిలేక టొరంటో వెళ్లిపోయింది. ఓ ముసలాడి చెంతకు చేరింది. అతనికి శారీరక సౌఖ్యాలనందిస్తూ చదువు పూర్తిచేసింది. ఆ క్రమంలో నలుగురిని వివాహమాడింది. ఆమె దాంపత్య జీవితం సుఖంగా ఏమీ సాగలేదు. చివరికి ఒంటరిగానే మిగిలింది. వైధవ్యం వెంటాడుతోంది. తన ఈ దుస్థితికి కారణం బాబ్ మాత్రమే.
నిజానికి బాబ్.. వెర్నాను గుర్తించనేలేదు. జీవితంలో ఎందరు వెర్నాలనో చూసినవాడు. తనదగ్గరకు వచ్చిన వెర్నా కోరికతో ఉందనుకున్నాడు. సందేహిస్తూనే.. సరసానికి సిద్ధమవుతున్నాడు. కానీ, మరోసారి అతనితో జతకట్టేందుకు వెర్నా మనసు అంగీకరించలేదు. అందుకే మొదట ట్రిప్ ను అర్ధాంతరంగా ముగించాలనుకుంది. బాబ్ కు దూరంగా వెళ్లిపోవాలనుకుంది. చిరాకుతో లేడీస్ రూములోకి వెళ్లి వైన్ బాటిళ్లను గిరాటేసింది. మళ్లీ ఆలోచించింది. తాను ఎందుకు దూరంగా వెళ్లాలి. అప్పట్లో తన పరిస్థితి వేరు. నాడు తను ఓ మైనర్. బిడ్డను సాకలేని బాలిక. అందుకే బిడ్డకు దూరమైంది. టొరంటోకు తరలిపోయింది. అష్టకష్టాలు పడింది. పోషణ కోసం, చదువు కోసం ఎందరికో సుఖాన్ని పంచింది. మూడేళ్ల పాటు ఓ ముసలాడికి సాయంత్రాల్లో తనువిచ్చింది. జీవితానికి ఎదురీదుతూ రాటు తేలింది. ఇపుడు తాను ఐదుగురు బాబ్ లతో సమానం.
‘‘ అంతా ఓకే కదా ’’ అన్న బాబ్ మాటకు తేరుకుంది వెర్నా.
‘‘షిప్ లో మీ ఆయన కూడా ఉన్నాడా’’ అన్న బాబ్ ప్రశ్నకు సమాధానమిచ్చింది ‘‘ లేదు. నేనిపుడు విధవరాలిని’’ అంటూ.
‘‘ ఓహ్…. సారీ ’’ అన్న బాబ్ తన భార్య కూడా ఆర్నెల్ల క్రితం చనిపోవడం యాదృచ్ఛికమన్నాడు.
ఇంత జరుగుతున్నా బాబ్ ఆమెను గుర్తుపట్టలేదు. అంతగా మారిపోయింది తను. శిరోజాలంకరణతో పాటు మనిషి నడత కూడా మారింది. దృక్పథమూ మారింది. అందుకేనేమో బాబ్ అణుమాత్రం కూడా వెర్నాను గుర్తించలేకపోయాడు. తన పూర్వాపరాలు తెలుసుకోడానికి అతనడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చింది వెర్నా. తన గురించి చెబుతూ బాబ్… తన కుమారులు, మనుమల గురించి గర్వంగా చెప్పినపుడు ఆగ్రహంతో రగిలిపోయింది. తననీ దుస్థితిలోకి నెట్టి తాను మాత్రం హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న దురహంకారి బాబ్ ను అంతమొందించాలనుకుంది. కానీ… ఎలా? ఎలా బాబ్ ని చంపాలి? చంపి ఎలా దొరక్కుండా తప్పించుకోవాలి?
షిప్ నుంచి తోసివేయాలా? అందరికీ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. వాటిని లెక్కిస్తే ఒకటి మిస్సవుతుంది. వెంటనే విషయం తెలుస్తుంది. ఆర్కిటిక్ మంచుఫలకాలపై ధృవపు ఎలుగుబంట్లు అత్యంత ప్రమాదకారులు. అందుకే వాటి నుంచి తప్పించుకోడానికి పర్యాటకులకు తుపాకులిస్తారు. అయితే వాటిని తోటి పర్యాటకులపై ప్రయోగించే అవకాశం లేదు. అదే చేస్తే ఇట్టే దొరికిపోతారు. అప్పటికే రకరకాల క్రైమ్ నవలలు చదివిన వెర్నా… ఎందుకైనా మంచిదని ఓ జత గ్లోవ్స్ కొనుక్కుంది. బాబ్ తో సరస సంభాషణ సాగుతూనే వుంది. ఆ మరుసటి రోజే ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. అది.. బాబ్ అంతానికి బీజం వేసింది.
