నారిసారించిన నవల-12

వట్టికొండ విశాలాక్షి

-కాత్యాయనీ విద్మహే 

  5

నిష్కామయోగి నవల 1956 లో ప్రజావాణి పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది. వెంటనే ప్రజావాణి ప్రచురణగా వచ్చింది. ఖైదీ నవలను ప్రచురించిన కాంగ్రెస్ పత్రికను  రాష్ట్ర కమిటీ దానిని ఇక  నడపలేమని తీర్మానించాక వట్టికొండ రంగయ్య తీసుకొని ప్రజావాణి అని పేరు మార్చి నడిపాడు. 1954 లో వట్టికొండ రంగయ్య మద్రాసు నుండి మకాం గుంటూరుకు మార్చటంతో ప్రజావాణి కార్యస్థానం గుంటూరు అయింది. వట్టికొండ విశాలాక్షి నవలలు ప్రజావాణి ప్రచురణలు గానే వచ్చాయి. 1998 లో వట్టికొండ రంగయ్య మరణించాడు. ఆయన ‘దివ్యస్మృతికి’ అంకితంగా   నిష్కామయోగి నవలను పునర్ముద్రించింది విశాలాక్షి.  

ఈ నవలలో కథ 1920 నుండి 1952 వరకు మూడు దశాబ్దాల కాలం మీద విస్తరించింది. కాంగ్రెస్ నాయకత్వాన జాయతీయోద్యమం, కమ్యూనిస్టు ప్రజా ఉద్యమం సమాంతరంగా సాగుతున్న కాలం అది. ఆ రెండింటిలోనూ పాల్గొన్న మహిళల అనుభవాల చరిత్ర ఈ నవలకు ఇతివృత్తం అయింది. జాతీయోద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమాలలో భాగస్వాములు అవుతూనే వాటిని వాళ్ళు ఎట్లా అర్ధంచేసుకొన్నారు? ఏమని వ్యాఖ్యానించారు?  తెలుసుకొనటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  తమకాలపు రాజకీయాల పై స్త్రీల కోణం అనేది ఒకటి ఉంటుంది అని చూపిన  ఒక సాధికార డాక్యుమెంట్ ఈ నవల.  

1920 సెప్టెంబర్ 4 నుండి 9 వతేదీవరకు కలకత్తాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ మహాసభ ప్రభావాల నుండి  ఈ నవలలో కథ మొదలవుతుంది. ఆ మహాసభ ప్రత్యేకత అసహయోద్యమ గురించిన ఒక అవగాహనకు రావటం. స్వరాజ్యం లక్ష్యంగా బ్రిటిష్ వలసపాలనకు సహాయాన్ని సహకారాన్ని నిరాకరించటం ఇందులో కీలకం. దీనికి సంబంధించిన కార్యక్రమం నిర్దిష్టంగా రూపొందింది నాగపూర్ కాంగ్రెస్ లో (1920 డిసెంబర్).  ప్రతి ఇంటా నూలు వడకటం, దేశీయ చేనేత పరిశ్రమను ఉద్దరించటం, జాతీయ విద్యాప్రణాళిక సమగ్రంగా రూపొందే లోగా బాలురకు హిందుస్థానీభాషను , నూలు వడకటాన్ని  నేర్పించటం అందులో ముఖ్యమైనవి. 1921 మార్చ్ 31 ఏప్రిల్ 1 వతేదీలలో బెజవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్ కార్యనిర్వాహక సమావేశాలు కాంగ్రెస్ లో సభ్యత్వం పెంచాలనీ, ఇరవై లక్షల రాట్నాలు నడపటం లక్ష్యంగా కార్యక్రమం తీసుకొనాలని నిర్ణయించాయి. (భోగరాజు పట్టాభి సీతారామయ్య, కాంగ్రెస్ చరిత్ర) ఈ సభలవల్ల  ఆంధ్రదేశంలో అసహాయ ఉద్యమానికి ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ సందర్భంలోనే ఏప్రిల్ 6 న  గాంధీ విశాలాక్షి పుట్టినిల్లు  చేబ్రోలును సందర్శించాడు. ఆ తరువాత రెండు నెలలకు విశాలాక్షి పుట్టింది. ముప్ఫయి అయిదేళ్ల వయసులో తాను పుట్టేటప్పటికి వూళ్ళో వేరూనుకొంటున్న జాతీయోద్యమ చైతన్యం దగ్గరే ప్రారంభించి దాని విస్తరణ , భిన్న పోకడలు, పరిణామాలు వస్తువుగా విశాలాక్షి వ్రాసిన ఈ  నిష్కామయోగి నవలలో  కథ ప్రవర్తించటం     స్థూలంగా  1930 వ దశకంలో అనుకోవచ్చు.      

