వెనుతిరగని వెన్నెల(భాగం-13)
-డా|| కె.గీత
(ఆడియో ఇక్కడ వినండి)
వెనుతిరగని వెన్నెల(భాగం-13)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది. ఇద్దరికీ పరిచయమవుతుంది. పెద్ద వాళ్లు ఒప్పుకుని ఇద్దరికీ పెళ్లి చేస్తారు. తన్మయి, శేఖర్ విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన ఆరు నెలల్లోనే తన్మయి గర్భవతి అవుతుంది.
***
నిద్రలేవడం తోనే అలిసిపోయినట్లుగా అయ్యి కాస్సేపటిలోనే మళ్లీ నిద్రపోతూంది తన్మయి.
మెలకువగా ఉన్నంత సేపూ కడుపులో తిప్పడం వల్ల ఏమీ తినలేక, ఏ వాసనా నచ్చక, లేచిందగ్గర్నించీ కళ్లు తిరుగుతున్నట్లే అయ్యిసరిగా తినడం మానేసింది.
పీక్కుపోయిన కూతురి ముఖాన్ని, చెంపల్నీ రాస్తూ పక్కన వచ్చి కూచుంది జ్యోతి.
ఏదో మాట్లాడబోయే సరికి దు:ఖం తన్నుకు వచ్చింది తన్మయికి.
“అమ్మా, ఇక వెళ్లను అతని దగ్గిరికి” మనసులో సుళ్లు తిరుగుతున్న మాటలు గొంతులోకి రానివ్వకుండా ఏడుస్తూ ఉండిపోయింది.
కూతురి దు:ఖాన్ని మరో విధంగా అర్థం చేసుకున్న జ్యోతి “ఏడవకమ్మా, శేఖర్ ఏదో పనిలో ఉండి రాలేకపోయుంటాడు. నాన్నగారితో మళ్లీ ఒక సారి ఫోను చేయిస్తాలే” అంది అనునయంగా.
ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దు:ఖం తో గోడ వైపు తిరిగి ముసుగు పెట్టుకుని లోపల్లోపలే వెక్కి వెక్కి పడ్తూ పొట్ట మీద చెయ్యి వేసి తడుముకుంది. మెల్లగా గొణుగుతున్నట్లు కడుపులోని బిడ్డతో మాట్లాడడం మొదలు పెట్టింది.
తన చేతి వేళ్ల స్పర్శ నుంచి తనలో దాగున్న చిన్ని ప్రాణి తన మాటల్ని, తన మనసుని చదువుతున్నట్లు భ్రాంతి కలిగింది.
“బంగారూ! నువ్వు అమ్మాయివో, అబ్బాయివో తెలీదు నాకు. ఎవరైనా నువ్వు నాకు బంగారువే. నీతో ఎన్నో చెప్పాలి. నీకు మాత్రమే చెప్పగలిగిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న పసికూనవి నీకర్థమవుతాయా? సర్లే, హాయిగా బజ్జో. మనిద్దరం ఇక రేపట్నించీ కబుర్లు చెప్పుకుందాం. నా బాధలు నీకెందుకు గానీ, నీకు మంచి మంచి కబుర్లెన్నో చెపుతాను. సరేనా?!” అంది.
నిజంగా తనలో ఎవరో చెవి ఒగ్గి విని ఊకొట్టినట్లనిపించి దు:ఖం లోంచి వెంటనే తేరుకుంది. గొప్ప ఊరటగా, సంతోషంగా అనిపించింది.
ఒక్కటి మాత్రం అర్థం అయ్యింది. ఇక తనీ ప్రపంచంలో ఒంటరిది కాదు. తనకి తన కడుపులోని బిడ్డ తోడు.
“అవును. తన కడుపులో పెరుగుతున్న పసిప్రాణి తో మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. తనకి నచ్చినట్లు హాయిగా పుస్తకాలు చదివి వినిపించొచ్చు. తనకి బిడ్డ పుట్టేక పాటలు, ఆటలతో జీవితం ఎంతో హాయిగా గడిచిపోతుంది.” తన్మయికి కష్టాలన్నీ గట్టెక్కిపోయిన ఆనందం కలిగింది.
