అర్థనారీశ్వరులకే అవమానమా…?
( ‘అస్మిత ‘కథల సంకలనం పై సమీక్ష )
-వురిమళ్ల సునంద
అస్మిత అనగానే. మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది ఓ అహంభావి.. అహంకారంతో ముట ముట లాడే ఓ రూపం.. ఆవేశంగా విరుచుకుపడే ఓ కెరటం..
కానీ ఇక్కడ అస్మిత ముఖ చిత్రం చూడగానే కనిపించే చిత్రం స్త్రీపురుష ఏక సంఘర్షణ రూపం.. అదే పుటపై రాసిన ట్రాన్స్ జెండర్ల కథా సంకలనమని..
కానీ ఆ పేరుతో వెలువరించిన కథలు లోపలికి వెళితే.. అది అహంకారం కాదు ఆవేదనల అంతరంగమని అవగతం అవుతుంది.
ఇక కథానికల చరిత్ర పుట్టుపూర్వోత్తరాలకు వెళితే మొట్టమొదటి కథానిక రాసింది బండారు అచ్చమాంబ గారని, పురుషుల్లో గురజాడ అప్పారావు గారు రాసిన దిద్దుబాటు కథని అంటారు..
కాల క్రమేణా కథా సాహిత్యం ఎన్నో మార్పులు చేర్పులతో పాటు ఎన్నెన్నో జీవన పార్శ్వాలను తడిమిందనే చెప్పవచ్చు.
ఏది ఏమైనా మూడు నాలుగు తరాల నుండి కథలు కథానికలలో అనేక రకాల జీవితాల్ని ప్రతిబింబించే కథలు ఉన్నాయి.. ఇందులో మధ్య తరగతి, కుటుంబ సమస్యలు, ఉద్యమ కథలు, పీడిత తాడిత ప్రజల చైతన్యం కొరకు రాసిన కథలు, వివక్షతకు గురైన స్త్రీలు దళితుల కథలు,సరోగసీ, ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన కథలు
.. ఇలా అనేక కోణాలను తడుముతూ రాసిన కథలు ఎన్నో వచ్చాయి.. ఇవన్నీ సమాజంలో బాధింపబడుతున్న వారి కష్టాల కథలు..
కానీ ఇదే సమాజంలో భయంకరమైన వివక్షతకు లోనవుతున్న బాధాతప్త హృదయులు ఉన్నారు.. వారి పట్ల ఎవరికీ ఎలాంటి సానుభూతి ఉండదు.. పైగా వాళ్ళను చూడగానే ప్రతివారికీ లోకువ భావన.. వ్యంగ్యం వెక్కిరింపు అసహ్యపు చూపులతోనే వాళ్ళ ఆహార్యం వేష ధారణను ఆకలిగా ఆబగా చూసే వాళ్ళు మన సమాజంలోనే ఉన్నారు.. ఇంతగా నిరాదరణకు గురవుతున్న వాళ్ళే ట్రాన్స్ జెండర్లు.. వీరిని సామాన్యులు కొజ్జా అని, మరికొంత మంది కొంచెం పాలిష్ గా హిజ్రాలని ప్రస్తుతం గౌరవంగా ట్రాన్స్ జెండర్లని అంటున్నారు.
వీరి గురించి ఇతిహాసాలలో ఒకటైన మహాభారతంలో బృహన్నల, శిఖండి, పాత్రల గురించి విన్నాం.
మహా శివుని అర్థనారీశ్వర రూపాన్ని వినమ్రంగా పూజించాం. వారిని అక్కడ ఎవరూ అవహేళన చేయలేదు. ఎంతో గౌరవం పొందిన పాత్రలని మనకు తెలుసు వారు తెలివితేటలకు, ప్రతిభకు ఏమాత్రం తీసిపోరని వారు అర్థనారీశ్వర రూపులుగా పెళ్ళిళ్ళు వేడుకలకు వచ్చి దీవిస్తే శుభం కలుగుతుందనే నమ్మకం కూడా కొన్ని చోట్ల ఉన్నది..