  నిష్కామయోగి నవలలో ఊరి పేరు ఏమోగానీ ఆ ఊళ్లోకి జాతీయోద్యమ కార్యక్రమాన్ని  ఆచరణ కు తెచ్చినవాడు అచ్చయ్య. భార్యకు పండగకు  ఖద్దరు చీర తేవటంతో అది ప్రారంభం అయింది. ఆయనకు చదువు సంధ్యలు లేవు. ఎట్లా తెలిసిందో  సహాయనిరాకరణలో భాగంగా స్వదేశీ ఖద్దరు ధరించటం గురించి … తాను తన భార్య ఖద్దరే  కట్టాలి  అన్న నిర్ణయానికి తీసుకువచ్చాయి అతనిని. అందుకే పండక్కి ఆమెకు ఖద్దరు చీర తెచ్చాడు. ఆ ముతక గొల్లంచుల చీర తాను కట్టనని ఆమె అభ్యంతర పెడితే సరోజినీ నాయుడు,కమలాదేవి  పేర్లు చెప్పి వాళ్ళే కట్టుకుంటున్నారు అని చెప్పటమే కాక ‘ఈ గుడ్డ మనచేతుల మీదుగా మనం తయారుచేసుకోవచ్చు, మనమంటే మనమే కాకపోయినా మనదేశం దాటి ఇంకొకదేశం మాత్రం వెళ్ళక్కరలేదు. ఏ మరలు, యంత్రాలు లేకుండానే సహజంగానే ఉన్న చేతులతోనే ఈ గుడ్డ తయారుచేయవచ్చు … ఇంగ్లీషువాళ్ళ వ్యాపారం పడగొట్టవచ్చు ..’ అని ఖద్దరు ఎందుకు కట్టాలో కూడా చెప్పాడు.ఈ సారి వాళ్లోచ్చినప్పుడు,మన బజారులోనే అవసరమైతే మన వాకిటముందున్న వేపచెట్టుకింద మీటింగ్ పెట్టిస్తాను, నువ్వు కూడా విందువుగానీ అని కూడా అంటాడు ఆయన. 

వాళ్ళు అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు తప్ప మరొకళ్ళు కాదు. రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యత ఊరూరా ప్రచారకార్యక్రమాలను చేపట్టటమే. అందులో భాగంగా ఊళ్లోకి కాంగ్రెస్ వాళ్ళు రావటం అప్పటికే మొదలయిందని, అలాంటి వాళ్ళ పరిచయాలు, ప్రభావాలు అచ్చయ్యను ఖద్దరు ధారణ వరకు తీసుకువెళ్లాయని అర్ధం చేసుకోవచ్చు. కలకత్తా కాంగ్రెస్ ‘నూలువడుకు పరిశ్రమ ప్రతిగృహంలోనూ పునరుద్ధరించ వలసిందనీ లక్షలమంది నేతగాండ్రకు జీవనాధారమయిన నేతపరిశ్రమకూడా తక్షణము తిరిగి ప్రారంభింపబడవలెనని ‘ చేసిన తీర్మానం ( కాంగ్రెస్ చరిత్ర)  గ్రామాలలోకి ,ప్రజల హృదయాలలోకి ఎంతగా చొచ్చుకొని పోయిందో  దానిని వాళ్ళెంతగా స్వంతం చేసుకున్నారో అచ్చయ్య మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆరకంగా అచ్చయ్య భార్య పాపాయమ్మ ఆ వూళ్ళో ఖద్దరు కట్టిన మొదటి స్త్రీ అయింది. 

కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలోకివచ్చే క్రమంలో కాంగ్రెస్ మహిళలు రావటం, మహిళలను సమావేశపరిచి మాట్లాడటం ఈ నవలలో ప్రస్తావనకు రావటం చూస్తాం.1928 కలకత్తా కాంగ్రెస్ స్త్రీల ఆంక్షలను తొలగించి వారు జాతీయాభివృద్ధికొరకు పనిచేసేట్లుగా ప్రోత్సహించాలని చేసిన తీర్మానం( కాంగ్రెస్ చరిత్ర ) ఇందుకు మార్గం వేసి ఉంటుంది. కాంగ్రెస్ లో మహిళా కార్యకర్తల ప్రచారం ప్రభావం ఆ వూళ్ళో చాలా ఇళ్లల్లోకి రాట్నాన్ని తెచ్చింది.  అది బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక చర్య అని తెలిసీ మహిళలు రాట్నం మీద నూలువడకటానికి సిద్ధపడ్డారు. పోలీసుల పొడ పసిగడితే  దాచెయ్యటమూ నేర్చు కొన్నారు. నూలు వడకటం మాత్రమే కాదు, పికెటింగ్ లలోనూ పాల్గొని జైళ్లకు వెళ్ళటానికి సిద్ధపడాలని కూడా కాంగ్రెస్ మహిళలు చేసిన ప్రచారం పాపాయమ్మను , చిట్టెమ్మను జైలువరకు నడిపించటంలో ప్రభావం చూపింది. జైలుకు వెళ్లటంలో వాళ్ళు మొదటివాళ్లే కానీ వాళ్ళ తరువాత, వాళ్లింకా జైలు నుండి విడుదలై రాకముందే ఆ ఊరి  నుండి చాలామంది స్త్రీలే జైలుకు వెళ్లిన సంగతి అచ్చయ్య ఆలోచనల ముఖంగా సూచించింది రచయిత్రి. 

హిందీ నేర్చుకొనటంతో సహా కాంగ్రెస్ కార్యక్రమాన్ని అంతా నవల  ఇతివృత్తంలో భాగం చేసింది విశాలాక్షి.  యువకులు హిందీ నేర్చుకొనటానికి ఒక మాస్టారును ఊళ్లోకి పిలిపించాలను కొనటం, ఖద్దరు కట్టిన పాపాయమ్మను కూడా నేర్చుకొనమని అడగటం, అచ్చయ్య ఆ ఏర్పాటుకు పెద్దరికం వహించి విశాలాక్షి నేర్చుకొనటానికి వీలుగా తమఇంట్లోనే పాఠాలు చెప్పుకొనే అవకాశం కల్పించటం నవలలో చూస్తాం. నానాటికీ ఎక్కువవుతున్న హిందీ ప్రచారం దృష్ట్యా జైలు నుంచీ తిరిగివచ్చాక పాపాయమ్మ చూపిన చొరవతో పరీక్షకు కట్టాలన్న లక్ష్యంతో  స్త్రీలు హిందీ నేర్చుకొనటం కూడా గమనించవచ్చు. 

  1928 కలకత్తా కాంగ్రెస్ లోనే అంటరానితనానికి వ్యతిరేకంగా తీర్మానం జరగటం , అప్పుడే అంటరానితనాన్ని నిర్మూలించటానికి జమ్నాలాల్ బజాజ్ నాయకత్వంలో ఒక ఉపసంఘాన్ని ఏర్పరచటం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో అస్పృశ్యతకు  వ్యతిరేకంగా హరిజనాభ్యుదయాన్నికోరి కాంగ్రెస్ కార్యక్రమాలు తీసుకొనటం ముమ్మరమైంది. దానిని కూడా విడువలేదు విశాలాక్షి. కాంగ్రెస్ నాయకులు వచ్చి వీధి బావులలో హరిజనులు తోడిన  నీళ్లు కలిపే కార్యక్రమం తీసుకొనటం, మహిళా ప్రచారకులు వచ్చి హరిజనవాడలకు వెళ్ళటం, వాళ్లకు శుచీ శుభ్రత నేర్పటం, ఊరిమీద ఉప్పు,పప్పు, బియ్యం సేకరించి హరిజనులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేయడం మొదలైన గాంధీ ఇచ్చిన కార్యక్రమాల  గురించి స్త్రీలలో ప్రచారం చేసి ఆచరణ వైపు నడిపించటం వంటివి కథాగమనంలో భాగమయ్యాయి. ఆ రకంగా ఈ నవలలో కథ 1920 వ దశకపు  దేశీయ రాజకీయార్ధిక పరిణామాల నేపథ్యంలో ప్రారంభమై 30వ దశకం లో కొనసాగింది. 