డెక్ పై ఓ యువ జియాలజీ శాస్త్రవేత్త Stromatolites గురించి వివరించడం ప్రారంభించాడు. అది వింటున్నవారిలో మహిళలే ఎక్కువున్నారు. అత్యంత పురాతనమైనదీ, క్షీరదాలు, చేపలు, డైనోసార్ల కన్నా ముందుగా ఉద్భవించినదీ…. 1.9 బిలియన్ల ఏళ్ల కిందటే రూపొందిన స్ట్రొమటోలైట్స్ గురించి వెర్నా కూడా ఆసక్తిగా వింటోంది. గ్రీకు పదం Stroma (Mattress) నుంచి వచ్చిన పదం… Stone mattress గా స్థిరపడింది. ఘనీభవించిన పరుపులాంటి శిలాజమిది. నీలిరంగు, ఆకుపచ్చ రంగుల్లో పొరలుపొరలుగా ఏర్పడి ఆక్సిజన్ ను అందిస్తున్న అద్భుతం ఆ శిలాజం. అలాంటి అద్భుతాన్ని ప్రత్యక్షంగా చూస్తే బాగుంటుందని ప్రతిపాదించాడో వ్యక్తి మధ్యాహ్న భోజన సమయంలో. విచిత్రమేంటంటే.. స్ర్టొమటోలైట్స్ (రాళ్లు) పై నడిస్తే ఆ అనుభూతే వేరని చెప్పి ఒప్పించిన వ్యక్తి పేరు కూడా బాబే. వెర్నా దీన్నో అవకాశంగా తీసుకోవాలని నిర్ణయించుకుంది. తానూ అందుకు సిద్ధమేనంటూ ప్రకటించింది. స్టోన్ మ్యాట్రెస్ లోని మ్యాట్రెస్ (పరుపు) పదాన్ని నొక్కి పలుకుతూ బాబ్ ను కవ్వించింది. సరస సంభాషణల్లో ఆరితేరిన బాబ్ కు ఆ మాత్రం సంకేతం చాలు.
డెక్ నుంచి బయటపడే ముందు బైనాక్యులర్ లో ఒకసారి ఆ శిలాజాలను చూసింది వెర్నా. నిజానికి ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. వెర్నాలో మాత్రం హృదయ స్పందన పెరిగింది. పథకం ప్రకారం బాబ్ గోరెహామ్ ను తాను అంతం చేయగలుగుతుందా? ఒకదాని వెనుక ఒకటి శిఖరాలుగా ఏర్పడిన స్టోన్ మాట్రెస్ ఆమె ఆలోచనను అమలుచేస్తాయా? ఒక శిఖరం మీది నుంచి జారిపడితే రెండో శిఖరం మీదకి కనిపిస్తుందా? ఇవే ఆలోచనలు వెర్నాలో. ఒక వేళ బాబ్ గమనిస్తే అతణ్ణి చంపకూడదు. తానెవరో చెప్పి గుర్తుపడితే క్షమాపణలు కోరి ఊరకుండిపోవచ్చు అని ముందుగానే స్థిమితపడింది. ఆ వెంటనే అవసరమైన పనిముట్లు తీసుకుని పర్వతాలవైపు బయలుదేరింది వెర్నా. అనుకున్నట్లుగానే బాబ్ కూడా ఆమెతో పాటే బయలుదేరాడు. మొదటి శిఖరం దాటి రెండో శిఖరం వైపు వెళ్లారిద్దరూ. మిగతా పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చెల్లాచెదురయ్యారు. ఇక్కడ ఇద్దరూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. బాబ్ ను అంతం చేయాలన్న ఆలోచనలతో వెర్నా…. ఆమెను ఎలాగైనా అనుభవించాలనే కాంక్షతో బాబ్.