అయినా మరెందుకో నేటి సమాజంలో నిరాదరణ చిన్నచూపు.. జన్మనిచ్చిన తల్లి తండ్రులు సైతం వారిపట్ల చూపిస్తున్న వివక్షత అంతా ఇంతా కాదు… అలా అవ్వడానికి కారణం వాళ్ళా.. వాళ్ళ పుట్టుకకు వాళ్ళు బాధ్యులా.. వాళ్ళు అలా పుట్టడమే పాపమా !?శాపమా?.. పుట్టిన ప్రతి జీవి ఈ ప్రపంచంలో తన ఉనికిని చాటుకుంది.. మరి ఏ పాపం ఎరుగని ఈ హిజ్రాలు చేసిన తప్పేంటి? ఎందుకు వారిని సమాజంలో వెలివేస్తున్నారు.. ఎదిగే వయసులో వారిలో వచ్చే విచిత్రమైన మార్పుకు ఎంతగా కుమిలి పోతారో కృంగి కృశించి పోతారో ఎవరైనా ఆలోచించారా.. కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన కన్నవాళ్ళే
కఠిన హృదయంతో పాషాణ చిత్తంతో వాళ్ళ వల్ల తమ పరువు పోతుందని పిరికి ఆలోచనలతో బయటికి నెట్టేస్తున్నారు…
ఆ సమయంలో వారి బాధ వర్ణనాతీతం.. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఎవరి ఓదార్పు దొరకదు..
అదిగో అలాంటి సమయంలోనే వాళ్ళ బాధ ఆవేదన నుండి వచ్చిన ఆక్రోశం ఆవేశం వారిని అస్మితులుగా మనకు చూపిస్తుంది.. అందుకే ఈ సంకలనానికి ఈ పేరు సరియైనది నా దృష్టిలో…
ఇక వారి సామాజిక జీవన విధానం గురించి ఆలోచిద్దాం. చట్టాలు చాలా వరకు అమలులోకి వచ్చేటప్పటికి కంటితుడుపు చర్యలే..
2014లో సుప్రీం కోర్టు ట్రాన్స్ జెండర్లపై ఇచ్చిన ఓ తీర్పుతో సుమారు ఐదేండ్ల తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ రక్షణ చట్టం చేసింది..ఇక తమిళ నాడు ప్రభుత్వం,కేరళ ప్రభుత్వం వీరు చేసిన అనేక పోరాటాల ఫలితంగా వీరి సమస్యలపై దృష్టి సారించింది.
వీరిలో ఇప్పటి తరం వారు మంచి చదువులు చదువుకుంటున్నారు.
జీవితాన్ని శాపంగా భావించక తమ మనుగడ కోసం, హక్కుల కోసం గౌరవ ప్రదమైన జీవితం పోరాటం చేస్తున్నారు…
ఇంత వరకు ఎవరూ దృష్టి కేంద్రీకరించని హిజ్రాల జీవితాలను గురించి సమాజానికి తెలిసేలా పూనుకున్న సంస్థ విజయవాడ లోని *సమన్విత*
అందులో భాగంగానే వారికి హృదయపూర్వక చేయూత నిస్తూ వారి సమస్యలకు సంబంధించి ప్రజల్లో, కవులు రచయితల రచనల ద్వారా ఆలోచనలు రేకెత్తించే విధంగా *కథల పోటీ* నిర్వహించింది.
ఈ పోటీలో సుమారుగా ఇరవై ఎనిమిది కథలు మాత్రమే రావడం గమనార్హం. రాశి కన్నా వాసి గొప్పదనే విషయాన్ని ఋజువు చేస్తూ.. ఇందులో ప్రతి కథ ట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరించేందుకు, వారి కోణంలో ఆలోచించేందుకు , వారిలో కొంత ఆత్మ విశ్వాసం పెంచేందుకు,.. అలాగే ఇంత కాలం వారిపట్ల ఉన్న చులకన భావం తొలగించేందుకు ఈ కథలు చాలా వరకు సహాయ పడతాయనడంలో సందేహం లేదు.
ఇరవై ఎనిమిది కథల్లో పదిహేను కథలను పోటీలో వచ్చినవాటిని.. మిగిలిన నాలుగు సమన్విత బృందం వారినుండి తీసుకోబడినవి.
ఇందులో ముందు మాట రాసిన ఐద్వా రాష్ట్ర కార్యదర్శి గారైన డి రమాదేవి గారు . హిజ్రాల మనో వేదన గురించి సమాజంలో వెలి వేయబడి తమకంటూ ప్రత్యేక సంస్కృతిని అలవర్చుకున్న నేపధ్యాన్ని ..వారి జీవన పోరాటంలో ఎదుర్కొంటున్న భయంకరమైన అనుభవాలను గురించి చెబుతూ రాసిన విషయాలను, సమాజంలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్న వారి ప్రయత్నాలను అభినందిస్తూ తప్పకుండా చదవాలి.