1930ల నాటి ఉప్పుసత్యాగ్రహం ప్రస్తావన కూడా ఇందులో ఉంది. ఆ ఊరి యువకులు అందులో పాల్గొన్నారు కూడా. దొంగలను కొట్టటానికి ఉపయోగపడుతుందని  తనదగ్గర కర్ర సాము నేర్చుకొన్న యువకులు వాళ్ళ బలమూ, సాహసమూ ఉప్పు సత్యాగ్రహానికి వినియోగించటం చూసి  అచ్చయ్య సంతోషించాడు. వూళ్ళో నుండి యువకులు బయటి ఊళ్లకు పికెటింగ్ లకు వెళ్ళటం, వాళ్ళకోసం పోలీసులు వూళ్ళల్లోకి రావటం కూడా జరుగుతున్నది. జెండాలు పట్టుకొని ఊళ్ళో ఊరే గింపులు జరపటానికి, పికెటింగులు చేయటానికి, జైళ్లకు వెళ్ళటానికి యువత సన్నద్ధంఅవుతున్న ఉజ్వల దృశ్యాన్ని నవలలో చిత్రించింది విశాలాక్షి. 

ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర విక్రయశాలల ముందు పికెటింగులు, అరెస్టులు, జైళ్లు వీటితో ఉధృతంగా సాగుతున్న అసహాయోద్యమం గాంధీ ఇర్విన్ ఒడంబడికతో (1931) పూర్తిగా ఉపసంహరింపబడింది. రెండవరౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ కు  కాంగ్రెస్ పక్షాన గాంధీ వెళ్ళటానికి,   అది అవకాశం కల్పించింది. ఆ తరువాత 1934 ఏప్రిల్ లో గాంధీ సత్యాగ్రహం కార్యక్రమాన్నికూడా ఉపసంహరించాడు. సత్యాగ్రహం ఆధ్యాత్మికమైన అస్త్రవిశేషం అనీ, దానిని వినియోగించటంలో జనసామాన్యానికి తగిన స్వయం వ్యక్తిత్వం, మార్గదర్శకత్వం లోపించాయనీ  అందువల్ల ‘స్వరాజ్యం కొరకు సత్యాగ్రహము నవలంబించుటను కాంగ్రెస్ వాళ్ళు మానివేయాలి’ అనీ,  ప్రస్తుతానికి దానిని తన  ఒక్కడికి వదిలివేయాలని ఒక ప్రకటన విడుదల చేసాడు. అది అదే సంవత్సరం అక్టోబర్ లో జరిగిన పాట్నా సమావేశంలో ఆమోదించబడింది. దానితో సత్యాగ్రహ శకం ముగిసి  శాసన సభా శకం మొదలైంది. ఫలితంగా ‘కొంతకాలం నుండి బంధింపబడిన వాక్కు తిరిగి స్వేచ్ఛను పొందింది. ఎన్నికల ఉత్సాహం అమేయం.’  కాంగ్రెస్ సందేశాన్ని గ్రామగ్రామానికి వ్యాపింపచేయటానికి అదొక అవకాశం అయింది. (కాంగ్రెస్ చరిత్ర) నవలలో పాపాయమ్మ ఎన్నికల ప్రచారకార్యక్రమాలకు పక్క ఊళ్లకి వెళుతూ వారాలు, వారాలు వుండి వస్తున్నది అని చెప్పిన విషయం ఈ ఎన్నికలకు సంబం ధించే అయివుండాలి.