“ఇక ఎప్పుడూ ఇలా తనలో తను కుమిలి పోకూడదు. ధైర్యంగా ఉండాలి. ఈ బిడ్డ ని సురక్షితంగా ఈ భూమి మీదకు తీసుకురావడం ఒక్కటే ఇక తన లక్ష్యం.”అని నిర్ణయించుకుంది.
తన బిడ్డకు తను, తనకు తన బిడ్డ ఒకరికొకరు ఆలంబనలు. తననీ ఇలాగే కడుపులో పెంచి ఈ అనురాగాన్ని పంచుకున్న అమ్మ మీద ఒక్కసారిగా ప్రేమ పదింతలైంది.
వంటింటిలో కూరగాయలు తరుగుతున్న జ్యోతి పక్కనే చేరి భుజానికానుకుంది.
“ఏమ్మా, ఏవైనా తింటావా?” అంది జ్యోతి.
ఏమీ మాట్లాడకుండా కళ్లు మూసుకుంది తన్మయి. మనస్సంతా తల్లి మీద కృతజ్ఞతా భావం నిండిపోయింది.
“అమ్మా, నీకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోను? నాకొక జీవితాన్నిచ్చినందుకు. నాకూ ఒక పాపాయి పుట్టబోతూ ఉంది. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నీకూ ఇలాగే సంతోషంగా ఉండి ఉంటుంది కదూ” అనుకుంది మనస్సు లో.
పైకి మాత్రం “కాస్సేపు వచ్చి నా పక్కన పడుకోమ్మా” అంది.
“అలాగే. నీకిష్టవని దొండకాయ వేపుడు చేస్తున్నాను. కూర వేగగానే వస్తాను. నీకు అలసటగా ఉంటే కాస్సేపు పడుకో.” అంది జ్యోతి.
***
వారంలోనే శేఖర్ ఫోను చేసేడు.
కుశల ప్రశ్నల కంటే ముందు “ఎప్పుడెళ్తున్నావ్ మా ఇంటికి?” అనడిగాడు.
ఆ ప్రశ్న వినగానే ఉన్న నీరసం రెండింతలు పెరిగినట్లయ్యింది తన్మయికి.
తన్మయి ఏదో చెప్పబోయే లోగా “ఇలా చూడు. నీకిప్పుడు పెళ్లయ్యింది. నీకు నీ భర్త కుటుంబం అంటూ ఒకటుంది. వాళ్ల దగ్గిర ఉండాల్సిన బాధ్యత నీకుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఇంకా అమ్మ దగ్గిర పాలు తాగుతానంటే ఎలాగనుకుంటున్నావు?” అన్నాడు.
శేఖర్ దురుసు మాటలకి తల మరింత వేగంగా తిరగడం మొదలు పెట్టింది.
ఏమనుకుంటే అనుకున్నాడని ఫోను వెంటనే పెట్టేసింది.
మళ్లీ వెంటనే మోగుతున్న ఫోనుని ఈసారి జ్యోతి తీసింది.
అట్నించి దేవి మాట్లాడుతున్నట్లు అర్థం అయ్యింది తన్మయికి.
ఫోను పెట్టేసి, “ఇదేం మనుషులు బాబూ! ఒకపక్క పిల్ల వేవిళ్లతో సతమతమైపోతూంటే, “మా కోడల్ని మా ఇంటికి పంపించక పోతే కుదరదని” గొడవకొస్తూంది మహాతల్లి. ఆ కుర్రాడికైనా బుద్ధుండొద్దూ! అమ్మ ఏవంటే దానికల్లా తందాన తాన అనుకుంటూ…ఛీ.. ఛీ.. వెళ్లి వెళ్లి వీళ్ల ఎదాన పడ్డాం.” జ్యోతి గట్టిగా విసుక్కుంటూ వంటింట్లో గిన్నెలు దభాలున ఎత్తి కుదేయడం మొదలు పెట్టింది.
