ఇట్లు మీ వసుధారాణి

నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్

-వసుధారాణి 

కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏమవుతుందో , నా చేతికి క్షమించాలి కాలికి సైకిల్ ఇచ్చాక మా ఇంట్లో వాళ్ళకి తెలిసొచ్చింది.”అందుగలడిందులేడను సందేహము వలదు” లాగా మా బుల్లి టౌన్ లో ఎక్కడ చూసినా నా నీలి సైకిల్ తో,హిప్పీ జుత్తుతో,బోలెడు నిర్లక్ష్యం తో నేనే కనిపిస్తూ వుండేదాన్ని.

ఒక బజారులో పని ఉంటే మరి రెండు బజార్లు అదనంగా తిరిగి వచ్చేదాన్ని.నాకు సైకిల్ వచ్చిన కొత్తల్లో అయితే అలాంటి సైకిల్ ఎవరి దగ్గరా లేదు, పైగా ఆడపిల్లలు సైకిల్ తొక్కటం మా ఊర్లో అప్పుడప్పుడే మొదలుపెట్టారు.ఇక నా పోజులు చూడాలి.రోజూ ఉదయాన్నే లేవగానే మొహం కడుక్కుని మా అమ్మ మెత్తని చీర చెంగుతో మొహం తుడుచుకునే నేను.మా అమ్మ మెత్తని చీరెలు చించి సైకిల్ తుడుచుకోవటం మొదలు పెట్టా.

ఐదు రూపాయలకి పొడవు గొట్టం ఉండే నూనె డబ్బా ఒకటి కొని దాన్లో కొబ్బరినూనె పోసి సైకిల్ చైన్లో,పెడల్స్ కి, బ్రేక్ వైర్స్ కి వేసుకోవడం.విమానానికి  కూడా అంత సర్వీసింగ్ చేస్తారో లేదో మరి.

ఎప్పుడు కొంచెం ఖాళీ దొరికినా ఓ గుడ్డ ముక్క తీసుకుని సైకిల్ తుడుచుకోవటం.స్టీల్ రిమ్ముల మీద నా హిప్పీ ఫేస్ కనపడేలా మెరిసిందా లేదా చూసుకోవటం ఇలా ఉండేది నా సైకిల్ బానిసత్వం.ఇంట్లో వాళ్ళకి నా కొత్తొక వింత రోత పుట్టినా సైకిల్ వలన బయట పనులు త్వరగా చేస్తున్నాను కదా అని భరించేవాళ్ళు పాపం.

నెమ్మదిగా ఆ సైకిల్ అనే యంత్రం నా జీవితంలో ఓ ముఖ్యభాగం అయిపోయింది.మొదట్లో వింతగా గొప్పగా ఉన్న నా సైకిల్ రాను రాను నాకు మచ్చికైన పెంపుడు జంతువులా తయారైంది.నేను కూడా ఎస్ ఎల్ ఆర్ సైజ్ కంటే పొడవు పెరిగినట్లు ఉన్నాను. కాళ్ళు నేలపై ఆనేవి. మామూలుగా సైకిల్ తొక్కటం,జనం మనల్ని వింతగా చూడటం అన్న కిక్కు తగ్గిపోయింది.

ఉన్న సైకిల్ నే కొత్తగా గొప్పగా మార్పులు ఏమి చేయాలి ?

అని ఆలోచించి బ్రేకులు తీసివేసి,సైకిల్ హ్యాండిల్ని కిందకి తిప్పివేసాను స్పోర్ట్స్ సైకిల్ లా అయింది.అలా స్పీడ్ గా సైకిల్ వంగి తొక్కటం, కాలుతో ఆపటం, వీలైతే ఎవరినైనా చిన్నగా గుద్దుకుని ఆపటం.గొప్ప థ్రిల్ గా ఉండేది.

మా పల్నాడు బస్సుల్లో వెళ్లే జనం బస్సు కిటికీల్లోంచి నన్ను,నా సైకిల్ ని చూడటం ,పక్కన కూర్చున్న వాళ్ళకి చూడు చూడు అని చూపించటం నేను జీవితంలో మర్చిపొలేని థ్రిల్ అంటే నమ్మండి.

నేను సైకిల్ ని ఇలా తొక్కే పద్ధతి వలన మా ఊర్లో సైకిల్ రాణిగా ,రౌడీరాణిగా బాగా ప్రాచుర్యం పొందాను.ఐతే ఏపని అయినా ఏ సమయంలో అయినా చేయగలను అన్న విశ్వాసం నాలో కల్పించింది నా నీలి సైకిలే.