సత్యాగ్రహ విరమణతో  ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసిన కార్యక్రమం ఏదీ లేకపోవవటం పట్ల ఆనాడు వినపడిన ఒక అసంతృప్తస్వరాన్ని కూడా ఈ నవలలో నమోదు చేయటం మరువలేదు విశాలాక్షి. భారతదేశ స్వాతంత్య్రం గురించిన సందేహాలు వ్యాపించి ప్రజలు నిరుత్సాహంతో నిశ్శబ్దంగా వుండిపోయిన తరుణంలో ప్రజలకు ఉత్సాహాన్ని, చైతన్యాన్ని ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ నాయకత్వం ఇయ్యలేకపోయిందని రచయిత కథనం. ఆ సమయంలో వచ్చిన    (1939)   రెండవ ప్రపంచయుద్ధం కాంగ్రెస్ కు ఒక కార్యక్రమాన్ని కల్పించే అవకాశం ఇచ్చిందని అంటుంది. ఆ కార్యక్రమం ఇంగ్లండ్ కు యుద్ధంలో సహాయం చేయకూడదనే  ప్రచారం. వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమ రూపంలో అది సాగాలి. దానికి ఉన్న పరిమితులు ఎన్నో, అది ఎంత బలహీనమైన కార్యక్రమమో కూడా రచయిత కథనంలో స్పష్టంగానే తెలుస్తుంది. ఈ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన దలచినవాళ్లు గాంధీ అనుమతి పొందవలసి రావటం, సమావేశాలు, ఊరేగింపులు  లేకుండా  ఒకొక వ్యక్తి బయలుదేరి ఎక్కడో ఒక చోట నిలబడి యుద్ధానికి తోడ్పడవద్దు అని చెప్పవలసి ఉండటం ఆ పరిమితి, ఆ బలహీనత. అందువల్ల దాని ప్రభావం అంటూ ఏదీ ఇటు ప్రజలమీద కానీ అటు ప్రభుత్వం మీద కానీ లేకుండా పోయాయి అని విశాలాక్షి అభిప్రాయం.

ఈ నవలలో పాపాయమ్మ కాంగ్రెస్ పిలుపును అందుకొని అలా తాను కూడా వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నది. తనకు ఏ నాడు అలవాటు లేని కాలినడకన ఊళ్ళు తిరిగి యుద్ధవ్యతిరేక ప్రచారం చేసింది. కమ్యూనిస్టుల నుండి అదే యుద్ధవ్యతిరేక ప్రచారంలో పాల్గొంటున్న భాస్కరం అనే యువకుడి ముఖంగా ఈ విధమైన ప్రయోజనం లేని పని మీద విమర్శ పెట్టింది విశాలాక్షి. ఏ బజారు అరుగుమీదో నిలబడి యుద్ధానికి సహాయం చేయమని ఒక వ్యక్తి చెప్పేమాట ఒక్కరు కూడా వినటం లేదని, అది ప్రజల మీద చూపే ప్రభావం ఏదీ లేదు గనుకనే పోలీసులూ వాళ్ళను అరెస్టు చేసేది లేదని అంటూ అతను  ‘ఎందుకొచ్చిన శ్రమ వూరు వెళ్ళిపోయి హాయిగా విశ్రాంతి తీసుకోక’  అని ఆమెకు సలహా చెప్పాడు. ‘గాంధీ చెప్పినట్లు చేయాలనుకున్నాం.. చేస్తున్నాం’ అన్నది ఆమె సమాధానం. 

భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో మరొక కీలక ఘట్టం ‘క్విట్ ఇండియా’ ఉద్యమం. బ్రిటిషువాళ్ళను భారతదేశం వదిలివెళ్లాలని కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం  అది. 1942 ఆగస్టు 8 న ప్రారంభమైన ఈ చారిత్రక ఘట్టం ఆగస్టు విప్లవంగా కూడా చెప్పబడింది. గాంధీ దీనిని అహింసా ఉద్యమంగానే ప్రారంభించినా చాలావరకు అది స్థానికుల నాయకుల చేతిల్లోకి , విప్లవకారుల చేతుల్లోకి వెళ్ళింది. టెలిగ్రాఫ్ తీగెలు తెంచటం, రైలు పట్టాలు తొలగించటం వంటి కార్యక్రమాలు తీసుకోబడ్డాయి. వేలమంది అరెస్ట్ అయ్యారు. జైళ్లు నిండిపోయాయి.నిర్బంధం పెరిగింది.  అనేకమంది అజ్ఞాతంలోకి వెళ్లారు. 1944  సెప్టెంబర్ వరకు రెండేళ్ల పాటు సాగిన ఈ ఉద్యమం కూడా నిష్కామయోగి నవల ఇతివృత్తంలో భాగమైంది.  ఘటనల సమాహారంగా కాక రచయిత కథనంలో సూచితమైంది. ఉన్నట్టుండి ఒక్క సారి  పెద్దవిప్లవం బయలుదేరింది అన్నది దానిని ఉద్దేశించే. . వ్యక్తి సత్యాగ్రహంతో విసిగిపోయిన దేశీయులు  తెల్లవాళ్ళమీద కసితో, తెల్ల ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయాలని  ఈ విప్లవాన్ని లేవదీశారనీ, పాపాయమ్మ ఆ కార్యక్రమం లో పాలుపంచు కోకపోయినా పాల్గొనేవాళ్లను తెగమెచ్చుకొంటూ ఇవాళో రేపో స్వరాజ్యం వస్తుందని అంటుండేదని  కథనం చేసింది రచయిత్రి. ఆ ఉద్యమం అణచివేయబడ్డ తరువాత గాంధీ దానితో తనకు సంబంధం లేదని ప్రకటించిన విషయం  కూడా  ప్రస్తావించబడింది. 