భానుమూర్తి నిశ్శబ్దంగా గోడకి జేరబడి చూస్తూ “పోనీలే. వాళ్లకీ అమ్మాయిని కొన్నాళ్లు చూసుకోవాలని ఉందేమో. నాల్రోజులు పంపించి మళ్లీ తెచ్చుకుందాం. అయినా ఎంత దూరం? మళ్లీ వారంలోనే పంపించమని అడుగుదాం. గొడవలెందుకు చెప్పు మనకి” అన్నాడు సాలోచనగా.
తన్మయి ఇవేవీ ఆలోచించే స్థితిలో లేదు.
ఎవరైనా లేపి కూచోబెట్టి కాస్త తినిపిస్తే తినడం, లేకపోతే పడుకోవడం. తన నాడి కొట్టుకోవడం తనకి స్పష్టంగా వినిపిస్తూంది.
జ్యోతి ముడుచుకుని పడుకున్న తన్మయి వైపు చూపిస్తూ ఏది ఏవైనా సరే “ఇలా వేళ్లాడి పోతున్న పిల్లని అస్సలు పంపను. ఇక మీద వాళ్లు ఫోను చేస్తే మీరే సమాధానం చెప్పుకోండి” అంది గట్టిగా.
***
మూడవ నెల దాటగానే కాస్త వాంతులు తెరిపిన బడ్డాయి. నిద్ర మాత్రం మామూలుగానే ఎప్పుడంటే అప్పుడు వస్తూంది. ఏదో కూపస్థ దశలో ఉన్నట్లు అనిపించసాగింది తన్మయికి. అన్ని వాసనలూ ఇంకా పడడం లేదు కానీ కాస్త తనంతట తను లేచి తిరగసాగింది.
శేఖర్ మధ్య మధ్య ఫోను చేసి గొడవ పెడ్తూనే ఉన్నాడు.
తల స్నానం చేసి తలారబోసుకోవడానికి వీథి వరండాలో కూచుంది తన్మయి. లేత సూర్యుని కిరణాలు వెచ్చగా తగులుతూ హాయిగా ఉంది.
“పోస్ట్” అన్న కేకా, వాకిట్లో వనజ చేతిరాతతో ఉత్తరం చూడగానే ఆనంద తాండవం చేసింది తన్మయి మనసు.
ప్రియాతి ప్రియమైన తనూ!
ఎలా ఉన్నావు అని అడగను. ఎందుకంటే నీకు ఎంతో నచ్చిన జీవిత భాగస్వామితో, నీ కలల నగరంలో హాయిగా ఉంటున్నావు కాబట్టి. నీ జీవితం ఎంత ఆనందదాయకంగా ఉందో ఊహించగలను. ఎందుకంటే స్నేహితురాలినే మరిచిపోగలిగేవు కదా! ఊ..చెప్పు…విశాఖపట్నం, సముద్రం, కొత్త కాపురం… అన్నీ చకచకా చెప్పేసెయ్యి.
ఇక నా విశేషాలంటావా? ఉదయం ఆఫీసుకి శ్రీ వారు వెళ్లి వచ్చే దాకా ఎంబ్రాయిడిరీలు, పుస్తకాలు చదూకోవడం. సుధా సాంగత్యంలో రోజులు తెలీడం లేదంటే నమ్ము. ఇక్కడ భాష, సంస్కృతులు వేరైనా మనుషులు చాలా మంచి వాళ్లు. మా ఇంటిగలావిడకి పిల్లలంతా ఎక్కడో దూరాన స్థిరపడ్డారు. ఒక్కతే ఉంటుందేమో నన్నే కూతురిలా చూస్తుంది. ఇక సుధా అమ్మా, నాన్నా మాకు మరో అయిదారు గంటల ప్రయాణపు దూరంలో ఉంటారు. వాళ్లు కూడా మంచి వాళ్లే. ప్రస్తుతానికి అన్నీ మంచి విషయాలే. అమ్మతో అప్పుడప్పుడూ బయటి నించి ఫోను మాట్లాడుతాను. మా ఇంట్లో ఫోను లేదింకా. చిన్న సంసారం కదా!
అన్నట్లు నీ ఎమ్మే విషయం ఎంత వరకూ వచ్చింది? యూనివర్శిటీకి అప్లై చేసావా? ఎంట్రెన్సు రాయాలనుకుంటా. ప్రిపేర్ అవుతున్నావా?