అలాగే తృతీయ ప్రకృతి పేరుతో డాక్టర్ దుట్టా శమంతకమణి గారు రాసిన వ్యాసం చదివితే మన దేశంలో ఎంత మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.. అసలు వారి పుట్టక లోపాలు.. మానసిక ప్రవృత్తి తో మారిన వారు.. వారికి సంబంధించిన చట్టం ఏం చెబుతోంది వారిది సమాజంలో ఎలాంటి పాత్ర.. వారి కోసం ఏం చేయాలో.. వారి కోసం ఏర్పాటుచేసిన స్వచ్ఛంద సంస్థలు మొదలైన వివరాలతో కూడిన వ్యాసాన్ని అందించారు. శ్రీమతి దుట్టా శమంతకమణి గారు.
కథల లోనికి వెళ్ళే ముందు కానీ , కథలు చదివాక కానీ తప్పక చదవాల్సిన వ్యాసం ఇది.
కథల్లోకి వస్తే పదిహేను కథల్లో మూడు ప్రథమ, ద్వితీయ తృతీయ బహుమతులు,మరో నాలుగు కన్సోలేషన్ బహుమతులుగా ఎంపిక చేయడం జరిగింది.
అన్ని కథలను తడమను. కొన్ని కథలు మాత్రమే..
మొదటి బహుమతి పొందిన కథ పి.వి.ఆర్ శివకుమార్ గారి *కసారా* *నుండి రైలు* ఓ పెళ్లి వేడుకకు వచ్చిన హిజ్రాలను చూసి అసహ్యించుకుని అంతో ఇంతో ఇచ్చి పంపమనడం… ఎవరూ కదలక పోవడంతో.. పూజ చూస్తున్న శ్రీహరి వెళ్ళి వారితో మాట్లాడితే రెండు వేలు కావాలని డిమాండ్ చేయడం చూసి ఇచ్చింది తీసుకోవాలి.. నీలాగే ఒకరికి పదిమంది వస్తే ప్రతి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అవుతుందా అని చుట్ఠాల్లో కొందరు అన్నమాటలకు తను గోడమీద సైన్ పెట్టి పోతే ఎవ్వరూ రారని చెబుతుంది.. శ్రీహరి వాళ్ళు అడిగిన రెండు వేలకు మరో ఐదు వందలు కలిపి ఇవ్వడం వచ్చిన బంధువులకు అసహనం కలుగుతుంది… వారి మాటలను వింటూ మౌనంగా అనుకుంటాడు. వీరిని *కసారా టూ దాదర్* రైల్లో తిప్పాలని. ఆ తర్వాత శ్రీహరికి రైలు ప్రయాణం లో హిజ్రాతో పరిచయం
ఎదురైనా అనుభవాలు.. హిజ్రాలను కలుపుకుని వారికి జీవనోపాధి కలిగిస్తూ శ్రీహరి ఆర్థికంగా ఎంత ఎత్తుకు ఎదిగింది.. ఈ కథ చివరి వరకు ఆసక్తిని కలిగిస్తుంది.
కథ కొంచెం సినిమాటిక్ గా అనిపించినా ఈ కథ హిజ్రాలు చదివితే తమ శక్తి సామర్థ్యాల పట్ల నమ్మకం ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
రెండవ కథ డా.రమణ యశస్వి గారు.. వృత్తి రీత్యా డాక్టర్ అయ్యుండి తన చుట్టూ ఉన్న పరిసరాల్లోని వ్యక్తుల జీవితాన్ని కథగా మలిచారు. కథ శీర్షిక కూడా ఆసక్తి కలిగించేలా *తోటమాలి చమత్కారం* పెట్టడం బాగుంది. అరవై యేండ్ల స్త్రీ కన్న కొడుకు రాజు పెరుగుతూ హిజ్రాగా మార్పుకు లోనవ్వడం.. అతడు మరో హిజ్రాను ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న మరో హిజ్రాను తీసుకొచ్చి చూపించిన సమయంలో ఆమె భాష చేతలు అందరికీ అసహ్యం కలిగిస్తాయి.
ముసలమ్మ కొడుకు రాజు హిజ్రా మూకతో పడిన ఇబ్బందులు, అతడు ఆ తర్వాత ఎలాంటి మార్పులకు లోనయ్యాడు. అతని కోసం డాక్టర్ చూపించిన శ్రద్ధ ఫలించిందా… ఈ కథకు శీర్షిక ఎంత వరకు న్యాయం చేసింది.. చదువుతుంటే కళ్ళ ముందు దృశ్య మానం అవుతుంది. ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది.