రెండవప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అనివార్యమైన  అంతర్జాతీయ పరిస్థితులలో బ్రిటన్ భారతదేశంపై అధికారాన్ని రద్దుచేసుకొని స్వాతంత్య్రం ఇచ్చింది. వెంటనే శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు కాంగ్రెస్ హరిజన ఉద్యమంతో కులాలు లేకుండా చేసిందని నిందించినవాళ్లు కూడా కాంగ్రెస్ దే ఇక ప్రభుత్వాధికారం అని తెలుస్తుండటంతో తామూ కాంగ్రెసే అని చెప్పుకొనటం గురించి కూడా ప్రస్తావించింది రచయిత్రి. పాపాయమ్మ కు అసెబ్లీకి అభ్యర్థిగా పోటీచేసే అవకాశం వస్తుందని అందరూ అనుకొనటాన్ని, ఆమె ఆశ పడటాన్ని కూడా ప్రస్తావించి కానీ కాంగ్రెస్ ఆ స్థానానికి బాగా డబ్బు ఖర్చుపెట్టగల అభ్యర్థిని నిలబెట్టిందని చెప్పటం ద్వారా విశాలాక్షి కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్వభావం ప్రారంభంలోనే డబ్బు, అధికారం కేంద్రంగా బలపడుతున్న స్థితిని ఈ నవలలో వ్యాఖ్యానించింది. 1952 ఎన్నికలను, పరిణామాలను చిత్రించటంతో నవల ముగుస్తుంది  

6

కాంగ్రెస్ రాజకీయాలతోపాటు కమ్యూనిస్టు రాజకీయాలు కూడా ఈ నవలేతివృత్తంలో భాగం కావటం మరొక విశేషం. మార్క్సిస్టు భావజాలం గల జయప్రకాష్ నారాయణ్ వంటి యువకులు కాంగ్రెస్ లో చేరిన(1929) అయిదేళ్లకే(1934)  సోషలిస్టు పార్టీ కాంగ్రెస్ లో ఒక భాగంగా  ఏర్పడింది. వాళ్ళ కార్యక్రమంతో గాంధీకి ఏకీభావం లేదు.  వాళ్లు కాంగ్రెస్ లో అధికసంఖ్యాకులు అయినట్లయితే కాంగ్రెస్ తో సంబంధం వదులుకొనటానికి కూడా సిద్ధమయ్యేంతగా ఆయనకు  దానితో వైరుధ్యం ఉంది.అయితే నెహ్రు పేదరికం, అసమానతలు లేని సోషలిస్టు సమాజ స్థాపన ధ్యేయంగా ప్రకటించుకొన్నవాడు. సోషలిస్టు భావాలు గలవాళ్లు  కాంగ్రెస్ లో ఒక ప్రత్యేక పార్టీగా స్థిరపడటానికి అది ఒక  అవకాశం అయి వుంటుంది. 