నీ అడ్రసు తెలియక ఇక్కడికి రాస్తున్నా. ఇది త్వరలో నీకు చేరుతుందని ఆశిస్తాను. ఇపటికైనా కాస్త ఈ స్నేహితురాలిని కాస్త పట్టించుకోవమ్మా.
సదా ప్రేమతో
నీ
వన
ఇన్ లాడ్ లెటర్ మడిచి నీలి రంగు కాగితాన్ని ఆప్యాయంగా తడిమింది తన్మయి.
“తన జీవితంలో సంతోషం లేకపోయినా వనజైనా హాయిగా ఉంది అదే చాలు.” అని నిట్టూర్చింది.
వనజలో తనకి బాగా నచ్చే విషయం తన స్థిత ప్రజ్ఞత. తన లాగా వలవలా ఏడ్చేయడం ఎప్పుడూ వనజలో చూడలేదు తను. తన కంటే కొంచెమే పెద్దదైనా తనకంత పెద్దరికం ఎలా వచ్చిందో ఆశ్చర్యం వేస్తుంది. “నువ్వెప్పుడూ నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తావు. థాంక్స్ వనా!” అని మనసులోనే ధన్యవాదాలు చెప్పింది తన్మయి.
“చదువులో తను సాధించాలనుకున్న లక్ష్యం దాదాపు గా మర్చిపోయింది. విశాఖకి వెళ్లగానే వివరాలు కనుక్కోవాలి.” అనుకుంది.
వనజకి ఉత్తరం రాద్దామని కూచుంది. ఏమని రాయాలి? ఎంత సేపు కూచున్నా రాయదగ్గ మంచి విషయం ఒక్కటీ కనిపించడం లేదు. తన జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఏకరువు పెట్టి వనజకున్న సంతోషాన్ని కూడా చెడగొట్టడం ఇష్టం లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. పాపం తనక్కడ వేచి చూస్తుందేమో. కానీ ఏమని రాయగలదు తను?
ఆలోచనలతోనే కాలం గడుస్తూంది తన్మయికి. “పుస్తకాలు చదువుదామంటే, తనకి నచ్చే పుస్తకాలు లైబ్రరీ నుంచి తెచ్చేవాళ్లెవరు?”
ఇంట్లో ఉన్న భగవద్గీత చదవడం మొదలు పెట్టింది. వ్యాఖ్యానంతో బాటూ ఉన్న శ్లోకాలు చదువుతూంటే ఎంతో సాంత్వన కలగసాగింది.
ఆ సాయంత్రం శేఖర్ ఫోను చేసాడు. ఏమో గానీ దిగులుగా మాట్లాడేడు. అతని గొంతులోని కాస్త దిగులుకే కరిగిపోయింది తన్మయి.
రెండ్రోజుల్లో అత్తవారింటికి ప్రయాణమయ్యింది. తన ముఖం లోకి దిగులుగా చూస్తూ “జాగ్రత్తమ్మా” అంటున్న తల్లికి “నేను ఇప్పుడు బానే ఉన్నానమ్మా. నువ్వేం దిగులు పడకు. అంతగా ఒంట్లో బాలేకపోతే వచ్చేస్తాలే” అంది.
“అన్నట్లు అల్లుడికి చెప్పు. నాన్న గారు మంచం, డ్రెస్సింగు టేబులు సాయంత్రం నవతా ట్రాన్స్ పోర్ట్ కి ఎక్కిస్తున్నారు. రెండ్రోజుల్లో అతన్ని వెళ్లి తెచ్చుకోమను.” అంది జ్యోతి.
శేఖర్ తల్లి వెళ్లగానే అడిగే ప్రశ్నల్లో ఇదొకటి. తేలిగ్గా ఊపిరి తీసుకుంది తన్మయి.
స్వీట్లు, అరటి పళ్లు ఇంకా ఏవేవో కూతుర్తో బాటూ తీసుకొచ్చి అత్తవారింట్లో దిగబెట్టి వెళ్ళేడు భానుమూర్తి.
