“నెచ్చెలి”మాట 

“నెట్టిం”టి సాహితీ చెలి- నెచ్చెలి!

-డా|| కె.గీత 

“నెచ్చెలి”కి అప్పుడే ఏడాది నిండింది! 

“ఈ ఏడాదిగా “నెచ్చెలి” ఏమేం చేసిందీ?” అంటే 

అబ్బో , చెప్పడానికి బోల్డు విశేషాలున్నాయి. ఓపిగ్గా చదువుతానంటే కాసుకోండి మరి!

ముందస్తు విశేషం ఏవిటంటే- 

ప్రతి నెల్లోనూ  కాసిన్ని కొత్త విశేషాలు చేర్చుకుంటూ ఏడాదికి తప్పటడుగులు కాదు ఏకంగా పరుగు ప్రారంభించింది. 

అదీ సంగతి!

ముందుగా నా మీద ప్రేమతో అడగగానే తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  

పేరుపేరునా నెనర్లు! 

43000 దాటిన హిట్ల సంఖ్య తో అందరి మనసు మెచ్చిన “నెచ్చెలి” అయింది! తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలో  అగ్రస్థానంలో నిలిచింది! 

ఇందుకు కారణభూతమైన  పాఠకులైన మీ అందరికీ అనేకానేక నెనర్లు! 

పత్రిక  ప్రారంభించడానికి ఎన్ని కారణాలున్నా జూలై 10 నే ప్రారంభించడానికి మాత్రం కారణం మా చిన్నమ్మాయి “సిరివెన్నెల” పుట్టినరోజు కూడా అదే రోజు కావడమే. కాబట్టి జూలై 10 అంటే మా ఇంట  గొప్ప పండుగే అన్నమాట! 

ఇక తెలుగు పాఠకులకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ స్థాయికి చేరిన మహిళల స్ఫూర్తిని , సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని  పరిచయం చేసే దిశగా దాదాపు 70 శీర్షికలతో స్త్రీల కథలు, కవిత్వం, నవలలు, జీవితచరిత్రలు, పరిశోధనలు, కళలు, సినిమాలు వంటి అనేక కాలమ్స్, ధారావాహికలతో బాటూ మగవారి ప్రత్యేక విశేష రచనలు కూడా కలుపుకుంటూ అన్నిటినీ ఒక  చోటికి  తీసుకొచ్చి అందిస్తున్న “నెచ్చెలి” తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నెలనెలా క్రమం తప్పకుండా 10 వ తారీఖుకి విడుదల అవుతూ ఉంది. 

మీ క్యాలెండర్లని మార్కు చేసుకోండి. ప్రతినెలా 10 వ తారీఖు “నెచ్చెలి” మీ “నెట్టిం”ట అడుగుపెట్టే సుదినం! 

తెలుగు భాష లోంచి ఆంగ్ల భాషలోకి వస్తున్న అనువాదాలను,  పూర్తిగా ఆంగ్ల భాషలో రాస్తున్న ఇప్పటి యువతరాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న “నెచ్చెలి- ఇంగ్లీషు”(Neccheli-English) ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి  చేరువవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

మీ రచనలు ఏవైనా ఇంగ్లీషులోకి అనువదింపబడి, పత్రికల్లో అముద్రితమైనవైతే  “నెచ్చెలి- ఇంగ్లీషు”(Neccheli-English) మీకు ఆహ్వానం పలుకుతూ ఉంది. వెంటనే పంపండి. 

“నెచ్చెలి” కి రచనలు పంపడానికి మీరు  స్త్రీలే  కానవసరం లేదు, పురుషులకూ ఆహ్వానం! 

వినూత్న రచనాపద్ధతి మీ స్వంతమైతే తప్పకుండా editor.neccheli@gmail.com ను సంప్రదించండి. 

రచనలు పంపే ముందు నెచ్చెలి “రచనలు- సూచనలు” పేజీలోని  సూచనలు చూడండి. 

మీ/ నా అభిమాన “నెచ్చెలి” ఇలాగే ఉత్సాహపూరితంగా కొనసాగడానికి మీ సహకారం ఎప్పటిలానే అందిస్తారు కదూ!


*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.