‘‘ ఇది మనకు మంచి రోజు ’’ అన్నాడు బాబ్. ” It’s a good to have a chance to stretch your legs ” అంటూ మరో ద్వంద్వార్ధపు డైలాగ్ కూడా విసిరాడు. వెర్నా తనలో రేగుతున్న అలజడిని బయటపడకుండా నవ్వులు చిందించింది. రెండో శిఖరం దాటి మూడో శిఖరం వైపుగా బయలుదేరారిద్దరూ. బాబ్ వెనుకగా వెర్నా చిన్నగా నడుస్తోంది. ఇంకా దూరం వెళ్తే ప్రమాదమేమోనని బాబ్ తో అంది. దాన్నతడు తేలిగ్గా తీసుకున్నాడు. చిన్న షాంపేన్ బాటిల్స్ తీసుకునేందుకు బ్యాక్ పాక్ తెరిచాడు. అప్పటికే స్టోన్ మ్యాట్రెస్ ముక్కను చేతిలోకి తీసుకున్న వెర్నా….నిలువెల్లా కంపిస్తోంది, బాబ్ దగా చేసిన క్షణాలు గుర్తుకు వస్తుండగా.
‘‘ మనిద్దరికీ గతంలోనే బాగా పరిచయం ఉందనుకుంటా. నా పేరు వెర్నా ప్రిచర్డ్, హైస్కూల్ రోజుల్లో…’’ ఒక్కొక్క మాటనే ఒత్తి పలుకుతోంది వెర్నా.
‘‘ నాకూ అలాగే అనిపిస్తోందే ’’ అంటూ విషపు నవ్వులు రువ్వాడు బాబ్.
ఆ రకమైన నవ్వు వెర్నాకు బాగా గుర్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదామె. స్ట్రొమటోలైట్ రాయితో బలంగా బాబ్ కుడి దవడ కింద బాదింది. రక్తం కారుతున్నా ఆ రాయితో పదేపదే తలపై శక్తికొద్దీ మోదుతోంది. అంతే.. బాబ్ విగతజీవుడయ్యాడు. ఇకపై విషపు నవ్వులకు అవకాశమే లేకుండా. వెర్నా ఊహించినట్లే….అతడి దవడ నుంచి పెట్టుడు పళ్లు రాలిపడ్డాయి.
బాబ్ లైఫ్ జాకెట్ ను కూడా తన బ్యాక్ ప్యాక్ తో పాటే తీసుకువచ్చిన వెర్నా కొద్దిసేపటికి ఆ యువ శాస్త్రవేత్త వద్దకు వచ్చింది. తన వద్దనున్న స్టోన్ మ్యాట్రెస్ ముక్కను అతనికి చూపించి శాంపిల్ గా షిప్ లోకి తీసుకెళ్లింది. చకచకా బాబ్ గది వద్దకు వెళ్లి కీ తీసుకుని తలుపు తెరిచింది. సింక్ ట్యాప్ ఓపెన్ చేసి టవల్ తలుపుపై వేసింది, బాబ్ రాలేదన్న సందేహం ఎవరికీ రాకుండా. శాంపిల్ గా తాను తీసుకువచ్చిన స్టోన్ మ్యాట్రెస్ మీద ఇప్పుడు అందరి వేలిముద్రలూ పడ్డాయి, వెర్నావి తప్ప. పనైపోగానే గ్లోవ్స్ తీసివేసింది… ప్రశాంతంగా గదికి వెళ్లింది.
శాంతంగా ఉంటే సురక్షితంగా ఉన్నట్లే. ప్రశాంతంగా ఉన్న మనస్సు అన్ని రసాలనీ అందుకుంటుంది. అందుకే వెర్నా మూడో భర్త తరచూ వయాగ్రా రాత్రులకు ముందు ఇలా అంటుండేవాడు. ఆ విక్టోరియన్లు శృంగారాన్ని చావుతో జోడిస్తారని. ఎవరబ్బా ఆ రచయిత… కీట్సా? టెన్నిసనా? ఆమెకంత జ్ఞాపకశక్తి లేదు. కానీ, వివరాలు తర్వాత ఆమె తప్పక తెలుసుకుంటుంది.
*****
డా.అరుణజ్యోతి కోలా ఎమ్. ఎ తెలుగు, ఎమ్ ఫిల్, పిహెచ్డి చేశారు. బిఎ, ఎమ్ ఫిల్ లో స్వర్ణపతకాలు సాధించారు. సాక్షి, జి న్యూస్, ఎన్ టీవీ, వనితా టీవీలలో రిపోర్టర్, ఫీచర్స్ హెడ్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. అంకురం, ఇన్ఫోకస్, నవ్య వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్త్రీ స్వేచ్ఛ, భ్రూణ హత్యలు, నిర్భయ వంటి పలు సామాజిక అంశాలపై వ్యాసాలు రాశారు. హిందీ, ఆంగ్లభాషల నుండి అనువాదాలు చేశారు.