శేఖర్ ఆ సాయంత్రం రైలెక్కి తెల్లారగట్లకల్లా వచ్చేసేడు. మంచి నిద్దట్లో ఉన్న తన్మయిని తట్టి లేపుతూ “మొగుడు ఇన్ని నెలల తర్వాత వస్తే వాకిట్లో కాపలా కాయకుండా నిద్రపోతున్నావా నిద్ర మొహవా.” అన్నాడు నవ్వుతూ.
నిద్దట్లో ఉన్న తన్మయికి అది వ్యంగ్యమో, నిజమో అర్థం కాలేదు.
“ఎప్పుడెప్పుడు నువ్వు మా ఇంటికి వస్తావా, నేను వద్దామని అనుకుంటూంటే ఇన్నాళ్లు అమ్మగారింట్లో మకాం వేసేసేవా?” అన్నాడు మళ్లీ.
“మంచం అవీ పంపించేవని అమ్మ చెప్పింది. ఇక నువ్వు మా ఇంటికి రావొచ్చు.” అంది తన్మయి.
“ఏవన్నావు మీ ఇల్లా! అది మీ అమ్మ గారిల్లు. మీ ఇల్లంటే ఇది. ఇప్పుడు నువ్వున్నది. తెలుసుకో తెలివిమాలిందానా! అయినా మంచాలూ, కుంచాలూ ఇచ్చేసినంత మాత్రాన అయిపోదు. పెళ్లిలో మీ వాళ్లు చేసిన అమర్యాదకి జీవిత కాలం కోపగించినా సరిపోదు” అన్నాడు వెంటనే.
తన్మయి భగవద్గీతలోని స్థిత ప్రజ్ఞతా శ్లోకం గుర్తు తెచ్చుకుని లోపల్లోపలే బాధని అణచుకుంది.
“నా కొడుకు ఎలా ఉన్నాడు? సరిగా తిండి పెడ్తున్నావా లేదా? అసలే బక్కమ్మవి. ఇంకా బక్క చిక్కిపోయినట్లున్నావు.” అన్నాడు పొట్ట మీద తడిమి.
అతని ధోరణిలో అతనేదే చేసుకుని పోతున్నా చలనం లేనట్లు ఒళ్లప్పగించింది తన్మయి.
***
వారం రోజుల్లో రెండు కొత్త సినిమాలకి ఇల్లంతా కలిసి వెళ్లేరు.
తన్మయికి అన్ని సినిమాలూ నచ్చవు. బాగా తల నెప్పి వచ్చెయ్యడం మొదలు పెట్టింది. ఇంటికి వస్తూనే కడుపులో “బుడుంగు” మని ఏదో కదిలి నట్లయ్యింది.
గడ్డలా ఉన్న కడుపు మీద గబుక్కున పట్టుకుంది. మళ్లీ కదిలింది.
తన్మయికి ఆనందం ఆకాశాన్నంటింది. “తన కడుపులో బిడ్డ కదులుతూంది!!” ఒక్క సారిగా గట్టిగా అరవాలనిపించింది. గమ్మత్తైన కొత్త అనుభవాన్ని ఎవరితోనైనా పంచుకోవాలని మనసు బాగా ఆరాటపడింది. ముందు గదిలో బాతాఖానీ లో ఉన్న శేఖర్ ని పిలిచింది.
“ఏవిటే, ఏదో వ్యాపారం విషయాలు మాట్లాడుకుంటూంటే” అన్నాడు విసుగ్గా.
“కడుపులో కొంచెం గాభరాగా ఉంది.” అంది మెల్లగా.
అతను తన పొట్ట మీద చెయ్యి వేస్తే, ఆ చేతినలాగే పట్టుకుని “మన పాప కదులుతూంది చూడు” అనాలని ఎంతో ఆత్రపడింది తన్మయి.
“కూల్ డ్రింకే వైనా తాగుతావా తెప్పిస్తానుండు. సీరియస్ విషయాలు మాట్లాడుకుంటూంటే ఇందుకా పిలిచావు. ఇలాంటిదేదైనా మా అమ్మకి చెప్పొచ్చుగా” అంటూ వెళ్లిపోయాడు.