నిష్కామయోగి నవలలో ఆ సోషలిస్టుల ప్రస్తావన వుంది. పాపాయమ్మ తదితర రాజకీయ అభినివేశం , అనుభం కలిగిన స్త్రీలందరూ కలిసి ఏర్పరచుకొన్న లైబ్రరీలో ఒకరోజు పేపరు చదువుతూ పాపాయమ్మ నెహ్రు ఆంధ్ర ప్రాంతాలకు  వచ్చినప్పుడు సోషలిస్టులు ఏవేవో ప్రశ్నలు వేసి మీటింగ్ సరిగా జరగనియ్యలేదని చెప్తూ ఈ సోషలిస్టులతో పెద్ద గొడవ వచ్చి పడింది అంటుంది. పదిహేను పదహారేళ్ళ లైలా కు నెహ్రు గురించి తెలుసు కానీ సోషలిస్టుల గురించి వినటం అదే మొదలు. కాంగ్రెస్ లో పెద్ద నాయకుడైన నెహ్రూ ను ప్రశ్నించారు అని వాళ్ళ పట్ల లైలా లో ఒక చిన్న విరోధభావమే ఏర్పడింది.  అందువల్లనే తాను అత్తగారింటికి వెళ్ళాక ఇంటికి వచ్చిన బంధువు ఒకావిడ పాపాయమ్మ తాము మీటింగ్ పెట్టి పిలిచినపుడు చేసిన ప్రసంగం అంతా ‘కాంగ్రెస్ ను, గాంధీగారిని పొగడటమే సరిపోయింది’ అని ఆక్షేపణగా అంటే అవును మా వూళ్ళో అందరం అంతే. అంతా కాంగ్రెసే అని చెప్పి, కాంగ్రెస్ ను ఆక్షేపించింది కనుక ఆమెను మీరు సోషలిస్టులా అని ఒక ప్రశ్న వేయగలిగింది. కాదు కమ్యూనిస్టులం అని చెప్పింది ఆమె.  భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 1925 లో ఏర్పడినా బలపడటం, విస్తరించటం 1934 తరువాతనే. అతికొద్దికాలానికే నిషేధాలను ఎదుర్కోవలసి వచ్చింది. రహస్యపని విధానం అనివార్యం అయింది. 

కమ్యూనిస్టు  పార్టీ పాపాయమ్మ ఊళ్లో పనిచేస్తున్నట్లు ఆమె ఆలోచనల ముఖంగానే సూచించింది రచయిత్రి. వ్యక్తి సత్యాగ్రహోద్యమం లో పాల్గొంటూ ఊరూరూ తిరుగుతున్న పాపాయమ్మకు ఒక వూళ్ళో తమ ఊరి వాడే అయిన భాస్కరం , మరికొంతమంది యవకులు కలిశారు. అప్పుడే ప్రపంచయుద్ధవ్యతిరేక ప్రచారానికి కాంగ్రెస్ తీసుకొన్న  వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం లోని బలహీనతను ఎత్తిచూపిస్తూ మాట్లాడిన భాస్కరం ఇతనే. తనపనిని, కాంగ్రెస్ కార్యక్రమాన్ని తక్కువచేసి మాట్లాడాడని ఉక్రోషపడుతూ పాపాయమ్మ ‘వీడు చదివే పేపర్లు, వీడు అందరికి పంచిపెట్టే కాగితాలు అంతా రహస్యమే.. వీడి గుట్టు కాస్తా బయటపడితే ఎక్కడ ఉంటాడు వీడు’ అని మనసులో అనుకొంటుంది. దానిని బట్టి భాస్కరం నిషేధిత కమ్యూనిస్టు పార్టీ కోసం పని చేస్తున్నాడు అనుకోవచ్చు. భాస్కరం లైలాకు పెత్తల్లి కొడుకు. 

అత్తగారింట్లో బంధువుల స్త్రీతో సోషలిస్టుల గురించి  కమ్యూనిస్టులగురించి కాకతాళీయంగా జరిగిన ఒక సంభాషణ సహజంగా జిజ్ఞాసి అయిన లైలాను భర్తనడిగి వాళ్ళ  గురించి తెలుసుకొనేట్లు చేసింది. భర్త మోహనరావు పరీక్షలకు బస్తీ కి వెళ్లిన సమయం ఆడవాళ్లకు ఆ వూళ్ళో ప్రత్యేకంగా నిర్వహించబడిన రాజకీయ పాఠశాలకు హాజరై రాజకీయ పరిజ్ఞానం పెంచుకొనటానికి ఉపయోగపడింది. జ్ఞానం ఆచరణకు పురికొల్పింది. కమ్యూనిస్టుపార్టీ మహిళా సంఘానికి కార్యదర్శిగా సేవలు ప్రారంభించింది. ఉపన్యాసాలు ఇయ్యసాగింది.రచయితల సంఘంలోనూ చేరింది.  భాస్కరం చెల్లెలు తన పార్టీకే పనిచేస్తున్నదని సంతోషించాడు కూడా. 