మూడవ కథ కొయిలాడ రామ్మోహన్ రావు గారు రాసిన *మానవత్వం* కథ .. పెళ్లి ఇంటికి వెళ్ళి హిజ్రాలు రభస చేస్తుంటే పోలీసు ఇన్స్పెక్టర్ ను పిలవడం అతడు హిజ్రాలకు నచ్చచెప్పి, పెళ్లి వారితో హిజ్రాలు చేసిన మంచి పని గురించి చెప్పడం… వాళ్ళలో కూడా మానవత్వం ఉంటుందని గుర్తించేలా రాసిన కథ ఇది.
అలాగే ఇందులో మరో ఐదు కన్సొలేషన్ కథలు రంగుటద్దాలు, ప్రేమ బృందావనం, మీతో మేము , చీకటి జాబిలి..తో పాటు ఓ ఉపాధ్యాయుని పాఠశాల విద్యార్థులతో కలిసి రైల్లో ప్రయాణం చేస్తూ హిజ్రాతో చేసిన సంభాషణ, వారికి మనసుంటుందని తన మాటలకు ప్రభావితమైన హిజ్రా..
ఆమెకు హిజ్రాలపై రాసిన కవిత వినిపించి ఆ బోగీలో ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులను ఆలోచింపజేసే కథ “మాకూ మనసుంది”. కథ.అలాగే
కోపూరి పుష్పాదేవి గారి కథ చేయీ చేయీ కలిపి,’కథలో వెంకట రమణ సూర్యం సుభద్ర దంపతుల ఇంట్లో పనిమనిషిగా కుది వారి కుటుంబానికి ఏ విధంగా అండగా నిలిచాడో, అతడు హిజ్రగా ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపే కథ ఇది. అలాగే డాక్టర్ శమంతకమణి గారి ‘ఛమేలీ’ అటు ఇటు కాని స్త్రీ గా ఆమె పడిన మనో వేదన, అలాగే కె . ఉషారాణి గారి’ సమత్వం ‘కథలో “అమీ” గెలుపు గాథ, శాంతిశ్రీ గారి “కోకిల ‘ కథ..ఇందులో ప్రతి కథ ట్రాన్స్ జెండర్లు అర్థనారీశ్వర రూపాలైన వారి సమస్యలను కళ్ళకు కట్టిస్తుంది. వాళ్ళ కోసం సాయం చేసేందుకు భరోసాగా నిలిచేందుకు మన మనసును సమాయత్తం చేయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
***
పుస్తకం పేరు:: అస్మిత
ట్రాన్స్ జెండర్లపై కథానికల సంకలనం
రచయితలు:: 19 మంది
సంకలన కర్తలు:-
సమన్విత,కోపూరి ట్రస్ట్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ( ఐద్వా), ఆంధ్రప్రదేశ్.
వెల:200/
ప్రచురణ సం.:-2020
కవర్ డిజైన్-అరసవెల్లి గిరిధర్
పుస్తకాల కొరకు సంప్రదించాల్సిన చిరునామా:-
డోర్ నెం.3-274/207,శ్రీరామ్స్ స్నేహ ఎవెన్యూ,కుంచనపల్లి గ్రామం, తాడేపల్లి మండలం, అమరావతి, ఆంధ్రప్రదేశ్-522501
ఐద్వా కార్యాలయం
31-5-6, ప్రకాశరావు వీధి, మారుతి నగర్, విజయవాడ-4
ఫోన్::9490098620
ప్రజాశక్తి పుస్తక విక్రయ కేంద్రాలలో
*****
నా పేరు వురిమళ్ల సునంద, ఖమ్మం. నేను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయిని గా పని చేస్తున్నాను. నా ప్రవృత్తి- సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించడం సాహిత్యం పై మక్కువతో కవితలు కథలు బాల గేయాలు ,బాలల కథలు, సమీక్షలు రాస్తూ ఉంటాను. నా ముద్రిత రచనలు 1వరిమళ్ల వసంతం -కవితా సంపుటి 2.బహు’మతు’లు -కథా సంపుటి 3. వెన్నెల బాల -బాల గేయాల సంపుటి 4.మెలకువ చిగురించిన వేళ-కవితా సంపుటి నా సంపాదకత్వంలో వెలువడిన పుస్తకాలు 1. చిరు ఆశల హరివిల్లు- బాలల కవితా సంకలనం 2.ఆళ్ళపాడు అంకురాలు- బాలల కవితా సంకలనం 3. పూల సింగిడి -బాలల కథా సంకలనం 4.కలకోట కథా సుమాలు బాలల కథా సంకలనం 5. ఆసీఫా కోసం- కవితా సంకలనం ( ఆసీఫా ఉదంతం పై స్పందించిన సుమారు 230 పైగా రచయితల/కవుల కవితా సంకలనం.