కడుపులో మళ్లీ మళ్లీ కదులుతూన్న చోటల్లా పైన చెయ్యి వేస్తూ “ఏంటమ్మా! అన్ని మాటలూ వినేసావా? ఇవన్నీ పట్టించుకోకు. నేనున్నానుగా నీతో. మనిద్దరం కబుర్లు చెప్పుకుందాం” అంది ఆప్యాయంగా తడుముతూ తన్మయి.
అంతలో దేవి వచ్చింది “ఏవిటమ్మా, ఏదైనా ఇబ్బందిగా ఉందా?” అంటూ.
“లేదత్తయ్యా, కడుపులో కదులుతున్నట్లు ఉంది” అంది.
“నాలుగో నెల పడ్డాక పిల్లలు తన్నడం మొదలుపెడతారు. గాభరా పడకు. అన్నట్లు శేఖర్ రేపే బయలుదేరుతానంటున్నాడు. నిన్నూ పంపించమని అంటున్నాడు. నాలుగురోజులుండి వెళదామని నువ్వైనా చెప్పమ్మా” అంది.
ఆ రాత్రి శేఖర్ “నువ్విన్నాళ్లూ అమ్మగారింట్లో మకాం వేసి బాగానే ఉన్నావు. అక్కడ నేను వండుకోలేక చస్తన్నాను. నాకు ఎక్కువ సెలవు లేదు. అన్నీ సర్దుకో, రేపు సాయంత్రం బండికి వెళ్దాం” అన్నాడు.
తన్మయికి లోపల్లోపల కాస్త సంతోషం కలిగింది. “వెళ్లగానే యూనివర్శిటీకి వెళ్లి రావాలి” అనుకుంది.
తల్లికి ఫోను చేసింది.
“అదేవిటమ్మా, ఇంకా ఓపిక చిక్కక ముందే మళ్లీ ప్రయాణం అంటున్నావు? అల్లుడు చెప్తే వినే రకం కాదు కదా. జాగ్రత్తగా ఉండు మరి.” అంది జ్యోతి.
“సీమంతాలు అవీ మాకు ఆనవాయితీ లేవు. మీ అమ్మకి ముందే చెప్పమ్మ” పక్క నించి అంది దేవి.
ఆ మాటలు వినబడినట్లు “ఖర్చు తప్పడమే చూసుకుంటున్నట్టున్నది మహాతల్లి” అంది జ్యోతి.
ఫోను పెట్టేసేక కూడా తలపోటు తగ్గలేదు తన్మయికి వీళ్ల గొడవలకి.
***
మర్నాడు విశాఖపట్నంలో దిగగానే సంతోషకరమైన విషయం తెలిసింది తన్మయికి.
శేఖర్ తాతగారింట్లో అవుట్ హౌస్ పాతదైపోయిందని కూలగొట్టేసున్నందు వల్ల శేఖర్ బయటెక్కడో అద్దె ఇంటికి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాడు.
“ఇల్లు మా తాతయ్య ఇంటికి దూరమైనా నా పనికి దగ్గరవుతుంది” అన్నాడు శేఖర్ తన్మయితో.
మెయిన్ రోడ్డు ని వదిలి చిన్న సందులు రెండు మూడు దాటి, రోడ్డు కొంచెం కిందికి దిగే చోట గేదె ఒకటి కట్టేసి ఉంది. దాని పక్క నించి బండి వెళ్లే డౌన్ లోకి దిగారు. పక్కనున్న రెండు పోర్షన్లలో ఒకటి. ఇంటి ముందు సన్నని సిమెంటు వాకిలి ఉంది. ముందు వరండా గది. లోపల చిన్న మధ్య గది. వెనక వంటిల్లు, దాని వెనక బాత్రూము. నీళ్ల కుండీ.
గాలి వచ్చేందుకు మధ్య గదికి ఉన్న ఒకే ఒక్క కిటికీ వైపు గేదె కట్టి ఉన్నందు వల్ల ఎప్పుడూ అది తీయడానికి వీలుండదు.
ముందు వరండాలో సగానికి ఫెన్సింగు ఉండడం వల్ల బయటెవరు తిరిగినా ఇంట్లో వాళ్లు కనిపిస్తారు.