బైకు లో వెనుక సీటు ప్రాధాన్యం,కారులో ముందు సీటు.అలాగే నా సైకిల్ క్యారియర్ మీద కూర్చోవడం గొప్ప పదవి.నేను సైకిల్ తొక్కుతుంటే వెనకాల కూర్చోవడం మిత్రులకు పెద్ద ప్రెస్టీజ్ ఆ రోజుల్లో.నా సైకిల్ నాతో పాటు బోలెడు రేసుల్లో కూడా గెలిచింది.నా జీవితాన్ని కూడా గెలిపించింది.

మా సావిత్రి అక్కయ్యా వాళ్ళ ఇల్లు శంఖుస్థాపనకి మా అమ్మని తెల్లవారు ఝామున మూడు గంటలకు నా సైకిల్ పైన కూర్చోబెట్టుకుని మా ఇంటినుంచి మా అక్కయ్యా వాళ్ళ ఇంటికి మూడు కిలోమీటర్లు నేను చేసిన ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనిది. మూడు విషయాలు తెలిసి వచ్చాయి అప్పుడు నాకు ఎదిగిన బిడ్డలు తల్లిదండ్రులకి ఎంత ఉపయోగం ఒకటి,రెండు వస్తువు యొక్క ప్రాధాన్యం,మూడు ఆ రాత్రి వేళ ప్రయాణించే ధైర్యం నాకే కాదు , మా అమ్మ నా మీద  ఉంచిన నమ్మకం. మరి అది నిలబెట్టు కోవాలి అంటే,

ధైర్యం ఉంది కదా అని ఎప్పుడూ మొండిగా ప్రమాదల్లోకి వెళ్లలేదు నేను అప్పటి నుంచి.

నేనూ ,నా సైకిలు కలిసి కుటుంబానికి మా అన్నయ్య దూరంగా ఉన్న లోటును భర్తీ చేసాము.నేను పెళ్లి చేసుకుని మా ఊరు వదిలి వెళ్ళేటప్పుడు నా ప్రియ మిత్రురాలు రమాదేవి నన్ను ఓ వింత కోరిక కోరింది.నీకు గుర్తుగా నీ సైకిల్ నాకు ఇచ్చివెళ్ళు అని .అంటే నా సైకిల్ నా ప్రతి రూపంలా,నా నీడలా స్నేహితులు చూసే విధంగా నాతో,  నా జీవితంతో మమేకం అయిపోయిందన్న మాట.

ఆ మధ్య సునీల్ సినిమా ఏదో వచ్చింది కదా అతగాడు సైకిలతో మాట్లాడుకుంటూ ఉంటాడు.సైకిల్ కూడా అతనితో ,నాకు ఎంతమాత్రం అసహజంగా అనిపించలేదు.నా సైకిల్ అనుభావాలన్నీ గుర్తుకు వచ్చి.

వచ్చే నెల మరో అనుభవం తాలూకూ స్మృతులతో అప్పటి దాకా ఇట్లు మీ వసుధారాణి.

*****

Please follow and like us:

2 thoughts on “ఇట్లు  మీ వసుధా రాణి- నా నీలి ఎవాన్ యెస్ ఎల్ ఆర్ సైకిల్”

  1. గెలిచి గెలిపించి ఆత్మవఆత్మవిశ్వాసం నింపి నిత్యం నూతనోత్తేజమిచ్చిన
    నీలి సైకిలు..అమ్మని వెనకెక్కించుకుని..
    అన్న పాత్ర పోషించినా..స్నేహితురాలికి
    కలకాలం మిగిలిపోయే బహుమతై పిలిచినా..నీలి సైకిలేగా..
    కొన్ని వస్తువులూ ఊపిరిపోసుకుంటూ
    ఉంటాయి..మనతో పాటూ ఉంటూ ఎదుగుతూ..👌🚩⚘⚘🙏🙏

  2. నేను టెంత్ చదివే రోజుల్లో బాలయ్య మష్టారు టూషన్ నించి ఆ నిర్మానుష్యమైన పల్నాడ్ రొడ్డుమీద కధలూ సినిమాలూ చెప్పుకుంటూ స్మశానం దాటి రావటం. సైకిలెక్కితే తొందరగా వెళ్ళిపోతామని నడుచుకుంటూ రావటం నాకింకా కళ్ళముందు మెదులుతోంది రాణెమ్మా.

Leave a Reply

Your email address will not be published.