1941 నాటికి  కమ్యూనిస్టుపార్టీ  యుద్ధం పట్ల అంతకుముందున్న వ్యతిరేక వైఖరిని విడనాడి రెండవ ప్రపంచయుద్ధం ప్రజాయుద్ధం అని ప్రకటించటంతో  ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసింది. ( కొండపల్లి కోటేశ్వరమ్మ, నిర్జనవారధి,2012)  ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల విస్తరణ, ప్రజలలోకి అది చొచ్చుకువెళ్లటం పాపాయమ్మ ఆలోచనల ముఖంగా ఈ నవలలో ప్రస్తావించబడింది. భాస్కరం బయటకు వచ్చి పనిచేయటం, ప్రసాద్ వంటి మెత్తని మనుషులు కూడా కమ్యూనిస్టులు కావటం గమనిస్తున్న పాపాయమ్మ ‘ఇంకా ఏమిటి?  ఆ పార్టీని అణిచేది’ అని నిస్పృహకు లోనవుతుంది కూడా. కానీ 1947 లో తొలిస్వతంత్ర భారత పాలనాధికారం చేపట్టిన కాంగ్రెస్ , కాంగ్రెస్ ను విమర్శించే పార్టీలను సహించదలచుకోక నిషేధం విధిస్తే అది అవకాశంగా  కమ్యూనిస్టులయిన భాస్కరం తదితరులను ప్రభుత్వానికి పట్టిచ్చి తన పూర్వ కక్ష తీర్చుకొనే తీర్చుకొన్నది. 

భాస్కరం పార్టీ- అంటే కమ్యూనిస్టు పార్టీ – విధానంలో మార్పు గురించిన ప్రస్తావన కూడా ఈ నవలలో ఉంది. విధానంలో మార్పు సాయుధ విప్లవ పంథాను ఉపసంహరించటమే కావాలి. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపేసే సైనిక చర్య తరువాత అటు ప్రభుత్వ దాడులను, హత్యాకాండను ఎదుర్కొంటున్న దశలో  కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణా సాయుధ పోరాటం పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వచ్చింది. అంతర్గత చర్చల తరువాత 1951 అక్టోబర్ నాటికి బేషరతుగా పోరాట విరమణ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. భాస్కరం అజ్ఞాతం నుండి బయటకు వచ్చి పనిచేయటానికి గానీ,1952 ఎన్నికలలో  పోటీచేయటం కానీ అందువల్లనే సాధ్యం అయింది. 

ఈ విధంగా అటు కాంగ్రెస్ పార్టీ నిర్మాణకార్యక్రమాలతో జాతీయోద్యమం ఇటు కమ్యూనిస్టు పార్టీ ఆదర్శాలు, కార్యాచరణలతో సమన్యాయం ప్రాతిపదికగా అభ్యుదయఉద్యమం నిర్మించిన దేశీయ చరిత్రను – సమకాలీన రాజకీయార్థిక సంఘర్షణల  పరిణామాల రేఖాచిత్రంగా – నవలకు ఇతివృత్తంగా మలుచుకొనటంలో   వట్టికొండ విశాలాక్షి చరిత్ర పరిజ్ఞానం, చరిత్రపట్ల ఒక విమర్శనా త్మక దృష్టి రెండూ కనబడతాయి. అంతమాత్రమే అయితే నిష్కామయోగి నవల గొప్పతనం ఏమీ లేనట్లే.  అంతకన్నా ఎక్కువగా  ఆ చారిత్రక రాజకీయార్థిక సంఘర్షణల సంబంధం మానవ సంబంధాలను లోపలి నుండి,బయటి నుండి కూడా  ఎట్లా ప్రభావితం చేసి ఏ దిక్కుకు నడిపిం చిందో , వ్యక్తిత్వాలను ఎట్లా మలిచిందో చూపటం వల్ల ఇది గొప్ప నవల అయింది. అందునా స్త్రీల అనుభవకోణం, ఆలోచనా కోణం ప్రధానంగా నవలలో కథను నడపటం దానికి మరింత విలువను పెంచింది. 

 (ఇంకా వుంది) 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.