ఇక వంటిల్లయిటే చీకటి గుయ్యారం. ఆ బయట ఉన్న బాత్రూము ల దగ్గర పూర్తిగా రేకులతో మూసి ఉన్నందు వల్ల కుళాయినీళ్లు ఆరక చెమ్మగా ఉంది. బయట చిన్న డాబా పైకి వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. ఉన్నంతలో అదొక్కటే కాస్త ఊరట.
తన్మయికి ఇల్లు నచ్చలేదు. అదే చెప్పింది.
“నేనేవైనా జమీందారుననుకుంటున్నావా? నాకొచ్చే జీతంలో ఈ మహా నగరంలో ఈ మాత్రం తలదాచుకుందుకు చోటు దొరికింది సంతోషించు.” అన్నాడు శేఖర్.
మర్నాడు సాయంత్రం నవతా ట్రాన్స్పోర్ట్ నించి మంచం, డ్రెస్సింగు టేబుల్ వచ్చాయి.
శేఖర్ వాళ్ల తాతగారింట్లో నించి పాత పరుపేదో తీసుకొచ్చి వేస్తూ “ఏం చేస్తాం, ఖర్మ. ఒక్కటే కూతురివి కదా, ఏదో దోచి పెట్టేస్తారనుకున్న నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే” అన్నాడు.
పొద్దుట శేఖర్ బయటికి వెళ్లిపోగానే కాస్త వండుకు తినడం, ఇల్లు సర్దుకోవడం పనిగా పెట్టుకుంది తన్మయి. వంగి చేసే పన్లు, బరువు పన్లు చెయ్యొద్దని డాక్టరు చెప్పడం వల్ల రోజుక్కాస్త మెల్లగా చెయ్యడం మొదలెట్టింది.
ముదురు రంగు పాత చీరొకటి చింపి, చేత్తో కుట్లు వేసి బయట వరండా లో ఫెన్సింగుకి కర్టెన్లు కట్టింది.
తనెప్పుడో అల్లిన దారపు చిలకల పంజరం ఒకటి సామాన్ల లోంచి తీసి, వరండా లో గుమ్మం దగ్గిర వేళ్లాడ దీసింది.
మధ్య గదిలో గోడకున్న తలుపు ల్లేని అలమారా సొరుగుల్లో పేపర్లు వేసి, తన పుస్తకాలు, బట్టలు పొందికగా సర్దుకుంది.
వంటింట్లో చిన్న చిన్న సీసాల్లో శేఖర్ తెచ్చిన సరుకులు సర్ది పెట్టింది. గోనె సంచుల్లో ఉన్న అట్ల పెనం, మూకుళ్లు, గిన్నెలు, నీళ్ల బిందెలు రోజుకొకటి శుభ్రంగా కడగడం మొదలెట్టింది.
వారం రోజుల్లో చాలా వరకు పని తెమలింది.
పని మధ్యలో హఠాత్తుగా నిద్ర వస్తే పడుకోవడం అలవాటయినందువల్ల ఒక్కో సారి బద్ధకంగా అనిపించసాగింది. అలాంటప్పుడు మంచమ్మీద జేరబడి కడుపులో పాపాయితో కబుర్లతో గడపసాగింది.
ఆ రోజు పక్కింటి పోర్షన్లో ఉన్న మూడేళ్ల పాప అస్తమాటూ ఫెన్సింగు దగ్గిర తొంగి చూడడం గమనించి గడియ తీసి లోపలికి పిలిచింది.
ఆ వెనకే వచ్చిన పాప తల్లి లక్ష్మి “ఎన్నో నెల” అని పలకరించింది. వాళ్లాయన యూనివర్శిటీలో క్లర్కుగా పనిచేస్తున్నాడనగానే ఆసక్తి పెరిగింది తన్మయికి.
“యూనివర్శిటీలో అడ్మిషన్ పద్ధతేవిటో కనుక్కుంటారా కాస్త” అని బిడియంగా అడిగింది తన్మయి మొదటి పరిచయంలోనే ఇలా సాయాలు అడిగితే ఆవిడ ఏమనుకుంటుందో అనుకుంటూ.
“అదేమంత పెద్ద పనమ్మా. నువ్వే అడొగొచ్చు ఆయన్ని. నాకు చదువుల విషయాలంతగా తెలీవు” అంది లక్ష్మి.
ఆ మర్నాడు వాకిట్లో రుబ్బురోలు ముందు కూచుని కొబ్బరి పచ్చడి రుబ్బుతున్నలక్ష్మితన్మయిని పిలిచింది. “కాస్త ఉప్పు సరిపోయిందేమో చెప్తావా?”
అత్యంత రుచిగా ఉన్న ఆ పచ్చడి లో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే బావుణ్ణని ఒకటే మనసంతా లాగడం మొదలెట్టింది తన్మయికి. కానీ అడిగితే బావుండదేమో అని మానుకుంది.
పది నిమిషాల్లో పెద్ద గిన్నెలో కొబ్బరి పచ్చడి తెచ్చి ఇచ్చిన లక్ష్మి వైపు ఆనందంగా చూసింది తన్మయి.
“కడుపుతో ఉన్నపుడు ఏం చూసినా తినాలనిపిస్తుంది. మనం వండుకున్నదానికంటే పక్కనెవరైనా వండిన వాసనలు నచ్చుతాయి. రోజూ కాస్త ఏవైనా ఇస్తాను కడుపునిండా తిను. మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. రేపు మీ అబ్బాయో, అమ్మాయో పుట్టి, పెద్దయ్యాక నా పేరు మర్చిపోకుండా చెప్పాలి నువ్వు” అని నవ్వింది లక్ష్మి.
ముక్కూ మొహం తెలీని తన పట్ల ఆవిడ చూపిస్తున్న ప్రేమకి కళ్లల్లో నీళ్లు వచ్చాయి తన్మయికి.
“తను కూడా ఎప్పుడైనా తనలాంటి వాళ్లు ఎదురైతే ఇలా ఆప్యాయంగా చూడాలి” అనుకుంది.
***
“నాకు ఒరిస్సాలో పనిబడింది. పది రోజుల్లో వస్తాను. నువ్వొక్కర్తెవి ఇక్కడ ఉండలేకపోతే తాతయ్య గారింటికి దిగబెడతా నిన్ను” అన్నాడు వస్తూనే శేఖర్.
అతని దగ్గిర గుప్పుమని కొడ్తూన్న వాసనకి కడుపులో తిప్పినట్లయ్యింది తన్మయికి.
“నువ్విలా తాగి రావడం నాకు పడడం లేదని ఎన్ని సార్లు చెప్పాలి నీకు” అంది ప్రాధేయ పూర్వకంగా.
“ఏవిటే? ఏదో స్నేహితులతో వారానికోసారి సర్దా చేసుకోవడానిక్కూడా ఏడుపేనా నీకు? నీకు పడకపోతే నాకేంటట. ఇంటికొచ్చిందగ్గిర్నించీ ఏడుపు మానేసి, కాస్త నవ్వు మొహమేసుకుని అన్నం పెట్టు” అన్నాడు విసుగ్గా.
డ్రెస్సింగు టేబుల్ మీద యూనివర్శిటీ అప్లికేషను చూసి “ఇదేవిటి?” అన్నాడు ఇంకాస్త విసుగ్గా.
“ఎమ్మే చదవడానికి అప్లికేషను. పక్కింటి ఆవిడ తెప్పించి పెట్టారు.” అంది తన్మయి.
“చదివిన చదువు చాలాలేదా మొగుడితో పోట్లాడడానికి. నువ్వింకా చదివి దేశాన్ని ఉద్ధరించక్కరలేదు.” అన్నాడు వ్యంగ్యంగా.
“అదింకా అడ్మిషన్ టెస్టు అప్లికేషన్ మాత్రమే. సీటు వచ్చినప్పటి మాట. డెలివరీకి వెళ్లేలోగా ఒక్క సారి ఊరికే పరీక్ష ఎలా ఉంటుందో రాసి చూద్దామనుకుంటున్నాను.” అని వెనక్కి తిరిగింది తన్మయి.
అప్పటికే నిద్రపోతున్న శేఖర్ వైపు చూసి నిట్టూర్చి కడుపు మీద చెయ్యి వేసుకుని నిమురుకుంటూ “పాపాయీ, నాతో బాటూ చదువుతావా?” అంది దిగులుగా తన్మయి.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.